Thursday, February 3, 2011

బాబూ రాజేంద్రప్రసాద్

బాబూ రాజేంద్రప్రసాద్

బాబూ రాజేంద్రప్రసాద్‌
పేరు : బాబూ రాజేంద్రప్రసాద్.
తండ్రి పేరు : మహదేవ్ సహాయ.
తల్లి పేరు :

(తెలియదు).

పుట్టిన తేది : 3-12-1884.
పుట్టిన ప్రదేశం : బీహార్.
చదివిన ప్రదేశం : బీహార్.
చదువు : న్యాయశాస్త్రం.
గొప్పదనం : రైతుల రక్షణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయించటానికి పాటు పడ్డారు.
స్వర్గస్తుడైన తేది :

(తెలియదు).


రాజేంద్రప్రసాద్ 1884 డిసెంబరు 3న జన్మించారు. తండ్రి మహదేవ్ సహాయ ఆయుర్వేద వైద్యం చేస్తుండేవాడు. రాజేంద్రప్రసాద్ తాతగారు బీహార్ జిల్లాలోని హధువా సంస్థానంలో దివానుగా ఉండేవారు. వారి పూర్వికులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు. ఉద్యోగాల అన్వేషణలో తలోకవైపు చెదిరిపోయారు. రాజేంద్రప్రసాద్‌కి చిన్నతనము నుంచి బీదల యెడల ఎంతో సానుభూతి ఉండేది. అతని తండ్రి వైద్యం చేస్తున్నప్పుడు ఆయన ఒళ్ళో కూర్చోని రోగులను పరిశీలిస్తూ ఉండేవాడు. ఎవరయినా బీదవారు డబ్బు ఇచ్చుకోలేమని ప్రాధేయపడినప్పుడు "సరే ఏం ఫరవాలేదు వెళ్ళిరండి" అని అతను చెప్పేవాడు.

పాఠశాలలో చదువుకునే రోజుల్లో రాజేంద్రప్రసాద్ మిగతా విద్యార్ధులకన్నా చదువులో, ఆటలో మిన్నగా ఉండేవాడు. క్లాసులో ప్రతి పరీక్షలోనూ ఫస్ట్ మార్కులు అతనివే. అతను రాసిన పేపర్లు దిద్దే ఉపాధ్యాయులు కూడా ఆ తెలివి తేటలకు ఎంతో ముగ్ధులయ్యేవారు. ఒక సారి కొంతమంది స్నేహితులతన్ని కలిసి "నువ్వు ఇంత బాగా చదవడానికి కారణం ఎవరు?" అని అడిగారు. దానికి సమాధానంగా నాకు ఎవరూ ప్రైవేటు చెప్పటం లేదు. నాకు నేనే చదువుకుంటాను, అయితే మీ అందరిలాగ నేను రాత్రి సమయాలలో చదవను. ఉదయం నుంచి అలసిపోయివున్న మనసుకు, రాత్రి చదువుతో శ్రమయివ్వకూడదు. రాత్రి త్వరగా నిద్రపోయి, తెల్లవారు ఝామునేలేచి చదివితే అది మసులో ముద్రపడిపోతుంది. చదవటంలో కూడా బట్టీపట్టే పద్దతిని మానుకోవాలి అని చెప్పాడు. ఆ సిద్దాంతంతోనే అతను చదివి, బి.ఏ. పరీక్షలో కలకత్తా యూనివర్సిటీలో ప్రధముడుగా వచ్చాడు.

1907లో తండ్రి మరణించటంతో వారి కుటుంబం ఆర్ధికంగా కొన్ని ఇబ్బందులలో పడటం వలన, రాజేంద్రప్రసాద్ తన చదువు పూర్తి చేసుకోవటానికి ప్రైవేట్లు చెప్పవలసివచ్చింది. కష్టపడి చదువుకుంటూ తన డబ్బు తానే సంపాదించుకుంటూ ఎం.ఏ. పరీక్ష పాసయ్యాడు. అతనికి చిన్నతనం నుంచి లండన్‌లో బారిష్టరు పరీక్ష రాయాలనే కోరిక ఉండేది. కానీ కుటుంబ ఆర్ధిక పరిస్థితులు అతని కోరికను నెరవేర్చలేకపోయాయి. చివరకు స్వదేశంలోనే న్యాయశాస్త్రం చదివి కలకత్తాలో శంసుత్ హుడాసాహెం వద్ద జూనియర్ గా చేరి అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. రాజేంద్రుడి తెలివి తేటలకు ముగ్ధుడైన జస్టిస్ సర్ అశుతోష్ అనే జడ్జి మీవంటి చైతన్య వంతులైన యువకులు విద్యారంగంలో ఉంటే ముత్యాలాంటి పౌరులను సృష్టించగలరు. మీ తెలివితేటలు న్యాయవాదవృత్తిలో కేవలం క్లయింటులకే పరిమితం కాకూడదు. నేను యూనివర్సిటీ సిండికేటు సభ్యుడిని, మీరు లా కాలేజీలో ఉపాధ్యాయుడిగా చేరితే నేను సంతోషిస్తాను.

రాజేంద్రప్రసాద్ తన దేశ ప్రజలకు ఏం చేయమన్నా చేస్తానని ప్రమాణం చేసి, ఆర్ధికపరంగా ఎంతో బాగున్నా న్యాయవాద వృత్తిని నిస్వార్ధంతో వదిలి కలకత్తా కాలేజీలో లెక్చరర్ గా చేరాడు. వాస్తవానికి న్యాయవాద వృత్తిలో వచ్చే ఆదాయంలో నాలుగోవంతు కూడా ఆ ఉద్యోగంలో వచ్చేది కాదు. కానీ ఆదర్శాల కొరకు ఆడంబరాలను వదిలి తృప్తిగా జీవించాడు. ఆ రోజుల్లో భారతదేశపు రైతులను అధిక పన్నులతో పీడిస్తూ వారికి మనశ్శాంతి లేకుండా చేసేవారు. ఒకసారి మహాత్మాగాంధీ పాట్నాలోని రైతులను ఆంగ్లేయుల పన్నుల నుండి కాపాడాలని, అక్కడికి వచ్చి సమ్మె చేసినప్పుడు ఆయనను అరెస్టు చేసి జైలు శిక్ష విధించడం జరిగింది. అది చూసిన రాజేంద్రుడి దేశభక్తి కట్టలు తెంచుకుంది. ఎక్కడినుంచో వచ్చి తమ రాష్ట్ర రైతుల కొరకు గాంధీజీ కారాగార శిక్షను అనుభవించటం అతను భరించలేక పోయాడు. రైతులను కూడగట్టుకొని, వారి సమస్యలను విని ఒక పెద్ద రిపోర్టు తయారుచేసి భారతీయ అధికారుల సహాయంతో దానిని ఆంగ్లేయులకు సమర్పించి రైతుల రక్షణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయించి గాంధీజీని విడిపించటంలో కృతకృత్యుడయ్యాడు. బీహారు రాష్ట్రంలో వరదలు, కరువు కాటకాలు, ప్రకృతివైపరీత్యాలు సంభవించినప్పుడు, ఆయన అందించిన అసాధారణ సేవలు జాతీయ అంతర్జాతీయ నాయకులను ఆశ్చర్యపరచాయి. తన రాష్ట్రంలో విద్యా వ్యాప్తికి, ఇతర నిర్మాణాత్మక కార్యక్రమాలకు ఆయన చేసిన సేవ మిక్కిలి అభినందనీయం.

రాజేంద్రప్రసాద్ నమ్మిన సిద్దాంతాలకోసం, భారతదేశపు స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి, నిస్వార్ధంగా జీవించాడు. న్యాయవాద వృత్తిలో మంచి పేరు గడించి, డబ్బు సంపాదిస్తూ కూడా దేశం కోసం సర్వం త్యజించి ఆడంబరాలకు, అహంకారానికి అతీతంగా జీవించి చివరకు భారతదేశపు అధ్యక్షపదవిని అలంకరించిన రాజేంద్రప్రసాద్ జీవితం అందరికీ నూతన ఉత్తేజాన్ని ధైర్య స్థైర్యాలను, స్వార్ధ రాహిత్య జీవితాన్ని అలవర్చగలదు.


No comments: