Thursday, February 24, 2011

నీతి కధలు 11

సింహం - తోడేలు - నక్క

అనగా అనగా ఒక పెద్ద అడవి వుంది. అందులో ఎన్నో జంతువులు జీవిస్తున్నాయి. ఆ అడవిలోనే ఒక తోడేలు దాని భార్యా పిల్లలతో కలిసి వుంది. ఈ తోడేలు దాని కాపురం ఒక గుహలో పెట్టింది. అవి పగలంతా అడవిలో తిరిగి ఆహారము తినేవి. రాత్రి వేళలో గుహను చేరి విశ్రాంతి తీసుకునేవి. అలా రోజులు గడుస్తున్నాయి. వానాకాలం మొదలయింది. ఆ సంవత్సరం వానలు విపరీతంగా కురిశాయి. ఆ వానల వలన వాగులు పొంగి వరదలు వచ్చాయి. ఆ అడవి సగం నీటితో నిండిపోయింది. అందులో తోడేలు గుహ కూడా వుంది. దాని కుటుంబానికి ఆహారం దొరకటం కూడా కష్టమయింది. వాటికి ఏమి చేయటానికీ పాలుపోలేదు. అచటి నుండి అవి బయలుదేరి మంచి గుహ కోసం వెతకటం మొదలు పెట్టినాయి. తోడేలు తన భార్యతో "మనకు చాలా చెడు రోజులు వచ్చినాయి. ఆహారము లేదు సరికదా! మన పిల్లలు వానకు తడిసి పోతున్నారు. ఇపుడేమి చేద్దాం?" అని అంది. ఆడ తోడేలు చాలా తెలివిగలది. అది బాగా ఆలోచించింది. అచటకు దగ్గరలో ఒక గుహ వుంది. దానిలో ఒక సింహం వుంది. అది విశాలమైన గుహ. బాగా ఆలోచించగా ఈ విషయం ఆడ తోడేలుకు గుర్తుకు వచ్చింది. దానిలో ఎంత కాలమైనా హాయిగా వుండవచ్చు అనుకుంది. ఈ ఆలోచన మగనికి చెప్పింది. అది విని తోడేలు మండిపడింది. "వుండీ వుండీ మనమంతా సింహానికి ఆహారమవుదామా?" అంది. ఆడ తోడేలు ఒక మంచి పథకము ఆలోచించింది.

ఏమి చేయాలో వివరంగా మగ తోడేలుకు చెప్పింది. ఆ పథకానికి తోడేలు సంతోషించింది. ఆ పనికి పూనుకుంది. మగ తోడేలు,ఆడ తోడేలు వాటి పిల్లలు అన్నీ కలిసి సింహం గుహ ముందుకు చేరాయి. మగ తోడేలును, పిల్లలనూ చాటుగా వుండమంది. అచట ఒక చెట్టు చాటున అవి వున్నాయి. ఆడ తోడేలు ఒక్కటీ నెమ్మదిగా ఆ గుహద్వారము దగ్గరకు చేరింది. అచట చప్పుడు యేమీ వినపడలేదు. ఆడ తోడేలు నెమ్మదిగా గుహలోకి తొంగి చూసింది. అచట ఎవరూ కనపడలేదు. గుహ అంతా ఖాళీగా వుంది. నెమ్మదిగా గుహలోపలికి వెళ్ళి అంతా కలియ తిరిగింది. ఎటువంటి అలికిడీ లేదు. సింహం అప్పుడు గుహలో లేదు. బయటకు ఆహారము కోసం వెళ్ళింది. గుహ విశాలంగా చాలా బావుంది. సింహం ఆహారం తిని రాత్రి వేళకు వస్తుందని అర్థమైంది. తోడేలు తన భర్తనూ, పిల్లలనూ లోపలికి రమ్మని సైగ చేసింది. వారంతా లోపలికి చేరారు. పగలంతా అడవిలో తిరిగి ఆహారము తిని చీకటి పడగానే సింహం గుహకు వస్తే, ఏమి చేయాలో మగ తోడేలుకు చెప్పి గుహ బయటనే కాపలా వుంచింది. చీకటి పడసాగింది. దూరము నుంచి సింహం రావటం చూసింది. సింహం గుహకు దగ్గరగా రాగానే మగ తోడేలు గుహలోకి వెళ్ళింది.

ఆడ తోడేలు పిల్లలను గబ గబా నాలుగు దెబ్బలు కొట్టింది. అవి పెద్దగా ఏడవటం మొదలు పెట్టినాయి. మగ తోడేలు, ఆడ తోడేలు కలిసి విచిత్రంగా అరవటం మొదలు పెట్టాయి. ఆ అరుపులూ, కేకలూ వింటుంటే సింహానికి కొంచెం భయమేసింది. ఏదో పెద్ద జంతువు నా గుహలోకి చేరిందేమో అనుకుంది. అది గుహలోకి వెళ్ళకుండా బయటనే వుంది. సింహం ద్వారం వద్ద నిలబడి వుండటం చూచింది. ఆడ తోడేలు ఇలా అరవసాగింది. "పిల్లలు ఏడుస్తున్నారు. వారికి సింహం మాంసం వండి పెట్టాలట! లేకపోతే తిండి తినరట. గోల పెడుతున్నారు. ఇపుడు నేను యేమి చేసేది? ఇప్పటికిప్పుడు సింహపు మాంసం కావాలంటే ఎలా వస్తుంది? నేను ఎక్కడి నుండి తీసుకురాను." అంది. దానికి మగ తోడేలు యిలా అంది "తొందరపడకు ఒక సింహం యిటు రావటం చూశాను. అది బాగా బలిసి వుంది. దాని మాంసం బాగా రుచిగా వుంటుంది. అది యీ వైపుకి రాగానే దానిని చంపి దాని మాంసం తీసుకువస్తాను" అని గట్టిగా అరిచింది. ఈ మాటలు సింహం వింది. దానికి బాగా దడ పుట్టింది. లోపల యే జంతువులు వున్నాయో సింహానికి అర్థం కాలేదు. అవి తనను చంపుతాయేమో అనుకుంది. వెనుకకు చూడకుండా చాలా దూరం వెళ్ళింది. తోడేళ్ళ సంసారం గుహలో చేరటం అచట వుండే ఒక నక్క చూసింది. తోడేళ్ళ సంభాషణ అంతా వింది. సింహం పరుగు తీయటం చూసింది.

తోడేళ్ళ సాహసానికి నక్క ఆశ్చర్యపోయింది. తోడేళ్ళు సింహాన్ని మోసం చేసి గుహనుంచి తరమటం గమనించింది. తోడేళ్ళకి ఎలాగైనా బుద్ది చెప్పాలనుకుంది. సింహం కోసం ఆ ప్రాంతమంతా వెతికింది. అన్ని చోట్లా గాలించింది. దానికి సింహం దగ్గరలో ఎక్కడా కనపడలేదు. నక్క చాలా దూరం వెళ్ళి అంతా వెదికింది. చివరకు ఒక గుట్ట చాటున సింహం పడుకుంది. అది బాగా రొప్పుతోంది. నక్క మెల్లిగా సింహం దగ్గరకు చేరింది. ఇలా అంది. "ఓ మృగరాజా! నీవు ఈ అడవికి రాజువు. నీలాంటి వారు ఒక తోడేలుకి యిలా భయపడటం సబబేనా?నీలాంటి నాయకులు అలా పరుగు తీయవచ్చునా? రేపు యీ విషయం మిగిలిన జంతువులకి తెలిసిన నీ పరువు వుంటుందా" ఈ మాటలకి సింహం యే సమాధానం చెప్పలేదు. దానికి భయం యింకా తగ్గలేదు. నక్క మాటలు సింహం అసలు నమ్మలేదు. నక్క మరలా యిలా అంది. "ఓ రాజా! ఆ తోడేలును నీ గుహనుంచి వెళ్ళగొడతాను. నీవు నాతోరా "సింహం తనలో తాను ఇలా అనుకుంది. ఇది అసలే నక్క దీనిని అసలు నమ్మరాదు. దీనితో వెళితే ఇది నన్ను గుహ దగ్గరకు తీసుకెళ్ళి అచటనే వదలిపెడుతుంది. అపుడు నేనేం చేయాలి? ఆ జంతువుని చూసి నక్క పారిపోతే? ఇంతలో సింహానికి ఒక ఉపాయం తట్టింది. "ఓ నక్కా! నేను నిన్ను నమ్మను. నేను చెప్పింది చేస్తే నీతో రావడానికి ఒప్పుకుంటాను" అంది. నక్క అది యేమిటో చెప్పమంది. "నా తోకతో నీ తోకను ముడివేసుకొని యిద్దరం వెళదాం సరేనా" అంది. దీనికి నక్క ఒప్పుకుంది. ఆ తోడేళ్ళు యేమి చేయలేవని నక్క ఆలోచన.

సింహం, నక్క తోకలు ముడివేసుకొని గుహ వద్దకు చేరుకున్నాయి. సింహం, నక్క కలిసి రావడం ఆడతోడేలు చూసింది. నక్క యేదో ఎత్తు వేసిందని ఆడతోడేలు ఊహించింది. తోడేలు గుహముందుగా వచ్చి పక్కకు నిలబడింది. "ఏం నక్కా నేను రెండు సింహాలను తెమ్మంటే, ఒక్క దాన్నే తెచ్చావేమి? సరే ముందు నిన్ను చంపుతాను. తరువాత సింహాన్ని కూడా చంపి ఆ రెండింటినీ కలిపి వండుకు తింటాను" అని అరిచింది. ఆ మాటలు సింహం వింది. నక్క తనని మోసం చేసిందని భావించి వెనుకకు తిరిగి వేగంగా పరుగెత్తింది. ఆ పరుగులో నక్క శరీరం చీరుకుపోయింది. తోక తెగి, అది క్రిందపడి చనిపోయింది. ఇదంతా చెట్టుపైన వున్న ఒక కోతి చూచింది. నెమ్మదిగా ఆ కోతి సింహం దగ్గరకు వెళ్ళింది. నక్క చెప్పినట్లే చెప్పింది. మెల్లిగా సింహాన్ని ఒప్పించింది. సింహం కోతితో యిలా అంది "నీవు తాడుతో నా మెడకు నీ మెడకు కట్టు. అప్పుడు వెళ్ళుదాం" అంది. అలాగే చేసింది. ఆ రెండూ తాడుతో మెడలు కట్టుకున్నాయి. నెమ్మదిగా గుహ దగ్గరకు వెళ్ళినాయి. రెంటిని ఆడతోడేలు చూసింది.

ఆడతోడేలు నక్కని అరచినట్లే "ఓసీ కోతి! పొద్దుననగా సింహాన్ని తీసుకువస్తానని ఇంతరాత్రికి వస్తావా? ముందు నిన్ను చంపి, తరువాత సింహాన్ని చంపుతాను" అంది పెద్దగా. ఈ మాటతో సింహానికి వణుకు పుట్టింది. అది వెనుకకు తిరిగి పరుగులంకించుకుంది. దానితో పాటు కోతి కూడా పరుగెత్తాల్సి వచ్చింది. అవి రెండూ అలా పరుగెత్తి ఒక దిగుడు బావిలో పడి చనిపోయాయి. అందుకే పెద్దలు అంటారు "బుద్ధిబలం వుంటే బలహీనులు కూడా బలవంతులను జయించవచ్చును" అని.
============================================================

సాధువుగామారిన దొంగ

ఒక రోజు రాత్రి ధనవంతునికి చెందిన తోటలో కాయలు దొంగిలించడానికి దొంగ వచ్చాడు. తోటలోని కొన్ని కాయలు కోసాడు. ఆ అలికిడికి తోటలో నౌకర్లు లేచి దివిటీలు వెలిగించి తోటంతా వెతికారు. దొంగతనానికి వచ్చిన ఆ దొంగ పట్టుబడకుండా తప్పించుకోవాలని ఒంటికి విభూది రాసుకొని చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఒక చెట్టు కింద కూర్చొని సాధువులాగా కొంగ జపం చేయసాగాడు. నౌకర్లు దొంగను పట్టుకోలేక పోయారు. కానీ ఆ తోటలో జపం చేసుకుంటున్న ఆ సన్యాసిని చూసి వారు చాలాచాలా సంతోష పడ్డారు. మరుసటి రోజు ఆ తోటలో సాధువు బసచేసాడన్న వార్త సుడిగాలిగా ఊరిలో ప్రాకి పోయినది. చాలామంది ప్రజలు, పండ్లు, తినుబండారాలు తీసుకొని వచ్చి సాధువు కాళ్ళదగ్గర పడ్డారు. కొంతమంది అతడి పాదాల వద్ద వెండి, బంగారం, డబ్బులు కూడా పెట్టారు.

'నేను దొంగ సన్యాసిని కదా! అయినా ఎంతమంది ప్రజలు నాపట్ల భక్తిశ్రద్ధలు చూపుతున్నారు. ఎంత ఆశ్చర్యం! అని దొంగ ఆలోచించాడు. 'నేను సాధువుగా మారితే ఇంకెంతగా గౌరవిస్తారో? అని ఆలోచించి, నిజమైన సాధువు కావడానికి ఆ దొంగ తీర్మానించుకొన్నాడు. కొంతకాలానికి ఆ దొంగ నిజంగానే ఒక సాధువుగా మారి భగవంతుని కృపను పొందాడు.
=====================================================

సోమరిపోతు

శిళ్లంగేరి అనే గ్రామంలో ఒక జమిందారుండేవాడు. అతడు చాలా ధర్మాత్ముడు. పేదవాళ్లు వచ్చి జీవనోపాధి చేసుకోవడానికి ఏ సహాయం అడిగినా లేదనేవాడుకాదు. ఒక రోజు అతని వద్దకు సోమశర్మ అనే ఒక పేదవాడొచ్చాడు. జమిందారు అతనికి పుష్కలంగా పాలునిచ్చే ఆవునిచ్చి పాలవ్యాపారం చేసుకొని జీవించమన్నాడు. సోమశర్మ జమిందారుతో "అయ్యా, తమరేమో ఆవునిచ్చారు. కానీ దానిని ఉంచడానికి మా చిన్న ఇంటిలో స్థలం లేదు." అన్నాడు. జమిందారు కొంత ధనమిచ్చి, ఆవును కట్టివేయడానికి ఒక గుడిసె వేసుకోమన్నాడు.

"అయ్యా ఆవునిచ్చారు. దానిని కట్టివేసుకోవడానికి ఒక గుడిసె వేసుకోవడానికి ధనమిచ్చారు. ఆవు ఇచ్చే పాలను అమ్మితే వచ్చే డబ్బు మాకే సరిపోతుంది. దానికి గడ్డీ దాణా ఎలా కొనను?" అన్నాడు సొమశర్మ. అందుకు జమిందారు ఆవుకు కావలసిన గడ్డీ, దాణా కూడా ఉచితంగా తానే ప్రతీరోజు తన ఇంటి నుండి పంపిస్తానన్నాడు.

రెండు రోజులు గడిచాయి. సోమశర్మ జమీందారు దగ్గరకు వచ్చి "అయ్యా నాకో ఇబ్బంది వచ్చింది. పాలు బజారుకు తీసుకెళ్లి అమ్మాలంటే కష్టంగా ఉంది. ఈ పని చేసే అలవాటు లేదు." అన్నాడు.

జమిందారు ఆ పాలను తానే కొంటానన్నాడు. మరో రెండు రోజులు గడిచాయి. ఈసారి సోమశర్మ జమిందారు వద్దకు వచ్చి, "అయ్యా ఇంత వరకు మేము భిక్షాటనతో కాలం గడిపిన వాళ్లం. ఈ ఆవుకు చాకిరీ చెయ్యడం, ఇంట్లో అన్నం వండుకోవడం మొదలైన పనులు చేయడం నా భార్యకు చాలా కష్టంగా ఉంది" అన్నాడు. జమిందారు ఆలోచించి "సరే మీకు శ్రమ లేకుండా ఒక పనిమనిషినీ, వంట మనిషినీ పంపిస్తాను" అన్నాడు.

సోమశర్మ ఇంటికి పనిమనిషి వంట మనిషి వచ్చారు. సోమశర్మకు, అతని భార్యకు చాలా సంతోషమయింది. వంట వండిపెట్టింది. భోజనం వేళకు సరిగ్గా సోమశర్మ ఇంటికి ముగ్గురు బ్రాహ్మణులు వచ్చారు. వీరు ఎందుకొచ్చారో సోమశర్మకు అర్థం కాలేదు. వాళ్లు సోమశర్మతో "శర్మగారూ, మమ్ములను జమిందారు పంపించారు. మీరు భోజనం చేయడం కూడా బద్దకం వల్ల కష్టంగా ఉంటుందని అందువల్ల ఆ పని చేయడానికి పంపించారు" అన్నారు.

సోమశర్మకు, అతని భార్యకు సిగ్గువేసింది. ఆ రోజు నుండి సోమరితనానికి స్వస్తిచెప్పి బాగా కష్టపడటం అలవాటు చేసుకొన్నారు.
=======================================

స్నేహ ఫలం

చ్యవన మహాముని గంగా యమునల సంగమ ప్రదేశాన నీళ్ళలో మునిగి సమాధిపరుడై తపస్సు చేస్తున్నాడు. చేపలు ఆయన శరీరమంతా ఎక్కి హాయిగా తిరగటం మొదలు పెట్టాయి. ఆయన కరుణతో వాటిని మన్నించాడు. వాటి చేష్టలకు సంతోషపడ్డాడు. అలా పన్నెండేళ్ళు గడిచిపోయాయి. ఒకసారి జాలరులు ఆ ప్రాంతానికి వచ్చి వల వేశారు. చేపలతో పాటు చ్యవనుడు కూడా ఆ వలలో చిక్కుకున్నాడు. జాలర్లు వల పైకి తీసి ఆ మహామునిని చూసి భయపడ్డారు. తప్పు క్షమించమని ఆయన కాళ్ళమీద సాష్టాంగపడ్డారు. "ఈ చేపలతో కొన్నేళ్ళుగా సహవాసం చేయడం వల్ల నాకు వాటిమీద మక్కువ ఏర్పడింది. వాటితో సహా ప్రాణాలు విడవడం కూడా ఇష్టమే నాకు! కనుక అలా చేయ్యండి. లేదా మీకో ఉపాయం చెబుతాను. ఈ చేపల్ని మీరు ఎలాగో అమ్ముకుంటారుగా! వాటితోపాటు నన్ను కూడా అమ్మెయ్యండి" అన్నాడు. జాలర్లు భయపడుతూ వెళ్ళి ఆ సంగతి నహుష మహారాజుతో చెప్పారు. ఆయన భయసంభ్రమాలతో మంత్రి, పురోహితులను వెంటబెట్టుకుని ఆ మహాముని దగ్గరకు వెళ్ళి శిరస్సు వంచి నమస్కారం చేశాడు. 'మహాత్మా! తెలియక అపరాధం చేశారు బెస్తలు. అది ఏం చేస్తే పోతుందో సెలవియ్యండి' అన్నాడు. 'మహారాజా! బెస్తలు తమ కుల ధర్మం చేశారు. అందులో వారి తప్పేముంది పాపం వాళ్ళు చాలా శ్రమపడ్డారు. అందుచేత నా శరీరానికి తగిన వెల వాళ్ళకివ్వు' అన్నాడు చ్యవన మహర్షి. ఆయన మనస్సులో కోపం లేనందుకు నహుషుడు సంతోషించాడు. మంత్రిని పిలిచి, ఈ బెస్తలకు వెయ్యి మాడలు ఇవ్వండి అన్నాడు. 'ధర్మంగా ఇవ్వు మహారాజా' అన్నాడు ముని. 'అయితే పదివేలివ్వండి' చాలదు. 'లక్ష!' న్యాయం కాదు. సరే, 'కోటి' ఉహూ. 'పోనీ నా రాజ్యంలో సగం ఇస్తాను.' 'నువ్వూ నీ మంత్రులూ ఆలోచించుకుని తగిన వెల ఇవ్వండి!' దీనికింత చర్చేమిటి' 'నా రాజ్యమంతా ఇచ్చేస్తాను.' చ్యవనుడు నవ్వుతూ సరిపోదు అన్నాడు. నహుషుడు విచార పడిపోయాడు. మంత్రులందరిని కొంచెం పక్కకు తీసుకువెళ్ళి 'ఇకేం చేద్దాం' అని ఆలోచన అడిగాడు. ఇంతలో అక్కడికి గవిజాతుడనే మహాముని వచ్చాడు. నహుషుడి సమస్యేమిటో అడిగి తెలుసుకున్నాడు. 'మహారాజా! చింత విడిచిపెట్టు, గోవులకు, విప్రులకు భేదం లేదు ఆ ఇద్దరూ హవికీ, మంత్రాలకూ ఆధారమైన వాళ్ళు. సకల వేదాలకూ ఆశ్రయుడైన మహర్షికి వెల నిర్ణయించడం దుర్లబమైన పని. బ్రాహ్మణుడితో సమానమైనదే గోవు కూడాను. కనుక గోవు నివ్వు. వెల సరిపోతుంది.' అని ఉపాయం చెప్పాడు. నహుషుడు సంతోషించాడు. చ్యవనుడి దగ్గరకు వెళ్ళి "మహాత్మా! నన్ను దయ చూడు. మీకు వెల కట్టడం ఎవరికి సాధ్యం? గోవునిస్తాను. అనుగ్రహించు అన్నాడు.
చ్యవనుడు సంతోషించాడు. తగిన మూల్యమే నిర్ణయించావు. అలాగే ఇవ్వు అన్నాడు. నహుషుడు గోవును జాలరులకిచ్చాడు. జాలరులు గోవుతో సహా చ్యవనుడి దగ్గరకు వెళ్ళారు. "అయ్యా! మమ్మల్ని చూసింది మొదలు మా మీద అనుగ్రహం చూపిస్తున్నావు. మమ్మల్ని కరుణించి ఈ గోవును మా దగ్గర నుంచి మీరు తిసుకోండి" అని వేడుకున్నారు. కాదనలేకపోయాడు చ్యవనుడు. "సరే అలాగే ఇవ్వండి" అని ఆ గోవును వాళ్ళ దగ్గర్నుంచి తీసుకొని, మీరూ, ఈ చేపలూ స్వర్గానికి వెళ్ళండి అని దీవించాడు. వెంటనే ఆ బెస్తలు, చేపలు కూడా శరీరాలతో ఎగసి స్వర్గానికి వెళ్ళారు. నహుషుడూ, ఆయన పరివారం అది చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు చ్యవనుడూ, గవిజాతుడూ కలిసి నహుషుణ్ణి పిలిచి - "నీకు మేము చెరో వరం ఇస్తాం. ఏం కావాలో కోరుకో" అన్నాడు. "మీరు తృప్తిపొందడం కంటే నాకింకేం కావాలి" అన్నాడు నహుషుడు వినయంగా. "రాజా! నీకు ధర్మపరత్వం, దేవేంద్ర వైభవం కలుగుతాయి" అని దీవించి వాళ్ళిద్దరూ అంతర్హితులయ్యారు. నహుషుడు పరమానంద భరితుడయ్యాడు. "సజ్జన సాంగత్యం వల్ల ఉత్తమ ఫలితాలుంటాయని" చెబుతూ నారదుడు ధర్మరాజుకి కథ చెప్పాడు.
=========================================================

స్నేహబలం

హిరణ్యకుడు అను ఎలుక, చిత్రాంగుడు అనే జింక, మంథరుడు అనే తాబేలు, లఘుపతకము అనే కాకి వీళ్ళు నలుగురు మిత్రులు. కర్పూర గౌరవము అనే చెరువులో తాబేలు ఉండేది. ఆ చెరువులో ఒడ్డున ఉన్న చెట్టు తొర్రలో ఎలుక, ఆ చెట్టు మీద కాకి ఉండేది. ఆ ప్రక్కనే ఉన్న పొదలో జింక ఉండేది.

సాయంత్రపు పూట ఈ నలుగురు మిత్రులు ఒకేచోట చేరి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ ఆనందంగా జీవిస్తూ ఉండేవారు. ఒక రోజు మథ్యాహ్నమనగా ఆహారం కోసం వెళ్ళిన జింక సాయంత్రం అవుతున్నా తిరిగి రాకపోవటంతో తాబేలు, ఎలుక, కాకి కంగారు పడ్డాయి. చాలా సేపు ఎదురుచూసినా జింక వస్తున్న జాడ కనిపించలేదు.

'స్నేహితులారా! చిత్రాంగుడు ఇంతసేపయినా ఇంటికి తిరిగి రాలేదంటే ఏదో ప్రమాదంలో చిక్కుకొని ఉంటాడు అంది తాబేలు కంగారుగా. 'అవును నిజమే!' అన్నాయి ఎలుక, కాకి. 'ఇప్పుడు ఏం చేద్దాం!' అనుకున్నాయి ఆ మూడు. స్నేహితులారా! నేను ఎగిరివెళ్ళి అడవంతా చూసివస్తాను' అంటూ కాకి రివ్వుమంటూ ఆకాశంలోకి ఎగిరింది.

తాబేలు, ఎలుక చిత్రాంగుడు వస్తాడేమోనని నాలుగు దిక్కులు చూస్తూ నిల్చున్నారు. ఆకాశంలో ఎగురుతున్న కాకికి ఒకచోట జింక కనిపించిది. కాని అది వేటగాడు పన్నిన వలలో చిక్కికుపొయి బాధతో గింజుకుంటోంది. కాకి జింక ముందు వాలింది. కాకిని చూసి జింక ఆనందంతో 'వచ్చావా! లఘుపతనకము ఆహారం కోసం వచ్చి చూసుకోకుండా వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోయాను నన్ను రక్షించవా' అంది. 'భయపడకు చిత్రాంగా! నేను మన ఎలుక మిత్రుడు హిరణ్యకుడిని తీసుకువస్తాను అతను ఈ వలను కొరికి నిన్ను రక్షిస్తాడు!' అని కాకి జింకకు ధైర్యం చెప్పి మళ్ళీ ఆకాశంలోకి వేగంగా ఎగిరి వెళ్ళి కొద్దిసేపట్లోనే ఎలుకను తన వీపు మీద ఎక్కించుకొని వచ్చి జింక దగ్గర వాలింది.

ఎలుక తన పదునైన పళ్ళతో వల కొరికి జింకను విడిపించింది. ఆ ముగ్గురు ఆనందంగా కబుర్లు చెప్పుకొంటూ తమ ఇళ్ళ వైపు నడిచారు. దారిలో వాళ్ళకి తాబేలు ఎదురుపడింది. అయ్యో! మంధరా నువ్వెందుకు వచ్చావు అనడిగాడు హిరణ్యకుడు. 'చిత్రాంగుడు ఆపదలో ఉన్నాడని తెలిసి ప్రశాతంగా కూర్చోలేకపోయాను.

మీరిద్దరూ చిత్రాంగుడిని రక్షిస్తారని నాకు తెలుసు. అయినా మనసు ఊరుకోలేదు. అందుకే వచ్చాను అంటూ సమాధానమిచ్చాడు మంథరుడు. 'నువ్వు నిజమైన స్నేహితుడివీ అంటూ చిత్రాంగుడు ఆనందంగా మంథరుడిని ముద్దు పెట్టుకున్నాడు. ఆ నలుగురూ అనందంగా కబుర్లు చెప్పుకొంటూ ఇంటి దారి పట్టారు. కొంతదూరం ఆ నలుగురు నడిచే సరికి వేటగాడు ఎదురుపడ్డాడు. వాడిని చూడగానే జింక పొదలోకి దూరిపోయింది. కాకి ప్రక్కనే ఉన్న చెట్టు మీదకి ఎగిరిపోయింది, ఎలుక ప్రక్కనే ఉన్నకలుగులోకి దూరిపోయింది. తాబేలు మాత్రం ఎటూ పారిపోలేక వేటగాడి చేతికి దొరికిపోయింది.

జింక తప్పించుకున్నా తాబేలు దొరికిందని ఆనందపడ్డ వేటగాడు తాబేలును బాణం కొసకి తాడుతో కట్టి భుజం మీద వేసుకొని ఇంటి దారిపట్టాడు. వేటగాడు కొంతదూరం వెళ్ళగానే జింక, ఎలుక, కాకి ఒక్కచోట చేరి 'అయ్యో! చిత్రాంగుడు వేటగాడి బారి నుంచి తప్పించుకున్నాడంటే మళ్ళీ మంథరుడు వీడి చేతికి దొరికాడే' అనుకుని బాధపడ్డాయి.

అప్పుడు హిరణ్యకుడు 'స్నేహితులారా! మన మంథరుడిని రక్షించుకుంటానికి నాకు ఒక మంచి ఉపాయం తట్టింది అంది. 'హిరణ్యకా! తొందరగా ఆ ఉపాయం చెప్పు అంది కాకి. 'వేటగాడు నడిచే దారిలో చిత్రాంగుడు చచ్చినట్లు పడి ఉంటాడు. అప్పుడు వేటగాడు పట్టుకుంటానికి మంథరుడిని కట్టిన బాణం క్రింద పెట్టి వెళతాడు. అప్పుడు ఆ తాడును నేను కొరికి మంథరుడిని తప్పిస్తాను' అని చెప్పింది.

ఆ ఉపాయం ఎలుకకి, కాకికి నచ్చింది. ఆ మూడు అడ్డదారిలో వేటగాడి కంటే ముందుకి పోయి ఒక చోట జింక దారికి అడ్డంగా పడుకొంది. కాకి దాని మీద వాలి ముక్కుతో పొడుస్తున్నట్లు నటించసాగింది. ఆ దారిలో నెమ్మదిగా వస్తున్న వేటగాడు జింకను చూసాడు. దాని మీద వాలి కాకి ముక్కుతో పొడవటం వల్ల అది చచ్చిపోయిందనుకొని 'ఆహా! ఏమి నా భాగ్యం. ఈ రోజు అదృష్టం నా పక్షాన ఉంది అందుకే వలలో జింక తప్పించుకున్నా ఇక్కడ మరొక జింక దిరికింది అని ఆనందపడుతూ భుజం మీద బరువుగా ఉన్న తాబేలును నేల మీద పెట్టి జింక దగ్గరకు నడిచాడు.

వెంటనే ఎలుక వచ్చి తాబేలుకి కట్టిన తాడును కొరికేసింది. కాకి 'కావ్! కావ్'మని అరుస్తూ ఆకాశంలోకి ఎగిరిపోయింది. జింక పారిపోయింది. వేటగాడు కొయ్యబారి పోయి అంతలోనే తేరుకుని తాబేలు కోసం చూసాడు. అప్పటికే తాబేలు ప్రక్కనే ఉన్న చెరువులోకి పారిపోయింది.

'ఆహా! ఏమి నా దురదృష్టం చేతిలో వున్న దానిని వొదులుకున్నాను అనుకొంటూ ఆ వేటగాడు ఇంటికి వెళ్ళిపోయాడు.

ఎలుక, జింక, తాబేలు, కాకి ఆనందంగా తమ ఇంటికి వెళ్ళిపోయాయి. చూసారా! స్నేహం అంటే ఈ నాలుగు ఉన్నట్లు ఉండాలి. ఆపదలో ఉన్న స్నేహితుడిని ఆదుకుంటానికి అవసరమైతే ప్రాణాలను కూడా ఫణంగా పెట్టగలగాలి. పనికిరాని స్నేహితులు పదిమంది ఉండే కంటే అవసరంలో ఆదుకొనే స్నేహితుడు ఒక్కడుంటే చాలు. స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం.
===========================================================

స్వశక్తి

కేశవాపురం అనే ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి రాము, సోము అనే ఇద్దరు కొడుకులు. ఇద్దరికీ పెళ్ళిళ్ళు జరిగాయి. ఇల్లు పెద్దది కావటము వలన అందరూ కలసే ఉన్నారు. రాము పెద్దవాడు. ఉదయమేలేచి పొలము పనికి వెళ్ళి తండ్రికి సాయపడుతూ ఉండేవాడు. సోము సోమరిగా ఉంటూ పగటి పనికి వెళ్ళి కలలు కంటూ కాలక్షేపము చేసేవాడు. ఎవరు చెప్పినా ఏ పని చేయక పడుకొని ఉండేవాడు. కొంతకాలము గడిచింది. ఆ ఊరికి ఒక మెజీషియన్ వచ్చాడు. అనేక విద్యలు ప్రదర్శించాడు. చివరగా ధాన్యమును బంగారముగా మార్చాడు. సోమూకి ఆశ్చర్యము కలిగింది. మెజీషియన్ ప్రదర్శన పూర్తి అయిన పిదప అతన్ని కలిసి ధాన్యము బంగారముగా మార్చే విధము చెప్పమని అడిగాడు. అంతకుముందే అతని గురించి తెలుసుకున్న మెజీషియన్ రేపు చెప్తానన్నాడు. అతని ఇంటికి వెళ్ళి ఆ రాత్రి బసచేసి మరుసటి రోజు సొంతముగా నీవు నీ భార్యా కలసి పంట పండించిన ధాన్యముతోనే ఇది సాధ్యమవుతుంది. నీకు బంగారము తయారయ్యాక నీ భార్యకి నగలు చేయించాలి సుమా! అంతేకాదు మీ ఇంట్లో అందరితో కలసి పనులు చేయాలి. పగలు నిద్రించరాదు. అని చెప్పాడు. బంగారము తయారు చెయ్యాలనే ఉద్దేశముతో తండ్రితో చెప్పి తనవాట పొలము తీసుకొని భార్య సహాయంతో కష్టపడి ఎక్కువ ధాన్యము పండించాలని కృషి చేశాడు. అతని అదృష్టము వలన పంటలు బాగా పండాయి. ధాన్యరాసులు ఇంటికి వచ్చాయి. మెజీషియన్ కొరకు ఎదురుచూడసాగాడు.

ఒకరోజున మెజీషియన్ వచ్చాడు. అందరికీ సహాయపడుతూ ఉన్న సోమూని చూసి ఆనందించి నీ భార్యకి నగలు చేయించావా? అని అడిగాడు. ఆమె ముసిముసి నవ్వులు నవ్వసాగింది. మీరు మాకు బంగారము తయారుచేయిస్తానన్నారుకదా! అని అమాయకంగా అడిగాడు. ధాన్యపు బస్తాలను చూపుతూ ఇవి బంగారము కాదా! అన్నాడు. అప్పుడు ఆ వస్తువు చూసి ధాన్యము ఒక ప్రక్క, బంగారము వలెనున్న ఇత్తడి ముక్క ఒక ప్రక్క చూపించి నవ్వుతూ నీ గురించి విని, నీ పగటికలలకు స్వస్తి చెప్పాలనే, నాచెల్లెలు కాపురం ఆనందంగా ఉండాలనే ఈ ఎత్తువేశాను. నేను నీకు బావని. మీ పెళ్ళికి రాలేకపోయాను. ఫ్రెండ్స్ సహకారంతో ఈ నాటకం ఆడాను. మాచెల్లెలు నన్ను గుర్తించింది. నీకు చెప్పవద్దని ప్రమాణం చేయించుకున్నా. మీ అన్నయ్య ద్వారా నీ విషయము తెలుసుకొని అందరికీ నీవు బాగుపడటమే ఆనందమని తెలిసి మౌనం వహించారు అని చెప్పాడు. ఆ రోజు అందరూ కలిసి చలోక్తులతో మాట్లాడుకున్నారు. అన్న గారితో పొలము పనులలో సహాయము చేస్తూ సుఖసంతోషాలతో గడిపాడు.
===============================================

స్వామీజీ - సొమ్ములు

ఆ మండలంలో అదే పెద్ద ఊరు. పూర్తిగా పట్టణం అనలేం, అలాగని పల్లెటూరు కాదు. మధ్యస్తంగా ఉంటుంది. ఆ ఊరిలో హైస్కూలు ఉంది, లైబ్రరీ ఉంది, రెండు మూడు ఆఫీసులూ వున్నాయి. భాస్కర్ పంచాయితీ ఆఫీసు గుమస్తా. ఆయన దగ్గర తెలుసుకోదగ్గ విశేషాలేమీ లేవు గానీ, అతని భార్య శారద గురించి మాత్రం వివరంగానే చెప్పుకోవాలి. మంచి భక్తిగలది. ముఖ్యమైన దేవాలయాల్లో నిత్యం పూజలు, అభిషేకాలు చేయిస్తూ వుంటుంది. పిల్లలలో ఎవరికి జబ్బు చేసినా తాను ఉపవాసాలుంటుంది. ప్రతి శుక్రవారం పేదలకు పైసలు పంచుతుంది. కాషాయ రంగు దుస్తుల్లో ఎవరు కనిపించినా మహాసాధువని గౌరవించి భక్తితో సత్కరిస్తుంది. ఏ గుడిలో భజన జరిగినా ఆవిడ ముందుంటుంది. భక్తి గీతాలు కమ్మగా పాడుతుంది. చీరలు నగలు కొనడంలో ఎంత ఖర్చయినా వెనుకాడదు. వాళ్ళాయన శ్రీపతి నెలనెలా జీతం తెచ్చి ఆమె చేతికిస్తాడు. మిగిలిన ఇంటి బాధ్యతలన్నీ ఆమెవే. శారదంటే ఆ వూళ్ళోనేకాదు చుట్టుపక్కల అమ్మలక్కలకు బాగా తెలుసు. ఆ రోజు అమావాస్య ఆదివారం, మిట్ట మధ్యాహ్నం మంచి ఎండలో వయస్సులో ఉన్న ఒకావిడొచ్చింది. "ఏమండీ మీ యింటికి గడ్డం మీసాలున్న నడివయస్సులో వున్న సాధువుగారేమయినా వచ్చినట్లు చూశారా మీరు?" అంది.

"సాధువుగారా! ఎవరూ రాలేదండీ!" కూర్చొండి అని చెప్పి ఎంతో గౌరవంగా మాట్లాడి వరండాలో కుర్చీ వేసింది శారద. ఫరవాలేదు వెళతానండి. "ఆయన్ని గురించి మీకు రెండు మాటలు చెప్పాలి" అందామె. "చెప్పండి" అంది శారద ఆతృతగా. ఆయన దేవుడు లాంటివాడు. దెయ్యాల్ని భూతాల్ని వదలగొడతాడు. మనలో మనకు తెలియని పెద్ద రోగాల గురించి ఇట్టే చెప్పేస్తాడు. ఇంటి దోషాల గురించి, మనకు సంభవించే ముప్పు గురించి ముందుగా చెప్తాడు. ఏ వ్యాపారం చేస్తే లాభసాటిగా ఉంటుందో ఎక్కడ పొలం కొంటే అధికంగా పండుతాయో చెప్తారు. మాకు, మా చుట్టాలలో కొందరికి, మరి కొందరు తెలిసిన వారికి చెప్పారు. రాబోయే ప్రమాదాల గురించి ముందుగా చెప్పి కాపాడాడని వివరాలు గడగడ చెప్పింది. ఈలోగా వస్తారేమో అటు హైస్కూలు వైపుగా వెళ్ళివస్తానండీ అని గబగబా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన పావుగంటకి ఆయన రానేవచ్చారు. శారదకు చాలా ఆనందం కలిగింది. ఎంతో ఆదరంగా ఆయన్ని లోనికి ఆహ్వానించింది. "తల్లీ నేను మీ ఇంటికొచ్చిన కారణం ఓ ముఖ్య విషయం చెప్పి పోదామని" అన్నాడు స్వామీజీ. "చెప్పండి స్వామీ"అంది. "మీ ఆయనికి ప్రాణగండం ఉంది అదీ ఒక్క వారంలోగానే" అన్నాడు. "అమ్మో ప్రాణగండమే" అని ఆవిడ నిలువెల్లా వణికి పోయింది.

"మరేం కంగారు పడకండి దానికి శాంతి చేయాలి." "ఏం చేద్దాం చెప్పండి స్వామీ" అంది. ఇంతలో ఆమె మరలా వచ్చి మీ కోసమే వెతుకుతున్నాను స్వామి అంటూ వచ్చింది. ఆమె రాక అతనికి మరికొంత ఆనందాన్నిచ్చినట్లు కనిపించాడు. ముగ్గురు చాప మీద కూర్చున్నారు. ఇవ్వాళ అమావాస్య ఆదివారం కొద్ది నిముషాల్లో మనం కాళీ మాతకి పూజలు చేయాలి. అప్పుడుగాని ఆయనకి ప్రాణగండం తప్పదు."ఇప్పుడేంకావాలో త్వరగా చెప్పండి" స్వామీ. ముందు కర్పూరం, పటికబెల్లం, కొబ్బరికాయ తెప్పించండి మిగిలినవి ధూపదీప నైవేద్యాలు నా దగ్గరున్నాయి. అన్నారు. ఫరవాలేదు డబ్బివ్వండి నేను తెచ్చిపెడతాను" ఎంతో సహాయకారిగా అంది ఆ వచ్చినావిడ. వెంటనే శారద లోపలకెళ్ళి బీరువాలోంచి డబ్బు తెచ్చి ఇచ్చింది. ఆమె వేగంగా వెళ్ళిపోయింది. స్వామీజీ పూజకు అన్నీ సిద్దం చేస్తున్నారు. శారదని కాళ్ళూ, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కొని రమ్మన్నారు. ఆమె అలా చేసి వచ్చింది. ఈలోగా ఆమె కూడా కావలసినవి తీసుకువచ్చింది. ముగ్గురు కాళీమాత బొమ్మ దగ్గరగా కూర్చున్నారు.

స్వామీజీ మూడు నిముషాలలో మూడు నాలుగు మంత్రాలు చదివాడు. అగరొత్తులు వెలిగించాడు. మీ నగలు ఒకసారివ్వండి కాళీమాత దగ్గరుంచి ధూపం వేసి తిరిగి తీసుకుందురుగాని అన్నాడు. ఆమె తన మెడలోని నానుతాడు, చంద్రహారం, నల్లపూసలు, గొలుసు, చేతిగాజులు రెండు ఆనందంగా తీసిచ్చింది.స్వామిజీ వాటిని అందుకున్నాడు. ఓ తెల్లని గుడ్డలో చుట్టి కాళీమాత ఫొటో ముందు ఉంచాడు. ఆ తరువాత తన దగ్గరున్న సంచిలోంచి మూడు పటిక బిళ్ళల్లాంటివి తీశాడు. ఒకటి తనునోట్లో వేసుకున్నాడు. ఇంకొకటి వచ్చినావిడకి ఇచ్చాడు. మరొకటి శారదకిచ్చాడు. అమె దాన్ని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంది. వెంటనే స్పృహ లేకుండా పడిపోయింది. శారదకు మెలకువ వచ్చి చూసేసరికి ఏముంది! స్వామిజీ లేడు, ఆమె లేదు, నగలూ లేవు. సర్వం దోపిడీ జరిగింది. ఆ తరువాత ఏడ్పులు పెడబొబ్బలు. జనం చేరారు. తన నమ్మకం నవ్వులపాలై కన్నీళ్ళు మిగిలాయి.
============================================================

స్వార్ధం తెచ్చిన అనర్ధం

గ్రామాధికారి పరంధామయ్యకు సుస్తీచేసి మంచాన పడ్డాడు. ఒకరోజు ఆయన తన ముగ్గురు కొడుకుల్నీ పిలిచి "ఒరేయ్ అబ్బాయిలూ, ఇక నేను ఎంతోకాలం బతుకుతానని నమ్మకం లేదు. కాబట్టి నా దగ్గరున్న డబ్బు, బంగారం, పొలం మీకు పంపకం చెయ్యాలనుకుంటున్నాను. మీకు ఎవరెవరికి ఏమి కావాలో నిర్ణయించుకుని నాకు చెప్పండి" అన్నాడు.

వెంటనే మూడో కొడుకు సుందరం భార్య, భర్తను గదిలోకి పిలిచి, "చూడండీ! మీరు బంగారం తీసుకోండి. అది పాతకాలం బంగారం. మేలైన రకం, ఎప్పటికైనా మంచి ధర పలుకుతుంది" అని చెప్పింది. సుందరం భార్య మాటకు ఎదురు చెప్పలేక, "అలాగే" అని తల ఊపుతూ, తండ్రి దగ్గర కెళ్లి తనకు బంగారం కావాలనుకున్నాడు.

రెండో కొడుకు గోపాలం భార్య కూడా భర్తను లోపలికి పిలిచి "ఏమండోయ్! మీరు డబ్బు తీసుకోండి. ఎంచక్కా మనం పట్నం వెళ్లి ఏదైనా వ్యాపారం చేసి పెద్ద ధనవంతులం కావచ్చు. మంచి బంగళా కొనుక్కోవచ్చు. ఈ పల్లెటూర్లో నేను ఉండలేను బాబూ. అయినా ఆ చవుడు భూమి మనకేందుకు, ఎంతకాలం కష్టపడితే అంతడబ్బు సంపాదించగలం" అంది. గోపాలం కూడా భార్య మాటకు తల ఊపుతూ "అలాగే" అంటూ వెళ్లి, తండ్రితో తనకు డబ్బు కావాలన్నాడు.

పాపం అమాయకుడైన కామేశం తన వాటాగా మిగిలిన బంజరు పొలాన్ని తీసుకుని భార్యాభర్తలిద్దరూ అహొరాత్రులూ కష్టపడి, దాన్ని మంచి వ్యవసాయ భూమిగా చేసుకుని చక్కని పంటలు పండించుకున్నారు. కొద్దికాలానికే పరంధామయ్య కాలం చేశాడు.

డబ్బు తీసుకుని పట్నం వెళ్లిన గోపాలం వ్యాపారం ప్రారంభించాడు. కొద్దిరోజులకే వ్యాపారంలో నష్టం రావడం మొదలైంది. వాళ్ల సలహా, వీళ్ల సలహా విని, ఉన్న డబ్బంతా వ్యాపారంలో పెట్టాడు. అనుభవం లేనందువల్ల బాగా మోసపోయి దివాలా తీశాడు.

భార్యను తీసుకుని సుందరం పట్నంలో కాపురం పెట్టాడు. సుందరం భార్యకు బంగారమంటే మహా మోజు, రోజుకొక నగ సింగారించుకొని, ఇరుగు పొరుగు ఇళ్లకు వెళ్లి గొప్పగా ప్రదర్శించేది. ఇదంతా బాగా గమనించిన దొంగలు ఒకరోజు అర్థరాత్రి సుందరం ఇంట్లో జొరబడి, కత్తులు చూపి బెదిరించి, ఉన్న బంగారమంతా దోచుకెళ్లారు. ఇద్దరూ లబోదిబోమని ఏడుస్తుంటే ఇరుగుపొరుగు వచ్చి ఓదార్చారు.

సుందరం, గోపాలం ఇద్దరూ బతుకు తెరువు లేక అన్న దగ్గరకొచ్చి బావురమన్నారు. భార్యల మాటలు విని, బంజరు భూమిని అన్నకు అంటగట్టి, మోసం చేసి, తమ స్వార్ధం తాము చూసుకున్నందుకు తగినశాస్తి జరిగిందని ఇద్దరూ పశ్చాత్తాప పడ్డారు. సిగ్గుతో తలవంచుకుని అన్నకు క్షమాపణ చెప్పుకున్నారు. ముగ్గురూ కలిసి వ్యవసాయం చేసుకుంటూ కలిసిమెలిసి జీవించారు. తోబుట్టువును మోసం చేసినందుకు ఏం జరిగిందో చూశారా బాలలూ! ఇతరులను ఎప్పుడూ మోసం చెయ్యకూడదు.
========================================

మొక్కలకు నీళ్ళు తోడిన దొంగలు

ఒకసారి విజయనగర సామ్రాజ్యంలో భయంకరమైన కరువు వచ్చింది. వర్షాలు అస్సలు కురవలేదు. దానికి తోడు ఎండలేమో మండిపోయాయి. దాంతో బావులలోను, పంపుల్లోను నీళ్ళు ఎండిపోయాయి. ఎప్పుడూ నీటితో నిండుగా ఉండే బావులలో నీళ్ళు బాగా లోపలికి వెళ్ళిపొయాయి.

తెనాలి రామలింగడి ఇల్లు తుంగభద్రానది ఒడ్డున ఉన్న ఆయన ఇంట్లో కూడా బావిలో నీళ్ళు బాగా లోపలికి పోయాయి. దాంతో నీళ్ళు తోడటం చాలా కష్టం అయిపోయింది. నీళ్ళు త్రాగటానికి, స్నానం చేయడానికి, వంట చేసుకోవడానికి ఏదో ఒక విధంగా నీళ్ళు తోడుకోసాగారు. కానీ వాళ్ళింట్లో ఉన్న తోటకి నీళ్ళు పెట్టేదెలా?

తోటకి ఎట్లా నీళ్ళు పెట్టాలా అని తెనాలి రామలింగడు ఆలోచిస్తూ కూర్చున్నాడు. మొక్కలు చూస్తేనా ఎండిపోతున్నాయి. బావిలో నీళ్ళేమో ఎక్కడో అడుగుకి ఉన్నాయి. తోటంతా నీళ్ళు పెట్టాలంటే బోలెడు నీళ్ళు కావాలి. అందుకోసం చాలా మంది కూలీలను పెట్టాలి. వాళ్ళకి బోలెడంత ధనం ఇవ్వాలి. ఇట్లా అలోచించుకుంటూ ఉండగా రామలింగడికి తన ఇంటికి కొంచెం దూరంలో ముగ్గురు మనుషులు నిలబడి ఏదో మాట్లాడుకోవడం కంపించింది.

ఎవరు వాళ్ళు? అనుకుంటూ కాసేపు తన ఆలోచనలను మర్చిపోయి వాళ్ళవంక చూడసాగాడు రామలింగడు వాళ్ళ ముగ్గురూ రామలింగడి ఇంటివైపు చూస్తూ ఏదో మాట్లాడుకోవడం కూడా రామలింగడు గమనించాడు.

'వాళ్ళను చూస్తే దొంగల్లా ఉన్నారు. వాళ్ళ వాలకం చూస్తుంటే ఈ రాత్రికి మా ఇంటికి కన్నం వేసేలా ఉన్నారు. అని అనుకున్నాడు. వెంటనే తన కొడుకుని పిలిచి ఇలా చెప్పాడు "అబ్బాయి ఈ సంవత్సరం వర్షాలు సరిగా కురవకపోవడం వలన కరువు పరిస్థితులు నెలకొన్నాయి. తినడానికి తిండి లేక చేసేందుకు పని దొరకక చాలా మంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఆవిధంగా ఈ రాజ్యంలో దొంగల బెడద ఎక్కువయ్యింది. కాబట్టి మన ఇంట్లో ఉన్న నగలు, డబ్బు అన్నీ మనం ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెను తీసుకుని వెళ్ళి బావిలో పడేద్దాం. అప్పుడైతే దొంగలకు ఏమాత్రం అనుమానం రాదు. పైగా వాళ్ళు మన ఇంటికి దొంగతనానికి వచ్చినా కూడా వాళ్ళకి మన ఇంట్లో వస్తువులేమి కంపించవు" అన్నాడు.

తెనాలి రామలింగడు ఈ మాటలు కావాలనే గట్టీగా అన్నాడు. తన మాటలు దొంగలకు వినిపించాలనే కొంచెం గట్టిగా అన్నాడు.

రామలింగడు ఏదైతే అనుకున్నాడో అదే జరిగింది. తెనాలి రామలింగడు చెప్పేదంతా దొంగలు విన్నారు. అనుకున్నట్టుగానే ఇంట్లో ఉన్న నగలు, బంగారు నాణాలు వెండి సామాన్లు ఇంకా విలువైనవి ఏవైన ఉంటే అవి అన్నీ తీసుకుని వచ్చి ఓ ట్రంకు పెట్టెలో పెట్టి ఆ పెట్టెను బావిలో పడేసారు.

చాటునుంచి దొంగలు ఇదంతా చూసారు. అంతే ఆ రాత్రికి తెనాలి రామలింగడు ఇంటికి దొంగతనానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు.

అనుకున్నట్టుగానే రాత్రికి ఊరు సద్దుమణిగాక ఆ దొంగలు ముగ్గురు తెనాలి రామలింగడు ఇంటికి వచ్చారు. ఒక్కొక్కరే జాగ్రత్తగా బావిలోకి దిగారు.

బావిలోకి దిగగానే పెట్టె కనిపిస్తున్నది. దానిని తీసుకుని ఎంచక్కా వెళ్ళిపోవచ్చు అని దొంగలు అనుకున్నారు.

కానీ బావిలో అంతా చెత్త, చెదారం నిండి ఉంది. పిచ్చి మొక్కలు, రాళ్ళతో నిండి ఉంది. అందువలన ముందుగా బావిని శుభ్రం చేయాల్సి వచ్చింది. బావిలో పెరిగిన పిచ్చి మొక్కలు పీకేసి, చిన్నచిన్న రాళ్ళు అన్నీ తొలగించేసారు. అప్పటికి కూడా వాళ్ళకు నగలు ఉన్న పెట్టె కంపించలేదు.

"ఇప్పుడేం చేధ్ధాం ?" మిగిలిన ఇద్దరినీ అడిగాడు ఒకదొంగ.

"అసలు నిజంగా వాళ్ళు పెట్టె పడేసారంటావా?" తన సందేహాన్ని వెలిబుచ్చాడు మరొక దొంగ

"ఒరేయ్! మీవన్నీ పిచ్చి అనుమానాలు. వాళ్ళు నగలు ఉన్న పెట్టెను తీసుకుని వెళ్ళి బావిలో పడేయడం మనం చూసాం కదా!

"అవును" అని మిగిలిన ఇద్దరూ అంగీకరించారు.

"మరి అలా అయితే తప్పకుండా ఈ బావిలోనే ఆ నగల పెట్టె ఉండి ఉంటుంది కదా!"

"నిజమే" అన్నారు మిగిలిన ఇద్దరు దొంగలు.

"అలా అయితే ఇలా కబుర్లతో కాలక్షేపం చేసే బదులు వెతుకుదాం. తప్పకుండా మనకు నగలపెట్టి దొరుకుతుంది. మనం ఇలాగే కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఉంటే తెల్లారిపోతుంది. మనందొరికిపోతాం.." అన్నాడు.

"సరే..ఇప్పుడేం చేద్దాం" అడిగాడు ఒక దొంగ.

"పెట్టె చాలా బరువుగా ఉండటం వలన బావి అడుగుకి వెళ్ళిపోయి ఉంటుంది. కాబట్టి మనం ఇంక బావిలోపల ఉండి చేసేదేం లేదు. పైకి వెళ్ళి నీళ్ళన్నీ తోడి పోద్దాం. నీళ్ళు అన్నీ తోడిపోస్తే పెట్టె ఎక్కడ ఉందో మనకు కనిపిస్తున్నది. అప్పుడు ఆ పెట్టెను తీసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది" అని సలహా ఇచ్చాడు ఒకదొంగ.

మిగిలిన దొంగలు ఇద్దరూ అందుకు ఒప్పుకున్నారు.

ముగ్గురు దొంగలు బావిలోంచి పైకి వచ్చేసి నీళ్ళు తోడటం మొదలు పెట్టారు. వాళ్ళలా నీళ్ళు తోడి పోస్తుంటే తెనాలి రామలింగడు, ఆయన కొడుకు ఇద్దరూ కలిసి చాటుగా ఉండి మొక్కలకు పాదులు చేసారు.

ఈవిధంగా దొంగలు చాలాసేపు నీళ్ళు తోడుతూనే ఉన్నారు. చివరికి వాళ్ళ శ్రమఫలించింది. బావిలో అట్టడుగున ఉన్న నగలపెట్టె దొంగలకు కంపించింది.

దొంగలలో ఒకడు బావిలో దిగి ఆ నగలపెట్టెకు తాడు కట్టాడు. మిగిలిన దొంగలు ఇద్దరూ పెట్టెను జాగ్రత్తగా పైకి లాగారు. వాళ్ళు నగలపెట్టెను బావిలోంచి పైకి తీయాలన్న ఆ ఖంగారులో, ఆ హడావిడిలో తెల్లారిపోయిన సంగతిని కూడా గమనించలేదు. ఈ లోగా తెనాలి రామలింగడు భటులను పిలిపించి దొంగలను పట్టుకోమని చెప్పాడు. అంతే! వాళ్ళు దొంగలను పట్టుకున్నారు.

చూసారా పిల్లలూ! తెనాలి రామలింగడు ఎంత తెలివి కలవాడో...!?

ఎప్పుడైతే దొంగలు తన ఇంటిని దోచుకోవాలని పథకం వేసుకుంటున్నారని రామలింగడికి అర్థం అయ్యిందో అప్పుడే రామలింగడు ఓ పథకం వేసుకున్నాడు. ఎలాగూ తన తోటకు మనుషులను పెట్టి నీళ్ళు పెట్టించాలనుకున్నాడు కదా! ఆ పనేదో ఈ దొంగలచేతనే చేయిస్తే సరిపోతుంది అని రామలింగడికి అంపించింది.

వెంటనే లోపలికి వెళ్ళి...కొడుకుతో నగలన్నీ ఒక పెట్టెలో పెట్టి బావిలో పడేద్దాం. రాజ్యంలో దొంగల బెడద ఎక్కువగా ఉంది. ఆ బెడద తగ్గాక బావిలోంచి నగల పెట్టెను తీసుకుందాం అని చెప్పాడు.

నిజంగానే దొంగలు ఆ మాటలు విన్నారు. తెనాలి రామలింగడు ఆయన కొడుకు కలిసి నగల పెట్టెను బావిలో పడేయడం చూసారు. ఆ నగల పెట్టెలో నగలు పెట్టారని దొంగలు అనుకున్నారు. కానీ తెనాలి రామలింగడు ఆ నగల పెట్టెలో దొంగలు అనుకున్నట్టుగా నగలు పెట్టలేదు. చిన్న చిన్న రాళ్ళు పెట్టాడు. కానీ దొంగలు మాత్రం పెట్టెలో నగలు ఉన్నాయని అనుకున్నారు. అందుకే బావిలో దిగి ముందుగా బావిని శుభ్రంచేసారు.

బావిలో ఉన్న నీళ్ళని తోడిపోసారు. ఎంతో కష్టపడి పెట్టెను పైకి తీసారు. ఆ సమయానికల్లా తెల్లారిపోయింది. భటులు వచ్చి దొంగలను పట్టుకున్నారు. ఇదీ జరిగింది...

ఈ సంగతంతా తెనాలి రామలింగడు రాజుగారికి చెప్పాడు.

రాజుగారు ఇదంతా వినగానే ఒక్కసారిగా పెద్దపెట్టున నవ్వేసాడు. "నిజంగా నీ తెలివి తేటలు అమోఘం. నీ ఇంటికి దొంగతనానికి వచ్చిన వాళ్ళతో నువ్వు చెట్లకి నీళ్ళు పెట్టించావా?" అంటూ నవ్వాడు.

తెనాలి రామలింగడు "అవును మహారాజా!" అన్నాడు. దేశంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్న మాట నిజమే. అలా అని అందరూ దొంగతనాలు చేస్తామంటే ఎలా? వాళ్ళకి గుణపాఠం చెప్పేందుకే ఆ విధంగా చేసాను." అని చెప్పాడు.
=================================================

పరివర్తన

పూర్వం ఒకప్పుడు సత్యధర్మి అనే రాజు పాలిస్తూండేవాడు. పేరుకు తగినట్టుగా ఆ రాజు మిక్కిలి ఔదార్యవంతుడు. న్యాయశీలుడు. మంచి దైర్యశాలి. ఎప్పుడూ తన రాజ్యంలో ప్రజల అవసరాలను తీర్చి వారి సుఖసౌఖ్యాలను పాటుపడుతూండేవాడు. ప్రజలకు ఎటువంటి అపాయం రాకుండా రక్షిస్తూండేవాడు. వారివారి తాహతులకు తగినట్లుగా సహాయం చేస్తూ ప్రజలకు ఉత్సాహం కలిగించేవాడు. రాజ్యం శాంతి భద్రతలతో, సకల సౌభాగ్యాలతో తులతూగుతూండేది ప్రజలు ఎప్పుడూ రాజు మంచితనాన్ని పొగుడుతుండేవారు.

ఒకరోజు సాయంకాలం ఆ రాజు ఉద్యానవనంలో విహరిస్తూ దగ్గరగా ఉన్న అడవిలోకి ప్రవేశించాడు. ఆ అడవి రకరకాల చెట్లతో దట్టమై అతి సుందరంగా ఉంది. ప్రకృతి సౌందర్యానికి రాజు ముగ్దుడై ఆనందిస్తున్నాడు. కొంతసేపటికి ఆ రాజుకి ఆకలివేసింది. దగ్గరగా ఉన్న ఒక ఆశ్రమం చేరాడు. అక్కడ ఒక సాధువు నివసిస్తున్నాడు. ఆ సాధువును సమీపించిన రాజు "ఓ సాధువుంగవా ! ఇక్కడ ఇన్ని వృక్షాలు ఫలాలతో క్రుంగిపోతున్నాయి. ఏ చెట్టు పళ్ళు మధురంగా, రసవంతంగా ఉంటాయి? ఏ చెట్టు పళ్ళు చేదుగా విషమయమై ఉంటాయి? ఏ పళ్ళు తినాలి? ఏవి తినకూడదు?" అని అడిగాడు.

సాధువు "ఓ స్నేహితుడా ఇక్కడ నీకిష్టమైన పళ్ళు నీవు తినవచ్చు. సత్యధర్మి ధర్మరాజు వంటివాడు. అతడి మంచితనంవల్ల ఈ రాజ్యంలోచేదుపళ్ళు అనేవి లేనేలేవు. రాజు చిరంజీవి అగుగాక ఆ వేప చిగుళ్ళు మధురాతిమధురమైన ద్రాక్షపళ్ళులా ఉంటాయి. పుల్లటి చింతపండు పండిన మామిడిపండులాగా తియ్యగా ఉంటుంది. ధర్మాన్ని రక్షించే వారిని ధర్మం రక్షిస్తుంది" అన్నాడు.

వెంటనే సత్యధర్మి కొన్ని వేప చిగుళ్ళు కోసి తిన్నాడు. ఆశ్చర్యం అని మధురరసం ఉట్టిపడే ద్రాక్షపళ్ళులా ఉన్నాయి. చింతపండు తిని చూశాడు. అతి తియ్యని మామిడిపండులా ఉంది. రాజు ఎంతో సంతోషపడ్డాడు. ఆనందంతో ఊరివైపు బయలుదేరి వచ్చాడు.మనస్సులో అహంకారబీజం మొలకెత్తింది. "నేనెంతో గొప్ప రాజును. ప్రపంచంలో నాతో సమానమైన రాజు ఎవ్వరు? ఆహా నా కీర్తి నాలుగు దిక్కులా వ్యాపించింది" అనుకున్నాడు.

రాజు అహంకార గర్వంతో రాజ్యపాలనను అశ్రద్ధచేయడం ప్రారంభించాడు. ప్రజల కష్ట సుఖాలను గుర్తించడంలేదు. సదా త్రాగుతూ, తింటూ, నిద్రపోతూ కాలం గడపడం ప్రారంభించాడు. ప్రజలకు ఆశ్చర్యం కలిగింది. ఎక్కడ చూసినా రాజ్యంలో అల్లరులు, దోపిడీలు, దొంగతనాలు, కొట్లాటలు. పంటలు పండడంలేదు. అనావృష్టి ప్రబలిపోయింది అయినా రాజు ప్రవర్తనలో మార్పురాలేదు. తుచ్చసుఖాలతో ఆనందపడిపోతున్నాడు.

ఒకరోజు తిరిగి రాజు విహారానికి బయలు దేరాడు. పూర్వం వెళ్ళిన వనంలోకే వెళ్లాడు. పూర్వం చూసిన ఆశ్రమానికే వచ్చాడు. అప్పుడు చూసిన ఆశ్రమానికే వచ్చాడు. అప్పుడు చూచిన సాధువునే చూచాడు. తన గొప్పతనాన్ని వినడానికి కుతూహలపడుతున్నాడు. సాధువు వీపుపై తట్టి "ఓ మానవా వనంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? నన్ను ఏ పళ్ళు తినమంటావు. వేపాకు తినమంటావా? చింతపండు తినమంటావా??"అని అడిగాడు.

సాధుపుంగవుడూ నిర్లక్ష్యంగా "రాజ్యమంతా చెడిపోయింది. రాజు ప్రజల మంచి చెడ్డలను గ్రహించడం లేదు. రాజ్యంలో కరువు ఏర్పడింది. వానలు లేవు. తిండి గింజలు లేవు. పాపం పెరిగిపోయింది. ఏ పండు చూచిన పుచ్చు, పురుగు మధురమైన మామిడిపండు మట్టిముద్దలా ఉంటూంది. ప్రజలు ఈ రాజ్యాన్ని వదులుకుని ఎక్కడికైనా పోదామని తహతహలాడిపోతున్నారు" అన్నాడు. రాజు విమర్శకు ఉలిక్కిపడ్డాడు. నిట్టూర్పు విడిచాడు. అణకువతో నమ్రతతో సాధువు కాళ్ళపైబడి "ఆ పాపాత్ముణ్ణి నేనే. ఈ విపరీత పరిస్థితికి నేనే కారణం. అహంకారం ఆవరించుకుపోయింది. నన్ను రక్షించి ఆశీర్వదించు ప్రభూ" అని వేడుకున్నాడు.

సాధువు రాజును ఆశీర్వదించాడు. సత్యధర్మి నడవడి మారిపోయింది. రాజ్యాన్ని తిరిగి ధర్మయుక్తంగా పాలించడానికి ప్రారంభించాడు. సకాలంలో వర్షాలు పడ్డాయి. పంటలు పుష్కలంగా పండాయి. చెట్లు మధురమైన పళ్ళను ఫలింపచేసాయి. రాజ్యం సౌభాగ్యంతో వర్ధుల్లుతూంది. ఏ మూల చూసినా ప్రజలు రాజు గొప్పతనాన్ని గురించి చెప్పుకోవడం ప్రారంభించారు.

నీతి: ధర్మాన్ని రక్షించేవారిని ధర్మం రక్షిస్తుంది.

No comments: