అ నుంచి అః వరకు
- అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు, కొమ్మ కొమ్మకు కోటిపువ్వులు, అన్ని పువ్వుల్లో రెండేకాయలు?
- ఆకాశం, చుక్కలు, సూర్యుడు
- అందరాని వస్త్రంపై అన్నీ వడియాలు
- నక్షత్రాలు
- అంద చందాల వాడు రోజుకో ఆకారం చివరికి నిరాకారం లేదా నిండు సున్న
- చందమామ
- అక్కడిక్కడబండి, అంతరాలబండి మద్దూరి సంతలో మాయమైన బండి.
- సూర్యుడు
- అక్కాచెల్లెలి అనుబంధం – ఇరుగూ పొరుగూ సంబంధం దగ్గర వున్నా చేరువ కాలేరు.
- కళ్ళు
- అగ్గి అగ్గీ ఛాయ, అమ్మ కుంకుమ ఛాయ, బొగ్గు బొగ్గు ఛాయ, పోలిఛాయ కందిపప్పు, ఛాయ కాలనెమి ఛాయకడసారి తాతయ్య కణితి ఛాయ?
- గురిగింజ
- అబద్ధం అంటే తెలియని అమాయకురాలు
- అద్దం
- అబ్బాయి గారి దొడ్లో పెద్ద బొప్పాయి పండు పడితే పరుగెత్త లేక పదిమంది చచ్చారు.
- పిడుగు
- అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మాఇంటి కొచ్చింది తైతక్కలాడింది?
- కవ్వం
- అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, చెంబులో నీళ్ళన్నీ చెడతాగుతుంది.
- గంధపుచెక్క
- అడవిలో పుట్టాను, నల్లగామారాను, ఇంటికి వచ్చాను ఎర్రగామారాను, కుప్పలోపడ్డాను తెల్లగామారాను.
- బొగ్గు
- అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మాఇంటికొచ్చింది మహలక్ష్మిలా వుంది.
- గడప
- అడవిలో పుట్టాను, మేదరింట్లో మెలిగాను. వంటినిండా గాయాలు, కడుపునిండా రాగాలు.
- మురళి
- అడుగులు ఉన్నా కాళ్ళు లేనిది?
- గజం బద్ద
- అనంతపురంలో తప్పెట కొడితే అంతకు తగులు ఇంతకు తగులు చెరువులో ఉండే చేపకు తగులు బీళ్ళలో మేసే గొడ్డుకు తగులు బాలింతకు తగులు దీని భావమేమి?
- మెరుపు
- అన్నకందవు అమ్మ కందుతాయి.
- పెదవులు
- అరచేతి పట్నాన అరవై వాకిళ్ళు.
- అద్దం
- అర చేతిలో కుంకుమ అందమైన కుంకుమ బీరాకు కుంకుమ బిగువైన కుంకుమ
- గోరింటాకు
- అమ్మ కడుపున పుట్టాను. అంతా సుఖాన ఉన్నాను. నీచే దెబ్బలు తిన్నాను. నిలువున ఎండిపోయాను. నిప్పులు గుండు తొక్కాను. గుప్పెడ బూడిద అయినాను.
- పిడక
- అమారా దేశం నుంచి తుమారా పండ్లు తెస్తే కొనే వారే గాని తినేవారు లేరు.
- పగడం
- అలాము కొండకు సలాము కొట్టు.
- గొడ్డలి
- ఆకాశం పచ్చన నక్షత్రాలు తెల్లన
- పచ్చిమిరపకాయలు
- ఆకు పచ్చ హాస్పటల్, తెల్ల కాంపౌండరు నల్ల డాక్టరు నా పేరేమి?
- సీతాఫలం
- ఆకులేని చెట్టు అరవై ఆరు కాయలు కాస్తుంది.
- నాగమల్లి
- ఆడ గణ గణ ఈడ గణ గణ మద్దెమ్మ గుడి కాడ మరీ గణ గణ
- డోలు
- ఆ పక్క చూస్తే ఎర్ర టోపీ ఈ పక్క చుస్తే నల్ల టోపీ నేనెవరు?
- గురిగింజ
- ఆ రాజు కూతురు అధిక చక్కని దట గోరంత కొప్పు పెట్టి గొలుసులు దిగవేసింది.
- వరివెన్ను
- ఆమడదూరం నుంచి అల్లుడొస్తే మంచంకింద ఇద్దరు గోడమూల ఒకరూ దాక్కున్నారు.
- చెప్పుల జోడు,చేతికర్ర
- ఇంటివెనుక వెంపలిచెట్టు ఏకాయ కాయమంటే, ఆ కాయ కాస్తుంది.
- కుమ్మరిసారె
- ఇంటికి కన్ను కంటికి కన్ను మింటికి కన్ను ఇల్లంతా వెలుగు నిచ్చు.
- దీపం
- ఇక ఇక కాయ పక పక కాయ నేల పోయే కాయ నెత్తి కెక్కే కాయ
- ఈతకాయ
- ఇక్కడ నుండి చూస్తే గుండు, గుండును కొడితే పండు, పండును కొడితే పదహారు వొప్పులు
- తెల్ల పాయ
- ఇక్కడ నుండి చూస్తే ఇనుముగా నుండు దగ్గరకు పోతే పండుగా నుండు తింటే తీపిగా నుండు
- తాటి పండు
- ఈడ ఢమ ఢమ ఆడ ఢమ ఢమ మద్ది రేవుల కాడ మరీ ఢమ ఢమ
- ఉరుము
- ఈనదు కట్టదు కడుపు నిండితే ప్రజల కింత ఫలమిచ్చు
- చెరువు
- ఈ ప్రపంచంలోని వారందరు నా బిడ్డలే. కాని అమ్మా! అని నన్నెవ్వరూ పిలువరు. ఏమి చేయాలన్నా ఏమి పొందాలన్నా నాలోనే ఎటు పోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా నామీదే.
- భూమి
- ఎంతింతాకు బ్రహ్మంతాకు పెద్దలు పెట్టిన పేరంటాకు?
- మంగళ సూత్రం
- ఎక్కలేని మానుకు దిక్కులేని కాపు.
- మిరపచెట్టు
- ఎండకు ఎండదు వానకు తడవదు అది లేకపోతే జరగదు
- రూపాయి బిళ్ళ
- ఎందరు ఎక్కిన విరగని మంచం కదలదు జోగదు బెదరదు కూడ.
- అరుగు
- ఎర్ర మేడలో పచ్చ దీపాలు, దీపాలు చూదామని మేడ తలుపు తీసిన కళ్ళ వెంబడి నీరుకారు
- పిచ్చిమిరప
- ఎనిమిది చేతుల ఏబ్రాసీ ఎప్పుడు తిరిగే సోబ్రాసి వెన్నున జంజె వ్రెళ్ళాడు తీసిన కొద్ది తెర్లాడు.
- రాట్నం
- ఎప్పుడు ఒంటరిగా తిరుగుతాడు అందరికీ వెలుగునిస్తాడు.
- సూర్యుడు
- ఏటి నీటిన వెంపలి చెట్టు ఎంత కోసినా గుప్పెడు కాదు.
- పొగ
- ఒంటి కంటివాడు ప్రాణం లేని వాడు ప్రతి సృష్టి చేస్తాడు.
- కెమెరా
- ఒక్క ఉద్యోగిపేరు నాల్గక్షరములు; మొదటి వర్ణము చెరపిన కదన మగును; మూడవది చెరుపగ హస్తమునకు చెల్లు; నట్టి ఉద్యోగి ఎవ్వడో అరచి చెప్పుడు.
- కరణం
- ఒహొహొ బాలయ్యా ఒళ్ళంతా ముళ్ళయ్య పరపరకోసేస్తే కడుపంతా తీపయ్య.
- పనసకాయ
- కట్టుకుని, పెట్టుకునేది?
- పూల దండ
- కడుపునిండానీరు! ఒట్టిగానే ఊరు! కొట్టగానే పరారు!
- కొబ్బరి బోండాము
- కడుపులేనిది నీళ్లుతాగింది, రోజూ చెంచాడు పాలిస్తుంది!
- తాడిచెట్టు
- కడుపులో పిల్లలు – కంఠములో నిప్పులు, అరుపేమో ఉరుము – ఎరుపంటే భయము – ఎవరది?
- రైలు
- కదలనిది ఏందిరా? కదిలేది ఏందిరా? నలిగేది ఏందిరా?
- బండ, గుండు, గింజ
- కన్ను ఉన్నా తల లేనిది?
- సూది
- కనేవారులేరు! పెంచేవారులేరు! దానంతటదే పుట్టు! అదే చచ్చు!
- చెదలు
- కలి గాని కలి! ఏమి కలి?
- ఆకలి, చాకలి
- కళ్ళు లేకున్నా కనిపించు! నోరు లేకున్నా మాటలాడు! కాళ్ళు లేకున్నా కదలు!
- వీడియో క్యాసెట్
- కాయ కజ్జికాయ, ఆకేమో తమలపాకు?
- జిల్లేడుకాయ
- కాయ గాని కాయ! ఏమి కాయ?
- మొట్టికాయ, కజ్జికాయ
- కాయ, పువ్వు లేని పంట ఏ పంట?
- ఉప్పుపంట
- కారు గాని కారులో వెళతాను, వారు గాని వారు చేస్తాను?
- షికారు, సవారు
- కాళ్ళ క్రింద కోడి కదలకుండా గ్రుడ్లు పెట్టు?
- పుట్టగొడుగు
- కాళ్ళున్నా పాదములు లేనిది?
- కుర్చీ
- కాశీ నుండి కలకత్తా వరకు కదలకుండాపోయేది?
- దారి
- కిటకిట తలుపులు కిటారు తలుపులు ఎప్పుడు తీసిన చప్పుడు కావు.
- కంటి రెప్పలు
- కీ ఇచ్చే అవసరము లేకుండా అడిగినా, అడగకున్నా, కరెక్ట్ గా టైం చెప్పేస్తుంది. ఏమది?
- కోడి పుంజు
- కుడితి త్రాగకున్నా మేత మెయ్యకున్నా కడివెడు పాలిచ్చేదేది?
- తాటిచెట్టు
- కుమ్మరి కుప్పయ్య, పత్తి పాపయ్య ,ఆముదాల అప్పయ్య అంతా ఏకమైనారు?
- ప్రమిద
- కొనుక్కుందామనుకున్నా కొనలేనిది, అప్పుగా తీసుకొందామన్నా తీసికోలేనిది?
- కాలము
- కోడిగాని కోడి! ఏమి కోడి?
- పకోడి, చెగోడి
- కోపము వచ్చినప్పుడల్లా చిందులువేస్తాను. నా ఇష్ట ప్రకారము వచ్చి, వెళతాను. నా పేరు విన్నా, నన్ను చూచినా అందరూ భయపడతారు.
- తుఫాన్
- క్రింద గట్టు, పైన గట్టు, మధ్యలో ఎర్ర బొట్టు!
- నాలుక
- కంటికి నలుపు అందం, నాలుకకి తీపి అందం?
- చెరకు
- కన్నుంది చూడలేదు, కాలుంది నడవలేదు?
- నవారు మంచం
- గండి చెరువులో గుండు తేలె!
- వెన్న
- గంప గులకరాళ్ళలో ఒక చెకుముకి రాయి ?
- చంద్రుడు
- గడంత సానికి - ముంతంత కొప్పు!
- జొన్నకంకి
- గరికపోచలపై గాడిదలు నాట్యమాడు?
- పేను
- గాలికి తిరిగే గడుసరి, ఊరికే తిరిగే సొగసరి?
- సోమరి
- గాలిలో ఎగిరే అద్దము! చేతిలో పడితే పగిలి పొతుంది.
- నీటి బుడగ
- గింజ మునుగుతుంది. కాయ తేలుతుంది.
- వేరు శనగ
- గిలి గాని గిలి! ఏమి గిలి?
- ముంగిలి, లోగిలి
- గుంటూరు గుట్ట! ఏలూరు మిట్ట! పదిమంది పట్ట! ఒకడే కట్ట!
- మాంగల్యము
- గుండు మీద గుండు ఎంతపెట్టిన నిలవదు?
- కోడిగ్రుడ్డు
- గుడి నిండా కెంపులు! గుడికి తాళము!
- దానిమ్మపండు
- గుడి బయట గడుసు, లోన మొత్తన, నీరు చిక్కన!
- తాటి ముంజ
- గుడి! గుడికి మూడు నేత్రములు! ఈ గుడిలో లింగము లేదు గానీ, గంగ ఉన్నది.
- కొబ్బరి కాయ
- గునగున నడిచేవి రెండు! గట్టెక్కి చూచేవి రెండు! ఆలంకించేవి రెండు! అర్ధము చెప్పేది ఒకటి!
- కాళ్ళు, కళ్ళు, చెవులు, నోరు
- గుప్పెడు పిట్టకు బారెడు తోక?
- కలువ పువ్వు
- గూబ - గూటిలో! తోక – చేతిలో!
- గరిటె
- గోరు వంకకు గొడుగును పట్టేదెవరు?
- ఆకాశము
- చక చక పోయేవి రెండు. గట్టెక్కి చూచేవి రెండు అంది పుచ్చుకొనేవి రెండు. ఆలకించేవి రెండు.
- కాళ్ళు, కళ్ళు, చేతులు, చెవులు.
- చక్కని పాపకు చుక్కల చీర!
- ఆకాశము
- చచ్చినోడు సంతకు పోవు!
- ఎండు చేప
- చాచుకొని, సావిట్లో పండుకొనే ముసలమ్మ! ముడుచుకొని, మూల నిలబడుతుంది.
- చాప
- చారల చారల పాము, చక్కని పాము, నూతిలోని పాము, నున్ననైన పాము!
- పొట్లకాయ
- చారల పాపడికి దూది కుచ్చు!
- ఉడుత
- చింపిరి చింపిరి గుడ్డలు! ముత్యముల వంటి బిడ్డలు!
- మొక్కజొన్న
- చీకటి ఇంటిలో జడల దెయ్యము!
- ఉట్టి
- చిక్కటి కారడవిలో చక్కని దారి!
- పాపిట
- చిటపట వానలు కురవంగా! సీతాదేవి పుట్టంగా! లంకా దీపము పెట్టంగా! రాముడు విల్లును విఱువంగా!
- అరటి పువ్వు
- చిటారు కొమ్మన మిఠాయి పొట్లము!
- తేనె తుట్టె
- చిటుకు లాడి! పటుకు లాడి! గోడ ఎక్కి, దుముకు లాడి!
- విస్తరాకు
- చిట్టి పిడతలో మూడు కూరలు!
- తాంబూలము
- చిన్న ఇంటి నిండా తెల్లటి పండ్లు!
- నోటిలోని దంతములు
- చిన్న కాయ! నీ మీదున్న కాయ!
- చెమట కాయ
- చిన్నచట్టిలో కమ్మటి కూర!
- కిళ్ళీ
- చిన్నపట్నములో చాల గదులు! గదికొక్క సిపాయి! సిపాయికొక్క తుపాకి!
- తేనె పట్టు
- చిన్నమిద్దెలో చింతపండు?
- గుబిలి
- చిన్నా, పెద్ద భేదము లేదు. “వారు వీరు” అని అసలే లేదు. ప్రతిరోజూ మూడు పూటలా సర్వ ప్రాణులకు వేసేది ఏది?
- ఆకలి
- చిలుకని గాని చిలుకను నేను! నేను వస్తున్నా, వెళుతున్నా… అదుగో చిలుక! ఇదుగో చిలుక! అంటారు. చిలక గాని చిలక నైన నేనెవరిని?
- స్త్రీ
- చూచే వారే గానీ తీసే వారు లేరు.
- ఇంద్ర ధనస్సు
- చూచేవి చెప్పలేవు, చెప్పేది చూడ లేదు.
- కండ్లు, నోరు
- చూడబోతే చిన్న ముండ! విప్పుతుంటే ఎన్ని చీరలైనా వస్తాయి.
- నీరు ఉల్లిపాయ
- చూస్తే ఒకటి, చేస్తే రెండు, తలకూ, తోకకూ, ఒకటే టోపి చెప్పండి. ఇది చెప్పండి.
- కలరు
- చెక్కని స్తంభం చేతికందదూ, చెయ్యని కుండా పొయ్యని నీళ్ళు చెయ్య సున్నం – తియ్యని బెల్లం
- కొబ్బరి
- చెట్టు కొడితే పిట్ట లేచి పోయె!
- పేడు
- చెట్టు చూడు. చెట్టందం చూడు. చిత్రమైన చిగురాకును చూడు. పూసిందంటే ఒకటే పూవు చూడు. కాసిందంటే గంపెడు కాయలు చూడు.
- ఆకాశం, చంద్రుడు, చుక్కలు, వెన్నెల
- చెయ్యని కుండ! పొయ్యని నీరు! వెయ్యని సున్నము! తియ్యగ నుండు!
- కొబ్బరికాయ
- జామ చెట్టు క్రింద జానమ్మా ఎంత గుంజినా రాదమ్మా
- నీడ
- జల్లు పడగానే, జండా లేస్తుంది.
- పుట్ట గొడుగు
- జాజికాయ కొట్లాడుతుంది ఎలక్కాయ విడిపిస్తుంది.
- తాళంచెవి
- జాబు గాని జాబు ఏమి జాబు?
- పంజాబు
- జింక ఉరకంగా పాలుకారంగా?
- విసురు రాయి
- జిత్తెడు తోకున్న జివలగిరి మేక! ఆవుల కొండెక్కి, ఆకు మేసె!
- ఎలుక
- జిలుగు జిలుగు నీటిలో జీలుగు పుట్టె! ఆకు పుట్టె! అంతరాల కొడుకు పుట్టె! కొడుకును కొట్టి, కోడలు ముండ మోసె!
- అరటి చెట్టు
- జీవం ఉంది కాని కదలలేదు
- గ్రుడ్డు
- జీవం లేని జంతువు ఆకుల్లేని అడవిలో వేటాడబోయింది?
- దువ్వెన
- జీవము లేని గరుడ పక్షి దేశ దేశములూ తిరుగుతుంది.
- విమానము
- జీవంలేని గుర్రాన్నెక్కి జిగటాకోల చేతబట్టి ఆకుల్లేని అడవిలోకి వేటాడబోయింది టక్కులాడి.
- పడవ
- జీడీ వారికి కోడలు, సిరిగల వారికి ఆడపడుచు మైనులగుల్కె వయ్యారి వైశాఖంలో వస్తుంది.
- మామిడి పండు
- జోడు గుఱ్ఱముల మీద ఒకడే రాజు!
- పావు కోళ్ళ
- టక్కు చూచుట కెంతో నిక్కు! జాఱి పడిందటే… పుటుక్కు!
- కండ్ల జోడు
- ‘టూరు’ గాని టూరు, ఏమి టూరు?
- గుంటూరు, ఇంటూరు
- ట్రిక్కులు చేసే టక్కుల మారి! చెప్పకుండా పోతాడు. గల్లంతు ఔతాడు.
- మోసగాడు
- “టిక్కు” మనగానే మాట్లాడతాను. “టక్కు” మనగానే ఆగిపోతాను.
- ఆకాశ వాణి
- టిక్కు టిక్కు బండి! టక్కులాడి బండి! సాగిపోవు బండి! హాల్ట్ లేని బండి! అదేమిటి?
- గడియారము
- టెంకాయలో వంకాయ పోతే ఎంత?
- తొమ్మిది
- డబ్బుపెట్టి కొనడం ముందరగానే ఏడ్వడం.
- ఉల్లిగడ్డ
- డబ్బులిస్తానంటేనే దరువు వేస్తాడు.
- ఒళ్ళు పట్టేవాడు
- డబ్బులిస్తే చాలు గుద్దుతాడు.
- ఒడ్రమంగలి
- డాక్టరొచ్చారు సూది వేశారు, కాసులిస్తేను పారిపోయారు.
- దోమ
- ‘డాలు’ గాని డాలు! ఏమి డాలు?
- కాగడాలు, అప్పడాలు
- డిల్లీలో పాటను లండన్ లో వినిపిస్తుంది. మాస్కో లో నాటకాన్ని న్యూయర్క్ లో చూపిస్తుంది.
- టెలివిజన్
- డొంకలో ఇంపైన మెలికల పాము.
- నాలుక
- డొంకలో మెలికల కఱ్ఱ?
- పాము
- ‘డ్రస్’ గాని డ్రస్! ఏమి డ్రస్?
- అడ్రస్
- ఢాం ఢాం పలక! ఢంకా పలకా! ఎంత కొట్టినా… పగులని పలక?
- భూమ
- తండ్రి గరగర! తల్లి పీచు పీచు! బిడ్డలు రత్నమాణిక్యములు!
- పనస పండు
- తమ్ముడు కుంటుతూ, కుంటుతూ మైలు నడిచేసరికి అన్న పరుగెత్తుకుంటూ పన్నెండు మైళ్ళు నడుస్తాడు.
- గడియారములోని ముళ్ళు
- తరచి తరచి చూసినా లోతు తెలియనిది?
- ఆడదాని మనసు
- తల కాయ వుంది. తక్కింది లేదు. ఒంటి కాలిపైన గిరగిర తిరిగే ఒయ్యారముల సింగారము!
- బొంగరము
- తల ఉన్నా కళ్ళు లేనిది?
- గుండు సూది
- తలలేని కాసురెడ్డికి వీపునే మోకాళ్ళు!
- ఇంటి కప్పు
- తల్లి కూర్చుండు! పిల్ల పారాడు!
- కడవ చెంబు
- తళుకు తళుకు నీటిలో శ్రీరాముడు పుట్టె! ఆ శ్రీరాముని కడుపులో ఒక రాముడు పుట్టె! ఆ రాముని కడుపులో వజ్రము పుట్టె!
- బియ్యపు గింజ
- తవ్వని కుంట కురవని నీరు?
- నోరు, లాలాజలం
- తాపం గాని తాపం
- ప్రతాపం
- తాళము గాని తాళము! ఏమి తాళము?
- ఆది తాళము
- తాళి గాని తాళి ఏమి తాళి?
- ఎగతాళి
- తీసుకునే వారి చెయ్యి పైన, ఇచ్చేవారి చెయ్యి క్రింద ఇలా ఎప్పుడుంటుంది?
- బొట్టు పెట్టుకునేటప్పుడు
- తీస్తే పోతుంది. తెల్లారితే వస్తుంది.
- మీసము
- తెల్లటోడు నల్లటోడిని తన్ను!
- అగ్గిపెట్టె
- తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు. చేతితో చల్లడం, నోటితో ఏరుకోవడం.
- పుస్తకం
- తేరు తిరుగుతుంటే, పూలు రాలతాయి.
- విసురు రాయి
- తొడిమ లేని పండు! ఆకు లేని పంట!
- విబూది పండు,ఉప్పు పంట
- తొడేవారే గాని, పోసేవారే లేరు.
- బావి నీరు
- తొమ్మిది రంధ్రముల బొమ్మ! ఘనమైన తోలు బొమ్మ!
- మనిషి
- దండ కాని దండ ?
- అండదండ, కైదండ
- దానము గాని దానము! ఏమి దానము?
- నిదానము, మైదానము
- దాని మొదలు చెరకు మొదలు. దాని ఆకు తామరాకు దాని పూత మేడి పూత దాని కాత గజ్జి కాత
- ఆముదపు చెట్టు
- దినమంతా నిద్రపోతుంది రాత్రంతా మేలుకుంటుంది?
- దీపం
- దుకాణములో కొంటారు. ముందర పెట్టుకొని ఏడుస్తారు.
- ఉల్లి గడ్డలు
- దోసెడు నీటిలో దొరసాని జలకాడమాడింది?
- వెన్న
- ధనము గాని ధనము ఏమి ధనము?
- ఇంధనము, బంధనము
- ధరణిలో పన్నెండు మంది భార్యలు నాకు! ఒక్కో భార్యకు నలుగురు కొడుకులు! మూడువందల అరువది ఐదుమంది మనుమలు!
- సంవత్సరము= నెలలు, వారములు, రోజులు
- నట్టింట్లో నలుగురు దొంగలు?
- చనుకట్ట
- నడిచిపోయే తెల్లరాతికి నాలుగు కాళ్ళు?
- ఆవు
- నడుము సన్నపు నాగ లింగము! పోటు, పోటుకు బొబ్బలింగము!
- కందురీగ
- నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది. దాని పీక మీదకు కత్తిని తెస్తేగానీ నడువదు. ఏమిటది?
- పెన్సిల్
- నన్ను చూస్తే నిన్ను పట్టిస్తా?
- అద్దం
- నరుడు కాని నరుడు?
- వానరుడు
- నలుగురు దొంగలపై ఒకటే రాయి
- ఉసిరికాయ
- నల్లటి నీటిలో, తెల్లనీటిని పోసి, వెండి పలుకు లేస్తే అంతా త్రాగే వారే! ఏమిటవి?
- కాఫీ, టీ
- నల్లపడవలో తెల్లటిదారి?
- పాపిడి
- నా చుట్టూ అద్దములు వుంటాయి గానీ, అద్దముల మేడను కాను. వేగముగా పరుగెడుతుంటాను గానీ, జింకను కాను. నాతో అందరికీ పని వుంటుంది గానీ, ప్రభుత్వపు కార్యాలయమును కాను.
- బస్
- నాకు మీ చేయి తగిలితే నేను ఊరుకోను. ఎలుగెత్తి అరుస్తాను, దైవమును పిలుస్తాను. నేనెవరిని?
- గుడిగంట
- నాకు (మగ వారికి) ఉండేది! నీకు (ఆడవారికి) ఉండేది! అవేమిటో చెప్పు?
- అప్పు, కొప్పు
- నాలుగు కాళ్ళున్నాయి గానీ, జంతువును కాను. నా శరీరమంతా రంధ్రములున్నాయి గానీ, వలను కాను.
- మంచము
- నాలో నదులున్నాయి గానీ, మ్యాప్‌ను కాను. గుండ్రంగా వుంటాను గానీ, బంతిని కాను. నాలోనే సర్వము ఉన్నది గానీ, దేవుడ్ని కాను.
- గ్లోబ్
- నిద్రపోయినా కళ్ళు మూయనిది?
- నాలుక
- నిన్న ఏమిటో, నేడు ఏమిటో, రేపు ఏమిటో చెప్పవే చక్కని బొమ్మ! మాసమున కొకసారి మారిపోయే బొమ్మ ఎల్లప్పుడూ గోడ నంటియుండు బొమ్మ!
- వాల్ క్యాలెండర్
- నీచేతి దెబ్బలు తిన్నాను నిలువునా ఎండిపోయాను. నిప్పుల గుండమును తొక్కాను. గుప్పెడు బూడిదనయ్యాను.
- పిడక
- నీడొక్కలో నా కాలు!
- మగ్గము
- నీటి పైన కలకలా కొమ్మమీద కిచకిచ
- కప్పలు-కోతులు
- నున్నటి బండమీద నూగులను ఎండబోస్తే, నాలుక లేని భీముడొచ్చి, నాకి పోయాడు.
- జుట్టు కత్తిరించే కత్తి
- నున్నగా చెక్కించి, నూనె మెరుగెట్టించి; ఏడాది కొకసారి గంట కొట్టి; కదిలిస్తారు కోలాహలంబుగా!
- రథము
- నేనెన్నో మంచి విషయములను నేర్పుతాను గానీ, నాకు మాటలు రావు. నేను మీకు ప్రపంచమును చూపగలను గానీ, నేను చూడలేను. మరి నేనెవరిని?
- పుస్తకము
- పచ్చని గుడిలో ఎర్రని రత్నాలు?
- దానిమ్మ పండు
- పచ్చని పందిట్లో ఎర్రని పెళ్ళికూతురు?
- మిరప పండు
- పచ్చని పందిరిలో, తెల్లని మిద్దె లోపల ఉన్నాడు నల్లని రాజు.
- సీతా ఫలపు గింజ
- పచ్చిని పెట్టెలో విచ్చుకోనుంది. తెచ్చుకోపోతేనూ గుచ్చుకుంటుంది.
- మొగిలి పువ్వు
- పడుతుందేకానీ పైకి లేవలేదు?
- వాన
- పళ్ళు ఉన్నా నోరు లేనిది?
- రంపం
- పాలుగాని పాలు ఏమిపాలు?
- శాపాలు, లోపాలు
- పిటాపురం చిన్నవాడా పిట్టల వేటగాడా బ్రతికిన పిట్టను కొట్టవద్దు. చచ్చిన పిట్టను తేనూవద్దు. కూరకు లేకుండా రావద్దు. ఏమి కూర.
- కోడి గ్రుడ్డు
- పుట్టినా కదలనిది ఏది?
- గ్రుడ్డు
- పుట్టెడు శనగలలో ఒకటే రాయి.
- చందమామ
- పుట్టేటప్పుడు కొమ్ములుంటాయి గానీ, రాక్షసుడను కాను. పెరిగే కొద్దీ గుండ్రముగా ఔతాను గానీ, గోళమును కాను. ఎప్పుడూ తిరుగుతుంటాను గానీ, గడియారమును కాను. మరి నేనెవరిని?
- చందమామ
- పుట్టేటప్పుడు లేనిది, మధ్యలో వచ్చేది, చివరిదాకా వుండేది!
- భార్య
- పెంకు మీద పక్షి పేరు చెప్పవే కమలాక్షి
- తాబేలు
- పెట్టుకుంటూనే పట్టి చూచుకోవాలి?
- కొప్పు
- పైన పటారము! లోన లొటారము!
- మేడిపండు
- పై నో పలక క్రిందో పలక పలకల మధ్య మెలికల పాము, పామును పట్టా పగ్గలం లేదు పెగ్గెలు పలికే సిగ్గొదినా
- నాలుక
- బంగారు చెంబులో, వెండి గచ్చకాయ?
- పనస తొన
- బండి ఎక్కడు, గుఱ్ఱము ఎక్కడు, నడువలేని బాలుడు, ఇంటి ముందర అటు ఇటు తిరుగుతాడు.
- రాట్నము
- బడి గాని బడి! ఏమిబడి?
- రాబడి, దిగుబడి
- బాటకు బంధం, నల్లపూసల అందం?
- చీమల బారు
- బారుగాని బారు! ఏమి బారు?
- సాంబారు
- బావిలో చింత పండు?
- గుబిలి
- బిందె మీద బిందె అల్లాడే పది పందిళ్ళు?
- అరటి గెల
- బిళ్ళ కాని బిళ్ళ, లోకం కోరే బిళ్ళ?
- రూపాయిబిళ్ళ, తపాళబిళ్ళ
- బుడగకు బుక్కెడు నెత్తురు?
- కుంకుమ
- బుడబుక్కలోడొచ్చి భూమంతా చాటించె! మధ్యాహ్నామునకేమో మాయమాయే!
- పేడ నీరు
- బొట్టు కాని బొట్టు ఏమి బొట్టు?
- తాళిబొట్టు
- భగవంతుని ప్రతిరూపమును నేను! నన్ను మంగళకరముగా భావిస్తారు. మనిషి మనిషికీ ప్రతిరోజూ ప్రతిపూటా ఉపయోగపడతాను.
- అద్దము
- భయం కాని భయం?
- అభయం
- భరణి కార్తిలో చల్లినకాయకు చిప్పెడు పంట?
- నువ్వుల పంట
- భీముడు బిగతన్నె, అర్జునుడు అగపట్టె?
- స్తంబం, దూలం
- భుజం మీద ఉంటాడు దండెం మీద వ్రేలాడతాడు?
- కండువ
- భూమి చూసి నిలుచును?
- పడవ
- భూమిలో పెరిగిన బుల్లి చెంబు?
- కందపిలక
- భోజనం సహింపలేదు, గుంజకదలాడుచున్నావెందుకు?
- కూరలేదు
- భూ మాతకు ముద్దు బిడ్డ. ఆకాశపు జున్ను గడ్డ. రాత్రి వేళ రాజరికం. పగలయితే పేదరికం.
- చంద్రుడు
- మంచము క్రింద మామా! ఊరికి పోదాము రావా?
- చెప్పులు
- మందు కాని మందు?
- కామందు
- మనతో వస్తుంది, మనకు చెప్పకుండానే వెళ్తుంది?
- నీడ
- మల్లపు గుర్రానికి ఒళ్ళంతా రంధ్రాలు?
- జల్లెడ
- మా బావ బజారుకెళ్ళి తొడిమలేని వంకాయ తెచ్చాడు?
- కోడి గ్రుడ్డు
- మాతాత ఏటి అవతలికి వెళ్ళి మూడెడ్లను తెచ్చాడు. ఒకటి కరిగేది, ఒకటి తేలేది, ఒకటి మునిగేది.
- సున్నము, ఆకు, వక్క
- మాతాత బోడి, మీతాత బోడి పెద్దప్పబోడి, శివలింగంబోడి?
- మంచం కోళ్ళు
- మానం కాని మానం?
- అవమానం, బహుమానం, కొలమానం
- మారు కథ మంకెన్న! నీకు నాకు లంకెన్న!
- గొళ్ళెము
- ముక్కు మీద కెక్కు! చెవుల పైన నక్కు! జారిపడిందంటే పుటుక్కు! ఏమిటది?
- కండ్లజోడు
- ముక్కులేని పిట్ట ముళ్ళన్నీ ఏరుకు తిన్నది.
- పొయ్యి
- ముక్కువున్నా మెడలేనిది?
- నది
- ‘మొగుడు గాని మొగుడు’ ఏ మొగుడు?
- అప్పుల మొగుడు
- మొఖం ఉన్నా మెడ లేనిది?
- నది
- యంత్రము గాని యంత్రమును నేను! నాకు అప్పుడపుడు రిపేర్లుంటాయి. ఒక్కసారి ఆగిపోయానంటే, నేను మరలా పనికి రాను. మరి నే నెవరిని?
- మనిషి
- యమునికైనా భయపడను! కొట్టినా ఏడవను! తిట్టినా బాధ పడను! మీరేమనుకున్న నేనేమనుకోను. మరి నేనెవరిని?
- బొమ్మ
- యేరు మీద మిరప చెట్టు నాకగపడుతుంది, నీకగపడదు.
- బొట్టు
- రచ్చబండ క్రింద నలుగురు దొంగలు?
- గేదెపొదుగు
- రణం కాని రణం ?
- మరణం,తోరణం,ఆభరణం
- రసం కాని రసం?
- నీరసం, సరసం, విరసం
- రాజ మందిరము చిన్నదానా! రాఘవయ్య కోడలా! చేద వెయ్యకుండా, తియ్యకుండా, దాహమునకు నీరు తేవె!
- కొబ్బరి నీరు
- రాజా వారి తోటలో రోజా పూలు! చూచే వారే గాని, కోసే వారు లేరు. ఏమిటవి?
- నక్షత్రములు
- రాయి గాని రాయి! ఏమి రాయి?
- పావురాయి
- రేయీ, పగలూ నడిచింది. చేయీ, చేయీ కదిలింది. వేళా, పాళా చెపుతుంది. వున్నచోటనే పడివుంది.
- గోడ గడియారము
- రోషమునకు మారు పేరు నేను! భీముడను మాత్రము కాను. అందుకే ఎవరికి రోషము వచ్చినా, ముందు నా మీదే చెయ్యి వేస్తారు. నే నెవరిని?
- మీసము
- లంక తగుల బెడితే, లచ్చి మొత్తుకునే!
- అన్నము ఉడుకుట
- లక్కబుడ్డి నిండా, లక్ష వరహాలు?
- పుచ్చకాయ
- లక్కపిడతలో, లక్ష వరహాలు!
- దానిమ్మపండు
- లాగి విడిస్తేనే బ్రతుకు?
- ఊపిరి
- లింగడు కన్నెమనసు, దొంగిలించిన దొంగాడు?
- మన్మధుడు
- లోకమంతా చాప వేసి, నిద్ర పోకుండా తిరుగుతూ వుంటాడు.ఎవరతను?
- సముద్రము
- లోతు బావిలో జారికి బెల్లం?
- గుబిలి
- లోన బంగారము! బయట వెండి! ఏమిటి?
- కోడి గ్రుడ్డు
- వంకర టింకర మ్రాను! కష్ట జీవుల గూడే ఈడు, జోడు! విప్పితే, ఇంకో ఇల్లుంది. ఏమిటది?
- పెండ్లి పల్లకి
- వచ్చి పోయేవి రెండు! పోతే రానివి రెండు! ఏమిటి?
- కలిమి, లేములు - మాన, ప్రాణములు
- ‘వరి’ గాని వరి! ఏమి వరి?
- జనవరి
- వళ్ళంతా ముళ్ళు. వాసన ఘుమఘుమ?
- గులాబి
- వస్తూకేక లేస్తుండు! వేస్తూ పోతుండు! ఎవరు?
- గాజులసెట్టి
- వస్తే పోనివి రెండు! పోతే రానివి రెండు! ఏమిటి?
- కీర్తి, అపకీర్తి - పరువు, ప్రతిష్ట
- వాకిట్లో కలవారి కోడలు పడింది?
- ముగ్గు
- వాయు వేగమును మించి, లోకములన్నీగాలించి, చిటెకెలోఉన్న చోటికి వచ్చు! ఏమిటది?
- మనసు
- ‘వారు’ గాని వారు! ఏమి వారు?
- నవారు, అయ్యవారు
- ‘వాలు’ గాని వాలు! ఏమి వాలు?
- ఆనవాలు, ఆవాలు
- విత్తనము లేకుండా, మొలిచేది ఏమిటి?
- గడ్డము
- విశ్వాసమునకు ప్రతినిధిని నేను! విశ్వాసహీనుని చూచి, ‘ నీకంటే అదే నయమని’ అంటారు. మరి నేనెవరిని?
- కుక్క
- వేలెడంత లోగిలిలో, ఏభైమంది నివాసము!
- అగ్గి పెట్టెలోని పుల్లలు
- వేసిన దేమిరా? వ్రేలు పెట్టి చూసిన దేమిరా?
- వేసినది చెక్కరా! వ్రేలుపెట్టి వాసన చూచినది శ్రీ గంధమురా
- వేస్తే సోకు! తీస్తే బోసి! ఏమిటి?
- కండువ
- శంఖులో పెంకు, పెంకులోతీర్థము, తీర్థములో మొగ్గ?
- టెంకాయ
- శాఖలు ఉన్నా, ఆకులు లేనిది?
- సంస్థ
- శిబి, కర్ణులార్జించిన చెలువ ఏది?
- కీర్తి
- శివరాత్రికి చంకలెత్తనీయుడు?
- చలి
- శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరగాయ?
- మామిడికాయ
- శ్రీ రాముడు కూడ పట్టి వంచలేనిది, రంగు రంగులుగా ఒకే వరుసలో వచ్చునది, ‘కుక్కకు, నక్కకు పెళ్ళి’అనే సమయములో వచ్చునది. అదేమటో విప్పగలరా?
- ఇంద్ర ధనస్సు
- శ్రీ రాముల ఇంటి వెనుక శ్రీవణము చెట్టు! కాస్తుంది, పూస్తుంది. వాసన వుండదు.
- చింతకాయ
- శ్రీ విష్ణువు మోయుచు తిరిగెడు పక్షి?
- గరుడ పక్షి
- సంతలో షావుకారు, ఊరిలో ఉద్యోగరాయుడు, గట్టుమీద గంగారాయుడు!
- త్రాసు, కలము, కొంగ
- సందకాడ లగ్గమాయె! కాని పొత్తు గర్భమాయె! కోడి కూతకు కొడుకు పుట్టె! పొద్దు పొడవ పేరు కొచ్చె!
- చల్లకుండ
- సముద్రంలో పుట్టి, సముద్రంలో పెరిగి ఊళ్ళోకొచ్చి అరిచేది?
- శంఖం
- సముద్రంలో మునుగునది కానీ, చేపకాదు ఏమిటది?
- నది
- సల సలా కాగే నీళ్ళలో సీతమ్మ స్నానమాడు.
- అరిసెలు
- సాయి గాని సాయి! ఏమి సాయి?
- కసాయి
- సార సారల చెంబు, చక్కని చెంబు ముంచితే మునగదు ముత్యాల చెంబు?
- దోసకాయ
- సావిట్లో సద్దు కర్ర ?
- కలం
- సీమంత ముండ బిడ్డ అందరికీ వడ్డించు!
- గరిటె
- సువాసన ఉన్నా, పూజకు పనికి రానిది.
- మొగలి పూవు
- సూది వెళ్ళి చుక్కలను తాకింది. ఏమిటి?
- తారాజువ్వ
- సూర్యుడు చూడని మడుగు! చాకలి తాకని గంగ!
- టెంకాయ
- హంస ముక్కుకి, ముత్యం కట్టుకొని తోకతో నీళ్ళు త్రాగుతుంది?
- ప్రమిద
- హద్దులేని పద్దు?
- అబద్దం
- హనుమంతుడు అందగాడు?
- బ్రహ్మచారి
- హనుమంతుని పెళ్ళాం గొప్పధనవంతురాలు, తట్టెడు సొమ్ములు పెట్టుకొని తలవాల్చు?
- కొర్రకంకి
- హరీ అనకుండానే చచ్చేది?
- చెట్టు
- హర్మోనియంకూ, నాకూ తేడా ఉండదు. అది శబ్దము చేస్తుంది. నేనునూ శబ్దము చేస్తాను. దాని ఫలితము అశాశ్వతము! నా ఫలితము శాశ్వతము! మరి నేనెవరిని?
- టైప్ రైటర్
- హారము గాని హారము! ఏమి హారము?
- ఆహారము
- క్ష కారము చివరి స్థానము! క కారము మొదటి స్థానము! మరి నేనెవరిని?
- కక్ష
- క్షమించుట తప్ప, నాకేమీ తెలియదు. మరి నేనెవరిని?
- జ్ఞాని
- జ్ఞాని
No comments:
Post a Comment