Friday, February 25, 2011

నీతి కధలు 15

తెలివి తక్కువ రాజు

ఒక అరణ్యంలో రకకాల పక్షులు, జంతువులు నివసించేవి. అయితే వాటికి రాజు లేడు. తమకు ఒక నాయకుడంటూ ఉంటే బావుంటుందని భావించిన జంతువులు ఒక రోజు రాజును ఎన్నుకోవడానికి సమావేశమయ్యాయి. ఎవరిని రాజుగా ఎన్నుకోవాలని చర్చలు కొనసాగుతుండగా ఒక కోతి ముందుకు వచ్చి తన విచిత్రమైన హావభావాలతో నాట్యం చేసింది. ఆ నాట్యం చూసి జంతువులన్ని కడుపుబ్బ నవ్వాయి. కోతి చేష్టలకు ముచ్చటపడ్డ జంతువులు దాన్ని తమ రాజుగా ఎన్నుకున్నాయి.

ఇదంతా నక్కకు నచ్చలేదు "రాజనేవాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి బుద్దిలో, బలంలో అందరినీ మించిన వాడై ఉండాలి. అంతే కాని ఒక కోతి రాజుగా ఉండతగినది కాదు" అని అనుకుంది.

ఒక రోజు ఆ నక్క ఆహరం కోసం సంచరిస్తుండగా ఒక చోట వేటగాడు పన్నిన ఒక ఉచ్చు, దాని మధ్యలో ఒక పెద్ద రొట్టె ముక్క కనబడ్డాయి, ఆ జిత్తులమారి నక్క చాలా ఆకలిగా ఉన్నా ఆహారం జోలికి వెళ్ళకుండా గబగబా కోతి రాజు దగ్గరికి పరిగెత్తింది.

"రాజా ఈ సేవకుడు మీకు ఒక బహుమానం ఇవ్వాలనుకుంటున్నాడు. మీరు నా వెంట వస్తే ఒక రుచికరమైన ఆహారం దొరికేచోటు చూపిస్తాను" అని చెప్పింది నక్క.

కోతి సంతోషంగా నక్క వెంట వెళ్ళింది. నక్క కోతిని ఆ ఉచ్చు దగ్గరకు తీసుకెళ్ళింది.

"ఇదుగో రాజా... ఈ రొట్టె ముక్క మీది. అందుకే నేను దీన్ని ముట్టుకోలేదు" వినయంగా అంది నక్క.

వెనకా ముందూ ఆలోచించకుండా కోతి ఒక గెంతులో ముందుకు దూకింది. అమాయకంగా వేటగాడి ఉచ్చులో చిక్కుకుపోయింది.

"రాజనే వాడికి కొంచెం తెలివితేటలు ఉండాలి" అని నక్క కోతిని అక్కడే వదిలి వెళ్ళిపోయింది.
===============================

మితిమీరిన విశ్వాసం

ఒకప్పుడు ఒక నగరంలో బాగా చదువుకున్న యువకుడు ఉండేవాడు. అతనికి తన తెలివితేటలు, మేధస్సు పట్ల ఎంతో నమ్మకముండేది. ఆ అతి నమ్మకం అతన్ని గర్విష్టిగా మార్చింది. అతను నగరాన్ని వదిలి భోధనలు చేయడానికి పల్లెటూళ్ల వైపు వెళ్లాడు.

అలా వెళ్లగానే అతనికి కష్టాలు మొదలయ్యాయి. అతనికి తారసపడిన వాళ్లందరూ తామే మేధావులం అని అనుకునేవాళ్లే. వాళ్లకు బోధించాలంటే ఇతనే వారికంటే తెలివైనవాడని నిరూపించుకోవలసి ఉంటుంది. తన మేధస్సుపట్ల ఎంతో నమ్మకమున్న యువకుడు ఒక వ్యక్తి వద్దకు వెళ్లి తను ఆ వ్యక్తి కంటే తెలివైనవాడినని నిరూపించుకోదలిచాడు.

తన ప్రశ్నకు ఆ వ్యక్తి జవాబు చెప్పలేకపోతే అతను తనకు నాణాలు ఇవ్వాలి. అని యువకుడు షరతు విధించాడు.

యువకుడు ఆ వ్యక్తిని "ఇది చాలా సులభంగా గెలుచుకోగల ప్రశ్న" అంటూ ఊరించాడు. ఊరు ఊరంతా ఆ క్విజ్‌ను చూసేందుకు పోగయ్యారు. చదువుకున్న యువకుడు ఇలా మొదటి ప్రశ్న అడిగాడు,' ఇంగ్లండ్ రాజధాని ఏది?'

"నాకు తెలియదు. నేను నీకు మూడు నాణాలిస్తాను" అని అవతలి వ్యక్తి అన్నాడు.

'లండన్‌' అని చెప్పాడు. ఆ యువకుడు ప్రజలంతా అతన్ని మెచ్చుకున్నారు. యువకుడు మూడు నాణాలు జేబులో వేసుకున్నాడు.

"వేగంగా తిరుగుతుంది, కానీ అది తిరిగినట్లు అస్సలు అనిపించదు, ఏంటది? అని యువకుడు రెండో ప్రశ్న అడిగాడు.

"నాకు తెలీదు. నీకు మూడు నాణాలు ఇచ్చేస్తాను" అన్నాడా వ్యక్తి.

'భూమి' అని చెప్పి మరో మూడు నాణాలు జేబులో వేసుకున్నాడు యువకుడు.

యువకుడు "పగలు పైకెళ్లి, రాత్రి కిందకు దిగేది ఏంటి? అని మూడో ప్రశ్న అడిగాడు ఆ వ్యక్తి నాకు తెలీదు.

నీకు మరో మూడు నాణాలు ఇచ్చేస్తాను" అన్నాడు.

మొత్తం తొమ్మిది నాణాలు పొందిన యువకుడు సంతోషించగా, పేదవాడైన ఆ వ్యక్తి భార్య ఏడవడం మొదలెట్టింది.

ఇక అవతలి వ్యక్తి వంతు వచ్చింది. అతను యువకుడిని తన ప్రశ్నకు జవాబు చెప్పలేకపోతే ఐదువేల నాణాలు ఇవ్వాలని షరతు విధించాడు దానికి సంతోషంగా సరేనన్నాడు యువకుడు.

ఆ వ్యక్తి "ఉదయం రెండు కాళ్లతో, మధ్యాహ్నం నాలుగు కాళ్లతో నడిచేది ఏది"? అని అడిగాడు.ఆ ప్రశ్నవిన్న యువకుడి నోటి మాట పెగల్లేదు. జుట్టు గోక్కోవడం మొదలెట్టాడు. ప్రజలంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ యువకుడికి తన వద్దనున్న ఐదువేల నాణాలు ఆ వ్యక్తికి సమర్పించక తప్పలేదు.

కుతూహలం పట్టలేక యువకుడు "ఉదయం రెండు మధ్యాహ్నం నాలుగు సాయంత్రం ఆరు కాళ్లతోనడిచేది ఏంటి?" అని అడిగాడు ఆ వ్యక్తిని.

"ఏమో నాక్కూడా తెలీదు నీకు మూడు నాణాలు ఇస్తాను" అన్నాడా వ్యక్తి.

అవతలి వ్యక్తి సమాధానంతో చదువుకున్న ఆ యువకుడికి బుర్ర తిరిగిపోయింది.

నీతి: అతి విశ్వాసం పనికిరాదు.
=====================================

గతిలేని గబ్బిలం

ఒకప్పుడు పక్షులు, పెద్ద జంతువులు తమ మధ్య ఆధిపత్యం కోసం యుద్దం చేయాలని భావించాయి. పక్షిలా ఎగరగలిగే లక్షణమున్న జంతువు గబ్బిలం. దానికి పక్షులు, జంతువుల రెండింటి లక్షణం ఉండడం వలన అది ఏ గ్రూపులోనూ చేరక ఒంటరిగా మిగిలిపోయింది. పక్షులు దానిని తమవైపు రావలసిందిగా కోరినా... "నేను జంతువును" అని గర్వంగా చెప్పుకుంది. తరువాత కొన్ని జంతువులు దానిని తమవైపు రావల్సిందిగా కోరగా "నేను పక్షిని" అని వాటితో చెప్పింది.

కొన్ని రోజుల తరువాత యుద్దం ఆగిపోయి శాంతియుత వాతవరణం ఏర్పడింది. ఇప్పుడు గబ్బిలం వెళ్ళి పక్షులతో కలిసుండాలని వాటి వద్దకు వెళ్తే అవి దానిని తిరస్కరించాయి. తరువాత అది జంతువులతో జతకూడాలని అనుకుంది. అక్కడ కూడా దానికి అవమానం ఎదురైంది. అప్పటి నుండి గబ్బిలం చిన్న చిన్న పాడుబడ్డ బొయ్యారాలలో నివసిస్తూ, రాత్రి అయ్యే వరకు తన మొహాన్ని ఎవరికీ చూపించకుండా జీవిస్తోంది.
==================================

ప్రాణాలు తీసిన స్వార్ధం

ఒక ఊరిలో ఒక జమీందారుండేవాడు. ఒక నాటి రాత్రి ఇద్దరు దొంగలు జమీందారు ఇంట్లో తమకు దొరికినంత బంగారాన్ని, ధనాన్ని దోచుకుని ఆడవిలోకి జారుకున్నారు, ఆ బంగారాన్ని మరసటి రోజు తమ పక్క ఊరిలో అమ్మాలని ముందే నిర్ణయించుకున్నారు, అప్పటివరకు ఆ ధనాన్ని ఎక్కడైనా దాచేయాలని అనుకున్నారు.

ఒక చెట్టు బోదెలో బంగారాన్ని దాచారు. కాని అది భద్రంగా ఉంటుందని వారికి నమ్మకం కలగలేదు, అందువల్ల వారిద్దరూ ఆచెట్టు బోదెవైపు ఒక కన్ను వేయాలని ఎవరికివారు అనుకున్నారు.

కొద్దిసేపటి తర్వాత ఇద్దరికీ ఆకలివేసింది. కాని అంత ధనాన్ని వదిలి వారిద్దరూ తినడానికి ఎలా వెళ్లగలరు? కాబట్టి భోజన వసతలు ఏర్పాటుచేయడానికి కూడా వాళ్లు వంతులు వేసుకోవాలనుకున్నారు వారిలో మొదటి వాడు రెండవాడితో "లంబూ, నీవు ఈ బంగారానికి రక్షణగా ఉండు. నేను ఊర్లోకి వెళ్లి మనకు కావలసిన భోజనం తీసుకువస్తాను" అన్నాడు.

"సరేరా జంబూ! కాని త్వరగా వచ్చెయ్" అని లంబూ బదులిచ్చాడు.

జంబూ ఊర్లోకి వెళ్లాడు ఆ లోపల లంబూ 'నేను ఈ దొంగిలించిన ధనాన్ని జంబూతో పంచుకోవడమెందుకు?" అని ఆలోచించి ఒక పన్నాగం పన్నాడు.

జంబూ భోజనం తీసుకురాగానే అతణ్ణి చంపి మొత్తం ధనాన్ని బంగారాన్ని తానే సొంతం చేసుకోవాలనుకున్నాడు.

ఊర్లోకి వెళ్లిన జంబూకు కూడా అచ్చం ఇలాంటి ఆలోచనే వచ్చింది. అతను భోజనం చేసి లంబూకు తీసుకువచ్చే ఆహారంలో విషం కలిపాడు. కొద్దిసేపటి తర్వాత, జంబూ అడవిలోని ఆ చెట్టు వద్దకు చేరుకున్నాడు. చెట్టు పక్కన దాక్కున్న లంబూ ఒక పెద్ద రాయితో జంబూ తలపై బలంగా మోదడంతో జంబూ విలవిల్లాడుతూ కిండపడి ప్రాణం విడిచాడు. సంతోషంగా విషం కలిపిన ఆహారం తిన్న లంబూ నురగలు కక్కుతూ మరణించాడు,

అంత ధనం, బంగారం వారిద్దరిలో ఎవరికీ దక్కకుండా పోయింది.

పిల్లలు! అతి స్వార్ధం అనర్ధాలకు దారి తీస్తుందని పెద్దలెందుకంటారో అర్ధమయిందా?!
==============================

మనశ్శాంతి

రామయ్య, సోమయ్య ఇద్దరూ ఇరుగుపొరుగు వాళ్ళు. రామయ్య పేద కుటుంబానికి చెందిన రైతు సోమయ్య పెద్ద భూస్వామి. రామయ్య ఎప్పుడూ ఉల్లాసంగా, హయిగా ఉండేవాడు. ధనం లేక పోయినా ఎంతో సంతోషంగా, సంతృప్తిగా జీవితం గడిపేవాడు.

సోమయ్య ఎప్పుడూ ఆదుర్దాగా, ఏదో ఆలోచనలో ఉండేవాడు. రాత్రిపూట అతనికి సరిగ్గా నిద్ర పట్టేది కాదు. ఏ దొంగైనా వచ్చి తన బీరువాలోని డబ్బును కాజేస్తాడేమోనని భయపడేవాడు సంతోషంగా ఉండే రామయ్యను చూసి అసూయపడేవాడు సోమయ్య.

ఒక రోజు సోమయ్య రామయ్యను పిలిచి నీవు పేదవాడివి, ఈ డబ్బుతో హాయిగా జీవించు అని కొంత డబ్బు ఇచ్చాడు.

రామయ్యకు కృతజ్ఞతలు తెలిపి వెళ్ళిపోయాడు. చీకటి పడింది. రాత్రంతా రామయ్యకు కంటి మీద కునుకులేదు. డబ్బు పెట్టె వంకే చూస్తూ కాలం గడిపాడు సోమయ్యకున్న భయం, అశాంతి ఇప్పుడు రామయ్యకు పట్టింది.

తెల్లవారగానే రామయ్య డబ్బు పెట్టెను తీసుకెళ్ళి సోమయ్యకు తిరిగి ఇచ్చి నేను పేదవాణ్ణి సోమయ్యా నన్ను ఇలాగే ఉండనివ్వు నీవు ఇచ్చిన డబ్బు నా మనశ్శాంతిని నాకు కాకుండా చేస్తోంది. నీ డబ్బు నువ్వే తీసుకో అన్నాడు.
==========================

బ్రహ్మ - శిల్పి

స్వర్గంలో సంచరిస్తున్న బ్రహ్మదేవుడికి ఒక సందేహం కలిగింది. లోకాలంన్నింటినీ సృష్టించిన తనను భూలోక వాసులు గుర్తుపెట్టుకున్నారా లేదా అనే విషయం తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. అనుకున్నదే తడవుగా భూలోకానికి వెళ్లాలని అనుకున్నాడు.

ప్రయాణికుడిలా మారిపోయి ఒక శిల్పి ఇంటికి చేరుకున్నాడు. అక్కడ ఎన్నో అందమైన విగ్రహలు ఉండడం చూసి ముచ్చటగా అనిపించింది బ్రహ్మకి. ఒక విగ్రహాన్ని చూపిస్తూ దీని ఖరీదెంతని శిల్పిని అడిగాడు బ్రహ్మ. దానికి శిల్పి అది అంత ప్రముఖమైన విగ్రహం కాదు అని, దాని ధర తక్కువగానే ఉంటుందని బదులిచ్చాడు. అతని జవాబుకు బ్రహ్మ.సంతోషించాడు.

తరువాత ఒక స్త్రీ విగ్రహాన్ని చూపిస్తూ దీని ధరెంతో చెప్పగలవా? అని శిల్పిని ప్రశ్నించాడు ప్రయాణికుడి రూపం లో ఉన్న బ్రహ్మ దానికి శిల్పి ఆ విగ్రహం కొంచెం కష్టపడి చేశాను దానికి కొంత డిమాండ్ ఉంది. కాబట్టి అది కాస్త ఎక్కువ ధర పలుకుతుందని సమాధానమిచ్చాడు.

కొద్ది సేపు విగ్రహాలన్నింటిని పరిశీలించిన బ్రహ్మకు ఒక మూలలో తన విగ్రహం తారసపడింది. బ్రహ్మ తన విగ్రహం ఎక్కువ ధర పలుకుతుందని భావించి సంతోషంగా మరి ఈ విగ్రహం ధర ఎంతని తన విగ్రహాన్ని చూపిస్తూ శిల్పిని అడిగాడు.

"మీరు ఆ రెండు విగ్రహాలనూ తీసుకుంటే ఈ బ్రహ్మ విగ్రహాన్ని ఉచితంగా ఇస్తాను" అని అన్నాడు శిల్పి. ప్రయాణికుడి రూపంలో ఉన్న బ్రహ్మ శిల్పి మాటలకు నోరెళ్లబెట్టి విగ్రహంలా నిల్చుండిపోయాడు.
===============================

పారని పన్నాగం

ఒక ముసలి పిల్లి తన కిష్టమైన ఆహారం, ఎలుక పిల్లలను పట్టుకోలేక చతికిలపడిపోయింది. పారిపోతున్న ఎలుకులను పట్టుకునేంతలోనే అవిచేజారిపోతున్నాయి. వయసు మీద పడుతుండడంతో ఇక ఎలుకులను పట్టడం తనవల్ల కాదని నిర్ణయించుకుంది.

ఎలుకులను చంపి తినేందుకు తన ఒళ్ళు కరగకుండా, ఆయాసం రాకుండా ఉండే ఒక మంచి ఉపాయాన్ని ఆలోచించింది. ఎలుకులు బొయ్యారం దగ్గర్లోని గోడవద్ద ఒక తలదిండు కవర్‌ను మెడవరకు కప్పుకుని తలకిందులుగా నిలబడింది. ఎలుకులు తను చనిపోయిందనుకుని తన దగ్గరకు వస్తాయని, గుట్టు చప్పుడు కాకుండా వటిని గుటుక్కుమనిపించవచ్చని ఆలోచించింది ముసలి పిల్లి. చిట్టెలుకలన్నీ తమ బొయ్యారపు ద్వారం దగ్గర నిలబడి పిల్లిని చూస్తున్నాయి. అది గమనించిన ఒక తెలివైన ముసలి ఎలుక పిల్లి పన్నాగాన్ని అర్ధం చేసుకుంది. కాని ఈ విషయం చెబితే చిట్టేలుకులు నమ్మవని దానికి తెలుసు కాబట్టి వాటిని కాపాడాలంటే తను కూడా పిల్లిలాగా అబద్ధపు ఆలోచన చేయాలని భావించింది. అంతే, అనుకున్నదే తడవుగా చిట్టెలుకల వద్దకు వచ్చి ఆహా ఎంత మంచి బ్యాగు. నేనెప్పుడూ పిల్లి తలతో ఉన్న ఇలాంటి బ్యాగ్‌ను చూడలేదే! చాలా బావుంది కదా! అంది. అది బ్యాగేనని తలపోసిన చిట్టెలుకలు వాటి దారిన అవి వెళ్లిపోయాయి. ముసలి పిల్లి ఆశలు అడి యాశలయ్యాయి.
==================================================================
ఎవరు గుడ్డి?

"మన నగరంలో ఎంతమంది గుడ్డివారున్నారు" అని ఒకరోజు అక్బరు దర్బారులో ప్రశ్నించాడు. ఎవరు జవాబు చెప్పలేకపోయారు. అక్బర్ బీర్బల్ వైపు చూశాడు. ఏదో ఒక సమాధానం బీర్బల్ కు చెప్పక తప్పుతుందా!

"ప్రభూ చాలమంది గుడ్డి వారు ఉంటారు. ఇప్పుడిప్పుడే లెక్క చెప్పమంటే వీలు కాదు. మీరు నాకు ఒకరోజు సమయం ఇస్తే జాబితా తయారు చేసి ఇవ్వగలను." అని చెప్పాడు బీర్బల్. అందుకు అక్బర్ ఒప్పుకున్నాడు.

ఆ మరునాడు బీర్బల్ చక్రవర్తి కోటకు దగ్గరలో జనసంచారం ఎక్కువగా ఉన్నచోట చిన్న చొప్పుల దుకాణం పెట్టి అందులో ఒక చొప్పుల జత కుడుతూ కూర్చున్నాడు. కొద్ది దూరంలో బీర్బల్ నియమించిన పనివారు కాగితం, కలం పట్టుకుని నిలబడి ఉన్నారు.

"ఆయన చేస్తున్న పనిని చూసి చాలామంది బీర్బల్ గారు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు?" అని అడగసాగారు. అలా అడిగిన వారి పేర్లను బీర్బల్ సేవకులు కాగితంలో వ్రాసుకుంటున్నారు.

సాయంకాలం చక్రవర్తి విహారానికి బయలుదేరాడు. బీర్బల్ కూర్చున్న చోటు వైపు వచ్చారు. బీర్బల్ ను చూసి అక్బర్ కూడా అందరిలాగే అదే ప్రశ్న వేశాడు. "చెప్పులు కుడుతున్నాను ప్రభూ" అని బీర్బల్ సమాధానం చెప్తుండగానే, సేవకులు రాస్తున్న జాబితాలో అక్బర్ చక్రవర్తి పేరు కూడా చేరింది .

మరునాడు బీర్బల్ దర్బారులో చక్రవర్తికి.

గుడ్డి వారి జాబితాను సమర్పించాడు. ఆ జాబితా తీసుకుని ఆసక్తిగా పరీశీలించాడు చక్రవర్తి. అందులో చివరన తన పేరు చూడగానే ఉలిక్కిపడ్డాడు. ఇదేమిటి బీర్బల్? ఇందులో నా పేరు కూడా ఉంది. నేను గుడ్డివాడినా?" అని ఆశ్చర్యంగా ప్రశ్నించాడు అక్బరు.

బీర్బల్ చేతులు జోడించి "ప్రభువులవారు నన్ను మన్నించాలి. కొందరు పుట్టుకతో గుడ్డివారయితే, మరి కొందరు చూపు ఉండి కూడా గుడ్డివారే. నిన్న నేను చేస్తున్న పని స్పష్టంగా కనబడుతోంది అయినా 'ఏం చేస్తున్నారని'? అందరూ నన్ను ప్రశ్నించారు. చివరకు ప్రభువులవారు కూడా. మరి ఇలాంటి వారు గుడ్డివారే కదా ప్రభూ!" అన్నాడు బీర్బల్.

తను అడిగిన ప్రశ్నకు జవాబు మరొక కోణంలో సరదాగా చూపించిన బీర్బల్ యుక్తికి ముసిముసిగా నవ్వుకున్నాడు అక్బరు చక్రవర్తి.
=======================================

కోకిల స్వార్ధం

ఒక పర్వత ప్రాంతంలో దట్టమైన అడవి ఉండేది. ఆ అడవి ఎన్నో పచ్చటి, పొడవైన పైన్‌ చెట్లతో నిండి ఉండేది. వసంతకాలం రావడంతో అడవి మరింత పచ్చగా, దట్టంగా తయారయింది.

ఒక కోకిల ఎక్కడి నుంచో వచ్చి పైన్‌ చెట్టు పైన గూడు కట్టుకుంది. అది ఉల్లాసంగా ఉన్నప్పుడల్లా తన అద్బుతమైన స్వరగానాలతో అడవినంతా హాయిగాఉంచేది.

ఆకురాలే కాలం రానే వచ్చింది. పైన్‌ చెట్టు ఆకులన్నీ రాలి బోసిపోయి మోడులా తయారైంది. కోకిల ఆకులు రాలిపోయిన ఆ చెట్టును, పచ్చదనం కోల్పోయిన తన పరిసరాల్ని చూసి చాలా బాధపడింది. ఒక రోజు ఉదయం అక్కడి నుండి ఎగిరిపోయి, మంచి పుష్పాలు విరబూసి, ఆహ్లాదకరంగా ఉండే చోటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది.

అద్భుతంగా పాటలు పాడే కోకిల వెళ్ళిపోతుండటం చూసిన పైన్‌ చెట్టు, కోకిలతో "సోదరీ! ఎక్కడికెళ్తున్నావు? నేను పచ్చగా ఉన్నప్పుడు నీకు చోటు కల్పించాను. ఇప్పుడు నేను అందవిహీనంగా కన్పించినంతమాత్రాన నన్ను విడిచి వెళ్తావా? మళ్ళీ వసంతకాలం రాగానే నేను పచ్చగా అవుతాను కదా" అని అంది.

బదులుగా కోకిల, "లేదు, లేదు, నేనిక్కడ ఉండలేను. ఆకులు రాలని చెట్లు, ప్రకాశవంతమైన పరిసరాలు ఉండే చోటికి వెళ్లాలనుకుంటున్నాను. నేను నీతో ఇక ఉండలేను" అంది.

పైన్‌ చెట్టు ఎంత బ్రతిమాలినా వినకుండా కోకిల తన రెక్కలు విప్పి తుర్రున ఎగిరిపోయింది. తను అందవిహీనంగా తయారయ్యానన్న బాధకంటే, కోకిల వెళ్ళిపోయిందన్న బాధతోనే పైన్‌చెట్టు మరింత కుంగిపోయింది. అతి చిన్నదైన కోకిల, చాలా పెద్దదైన పైన్‌చెట్టుకు ఒక గుణపాఠం నేర్పింది.

నీతి : స్వార్ధపరులైన స్నేహితులను ఎన్నడూ నమ్మరాదు.