Thursday, June 23, 2011
Wednesday, June 22, 2011
విజయ దశమి
దసరా
దుర్గాదేవి
దసరా ఒక హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరవాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరవాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదవరోజు పార్వేట ఉంటుంది. ఈ రోజు ప్రజలు ఒక ప్రదేశంలో కూడి వేడుక జరుపుకుంటారు. జమ్మి చెట్టు ఉన్న ప్రదేశంలో పార్వేట చేయడం ఆనవాయితీ.
దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణా లో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్య కి స్త్రీలు పట్టు పీతాంబరాలు దరించటం ఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారంరాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసుని తో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే విజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశములో హెచ్చుగా ఉంటుంది.
ఆయుధపూజ
అరణ్యవాసం పూర్తిచేసుకుని అజ్ఞాతవాసం చేసే సమయం ఆసన్నమైనప్పుడు పాండవులు తమ ఆయుధాలను పరుల కంట జమ్మి చెట్టు మీద భద్ర పరిచారు. అజ్ఞాతవాస ముగింపులో విజయదశమినాడు పాడవ మధ్యముడు విజయుడు ఆయుధాలను బయటికి తీసి పూజచేసి ఉత్తర గోగ్రహణ యుద్ధాన్ని చేసి దిగ్విజయుడైనాడు. కనుక ఆశ్వీజ శుద్ధ దశమి విజయదశమి అయింది. ఆరోజున దుర్గాదేవి, అర్జునుడు విజయం సాధించారు కనుక ప్రజలు తమకు జీవనాధారమైన వస్తువులకు కృతజ్ఞతా పూర్వకముగా పూజలు చేసి తమ జీవితం విజయ వంతం కావాలని అమ్మవారిని వేడుకుంటారు. ఇదే ఆయుధ పూజ. విద్యార్ధులు పాఠ్య పుస్తకాలను, ఇతరులు తమవృత్తికి సంబంధించిన పుస్తకాలను పూలలో పెట్టడం ఆనవాయితీ. ఈ రోజు నూతనంగా విద్యార్ధులు పాఠశాలలో ప్రవేశింప చేయడం, అక్షరాభ్యాసం చేయడం ఆచారాలలో ఒకటి. వ్యాపారులు కొత్త లెక్కలు ఈ రోజు నుండి ప్రారంభించడం కొన్ని ప్రదేశాలలో ఆచారం.
మహిషాసురమర్ధిని
బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతల్తో ఘోరమైన యుద్ధమి చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది.
శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడువజ్రాయుధమును, వరుణ దేవుడు పాశము , బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది. మహిషాసురుని తరఫున పోరు సల్పుతున్న ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది. ఈ యుద్దములో ఆదేవి వాహనమైన సింహమూ శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము, సింహరూపము, మానవరూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిషిరూపములో దేవిచేతిలో హతుడైనాడు.ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దిము దసరా పర్వదినంగా ప్రజలచే కొనియాడబడింది.
ఇతర ఆచారాలు
ఈ రోజులలో వివిధ దేవుళ్ళ వేషధారణ చేసి ఇంటింటికి తిరిగి గృహస్తులు ఇచ్చినది పుచ్చుకోవడం కొందరు వృత్తిగా ఆచరిస్తారు. వీటికి దసరా వేషాలు లేదా పగటి వేషాలు అంటారు. ప్రాధమిక పాఠశాల ఉపాద్యాయులు విద్యార్ధులను వెంట పెట్టుకొని విద్యార్ధుల అందరి ఇళ్ళకు వెళ్ళి మామూలు పుచ్చుకోవడం మామూలే. ఈ సమయంలో వెదురు కర్రతో చేసి రంగు కాగితాలతో అలంకరించిన బాణాలు విద్యార్ధులు పట్టుకుని అయ్యవారి వెంట వస్తారు. విద్యార్ధులు ఏదయా మీ దయా మామీద లేదు, ఇంత సేపుంచుటా ఇది మీకు తగునా .. అయ్యవారికి చాలు అయుదు వరహాలు, పిల్ల వాళ్ళకు చాలు పప్పు బెల్లాలు అంటూ రాగయుక్తంగా పాడుకుంటూ అయ్యవారి వెంట వస్తారు. గృహస్తులు అయ్యవారికి ధనరూపంలోనూ, పిల్ల వాళ్ళకు పప్పు బెల్లం రూపంలోనూ కానుకలు ఇస్తారు. సంవత్సర కాలంలో సేవలందిచిన వారు గృహస్తును మామూళ్ళు అడగటం వారు కొంత ఇచ్చుకోవడమూ అలవాటే. దీనిని దసరా మామూలు అంటారు. కొత్తగా వివాహం జరిగిన ఆడపడచుని భర్తతో సహా ఇంటికి ఆహ్వానించి అల్లుడికీ కూతురికీ తలంటి తలకు పోసి నూతనవస్త్రాలు కానుకలు ఇచ్చి సత్కరించడం కూడా అలవాటే.
వివిధ ప్రదేశాలలో దసరా
దసరా ఉత్సవాలను దేశమంతా వివిధ రూపాలలో జరపుకుంటారు. మైసూరు, కలకత్తా, ఒరిస్సా, తెలంగాణా, విజయవాడలలో ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపు కుంటారు. ఇవే కాక ఊరి ఊరికీ కొన్ని ప్రత్యేక ఉత్సవాలు జరుపుకుంటారు. ఒంగోలులో కళారాలు రూపంలో అమ్మవారిని ఆరాధించి చివరి రోజున ఉత్సవంగా అమ్మవారు వెళ్ళి రాక్షససంహారం చేసే ఘట్టాన్ని ప్రదర్శిస్తారు.
మైసూరు
మైసూరు దసరా ఉత్సవాలలో ఏనుగుల ఊరేగింపు
మైసూరు మహారాజు పాలన కాలం నుండి వైభవంగా దసరా ఉత్సవాలను జరపటం ఆనవాయితీ. మహారాజు వారి కులదైవం అయిన చాముండేశ్వరీ దేవిని ఆరాధించి ఏనుగులపై ఊరేగింపుగా రావడం అలవాటు. ఆ సమయంలో వీధులలో కోలాహలంగా చేసే అనేక కళా ప్రదర్శనలు చూడటానికి దేశం నలుమూలల నుండి ప్రజలు వస్తుంటారు. ఆసమయంలో రాజభవనం ప్రత్యేకంగా అలంకరించ బడుతుంది. ఆ సమయంలో ఫ్లోటింగ్ కారు ఉత్సవాలు ప్రాధాన్యత సంతరించుకున్నవే. ఏనుగుల అలంకరణా ప్రత్యేకమే. రాజుగారి ఆయుధ పూజ వైభవంగా జరుగుతుంది.
కలకత్తా
దసరాను దుర్గాపూజ పర్వదినంగా బెంగాలీయులు జరుపుకుంటారు. సప్తమి, అష్టమి, నవమి తిధులలో దుర్గామాతకు పూజ చేసి తొమ్మిదవ రోజున కాళికామాతను దర్శిస్తారు. ఆ రోజు కాళీమాతను లక్షలమందిని దర్శించడం విశేషం. తొమ్మిది రోజులూ రాష్ట్రమంతా హరికధలు, పురాణ శ్రవణం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరి రోజున దుర్గామాతను హుగ్లీ నదిలో నిమజ్జనం చేస్తారు. ఆరోజున నదీతీరంలో కుమారీ పూజలు చేయడం బెంగాలీల ప్రత్యేకత.
ఒరిస్సా
ఒరిస్సా పౌరులు దసరా సమయంలో దుర్గామాతను ఆరాధిస్తారు. కటక్ కళాకారులు రూపొందించిన దుర్గామాత విగ్రహాలను వీధివీధిలో ప్రతిష్టిస్తారు. స్త్రీలు మానికలో వడ్లు నింపి లక్ష్మీ దేవిగా భావించి పూజలు నిర్వహిస్తారు.మార్గశిర మాసంలో కూడా ఈ చిహ్నంతో వారు లక్ష్మీదేవి ఆరాధించడం అలవాటు. దీనిని వారు మాన బాన అంటారు. ఒరిస్సా ప్రజలు విజయదశమి నాడు విజయదుర్గను ఆరాధిస్తే అన్నిటా విజయం సిద్ధిస్తుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. చివరి రోజున 15 అడుగుల రావణ విగ్రహాన్ని బాణసంచాతో తయారు చేసి మదానంలో కాలుస్తారు. ఈ రావణ కాశ్హ్టం చూడటానికి ప్రజల తండోప తండాలుగా వస్తారు.
తెలంగాణా బతుకమ్మ
తెలంగాణా ప్రజలు దసరాసమయంలో బతుకమ్మ ఉత్సవాలు చేస్తారు. బతుకమ్మ పండుగ’ ఆంధ్ర ప్రదేశ్రాష్ట్రములోని తెలంగాణా ప్రాంతములో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. నవరాత్రి మొదట రోజున బతుకమ్మను పూలతో అలంకరించి తొమ్మిది రోజులు ఒక చోట స్త్రీలంతా చేరి ఆటపాటలు పాడి ఆనందిస్తారు. చివరి రోజున బతుకమ్మను నిమజ్జనం చేసిన తరవాత పండుగ చేసుకుంటారు. ఇది తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుంటారు. ఈ వారం రోజులలో వీరు రోజూ చిన్న బతుకమ్మలు చేసి, ప్రతీ సాయంత్రం దాని చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు.
అయితే చివరి రోజు అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు మగవారంతా పచ్చిక బయళ్ళలోనికి పోయి తంగేడి, గునుక పూలను భారీగా ఏరుకుని వస్తారు. ఆ తరువాత ఇంటిళ్ళపాదీ కూర్చుని ఆ గునగ పూలు, తంగేడు, కలువ, మరియు ఇతర రకాల పూలతో బతుకమ్మని తయారు చేస్తారు. ఇందులో గునగ పూలు మరియు తంగెడు పూలు ముఖ్య భూమిక ను పోషిస్తాయి. ఈ పూలని జాగ్రత్తగా ఒక రాగి పళ్ళెం (తాంబలం)లో వలయాకారంగా, రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగేడు ఆకులు, పూలు పళ్లెంలో లేదా తాంబోలం లో పేర్చుతారు, ఆపై తంగేడు పూలతో కట్టలుగా కట్టిన కట్టలను చివరలు కోసి రంగులతో అద్దిన వాటిని పేర్చుతారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు. పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరి మాతను పెట్టి చుట్టు దీపాలతో అలంకరిస్తారు. దీనిని గృహంలో దైవ స్థానంలో అమర్చి పూజిస్తారు. ఇలా తయారు చేసిన బతకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ ఆడవారు పాడుతారు. ఆడవారు వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలను దరించి కొత్త బట్టలు కట్టుకుంటారు. ఇలా చాలా సేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఆపై ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్నం మరియు సత్తుపిండి ( మొక్కజొన్నలు, లేదా వేరుశనగ లేదా పెసర విత్తనాలను దోరగ వేయించి వాటిని పిండి చేసి వాటితో చక్కెర పిండి లేదా బెల్లం మరియు నెయ్యి తగినంత కలిపి తయారు చేస్తారు)లను ఇచ్చి పుచ్చుకొని తింటారు
కరీంనగర్
దసరా సమయంలో కరీం నగర వాసులు అకాడా గా నిర్వహుస్తారు.ఇక్కడ గనిలో పనిచేసే కార్మీకులు ఈ పండుగను గ్రామీణవాతావరణం ఉట్టిపడేలా చేసుకుంటారు. క్షత్రియుల ఆయుధ విన్యాసాలు పోలిన విన్యాసాలను ప్రదర్శించడం ఇక్కడి అలవాటు. ఇక్కడి నెహ్రూ స్టేడియంలో నరకాసుర వధ ఘట్టాన్ని ప్రదర్శించడంతో పండుగ మొదలౌతుంది.హనుమాన్ అకాడా, దుర్గా అకాడా’ ల లాంటి దేవతల రూపాలతో ఇనుప బెల్టు, త్రిశూలం మొదలైన ఆయుధాలను పట్టుకొని విన్యాసాలు చేస్తూ ఊరంతా తిరుగుతూ ప్రజలను ఆనందింప చేస్తారు. కర్రసాము ఈ ప్రదర్శనలో భాగమే. జమ్మి ఆకులను ఒకరికొకరు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పుకుంటారు.
గుజరాత్
దసరా సమయంలో గుజరాతీయులు పార్వతిదేవి ఆరాధన చేస్తారు. ఇంటింటా శక్తి పూజ చేయడం గుజరాతీయుల ఆచారం.ఇంటి గోడల మీద శ్రీ చక్రాన్ని, త్రిశూలాన్ని, శక్తి ఆయుధాన్ని పసుపుతో చిత్రించి పూజిస్తారు.ఆ గుర్తుల సమీపంలో పొలం నుండి తీసుకు వచ్చిన మట్టితో వేదిక తయారు చేసి దానిపై బార్లీ ,గోధుమ విత్తనాలను చల్లి దానిపై మట్టి ఉండ పెట్టి దానిని నీటితో నింపి పోకచెక్క వెండి లేక రాగి నాణెం వేస్తారు. ఆ మట్టికుండను వారు దేవిగా భావిస్తారు. దానిని వారు కుంభీ ప్రతిష్ట అంటారు. అష్టమి రోజున యజ్ఞం నిర్వహించి దశమి రోజున నిమజ్జనం చేస్తారు. అమ్మవారి వద్ద పెట్టిన ప్రమిదను గుడిలో సమర్పిసారు. తరవాత పౌర్ణమి వరకూ జరిగే గర్భా అనే ఉత్సవాలలో స్త్రీలు ఉత్సాహంగా పాల్గొటారు.
విజయవాడ భేతాళ నృత్యం
విజయవాడలోని ప్రధన ఆలయాలలో బెజవాడ కనక దుర్గమ్మ ఒకటి. ఇది ఆంధ్ర రాష్ట్రం అంతటా ప్రాముఖ్యం ఉన్న ఆలయం. నవరాత్రి తొమ్మిది రోజులు వైభవంగా ఉత్సవాలు నిర్వహించి విజయదశమి నాటికి కృష్ణా నదిలో తెప్పోత్సవం చేస్తారు. ఈ ఉత్సవంలో అమ్మవారు తెప్పపై మూడు సార్లు ఊరేగి భక్తులకు దర్శనమిస్తుంది. తర్వాత విజయవాడ నగర పోలీసులు అమ్మవారిని పాతబస్తిలో ఉరేగిస్తారు. 1వ టవున్ పోలీసు స్టేషను వద్దకు రావడముతో ఉరేగింపు ముగిస్తుంది. దసరా సందర్భంలో చివరి రోజు ప్రభలు ఊరేగింపుగా వస్తాయి. ఈ ప్రభలలో భేతాళ నృత్యం ప్రదర్శిస్తారు. ఈ భేతాళ నృత్య ప్రదర్శన విజయవాడ ప్రత్యేకత.
గద్వాల
రాచరికం ఉన్న రోజులలో సంస్థానాధీశులు పాకనాటి రెడ్లు దసరా ఉత్సవాలను వైభవోపేతంగా చేసేవారు. సర్వస్వతంత్రులైన వారు ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ యుద్ధం చేసి శత్రువులపై విజయం సాధించి సంస్థానాన్ని విస్తరించారు. ఈ విజయానికి తమకున్న ఆయుధబలం ఒక కారణం కనుక ఆయుధ పూజలు ఆర్భాటంగా జరిగేవి.తొమ్మిది రోజులు పూజలు చేసి దశమి రోజున పెద్దలను స్మరించడం వారి దైర్య సాహసాలను గుణగణాలను పొగడటం అలవాటు. చివరి రోజున సంస్థానాధీశులు బంధువులు, ఉద్యోగులు, మిత్ర సమేతంగా కోట నుండి బయలుదేరి గుండు కేశవస్వామి ఆలయానికి విచ్చేసి అక్కడ ఉన్న జమ్మి ఆకులను బంగారంగా ఎంచి ఒకరికొకరు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఆయుధ పూజలో వారు తోపులు, కత్తులూ, కటార్లు, వెయిట్ ఎ మినిట్ గన్లు, ఫిరంగులు, రివ్వాల్వర్లు, మందు గుండు సామాన్లు ఇతర ఆయుధాలకు పూజలు నిర్వహించేవారు.
వీరవాసరం ఏనుగుల సంరంభం
పశ్చిమ గోదావరి జిల్లా వీర వాసరంలో దసరా సమయంలో షుమారు వంద సంవత్సరాల నుండి ఏనుగు సంబరాలు జపడం అలవాటు. దసరా మొదటి రోజున ఏనుగుగుడి లో భేతాళుడిని నిలబెడతారు. భేతాళుడంటే వయసైన బ్రహ్మచారి.తొమ్మిది రోజులు భేతాళుడు అమ్మవారి పూజలు నిర్వహిస్తాడు. ఈ తొమ్మిది రోజులు భేతాళుడు నియమ నిష్టలను ఆచరిస్తాడు. మొదటి రోజునుండి నూరు సంవత్సరాల క్రితం వెదురు కర్రలు గడ్డి కొబ్బరిపీచుతో చేసిన ఏనుగును నూతనంగా అంబారీతో అలంకరిస్తారు. తెల్లని వస్త్రానికి రంగుల లతలు, కాగితంపూలు, తగరంతో అలంకరణలు చేసి అంబారీ చేస్తారు. అలాగే నూతనంగా చిన్న ఏనుగును తయారు చేసి అలంకరించి చివరి రోజున బోయీలచే ఊరేగింపుగా తీసుకు వెళతారు.ఈ ఊరేగింపులో పిల్లలను ఏనుగు కింద నుండి దాటిస్తారు.అలాదాటిస్తే పిల్లలు రోగ విముక్తులై ఆరోగ్యంగా ఉంటారని విశ్వసిస్తారు.రాత్రి ఆరు గంటలకు ప్రారంభించి తెల్లవారి ఆరుగంటలవరకూ సాగి తూపు చెరువు కట్టకు చేరుకొని ఈ ఉత్సవాన్ని ముగిస్తారు.
విజయనగరం సిరిమాను
విజయనగరంలో దసరా సమయంలో గజపతుల ఆడపడుచైన పైడి తల్లి’కి పూజలు చేస్తారు’. ఈ దేవికి దసరా వెళ్ళిన తరువాత మొదటి మంగళవారం నాడు జాతరజరుపుతారు. ఈ ఉత్సవంలో భాగంగా పూజారిని సిరిమాను ఎక్కించి అమ్మవారి గుడి ఉన్న మూడు లాంతర్ల సెంటర్ నుండి కోట వరకు మూడు సార్లు ఊరేగిస్తారు. ఈ ఉత్సవం చూసేందుకు చుట్టు పక్కల పల్లేలనుండి ప్రజలు ఎడ్లబండిలో మూడురోజుల ముందుగా వచ్చి రోడ్డు ప్రక్కన గుడారాలు వేసుకుని ఉత్సవం చూసి ఆనందిస్తారు. అడవిలో నుండి ఒక నిటారైన చెట్టును నరికి తీసుకు వచ్చీ మొదలు భాగాన్ని లాగుడు బండికి కట్టి చివరి భాగంలో ఊయలకట్టి అందులో పూజారిని కూర్చో పెట్టి ఊరేగింపుగా కోటకు తీసుకు వస్తారు . అక్కడ గజపతులు అమ్మవారికి లాంఛనాలు ఇచ్చి పూజిస్తారు.
వీపన గండ్లలో రాళ్ళయుద్దం
కర్నూలు జిల్లాలోని వీపనగండ్లలో దసరాసమయంలో రాళ్ళ యుద్ధం చేసుకుంటారు. దసరా రోజున సాయం వేళలో ప్రజలు కాలువ ఒడ్డున కాలువకు అటూఇటూ చేర కంకర రాళ్ళను గుట్టగా పోసుకుని ఒకవైపు రామసేన ఒకవైపు రావణ సేనగా ఊహించి రాళ్ళను విసురుతూ యుద్ధం చేసుకుంటారు. ఇది అధర్మంపై ధర్మం యుద్దంచే వుజయం చేసినట్లు భావిస్తారు. దీనిని వాళ్ళు వాళ్ళు రామ రావణ యుద్ధంగా అభివర్ణిస్తారు. ఎంత ఎక్కువగా దెబ్బలు జరిగితే అంత ఎక్కుగా ఉత్సవం జరిగినట్లు విశ్వశిస్తారు.
సంగారెడ్డిలో రావణ దహనం
మెదక్ జిల్లా సంగారెడ్డిలో దసరా సందర్భంలో తొమ్మిది రోజులు దేవిని ఆరాధించి చివరి రోజున రావణ కుంభకర్ణ బొమ్మలను దగ్ధం చేస్తారు. ఈ బొమ్మలను వారు బాణసంచాతో తయారు చేసి అగ్ని బాణాలతో దగ్ధం చేస్తారు.రామ లక్ష్మణ వేషదారులు బాణాలను సంధిస్తారు. ఈ ఉత్సవం మునిసిపల్ గ్రవుండులో నిర్వహిస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుండి వేలకొలది భకులు హాజరై ఉత్సవానికి వన్నె తీసుకు వస్తారు.
బందరు శక్తి పటాలు
కృష్ణా జిల్లాలో ఉన్న రేవుపట్టణం బందరులో దసరా సందర్భంలో శక్తి పటాల ఊరేగింపు నిర్వహిస్తారు. దాదాపు నూరు సంవత్సరాల క్రితం కలకత్తా నుండి బొందిలీలకు చెందిన సైనికుడు మచిలీపట్నం ఈడేపల్లిలో కాళీమాత ప్రతిష్ట చేసాడు.అప్పటి నుండి దసరా సమయంలో శక్తి ఆలయం నుండి శక్తి పటాన్ని పట్టుకుని పురవీధులలో ఊరేగింపుగా తీకుసుకు రావడం ప్రారంభం అయింది.ఊరేగింపు సమయంలో పట్టాన్ని విపుకు కట్టుకుని ముఖానికి అమ్మవారి భయంకర ముఖాకృతిని తగిలించుకుని నాట్యమాడుతూ వీధులలో తిరుగుతారు. తొమ్మిది రోజులు ప్రభలలో ఇలా ఆన్ని వీధులలోని ఇంటింటికీ తిరుగుతారు. వారి వారి ఇంటికి వచ్చినపుడు వారి మొక్కుబడులు తీర్చుకుంటారు. పటం ధరించిన వారు డప్పు శబ్ధానికి అనుగుణంగా వీరనృత్యం చేస్తూ భయంకరాకృతిలో ఉన్న రాక్షసుని సంహరిస్తున్నట్లు అభినయిస్తారు. చివరిరోజున మచిలీ పట్నం కోనేరు సెంటరుకు తీసుకు వచ్చి జమ్మి కొట్టడంతో ఉత్సవం ముగుస్తుంది.
ఒంగోలు కళారాలు
దసరా సమయంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉత్సవాలలో భాగంగా కళారాలను ఊరేగిస్తారు.ఈ కళారాలను దసరా సమయానికి చక్కగా అలంకరించి సిద్ధం చేస్తారు. కళారాలంటే బృహత్తర ముఖాకృతి. ఇక్కడ కాళికాదేవికి, మహిషాసుర మర్ధినికి, నరసింహ స్వామికి కళారాలున్నాయి. వీటికి ఈ తొమ్మిది రోజులు విశేషంగా పూజలు చేసి తొమ్మిది పది రోజులలో ఒక్కోరోజు కొన్ని కళారాలకు ఊరేగింపు చేస్తారు.కళారాన్ని బండి మీద ఎక్కించి ఆటూఇటూ పట్టుకోవడానికి అనివిగా కొయ్యలను అమర్చి వాటి సాయంతో కళారాన్ని అటూ ఇటూ ఊపుతూ డప్పుల మోతలతో ఊరేగింపు నిర్వహిస్తారు. కళారం వెనుక భాగంలో ఒకరు అమ్మవారి ప్రతి రూపంగా చీదను ధరించి వీరనృత్యం చేస్తూ కళారాన్ని ఊగ్రంగా ఊపుతూ ఉంటాడు. ఉగ్రరూపంలో ఉన్న కళారం భీతిని కలిగిస్తుందని గర్భిణీ స్త్రీలకు ఈ ఉత్సవ దర్శనం మంచిది కాదని పెద్దలు సూచిస్తారు. ఇలా కళారాన్ని ఊరి నడిమద్యకు తీసుకు వచ్చి అక్కడ రాక్షస సంహారం ఘట్టాన్ని ప్రదర్శిస్తారు.
నరాత్రులు నవరూపాలు
నవరాత్రి ఉతవాలలో ఆలయాలలో పార్వతీదేవికి రోజుకు ఒక అంకరణ చేస్తారు ఇలా ఒక్కోప్రాంతంలో ఒక్కోలా నామాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో మొదటి రోజు శైల పుత్రి, రెండవ రోజున బ్రహ్మచారిణి, మూడవ నాడు చంద్రఘంటాదేవి, నాల్గవ రోజున కూష్మాండాదేవి, అయిదవ రోజున స్కందమాత, ఆరవ రోజున కాత్యాయినీ, ఏడవరోజున కాళరాత్రి, ఎనిమిదవ రోజున మహాగౌరి, తొమ్మిదవ రోజున సిద్ధిధాత్రిదేవిగా పూజిస్తారు. కొన్ని ప్రదేశాలలో పార్వతీ దేవిని కనక దుర్గగా, మహా లక్ష్మిగా, అన్నపూర్ణగా, గాయత్రిగా, బాలాత్రిపురసుందరిగా, రాజరాజేశ్వరిగా, మహిషాసుర మర్ధినిగా ఆరాధిస్తారు.
పొడుపు కథలు
అ నుంచి అః వరకు
- అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు, కొమ్మ కొమ్మకు కోటిపువ్వులు, అన్ని పువ్వుల్లో రెండేకాయలు?
- ఆకాశం, చుక్కలు, సూర్యుడు
- అందరాని వస్త్రంపై అన్నీ వడియాలు
- నక్షత్రాలు
- అంద చందాల వాడు రోజుకో ఆకారం చివరికి నిరాకారం లేదా నిండు సున్న
- చందమామ
- అక్కడిక్కడబండి, అంతరాలబండి మద్దూరి సంతలో మాయమైన బండి.
- సూర్యుడు
- అక్కాచెల్లెలి అనుబంధం – ఇరుగూ పొరుగూ సంబంధం దగ్గర వున్నా చేరువ కాలేరు.
- కళ్ళు
- అగ్గి అగ్గీ ఛాయ, అమ్మ కుంకుమ ఛాయ, బొగ్గు బొగ్గు ఛాయ, పోలిఛాయ కందిపప్పు, ఛాయ కాలనెమి ఛాయకడసారి తాతయ్య కణితి ఛాయ?
- గురిగింజ
- అబద్ధం అంటే తెలియని అమాయకురాలు
- అద్దం
- అబ్బాయి గారి దొడ్లో పెద్ద బొప్పాయి పండు పడితే పరుగెత్త లేక పదిమంది చచ్చారు.
- పిడుగు
- అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మాఇంటి కొచ్చింది తైతక్కలాడింది?
- కవ్వం
- అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, చెంబులో నీళ్ళన్నీ చెడతాగుతుంది.
- గంధపుచెక్క
- అడవిలో పుట్టాను, నల్లగామారాను, ఇంటికి వచ్చాను ఎర్రగామారాను, కుప్పలోపడ్డాను తెల్లగామారాను.
- బొగ్గు
- అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మాఇంటికొచ్చింది మహలక్ష్మిలా వుంది.
- గడప
- అడవిలో పుట్టాను, మేదరింట్లో మెలిగాను. వంటినిండా గాయాలు, కడుపునిండా రాగాలు.
- మురళి
- అడుగులు ఉన్నా కాళ్ళు లేనిది?
- గజం బద్ద
- అనంతపురంలో తప్పెట కొడితే అంతకు తగులు ఇంతకు తగులు చెరువులో ఉండే చేపకు తగులు బీళ్ళలో మేసే గొడ్డుకు తగులు బాలింతకు తగులు దీని భావమేమి?
- మెరుపు
- అన్నకందవు అమ్మ కందుతాయి.
- పెదవులు
- అరచేతి పట్నాన అరవై వాకిళ్ళు.
- అద్దం
- అర చేతిలో కుంకుమ అందమైన కుంకుమ బీరాకు కుంకుమ బిగువైన కుంకుమ
- గోరింటాకు
- అమ్మ కడుపున పుట్టాను. అంతా సుఖాన ఉన్నాను. నీచే దెబ్బలు తిన్నాను. నిలువున ఎండిపోయాను. నిప్పులు గుండు తొక్కాను. గుప్పెడ బూడిద అయినాను.
- పిడక
- అమారా దేశం నుంచి తుమారా పండ్లు తెస్తే కొనే వారే గాని తినేవారు లేరు.
- పగడం
- అలాము కొండకు సలాము కొట్టు.
- గొడ్డలి
- ఆకాశం పచ్చన నక్షత్రాలు తెల్లన
- పచ్చిమిరపకాయలు
- ఆకు పచ్చ హాస్పటల్, తెల్ల కాంపౌండరు నల్ల డాక్టరు నా పేరేమి?
- సీతాఫలం
- ఆకులేని చెట్టు అరవై ఆరు కాయలు కాస్తుంది.
- నాగమల్లి
- ఆడ గణ గణ ఈడ గణ గణ మద్దెమ్మ గుడి కాడ మరీ గణ గణ
- డోలు
- ఆ పక్క చూస్తే ఎర్ర టోపీ ఈ పక్క చుస్తే నల్ల టోపీ నేనెవరు?
- గురిగింజ
- ఆ రాజు కూతురు అధిక చక్కని దట గోరంత కొప్పు పెట్టి గొలుసులు దిగవేసింది.
- వరివెన్ను
- ఆమడదూరం నుంచి అల్లుడొస్తే మంచంకింద ఇద్దరు గోడమూల ఒకరూ దాక్కున్నారు.
- చెప్పుల జోడు,చేతికర్ర
- ఇంటివెనుక వెంపలిచెట్టు ఏకాయ కాయమంటే, ఆ కాయ కాస్తుంది.
- కుమ్మరిసారె
- ఇంటికి కన్ను కంటికి కన్ను మింటికి కన్ను ఇల్లంతా వెలుగు నిచ్చు.
- దీపం
- ఇక ఇక కాయ పక పక కాయ నేల పోయే కాయ నెత్తి కెక్కే కాయ
- ఈతకాయ
- ఇక్కడ నుండి చూస్తే గుండు, గుండును కొడితే పండు, పండును కొడితే పదహారు వొప్పులు
- తెల్ల పాయ
- ఇక్కడ నుండి చూస్తే ఇనుముగా నుండు దగ్గరకు పోతే పండుగా నుండు తింటే తీపిగా నుండు
- తాటి పండు
- ఈడ ఢమ ఢమ ఆడ ఢమ ఢమ మద్ది రేవుల కాడ మరీ ఢమ ఢమ
- ఉరుము
- ఈనదు కట్టదు కడుపు నిండితే ప్రజల కింత ఫలమిచ్చు
- చెరువు
- ఈ ప్రపంచంలోని వారందరు నా బిడ్డలే. కాని అమ్మా! అని నన్నెవ్వరూ పిలువరు. ఏమి చేయాలన్నా ఏమి పొందాలన్నా నాలోనే ఎటు పోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా నామీదే.
- భూమి
- ఎంతింతాకు బ్రహ్మంతాకు పెద్దలు పెట్టిన పేరంటాకు?
- మంగళ సూత్రం
- ఎక్కలేని మానుకు దిక్కులేని కాపు.
- మిరపచెట్టు
- ఎండకు ఎండదు వానకు తడవదు అది లేకపోతే జరగదు
- రూపాయి బిళ్ళ
- ఎందరు ఎక్కిన విరగని మంచం కదలదు జోగదు బెదరదు కూడ.
- అరుగు
- ఎర్ర మేడలో పచ్చ దీపాలు, దీపాలు చూదామని మేడ తలుపు తీసిన కళ్ళ వెంబడి నీరుకారు
- పిచ్చిమిరప
- ఎనిమిది చేతుల ఏబ్రాసీ ఎప్పుడు తిరిగే సోబ్రాసి వెన్నున జంజె వ్రెళ్ళాడు తీసిన కొద్ది తెర్లాడు.
- రాట్నం
- ఎప్పుడు ఒంటరిగా తిరుగుతాడు అందరికీ వెలుగునిస్తాడు.
- సూర్యుడు
- ఏటి నీటిన వెంపలి చెట్టు ఎంత కోసినా గుప్పెడు కాదు.
- పొగ
- ఒంటి కంటివాడు ప్రాణం లేని వాడు ప్రతి సృష్టి చేస్తాడు.
- కెమెరా
- ఒక్క ఉద్యోగిపేరు నాల్గక్షరములు; మొదటి వర్ణము చెరపిన కదన మగును; మూడవది చెరుపగ హస్తమునకు చెల్లు; నట్టి ఉద్యోగి ఎవ్వడో అరచి చెప్పుడు.
- కరణం
- ఒహొహొ బాలయ్యా ఒళ్ళంతా ముళ్ళయ్య పరపరకోసేస్తే కడుపంతా తీపయ్య.
- పనసకాయ
- కట్టుకుని, పెట్టుకునేది?
- పూల దండ
- కడుపునిండానీరు! ఒట్టిగానే ఊరు! కొట్టగానే పరారు!
- కొబ్బరి బోండాము
- కడుపులేనిది నీళ్లుతాగింది, రోజూ చెంచాడు పాలిస్తుంది!
- తాడిచెట్టు
- కడుపులో పిల్లలు – కంఠములో నిప్పులు, అరుపేమో ఉరుము – ఎరుపంటే భయము – ఎవరది?
- రైలు
- కదలనిది ఏందిరా? కదిలేది ఏందిరా? నలిగేది ఏందిరా?
- బండ, గుండు, గింజ
- కన్ను ఉన్నా తల లేనిది?
- సూది
- కనేవారులేరు! పెంచేవారులేరు! దానంతటదే పుట్టు! అదే చచ్చు!
- చెదలు
- కలి గాని కలి! ఏమి కలి?
- ఆకలి, చాకలి
- కళ్ళు లేకున్నా కనిపించు! నోరు లేకున్నా మాటలాడు! కాళ్ళు లేకున్నా కదలు!
- వీడియో క్యాసెట్
- కాయ కజ్జికాయ, ఆకేమో తమలపాకు?
- జిల్లేడుకాయ
- కాయ గాని కాయ! ఏమి కాయ?
- మొట్టికాయ, కజ్జికాయ
- కాయ, పువ్వు లేని పంట ఏ పంట?
- ఉప్పుపంట
- కారు గాని కారులో వెళతాను, వారు గాని వారు చేస్తాను?
- షికారు, సవారు
- కాళ్ళ క్రింద కోడి కదలకుండా గ్రుడ్లు పెట్టు?
- పుట్టగొడుగు
- కాళ్ళున్నా పాదములు లేనిది?
- కుర్చీ
- కాశీ నుండి కలకత్తా వరకు కదలకుండాపోయేది?
- దారి
- కిటకిట తలుపులు కిటారు తలుపులు ఎప్పుడు తీసిన చప్పుడు కావు.
- కంటి రెప్పలు
- కీ ఇచ్చే అవసరము లేకుండా అడిగినా, అడగకున్నా, కరెక్ట్ గా టైం చెప్పేస్తుంది. ఏమది?
- కోడి పుంజు
- కుడితి త్రాగకున్నా మేత మెయ్యకున్నా కడివెడు పాలిచ్చేదేది?
- తాటిచెట్టు
- కుమ్మరి కుప్పయ్య, పత్తి పాపయ్య ,ఆముదాల అప్పయ్య అంతా ఏకమైనారు?
- ప్రమిద
- కొనుక్కుందామనుకున్నా కొనలేనిది, అప్పుగా తీసుకొందామన్నా తీసికోలేనిది?
- కాలము
- కోడిగాని కోడి! ఏమి కోడి?
- పకోడి, చెగోడి
- కోపము వచ్చినప్పుడల్లా చిందులువేస్తాను. నా ఇష్ట ప్రకారము వచ్చి, వెళతాను. నా పేరు విన్నా, నన్ను చూచినా అందరూ భయపడతారు.
- తుఫాన్
- క్రింద గట్టు, పైన గట్టు, మధ్యలో ఎర్ర బొట్టు!
- నాలుక
- కంటికి నలుపు అందం, నాలుకకి తీపి అందం?
- చెరకు
- కన్నుంది చూడలేదు, కాలుంది నడవలేదు?
- నవారు మంచం
- గండి చెరువులో గుండు తేలె!
- వెన్న
- గంప గులకరాళ్ళలో ఒక చెకుముకి రాయి ?
- చంద్రుడు
- గడంత సానికి - ముంతంత కొప్పు!
- జొన్నకంకి
- గరికపోచలపై గాడిదలు నాట్యమాడు?
- పేను
- గాలికి తిరిగే గడుసరి, ఊరికే తిరిగే సొగసరి?
- సోమరి
- గాలిలో ఎగిరే అద్దము! చేతిలో పడితే పగిలి పొతుంది.
- నీటి బుడగ
- గింజ మునుగుతుంది. కాయ తేలుతుంది.
- వేరు శనగ
- గిలి గాని గిలి! ఏమి గిలి?
- ముంగిలి, లోగిలి
- గుంటూరు గుట్ట! ఏలూరు మిట్ట! పదిమంది పట్ట! ఒకడే కట్ట!
- మాంగల్యము
- గుండు మీద గుండు ఎంతపెట్టిన నిలవదు?
- కోడిగ్రుడ్డు
- గుడి నిండా కెంపులు! గుడికి తాళము!
- దానిమ్మపండు
- గుడి బయట గడుసు, లోన మొత్తన, నీరు చిక్కన!
- తాటి ముంజ
- గుడి! గుడికి మూడు నేత్రములు! ఈ గుడిలో లింగము లేదు గానీ, గంగ ఉన్నది.
- కొబ్బరి కాయ
- గునగున నడిచేవి రెండు! గట్టెక్కి చూచేవి రెండు! ఆలంకించేవి రెండు! అర్ధము చెప్పేది ఒకటి!
- కాళ్ళు, కళ్ళు, చెవులు, నోరు
- గుప్పెడు పిట్టకు బారెడు తోక?
- కలువ పువ్వు
- గూబ - గూటిలో! తోక – చేతిలో!
- గరిటె
- గోరు వంకకు గొడుగును పట్టేదెవరు?
- ఆకాశము
- చక చక పోయేవి రెండు. గట్టెక్కి చూచేవి రెండు అంది పుచ్చుకొనేవి రెండు. ఆలకించేవి రెండు.
- కాళ్ళు, కళ్ళు, చేతులు, చెవులు.
- చక్కని పాపకు చుక్కల చీర!
- ఆకాశము
- చచ్చినోడు సంతకు పోవు!
- ఎండు చేప
- చాచుకొని, సావిట్లో పండుకొనే ముసలమ్మ! ముడుచుకొని, మూల నిలబడుతుంది.
- చాప
- చారల చారల పాము, చక్కని పాము, నూతిలోని పాము, నున్ననైన పాము!
- పొట్లకాయ
- చారల పాపడికి దూది కుచ్చు!
- ఉడుత
- చింపిరి చింపిరి గుడ్డలు! ముత్యముల వంటి బిడ్డలు!
- మొక్కజొన్న
- చీకటి ఇంటిలో జడల దెయ్యము!
- ఉట్టి
- చిక్కటి కారడవిలో చక్కని దారి!
- పాపిట
- చిటపట వానలు కురవంగా! సీతాదేవి పుట్టంగా! లంకా దీపము పెట్టంగా! రాముడు విల్లును విఱువంగా!
- అరటి పువ్వు
- చిటారు కొమ్మన మిఠాయి పొట్లము!
- తేనె తుట్టె
- చిటుకు లాడి! పటుకు లాడి! గోడ ఎక్కి, దుముకు లాడి!
- విస్తరాకు
- చిట్టి పిడతలో మూడు కూరలు!
- తాంబూలము
- చిన్న ఇంటి నిండా తెల్లటి పండ్లు!
- నోటిలోని దంతములు
- చిన్న కాయ! నీ మీదున్న కాయ!
- చెమట కాయ
- చిన్నచట్టిలో కమ్మటి కూర!
- కిళ్ళీ
- చిన్నపట్నములో చాల గదులు! గదికొక్క సిపాయి! సిపాయికొక్క తుపాకి!
- తేనె పట్టు
- చిన్నమిద్దెలో చింతపండు?
- గుబిలి
- చిన్నా, పెద్ద భేదము లేదు. “వారు వీరు” అని అసలే లేదు. ప్రతిరోజూ మూడు పూటలా సర్వ ప్రాణులకు వేసేది ఏది?
- ఆకలి
- చిలుకని గాని చిలుకను నేను! నేను వస్తున్నా, వెళుతున్నా… అదుగో చిలుక! ఇదుగో చిలుక! అంటారు. చిలక గాని చిలక నైన నేనెవరిని?
- స్త్రీ
- చూచే వారే గానీ తీసే వారు లేరు.
- ఇంద్ర ధనస్సు
- చూచేవి చెప్పలేవు, చెప్పేది చూడ లేదు.
- కండ్లు, నోరు
- చూడబోతే చిన్న ముండ! విప్పుతుంటే ఎన్ని చీరలైనా వస్తాయి.
- నీరు ఉల్లిపాయ
- చూస్తే ఒకటి, చేస్తే రెండు, తలకూ, తోకకూ, ఒకటే టోపి చెప్పండి. ఇది చెప్పండి.
- కలరు
- చెక్కని స్తంభం చేతికందదూ, చెయ్యని కుండా పొయ్యని నీళ్ళు చెయ్య సున్నం – తియ్యని బెల్లం
- కొబ్బరి
- చెట్టు కొడితే పిట్ట లేచి పోయె!
- పేడు
- చెట్టు చూడు. చెట్టందం చూడు. చిత్రమైన చిగురాకును చూడు. పూసిందంటే ఒకటే పూవు చూడు. కాసిందంటే గంపెడు కాయలు చూడు.
- ఆకాశం, చంద్రుడు, చుక్కలు, వెన్నెల
- చెయ్యని కుండ! పొయ్యని నీరు! వెయ్యని సున్నము! తియ్యగ నుండు!
- కొబ్బరికాయ
- జామ చెట్టు క్రింద జానమ్మా ఎంత గుంజినా రాదమ్మా
- నీడ
- జల్లు పడగానే, జండా లేస్తుంది.
- పుట్ట గొడుగు
- జాజికాయ కొట్లాడుతుంది ఎలక్కాయ విడిపిస్తుంది.
- తాళంచెవి
- జాబు గాని జాబు ఏమి జాబు?
- పంజాబు
- జింక ఉరకంగా పాలుకారంగా?
- విసురు రాయి
- జిత్తెడు తోకున్న జివలగిరి మేక! ఆవుల కొండెక్కి, ఆకు మేసె!
- ఎలుక
- జిలుగు జిలుగు నీటిలో జీలుగు పుట్టె! ఆకు పుట్టె! అంతరాల కొడుకు పుట్టె! కొడుకును కొట్టి, కోడలు ముండ మోసె!
- అరటి చెట్టు
- జీవం ఉంది కాని కదలలేదు
- గ్రుడ్డు
- జీవం లేని జంతువు ఆకుల్లేని అడవిలో వేటాడబోయింది?
- దువ్వెన
- జీవము లేని గరుడ పక్షి దేశ దేశములూ తిరుగుతుంది.
- విమానము
- జీవంలేని గుర్రాన్నెక్కి జిగటాకోల చేతబట్టి ఆకుల్లేని అడవిలోకి వేటాడబోయింది టక్కులాడి.
- పడవ
- జీడీ వారికి కోడలు, సిరిగల వారికి ఆడపడుచు మైనులగుల్కె వయ్యారి వైశాఖంలో వస్తుంది.
- మామిడి పండు
- జోడు గుఱ్ఱముల మీద ఒకడే రాజు!
- పావు కోళ్ళ
- టక్కు చూచుట కెంతో నిక్కు! జాఱి పడిందటే… పుటుక్కు!
- కండ్ల జోడు
- ‘టూరు’ గాని టూరు, ఏమి టూరు?
- గుంటూరు, ఇంటూరు
- ట్రిక్కులు చేసే టక్కుల మారి! చెప్పకుండా పోతాడు. గల్లంతు ఔతాడు.
- మోసగాడు
- “టిక్కు” మనగానే మాట్లాడతాను. “టక్కు” మనగానే ఆగిపోతాను.
- ఆకాశ వాణి
- టిక్కు టిక్కు బండి! టక్కులాడి బండి! సాగిపోవు బండి! హాల్ట్ లేని బండి! అదేమిటి?
- గడియారము
- టెంకాయలో వంకాయ పోతే ఎంత?
- తొమ్మిది
- డబ్బుపెట్టి కొనడం ముందరగానే ఏడ్వడం.
- ఉల్లిగడ్డ
- డబ్బులిస్తానంటేనే దరువు వేస్తాడు.
- ఒళ్ళు పట్టేవాడు
- డబ్బులిస్తే చాలు గుద్దుతాడు.
- ఒడ్రమంగలి
- డాక్టరొచ్చారు సూది వేశారు, కాసులిస్తేను పారిపోయారు.
- దోమ
- ‘డాలు’ గాని డాలు! ఏమి డాలు?
- కాగడాలు, అప్పడాలు
- డిల్లీలో పాటను లండన్ లో వినిపిస్తుంది. మాస్కో లో నాటకాన్ని న్యూయర్క్ లో చూపిస్తుంది.
- టెలివిజన్
- డొంకలో ఇంపైన మెలికల పాము.
- నాలుక
- డొంకలో మెలికల కఱ్ఱ?
- పాము
- ‘డ్రస్’ గాని డ్రస్! ఏమి డ్రస్?
- అడ్రస్
- ఢాం ఢాం పలక! ఢంకా పలకా! ఎంత కొట్టినా… పగులని పలక?
- భూమ
- తండ్రి గరగర! తల్లి పీచు పీచు! బిడ్డలు రత్నమాణిక్యములు!
- పనస పండు
- తమ్ముడు కుంటుతూ, కుంటుతూ మైలు నడిచేసరికి అన్న పరుగెత్తుకుంటూ పన్నెండు మైళ్ళు నడుస్తాడు.
- గడియారములోని ముళ్ళు
- తరచి తరచి చూసినా లోతు తెలియనిది?
- ఆడదాని మనసు
- తల కాయ వుంది. తక్కింది లేదు. ఒంటి కాలిపైన గిరగిర తిరిగే ఒయ్యారముల సింగారము!
- బొంగరము
- తల ఉన్నా కళ్ళు లేనిది?
- గుండు సూది
- తలలేని కాసురెడ్డికి వీపునే మోకాళ్ళు!
- ఇంటి కప్పు
- తల్లి కూర్చుండు! పిల్ల పారాడు!
- కడవ చెంబు
- తళుకు తళుకు నీటిలో శ్రీరాముడు పుట్టె! ఆ శ్రీరాముని కడుపులో ఒక రాముడు పుట్టె! ఆ రాముని కడుపులో వజ్రము పుట్టె!
- బియ్యపు గింజ
- తవ్వని కుంట కురవని నీరు?
- నోరు, లాలాజలం
- తాపం గాని తాపం
- ప్రతాపం
- తాళము గాని తాళము! ఏమి తాళము?
- ఆది తాళము
- తాళి గాని తాళి ఏమి తాళి?
- ఎగతాళి
- తీసుకునే వారి చెయ్యి పైన, ఇచ్చేవారి చెయ్యి క్రింద ఇలా ఎప్పుడుంటుంది?
- బొట్టు పెట్టుకునేటప్పుడు
- తీస్తే పోతుంది. తెల్లారితే వస్తుంది.
- మీసము
- తెల్లటోడు నల్లటోడిని తన్ను!
- అగ్గిపెట్టె
- తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు. చేతితో చల్లడం, నోటితో ఏరుకోవడం.
- పుస్తకం
- తేరు తిరుగుతుంటే, పూలు రాలతాయి.
- విసురు రాయి
- తొడిమ లేని పండు! ఆకు లేని పంట!
- విబూది పండు,ఉప్పు పంట
- తొడేవారే గాని, పోసేవారే లేరు.
- బావి నీరు
- తొమ్మిది రంధ్రముల బొమ్మ! ఘనమైన తోలు బొమ్మ!
- మనిషి
- దండ కాని దండ ?
- అండదండ, కైదండ
- దానము గాని దానము! ఏమి దానము?
- నిదానము, మైదానము
- దాని మొదలు చెరకు మొదలు. దాని ఆకు తామరాకు దాని పూత మేడి పూత దాని కాత గజ్జి కాత
- ఆముదపు చెట్టు
- దినమంతా నిద్రపోతుంది రాత్రంతా మేలుకుంటుంది?
- దీపం
- దుకాణములో కొంటారు. ముందర పెట్టుకొని ఏడుస్తారు.
- ఉల్లి గడ్డలు
- దోసెడు నీటిలో దొరసాని జలకాడమాడింది?
- వెన్న
- ధనము గాని ధనము ఏమి ధనము?
- ఇంధనము, బంధనము
- ధరణిలో పన్నెండు మంది భార్యలు నాకు! ఒక్కో భార్యకు నలుగురు కొడుకులు! మూడువందల అరువది ఐదుమంది మనుమలు!
- సంవత్సరము= నెలలు, వారములు, రోజులు
- నట్టింట్లో నలుగురు దొంగలు?
- చనుకట్ట
- నడిచిపోయే తెల్లరాతికి నాలుగు కాళ్ళు?
- ఆవు
- నడుము సన్నపు నాగ లింగము! పోటు, పోటుకు బొబ్బలింగము!
- కందురీగ
- నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది. దాని పీక మీదకు కత్తిని తెస్తేగానీ నడువదు. ఏమిటది?
- పెన్సిల్
- నన్ను చూస్తే నిన్ను పట్టిస్తా?
- అద్దం
- నరుడు కాని నరుడు?
- వానరుడు
- నలుగురు దొంగలపై ఒకటే రాయి
- ఉసిరికాయ
- నల్లటి నీటిలో, తెల్లనీటిని పోసి, వెండి పలుకు లేస్తే అంతా త్రాగే వారే! ఏమిటవి?
- కాఫీ, టీ
- నల్లపడవలో తెల్లటిదారి?
- పాపిడి
- నా చుట్టూ అద్దములు వుంటాయి గానీ, అద్దముల మేడను కాను. వేగముగా పరుగెడుతుంటాను గానీ, జింకను కాను. నాతో అందరికీ పని వుంటుంది గానీ, ప్రభుత్వపు కార్యాలయమును కాను.
- బస్
- నాకు మీ చేయి తగిలితే నేను ఊరుకోను. ఎలుగెత్తి అరుస్తాను, దైవమును పిలుస్తాను. నేనెవరిని?
- గుడిగంట
- నాకు (మగ వారికి) ఉండేది! నీకు (ఆడవారికి) ఉండేది! అవేమిటో చెప్పు?
- అప్పు, కొప్పు
- నాలుగు కాళ్ళున్నాయి గానీ, జంతువును కాను. నా శరీరమంతా రంధ్రములున్నాయి గానీ, వలను కాను.
- మంచము
- నాలో నదులున్నాయి గానీ, మ్యాప్‌ను కాను. గుండ్రంగా వుంటాను గానీ, బంతిని కాను. నాలోనే సర్వము ఉన్నది గానీ, దేవుడ్ని కాను.
- గ్లోబ్
- నిద్రపోయినా కళ్ళు మూయనిది?
- నాలుక
- నిన్న ఏమిటో, నేడు ఏమిటో, రేపు ఏమిటో చెప్పవే చక్కని బొమ్మ! మాసమున కొకసారి మారిపోయే బొమ్మ ఎల్లప్పుడూ గోడ నంటియుండు బొమ్మ!
- వాల్ క్యాలెండర్
- నీచేతి దెబ్బలు తిన్నాను నిలువునా ఎండిపోయాను. నిప్పుల గుండమును తొక్కాను. గుప్పెడు బూడిదనయ్యాను.
- పిడక
- నీడొక్కలో నా కాలు!
- మగ్గము
- నీటి పైన కలకలా కొమ్మమీద కిచకిచ
- కప్పలు-కోతులు
- నున్నటి బండమీద నూగులను ఎండబోస్తే, నాలుక లేని భీముడొచ్చి, నాకి పోయాడు.
- జుట్టు కత్తిరించే కత్తి
- నున్నగా చెక్కించి, నూనె మెరుగెట్టించి; ఏడాది కొకసారి గంట కొట్టి; కదిలిస్తారు కోలాహలంబుగా!
- రథము
- నేనెన్నో మంచి విషయములను నేర్పుతాను గానీ, నాకు మాటలు రావు. నేను మీకు ప్రపంచమును చూపగలను గానీ, నేను చూడలేను. మరి నేనెవరిని?
- పుస్తకము
- పచ్చని గుడిలో ఎర్రని రత్నాలు?
- దానిమ్మ పండు
- పచ్చని పందిట్లో ఎర్రని పెళ్ళికూతురు?
- మిరప పండు
- పచ్చని పందిరిలో, తెల్లని మిద్దె లోపల ఉన్నాడు నల్లని రాజు.
- సీతా ఫలపు గింజ
- పచ్చిని పెట్టెలో విచ్చుకోనుంది. తెచ్చుకోపోతేనూ గుచ్చుకుంటుంది.
- మొగిలి పువ్వు
- పడుతుందేకానీ పైకి లేవలేదు?
- వాన
- పళ్ళు ఉన్నా నోరు లేనిది?
- రంపం
- పాలుగాని పాలు ఏమిపాలు?
- శాపాలు, లోపాలు
- పిటాపురం చిన్నవాడా పిట్టల వేటగాడా బ్రతికిన పిట్టను కొట్టవద్దు. చచ్చిన పిట్టను తేనూవద్దు. కూరకు లేకుండా రావద్దు. ఏమి కూర.
- కోడి గ్రుడ్డు
- పుట్టినా కదలనిది ఏది?
- గ్రుడ్డు
- పుట్టెడు శనగలలో ఒకటే రాయి.
- చందమామ
- పుట్టేటప్పుడు కొమ్ములుంటాయి గానీ, రాక్షసుడను కాను. పెరిగే కొద్దీ గుండ్రముగా ఔతాను గానీ, గోళమును కాను. ఎప్పుడూ తిరుగుతుంటాను గానీ, గడియారమును కాను. మరి నేనెవరిని?
- చందమామ
- పుట్టేటప్పుడు లేనిది, మధ్యలో వచ్చేది, చివరిదాకా వుండేది!
- భార్య
- పెంకు మీద పక్షి పేరు చెప్పవే కమలాక్షి
- తాబేలు
- పెట్టుకుంటూనే పట్టి చూచుకోవాలి?
- కొప్పు
- పైన పటారము! లోన లొటారము!
- మేడిపండు
- పై నో పలక క్రిందో పలక పలకల మధ్య మెలికల పాము, పామును పట్టా పగ్గలం లేదు పెగ్గెలు పలికే సిగ్గొదినా
- నాలుక
- బంగారు చెంబులో, వెండి గచ్చకాయ?
- పనస తొన
- బండి ఎక్కడు, గుఱ్ఱము ఎక్కడు, నడువలేని బాలుడు, ఇంటి ముందర అటు ఇటు తిరుగుతాడు.
- రాట్నము
- బడి గాని బడి! ఏమిబడి?
- రాబడి, దిగుబడి
- బాటకు బంధం, నల్లపూసల అందం?
- చీమల బారు
- బారుగాని బారు! ఏమి బారు?
- సాంబారు
- బావిలో చింత పండు?
- గుబిలి
- బిందె మీద బిందె అల్లాడే పది పందిళ్ళు?
- అరటి గెల
- బిళ్ళ కాని బిళ్ళ, లోకం కోరే బిళ్ళ?
- రూపాయిబిళ్ళ, తపాళబిళ్ళ
- బుడగకు బుక్కెడు నెత్తురు?
- కుంకుమ
- బుడబుక్కలోడొచ్చి భూమంతా చాటించె! మధ్యాహ్నామునకేమో మాయమాయే!
- పేడ నీరు
- బొట్టు కాని బొట్టు ఏమి బొట్టు?
- తాళిబొట్టు
- భగవంతుని ప్రతిరూపమును నేను! నన్ను మంగళకరముగా భావిస్తారు. మనిషి మనిషికీ ప్రతిరోజూ ప్రతిపూటా ఉపయోగపడతాను.
- అద్దము
- భయం కాని భయం?
- అభయం
- భరణి కార్తిలో చల్లినకాయకు చిప్పెడు పంట?
- నువ్వుల పంట
- భీముడు బిగతన్నె, అర్జునుడు అగపట్టె?
- స్తంబం, దూలం
- భుజం మీద ఉంటాడు దండెం మీద వ్రేలాడతాడు?
- కండువ
- భూమి చూసి నిలుచును?
- పడవ
- భూమిలో పెరిగిన బుల్లి చెంబు?
- కందపిలక
- భోజనం సహింపలేదు, గుంజకదలాడుచున్నావెందుకు?
- కూరలేదు
- భూ మాతకు ముద్దు బిడ్డ. ఆకాశపు జున్ను గడ్డ. రాత్రి వేళ రాజరికం. పగలయితే పేదరికం.
- చంద్రుడు
- మంచము క్రింద మామా! ఊరికి పోదాము రావా?
- చెప్పులు
- మందు కాని మందు?
- కామందు
- మనతో వస్తుంది, మనకు చెప్పకుండానే వెళ్తుంది?
- నీడ
- మల్లపు గుర్రానికి ఒళ్ళంతా రంధ్రాలు?
- జల్లెడ
- మా బావ బజారుకెళ్ళి తొడిమలేని వంకాయ తెచ్చాడు?
- కోడి గ్రుడ్డు
- మాతాత ఏటి అవతలికి వెళ్ళి మూడెడ్లను తెచ్చాడు. ఒకటి కరిగేది, ఒకటి తేలేది, ఒకటి మునిగేది.
- సున్నము, ఆకు, వక్క
- మాతాత బోడి, మీతాత బోడి పెద్దప్పబోడి, శివలింగంబోడి?
- మంచం కోళ్ళు
- మానం కాని మానం?
- అవమానం, బహుమానం, కొలమానం
- మారు కథ మంకెన్న! నీకు నాకు లంకెన్న!
- గొళ్ళెము
- ముక్కు మీద కెక్కు! చెవుల పైన నక్కు! జారిపడిందంటే పుటుక్కు! ఏమిటది?
- కండ్లజోడు
- ముక్కులేని పిట్ట ముళ్ళన్నీ ఏరుకు తిన్నది.
- పొయ్యి
- ముక్కువున్నా మెడలేనిది?
- నది
- ‘మొగుడు గాని మొగుడు’ ఏ మొగుడు?
- అప్పుల మొగుడు
- మొఖం ఉన్నా మెడ లేనిది?
- నది
- యంత్రము గాని యంత్రమును నేను! నాకు అప్పుడపుడు రిపేర్లుంటాయి. ఒక్కసారి ఆగిపోయానంటే, నేను మరలా పనికి రాను. మరి నే నెవరిని?
- మనిషి
- యమునికైనా భయపడను! కొట్టినా ఏడవను! తిట్టినా బాధ పడను! మీరేమనుకున్న నేనేమనుకోను. మరి నేనెవరిని?
- బొమ్మ
- యేరు మీద మిరప చెట్టు నాకగపడుతుంది, నీకగపడదు.
- బొట్టు
- రచ్చబండ క్రింద నలుగురు దొంగలు?
- గేదెపొదుగు
- రణం కాని రణం ?
- మరణం,తోరణం,ఆభరణం
- రసం కాని రసం?
- నీరసం, సరసం, విరసం
- రాజ మందిరము చిన్నదానా! రాఘవయ్య కోడలా! చేద వెయ్యకుండా, తియ్యకుండా, దాహమునకు నీరు తేవె!
- కొబ్బరి నీరు
- రాజా వారి తోటలో రోజా పూలు! చూచే వారే గాని, కోసే వారు లేరు. ఏమిటవి?
- నక్షత్రములు
- రాయి గాని రాయి! ఏమి రాయి?
- పావురాయి
- రేయీ, పగలూ నడిచింది. చేయీ, చేయీ కదిలింది. వేళా, పాళా చెపుతుంది. వున్నచోటనే పడివుంది.
- గోడ గడియారము
- రోషమునకు మారు పేరు నేను! భీముడను మాత్రము కాను. అందుకే ఎవరికి రోషము వచ్చినా, ముందు నా మీదే చెయ్యి వేస్తారు. నే నెవరిని?
- మీసము
- లంక తగుల బెడితే, లచ్చి మొత్తుకునే!
- అన్నము ఉడుకుట
- లక్కబుడ్డి నిండా, లక్ష వరహాలు?
- పుచ్చకాయ
- లక్కపిడతలో, లక్ష వరహాలు!
- దానిమ్మపండు
- లాగి విడిస్తేనే బ్రతుకు?
- ఊపిరి
- లింగడు కన్నెమనసు, దొంగిలించిన దొంగాడు?
- మన్మధుడు
- లోకమంతా చాప వేసి, నిద్ర పోకుండా తిరుగుతూ వుంటాడు.ఎవరతను?
- సముద్రము
- లోతు బావిలో జారికి బెల్లం?
- గుబిలి
- లోన బంగారము! బయట వెండి! ఏమిటి?
- కోడి గ్రుడ్డు
- వంకర టింకర మ్రాను! కష్ట జీవుల గూడే ఈడు, జోడు! విప్పితే, ఇంకో ఇల్లుంది. ఏమిటది?
- పెండ్లి పల్లకి
- వచ్చి పోయేవి రెండు! పోతే రానివి రెండు! ఏమిటి?
- కలిమి, లేములు - మాన, ప్రాణములు
- ‘వరి’ గాని వరి! ఏమి వరి?
- జనవరి
- వళ్ళంతా ముళ్ళు. వాసన ఘుమఘుమ?
- గులాబి
- వస్తూకేక లేస్తుండు! వేస్తూ పోతుండు! ఎవరు?
- గాజులసెట్టి
- వస్తే పోనివి రెండు! పోతే రానివి రెండు! ఏమిటి?
- కీర్తి, అపకీర్తి - పరువు, ప్రతిష్ట
- వాకిట్లో కలవారి కోడలు పడింది?
- ముగ్గు
- వాయు వేగమును మించి, లోకములన్నీగాలించి, చిటెకెలోఉన్న చోటికి వచ్చు! ఏమిటది?
- మనసు
- ‘వారు’ గాని వారు! ఏమి వారు?
- నవారు, అయ్యవారు
- ‘వాలు’ గాని వాలు! ఏమి వాలు?
- ఆనవాలు, ఆవాలు
- విత్తనము లేకుండా, మొలిచేది ఏమిటి?
- గడ్డము
- విశ్వాసమునకు ప్రతినిధిని నేను! విశ్వాసహీనుని చూచి, ‘ నీకంటే అదే నయమని’ అంటారు. మరి నేనెవరిని?
- కుక్క
- వేలెడంత లోగిలిలో, ఏభైమంది నివాసము!
- అగ్గి పెట్టెలోని పుల్లలు
- వేసిన దేమిరా? వ్రేలు పెట్టి చూసిన దేమిరా?
- వేసినది చెక్కరా! వ్రేలుపెట్టి వాసన చూచినది శ్రీ గంధమురా
- వేస్తే సోకు! తీస్తే బోసి! ఏమిటి?
- కండువ
- శంఖులో పెంకు, పెంకులోతీర్థము, తీర్థములో మొగ్గ?
- టెంకాయ
- శాఖలు ఉన్నా, ఆకులు లేనిది?
- సంస్థ
- శిబి, కర్ణులార్జించిన చెలువ ఏది?
- కీర్తి
- శివరాత్రికి చంకలెత్తనీయుడు?
- చలి
- శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరగాయ?
- మామిడికాయ
- శ్రీ రాముడు కూడ పట్టి వంచలేనిది, రంగు రంగులుగా ఒకే వరుసలో వచ్చునది, ‘కుక్కకు, నక్కకు పెళ్ళి’అనే సమయములో వచ్చునది. అదేమటో విప్పగలరా?
- ఇంద్ర ధనస్సు
- శ్రీ రాముల ఇంటి వెనుక శ్రీవణము చెట్టు! కాస్తుంది, పూస్తుంది. వాసన వుండదు.
- చింతకాయ
- శ్రీ విష్ణువు మోయుచు తిరిగెడు పక్షి?
- గరుడ పక్షి
- సంతలో షావుకారు, ఊరిలో ఉద్యోగరాయుడు, గట్టుమీద గంగారాయుడు!
- త్రాసు, కలము, కొంగ
- సందకాడ లగ్గమాయె! కాని పొత్తు గర్భమాయె! కోడి కూతకు కొడుకు పుట్టె! పొద్దు పొడవ పేరు కొచ్చె!
- చల్లకుండ
- సముద్రంలో పుట్టి, సముద్రంలో పెరిగి ఊళ్ళోకొచ్చి అరిచేది?
- శంఖం
- సముద్రంలో మునుగునది కానీ, చేపకాదు ఏమిటది?
- నది
- సల సలా కాగే నీళ్ళలో సీతమ్మ స్నానమాడు.
- అరిసెలు
- సాయి గాని సాయి! ఏమి సాయి?
- కసాయి
- సార సారల చెంబు, చక్కని చెంబు ముంచితే మునగదు ముత్యాల చెంబు?
- దోసకాయ
- సావిట్లో సద్దు కర్ర ?
- కలం
- సీమంత ముండ బిడ్డ అందరికీ వడ్డించు!
- గరిటె
- సువాసన ఉన్నా, పూజకు పనికి రానిది.
- మొగలి పూవు
- సూది వెళ్ళి చుక్కలను తాకింది. ఏమిటి?
- తారాజువ్వ
- సూర్యుడు చూడని మడుగు! చాకలి తాకని గంగ!
- టెంకాయ
- హంస ముక్కుకి, ముత్యం కట్టుకొని తోకతో నీళ్ళు త్రాగుతుంది?
- ప్రమిద
- హద్దులేని పద్దు?
- అబద్దం
- హనుమంతుడు అందగాడు?
- బ్రహ్మచారి
- హనుమంతుని పెళ్ళాం గొప్పధనవంతురాలు, తట్టెడు సొమ్ములు పెట్టుకొని తలవాల్చు?
- కొర్రకంకి
- హరీ అనకుండానే చచ్చేది?
- చెట్టు
- హర్మోనియంకూ, నాకూ తేడా ఉండదు. అది శబ్దము చేస్తుంది. నేనునూ శబ్దము చేస్తాను. దాని ఫలితము అశాశ్వతము! నా ఫలితము శాశ్వతము! మరి నేనెవరిని?
- టైప్ రైటర్
- హారము గాని హారము! ఏమి హారము?
- ఆహారము
- క్ష కారము చివరి స్థానము! క కారము మొదటి స్థానము! మరి నేనెవరిని?
- కక్ష
- క్షమించుట తప్ప, నాకేమీ తెలియదు. మరి నేనెవరిని?
- జ్ఞాని
- జ్ఞాని