Monday, February 21, 2011

నీతి కధలు 4

చీమ యుక్తి

అది ఒక పెద్ద చీమల బారు. పప్పు బద్దలను నోట కరుచుకొని, ఆ చీమలు వాటి కలుగులోకి పోతున్నాయి. చీమలు పట్టుకొని వస్తున్న ఆ పప్పులను చూడగానే ఓ తొండకు నోరు వూరింది. మెల్లిగా చీమల బారు పక్కగా చేరి చీమల నోట్లో వున్న పప్పు బద్దలను లాగుకొని తినడం మొదలు పెట్టింది. చీమలకు భయం వేసి, చెల్లా చెదురుగా తిరుగుతున్నాయి కంగారుగా! చీమల నాయకురాలు పెద్ద కండ చీమ, చీమల కంగారు చూసింది. గబగబా చీమల దగ్గరకు వచ్చి వాటికి సంజ్ఞ చేసి, దగ్గరలో వున్న ఓ కలుగు దగ్గరకు వెళ్ళి కూర్చుంది.

కండ చీమ సంజ్ఞ చిన్న చీమలకు ఎంతో ధైర్యం వచ్చింది. మళ్ళీ, పప్పు బద్దలను నోటకరచుకొని, తొండకు దొరకకుండా అవి కండ చీమ ఉన్న కలుగు దగ్గరకు చేరాయి, గుంపుగా!ఆ చీమల గుంపు దగ్గర బోలెడు పప్పులు ఒక్క సారిగా తినెయ్యవచ్చునని తొండ ఆ కలుగు దగ్గరకు చేరింది. చీమలను చెదరకొట్టడం మొదలు పెట్టింది.

కలుగు వెలుపల అలికిడి అవుతూ ఉండడం కలుగులో ఉన్న పాము గమనించింది. తొండను పట్టుకుంటే మంచి ఆహారం దొరుకుతుందని కలుగులోంచి అమాంతంగా తొండ మీదకు దూకి, తొండను నోట కరచుకొని కలుగులోకి దూరిపోయింది. ఇదంతా భయం భయంగా చూస్తూ వున్న చీమలకు ధైర్యం వచ్చి, కండ చీమ చుట్టూ చేరాయి. కండ చీమ యుక్తికి ఉబ్బి తబ్బిబ్బయ్యాయి!

'మన నోటి దగ్గర ఆహారాన్ని లాగుకొంటున్న తొండను దిగమింగింది పాము' అన్నట్లుగా గర్వంగా చూసింది కండచీమ! తన ఎత్తు ఫలించినందుకు

ఎంతో ఆనందించింది. అందుకే "ఉపాయం వుంటే అపాయం తప్పించు కోవచ్చును" అంటారు పెద్దలు.
___________________________________________________________________________

చేతకాని పని హాని

అది ఒక పెద్ద చెరువు. కొంతమంది పల్లె కారులు, చెరువులో వలలు విసురుతూ చేపలు పట్టు కొంటున్నారు. మధ్యాహ్నం దాకా చేపలు పట్టి, భోజనం వేళ అయినందున, వలలను గట్టు మీద ఆర బెట్టి ఇళ్ళకు వెళ్ళిపోయారు.

ఆ చెరువు గట్టు మీద ఓ చెట్టు వుంది. కొమ్మల్లో కూర్చుని వున్న కోతి పల్లె కారులు వలలు విసరడం చూసింది. పల్లెకారులు వలలను విసురుతూ వుంటే, చక్రాల్లా విచ్చుకొని ఆ వలలు నీళ్ళ మీద పడుతూ వుండడం కోతికి ఎంతో ముచ్చట కలిగింది. తాను కూడా అలా వలలను విసరాలని సరదా పుట్టింది. చెట్టు దిగి, అందులో ఒక వలను తీసి చెరువులోకి విసిరితే అది తన కాళ్ళకే చుట్టుకుంది. వలను విసరడం చేతకాక కాళ్ళకు చుట్టుకొన్న వలను తీసుకోవడానికి ప్రయత్నిచడంవలన, ఆ కోతి ఎంతో జంజాటన పడిపోయింది. ఆ జంజాటనతో వల అంతా దాని ఒంటి నిండా చుట్టుకొని పోయింది. కాళ్ళు చేతులు కట్టివేసినట్లు అయిపోయి కేరు కేరుమని అరుస్తూ గిలగిల కొట్టుకోసాగింది. ఇంతలో పల్లె కారులు అక్కడకి వచ్చారు. కోతి అవస్థ చూసి, జాలి కలిగి మెల్లిగా వలను వూడదీశారు.

అంతసేపు పడిన జంజాటనతో కోతి అలిసి పోయి, ఆ పక్కనే వాలిపోయింది! పల్లెకారులు కోతిని చూసి ఇలా అనుకున్నారు "ఏ పని అయినా తెలియకుండా చేయకూడదు, పని నేర్చుకోకుండా చేయడానికి పూనుకోకూడదు" పిచ్చికోతి మనషులు చేసినట్లు చేయబోయి, వలలో చిక్కుకుంది. ఇలాంటి వాటినే 'కోతిచేష్టలు' అంటారు, అని మెల్లిగా కోతిని లేవదీసి చెట్టు దగ్గరకు చేర్చారు.
_____________________________________________________________________________

జీతము ఇవ్వని యజమాని

పూర్వము ఒక పట్టణములో వినాయకరావు అనే వ్యాపారి వుండేవాడు. ఆయన పనివాళ్ళను పెట్టుకోవటం వారికి జీతము ఇవ్వకుండా ఏవో సాకులు చెప్పి పంపేవాడు. ఆయన జీవితంలో ఎవ్వరికీ జీతం ఇవ్వలేదు. ఒకసారి వినాయకరావు వద్దకు చిరంజీవి అనే కుర్రవాడు వచ్చాడు. పని కావాలంటూ అడిగాడు. పనివాడులేక ఇబ్బందిగానే వుంది వినాయకరావుకి. తాను చెప్పిన పని చెయ్యాలనీ, చెయ్యకపోతే జీతం ఇవ్వననీ ముందే చెప్పాడు వినాయకరావు. చిరంజీవి చెప్పిన పని సవ్యముగానే పూర్తి చేసేవాడు. నెలరోజులు పూర్తి కావటానికి ఒకరోజే మిగిలింది. వినాయకరావుకి ఏంచెయ్యాలో ఎలా చెప్పి జీతం తీసుకోవాలని ఎదురు చూస్తున్నాడు.

ఆ రోజున అక్కడికి ధనవంతులు వచ్చారు. వచ్చిన వాళ్ళు బాగానే కొనుగోలు చేశారు. ఆ ఆనందములో వినాయకరావు చిరంజీవితో అందరికీ డ్రింక్ తీసుకురా అన్నాడు. యజమాని మాట ప్రకారము అందరికీ డ్రింక్‌లు తెచ్చి ఇచ్చాడు. అందరూ త్రాగివెళ్ళారు. ఇంకా రెండు డ్రింక్‌లు ఉన్నాయి. ఈ రెండు డ్రింక్‌లు ఎవరికి? నిన్ను డ్రింక్‌లు తెమ్మన్నానుకానీ వాళ్ళకి ఇవ్వమన్నానా అంటూ నీకు ఈ నెల జీతం ఇవ్వను అన్నాడు వినాయకరావు. ఇంతలో వెనక్కి వెళ్ళిన ధనవంతులు రావటం ఆ సంభాషణ వినడం వలన చిరంజీవి నెల జీతం తాము ఇస్తామనిచెప్పి, అతని వద్ద కొనుగోలు చేసిన కొన్ని వస్తువులు బాగాలేవని చెప్పి తిరిగి ఇచ్చివేశారు. వినాయకరావు గురించి ఆ ధనవంతులు అందరివద్దా చెప్పటం వల్ల అతని వ్యాపారము పూర్తిగా దెబ్బతినింది.

నీతి: ఎవ్వరిని ఎప్పుడూ మోసం చెయ్య కూడదు.
____________________________________________________________________________________

జ్ఞానోదయం

వేసవి సెలవులు ముగియగానే తిరిగి పాఠశాలలు తెరిచారు. పాత కొత్త విద్యార్థులతో పాఠశాల కళకళలాడసాగింది. ఐదో తరగతి చదువుతూ పాఠశాలకు డుమ్మా కొట్టిన అనిల్ పుస్తకాల సంచిని తగిలించుకొని తన చిట్టి తమ్ముడిని వెంట బెట్టుకొని పాఠశాలలోకి అడుగుపెట్టాడు.

అనిల్‌ని చూడగానే ఆనందంగా సత్యం మాస్టారు బాబూ! అనిల్ ప్రభుత్వ ఉత్తర్వులమేరకు వేసవిలో పాఠశాల పెట్టి నీలాంటి బడి మానేసిన పిల్లలకు పాఠాలు చెప్పడం మేలే అయ్యింది. తిరిగి పాఠశాల తెరవగానే వారి వారి స్టాండర్డ్‌ను అనుసరించి పాఠశాలలో చేరుతున్నారు. నువ్వు అందుకేగా వచ్చింది అన్నాడు. మాష్టారు! నా సంగతేమో గాని, నా చిట్టి తమ్ముణ్ణి ఆశీర్వదించండి, వీడి పుట్టిన రోజు ఈ రోజే! అన్నాడు స్వీట్స్ తమ్ముడి చేత ఇప్పించి. మనస్పూర్తిగా ఆశీర్వదిస్తూ వెయ్యేళ్ళు వర్ధిల్లు బాబూ! అన్నాడు సత్యం మాస్టారు. అంతే! అనిల్ ఆ మరుక్షణం తన తమ్ముడిని ఒకటో తరగతిలో కూర్చుండబెట్టి ఇంటి ముఖం పట్టాడు. తన అంచనా తప్పవడంతో సత్యం మాస్టారు, అనిల్‌ని వెనక్కి పిలిచి అనిల్ నిన్ను - నీ వాలకాన్ని చూసి తిరిగి పాఠశాలలో చేరి బాగా చదువుకోవడానికి వచ్చావనుకొన్నానే! బడిలోచేరి చదువుకోవా? అన్నాడు.

నాకూ చదువుకోవాలనే ఉంది మాష్టారు. కాని కుటుంబ పరిస్థితులు సహకరించడంలేదు. యాక్సిండెంట్‌లో నాన్న పోగానే అమ్మ ఏకాకి అయ్యింది. బంధువుల సాయం అంతంతమాత్రమే! నోటికింత ముద్దపెట్టే పొలాన్ని, పాడి గెదెలను చూసుకుంటూ అమ్మకి సాయంగా ఇంటి పట్టునే ఉంటున్నాను. అన్నాడు అనిల్. దాంతో అనిల్‌ని అర్థం చేసుకొన్న సత్యం మాస్టారు బాబూ! అనిల్ నీకు నేను చదువు చెబుతాను. రాత్రి పాఠశాలకు రా! ఈ రోజుల్లో చదువు ఎంతో అవసరం! పట్టాల కోసం, ఉద్యోగాల కోసం అనుకోవడం పొరపాటు. విద్య మన జీవితాలకో వెలుగు! అన్నాడు. ఆ మాటలతో జ్ఞానోదయం కలిగిన అనిల్ రాత్రి పాఠశాలకెళ్ళి చక్కగా చదువుకొని, సత్యం మాస్టారి సలహా సంప్రదింపులతో ఎన్నో పరీక్షలు రాసి పాసై ఒక ఉద్యోగస్తుడయ్యాడు.
_________________________________________________

డాబుసరి వేషాలు

తుంగభద్ర వొడ్డున పెద్ద అడవి. అడవిలో చెప్పలేనన్ని రకరకాల పక్షులు. వసంత ఋతువులో ఆ అడవి అందం చూడాలి! ఇంతా అంతా అనికాదు ఎంతో అందం! అంతకుమించిన ఆనందంతొ పక్షులు కలకలలాడుతూ ఉల్లాసంగా ఉండేవి. ఏటేటా వసంత ఋతువులో అడవి పక్షులన్నీ కలిసి పెద్ద పండగ చేసుకొనేవి. ఆ పండగలోనే తమ కొక 'పెద్ద' ని యెంచుకొనేవి. ఒక పండగకు పక్షులు వరుణుణ్ణి రావలసిందని ఆహ్వానించాయి. మబ్బు గుర్రాల్ని కట్టుకుని గాలిరథం యెక్కి వరుణుడు వచ్చాడు. మబ్బుల్ని చూస్తే చాలు నెమళ్ళు పురివిప్పి నృత్యం చేస్తాయి. ఆ నృత్యం కళ్ళారా చూడవలసిందే!

పక్షులు ఆ ఏటికి తమ పెద్దగా నెమలిని యెంచుకొన్నాయి. వరుణుడు చాలా సంతోషించాడు. 'నెమలిని యెందుకు యెన్నుకొన్నారు? ' అనడిగింది బొంతకాకి. 'అందచందాలున్నవి కనుక' అని జవాబిచ్చాయి పక్షులు. మరుసటేడు పండుగకు సూర్యుడు అతిథిగా వచ్చాడు. ఆ ఏడాది పెద్దగా పక్షులు కోకిలను యెంచుకున్నాయి. కోకిలపాట యెంత తియ్యగా ఉంటుందో ఎవరికి తెలియదు? సూర్యుడు సంతోషించాడు. కాని, బొంతకాకి గొంతులో పచ్చిమిరపకాయ పడ్డట్టు అయింది. గురగుర లాడింది నిరుడంటే నెమలి అందగత్తె అన్నారు. మరి కోకిల? తనకన్న అందగత్తె కాదు కదా? తనలో తాను గొణుక్కున్నది.

"ఏం చూసి కోకిలను యెంచుకొన్నారు?" ఉక్రోషం కక్కుతూ అడిగింది బొంతకాకి. పక్షులు నవ్వాయి. 'దాని కంఠం ఎంత కమ్మగా ఉందో చూడు! అందుకనే పెద్దగా యెంచుకొన్నాం' అని జవాబిచ్చాయి. బొంతకాకి తెగ గొణిగింది. వచ్చే వసంత ఋతువు నాటికి యేమైనా సరే, తనే పెద్ద కావాలని నిశ్చయించుకొంది. సరే! వసంత ఋతువు రానేవచ్చింది. ఈసారి పక్షులు తమ అతిధిగా చంద్రుణ్ణి పిలిచాయి. నక్షత్రాల రథం ఎక్కి చంద్రుడు వచ్చాడు. పండగ మంచి జోరుగా ఉంది. అందరూ ఒక చోటుకు చేరారు. పెద్దని యెంచుకోవలసిన సమయం.

ఇంతలో ఒక వేపునించి ఒక చిత్రమైన పక్షి సభలో ప్రవేశించింది. వింత వేషం! పొడుగాటి తోక, రెక్కల నిండా తెల్లని మెత్తటి యీకలు, నెత్తిమీద వింత జుట్టు. కాని అది నెమలీ కాదు, హంసా కాదూ, కోడి కాదు. పక్షులన్నీ యీ వింత పక్షిని చూసి నోరు తెరిచాయి. అది పెద్దను యెంచుకోవలసిన సమయం మరి. 'నెమలికన్నా అందమైన పక్షిని. అందుకని నేనే పెద్దను!' అంది కొత్త పక్షి. నెమళ్ళు తల వంచాయి. మిగతా పక్షులు నోరు మెదపలేదు.

'కోయిలలకన్నా చక్కగా పాడగలను. అందుకని నేనే పెద్దను!' అంది కొత్త పక్షి. కోయిలలు తలలు వంచాయి పక్షులు మాత్రం ఏమంటాయి. ' ఒక పాట పాడి వినిపించు ' అని అడిగే దైర్యంకూడా లేదు. 'ఊఁ... ఏకగ్రీవంగ నన్నే పెద్దగా యెంచుకోండి! ' అంది కొత్త పక్షి మంచి డాబుసరిచేసి. పక్షులు నోరెత్తకుండ రెక్కలు విప్పి అంగీకారం తెలియచేయడానికి సిద్దమయ్యాయి. ఇంతలో హంస ముందుకువచ్చింది. ఇంతసేపు అది చంద్రుడితో ఆడుకుంటోంది. కొత్తపక్షి డాబు దర్పాలు చూసి అనుమానించింది. హంస అసాద్యురాలు, వింతని కనిపెట్టింది.

' అయ్యా! ఈ కొత్తపక్షిగారిని పెద్దగా యెంచుకొవడానికి అభ్యంతరంలేదు. మాంచి డాబుసరిగా ఉన్నరు. ఇంత దర్జా గలవారు మనకు పెద్ద కావడం చాలా సంతోషం. కాని, చిన్న మనవి!... అంటూ హంస కొత్తపక్షి దగ్గరకంటా వెళ్ళింది. కొత్తపక్షి తోకని పట్టి గుంజింది. చిత్రం... ఎక్కడ ితోక అక్కడ రాలిపోయింది! కొత్త పక్షి తల నేలకు వంచింది. కొత్తపక్షి రెక్కల్ని దువ్వింది పెట్టుడు ఈకలు జారి పోయాయి. నెత్తిమీంచి జుట్టులాగేసింది. తీరాచూస్తే... అది బొంతకాకి!

బొంతకాకి ఎలాగో పెద్దరికం సంపాదించాలని అడవిలో అక్కడక్కడా రాలిపడిన ఈకలన్నీ తగిలించుకుంది. డాబుసరి వేషం వేసుకుని వచ్చింది. కాని, హంస తెలివితేటల వల్ల అసలురంగు బయటపడింది. తర్వాత పక్షులు బొంతకాకిని అడవినుంచి తరిమేశాయి. హంసను ఆ ఏటికి తమ పెద్దగా ఎంచుకున్నాయి. చంద్రుడు చాలా సంతోషించాడు. నాటికి నేటికి ఆ బొంతకాకి జాడ ఎవరికీ తెలియలేదు.
____________________________________________________________________________________

తగని గర్వం

చీమలు దూరని చిట్టడవిలో ఓ సింహం ఉంటూ ఉండేది. సహజంగానే బలపరాక్రమాలున్న జంతువు. మంటకు గాలి తోడైనట్లు సింహానికి అంతులేని అహంకారము ఉంది. అడవిలో బ్రతికే తదితర మృగాలన్నిటి చేతా అడ్డమైన చాకిరీ చేయించేది. సింహం ఆడిందే ఆట, పాడిందే పాట. ఇలా ఉండగా చిట్టడవికి చెప్పలేనంత కరువొచ్చింది. ఆ కరువుకి తట్టుకోలేక మృగాలన్నీ తలో దోవా పారిపోయాయి. మృగాలకి రాజయితే మాత్రం సింహానికి తిండితిప్పలు ఎక్కడివి? బెట్టుగా అక్కడే కొన్నాళ్ళ పాటు నీల్గుతూ ఉంది. కాని, అది ఆఖరికి కాకులు దూరని కారడవికి ప్రయాణమై వెళ్ళింది. కాకులు దూరని కారడవిలో ఓ నక్కా, గాడిదా, ఎద్దూ, మంచి స్నేహంగా నివాసముంటున్నాయి. వాటి వాటి తిండితిప్పలు వేరయినా కలసిమెలసి ఉంటున్నాయి.

సింహం అక్కడికి చేరింది. తాను వలస వచ్చినా గర్వాన్ని వదలలేదు. కాకులు దూరని కారడవికి తానే రాజునని అంది. నక్కా, ఎద్దు, గాడిద - మూడింటితోనూ ఒక ఒడంబడికకు వచ్చింది. అందరూ కలిసి ఆహారాన్ని సంపాదించాయి. సింహం ఒక పక్క, తతిమ్మా జంతువులు ఒక పక్క కూచున్నాయి. సింహం ఎద్దు వేపు చూసి 'ఎలా పంచిపెడతావో పంచిపెట్టూ' అని అంది. ఆహారాన్ని నలుగురికి నాలుగు సమాన వాటాలు వేసింది ఎద్దు. సింహానికి కోపం వచ్చింది. ఎద్దు మీదకు దూకి పంజాతో చరిచింది. ఎద్దు చచ్చిపోయింది. నక్కా, గాడిదా లోలోపలే ఏడ్చాయి.

సింహం నక్క వైపు తిరిగి ఈ సారి నువ్వు పంచూ అని అంది. నక్క తెలివిగలది. చప్పున దండం పెట్టి ఆహారాన్ని పంచడం నాకు చేత కాదు! అని అంది. సింహం గర్వానికి అంతు లేకుండా పోయింది. 'సరే! నేనే పంచుతాను' అని ఆహారాన్ని మూడు వాటాలు చేసి ఇలా అంది :

'నేను మృగరాజుని కనక ఒక వాటా నాది రెండోవాటా మీతో పంచుకోవాలి కనక నాది!' అని అంటూ మూడో వాటా కాలు నొక్కి పెట్టి, 'దమ్ములుంటే మూడో వాటా తీసుకోండి!' అని అంది. కాని సింహం కాలి కింద ఆహారాన్ని లాక్కోడానికి ధైర్యం ఎవరికుంది? ఇలా దౌర్జన్యంగా మొత్తం ఆహారాన్ని సింహం కాజేసింది. తతిమ్మా జంతువులు ఆకలితో నకనకలాడాయి. ఐతే, సింహం ఒక్కటే ఆత్రంకొద్దీ ఆహారాన్ని మింగింది. ఎద్దుని చంపింది కదూ? దాన్ని కూడా మెక్కింది. తిండికి చిట్టడవిలో మొగం వాచిందో ఏమో, దొరికిందే చాలనుకుని తెగతిన్నది.

సింహానికి జబ్బుచేసింది. చేయదూ మరి! ఆ జబ్బు ముదిరి చచ్చేస్ధితికి వచ్చింది. ఇన్నాళ్ళు సింహంవల్ల బాధపడిన జంతువులు వచ్చి, కసిదీరా సింహాన్ని తిట్టి, తన్ని పోతున్నాయి. సింహం లేవలేకపోయినా గ్రుడ్లురిమి చూచి మూలిగేది. కాని, ఏ ప్రాణీ భయపడేది కాదు. 'బ్రతికి బాగుంటే పగదీర్చుకుంటా' ననేది. గ్రుడ్లురిమి చూడ్డంవల్ల కొన్ని జంతువులు యింకా భయపడుతున్నాయి.

ఓ రోజున గాడిద వచ్చింది.'నీవుకూడా తన్నిపోవడానికే వచ్చావా?' అని గ్రుడ్లురిమి చూసింది సింహం. 'ఇంకా గ్రుడ్లురుముతున్నావా మృగరాజా! చింత చచ్చినా పులుపు చావలేదే!' అంది గాడిద. సింహం మళ్ళా గ్రుడ్లురిమి చూసింది. గాడిద మళ్ళీ మాటాడకుండా వెనక్కి తిరిగింది. సింహం మొగాన్ని గురిచూసి వెనక కాళ్ళతో ఫెడీ ఫెడీ తన్నింది. దాంతో సింహం రెండు కళ్ళూ రాలిపడ్డాయి.

'ఇంత బతుకూ బతికి, ఆఖరికి గాడిద చేత కూడా తన్నులు తిని చావవలసి వచ్చింది. అయ్యో! నాదెంత దిక్కుమాలిన చావు?' అని ఏడ్చింది సింహం. కాని ఎవరికి జాలి?
______________________________________________________________________________

తగని సలహా

అనగా అనగా ఓ అడవి. అడవి అనగానే మీకు పులులూ, సింహాలు, పాములు, తోడేళ్ళు, పొడుగాటి చెట్లూ, ఎత్తైన గట్లూ గుర్తుకు రావొచ్చు. ఇవన్నీ ఉండే మాట నిజమే కాని, ఆ అడవిలోని కోతుల మందని గురించి చెప్పుకుందాం.

ఆ అడవిలో ఇష్టారాజ్యంగా కోతుల మంద కాపురం చేస్తున్నాయి. కడుపునిండా నిద్రపోయి, హాయిగా కాలక్షేపం చేస్తున్నాయి. ఇలా ఉండగా ఈ శీతాకాలంలో ఈ రోజున ఏం జరిగిందనుకున్నారూ! ఆ వేళ మరీ చలివేస్తోంది. బారెడు పొద్దుండగానే మంచు గడ్డల్లే అయిపోయింది! జిమ్ముమంటూ ఒళ్ళు బిగుసుకు పోతోంది. మనకంటే దుప్పట్లు ఉంటాయి. కోతులకేం ఉంటాయ్? 'ఏంచేద్దాం? ఏంచేద్దాం' అన్నాయి కోతులు. ఒక ముసలికోతి' చలి మంట వేసుకుందాం అని అంది. భేష్! భేష్! అన్నాయి. మంద మందంతా ఇంకేం తలో మూలకి వెళ్ళాయి. తలా ఒక గుప్పెడు ఎండు టాకులు, పుల్లలూ తెచ్చాయి. ఓ చెట్టు కింద పోగేశాయి. పెద్ద గుట్టయింది. ఓ మహా చక్కగా రాత్రి తెల్లార్లూ చలికాగొచ్చు అని అంది ఓ పండు ముసలి కోతి.

"ఊ చప్పున మంట వెయ్యండి" ఓ పడుచు కోతి అంది. మంట వెయ్యడానికి నిప్పేది?

* ఆకులున్నాయ్
* అగ్గి లేదోయ్
* అగ్గి లేందే
* మంట రాదోయ్
* మంట లేందే
* చలి వదలదోయ్

అని పాడింది ఒక ఆడ కోతి. అయితే అగ్గి నిప్పు తెండి ఎక్కడుందీ వెతకండి, వెతకండీ! నిప్పు కోసం తలో మూలకి బయల్దేరాయి. ఇంతలోకే పొద్దు గూకింది. అడవిలో మరింత చీకటి కదూ? ఆ చీకట్లో ఒక పొదమీదనుంచి మిణుగురు పురుగులు ఎగురుతున్నాయి. నల్లని చీకట్లో పచ్చని వెలుతురూ మిలమిలా తళతళా మిణుగురులు మెరిసెను నల్లని చీకట్లు తెల్లబడి పోయెను, మిణుగురుల్ని కోతులు చూశాయి. అదుగో నిప్పురవ్వ! 'ఊ పదండి తలో నిప్పురవ్వా తెద్దాం' అన్నాయి కోతులు. చప్పునపోయి తలో మిణుగురిని పట్టుకున్నాయి. గుట్ట దగ్గరకు వచ్చాయి. ఆకులు గుట్టలో మిణుగురుల్నికుక్కి మంట వెలిగించడానికి ప్రయత్నించాయి. కొన్ని ఊహూ అంటూ ఊదుతున్నాయి. మరికొన్ని కోతులు టేకు ఆకులు మన విసనకర్రలల్లే ఉంటాయి. వాటిని తెచ్చి విసురుతున్నాయి. ఉహు ఎంత శ్రమ పడినా ఆకులు గుట్ట రాజుకోలేదు. ఊదీ ఊదీ విసుగెత్తుతోంది. ఇదంతా ఎవరు చూస్తున్నారు చెప్పుకోగలరా చెట్టు కొమ్మమీద కూచున్న పాలపిట్ట చూస్తోంది. పాలపిట్ట చాలా మంచిది. కోతుల తెలివి తక్కువతనం చూసి జాలిపడి ఇలా అంది.

* అక్కలారా! అక్కలారా!
* నిప్పుకాది మిణుగురమ్మా
* మిణుగు రెప్పుడు మండదమ్మా
* మిణుగు రెప్పుడు వెలుగునంతే!

పాలపిట్ట పాటవిని కోతులు మండిపడ్డాయి. మాకు తెలియదట. ఈ పిట్టకు తెలుసట! అని కోపగించాయి. పాలపిట్టను గద్దిస్తూ కోతులు - నోరు ముయ్యవే పాలపిట్టా తెలిసినట్టు మహా చెప్పవచ్చావ్! నిప్పు సంగతి నీటి సంగతి నీకు తెలుసా? మాకు తెలుసా? అని అన్నాయి. పాపం, పాలపిట్ట మాత్రం తన గొడవ మానుకోలేదు. మళ్ళా అంది కదా

* నా మాట వినుడక్కలారా!
* అగ్గిగాదిది మిణుగురమ్మా!
* వెలుతురిచ్చే మిణుగురమ్మా!
* మిణుగు రెప్పుడు మండదమ్మా!!

కోతులికి పట్టరాని కోపం వచ్చింది. కూస్తంత పిట్ట తమని ఎగతాళి చేస్తోందని భావించాయి. ఏయ్ జాగ్రత్త అని బెదిరించాయి. కాని పాలపిట్ట మాత్రం పాడుతూనే ఉంది;

* నామాట విను డక్కలారా!
* అగ్గికాదిది మిణుగురమ్మా!"

కోతులు పిచ్చి కోపంతో పాలపిట్టను పట్టుకున్నాయి. తోక పీకేశాయి. చివరికి పీక నులిమి చెట్టుకేసి బాదాయి. పాల పిట్ట చచ్చిపోయింది. కోతులు ఎంత తన్నుకున్న ఆకులు గుట్ట మండలేదు. వాటికి చలి తీరలేదు. పాలపిట్ట మాట నిజమని గ్రహించనూ లేదు. తెలివి తక్కువ కోతిమందకు తగని సలహా చెప్పి ప్రాణము కోల్పోయిన పిట్టకథ ఇది.

నీతి: వారు ఎలాంటి వారో ఎవరో తెలుసుకోకుండా సలహాలు ఇవ్వకూడదు. ఇస్తే మనమే ప్రమాదంలో పడతాము.
______________________________________________________________

తగిన శాస్తి

అనగనగా ఒక పెద్ద అడవి వుండేది. ఆ అడవిలో ఒక గుర్రం, గేదె వుండేవి. అవి పక్క పక్కనే మేస్తుండేవి. ఒకే సెలయేటిలో నీళ్ళూ కూడా తాగేవి. కానీ వాటికి ఏనాడు పడేదికాదు. ఎప్పుడూ పోట్లాడుకునేవి. . నేను గొప్పంటే నేను గొప్పని బడాయిలు పోయేవి. ఎప్పటిలానే ఒక రోజు ఆ రెండూ పోట్లాడుకున్నాయి. కోపం ఆపుకోలేని గేదె తన కొమ్ములతో గుర్రాన్ని బాగా పొడిచింది. దాంతో గాయాలయ్యాయి. రక్తం కూడా ఎక్కువగానే కారింది. గుర్రం ఇది మనసులో పెట్టుకుంది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. అందుకే పక్కనే వున్న గ్రామానికి వెళ్ళింది. రామయ్య అనే రైతును కలిసి గేదెకు జరిగినదంతా చెప్పింది.

అంతా విని అయితే నేనేం చేయాలి? అని అడిగాడు రామయ్య. ఏమీ లేదు నువ్వు నామీద కూర్చొని ఆ గేదెను కర్రతో బాగా బాదాలి. అప్పుడు అది ఓడిపోతుంది. అంది గుర్రం కసిగా పళ్ళు నూరుతూ. మరి నాకేంటి లాభం అన్నాడు రామయ్య. లాభం లేకపోవటమేంటి! గేదెను కొట్టినప్పుడు పడిపోయి అది ఓడిపోతుంది కదా. అప్పుడు అది మన ఆధీనంలోనే వుంటుంది. నువ్వు ఎంచక్కా దాని పాలు తాగొచ్చు. పైగా దాన్ని వ్యవసాయానికి కూడా ఉపయోగించుకోవచ్చు అంది గుర్రం.

సరేనన్నాడు రామయ్య. అతను ఆ మరునాడే వెళ్ళి గేదెను బాగా బాదాడు. దాంతో గేదె గాయపడి చేతికి చిక్కింది. గేదె నీ దగ్గరకు వచ్చిందికదా ఇక నా కళ్ళెం వదిలేయ్ అంది గుర్రం.

అమ్మా! నేనెలా వదులుతాను? నీ వల్ల కూడా నాకు ఉపయోగమే కదా. ఎంచక్కా నీ మీద ఎక్కి స్వారీ చేయొచ్చు. వేరే వూళ్ళకు వెళ్ళొచ్చు. అంటూ తన ఇంటికి పట్టుకెళ్ళాడు రామయ్య. తను చేసిన పనికి గుర్రం సిగ్గుపడింది. తాము తాము చూసుకోక మధ్యలో స్వార్థపరుడైన మనిషిని తెచ్చినందుకు సిగ్గుపడింది. తగినశాస్తి జరిగిందని బాధపడింది.
___________________________________________________________


తప్పింపతరమా

సింగడి పేరు చెబితే పసిపిల్లలు కూడా ఏడుపు మానేస్తారు. సింగడి పేరు చెబితే పాములు కూడా పడగలు వాలుస్తాయి. సింగడి పేరు చెబితే సింహాలు కూడా తోకలు ముడుస్తాయి. సిరిపురం సింగడంటే గజదొంగలు కూడా తలలూపుతూ కిటికీలతో సహా మూసుకుంటారు. సింగడికి సిబ్బంది లేదు. తోటి దొంగలు లేరు. అతని సైన్యం అంతా అతనొక్కడే. చాలా తెలివితేటలుగా దొంగతనాలు చేస్తాడు. వేషాలు మార్చడం, భాషలు మార్చడంలో సింగడికి సింగడే సాటి. పగలంతా సందుకో వేషంలో తిరుగుతూ తను దొంగతనం చేయ్యాలనుకున్న యింట అనుపాన్లు, గుట్లు గ్రహిస్తాడు. నాలుగయిదు రోజులు ఆ ఇంటి వాళ్ళు తన వేషాన్ని మర్చిపోయేంత వరకూ మౌనంగా ఉండిపోతాడు.

ఆ తరువాత ఓ రాత్రి విజృంబించి తన చాకచక్యం చూపి మూడోకంటివాడికి కూడా తెలియకుండా ఆయింటిని దోచేస్తాడు. ఫలానా వారి ఇల్లు దోచుకుంటానని ముందు చెబుతాడు. అందరూ అప్పటికే బహు హెచ్చరికగా ఉంటారు. అయితే అర్థరాత్రి దాటాక ఓ కుంటివాడుగానో, గుడ్డివాడుగానో హెచ్చరికవున్న వారి దగ్గరికొచ్చి మీరంతా ఇక్కడున్నారు, అవతల మీ ఇల్లు కాలిపోతున్నది అని చెప్పేవాడు. దాంతో వాళ్ళు ఆదుర్థాగా అక్కడకు పరుగెడతారు. ఆ ప్రదేశం నిర్మానుష్యం అయిన తరువాత రెండూ మూడిళ్ళు దోచుకొని దొరికిన సొమ్ము మూట కట్టుకొని వెళతాడు. మళ్ళీ ఆ ఇళ్ళవాళ్ళు మోసగింపబడ్డామని తెలుసుకొని తిరిగి వచ్చేలోగా కలసిపోతాడు.

అయితే ప్రతిసారి అదే ఎత్తుగడ ఉపయోగించక కొత్త ఎత్తులు ఆలోచిస్తుంటాడు. ఇలా ఊళ్ళకి ఊళ్ళు దోచి చాలా డబ్బు కూడబెట్టాడు సింగడు. కోటి రూపాయలు సంపాదించిన తర్వాత అందమైన అమ్మాయిని పెళ్ళి చేసుకొని హాయిగా బ్రతకాలని వాడి ఆశ. ఆ ఊరు చేరి అది రెండో రోజు. ఆ వేషంలో తిరిగి, ఈ వేషంలో తిరిగి మాణిక్యంశెట్టి కొట్లకి పడగలెత్తాడని విని ఆ యింటి అనుపాసులు వెతుకుతున్నాడు. మాణిక్యంశెట్టి ఇంటికి ఆ ఉదయం ఒక సాధువు వచ్చాడు. శెట్టిగారు తమకి తమ కుటుంబానికి ఉన్న రకరకాల వ్యాధుల్ని గురించి చెప్పాడు. సాధువు కొంచెం తెల్లపొడిని ఇచ్చి ఈ రోజు ఈ పొడి వేసి వంటకాలు చెయ్యండి. అది తింటే మీ వ్యాధులు తగ్గిపోతాయి అని చెప్పాడు.

అలాగే ఆ పొడి వేసి వంటకాలు వండి తిన్న మాణిక్యంశెట్టి కుటుంబసభ్యులంతా మత్తుగా నిద్రపోయారు. సింగడు తన తెలివితేటలతో దొడ్డి తలుపు తెరచి యింట్లో ప్రవేశించాడు. నగదు, నగలు మూట కట్టుకుంటుండగా ఓ పక్క అద్దాల బీరువాలో అందంగా చేసి పెట్టిన లడ్డూలు కనిపించాయి. లడ్డూలు సింగడి బలహీనత. అందువల్ల ఆ బీరువా తెరచి అయిదారు లడ్డూలు గబగబా తిన్నాడు. అంతవరకే అతనికి తెలుసు. కళ్ళు తెరచి చూస్తే మంచానికి కట్టివేయబడి ఉన్నాడు సింగడు. నువ్వు యిచ్చింది మత్తుమందు అని తెలియక మేందాన్ని నేతిలో వేసి దాంతో అన్ని వంటకాలూ చేశాం. అయితే మత్తు ఆవరించకుంటుండగా నాకు అర్థమయింది. నేనేం చెయ్యలేకపోయాను. నువ్వు వస్తావని తెలిసి అతి కష్టం మీద ఆ నేతితో చేసిన లడ్డూలు ఈ అద్దాల బీరువాలో పెట్టి పారిపోయాను. అవి తిని నువ్వు తవ్వుకున్న గోతిలో నువ్వే పడ్డావు. తాడి తన్నే వాడి తల తన్నేవాడుంటాడని తెలుసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. కాసేపటిలోగా రక్షకభటులు వస్తారు. అంతవరకూ మరో లడ్డూ ఇవ్వనా అని శెట్టిగారు, అతని కుటుంబ సభ్యులు హేళనగా నవ్వారు. తేలుకుట్టిన దొంగలా మౌనంగా ఉండిపోయాడు గజదొంగ సింగడు.
___________________________________________________________________________

తెచ్చిపెట్టుకొన్న తిప్పలు

గోవిందప్ప కోనేట్లో కోటి రకాల కప్పలు ఉన్నాయి. బావురు కప్పలు, పచ్చ కప్పలు, వాన కప్పలు, గోండ్రు కప్పలు, చిరు కప్పలు ఇలా ఎన్నెన్నో రకాలు. అవన్నీ కలిసిమెలిసి బ్రతుకుతున్నాయి. ఎండా, వానా తేడా లేకుండా ఎరపొరుపులు రాకుండా ఎల్లకాలం చల్లగా జీవిస్తున్నాయి. చీకూచింతా లేకుండా హాయిగా కాలక్షేపం చేస్తున్నాయి.

కోనేటికి నాలుగు వైపులా రాతిమెట్లున్నాయి. సాయంత్రమయ్యే సరికి నగరంలో వాళ్ళంతా మెట్ల మీదకి చేరుకునేవాళ్ళు వెన్నెల రాత్రిళ్ళలో ఆ మెట్ల మీదే గడిపేవాళ్ళు. వాళ్ళు చేసే చర్చలు, వాదనలు కప్పలు వింటూ వుండేవి. రానురాను మనుషుల పద్ధతులన్నీ కప్పలకు అంటుకున్నాయి. కొంత కాలానికి కప్పలు సరికొత్త విషయం ఒకటి తెలిసింది. మనుషులు తమను పాలించడానికి ఒక 'రాజు' ని ఎన్నుకున్నారట! ఈ వార్త విన్నాక మనుషులకే రాజు అవసమైనప్పుడు తమకు మాత్రం ఎందుకవసరం లేదు? తమకూ ఓ రాజు కావాలి! అనే ఆలోచన రేకేత్తింది కప్పలకు. సూర్యుణ్ణి ప్రార్థించాయి కప్పలు. సూర్యుడు వచ్చాడు. 'ఏం కవాలి?' అనడిగాడు.

'మాకో రాజుని ఇవ్వు దేవా!' అనడిగాయి కప్పలు. 'ఇప్పుడు హాయిగానే ఉన్నారుగా! ఇంకా రాజెందుకు?' మనుషులకే రాజు ఉన్నప్పుడు మాకు మాత్రం ఉండొద్దా? అన్నాయి కప్పలు. 'పోనీ, మీలోనే ఒకరిని ఎంచుకోరాదూ?' అన్నాడు సూర్యుడు. 'ఉహు, మాకు కొత్త రాజే కావాలి!' అన్నాయి కప్పలు.

వాటి అమాయకత్వానికి సూర్యుడికి జాలి పుట్టింది. వెళ్ళిపోతూ, వెళ్ళిపోతూ పెద్ద జీలగబెండును కోనేట్లో వేశాడు. ఒకటి రెండు రోజులు జీలగబెండుకి దూరంగా వున్నాయి కప్పలు. బెదురు తీరాక బెండు మీదకి గెంతాయి. ఎలా గెంతినా బెండు ఉలుకూ పలుకూ లేదు. తనివితీరా గెంతి గెంతి 'ఇస్! రాజంటే ఇంతేనా?' అని అనుకున్నాయి. వాటికి నచ్చలేదు. మళ్ళా సూర్యుణ్ణి వేడుకున్నాయి వచ్చాడు. 'దేవా! మాకీ చచ్చురాజు పనికిరాడు. మరో కొత్త రాజుని ఇవ్వు అన్నాయి కప్పలు. 'మీది అమాయకత్వమో, మూర్ఖత్వమో తెలీకుండా వుంది. పోనీ, హాయిగా ఆడుకుంటారు కదా అని బెండుని ఇస్తే, కాదు కూడదంటున్నారు. అన్నాడు మందలింపుగా సూర్యుడు.

'ఇంతకన్నా మంచి రాజుని ఇవ్వు దేవా!' అన్నాయి కప్పలు. సూర్యుడు చాలా ఆలోచించాడు. కప్పల మీదనున్న జాలి వల్ల సూర్యుడు చంద్రుణ్ణి ఇచ్చాడు. కప్పలు కోరినప్పుడల్లా చంద్రుడు వచ్చేవాడు. ఆడుకొనేవాడు. కలిసిమెలసి తిరిగేవాడు. చల్లగా పండువెన్నెల ఇచ్చేవాడు. తినగా తినగా గారెలు చేదైనట్టుగా హాయిగా చల్లగా వున్న చంద్రుడంటే కప్పలకు అట్టే సంతృప్తి కలగలేదు. గొణుక్కుని మళ్ళా సూర్యుడిని ప్రార్థించాయి.

'ఎందుకు?' అనడిగాడు సూర్యుడు. 'ఎంతసేపూ పనికిమాలిన వాళ్ళనే రాజుగా యిస్తున్నావు దేవా! కాస్త కరుకైన వాళ్ళని యివ్వు అన్నాయి కప్పలు. 'మీరు మూర్ఖులు' రాజుని ఎవరూ కోరుకోరు. నేను మీకు స్నేహితుల్ని యిచ్చాను. ఐనా ఏం లాభం? వాళ్ళ మంచి చేదయిందీ అన్నాడు సూర్యుడు. 'ఏమైనా సరే, మాకు రాజు కావాలి! అని ఉబలాట పడ్డాయి కప్పలు. సూర్యుడికి విసుగెత్తింది. అనుభవిస్తే కాని తెలియదు అని అనుకున్నాడు. కొల్లేటి కొంగని రాజుగా యిచ్చి వెళ్ళిపోయాడు. జీలగబెండు, చంద్రుడులాగా కాకుండా నిబ్బరంగా గట్టుమీద కూచుంది. కొల్లేటి కొంగ బెట్టుగా ఉంది. ఇదంతా కప్పలకు గొప్ప లక్షణంగా కనిపించింది.

ఓహొ కొంగరాజా! నువ్వు చాలా గొప్పవాడివి. ఇంతకు ముందున్న రాజులు ఉత్త చచ్చు దద్దమ్మలు. నీ ఠీవి, గంబీరత అద్భుతం! మాకు అన్ని విధాలా నచ్చావు. చంద్రాయుధంలాంటి నీ ముక్కు ఒక్కటి చాలు మమ్ముల్ని పరిపాలించడానికి అన్నాయి కప్పలు. కొంగ ఏమీ మాట్లాడలేదు. కోనేటివైపు చూస్తూ కూచుంది. కప్పల పొగడ్త విని ఆనందించినట్టు తోచింది. ఆ మర్నాటినించి కొంగ ఒక్కొక్క కప్పను తినేయడం మొదలు పెట్టింది. కొద్దిరోజుల్లో కప్పలకు విషయం అర్థమయ్యింది. ఏ ముక్కును పొగిడాయే ఆ ముక్కే మృత్యువయింది. రోజురోజుకి కప్పల కుటుంబాలు నశించిపోయాయి. 'ఓ సూర్యుడా! మాకు రాజు వద్దూ, గీజూవద్దు! ఈ బాధల్ని తప్పించు' అని ఏడ్చాయి కప్పలు. కాని సూర్యుడు మళ్ళా కనబడలేదు. కొల్లేటి కొంగ రాజరికం పోనూలేదు.

No comments: