Wednesday, November 16, 2011

నీతి కథలు

అతి పండితుడు

వారణాసిలో బ్రహ్మదత్తుడు రాజ్యపాలన చేస్తుంటే బోధిసత్వుడు వైశ్యకులంలో పుట్టాడు. అతనికి పండితుడని పేరు పెట్టారు. అతను పెద్దవాడయ్యాక మరో వర్తకుడితో కలిసి వ్యాపారం చెయ్యసాగారు. ఆ వ్యాపారి పేరు అతిపండితుడు. వాళ్ళిద్దరూ పై వూళ్ళు వెళ్ళి వ్యాపారం చేసి లాభంతో తిరిగి వచ్చారు. లాభం పంచుకునే సమయంలో ' నాకు రెండువంతులు రావాలి ' అన్నాడు అతి పండితుడు. ' ఎందుకని?' అడిగాడు బోధిసత్వుడు (పండితుడు) ఆశ్చర్యపడుతూ. అందుకతడు ' నువ్వు పండితుడివి మాత్రమే నేను అతిపండితుడిని కదా! అందుకు ' అన్నాడు.

'సరుకులూ... ఎద్దులూ... బళ్ళూ మనవి సమాన భాగాలు కదా? నీకు రెండువంతులెందుకు రావాలి?' అడిగాడు పండితుడు. 'అతిపండితుడిని అవడంవల్ల' అన్నాడతను. వారి దెబ్బలాట ముదిరింది. అప్పుడు అతిపండితుడు దీనికొక ఉపాయముంది. నాకు రెండు భాగములు వచ్చుట న్యాయమోకాదో వృక్షదేవత చెప్పును. రేపు వృక్షదేవతనే అడుగుదాం. అది చెప్పినట్లే చేద్దాం. మనలో మనకి తగవెందుకు? అన్నాడు.

ఆ రాత్రి అతిపండితుడు తన తండ్రినొక చెట్టు తొర్రలో పెట్టి "మేము రేపు వచ్చి అడిగినప్పుడు ' అతి పండితుడు రెండు భాగములకు అర్హుడు అని చెప్పు ' అంటూ ఆదేశమిచ్చాడు. మర్నాడు అతిపండితుడు, పండితుని వృక్షము వద్దకు కొనిపోయి వృక్షదేవతా! మాతగవు తీర్చుము. అందుకు నువ్వే తగినదానవు" అన్నాడు. సంగతి చెప్పండి అన్నాడు తొర్రలో ఉన్న అతను గొంతుకను కొంత మార్చి. ఇతను పండితుడు, నేనో అతి పండితుడిని. అని మొదలుపెట్టి జరిగినదంతా వృక్షానికి విన్నవించాడు అతి పండితుడు. మా వ్యాపారంలో వచ్చిన లాభంతో ఎవరెవరికెంత రావాలో సెలవియ్యి అన్నాడు చివరగా.

పండితునకొక భాగము, అతిపండితునకు రెండు భాగములు అని వినిపించింది చెట్టులోంచి. అప్పుడు పండితునిగా ఉన్న బోధిసత్వుడు దేవతా రూపమో మరొకటో యిప్పుడు బయటపడుతుంది అంటూ ఎండుగడ్డి తెచ్చి చెట్టు తొర్రలో వేసి నిప్పంటించాడు. అగ్నిజ్వాలలు వ్యాపించే సరికి అతిపండితుని తండ్రి సగం ఒళ్ళు కాలి కుయ్యో మొర్రో మంటూ బయటకు వచ్చి పండితునిగా ఉండడమే మంచిది. అతిపండితుడవడం చాలా హానికరం. నాకొడుకు అతి పండితుడు కాబట్టి నన్ను అగ్నిపాలు చేశాడు. అని మీరిద్దరూ సమాన భాగాలు చేసుకోవడమే న్యాయం. అని చెప్పాడు. ఇద్దరూ వ్యాపారంలో లాభాలను సమంగా పంచుకున్నారు.

నీతి: కుటిలత్వానికి తానేకాక తనవారు కూడా బలవుతారు.
________________________________________________________________

అనుభవించని ఐశ్వర్యం

కనకయ్య వొట్టి లోభి, ఎంతో ఐశ్వర్యం వుంది. అయినా తను తినేవాడు గాదు, ఒకరికి పెట్టేవాడు కాదు. కనకయ్య పీనాసి అని అందరికీ తెలుసు. అయినా ఊరిలోని వారు - ఏ కొంచెమైనా సహాయం చేయక పోతాడా? అని తరచుగా అతని వద్దకు వచ్చేవారు. సహాయం చేయమని కోరేవారు. కాని కనకయ్య వాళ్ళకు, ఏవేవో సాకులు చెప్పి పంపించేసే వాడు. గడ్డి పరక అంత సాయం కూడా చేసేవాడు గాదు.

"సహాయం చెయ్యి" అంటూ ఊరిలో వాళ్ళ పోరు, రోజురోజుకూ అధికం కావడం వల్ల - కనకయ్యకు చికాకు ఎక్కువైపోయింది. వాళ్ళ పోరు వదల్చు కోవాలని అనుకొన్నాడు. పొలాలు, నగలు మొదలైనవన్నీ అమ్మేసి, బంగారం కొన్నాడు. ఊరికి దగ్గరలో వున్న ఓ చిట్టడవిలో - ఎవరికీ కనపడని చోట - ఆ బంగారాన్ని భద్రంగా దాచి పెట్టాడు! రోజూ ఉదయమే లేచి తన బంగారం పాత్రను చూసుకోవడం కోసం అడవికి వెళ్ళి వస్తూండేవాడు - ఇలాగ కొన్నాళ్ళు దొర్లి పోయాయి.

కనకయ్య రోజూ అడవికి వెళ్ళి వస్తూ ఉండటం ఓ దొంగ కనిపెట్టాడు. రహస్యంగా ఆను పానులన్నీ గమనించాడు. ఓ నాడు సాయంత్రం అడవికి వచ్చి, పాత్రలోని బంగారాన్ని తవ్వుకొని పట్టుకొని పోయాడు. మరునాడు, ఉదయం, మాములుగా కనకయ్య అడవికి వచ్చి చూసుకొంటే - తాను పాతి పెట్టిన చోట బంగారం లేదు. కాళీ గొయ్యి కనపడింది. కనకయ్య గుండె బద్దలయినంత పని అయింది. బంగారాన్నంతా ఎవరో ఎత్తుకు పోయారని దుఃఖం పొంగి పొరలింది. లబలబా నెత్తీ నోరూ బాదుకొంటూ ఊరి బైటకు వచ్చి ఓ చెట్టు మొదట్లో కూర్చన్నాడు ఏడుస్తూ..

ఆ దారినే వెళుతున్న ఆ ఊరి ఆసామి ఒకడు - కనకయ్యను చాశాడు. "ఎందుకు ఏడుస్తున్నావు" అని అడిగి కారణం తెలిసికొని, అన్నాడు.

"ఎందుకు ఏడుస్తున్నావు? ఆ బంగారం నీదగ్గర ఉన్నప్పుడు నువ్వు ఏమైనా అనుభవించావా? నువ్వు ఏనాడూ అనుభవించి ఎరుగని ఆ ఐశ్వర్యం పోయిందని ఇప్పుడు ఏడవడం ఎందుకు! ఆ బంగారం నీ దగ్గరవున్నా, లేకపోయినా ఒకటే! అనుభవించలేని ఐశ్వర్యం ఎందుకు? పైగా ఆ ఐశ్వర్యాన్ని కాపాడు కొనడానికి అనేక అవస్ధలు పడ్డావు - ఇప్పుడు అది పోయింది కనుక నీ బాధ విరుగుడయింది. ఇక హాయిగా నిద్రపో..."

కనకయ్య ఏడుపు మాని 'నిజమే సుమీ' అనుకొంటూ ఇంటికి పోయాడు - కళ్ళు తుడుచుకొంటూ...

మూలం : చిన్నారి పాపలకు చిట్టిపొట్టి కధలు, ఏడిద కామేశ్వరరావు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
_______________________________

అపాయానికి ఉపాయము

అపాయానికి ఉపాయము ఎంత ముఖ్యమో, ఉపాయానికి అపాయము లేకుండా జాగ్రత్త పడటం అంతే ముఖ్యము.

ఉపాయములో ఎలాంటి అపాయమున్నా తప్పించుకోవచ్చు. తెలివి, ఆలోచన సమయస్ఫూర్తి ఉంటే శత్రువును ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు నీరు త్రాగించవచ్చు. అలా సింహాన్ని చంపిన చిన్న కుందేలు కథ.

అరణ్యంలో ఎన్నో రకాల జంతువులు నివసిస్తున్నాయి. అన్నింటికి రాజు సింహం. అది చాల పౌరుషము కలది. తన పంతం చెల్లాలనే పట్టుదల కలది. పై పెచ్చు క్రూర స్వభావమున్నది. అందుచేత అది ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగుతోంది. అది ఇష్టము వచ్చినట్లు వేటాడి జంతువుల్ని చంపి తినేది. జంతువుల శవాల్ని పోగులు పెట్టేది. ఆ సింహం వేటకు బయలుదేరితే జంతువులన్నీ ప్రాణరక్షణ కోసం పరుగు తీసేవి. సింహం ఇష్టం వచ్చినట్లు చంపటం వల్ల అన్నీ కలిసి ఆలోచించి రోజుకు ఒకరు చొప్పున ఆహారంగా వెళ్ళాలని తీర్మానించుకుని, సింహానికి తెలియజేయగా సింహం అంగీకరించింది.

కష్టపడకుండా నోటి దగ్గరికి ఆహారము రావటంవలన దానికి బాగానే ఉంది. జంతువులు తమ వంతు ప్రకారము ఆహారముగా వెళుతున్నాయి. చిన్న కుందేలు వంతు వచ్చింది. మూడు సంవత్సరాలు నిండిన తనకి అప్పుడే ఆయుర్దాయము చెల్లిపోయిందని బాధపడింది. అయితే కుందేలు మిగతా జంతువుల వలె గాక తెలివిగలది, ఆలోచించగలిగింది. ఉపాయముతో అపాయము తప్పించుకోవాలని ఆలోచించసాగింది. దానికి ఉపాయము తోచింది. వెంటనే ఆచరణలో పెట్టింది. సింహం దగ్గరకు ఆలస్యంగా వెళ్ళింది. సింహం వేళ దాటి పోతున్నందున కుందేలు పై మండిపడి 'ఇంత ఆలస్యము ఎందుకు జరిగింది?' అని భయంకరంగా గర్జించింది. అప్పుడు కుందేలు వినయం, భయం, భక్తితో నమస్కరించి ఇలా అంది.

"మహారాజా! నేను మామూలు వేళకు బయలు దేరాను దారిలో మరో సింహం కనిపించి నన్ను నిలదీసి గర్జించింది. తానే ఈ అడవికి మహారాజు, మరొకడు రాజు కాడు అని నన్ను తనకు ఆహారము కమ్మన్నది. నేను అతి కష్టము మీద ఒప్పించి మీ దర్శనము చేసుకుని తిరిగి వస్తానని చెప్పి వచ్చాను.

"ప్రభూ! ఆ సింహం మిమ్మల్ని ఎంతగానో దూషించింది. మీకు పౌరుషం లేదన్నది గాజులు వేసుకోమని" చెప్పింది. మిమ్మల్ని వెక్కిరించింది. ఈ మాటలు చెప్పి కుందేలు సింహం వైపు చూసింది అప్పటికే సింహానికి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే కోపంగా "నేనే ఈ అడవికి రాజుని" ఎక్కడో చూపించు దానిని నా పంజాతో కొట్టి చంపేస్తా" నంటూ ఆవేశముగా కుందేలు వెంట నడిచింది. కుందేలుని తొందర చేసి బయలుదేరిన వారిరువురు పాడు బడిన బావి దగ్గరకు వచ్చారు. శత్రుసింహానికై వెదక సాగింది. ఇక ఆలస్యం చేయక కుందేలు ఇలా చెప్పింది. "మహారాజా! మిమ్మల్ని వెక్కిరించి, దూషించిన సింహం ఆనూతిలో ఉంది. వెళ్ళి చంపండి". అంది.

కుందేలు మాటలకి సింహం గర్జించి నూతి గట్టుపైకి దూకి లోపలి చూసింది ఈ సింహం గర్జించగానే ఆ సింహం గర్జించింది. ఈ సింహం పంజా పై కెత్తగానే ఆ సింహం పంజా పైకెత్తింది ఈ సింహం ఏంచేస్తే అది అలా చేయసాగింది. సింహానికి కోపం ఎక్కువై నూతి గట్టు మీద నుండి నూతిలోకి దూకింది అంతే నీటిలో మునిగి చచ్చిపోయింది. ఆ నూతి నీటిలో తన నీడ పడి మరో సింహంలా కనిపించిందని కోపముతో ఉన్న అడవి రాజు పసికట్ట లేక పోయింది. కుందేలు పన్నిన ఉపాయం వలలో చిక్కుకుని సింహం చచ్చిపోయింది. అపాయానికి ఉపాయము ఉపయోగించి ప్రాణాలు కాపాడుకుంది చిన్న కుందేలు.

మూలం: అక్షరజ్యోతి.


No comments: