Saturday, February 26, 2011

నీతికధలు 22

కోతిగొప్పలు

ఒకరోజు కొందరు నావికులు సముద్రయాత్రకు బయలుదేరారు. వారు తమతోపాటు తమ పెంపుడు కోతిని వెంటబెట్టుకుని యాత్రను మొదలెట్టారు. వారు సముద్రం మధ్యలో ఉండగా ఒక భయంకరమైన ఉప్పెన వచ్చింది. ఆ ఉప్పెన ధాటికి అందరూ సముద్రంలోకి కొట్టుకుపోయారు. కోతి కూడా తాను మునిగిపోయానని అనుకునే సమయంలో ఒక డాల్ఫిన్‌ వచ్చి కోతిని తన వీపుపై ఎక్కించుకుంది.

కోతి, డాల్ఫిన్‌ ఇద్దరూ సురక్షితంగా ఒక దీవికి చేరుకున్నారు. కోతి... డాల్ఫిన్‌ వీపు మీది నుండి దిగి ఒడ్డుపై కూర్చుంది. డాల్ఫిన్‌... కోతితో, "మిత్రమా! నీకు ఈ ప్రదేశం తెలుసునా?" అని అడిగింది. అపాయం నుంచి గట్టెక్కి సురక్షితంగా ఉన్నానని రూఢీ చేసుకున్న కోతి, "ఈ ప్రదేశం నాకు తెలియకపోవడం ఏమిటి? ఈ దీవిని పరిపాలించే రాజు నాకు మంచి స్నేహితుడు. నీకోక విషయం తెలుసో లేదో! నేను ఒక రాజకుమారుడిని."

కోతి వ్యర్ధప్రెలాపనలు పేలుతోంది. ఆ దీవిలో ఒక్క జీవికూడా నివసించదని తెలిసిన డాల్ఫిన్‌కు చిర్రెత్తుకొచ్చినా సమ్యమనంతో, "ఓహో! నువ్వు రాజకుమారుడివి. కాని ఇప్పటి నుంచి నువ్వు రాజువన్నమాట!" అంది. కోతికి డాల్ఫిన్‌ మాటలు అర్ధంకాక "నేను రాజునెలా అవుతాను?" అని అడిగింది డాల్ఫిన్‌ను. ఒడ్డు నుంచి కోతికి అందకుండా దూరంగా వెళ్లిన డాల్ఫిన్‌. "చాలా సులభం. ఈ దీవిలో ఉన్న జీవివి నువ్వొక్కడివే కాబట్టి నీవే ఈ దీవికి రాజువు" అని సమాధానమిచ్చి కోతిని ఆ దీవిలోనే వదిలి వెళ్లిపోయింది.

నీతి : అబద్ధం చెప్పడం, గొప్పలకుపోవడం రెండూ నాశనానికి దారితీస్తాయి.
===============================

కూతురి సలహా

విజయేంద్రవర్మ ఆదర్శవంతుడైన రాజు. ప్రతి ఏటా తన పుట్టినరోజు నాడు పేదలందరికీ దానధర్మాలు చేసేవాడు. తన రాజ్యంలో భూమిలేని రైతులకు కొంత భుమినిచ్చి సాగుచేసుకోమనేవాడు. తద్వారా రైతు కుటుంబాలకు ఉపాధి కల్పించాలని రాజు భావించేవాడు.

అలా భూమిని పొందిన చంద్రన్న అనే రైతు పొలం దున్నుతుండగా నాగలికి ఏదో తగిలినట్టనిపించింది. అక్కడ తవ్వి చుడగా ఒక బంగారు రోలు, రోకలి దొరికాయి. ఆ రైతు నిజాయితీ గలవాడు. అందుకే ఆ రోలు, రోకలి భూమి యజమాని అయిన రాజుకే చెందాలనుకున్నాడు. అయితే రోలును రాజుకి బహుకరించి, రోకలిని తన కష్టానికి ప్రతిఫలంగా తనవద్దే ఉంచుకోవాలని అనుకున్నాడు. ఆ రైతుకు ఒక కుతురు ఉంది. ఆమె చాలా తెలివైనది. ఆమె తండ్రితో "మీరు రోలు మాత్రమే ఇస్తే రాజు రోకలి ఏదని అడుగుతారు. కాబట్టి రోలు, రోకలి రెండూ ఆయనకు బహుకరించండి" అని చెప్పింది.

కూతురి సలహాను పెడచెవిన పెట్టి చంద్రన్న రోలు మాత్రం తీసుకెళ్ళి రాజుకు బహుకరించాడు. రోలును చుసిన రాజా విజయేంద్రవర్మ రోకలి ఏదని చంద్రన్నను ప్రశ్నించాడు. చంద్రన్న దానికి సరైన సమాధానం ఇవ్వలేకపోయాడు. దాంతో రాజు అతడిని చెరసాలలో బంధించమని సైనికులను ఆదేశించాడు. సైనికులు అతడిని చెరసాలకు తీసుకువెళ్తుండగా, "నా కూతురి సలహా విని ఉంటే నాకీ దుస్ధితి పట్టేది కాదు కదా!" అని అతను ఆ విషయాన్ని రాజుకు చెప్పాడు. రాజు చంద్రన్నను వివరాలనడగగా కూతురి గురించి చెప్పాడు. చంద్రన్న కూతురిని తీసుకురమ్మని సైనికులను ఆజ్ఞాపించాడు రాజు. ఆమె రాజసభలోకి ప్రవేశించి జరిగినదంతా వివరించింది. ఆ అమ్మాయి తెలివితేటలకు ముగ్ధుడైన రాజు ఆమెను తన మంత్రిగా నియమించుకున్నాడు.
========================

ముఖ్యమైన పాఠం

ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలోని బల్లపై కొన్ని వస్తువులను ఉంచి విద్యార్ధుల ముందు నిల్చున్నాడు. క్లాసు మొదలయ్యింది. ఏమీ మాట్లాడకుండా ఉపాధ్యాయుడు ఒక గాజుపాత్రను రాళ్ళతో నింపసాగాడు.

ఆ తరువాత కొన్ని చిన్న చిన్న గులకరాళ్లను తీసుకుని వాటిని ఆ పాత్రలోకి నింపసాగాడు. ఆ గాజుపాత్రను ఊపగానే గులకరాళ్లు పెద్ద రాళ్ళ మధ్యన ఉన్న ఖాళీ స్ధలంలోనికి చేరిపోయాయి. మళ్ళీ ఉపాధ్యాయుడు "ఇప్పుడు ఈ పాత్ర నిడిందా?" అని అడగ్గానే "నిండింది" అనే సమాధానం చెప్పారు విద్యార్ధులు.

ఒక సంచిలో నుంచి కొంత ఇసుకను తీసి పాత్రలో నింపాడు ఉపాధ్యాయుడు. ఆ పాత్ర మిగిలివున్న ఖాళీ స్ధలాన్ని ఆ ఇసుక ఆక్రమించేసింది. మళ్ళీ "పాత్ర నిండిందా?" అని ప్రశ్నిచిన ఉపాధ్యాయుడికి "నిండింది" అనే సమాధానమే ఇచ్చారు విద్యార్ధులు.

"ఇప్పుడు చెప్పండి ఈ గాజుపాత్ర మన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది కదా! గమనించారా? పెద్ద రాళ్ళు మన జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశాలు - మన కుటుంబం, ఆరోగ్యం మొదలైనవి. ఈ రెండు అంశాలు ఉంటే మిగతా అంశాలు మన జీవితానికి అవసరం లేదు".

"చిన్న గులకరాళ్ళు మిగతా అంశాలు - మన ఉద్యోగం, వృత్తి, ఇల్లు మొదలైనవి. ఇసుక మిగతా చిన్న చిన్న అంశాలు. మనం ముందుగానే ఇసుకతో గాజుపాత్రను నిలిపినట్లయితే గులకరాళ్ళకు, పెద్ద రాళ్ళకు చోటు ఉండేది కాదు. మన జీవితము అంతే. చిన్న చిన్న సుఖాలు కోసం సమయం, శక్తి వృధా చేసుకుంటే ముఖ్యమైన అంశాలను కోల్పోతాం. మన సంతోషానికి కారణం కాగల అంశాల పట్ల మాత్రమే శ్రద్ధ వహించాలి. కుటుంబసభ్యులతో ఆడటం, ఇంటి దగ్గర గడపడం... ఇలాంటివి సమయం ఉన్నప్పుడు కోల్పోతే ఆ క్షణాలు మళ్ళీ తిరిగి రావు. కాబట్టి మన జీవిత గమనం అనేది నిర్దేశిత లక్ష్యాలతో, ముఖ్యమైన అంశాలు ప్రాతిపదికను సాగాలి" అని విద్యార్ధులకు వివరించాడు ఉపాధ్యాయుడు. ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నామన్న తృప్తితో విద్యార్ధులు చప్పట్లతో తరగతి గదిని హోరెత్తించారు.
=========================================

ప్రోత్సాహం

ఒక వ్యక్తి కారులో ప్రయాణిస్తూ కొండలు, గుట్టల మధ్య దారితప్పి పోయాడు. రహదారిపైకి రావాలని ప్రయాణించి ప్రమాదవశాత్తూ ఒక ఊబిగుంటలోకి చిక్కుకు పోయాడు. అతనికి దెబ్బలేమి తగలకపోయినా, అతని కారు లోతైన బురదలో కూరుకుపోయింది. ఆ వ్యక్తి సహాయం కోసం అర్ధిస్తూ పక్కనే ఉన్న పొలంలోని రైతు దగ్గరకు వెళ్లాడు.

"గంగ మీ కారుని ఈ ఊబిలో నుండి బయట పడేయగలడు." అని ఒక ముసలి గుర్రాన్ని చూపిస్తూ చెప్పాడు రైతు. ఆ వ్యక్తి ముసలి గుర్రం వైపు చూసి రైతుని చూస్తు, "ఈ ముసలి గంగ అంత పని చేయగలదా?" అని అడిగాడు. ప్రయత్నిస్తే పోయేది లేదు కదా అని అనుకున్న వ్యక్తి సరేనంటూ రైతు, ముసలి గుర్రంలతో పాటు ఊబిగుంట వైపు నడిచారు.

రైతు గుర్రాన్ని కారుకు తాడుతో కట్టి "రాధా, రాణీ! రాజా, గంగా! గుర్రం ఒకే ఉదుటున కారును ఊబిగుంటలో నుంచి పైకి లాగేసింది.

ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి రైతుకు కృతజ్ఞ్తలు చెప్పి, "నువ్వు గంగ అని పిలిచేముందు అన్ని పేర్లెందుకు పిలిచావు?" అని అడిగాడు.

రైతు చిరునవ్వుతో, "ముసలిదైన గంగ ఒక గుడ్డిగుర్రం. దానితో పాటు మరికొన్ని గుర్రాలు కుడా కలిసి పనిచేస్తున్నాయంటే అది ఆ పని చేసేందుకు జంకదు. అదొక్కటే పనిచేస్తున్నానని అనిపిస్తే భయంతో ఆ పనిని సరిగాచేయలేదు" అని చెప్పాడు.
=================================

రామన్న తీర్పు

ఒకసారి మర్యాదరామన్న కొలువుకు ఇద్దరు వ్యక్తులు ఒక ఫిర్యాదుతో వచ్చారు. వారిద్దరిలో ఒకరు ఆ ఊరిలో పేరున్న ధనికుడు, మరొకరు రైతు.

"మా పూర్వికులకు చెందిన విలువైన వజ్రం ఒకటి నా దగ్గర ఉండేది. ఇతను వ్యాపార నిమిత్తం పొరుగుదేశం వెళ్తూ నకలు కోసం నా వజ్రాన్ని అడిగి తీసుకుని వెళ్ళాడు. తిరిగి వచ్చాక వజ్రం కోసం వెళితే ఇవ్వడం లేదు" అని రైతు ఫిర్యాదు చేశాడు.

'నీ సమాధానం ఏమిట'ని రెండో వ్యక్తి వైపు చూశాడు మర్యాదరామన్న. అప్పుడు ధనికుడు తన చేతిలో ఉన్న కర్రను పట్టుకోమని రైతుకు ఇచ్చి, కొంచెం ముందుకు వచ్చి చేతులు జోడించి "రైతు చెప్పింది నిజమే. అతని దగ్గరున్న వజ్రం లాంటిది కొండానికి, పొరుగుదేశంలో ఉన్న వ్యాపారులకు చూపించడానికి తీసుకెళ్లింది వాస్తవమే, అయితే నేను ఇంటికి చేరుకున్న క్షణమే అతన్ని పిలిపించి ఆ వజ్రాన్ని తిరిగి ఇచ్చేశాను. రైతు దురాశతో నా దగ్గరున్న వజ్రాల్లో ఒకదాన్ని పొందటానికి ఎత్తు వేస్తున్నాడు" అని చెప్పాడు.

ఆలోచనల్లో పడిపోయాడు రామన్న. ఇచ్చినప్పుడుగాని, పుచ్చుకున్నప్పుడుగాని చూసిన సాక్ష్యులు ఎవరూ లేరు. వ్యవహారమంతా కేవలం ఇద్దరి మద్యే గడిచింది.

"చూడండి! మీ లావాదేవీలో దేవుడే సాక్షి. మీకు ఇంకొక్క అవకాశం ఇస్తున్నాను. దేవుడు మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి" అని ఆదేశించాడు రామన్న.

ధనికుడు వెంటనే తన కర్రను మళ్ళీ రైతు చేతిలో పెట్టి, రెండు చేతులు జోడించి దేవుణ్ణి ప్రార్ధిస్తున్నట్టుగా పైకెత్తి "ఆ భగవంతుని సాక్షిగా నేను నిజమే చెబుతున్నాను. రైతుకు నేను వజ్రాన్ని తిరిగి ఇచ్చేశాను" అని ప్రమాణం చేశాడు. ధనికుడు ప్రవర్తన నిశితంగా గమనించిన రామన్నకు విషయం మొత్తం అర్ధమ్మయింది.

ధనికుడు రైతు చేతుల్లోంచి కర్రను తీసుకోబోయాడు. "ఆగు! ఆ కర్రను తీసుకోవద్దు. అది రైతుకు పరిహారంగా ఇవ్వబడుతోంది" అని తీర్పు చెప్పాడు. అది విని రైతు, ధనికుడు ఇద్దరూ ఆశ్చర్యపోయారు.

"ఇంటికి వెళ్ళి ఆ కర్రను జాగ్రత్తగా విరగ్గొట్టి చూడు" అని రైతుకు చెప్పి పంపించేశాడు. ఆ తీర్పుతో నిరాశచెందిన రైతు రామన్నను రెట్టించే ధైర్యం లేక ఇంటికి వెళ్ళి కర్రను పగలగొట్టి చూశాడు. అందులోంచి అతను ధనికుడికి ఇచ్చిన వజ్రం బయటపడింది.

అత్యాశకు పోయి రైతును మోసగించినందుకు ధనికుడికి తగినశాస్తి జరిగింది.
==========================================

సత్యమేవ జయతే

ధర్మయ్య ఒక నిజాయితీ గల వర్తకుడు. ఒకరోజు వ్యాపార నిమ్మితం పరదేశానికి వెళ్లిన ధర్మయ్య అక్కడ సత్రంలో రంగయ్య అనే వ్యక్తితో కలిసి ఒకే గదిలో బస చేశాడు. తెల్లవారక ముందే సత్రంలో నుండి బయలుదేరిన ధర్మయ్య తన వ్యాపార లావాదేవీలను కొనసాగించేందుకు మరో పట్టణం చేరుకున్నాడు. ఆ పట్టణ పోలీసులు అతన్ని అడ్డగించి తనతో పాటు బస చేసిన రంగయ్య హత్య చేయబడ్డాడని తెలుసుకొని నిర్ఘంతపోయాడు. పోలీసులు ధర్మయ్యను ప్రశ్నిస్తూ అతని సంచి వెదకగా అందులో రక్తంతో తడిసిన కత్తి ఉండడంతో ధర్మయ్యే నేరస్ధుడని నమ్మిన పోలీసులు ధర్మయ్య ఎంతగా వాదించినా వినకుండా అతన్ని ఇరవై ఆరేళ్ళు జైలు శిక్ష విధించారు.

దీనంగా దేవుణ్ణి ప్రార్దించడం తప్ప మరేమీ చేయలేని ధర్మయ్య దేవుడి కృపకోసం ఎదురు చూడ సాగాడు. అంతలోనే కొంత మంది కొత్త నేరస్ధులను జైలులోకి తీసుకువచ్చారు అధికారులు. వారిలో కరడుగట్టిన హంతకుడు రత్నయ్య కూడా ఉన్నాడు. రత్నయ్య మాటలలో రంగయ్యను చంపింది రత్నయ్యేనని తెలుసుకున్నాడు ధర్మయ్య. కాని ప్రతీకారం తీర్చుకోవాలని చూడలేదు ధర్మయ్య.

ఒకరోజు జైలు నుండి పారిపోయేందుకు సొరంగం తవ్వుతున్న రత్నయ్యను చూశాడు ధర్మయ్య. సొరంగం తవ్వుతున్న చప్పుడు విన్న పోలీసులు వచ్చి గదిలో ఆరా తీశారు. కాని రత్నయ్యే సొరంగం తవ్వాడని ధర్మయ్య చెప్పలేదు సరికదా మౌనంగా తెలియనట్లే ఊరుకున్నాడు. తన నేరం వల్ల జైలుశిక్ష అనుభవిస్తున్న ధర్మయ్యకి తన పట్ల ఇంత దయ, ప్రేమ చూసేసరికి తట్టుకోలేకపోయినా రత్నయ్య ధర్మయ్య కాళ్లపై పడి తనను క్షమించమంటూ వేడుకోగా, "దేవుడే క్షమిస్తాడు" అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు ధర్మయ్య.

మరుసటి రోజే తన నేరం అంగీకరించిన రత్నయ్య తన వల్ల నేరం అనుభవిస్తున్న ధర్మయ్య నిరపరాధి అని అతన్ని విడిచిపెట్టమని జైలు అధికారుబతిమాలాడు. అసలు నేరస్ధుడు దొరకడంతో ధర్మయ్యను వదిలేశారు అధికారులు.

నీతి : కొంత ఆలస్యమైనా, ఎల్లప్పుడూ సత్యమే జయిస్తుంది.
=============================================

తెలివైన రైతు

రాజా విజయేంద్రవర్మ తన పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారో లేదో తెలుసుకోవాలని ఒక రోజు రాజ్యంలో పర్యటిస్తున్నాడు. పొలంలో పని చేసుకుంటున్న ఒక రైతును "నువ్వు సంపాదించే దానితో సంతోషంగా ఉన్నావా?" అని అడిగాడు. "సంతోషంగా ఉన్నాను రాజా! నేను రోజుకు ఒక రూపాయి మాత్రమే సంపాదిస్తాను. దానిలో 25 పైసలు తింటాను. మరో 25 పైసలు అప్పుగా ఇస్తాను. మరో 25 పైసలు రుణం చెల్లిస్తాను. మిగిలిన 25 పైసలు పడవేస్తాను" అని చెప్పాడు రైతు.

"అయినా నీవు సంతోషంగా ఉన్నావని ఎలా చెప్పగలవు?" అడిగాడు రాజు. "రాజా! నా మొదటి 25 పైసలు నా కుటుంబ సభ్యులు ఆహారానికి, రెండో 25 పైసలు నేను పిల్లలపై ఖర్చ చేస్తాను కాబట్టి అది నా భవిష్యత్తుకు బీమా వంటిది. మరో 25 పైసలు నా తల్లిదండ్రులపై ఖర్చు చేస్తాను. వారి రుణం తీర్చుకోవడానికంటే సంతోషం ఏముంటుంది. చివరి 25 పైసలు నేను బీదవారికి దానం చేస్తాను.

రైతు చెప్పిన దానిని విని రాజు సంతోషించాడు. అతనికి ఒక బంగారు నాణెం బహుమతిగా ఇచ్చి, "నా మొహం వందసార్లు చూసే వరకు ఈ విషయం ఎవ్వరితోనూ చెప్పవద్దు" అని రాజు దర్బారుకు చేరుకున్నాడు.

రైతు చెప్పిన చిక్కు ప్రశ్నను రాజు తన దర్బారులో వారి ముందు ఉంచాడు. జవాబు చెప్పిన వారికి మంచి బహుమతి ఇస్తానని ప్రకటించాడు. ఒక తెలివైన అధికారికి రాజు ఒక ఊరికి వెళ్ళి అక్కడ రైతును కలిశాడన్న విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే రైతు దగ్గరకెళ్ళి అతనికి బంగారు నాణాల మూట ఇచ్చి తిరిగి నగరానికి చేరుకున్నాడు.

మర్నాడు ఉదయం ఆ రైతు కూడా దర్బారుకు వచ్చాడు. ఆ తెలివైన అధికారి చక్కగా చిక్కు ప్రశ్నలకు జవాబును వివరించాడు. అంతే, కోపంతో ఊగిపోతు రాజు "నీకెంత ధైర్యం! నా మొహం వందసార్లు చూపిన తరువాత గాని జవాబు ఎవరితోనూ చెప్పవద్దని చెప్పానుగా! అని రైతు మీద ఆగ్రహించాడు.

"రాజా! మీ మాటలను నేను జవదాటలేదు. ఈ అధికారి గారు నాకు వంద బంగారు నాణాలు ఉన్న ఒక మూటను ఇచ్చారు. నాణాలపై మీ బొమ్మ ముద్రించి ఉంది. కాబట్టి నేను వందసార్లు మీ మొహం చూసిన తరువాత గాని ఈ జవాబు అధికారికి చెప్పలేదు" అని వివరించాడు రైతు.

రాజు తన అధికారి తెలివికి, రైతు మేధస్సుకు సంతోషించి వారిద్దరినీ సత్కరించాడు.
===================================

చెడ్డ బేరం

పూర్వకాలంలో గుర్రాలు మిగతా జంతువులతోపాటు కలిసి అడవుల్లోనే జీవించేవి. ఒక రోజు ఒక గుర్రం ఒక మనిషి దగ్గరకు వెళ్ళి. "దయచేసి నన్ను కాపాడండి. అడవిలో ఒక సిణం నన్ను చంపాలనుకుంటోంది" అంటూ ప్రాభేయపడింది.

"భయపడకు మిత్రమా! నేను నిన్ను రక్షిస్తాను. సిణం నిన్ను ఏమి చేయదు" అన్నాడు మానవుడు.

దానితో గుర్రం ఎంతో సంతోషించింది. కృతజ్ఞతలు కూడా తెలుపుకుంది. తిరిగి మానవుడు ఇలా చెప్పాడు, "మరి నువ్వు ఏం చెప్పినా వినాలి."

"నువ్వేం చెప్పినా చేస్తాను. నా ప్రాణాలు కాపాడగలిగితే చాలు" అంది గుర్రం. "సరే మరి నువ్వు నీ మీద నన్ను స్వారీ చేసుకోనివ్వాలి," అన్నాడు.

ప్రాణభయంతో ఉన్న ఆ గుర్రం మానవుడు చెప్పిన వాటికల్లా ఒప్పుకుంది. మానవుడు దానిమీద ఎక్కి కూర్చున్నాడు. గుర్రాన్ని తన ఇంటివైపు నడిపించాడు. అక్కడ పశువుల కొట్టంలో దాన్ని ఉంచి "ఇక్కడ నువ్వు ఎంతో నిశ్చింతగా ఉండచ్చు. నా ఇంట్లో నీకొచ్చే భయం ఏమి ఉండదు. నేను నిన్ను బయటకు తీసుకెళ్ళినప్పుడల్లా నీ వీపు మీద స్వారీ చేస్తుంటాను. నేను నీతో ఉంటే ఆ సిణం నిన్ను ఏం చేయలేదు" అన్నాడు. ఆ తరువాత తలుపులు వేసి వెళ్ళిపోయాడు.

గుర్రం ఒంటరిగా మిగిలిపోయింది. "నేనిక్కడ జాగ్రత్తగా ఉండగలను. కాని స్వేచ్చలేదు. నా రక్షణను కోరుకున్నాను కాని స్వేచ్చను కోల్పోయాను. ఇది చలా చెడ్డ బేరం," అనుకుని చింతిస్తూ ఉండిపోయింది గుర్రం.

ఇక ఆరోజు నుండి మానవుని అదుపాజ్ఞలో బ్రతకసాగింది.

No comments: