* అక్కఱకురాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁ దా
నెక్కినఁ బాఱని గుఱ్ఱము
గ్రక్కున విడువంగవలయుఁ గదరా సుమతీ!
* అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దులఁ గట్టుక
మడి దున్నుక బ్రతక వచ్చు మహిలో సుమతీ!
* అడియాస కొలువుఁ గొలవకు
గుడిమణియము సేయఁబోకు , కుజనులతోడన్
విడువక కూరిమి సేయకు
మడవినిఁ దోడరయ కొంటి నరుగకు సుమతీ !
* అధరము గదలియుఁ గదలక
మధురములగు భాషలుడిగి మౌనవ్రతుఁడౌ
నధికార రోగపూరిత
బధిరాంధక శవముఁ జూడఁ బాపము సుమతీ !
* అప్పిచ్చువాఁడు, వైద్యుఁడు
నెప్పుడు నెడతెగక పాఱె డేఱును ద్విజుఁడున్
జొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూరుఁ జొరకుము సుమతీ!
* అప్పుగొని చేయు విభవము
ముప్పునఁ బ్రాయంపుటాలు మూర్ఖుని తపమున్
దప్పరయని నృపరాజ్యము
దెప్పరమై మీఁదఁ గీడు దెచ్చుర సుమతీ !
* అల్లుని మంచితనంబును
గొల్లని సాహిత్యవిద్య కోమలి నిజమున్
బొల్లున దంచిన బియ్యము
దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ!
* ఆఁకలి యడుగని కడుపును
వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్
బ్రాఁకొన్న నూతి యుదకము
మేఁకల పాఁడియును రోఁత మేదిని సుమతీ!
* ఆఁకొన్న కూడె యమృతము
తాఁకొండక నిచ్చువాఁడె దాత ధరిత్రిన్
సోఁకోర్చువాడె మనుజుఁడు
తేఁకువగలవాఁడె వంశ తిలకుఁడు సుమతీ!
* ఇచ్చునదె విద్య, రణమునఁ
జొచ్చినదే మగతనంబు , సుకవీశ్వరులున్
మెచ్చునదె నేర్పు , వాదుకు
వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతీ!
* ఇమ్ముగఁ జదువని నోరును
"నమ్మా"యని పిలిచి యన్న మడుగని నోరున్
దమ్ములఁ బిలువని నోరును
గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ !
* ఉడుముండదె నూఱేండ్లును
బడియుండదె పేర్మిఁ బాము పదినూఱేండ్లున్
మడువునఁ గొక్కెర యుండదె
కడు నిలఁబురుషార్ధపరుఁడు గావలె సుమతీ !
* ఉత్తమ గుణములు నీచున
కెత్తెఱఁగున గలుగనేర్చు నెయ్యెడలం దా
నెత్తిచ్చి కఱగిపోసిన
నిత్తడి బంగార మగునె యిలలో సుమతీ !
* ఉదకము ద్రావెడు హయమును
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్
మొదవు కడనున్న వృషభముఁ
జదువని యా నీచుఁ జేరఁ జనకుర సుమతీ !
* ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!
* ఉపమింప మొదలు తియ్యన
కపటం బెడనెడను జెఱుకు కైవడినే పో
నెపములు వెదకును గడపటఁ
గపటపు దుర్జాతిపొందు గదరా సుమతీ !
* ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతీ !
* ఎప్పుడు దప్పులు వెదికెడు
నప్పురుషుని కొల్వగూడ దదియెట్లన్నన్
సప్పంబు పడగ నీడను
గప్పవసించిన విధంబు గదరా సుమతీ !
* ఎప్పుడు సంపదకల్గిన
నప్పుడె బంధువులువత్తురది యెట్లన్నన్
దెప్పలుగఁ జెరువు నిండినఁ
గప్పలు పదివేలుచేరుఁ గదరా సుమతీ!
* ఏఱకుమీ కసుగాయలు
దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ
పాఱకుమీ రణమందున
మీఱకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ !
* ఒకయూరికి నొక కరణము
నొక తీర్పరియైనఁ గాక నొగిఁ దఱచైనన్
గకవికలు గాక యుండునె
సకలంబును గొట్టువడక సహజము సుమతీ !
* ఒల్లని సతి నొల్లని పతి
నొల్లని చెలికాని విడువ నొల్లనివాఁడే
గొల్లండు గాక ధరలో
గొల్లండును గొల్లఁడౌనె గుణమున సుమతీ !
* ఓడల బండ్లును వచ్చును
ఓడలు నా బండ్లమీఁద నొప్పుగ వచ్చున్
ఓడలు బండ్లును వలెనే
వాడంబడుఁగలిమిలేమి వసుధను సుమతీ !
* కడు బలవంతుండైనను
బుడమినిఁ బ్రాయంపుటాలిఁ బుట్టినయింటిన్
దడ వుండనిచ్చె నేనియుఁ
బడుపుగ నంగడికిఁ దానె పంపుట సుమతీ !
* కనకపు సింహాసమున
శునకముఁ గూర్చుండఁ బెట్టి శుభలగ్నమునం
దొనరఁగఁ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ!
* కప్పకు నొరగాలైనను
సప్పమునకు రోగమైన సతి తులువైనన్
ముప్పున దరిద్రుఁడైనను
దప్పదు మఱి దుఃఖమగుట తథ్యము సుమతీ!
* కమలములు నీటబాసిన
కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్
తమతమ నెలవులు తప్పిన
తమ మిత్రులె శత్రులగుట తధ్యము సుమతీ!
* కరణము సాధై యున్నను
గరి మదముడిఁగినను బాము గఱవకయున్నన్
ధరఁ దేలు మీటకున్నను
గర మరుదుగ లెక్కఁగొనరు గదరా సుమతీ!
* కరణముఁ గరణము నమ్మిన
మరణాంతకమౌను గాని మనలేఁడు సుమీ
కరణము దన సరి కరణము
మఱి నమ్మక మర్మమీక మనవలె సుమతీ!
* కరణముల ననుసరింపక
విరసంబునఁ దిన్నతిండి వికటించుఁ జుమీ
యిరుసునఁ గందెనఁ బెట్టక
పరమేశ్వరు బండియైనఁ బాఱదు సుమతీ!
* కవిగాని వాని వ్రాఁతయు
నవరస భావములు లేని నాతుల వలపున్
దవిలి చను పంది నేయని
వివిధాయుధ కౌశలంబు వృథరా సుమతీ !
* కసుగాయఁ గఱచి చూచిన
మసలక దనయొగరు గాక మధురంబగునా?
పసగలుగు యువతు లుండగఁ
బసిబాలలఁ బొందువాఁడు పసరము సుమతీ!
* కాదన్నవాడె కరణము
వాదడచినవాడె పేడి వసుధేశుకడన్
లేదన్నవాడె చనవరి
గాథలు పెక్కాడువాడె కావ్యుడు సుమతీ!
* కాదుసుమీ దుస్సంగతి
పోదుసుమీ కీర్తికాంత పొందిన పిదపన్
వాదుసుమీ యప్పిచ్చుట
లేదుసుమీ సతులవలపు లేశము సుమతీ !
* కాముకుఁడు దనిసి విడిచిన
కోమలిఁ బరవిటుఁడు గవయ గూడుటయెల్లన్
బ్రేమమునఁ జెఱకుపిప్పికి
జీమలు వెస మూఁగినట్లు సిద్ధము సుమతీ!
* కారణములేని నగవును
బేరణమును లేని లేమ పృథివీస్థలిలోఁ
బూరణములేని బూరెయు
వీరణమునులేని పెండ్లి వృథరా సుమతీ !
* కులకాంత తోడనెప్పుడు
గలహింపకు వట్టి తప్పు ఘటియింపకుమీ
కలకంఠి కంట కన్నీ
రొలికిన సిరి యింటినుండ నొల్లదు సుమతీ !
* కూరిమిగల దినములలో
నేరములెన్నడును గలుగ నేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ !
* కొంచెపు నరు సంగతిచే
నంచితముగఁ గీడు వచ్చు నది యెట్లన్నన్
గించిత్తు నల్లి కుట్టిన
మంచమునకుఁ జేటువచ్చు మహిలో సుమతీ!
* కొక్కోకమెల్లఁ జదివినఁ
జక్కనివాఁడైన రాజు చంద్రుండైనన్
మిక్కిలి రొక్కంబీయక
చిక్కదురా వారకాంత సిద్ధము సుమతీ!
* కొఱగాని కొడుకు పుట్టినఁ
గొఱగామియెకాదు తండ్రి గుణములఁ జెరచున్
జెఱకు తుద వెన్ను పుట్టిన
జెఱకునఁ దీపెల్లఁ జెఱచు సిద్ధము సుమతీ!
* కోమలి విశ్వాసంబును
బాములతోఁ జెలిమి యన్య భామలవలపున్
వేముల తియ్యఁదనంబును
భూమీశుల నమ్మికలును బొంకుర సుమతీ !
* గడనగల మగనిఁ జూచిన
నడుగడుగున మడుఁగులిడుదు రతివలు తమలో
గడ నుడుగు మగనిఁ జూచిన
నడపీనుఁగ వచ్చెననుచు నగుదురు సుమతీ !
* చింతింపకు గడచినపని
కింతులు వలతురని నమ్మకెంతయు మదిలో
నంతఃపుర కాంతలతో
మంతనములు మాను మిదియె మతముర సుమతీ !
* చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైన యట్లు పామరుడు దగన్
హేమంబు కూడబెట్టిన
భూమీశుల పాలజేరు భువిలో సుమతీ!
* చుట్టములు గాని వారలు
చుట్టములము నీకటంచు సొంపుదలిర్పన్
నెట్టుకొని యాశ్రయింతురు
గట్టిగఁద్రవ్యంబు గలుగఁగదరా సుమతీ !
* చేతులకుఁదొడవు దానము
భూతలనాథులకుఁదొడవు బొంకమి ధరలో
నీతియ తొడ వెవ్వారికి
నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ !
* తడ వోర్వక యొడలోర్వక
కడువేగం బడచిపడినఁగార్యం బగునే?
తడవోర్చిన నొడలోర్చినఁ
జెడిపోయిన కార్యమెల్ల జేకుఱు సుమతీ !
* తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌఁ
దన సంతోషమె స్వర్గము
తన దఃఖమె నరకమండ్రు, తథ్యము సుమతీ!
* తనకలిమి యింద్రభోగము
తనలేమియె సర్వలోక దారిద్ర్యంబున్
తనచావు జగత్ ప్రళయము
తను వలచినదియె రంభ తథ్యము సుమతీ !
* తనయూరి తపసితనమును
దన పుత్రుని విద్య పెంపుఁ దన సతి రూపున్
దన పెరటిచెట్టు ముందును
మనసున వర్ణింప రెట్టి మనుజులు సుమతీ !
* తనవారు లేని చోటను
జనమించుక లేనిచోట జగడము చోటన్
అనుమానమైన చోటను
మనుజునకును నిలువఁదగదు మహిలో సుమతీ !
* తములము వేయని నోరును
విమతులతో జెలిమి సేసి వెతఁబడు తెలివిన్
గమలములు లేని కొలఁకును
హిమధాముఁడు లేని రాత్రి హీనము సుమతీ !
* తలనుండు విషము ఫణికిని
వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్
తలతోఁక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము కదరా సుమతీ!
* తలపొడుగు ధనముఁబోసిన
వెలయాలికి నిజములేదు వివరింపంగాఁ
దల దడివి బాసఁ జేసిన
వెలయాలిని నమ్మరాదు వినరా సుమతీ !
* తలమాసిన నొలుమాసిన
వలువలు మాసినను బ్రాణవల్లభునైనన్
గులకాంతలైన రోఁతురు
తిలకింపఁగ భూమిలోనఁ దిరముగ సుమతీ!
* తాననుభవింప నర్థము
మానవపతిఁ జేరుఁ గొంత మఱి భూగతమౌఁ
గానల నీఁగలు గూర్చిన
తేనియ యొరుఁజేరినట్లు తిరముగ సుమతీ!
* దగ్గర కొండెము చెప్పెడు
ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుఁడై మఱి తా
నెగ్గుఁ బ్రజ కాచరించుట
బొగ్గులకై కల్పతరువుఁ బొడుచుట సుమతీ!
* ధనపతి సఖుడై యుండియు
నెనయంగా శివుడు భిక్షమెత్తగ వలసెన్
దనవారి కెంత కలగిన
దన భాగ్యమె తనకుగాక తథ్యము సుమతీ !
* ధీరులకుఁ జేయు మేలది
సారంబగు నారికేళ సలిలము భంగిన్
గౌరవమును మఱి మీఁదట
భూరి సుఖావహము నగును భువిలో సుమతీ!
* నడువకుమీ తెరువొక్కట
కుడువకుమీ శత్రునింట కూరిమితోడన్
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ!
* నమ్మకు సుంకరిఁ జూదరిఁ
నమ్మకు మగసాలివాని నటు వెలయాలిన్
నమ్మకు మంగడివానిని
నమ్మకుమీ వాహహస్తు నవనిని సుమతీ!
* నయమునఁ బాలుం ద్రావరు
భయమ్మున విషమ్మునైన భక్షింతురుగా
నయమెంత దోసకారియొ
భయమే చూపంగ వలయు బాగుగ సుమతీ!
* నరపతులు మేరఁ దప్పినఁ
దిర మొప్పగ విధవ యింటఁ దీర్పరియైనన్
గరణము వైదికుఁడయినను
మరణాంతకమౌను గాని మానదు సుమతీ!
* నవరస భావాలంకృత
కవితా గోష్ఠియును మధుర గానంబును దా
నవివేకి కెంతఁ జెప్పినఁ
జెవిటికి సంకూదినట్లు సిద్ధము సుమతీ!
* నవ్వకుమీ సభ లోపల
నవ్వకుమీ తల్లిదండ్రి నాథుల తోడన్
నవ్వకుమీ పరసతితో
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!
* నీరే ప్రాణాధారము
నోరే రసభరితమైన నుడువులకెల్లన్
నారియె నరులకు రత్నము
చీరయె శృంగారమండ్రు సిద్ధము సుమతీ!
* పగ వలదెవ్వరి తోడను
వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్
దెగనాడవలదు సభలను
మగువకు మనసీయవలదు మహిలో సుమతీ!
* పతి కడకుఁ దన్ను గూర్చిన
సతికడకును , వేల్పుకడకు , సద్గురు కడకున్
సుతు కడకు రిత్తచేతుల
మతిమంతులు చనరు , నీతి మార్గము సుమతీ !
* పనిచేయు నెడల దాసియు
ననుభవమున రంభ మంత్రి యాలోచనలన్
దన భుక్తియెడలఁ దల్లియు
ననఁ దన కులకాంత యుండ నగురా సుమతీ!
* పరనారీ సోదరుడై
పరధనముల కాసపడక పరులకు హితుడై
పరులు దను బొగడ నెగడియు
పరులలిగిన నలుగ నతడు పరముడు సుమతీ !
* పరసతి కూటమిఁగోరకు ,
పరధనముల కాసపడకు పరునెంచకుమీ ,
సరిగాని గోష్ఠి సేయకు,
సరి చెడిఁ జుట్టుంబుకడకుఁ జేరకు సుమతీ !
* పరసతుల గోష్ఠినుండిన
పురుషుఁడు గాంగేయుడైన భువి నిందబడున్
బరసతి సుశీలయైనను
బరుసంగతి నున్న నింద పాలగు సుమతీ !
* పరు నాత్మఁ దలఁచు సతిఁ విడు
మఱుమాటలు పలుకు సుతుల మన్నింపకుమీ
వెఱపెఱుఁగని భటు నేలకు
తఱచుగ సతిఁ గవయఁబోకు తగదుర సుమతీ!
* పరుల కనిష్టము సెప్పకు
పొరుగిండ్లకుఁ బనులు లేక పోవకు మెప్పుడున్
బరుఁ గలిసిన సతి గవయకు
యెఱిఁగియు బిరుసైన హయము నెక్కకు సుమతీ !
* పర్వముల సతులఁ గవయకు
ముర్వీశ్వరుకరుణ నమ్మి యుబ్బకు మదిలో ,
గర్వింప నాలిఁ బెంచకు,
నిర్వహణము లేనిచోట నిలవకు , సుమతీ !
* పలుదోమి సేయు విడియము
తలగడిగిన నాఁటి నిద్ర , తరుణులయెడలన్
పొలయలుక నాఁటి కూటమి,
వెల యింతని చెప్పరాదు వినురా సుమతీ !
* పాటెఱుగని పతి కొలువును ,
గూటంబున కెఱుకపడని కోమలి రతియున్,
బేఁటెత్తజేయు చెలిమియు
నేటికి నెదురీఁదినట్లు లెన్నగ సుమతీ !
* పాలను గలసిన జలమును
బాల విధంబుననె యుండుఁ బరికింపంగాఁ
బాల చవిఁ జెఱచుఁ గావున
బాలసుఁడగువాని పొందు వలదుర సుమతీ!
* పాలసునకైన యాపద
జాలింబడి తీర్పఁదగదు సర్వజ్ఞునకున్
దేలగ్నిఁ బడఁగఁ బట్టిన
మేలెఱుఁగునె మీటుఁగాక మేదిని సుమతీ!
* పిలువని పనులకుఁ బోవుట
కలయని సతిరతియుఁరాజు , గానని కొలువుం
బిలువని పేరంటంబును
వలవని చెలిమియును జేయవలదుర సుమతీ!
* పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా
పుత్రుని గనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ !
* పురికిని బ్రాణము కోమటి
వరికిని బ్రాణంబు నీరు వసుమతిలోనం
గరికిని బ్రాణము తొండము
సిరికిని బ్రాణమ్ము మగువ సిద్ధము సుమతీ !
* పులిపాలు తెచ్చి యిచ్చిన
నలవడఁగా గుండెగోసి యఱచే నిడినన్
దల పొడుగు ధనముఁ బోసిన
వెలయాలికిఁ గూర్మి లేదు వినురా సుమతీ!
* పెట్టిన దినములలోపల
నట్టడవులకైన వచ్చు నానార్థములున్
బెట్టని దినములఁ గనకపు
గట్టెక్కిన నేమి లేదు గదరా సుమతీ!
* పొరుగునఁ బగవాఁడుండిన
నిరవొందఁగ వ్రాఁతగాఁడె యేలికయైనన్
ధరఁ గాఁపు కొండెమాడినఁ
గరణాలకు బ్రతుకులేదు గదరా సుమతీ!
* బంగారుఁ గుదువఁ బెట్టకు
సంగరమునఁ బాఱిపోకు సరసుఁడవైనన్
నంగడి వెచ్చము లాడకు
వెంగలితోఁ జెలిమి వలదు వినురా సుమతీ!
* బలవంతుడ నాకేమని
బలువురతో నిగ్రహించి పలుకుట మేలా?
బలవంతమైన సర్పము
చలిచీమల చేతజిక్కి చావదె సుమతీ!
* మండలపతి సముఖంబున
మెండైన ప్రధానిలేక మెలఁగుట యెల్లన్
గొండంత మదపుటేనుఁగు
తొండము లేకుండినట్లు దోఁచుర సుమతీ!
* మంత్రిగలవాని రాజ్యము
తంత్రము చెడకుండ నిలచుఁ దఱచుగ ధరలో
మంత్రివిహీనుని రాజ్యము
జంత్రపుఁ గీలూడినట్లు జరుగదు సుమతీ!
* మది నొకనిఁ వలచి యుండఁగ
మదిజెడి యొక క్రూరవిటుడు మానక తిరుగున్
అది చిలుకఁ బిల్లి పట్టినఁ
జదువునె యా పంజరమున జగతిని సుమతీ!
* మాటకుఁ బ్రాణము సత్యము
కోటకుఁ బ్రాణంబు సుభటకోటి ధరిత్రిన్
బోటికిఁ బ్రాణము మానము
చీటికిఁ బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ!
* మానఘనుఁ డాత్మధృతిఁ జెడి
హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్
మానెఁడు జలములలోపల
నేనుఁగు మెయి దాఁచినట్లు యెఱుగుము సుమతీ!
* మేలెంచని మాలిన్యుని
మాలను నగసాలివాని మంగలి హితుగా
నేలిన నరపతి రాజ్యము
నేలఁ గలసిపోవుఁ గాని నెగడదు సుమతీ!
* రాపొమ్మని పిలువని యా
భూపాలునిఁ గొల్వ భుక్తి ముక్తులు గలవే?
దీపంబు లేని యింటను
జేపుణికిళ్ళాడినట్లు సిద్ధము సుమతీ!
* రూపించి పలికి బొంకకు
ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలోఁ
గోపించు రాజుఁ గొల్వకు
పాపపు దేశంబు సొరకు పదిలము సుమతీ!
* లావు గలవాని కంటెను
భావింపఁగ నీతిపరుఁడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాఁడెక్కినట్లు మహిలో సుమతీ!
* వరి పంట లేని యూరును
దొరయుండని యూరును తోడు దొరని తెరువున్
ధరను బతిలేని గృహమును
నరయంగా రుద్రభూమి యనఁదగు సుమతీ !
* వఱదైన చేను దున్నకు
కఱవైనను బంధుజనుల కడ కేఁగకుమీ
పరులకు మర్మము సెప్పకు
పిఱికికి దళవాయితనముఁ బెట్టకు సుమతీ!
* వలపింత సతికిఁ బుట్టక
బలిమినిఁ దమకించి విటుడు పైకొనుటెల్లన్
మలయజము సాన మీదను
జలముంచక తీసినట్టి చందము సుమతీ!
* వినఁదగు నెవ్వరు సెప్పిన
వినినంతనె వేగపడక వివరింపఁదగున్
గని కల్ల నిజముఁ దెలిసిన
మనుజుఁడెపో నీతిపరుఁడు మహిలో సుమతీ!
* వీడెము వేయని నోరును
జేడెల యధరామృతంబుఁ జెందని నోరున్
బాడంగరాని నోరును
బూడిద కిరవైన పాడు బొందర సుమతీ!
* వెలయాలి వలనఁ గూరిమి
గలుగదు మఱిఁ గలిగెనేని కడతేరదుగా
పలువురు నడిచెడు తెరువునఁ
బులు మొలవదు మొలిచెనేని బొదలదు సుమతీ!
* వెలయాలు సేయు బాసలు
వెలయఁగ నగసాలిపొందు వెలమల చెలిమిన్
గలలోనఁ గన్న కలిమియు
విలసితముగ నమ్మరాదు వినురా సుమతీ!
* వేసరఁపు జాతిగానీ
వీసముఁ దాఁ జేయనట్టి వెంగలి గానీ
దాసికొడుకైనఁ గానీ
కాసులు గలవాడె రాజు గదరా సుమతీ!
* శుభముల నొందని చదువును
నభినయమును రాగరసము నందని పాటల్
అభిలాష లేని కూటమి
సభమెచ్చని మాటలెల్లఁ జప్పన సుమతీ!
* శ్రీరాముని దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరా యనగా
ధారాళమైన నీతులు
నోరూరగ జవులుపుట్ట నుడివెద సుమతీ!
* సరసము విరసము కొఱకే
పరిపూర్ణ సుఖంబు లధిక బాధల కొఱకే
పెరుగుట విరుగుట కొఱకే
ధర తగ్గుట హెచ్చు కొఱకె తథ్యము సుమతీ!
* సిరి తాఁ వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరి తాఁ బోయిన బోవును
కరిమ్రింగిన వెలగపండు కరణిని సుమతీ!
* స్త్రీలయెడ వాదులాడకు
బాలురతోఁ జెలిమి సేసి భాషింపకుమీ
మేలైన గుణము విడువకు
యేలినపతి నిందసేయ కెన్నడు సుమతీ!
No comments:
Post a Comment