Tuesday, February 22, 2011

నీతి కధలు 7

పసిమనసు

రాఘవరావుగారు కూతురును చూడటానికి పట్నం నుండి వచ్చారు. ఆయన కర్నూలు జిల్లాలో హెడ్‌మాస్టర్. తాతగారిని చూసి పరుగున వచ్చాడు పవన్. మనవడిని ఎత్తుకొని ముద్దాడుతూ ఇంట్లోకి నడిచాడు రాఘవరావుగారు. అమ్మా! అమ్మా! తాతయ్య వచ్చాడు. అరిచాడు పవన్. శైలజ కిచెన్ రూం నుండి బయటికి వచ్చి తండ్రిని క్షేమసమాచారాలడిగింది. అనంతరం అల్లుడుగారింకా రాలేదా? అడిగారాయన.

ఆఫీస్ టైం అయిపోయింది కదా! వస్తుంటారు నాన్నా అని చెప్పింది శైలజ. మనువడితో ఆడుకుంటూ కబుర్లలో పడ్డాడు రాఘవరావుగారు. తండ్రి కోసం పవన్ మనసు ఎదురుచూస్తుంది. ఆఫీస్, దారి కబుర్లు పూర్తి చేసుకొని రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికి వచ్చాడు రంగనాథం. రాగానే పరుగున వెళ్ళి తండ్రి చేయి పట్టుకున్నాడు పవన్. అలసటగా వున్న రంగనాథం చేయి విడిపించుకున్నాడు. మామగారిని చూసి క్షేమసమాచారాలు అడిగాడు. టవల్ తీసుకొని బాత్‌రూం వైపు నడిచాడు. తండ్రి తనను ఎత్తుకోవాలని ఎంతో ఆశగా పరుగెత్తుకుంటూ వచ్చిన పవన్ మనసు నిరాశతో గిలగిలలాడింది.

రంగనాథం డ్రస్ చేంజ్ చేసుకొని వచ్చాడు. అలసటగా కుర్చీలో కూర్చున్నాడు. టి.వి. ఆన్ చేసాడు. పవన్ పలక చేత పట్టుకొని పరుగున వచ్చాడు. పలకలో ఓ సున్నా చుట్టి, దానికి రెండు కళ్ళు, ముఖం, చెవులు పెట్టాడు. నాన్నా! నాన్నా! నేను బొమ్మ గీశాను చూడు అన్నాడు. రంగనాథం టి.వి పై నుండి చూపు మరల్చలేదు. పలకలోకి చూడకుండా ఎబిసడిలు రాసుకోకుండా ఈ బొమ్మలేంటి? వెళ్ళి ఎబిసిడిలు రాయి వెళ్ళు అన్నాడు చెంపలు నిమిరి. తాను గీసిన బొమ్మ చూసి నాన్న మెచ్చుకుంటాడని ఆశ పడిన పవన్ ముఖం చిన్నబోయింది. మెల్లగా వెళ్ళి గోడవారగా కూర్చున్నాడు. ఎబసిడిలు వచ్చినవన్నీ రాసాడు. నాన్నా నాన్నా! ఎబసిడిలు రాశాను అంటూ ఉత్సాహంగా వచ్చాడు. తాతయ్యకు చూపించు అన్నాడు రంగనాథం. ఉరకలు వేసే ఉత్సాహం చచ్చుబడిపోయింది. చేసేది లేక ముఖం చిన్నబుచ్చుకుని తాతయ్య దగ్గరకెళ్ళి కూర్చున్నాడు. రాత్రి భోజనాలయ్యాక టి.వి లో వార్తలు వింటున్నాడు రంగనాథం. పవన్ వచ్చాడు. నాన్నా! నాన్నా! కథ చెప్పవా? గడ్డం పట్టుకుని లాగుతూ అడిగాడు. "కథకు కాళ్ళులేవు. ముంతకు చెవుల్లేవు పడుకోకన్నా" అన్నాడు రంగనాథం. పవన్ కథ చెప్పమని గడ్డం పట్టుకులాగుతున్నాడు. వార్తలు వినాలి. చెబుతుంది నీక్కాదా విసిగించకు వెళ్ళి పడుకో! లేకుంటే పిచ్చోడికి పట్టిస్తా అన్నాడు. అంతా గమనిస్తున్న రాఘవరావుగారు అల్లుడూ వాడికి కథ చెప్పు అన్నారు.

అదేంటి మామయ్యా! వాడేదో పిల్ల తనం కొద్దీ కథ చెప్పమంటున్నాడు. అలాగని కథలు చెబుతూ కూర్చోవటమేనా? అంత తీరికెక్కడుంది. అన్నాడు రంగనాథం. వచ్చినప్పటి నుండీ గమనిస్తున్నాను. నువ్వు వాడిని నిర్లక్ష్యం చేస్తున్నావు అన్నారు రాఘవరావుగారు. నేను వాడిని నిర్లక్ష్యం చేయటమేమిటి? వాడు నాప్రాణం. వాడికి పదిహేను జతల బట్టలు తెచ్చాను. కోరిన తినుబండారాలు కొనిచ్చాను. వందలకొద్దీ ఫీజ్‌తో స్కూల్లో చేర్చాను. వాడికేంతక్కువైంది? అన్నాడు రంగనాథం. వాడికి అన్నీ అమర్చావని నీ వనుకుంటున్నావు. సంతృప్తి పడుతున్నావు కానీ, వాడి ఒంటరితనాన్ని దూరం చేసే నీ ప్రేమ మాత్రం వాడికి లేదు అన్నారు రాఘవరావుగారు. వాడు నా ప్రాణం. వాడిపై నాకు ప్రేమలేక పోవడమేమిటి మావయ్యా? ఆశ్చర్యంగా అడిగాడు రంగనాథం.

రాఘవరావుగారు అల్లుడి మాటలకు నవ్వి, పిల్లలకు తల్లిదండ్రులతో కబుర్లు చెప్పాలని ఉంటుంది. తాము రాసిన అక్షరాలు, బొమ్మలు చూపి మెప్పుపొందాలని ఉంటుంది. కథలు వినాలని ఉంటుంది. తల్లిదండ్రులతో ఆడుకోవాలని ఉంటుంది. కానీ మనం యాంత్రిక జీవితంలో పడి పట్టించుకోము. వారికేలోటు చేయలేదనుకుంటాం. వాళ్ళ మనసులో బాథ మనకర్థం కాదు. వాళ్ళ ఒంటరితనాన్ని గుర్తించలేము. వాళ్ళ ఉత్సాహాన్ని అల్లరి అంటాం. వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గదమాయిస్తాము, భయపెడతాము. వాళ్ళ ఉరకలు వేసే ఉత్సాహాన్ని ఆనకట్ట వేస్తాము. తెలుసుకోవాలనే ఉత్సుకతను ఆదిలోనే నరికేస్తాం. ఎన్నో పనులతో అలసిపోయామంటాము. కానీ పిల్లల సమక్షంలో అలసట తీర్చుకోవచ్చని మనకు తెలియదు. పని, స్నేహితులు, ఊరి రాజకీయాలు, అనవసర కబుర్లు, టి.వి కోసం కేటాయించే సమయంలో కొంత టైం కూడా పిల్లలకోసం వినియోగించలేము. వారితో కలిసి కబుర్లు చెప్పలేం, ఆడలేం. వాళ్ళని మానసికంగా ఒంటరిని చేస్తాం. వాడికన్నీ అమర్చామనుకుంటాం. ఇదీ మనం పిల్లల కోసం చేస్తున్న త్యాగం అన్నారు.

ఆయన మాటల్లోని యదార్థం అర్థమయ్యి రంగనాథం ఉలిక్కిపడ్డాడు. నన్ను క్షమించండి మామయ్యా! మీరు చెప్పింది అక్షరాలా నిజమే! అంటూ తాత పక్కన నిద్రలోకి జారుకున్న బాబు వైపు నడిచాడు రంగనాథం.
=============================================================

పారిన పథకం

గౌరీపురంలో వుండే సూరమ్మకు గయ్యాళితనము, ధనాశ ఒక పాలు ఎక్కువగానూ, పొదుపరితనము, సంపాదించగలిగే నేర్పు ఒక పాలు తక్కువగానూ వుండేవి. ఆమెకు ఇద్దరు పిల్లలు. వాళ్ళు చిన్నవాళ్ళుగా వుండగానే భర్తపోగా, ఉన్న ఆస్తినే కర్పూరంలా కరిగిస్తూ వాళ్ళను పెంచుకొచ్చింది. ఈ మధ్యనే కూతురు లక్ష్మికి పెళ్ళి చేసింది. ఇక పెళ్ళికి మిగిలినవాడు కొడుకు గోపాలుడు.

గోపాలుడు బాగా చదువుకొని కచ్చేరీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఆ ఉద్యోగాన్ని ఎరగా చూపి ఆడపెళ్ళి వారి నుంచి పెద్దగా కట్న కానుకలు లాగి, తన పూర్వవైభవాన్ని పొందాలని ఆమె వచ్చిన ప్రతి సంబంధాన్నీ వారి ఆస్తిపాస్తులు తూకం వేసి తిరగ్గొట్టడం ప్రారంభించింది. తల్లి సంగతి ఇలా వుండగా గోపాలుడి ఆశలూ, కోరికలూ అందుకు భిన్నంగా వున్నవి. తాముంటున్న వీధిలోనే, నాలుగిళ్ళ అవతల వున్న తమ బంధువుల పిల్ల నిర్మలను వివాహమాడాలన్నది అతడి ఆలోచన. నిర్మల చురుకుదనమూ, సహనమూగల పిల్ల. అయితే, తనకు నిర్మలతో సవ్య మార్గాన వివాహం జరుగుతుందన్న ఆశ మాత్రం అతడికి లేదు. అందుకు, నిర్మల కుటుంబం ఆర్థికంగా తమకంటే తక్కువ స్థితిలో వుండడం ఒక కారణమైతే, నిర్మల తండ్రి రామయ్యకూ, తన తల్లికీ మధ్య ఏవో కుటుంబాల పాత తగువుల కారణంగా నివురుకప్పిన నిప్పులాంటి శత్రుత్వం వుండడం మరొక కారణం.

ఈ పరిస్థితుల్లో ఏం చెయ్యాలా అని గోపాలుడు చాలాకాలం మధనపడి చివరకు ఒకసారి నిర్మలను ఏకాంతంగా కలుసుకుని, తను కోరుకుంటున్నదేమిటో వివరంగా చెప్పి, మనిషి ఎటువంటిదైనా ఆమె నా కన్నతల్లి! ఆమెలో మార్పు కోరుకోవడమే గాని ఏమీ చెయ్యలేని అసహాయ పరిస్థితి నాది. అటు అమ్మను కష్టపెట్టకుండా నేను సుఖ జీవితం గడపాలంటే, నీ వంటిదాని సహకారం అవసరం. నీకు కూడా నేనంటే ఇష్టమైన పక్షంలో, మన పెళ్ళికి ఏదో ఒక ఉపాయం నువ్వే ఆలోచించు అన్నాడు.

తల్లిలాగా కాకుండా మంచివాడూ, నెమ్మదస్థుడూ అయిన గోపాలుడంటే నిర్మలకు ఇష్టమే. ఆ ఇష్టాన్ని సూచిస్తూ, సిగ్గుతో తలవంచుకుని కొద్దిసేపు మౌనంగా వూరుకున్న నిర్మల, చివరకు, ఉపాయానికేం ఆలోచించవచ్చుకాని ఎటుతిరిగీ అత్తయ్యను కాస్త అయినా కష్టపెట్టక తప్పదు. అన్నది. దీనికి గోపాలుడు నవ్వి ఉన్నది మొండి జబ్బని తెలిశాక దాన్ని పూర్తిగా మందులతోనే తగ్గించమని పట్టుబట్టే మూర్ఖుణ్ణి కాదు, నిర్మలా! అన్నాడు. గోపాలుడికి తన మీద వున్న అభిమానానికీ, నమ్మకానికీ కృతజ్ఞతగా చూసిన నిర్మల, అయితే సరే! సాధ్యమైనంత త్వరలో ఏదో ఒక ఉపాయం ఆలోచించి, నీకు చెబుతాను అన్నది. ఆ తర్వాత రెండు మూడు రోజుల్లోనే తండ్రి సహకారంతో నిర్మల ఒక పథకం రూపొందించడమూ, గోపాలుడు దానికి అంగీకరించడమూ జరిగాయి.

ఆ రోజు నుంచి వారం గడవకుండా, ఒక విచిత్రం జరిగింది. ఒకనాటి తెల్లవారుఝామున, ఇంటి ముంగిట కళ్ళాపి చల్లడానికి నిర్మల వచ్చేసరికి, వాకిట్లో ఒక వృద్ధ సాధువు సొమ్మసిల్లి పడిపోయి కనిపించాడు. నిర్మల చప్పున తండ్రిని పిలిచి, సాధువును లోపలకు చేర్చి ఉపచారాలు చేసింది. కొద్దిసేపట్లోనే తేరుకున్న సాధువును, మరి రెండు రోజుల్లో బాగా కోలుకున్నాడు. క్రమంగా అతణ్ణి గురించిన వివరాలు తెలియవచ్చాయి. సాధువు పేరు కరుణానందుడు. అతడి వయసు నూట ఇరవై సంవత్సరాలు. గత నూట పది సంవత్సరాలుగా హిమాలయ పర్వత సానువుల్లో ఏకాంత జీవనం సాగిస్తూ, అనేక మహిమలు గడించాడు. మరొక రెండు సంవత్సరాల్లో నిర్వాణం చెందనున్నాడు. గురువు ఆదేశానుసారం, తాను నిర్వాణం చెందేలోగా, జనావాసాలన్నీ కాలినడకన తిరిగి, తన మహిమలన్నీ మంచివాళ్ళకూ, కరుణాహృదయులకూ ధారపోస్తున్నాడు. అలా తిరుగుతూనే ప్రయాణభారం, వృద్ధాప్యం వల్ల నిర్మల ఇంటి ముంగిట్లో సొమ్మసిల్లి పడిపోయాడు. ఈ వివరాలన్నీ ఇరవై నాలుగు గంటల్లో ఊరంతా తెలిసిపోయాయి. ఊరివాళ్ళలో కొందరు పూలు, పండ్లు తీసుకెళ్ళి కరుణానందుడి దర్శనం చేసుకురాసాగారు. ఒకరిద్దరు మంచివాళ్ళకు మాత్రం, ఆయనతో సన్నిహితంగా మాట్లాడే అవకాశం లభించింది. అటువంటి వారిలో సూరమ్మ ఇంటికెదురుగా వుంటున్న గంగాధరం ఒకడు. గంగాధరాన్ని కరుణించిన సాధువు, అతడికి ఏదో మహిమ కూడా ప్రసాదిస్తానని చెప్పాడు.

ఈ సంగతంతా సూరమ్మకు తెలిసింది. మొదట రామయ్య ఇంటికి వెళ్ళడానికి సందేహించిన సూరమ్మ చివరికి ఒకసారి వెళ్ళి సాధువు దర్శనం చేసుకొని తన ఇంటికి ఆహ్వానించి సేవలు చేసి ఏదైనా మహిమలు సంపాదించాలనే నిర్ణయానికి వచ్చింది. తీరా అనుకున్న రోజున సూరమ్మ వెళ్ళేసరికి సాధువు దర్శనం వెంటనే దొరకలేదు. అతడు లోపల దీక్షలో కూర్చుని, నిర్మలకు ఏదో మంత్రాన్ని ఉపదేశిస్తున్నాడు. ఆమె తండ్రి రామయ్య మాటల వల్ల, సూరమ్మకు తెలిసినదేమంటే సాధువు, నిర్మలకు మహాలక్ష్మీ మంత్రం ఉపదేశిస్తున్నాడు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మూలా నక్షత్రయుక్త పౌర్ణమీ శుక్రవారం నాడు, ఆ మంత్రాన్ని ఎనిమిదిసార్లు జపిస్తే, ఇంట్లోని ప్రతి మూలలోనూ నూట ఎనిమిది చొప్పున బంగారు నాణాలు ప్రత్యక్షమవుతాయి!

ఇది వింటూనే సూరమ్మకు, నిర్మలను తన కోడలుగా చేసుకోవాలన్న ఆశ కలిగింది. ఇంతలో లోపలి తతంగం అంతా ముగిసినట్టు తెలియవచ్చింది. సూరమ్మ లోపలికి పోయి, సాధువుకు సాష్టాంగ ప్రణామం చేసి, అతణ్ణి తన ఇంటికి రావలసిందిగా ప్రార్థించింది. సాధువు మందహాసం చేస్తూ, ఇప్పుడు వీలుకాదు, తల్లీ! ఏచోటా వారం రోజులకు మించి వుండరాదని గురువాజ్ఞ. మరొక ఆరునెలల్లో అంటే రాబోయే శ్రావణ మాసంలో నిర్మల తొలిసారిగా మహాలక్ష్మీ మంత్రం జరిపించబోతున్నది. ఉపదేశించిన గురువుగా నన్ను, ఆరోజున ఇక్కడికి వచ్చి, నా ఆధ్వర్యంలో పూజ జరిపించమని పట్టుబడుతుంది. అప్పుడు నీ ఇంటికి కూడా వస్తాను, అన్నాడు. సూరమ్మ సాధువుకు వినయంగా నమస్కరించి మీ ఇష్టం . స్వామీ కాకపోతే మరొక చిన్న కోరిక అన్నది. ఏమిటో చెప్పు అన్నాడు సాధువు.

మీ అభిమానానికి పాత్రురాలైన నిర్మల అంటే, నాకు దాని చిన్నతనం నుంచి అభిమానం స్వామీ! ఎంతోకాలంగా దాన్ని నా కోడలిని చేసుకోవాలనుకుంటున్నాను. కానీ దాని తండ్రికి నేనంటే పిసిరంత గౌరవం కూడా లేదు, అన్నది సూరమ్మ. సూరమ్మ మాట వింటూనే సాధువు కరుణానందుడు కళ్ళు మూసుకొని కొద్దిసేపు తర్వాత తెరచి నీకున్న ఒక్కగానొక్క కొడుకు గోపాలుడు! వాడు కచ్చేరీ ఉద్యోగం చేస్తున్నాడు అవునా? అని ప్రశ్నించాడు. అవును స్వామీ! అంటూ సూరమ్మ ఆనందంగా జవాబిచ్చింది.

సాధువు బయట ఎవరితోనో మాట్లాడుతున్న రామయ్యను పిలిపించి రామయ్యా! ఈ సూరమ్మ కొడుకు చాలా ఉత్తముడు. నీ కూతురు నిర్మలకు తగినవాడు అన్నాడు. రామయ్య చేతులు జోడిస్తూ తమ ఆజ్ఞ స్వామీ అన్నాడు. ఆ తర్వాత నెల తిరక్కుండానే రామయ్య నిర్మలకూ, గోపాలుడికీ వివాహం జరిపించాడు. వివాహం అయిన వెంటనే కాపురానికి వచ్చిన నిర్మల కూలీలచేత పాడుపడినట్టున్న పెద్ద పెరడును బాగుచేయించి, రకరకాల కూరగాయల మొక్కలు నాటింది. ఆ పెరట్లోనే ఒక మూలగా పాకవేయించి, అందులో రెండు గేదెల్ని కొనితెచ్చిపెట్టి పాలవ్యాపారం ప్రారంభించింది. ఈ విధంగా నాలుగునెలలు గడిచేసరికి కూరగాయలూ, పాలు అమ్మగా వచ్చిన లాభాలతో సూరమ్మ అక్కడా ఇక్కడా చేసిన అప్పులు తీర్చి కొంత డబ్బు వెనుక వేసింది.

తన కోడలు ఏ మంత్రం జపించకుండానే డబ్బు సంపాయిస్తున్నదని సూరమ్మ సంతోషించినా, రాబోయే శ్రావణమాసంలో మహాలక్ష్మీ మంత్రం జపించి, ఆమె కూడబెట్టబోయే బంగారు నాణాల కోసం ఆతృతగా ఎదురుచూడసాగింది. కొన్నాళ్ళకు శ్రావణమాసం వచ్చింది. ఒకనాటి ఉదయాన రామయ్య, గంగాధరం వెంటరాగా సాధువు కరుణానందుడు వచ్చాడు. తనను చూడగానే పొంగిపోతూ అతిధి మర్యాదలకు పూనుకున్న సూరమ్మతో సాధువు, ఏం సూరమ్మా! ఇల్లు కళకళలాడుతున్నది. నీ కోడలు మంత్రం జపించకుండానే, నీ ఇంటికి మహాలక్ష్మీ వచ్చిందన్నమాట! అంటూ తను పెట్టుకున్న నకిలీ గడ్డమూ, జడలూ తీసి పక్కన పెట్టాడు. సూరమ్మ నిర్ఘాంతపోతూ చూసి ఏమిటీ మోసం? అంటూ కోపంగా మరేదో అనబోయింది. కాని, కరుణానందుడిగా వేషం వేసుకు వచ్చిన వృద్దుడు ఆమెను వారిస్తూ నన్ను నానా మాటలు అనబోయేముందు నేనెవరో గుర్తుపట్టగలవేమో ఒకసారి పరీక్షగా చూడు సూరమ్మా! అన్నాడు. అతణ్ణి పరీక్షగా చూసిన సూరమ్మ అతణ్ణి గుర్తుపట్టి తడబడుతూ మీరా! అంటూ తల వంచుకున్నది.

అప్పుడు వృద్దుడు శాంతంగా గుర్తుపట్టావు గదా! అని, అక్కడే వున్న గోపాలుడికేసి తిరిగి, నాయనా! నేను నీ నాన్నకు స్వయానా పినతండ్రిని మీ అమ్మకు పిన మామగారిని. నాకు అప్పట్లో ఊళ్ళు తిరిగి నాటకాలు వేసే అలవాటుండేది. అది మా అన్నయ్యకు అంటే, మీ తాతకు ఇష్టం ఉండేదికాదు. నా అభిరుచి వదులుకోలేక, నేను మరొక ఊరు వెళ్ళిపోయాను. వృద్దురాలైన అత్త మామల్ని మీ అమ్మ నానాబాధలు పెట్టి కట్టుబట్టలతో వీధిలోకి తరిమేసింది. ఆ తర్వాత వాళ్ళ జీవితం కడదాకా నా దగ్గర సుఖంగా గడిచినా, వాళ్ళు మాత్రం చివరి క్షణం వరకూ కొడుకు కోసం బాధపడుతూనే వున్నారు, అంటూ ఆగి సూరమ్మను ఏం తల్లీ నేను చెప్పిన దాంట్లో అబద్దం పాలు ఏమీ లేదుగదా? అని ప్రశ్నించాడు.

సూరమ్మ వెలవెలపోతూ, తల పక్కకు తిప్పుకున్నది. వృద్దుడు ఒక్క క్షణం ఆగి, గోపాలుడితో ఇదంతా ఈ రామయ్యకూ, గంగాధరానికీ తెలుసు. నువ్వు నిర్మలను చేసుకోవడానికి నిశ్చయించుకున్న తర్వాత, నిర్మల రూపొందించిన పథకంలో, సాధువు పాత్రకు రామయ్యా, గంగాధరం నన్ను ఒప్పించారు. ఆపైన జరిగినదంతా తెలిసిందే! ఇక మీ అమ్మకు చెప్పవలసిందే మిగిలింది. అంటూ సూరమ్మ వైపు తిరిగి, అత్త మామలను కాల్చుకుతిన్న నీ వంటి దానికి, నిర్మల లాంటి కోడల్ని తీసుకువచ్చి, నీ కొడుకు నిన్ను చాలా అదృష్టవంతురాలిని చేశాడు. నిర్మల గుణగణాలు నీకు తెలియడం కోసమే, ఈ ఆరునెలలు గడువు ఇచ్చాను. ఇప్పటికైనా అర్థం చేసుకొని సవ్యంగా ప్రవర్తించావా సరేసరి, లేదా నిర్మల కూడా ఒకనాటి సూరమ్మలా ప్రవర్తిస్తుంది. అన్నాడు.

ఆఖరికి పరిస్థితి అంతా పూర్తిగా అర్థం చేసుకున్న సూరమ్మ బొటా బొటా కన్నీళ్ళు కారుస్తూ మామయ్యా! నా తప్పు నాకు తెలిసింది. మీరు చెప్పినట్లు నిర్మల నా కోడలవడం నా అదృష్టం. ఈ ఆరు నెలల్లోనే మా ఇంటి పరిస్థితులు పూర్తిగా మార్చేసిన నా కోడలు అన్ని విధాలా ఈ ఇంటి మహాలక్ష్మే అన్నది. సూరమ్మలో వచ్చిన మంచి మార్పుకు సాధువు వేషంలో వున్న ఆమె పినమామతో పాటు అక్కడ వున్నవారందరూ చాలా సంతోషించారు.
==============================================================

పాలు ముట్టని పిల్లి

విజయనగరములో నివసించుచున్న ప్రజలకు ఎలుకల బాధ భరించరానిదైనది. ప్రభుత్వము ప్రజలను పిల్లులను పెంచమని ప్రోత్సహించినిది. రాయలవారు ప్రభుత్వోద్యోగులకు పిల్లులను ఉచితంగా యిప్పించారు. పిల్లులను పెంచుటకు పాలు అవసరము. కావున ఒక్కొక్క ఆవును కూడా యిప్పించినారు.

ప్రభుత్వోద్యోగులతోపాటు కవులకు, పండితులకు కూడా ఒక్కొక్క పిల్లిని, ఒక్కొక్క ఆవును యిచ్చినారు. అందరితోపాటు రామకృష్ణ కవికి కూడా ఒక పిల్లిని, ఒక ఆవును ఇచ్చినారు. రామకృష్ణుడు పిల్లిని సరిగా పెంచలేదు. ఆవు ఇచ్చిన పాలన్నీ తమ కుటుంబంలోని వారికి ఉపయోగించసాగాడు. పిల్లి చాలినంత ఆహారంలేక ఆకలితో చాలా బాధపడుతూ వుండేది. ఆ ఆకలి తీర్చుకొనుటకు రాత్రింబగళ్ళూ మేల్కొని వుండి కనబడిన ఎలుకనన్నిటినీ చంపి తినసాగింది. క్రమంగా ఇరుగు పొరుగు ఇండ్లలో కూడా దూరి ఎలుకలను వేటాడి తిని ఆకలి తీర్చుకోసాగింది. అందువలన రామకృష్ణుని ఇంటిలోగాని, ఇరుగు పొరుగు ఇండ్లలో గాని ఎలుకలు కనిపించకుండా పోయాయి. పిల్లికి ఆహారంగా ఉపయోగపడుతున్న ఎలుకలు కూడా దొరకనందుకు అది బాగా చిక్కిపోయి నడవలేని స్థితిలో ఉన్నది.

ఇట్లు జరుగుతుండగా రాయలవారు తాము ప్రభుత్వోద్యోగులకు ఇచ్చిన పిల్లులను చూచి, బాగా పెంచిన వారికి బహుమతి యివ్వబడనున్నట్లు ప్రకటించారు. తమవద్ద నుండి పిల్లులను తీసుకొని వెళ్ళినవారంతా వాటిని పౌర్ణమినాడు తప్పక తీసుకొనివచ్చి చూపించాలని ఆజ్ఞాపించారు. ఆ ప్రకటన విషయం రామకృష్ణకవి తెలుసుకొని ఆలోచనలో పడ్డాడు. ' ఆవు ఇచ్చిన పాలన్నీ నేను, మా కుటుంబ సభ్యులం హాయిగా త్రాగేశాం. పిల్లికి ఒక్కనాడయినా పాలు ఇవ్వలేదు. సరిగా తిండికూడా పెట్టలేదు. అది ఇప్పుడు చచ్చేస్థితిలో వుంది. దీనిని తీసుకొని వెళ్ళి రాయలవారికి చూపిస్తే సరిగా పెంచలేదని ఏమైనా అనవచ్చు, శిక్షించవచ్చు, జరిమానా విధించవచ్చు. పౌర్ణమి యిక వారం దినాలున్నది. ఈ అగండం నుంచి బయటపడడమెలా అని దీర్ఘంగా ఆలోచించాడు. కొంతసేపైన తర్వాత భార్యను పిలిచి ఒక గిన్నెలో బాగా వేడిగా వున్న పాలు తెమ్మన్నాడు. భార్య ఒక గిన్నెలో వేడి వేడి పాలు తీసుకొని వచ్చింది. ఆ గిన్నె నొకచోట పెట్టి పిల్లిని తీసుకొనివచ్చి దానిచేత త్రాగించుటకు ప్రయత్నించాడు. పాలను చూచి అది ఎంతో ఆనందించింది, ఆనందించి త్రాగబోయింది. మూతి కాలింది. అరుస్తూ పారిపోయింది. దానిని మళ్ళీ తీసుకొనివచ్చి పాలదగ్గర విడిచిపెట్టాడు. ఎంత ప్రయత్నించినా అది పాలు ముట్టుకోలేదు. ఆ విధంగా కొన్ని సార్లు జరిగింది. ఏమైనా పిల్లి పాలు ముట్టడంలేదు. అది పాలను చూసి ముఖం త్రిప్పుకోవటం మొదలుపెట్టింది. రామకృష్ణుని చేతుల నుండి తప్పించుకొని పారిపోవుటకు ప్రయత్నించింది. కాని పాలు త్రాగుటకు సిద్దపడలేదు. దాని ప్రవర్తనను చూసి రామకృష్ణుడు ఎంతో సంతోషించాడు. గండం తప్పించుకొని గట్టెక్కగలననుకున్నాడు.

పౌర్ణమినాడు రాయలవారి సమక్షంలో పిల్లుల ప్రదర్శన ప్రారంభమైది, ప్రభుత్వోద్యోగులు ఒక్కొక్కరు తాము పెంచిన పిల్లులను ఎత్తుకొని తెచ్చి రాయలవారికి చూపిస్తున్నారు. ఒక పిల్లికంటే ఒకటి బాగా బలిసి వున్నది. అతిగా బలిసి అడుగు తీసి అడుగువేయలేక ఆయాసపడే స్థితిలో వున్నవి. ఎలుక కనపడినా పరుగెత్తి వెళ్ళలేనంత లావుగా వున్నవి. తాము ఇచ్చిన పిల్లులు తమ ఉద్యోగులు బాగా పెంచుతున్నారని రాయలవారు సంతోషిస్తున్న సమయంలో రామకృష్ణకవి తాను పెంచుటకు తీసుకొని వెళ్ళిన పిల్లిని తీసుకొనివచ్చి రాయలవారికి చూపించినాడు. అది బాగా కృశించిపోయి రేపోమాపో చస్తుందేమో అనుకొనేటట్లు వున్నది.

ఆ పిల్లిని చూడగానే రాయలవారికి ఆగ్రహం, ఆశ్చర్యం రెండూ కలిగాయి. రామకృష్ణ కవిగారు! మీ పిల్లి యిలా వుండడానికి కారణం ఏమిటని అందరు పిల్లులూ ఒకదాని కంటే ఒకటి బలిసి ఎంతో అందంగా వుండగా మీ పిల్లి బక్కచిక్కి ఈ క్షణమో, మరుక్షణమో ప్రాణం వదిలేదానిలా వుందేం? మేము ఇచ్చిన ఆవుపాలు దీనికి పట్టడంలేదా? అని అడుగగా, రామకృష్ణుడు వినయంగా మహాప్రభు! ఈ పిల్లిని పెంచడంలో నేను పడిన తిప్పలు ఇన్ని అన్నీ కావు. అసలు పాలు ముట్టదు. అప్పుడప్పుడు కాస్త పప్పు అన్నం తింటుందనుకోండి. ఎప్పుడూ దీని దృష్టి ఎలుకలమీదే! దీని పుణ్యమా అని మేమేగాక, మా యిరుగు పొరుగు యిండ్లలోని వారుకూడా ఎలుకల బాధ లేక హాయిగా వున్నారు అని చెప్పినాడు.

రామకృష్ణుని మాటలు విని రాయలవారేగాక సభలో వున్న మంత్రులు మున్నగువారు కూడ ఎంతో ఆశ్చర్యపడ్డారు. రాయలవారు, ఆయన మాటలు నమ్మలేదు. ఒక రాజభటుని పంపి పాలు తెప్పించి ఒకచోట పెట్టించారు. తమ పిల్లితో ఆ పాలు త్రాగించండి అని ఆజ్ఞాపించారు! రామకృష్ణుడు పట్టుకొనివున్న పిల్లిని తీసుకొనివెళ్ళి పాల ముందు నిలబెట్టాడు. అది ఆ పాలను చూడగానే ముఖం ప్రక్కకు త్రిప్పుకోసాగింది. రామకృష్ణుడు ఎంత ముందుకు నెట్టినా అది పాల వద్దకు పోక వెనుకకు తిరిగి వస్తున్నది. అది చూచి అంతా ఆశ్చర్యపడసాగారు. రామకృష్ణకవి చెప్పిన మాటలు నిజమే అనుకోసాగారు.

ఎవరు ఏమనుకున్నా రాయలవారు మాత్రం రామకృష్ణుని మాటలు నమ్మలేదు. ' లోకంలో పాలుత్రాగని పిల్లి వుంటుందా? రామకృష్ణుడేదో కొంటె పని చేసివుంటాడు. అందువల్లనే ఈ పిల్లి పాలు త్రాగుటకు భయపడుతున్నది ' అని ఆ పిల్లిని దగ్గరకు తెప్పించుకొని దాని నోరుపరీక్షించి చూచినారు. పిల్లి మూతి కాలిన మచ్చలు కనబడినవి. నాలుక చివర వాతపడినట్లున్నది. వాటిని చూచి రాయలవారు కోపించి రామకృష్ణకవీ! పిల్లి పాలు త్రాగకుండ మీరేదో చత్కారం చేసినట్లు గ్రహించాము. మీరు నిజం చెపితే క్షమించి విడిచిపెడతాను లేకుంటే కఠిన శిక్ష విధిస్తాను. అని బెదిరించగా, రామకృష్ణుడు జరిగిన విషయమంతయు చెప్పి ' మహాప్రభూ! మీరు మా ఎలుకల బాధ తీర్చుటకై పిల్లిని, దానిని పెంచుటకు ఆవును యిచ్చినారు. ఆ పిల్లివలన మా యింటిలోని ఎలుకల బాధయే గాక, మా ఇరుగు పొరుగుల ఎలుకల బాధకూడా పోయినది. మీరు ఎవరినైనను పంపి మా యింటిలో పరిసరములో ఎక్కడైతే ఎలుకలు కనబడతాయో తెలుసుకొని రమ్మనండి, నేను నా పిల్లిని, ఎలుకల బాధ తొలగించే స్థితిలో ఉంచాలనే ఆ విధంగా తయారు చేశాను. మీరు పిల్లినిచ్చి మా ఎలుకల బాధ పోగొట్టుటయేగాక, మాకు నిత్యం కావలసిన పాలు, పెరుగు, నెయ్యి మొదలగువానిని లోటు కలుగకుండ ఆవును కూడ యిచ్చినందుకు మీకు నేను కృతజ్ఞతాపూర్వక వందనము అర్పించుకొనుచున్నాను. నా పిల్లివలె యిచటికి తేబడిన ఏ పిల్లి అయినా ఎలుకలను పట్టగలదేమో పరీక్ష పెట్టి చూడుము. కడుపునిండాతిని, బలిసిన పిల్లులు ఎలుకలను పట్టుటకు ప్రయత్నించునా? ఇచ్చటికి వచ్చినవారినడిగి తెలిసికొని నన్ను శిక్షించుటయో, రక్షించుటయో చేయుడి అని చెప్పాడు.

రామకృష్ణుని మాటలు విని రాయలవారు అచ్చటికి బలిసిన పిల్లులను తెచ్చి వారిని విచారించగా వారి ఇండ్లలో ఎలుకల బాధ పూర్తిగా పోలేదని చెప్పిరి. రామకృష్ణుని యింటి పరిసరములలో నున్నవారిని విచారించగా తమకు ఎలుకలబాధ ఏ మాత్రం లేదని చెప్పిరి. ఆ సమాచారం తెలుసుకొని రాయలవారు రామకృష్ణుడు చేసిన పని సరియైనదేనని మెచ్చుకొని, వందవరహాలు బహుమతిగా యిచ్చి సత్కరించారు.
===========================================================

పావురాళ్ళు-రాళ్ళు


పావురాలంటే వెంకయ్యకు ఎంతో ఇష్టం. రకరకాల పావురాలను తెచ్చి పెంచుతూ ఉంటాడు!అరలు అరలుగా గూళ్ళతో నిండిన పెట్టెలు ఇంటి వసారాలో చూడ ముచ్చటగా అమర్చి పెట్టాడు. పప్పులు, పళ్ళు పెట్టి సరదాగా పెంచడం వల్ల, ఆ పావురాలు బాగా బలిసి, నవనవలాడుతూ ఎంతో అందంగా ఉంటాయి.

ఓ నాడు, గూళ్ళల్లోని పావురాలనన్నిటినీ విడిచి పెట్టి వెంకయ్య వాటికేసి సరదాగా చూస్తూ అరుగు మీద కూర్చున్నాడు. వయ్యారంగా అడుగులు వేస్తూ, ఆ పావురాలు అటూ ఇటూ తిరుగుతూ ఉంటే హంసల్లా ఉన్నాయని అనుకొంటూ వెంకయ్య మురిసి పోతున్నాడు!

అంతలో ఆ పావురాలు నేలమీద వున్న చిన్నచిన్న రాళ్ళ పిసళ్ళను వెదుక్కొంటూ వాటిని మింగుతున్నాయి. అది చూసిన వెంకయ్యకు ఆశ్చర్యం కల్గింది! అసహ్యం కూడా వేసింది; "మంచి మంచి పప్పులు, పళ్ళు పెడుతూవుంటే, ఇవి రాళ్ళు మింగుతున్నాయేమిటి?" అని కోపం కూడా వచ్చింది. వెంటనే, ఛీ!మట్టి తినే ఈ పావురాలను పెంచడం నాదే తప్పు" అనుకొంటూ, చేతిలో ఉన్న కర్రను, వాటి మీద బలంగా విసిరాడు. కర్రదెబ్బ తప్పించుకొని పావురాలన్ని ఎగిరి పోయాయి కానీ, పావురాలతో పాటు రాతి పిసళ్ళను మింగుతూవున్న ఓ పిచ్చుకకు బలంగా దెబ్బ తగలడం వల్ల పక్కగా ఒరిగి పడిపోయింది.

'అయ్యో' అనుకొంటూ దగ్గరకు వచ్చిన ఓ పావురంతో అంది, ఆ పిచ్చుక, బాధపడుతూ "మన బతుకు పద్దతి ఇతడికి తెలియదు అతడు పెట్టే పప్పులు, పళ్ళు, బలమైన ఆహారం తింటున్నాం. అవి జీర్ణం కావడానికి రాళ్ళు తింటాం. ఇది మన తిండి పద్ధతి! ఆ విషయం తెలుసుకోక, అతడు మనలను కొట్టి తరుముతున్నాడు. ఇటువంటి తెలివి తక్కువవాడి వద్ద ఉండడం మనదే తప్పు, ప్రమాదం కూడానూ, పద, పోదాం" అంటూ పావురం సాయంతో పిచ్చుక ఎగిరి పోయింది! పావురాలన్నీ తలొక దిక్కుకూ ఎగిరిపోయాయి.

నిశ్చేష్టుడై వెంకయ్య అలానే కూర్చుండి పోయాడు, ఆకాశంలోకి ఎగిరి పోతున్న పావురాల కేసి చూస్తూ...!
======================================================

పిశాచాలు చేసిన సహాయము

అనగనగా అవంతీపురం సమీపములో గల గ్రామములో ఒక ముసలి అవ్వ, మనుమడు ఉన్నారు. అవ్వ అమాయకురాలు. ఇరుగు పొరుగు అవ్వకి మాయమాటలు చెప్పి ఉప్పు, పప్పు తీసుకువెళ్ళేవారు. అవ్వను సుఖపెడదామంటే అవ్వచేసే పనికి మనుమడికి కోపం వచ్చేది. పై పెచ్చు గుట్టుగా సంసారము చేయాలని తెలియదు అనేది. ఒక రోజున అవ్వ ఇల్లు ఊడుస్తూ ఉంటే చిన్న తాళము చెవి దొరికింది. అది తన మనుమడి పెట్టెదని తీసి పెట్టె తాళము తీసి పెట్టెలోపల డబ్బు చూసి అందరిని పిలిచి చెప్పింది. ఆ మాటలు చాటుగా ఉన్న దొంగలు విని హడావుడిగా వచ్చి మీ మనుమడు చెట్టు మీదనుంచి పడిపోయాడు. దెబ్బలు తగిలాయి. డబ్బు తీసుకొని రమ్మన్నాడని చెపితే తీసుకొని వాళ్లమాటలు నిజమేనని నమ్మి ఆ డబ్బులు ఇచ్చింది అవ్వ. ఆధనము తీసుకొని వాళ్ళు పారిపోయారు. అవ్వ ఏడుస్తూ గుమ్మంలో చతికిలపడింది.

కొంతసేపు గడిచేసరికి మనుమడు సరుకులు తీసుకొని వచ్చాడు. అప్పుడే దెబ్బలు తగ్గిపోయాయా? అని అవ్వ అడిగేసరికి అవ్వ చెప్పిన మాటలు వల్ల అంతా తెలిసి నా కష్టార్జితము మట్టి పాలు చేశావు గదే! ఇంకా కాస్త కూడబెట్టి పట్టణంలో వ్యాపారము చేద్దామనుకున్నాను. నాకు ఆ రాత లేదే. మళ్ళీ నా కంటికి కనిపించకు, వెళ్ళిపో అని అన్నము తినకుండా వెళ్ళిపోయాడు. మనుమడి మాటలకు అవ్వకు పట్టరాని దుఃఖము కలిగి అడవిలోకి వెళ్ళి పిశాచాల బారిన పడి మరణించాలని బయలుదేరి వెళ్ళి చింతచెట్టు దగ్గర కూర్చొని పిశాచాలు పిశాచాలు రండి అంటూ అరిచింది. రెండు తెల్లని పిశాచాలు వచ్చి మమ్మల్ని ఎందుకు పిలిచావు అంటూ అడిగాయి. అవ్వ వాటిని చూసి భయపడక విషయమంతా చెప్పి నా మనుమడిచే అంత మాటలు అనిపించుకున్నాక ఎందుకు బ్రతకాలి నన్ను చంపేయండి అంది.

పిశాచాలు కూడబలుక్కొని అది కుర్రదొంగలపని అని గ్రహించి అవ్వా నీ మనుమడి ధనము నీ చేతికి తిరిగి వస్తే ఇంటికి వెళతావా? లేక చచ్చిపోతావా? అని అడిగాయి. ధనము దొరికితే ఇంటికి వెళ్తానంటే సరే మా వెంటరా అని కుర్రదొంగల వద్దకు తీసుకువెళ్ళి బయట ఉండమని చెప్పాయి. లోపల అందమయిన అమ్మాయిని వాళ్ళిద్దరూ ఏడిపించటం గమనించి ఆ అమ్మాయిలో ప్రవేశించి నేను పిశాచాల పెద్దమ్మ పెంపుడు కూతుర్ని. మీ సంగతి చెప్తా అంటూ ఇద్దర్నీ చావబాదింది. దాంతో వాళ్ళిద్దరూ పారిపోవడానికి ప్రయత్నించగా రెండో దయ్యము పిశాచము ఆవహించి వున్న దయ్యం కాళ్ళ దగ్గర పడేసింది. దాంతో హడలెత్తిన దొంగలతో అవ్వను మోసం చేసి ధనము తీసుకున్నది మీరేనా అని అనగా మేమే అంటూ ఆ ధనమును అక్కడ పడేసి పారిపోయారు. వాళ్ళు వెళ్ళగానే అవ్వ లోపలికి వచ్చింది. అవ్వా! నీ డబ్బు తీసుకో. అని ఈ అమ్మాయి మంచిది. సవతి తల్లి బాధలు పడలేక వచ్చి వీరి బారిన పడింది. నీ మనుమడికి ఇచ్చి వివాహం చేసి సుఖంగా ఉండు అని చెప్పి అదృశ్యమయ్యాయి.

అవ్వ ధనముతో పాటు అందగత్తెలాంటి అమ్మాయిని తీసుకురావడం చూసిన మనుమడు అవ్వా ఎవరు ఈమె అన్నాడు. నీ భార్య నీ ధనము ఇదుగోరా అంటూ జరిగిన విషయము చెప్పింది. మంచి ముహూర్తం చూసి వారి వివాహం జరిపించింది. వారు సుఖంగా జీవనంసాగిస్తున్నారు.
===========================================================

పిసినారి పేరయ్య

చాలా మందికి సంతకాలు చేయడం వచ్చింది. పేపరు చదువుతున్నారు. మంచి విషయాలు తెలుసుకోగలుగుతున్నారు. పంతులుగారిపైన అందరికీ గౌరవం, ప్రేమ. రాగానే పాదాలంటేవారు. ఆయన ఆశీర్వదించేవారు. రాత్రి బడికి పంతులుగారు వచ్చారు. చేతిలో వేమన శతకం ఉంది. వారంతా ఆ కథలు వినాలని అడిగారు. ఆయన అంగీకరించారు. అందరూ పుస్తకాలు చదువుతారు. వేమన జీవితం చదివాడు. ఎదుటివారిని చదివాడు. అనుభవం గడించాడు. యోగిగా మారాడు. చెప్పడం ప్రారంబించారు పంతులుగారు. నా చిన్నతనంలోని ఒక సంఘటన చెపుతాను. మా గ్రామంలో ఒక దుకాణం ఉండేది. ఆ దుకాణంలో సరుకులు అన్నీ దొరికేవి. యజమాని పేరు పేరయ్య. పేరయ్యకు పేరాశ. మంచి మాటకారి. అందరితో కలుపుగోలుతనంగా ఉండేవాడు. అప్పులు ఇచ్చేవాడు. బేరం అధికంగా ఉండేది. అందరూ ఆ దుకాణంలోనే కొనేవారు. అయితే అతను పరమలోభి. కడుపునిండా తినేవాడు కాడు. పిల్లికి బిచ్చం పెట్టేవాడు కాడు. భార్య పేరు లీల. మంచి మనిషి. అయినా మొగుడికి భయపడేది. సొంతంగా ఏమీ చేసేది కాదు. ఆమెనూ కడుపు నిండా తిననిచ్చేవాడు కాదు. కొడుకు పేరు బాలరాజు. పదకొండు సంవత్సరాల వయస్సు. అక్షరం రాదు. ఎప్పుడూ ఏదో ఒకటి తినాలి. చొక్కా ధరించడు. నిక్కరుతో ఉండేవాడు. ఇది తండ్రికి నచ్చదు. బాదుతూ ఉండేవాడు. బాలరాజు ఏడిచి గోలచేసేవాడు.

అందరూ మంచి కూరలు అమ్మేవారు. పేరయ్య పుచ్చూ చచ్చూ అమ్మేవాడు. ఎక్కువ ధర తీసుకునే వాడు. మాటలు మాత్రం మంచిగా ఉండేవి. బాగా సంపాదించాడు. పొలం కొన్నాడు. భవనం కట్టించాడు. పొలం వెళ్ళేవాడు. అజమాయిషీ చేసేవాడు. ఇంట్లో వారికి మంచి దుస్తులు ఉండవు. మంచి తిండి ఉండదు. రూపాయికీ తనకూ లంకె. ఎవరు పిలిచినా వెళ్ళి తినేవాడు. తనకు అయిన వారికి గూడా ఏది విదిలించేవాడు కాడు. చీకటి పడేది. ధనం దాచిన పెట్టె వద్దకు వెళ్ళేవాడు. దానిని చూసుకుంటూ మురిసి పోయేవాడు. అక్కడే నిదురించేవాడు. భార్యకు నలతగా ఉంది. లేవడం లేదు. పేరయ్యకు బాధలేదు. ఆమెకు వైద్యం లేదు. నీరసంగా వుండేది. పాలు పితకమనేవాడు. ఇంటి చాకిరీ చేయించేవాడు. నీరు తోడించేవాడు. కొడుకేమీ చేయడు. పాపం ఆమెకు జ్వరం మొదలయింది. అందరూ వైద్యునికి చూపించమన్నారు. అదే నయమవుతుందనేవాడు. అన్నిటికీ మిరియాల కషాయమే మందు అనేవాడు. రోజు రోజుకూ ఆమెకు సుస్తీ ఎక్కువయింది. పేరయ్యకు ఖర్చు అంటే భయం. వైద్యుని కలవలేదు. ఆమె మంచం మీద వుంది. కదలలేక పోతోంది. కాఫీ అడిగే వారు లేరు. పేరయ్య బేరం చేస్తూనే వుండేవాడు. మందూ లేదు, మాకూ లేదు. అమె మరణించింది.

కొడుకు కాసేపు ఏడిచాడు. చిరు తిండి ప్రారంభించాడు. పేరయ్యకు బాధేలేదు. మందుల పైకం మిగిలిందని ఆనందం. దహనం చేయించాడు. బంధువులకు తెలియదు. కర్మకాండలు లేవు. పైకం మిగిలిందని పేరయ్య ఆనందం. బంధువులు కూడా వచ్చేవారు కారు. అతని సంగతి అందరికీ తెలుసు. పనిమనిషి కుదిరింది. పేరయ్యకు పని జరిగిపోతోంది. కొడుకు జులాయిగా మారాడు. చదివించమనేవారు ఊరివారు. పైకం దండగ అనేవాడు పేరయ్య. బాలరాజు తిండికి ముందుండే వాడు. తరువాత కోతి కొమ్మచ్చులు ఆడేవాడు. అయినా పేరయ్యకు చీకూ చింతా కలుగలేదు. చివరకు జులాయిగా మారాడు. ఇంటికి పేచీలు, కొట్లాటలు తెచ్చేవాడు. దుకాణంలో కరివేపాకు వుండేది. కానీ కరివేపాకు మరొకరిని అడిగేవాడు. ఏమిటంటే మంచిది కాదు అనేవాడు. పాడి గేదెను కొనడు, మజ్జిగ ఎదురింటి వారిని అడిగేవాడు. వంటపని ఒకరికి పురమాయించేవాడు. ఒకరి సహకారం వొకరికి అవసరమంటాడు. తన పైకం మాత్రం తీయడు. ఎదుటి వారిని అడిగేవాడు. అందరూ హేళన చేసేవారు. తనకు రోగం వచ్చేది. జీలకర్ర, మిరియాలు నమిలేవాడు. వైద్యం చేయించుకునేవాడు కాదు. శరీరం శాశ్వతం కాదనేవాడు. పైకం దాపరికం దేనికని అడిగేవారు. పైసా యే పరమాత్మా హై అనేవాడు.

మరికొంత పొలం బేరం చేశాడు. ఇంకో రెండు ఇండ్లు కొన్నాడు. అయినా వొంటికి సుఖం లేదు. మంచి లేదు. బాలరాజుకు చిరుతిండి ప్రధానం. ఇంకేమీ అవసరం లేదు. పేరయ్య ధనాన్ని ప్రేమించాడు. ధనం గురించే ఆలోచించాడు. మనుషులను నమ్మలేకపోయాడు. ప్రేమించలేకపోయాడు. దొంగల భయం. కంటికి నిదురరాదు. తిండి సహించేది కాదు. ఆరోగ్యం పాడైంది. పక్షవాతం వచ్చింది. వైద్యుని చూడలేదు. పైకం పాడవుతుంది. అదీ అతని ఆలోచన. చేసేవారు లేరు. కొడుకును నమ్మడు. బాలరాజు బరి తెగించాడు. దొరికింది దుబారా చేయసాగాడు. పేరయ్య బావమరిదికి ఈ తంతు అంతా తెలిసింది. అయినా రాలేకపోయాడు. ఇతరుల సలహా మీద బావమరిదిని పిలిపించాడు పేరయ్య. కొడుకుని దారి చేయమని అడిగాడు. పైకం యీయనని చెప్పాడు. అందరూ మందలించారు. అయినా వినలేదు. బావమరిదికి అక్కగారి మీద అభిమానం. బాలరాజును తీసుకుపోయాడు. ఆ ఊరి నదికి వరద వచ్చింది. చాలా ప్రాణాలు పోయాయి. నీరు ఊరంతటినీ ముంచింది. పేరయ్య పెట్టెను కౌగిలించుకున్నాడు. వదలలేదు. నీరు బాగా త్రాగాడు. వరద నీటిలో హరీమన్నాడు. పెట్టెను కౌగిలించుకున్నాడు. ప్రాణం నిలుపుకోలేకపోయాడు.

అందుకే వేమన చెప్పింది. లోభిని ఎవరూ ఏమీ చేయనవసరం లేదు. పైకం అడిగితే చాలు పడి చస్తాడు అని నీతిని చెప్పాడు. సంపాదించాలి. సంపాదించింది అనుభవించాలి. అతడే మనిషి. ఇది మనకు వేమన తెలియ చేసిన నీతి. మరిచిపోకండి. అంటూ పంతులు గారు పాఠం ముగించారు.
==========================================================

పుట్టినరోజు

ఉదయం ఆరు గంటలు కావొస్తోంది. రవి ఇంకా నిద్రలేవలేదు. "ఒరేయ్ రవి! లేవరా! ఈరోజు నీ పుట్టినరోజు, మరచిపోయావా"? అంటూ సునీత గదిలోకి వచ్చింది. మగతనిద్రలో వున్న రవి, తల్లి పిలుపుతో లేచికూర్చున్నాడు. అది చూసి సునీత "హ్యపీ బర్తడే" అంటు శుభాకాంక్షలు తెలిపింది. "ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిరా! మీ డాడీ హాల్లో ఎదురచూస్తున్నారు" అంటూ వెళ్ళిపోయింది.

రవి తండ్రి రాఘవ పట్టణంలో పెద్ద వ్యాపారస్ధుడు. రవి వారికి ఒక్కగానొక్క కొడుకు. ఆ ఊరి పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నాడు. కలవారి బిడ్డయినా క్రమశిక్షణతో పెరిగాడు. మాష్టార్లకు రవి అంటే చాలా యిష్టం. చదువుల్లోను, ఆటల్లోను ఫస్టు. తోటి పిల్లలతో స్నేహంగా ఉంటాడు. పేదపిల్లలను అవసరాల్లో ఆదుకొంటాడు. రవి స్నానం చేసి వచ్చి తల్లిదండ్రుల ఆశీస్సులందుకొన్నాడు. రాఘవ వందరూపాయల నోటును రవి చేతికిచ్చి "నీ కిష్టమైన వస్తువు కొనక్కో" అని చెప్పి వెళ్ళి పోయాడు.

రవి ఆ నోటును జేబులో ఉంచుకొని బడికి వెళ్ళాడు. క్లాసులో ఉమ టీచర్ "మదర్ థెరీసా" పాఠం చెబుతోంది. అందులో మదర్ చేసిన సేవా కార్యక్రమాలను గూర్చి వివరిస్తోంది. పిల్లలంతా ఆసక్తిగా వింటున్నారు. అప్పుడు రవి పైకి లేచి 'మదర్ థెరీసా' అంటే ఎవరు టీచర్? అని అడిగాడు. "దీన జనులకు సాయపడాలనే తపనతో పరాయిదేశం నుంచి మన దేశానికి వచ్చింది. ఇక్కడ ఎందరో రోగపీడితులకు, అనాథ పిల్లలకు, వృద్దులకు ఆసుపత్రులు శిశుకేంద్రాలు, వృద్దుల పునరా వాస కేంద్రాలను స్ధాపించింది. సేవాభావంతో వాటిని నడిపించి అందరి బాధలను తనవిగా భావించి వారికోసం తన జీవితాన్ని అంకితం చేసింది. అటువంటి కరుణామయి సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం, ఆమెకు "భారతరత్న"నిచ్చి గౌరవించింది. అంటూ గోడపై వేలాడుతున్న మదర్ ఫొటోను చూపించింది. అది చూసి రవి మనస్సు భక్తి భావంతో నిండిపోయింది. ఇంతలో బడిగంట మోగింది. పిల్లలంతా బిలబిలమంటూ బయటికి వస్తున్నారు.

రవి మనస్సులో టీచర్ చెప్పిన పాఠం మెదులుతూనే ఉంది. ఈ పుట్టినరోజున తాను కూడా ఏదైనా మంచి పని చేయాలనుకొన్నాడు. ఏమి చేయాలా అని ఆలోచిస్తుంటే కొంత దూరంలో ఆసుపత్రి బోర్డు కనిపించింది. వెంటనే పండ్ల దుకాణానికి వెళ్ళి తన వద్ద ఉన్న వంద రూపాయలతో పండ్లను కొని ఆసుపత్రిలోని రోగులకు పంచిపెట్టాడు. అక్కడ ఉన్న వైద్యులు రవి మంచి మనస్సును అభినందించారు. ఒక మంచి పని చేసానన్న తృప్తితో ఇంటికి వచ్చాడు. రవి రావడం తండ్రి గమనించి "ఒరేయ్! రవీ! ఎందుకాలస్యంగా వచ్చావ్? బజారుకెళ్ళి ఏమైనా కొన్నావా? అంటూ ప్రశ్నించాడు. తండ్రికి ఏమని జవాబు చెప్పాలో తెలియక అలాగే తలవంచుకొని నిలబడ్డాడు.

కొడుకు మౌనంచూసి రాఘవ "ఏమైందిరా! నీకు! అలా మౌనంగావున్నా" వంటూ గద్దించాడు. అప్పుడు రవి జరిగినదంతా చెప్పి తండ్రివంక భయంగా చూసాడు. అది విని రాఘవ ముఖం సంతోషంతో నిండిపోయింది. రవిని దగ్గరికి పిలచి భుజంతట్టి ఇంత మంచి పనిచేసి భయపడతా వెందుకు? అంటూ మెచ్చుకొన్నాడు. తండ్రి పొగడ్తవిని రవి ఆనందంతో ఎగిరి గంతేసాడు.

ఆ రాత్రి భోజనం చేసి నిదుర పోయాడు. ఆ నిదురలో ఒక కల వచ్చింది. ఆ కలలో ఎక్కడ నుంచో "రవీ!" అంటూ పిలుపు వచ్చింది. అలా వెళుతుంటే తెల్లని వస్త్రాలు ధరించి దేవదూతలా మెరుస్తున్న ఒక ముసలావిడ కనిపించింది. ఆమె "రవీ! నన్ను గుర్తుపట్టలేదా!" అంటూ ప్రేమగా పలికింది. రవి ఆమెవంక ఆశ్చర్యంగా చూసి "మదర్! మీరా!" అంటూ దగ్గరికి వెళ్ళాడు.

"రవీ! ఈరోజు నువ్వు చాలా మంచి పని చేసావు. అలాగే నువ్వు బాగా చదివి గొప్పవాడివి కావాలి. ఇలాంటి మంచి పనులెన్నో చెయ్యాలి? అంటుంటే కల చెదిరింది. రవి మదర్! మదర్! అని కలవరిస్తున్నాడు.

"ఓరేయ్! రవీ! ఏమైందిరా నీకు?" అంటున్న తల్లి పిలుపుకు రవి ఉలిక్కిపడి లేచి ఏమీలేదని తలూపి మళ్ళీ నిదురపోయాడు. మరుసటిరోజు క్లాసులో జరిగినదంతా టీచర్‌కు చెప్పాడు. టీచర్ "పిల్లలూ! విన్నారు కదూ! మదర్ ఏమి చెప్పిందో! మీరు కూడా బాగా చదువుకొని గొపవాళ్ళు కావాలి. మదర్‌ను ఆదర్శంగా చేసుకొని ఆమె అడుగు జాడాల్లో నడచి పేదలకు, అనాథలకు సేవ చేస్తారు కదూ అంది. పిల్లలు అలాగే టీచర్! అన్నారు ఒక్కసారిగా!
============================================================================

పులి మీసం

ఒక అడవి దగ్గరలో ఒక మహిళ ఉండేది. ఆవిడ పేరు ధర్మావతి. ఆమె వుంటున్న ఊరికి ఒక ఋషి వచ్చాడు. చాలామంది ఋషి వద్దకు వెళ్ళి సలహాలు పొదుతున్నారు. ఈ సంగతి ధర్మావతి కూడా విన్నది. ధర్మావతి కొన్ని కష్టాలు వున్నాయి. ఆ ఋషి దగ్గరకు వెళ్ళి సలహా తీసుకోవాలి. ఆయన దగ్గర కొన్ని శక్తులు కూడా వున్నాయి. పొరుగువారు చెప్పగా విన్నది. కొంత కాలంగా ఆమె భర్తలో ఏదో మార్పు వచ్చింది. ధర్మావతి భత్ర యుద్దంలో పని చేసి వచ్చాడు. మూడు సంవత్సరాలు భార్యకు దూరంగా వున్నాడు. ఆ తరువాత తిరిగి వచ్చాడు ఆమె భర్త. అప్పతి నుండీ అతనిలో ఏదో తేడా వచ్చింది. ఆమెతో సరిగా మాటలాడటంలేదు. భార్యమీద యిది వరకు ప్రేమ చూపడం లేదు. ఇది ధర్మావతిని ఎంతో బాధించింది. తన భర్త ప్రేమ పొదడానికి ఏదైనా చిట్కా కావాలి. అందుకోసం ఆమె ఋషి వద్దకు వచ్చింది. వినయ విధేయతలతో చేతులు జోడించింది. నమస్కారం స్వామీజీ! నా పేరు ధర్మావతి. నాభర్త నాతో ప్రేమగా వుండటంలేదు. నా భర్త నాతో మునుపటిలాగా ప్రేమగా వుండాలి. అందుకు ఏదైనా ఉపాయం చెప్పండి అని వేడుంది. ఋషి ఆలోచించాడు. నీ భర్త యిది వరకులా నీతో ప్రేమగా వుండాలి. నేను ఒక మందు తయారు చేసి యిస్తాను. ఆ మందు అతని చేత తినిపించు. కొద్ది రోజులలో అతను నీకు దగ్గర అవుతాడు. నిన్ను గౌరవంగా చూసుకుంటాడు. నీ మీద ప్రేమను చూపుతాడు. నిన్ను వదిలి వుండలేదు అన్నాడు. ధర్మావతి సంతోషించింది. 'ధన్యవాదాలు స్వామీ' అంది. అయితే ఒక యిబ్బంది వుంది. ఆ మందుకు అన్నీ వున్నాయి. ఒక దినుసు తక్కువ అయింది. మరి ఆ దినుసు నీవు తీసుకు రాగలవా? అన్నారు స్వామీజీ. అలాగే స్వామీ. నా భర్తకోసం ప్రాణాలకు తెగిస్తాను. ఆ దినుసును తెస్తాను అంది. అప్పుడు ఆ ఋషి యిలా అన్నాడు. అది పెద్ద పులి మీసం. అది నువ్వు తీసుకు రాగలిగితే చక్కని మందు తయారవుతుంది. నీ భర్తలో మంచి మార్పు వస్తుంది. అలాగే స్వామీ. మీరు చెప్పిన విధంగానే చేస్తాను. నా ప్రాణాలకు తెగించి అయినా పెద్దపులి మీసం తెస్తాను.

పులి ధర్మావతిని చూస్తూనే గాండ్రించింది. భయంతో గజగజ వణికి పోయింది ధర్మావతి. అయినా గుండెదిటవు చేసుకొని నిలబడింది. అలా కాసేపు నిలబడి తన యింటికి తిరిగి వెళ్ళింది. మరుసటి రోజు తిరిగి అడవికి వెళ్ళింది. అక్కడ ఇంకోచోట నిలబడింది. పులి మళ్ళి గట్టిగా గాండ్రించింది. ధర్మావతి అలాగే నిలబడింది. ఇలా కొన్ని రోజులు జరిగాయి. రోజులు గడిచే కొద్దీ ధర్మావతిని చూసి పులి అరవడం మానుకుంది. ఆతర్వాత కొన్ని పిండి వంటలు వండి పులికి పెట్టింది. ధర్మావతి వండిన వంటకాలు రుచి చూసింది పులి. ఆవురు ఆవురు మంటూ తిన్నది. నాలుకతో మూతి తుడుచుకుని అడవిలోకి వెళ్ళిపోయింది. ఇంకొన్ని నాళ్ళకు పులి బాగా అలవాటు అయింది. ఇప్పుడూ ధర్మావతి ముట్టుకున్నా పులి ఏమీ అనడం లేదు. చివరికి ఒక రోజు ఆ పులిని నిమురుతూ వుంది ధర్మావతి. అదను చూసి పులి మీసం పీకింది. పులి మూలిగిందేగానీ ఏమీ అనలేదు. ధర్మావతి పర్గుపరుగున వచ్చింది. పులి మీసం తీసుకొని ముని వద్దకు వచ్చింది. స్వామీ ఎంతో శ్రమ పడి పులి మీసం స్మపాదించాను తీసుకోండి అన్నది ధర్మావతి. ఋషి ఆమె యిచ్చిన పులి మీసాన్ని అందుకుని మంటలో పడవేశాడు. ధర్మావతి ఆశ్చర్యపోయింద్ది. అయ్యో స్వామీ! యిలా చేశారేంటి? అని తెగ గాధపడింది. అప్పుడు ఋషి యిలా అన్నాడు. అమ్మా ధర్మావతీ నీకు ఏ మందుతోనూ పనిలేదు. నువ్వు నాకు ఓక సంగతి చెప్పు. పులిని నువ్వు ఎలా లొంగదీసుకున్నావు? ప్రేమ, ఆప్యాయతలతో! అవునా? ఎంతో కౄరమైన జంతువునే లొంగదీసుకున్నావు. అంతటృఇ ఓర్పుగల నీవు నీ భర్తను లొంగదీసుకోలేవా? ఇదే ప్రేమ, అనురాగం నీ భర్తపై చూపించు. సహనంతో అతనిని నీ వైపుకు మళ్ళించుకో. నీ ప్రేమను పంచి, అతని ప్రేమను పొందు. అని చెప్పాడు ఋషి. ధర్మావతికి కళ్ళు తెరచుకున్నాయి. ధైర్యంగా యింటికి వెళ్ళింది. భర్తలో మార్పు తెచ్చింది. అతని నుండి వెనకటి ప్రేమను పొందింది.

నీతి: ఆత్మ బలం చాలా గొప్పది. దానితో జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చును.
===========================================================

పేదరాశి పెద్దమ్మ కథ

అనగనగా ఒక ఊరు ఉంది. ఆ ఊళ్ళో పేదరాశి పెద్దమ్మ ఉందట. పెద్దమ్మకు నలుగురు కూతుళ్ళు ఉన్నారు. కూతుళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. వారికి మంచి మనువులు చూసింది. తను దాచుకున్నవి తలోకాస్త ఇచ్చి వేసింది. తన వద్ద మిగిలింది ఏమీ లేదు. తాను బతకాలి కదా! కనుక ఒక్కో కూతురి ఇంట మూడు మాసాలు ఉంటుంది. అల్లుళ్ళు మంచివాళ్ళు దొరికారు. అత్తగారిని బాగా చూసుకుంటారు. ఇలా చాలా కాలం గడిచింది. ఈ ఏర్పాటు బాగానే ఉంది. పెద్దమ్మకు వంట వార్పు పని లేదు. హాయిగా గడచిపోతూంది. ఒకసారి పెద్దమ్మ కూతురు ఇంట్లో మూడు మాసాలు ఉంది. పెద్ద కూతురు అన్నీ వండి పెట్టింది. హుషారుగా ఉంది పెద్దమ్మ. ఒక రోజు రెండవ కూతురు ఇంటికి బయలు దేరింది. కొంత దూరం సాగింది. మధ్యలో అడవి వచ్చింది. అడవి గుండా నడిచి వెళ్ళాలి. పెద్దమ్మ చక చకా నడవసాగింది. అడవి మధ్యకు చేరింది. ఆ అడవిలో ఒక పులి ఉంది. నరవాసన పట్టింది. పెద్దమ్మను సమీపించింది. నిన్ను తినేస్తాను - అంది పులి పెద్దమ్మతో. పెద్దమ్మకు భయం వేసింది.

చెమటలు పట్టాయి. పెద్దమ్మ తెలివైనది. యుక్తి గలది. కాస్త ఆలోచించింది. పులితో ఇలా అంది. పెద్ద పులీ! పెద్ద పులీ! నేను ముసలదాన్నయాను. బాగా చిక్కిపోయాను. ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు రెండో కూతురు ఇంటికి వెళుతున్నాను. వాళ్ళు బాగా ఉన్నోళ్ళు . అక్కడ పది రోజులు ఉంటాను. రెండవ అమ్మాయి చాలా మంచిది. నా కోసం గారెలు చేస్తుంది. సున్ని ఉండలు చేసి పెడుతుంది. అరిసెలు చేస్తుంది. అన్నీ తింటాను. ఒళ్ళు చేస్తాను. బలిసి వస్తాను. అప్పుడు తిందువుగాని - అంది పెద్దమ్మ. పెద్దపులి పెద్దమ్మ మాటలు నమ్మింది. పెద్దమ్మను పులి అప్పటికి వదిలి పెట్టింది. పెద్దమ్మ రెండవ కూతురు ఇంటికి వెళ్ళింది. పది రోజులు అయ్యింది. పదిహేను రోజులు దాటింది. నెల పూర్తయింది. పెద్దమ్మ మరలా అడవిన రాలేదు. ఎలాగైనా రాకపోతుందా! ఇదే దారి కదా. అప్పుడు పడతా పెద్దమ్మ పని - అని కాచుకొని కూచుంది పులి. పెద్దమ్మ మూడు నెలలు అచట గడిపింది. ఇక బయలుదేర వలసిన పరిస్థితి ఏర్పడింది. అది ఒప్పందం కదా.

బయలు దేరే రోజు దగ్గర పడింది. పెద్దమ్మ రెండవ కూతురిని పిలిచింది. పులితో జరిగిన గొడవ చెప్పింది. పెద్దమ్మ కూతురూ తెలివైనదే. అమ్మను కాపాడాలి. బాగా ఆలోచించింది. ఒక పెద్ద బాన తెచ్చింది. బానలో పెద్దమ్మను కూచో పెట్టింది. మూత పెట్టింది. మూతకు గుడ్డ కట్టింది. దొర్లించి వదిలి పెట్టింది. బాన దొర్లుతూ అడవినబడి పోతాఉంది. బానలోని ముసలమ్మ హుషారుగా ఉంది. పులి నన్నేమీ చేయలేదు - అనుకుంది. "బానా బానా దొర్లు,దొర్లు" అంటూ పాడుకుంటుంది. బాన అడవి మధ్యకు చేరింది. పులి సమీపించింది. పులికి బానలో పాట వినిపించింది. పులికి ఎక్కడలేని కోపం వచ్చింది. బానను కాలితో ఆపింది. పంజాతో గట్టి దెబ్బ కొట్టింది. బాన ఢాం అని పగిలిపోయింది. ముక్కలయింది. పెద్దమ్మ బయటపడింది. భయం వేసింది. నిన్ను ఇప్పుడే తింటాను - అని పులి కేక వేసింది. పెద్దమ్మకు వణుకు పుట్టింది. అయినా ధైర్యం తెచ్చుకుంది. మళ్ళీ కాస్త ఆలోచించి పెద్ద పులీ! పెద్దపులీ!ప్రయాణంలో ఒళ్ళంతా చెమట పట్టింది. నీరసంగా ఉంది. అలసిపోయాను. పక్కనే చెరువు ఉంది. ఆ చెరువులో స్నానం చేసి వస్తాను. అపుడు హాయిగా తిందువుగాని - అంది పెద్దమ్మ. పులి "సరే" అని వదిలి పెట్టింది.

పెద్దమ్మ చెరువులోకి దిగింది. స్నానం చేసింది. బయటకు రాలేదు. గంట అయ్యింది. రెండు గంటలు అయింది. పులికి కోపం వచ్చింది. ఆకలి పెరిగింది. పులి చెరువు ఒడ్డున నిలబడి పెద్దమ్మను పిలిచింది. పెద్దమ్మ పులి మాటలు విన్నది. కాని పట్టించుకోలేదు. ఏమైనా పులి పెద్దమ్మను తినేయాలనుకుంది. పులి చెరువులో దిగింది. పెద్దమ్మను సమీపించింది. పెద్దగా అరిచింది. పెద్దమ్మను చంపేయాలనుకుంది. పంజా ఎత్తింది. పెద్దమ్మ తక్కువదా! ముందే ఆలోచించింది. రెండు గుప్పెట్ల నిండా ఇసుక తీసుకుంది. పులి మీదకు రాగానే పులి కంట్లో ఇసుక చల్లింది. పులి కళ్ళు కనబడలేదు. కేకలు పెట్టింది. చెరువులోనే గిలగిల తన్నుకుంది. ఈలోగా పెద్దమ్మ ఒడ్డుకు చేరుకుంది. అడవిలో నడిచింది. మూడవ కూతురు ఇంటికి చేరుకుంది. కనుక మనం ఉపాయంతో బతకాలి. తెలివిగా మెసలడం నేర్చుకోవాలి. సమయానికి తగిన ఆలోచన చేయాలి. అలా ఉంటే హాయిగా జీవించగలం.
========================================================

ప్రజ్ఞాశాలి

అనగనగా ఒక రాజు. అతని దగ్గర బాగా డబ్బుంది. దాచడం కోసం ఒక శిల్పిని పిలిచి, రహస్య ధనాగారం ఏర్పాటు చేయించాడు. దానికున్న రహస్యద్వారం కూడా ఇతరులకు తెలియనివ్వలేదు. దీనిని నిర్మించిన శిల్పి మాత్రం తక్కువ వాడా? పిసినారి రాజుకు తగ్గవాడే! రాజుకు తెలీయకుండా గోడకు అమర్చిన రాతి పలకల్లో ఇంకో రహస్య మార్గం ఏర్పాటు చేసి, పోయే ముందు కొడుకులిద్దరికీ దాని సంగతి చెప్పి కన్ను మూశాడు. డబ్బు కావలసినప్పుడు. వాళ్ళిద్దరూ, ఆ మార్గం వాడుకొనేవారు. అసలే పీనాసి రాజు. రోజూ డబ్బును తనివి తీరా చూచుకొనే గుణం ఉండడంవలన ధనం మాయం కావడం గమనించాడు.

రాజు కత్తెర బోను ఏర్పాటు చేశాడు. ఎప్పటిలానే వచ్చిన ఇద్దరిలో ఒకడు దానిలో చిక్కుకున్నాడు. తనను గుర్తుపట్టే స్థితి రాకూడదని, అన్నచేత తన తల నరికించేసుకున్నాడు బోనులో ఇరుక్కున్నవాడు. తల ఇంటికి తీసుకెళ్ళాడు సోదరుడు. రాజు తెలివితక్కువ వాడా? ఈ పని ఇద్దరు చేశారని గ్రహించేశాడు. దొరికిన మొడెం కోటగుమ్మానికి వ్రేలాడ దీయించి, కాపలా వాళ్ళకి చెప్పాడు. అది చూసి ఎవరయినా తీసుకుపోదామని ప్రయత్నిస్తే పట్టుకోమని. తల్లిపోరు పడలేక, తల నరికిన వాడు, నేర్పుగా కాపలా వాళ్ళకి సారా పోసి, మత్తులో ముంచి, మొండెం దించుకొని ఇంటికి పట్టుకుపోయాడు.

అతడు అసాధ్యుడని రాజుకు అర్థమైపోయింది. తన కూతురు అందాలరాశిని ఎరగా వేశాడీసారి. అతి దారుణమైన పని, నేర్పుతో కూడిన సాహస కార్యం చేసిన వాడినే ఆమె పెళ్ళాడబోతున్నట్టు ప్రకటించింది. తన వాళ్ళ తల నరికిన సంగతీ, మొండెం మాయం చేసిన సంగతీ చెప్పి పెళ్ళడమన్నాడు బ్రతికి ఉన్న సోదరుడు. ఆమె అతన్ని గుర్తించి, కాపలా వాళ్ళకు పట్టివ్వబోయేలోగా గమ్మత్తుగా తప్పించుకున్నాడు. ఇలాటి అసాధ్యడు అల్లుడయితే దిగుల్లేదు అనుకున్న రాజు, అసలు ఖజానా దొంగను శిక్షించే ప్రసక్తి లేదన్నాడు. అప్పుడు బైటపడ్డాడు సోదరుడు. నిన్ను ఇప్పుడు నరికేస్తే నీకు దిక్కెవరు? అడిగాడు రాజు. తమరు మారాజులు కనుక అడిగే దమ్ములు ఎవరికీ లేవు. కాని మీరు ఆడిన మాట తప్పితే, రేపు పరలోకంలో అల్లాకు జవాబు చెప్పుకోవలసి వస్తుంది. అన్నాడా చిన్నవాడు. అతడి ధైర్యానికి మెచ్చి, రాజు తన కూతుర్నిచ్చి పెళ్ళి చేశాడు. అంతే కాదు! అర్థరాజ్యం కూడా కానుకగా ఇచ్చాడు.

No comments: