Saturday, February 26, 2011

నీతికధలు 21

స్వర్గానికి దారి

ఇంతకుముందు ఎన్నో అద్భుతాలు, ఇంద్రజాల విద్యలు ప్రదర్శించానని చెప్పుకుంటున్న ఒక సాధువు ఒక గ్రామానికి చేరుకున్నాడు. అతని గురించి విన్న గ్రామస్ధులు ఎంతో ఆనందంతో ఆయనకు సేవలు చేయసాగారు. రోజూ ఉదయం, సాయంత్రం అతని గుడారం వద్దకు చేరి పంచభక్ష్య పరమాన్నాలు, పట్టుపీతాంబరాలు సమర్పించేవారు. అలా కొంతకాలం గడిచింది. ఈ సంగతి ఆ నోట పొక్కి చివరకు తెనాలి రామలింగడి చెవిని చేరింది.

ఇందులో ఏదో మర్మముందని గ్రహించిన రామలింగడు సాధువు గుడారం వద్ద ఉండగా అతని వద్దకు వెళ్లి కూర్చున్నాడు. సాధువు శ్లోకాలు చదవడం మొదలెట్టాడు. ఒకటే శ్లోకం మరల చదవడంతో రామలింగడికి అనుమానం బలపడింది. రామలింగడు సాధువు నిజమైన భక్తుడు కాదని, ఆయనకు ఎలాంటి విద్యలు రావని గ్రహించాడు.

హఠాత్తుగా రామలింగడు సాధువు వైపునకు వంగి అతని గడ్డంలో నుండి ఒక వెంట్రుకను తుంచాడు. అంతే వేగంగా బయటకు పరిగెత్తి "నాకు స్వర్గానికి వెళ్లే దారి దొరికింది" అని బిగ్గరగా అరవడం మొదలెట్టడు. గ్రామస్ధులంతా నివ్వెరపోతూ చూస్తుండిపోయారు.

"ఈ సాధువు ఎంతో మహనీయుడు. ఆయన గడ్డం లోని ఒక వెంట్రుకను నా దగ్గర ఉంచుకుంటే నేను బతికున్నంత కాలం సిరిసంపదలతోనూ, చనిపోయిన తర్వాత స్వర్గంలోనూ తుల్తూతానని చెప్పాడు" అని గ్రామస్ధులతో అన్నాడు రామలింగడు. అంతే గ్రామస్ధులంతా ఒక్కసారిగా సాధువుపైన బడి సాధువు గడ్డం వెంట్రుకలను రక్తం వచ్చేలాగా తుంచసాగారు. సాధువు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకు జీవుడా అంటూ పరుగులంకించుకున్నాడు.
=================================================

తెలివైన గాడిద

అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. అది ఒక రోజు ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయింది. అది సహాయం కోసం ఎన్నో గంటలు అరిచి గీపెట్టింది. చాలా సేపటి తర్వాత గాని గాడిద బావిలో పడిందని తెలుసుకోలేకపోయాడు రైతు. ఇన్నాళ్లుగా తనకి ఎంతో సేవ చేసిన గాడిదను కాపాడాలని అనుకోలేదు అతను. ఎందుకంటే ఆ గాడిదను పైకి తీయడం అనవసరం అనుకున్నాడు.

అంతేకాక ఆ బావిని కూడా మూసేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అందుకని దానిమీద మట్టి వేసి బావి నింపటం మంచిదని భావించాడు రైతు.

ఆ పనిచేయడానికి తనకు సహాయం చేయమని పక్కింటి వారిని కూడా పిలిచాడు.రైతు పారతో బావిలోని గాడిదపై మట్టి వేయడం ప్రారంభించాడు. పక్కింటివారు కూడా పారలతో మట్టి వేస్తూ రైతుకు సహాయం చేయసాగారు. ఏం జరుగుతోందో అర్ధం కాని గాడిద మొదట ఏడుపులు, పెడబొబ్బలు పెట్టసాగింది. తరువాత అరవకుండా ఉండిపోయింది.

కొద్దిసేపు పారతో మట్టి వేసిన తరువాత బావిలోకి చూసిన రైతు ఆశ్చర్యపోయాడు. తనపైన మట్టిపడుతున్న ప్రతిసారి గాడిద మట్టిని విదుల్చుకుంటూ ఆ మట్టిమీదే నలబడి పైకి రాసాగింది. రైతుకు, పక్కింటి వారికి ఆశ్చర్యం కలిగింది. బావిలో నిండిన మట్టి మీదుగా ఎక్కి గాడిద పైకి వచ్చేసింది. గాడిద తెలివికి మెచ్చిన రైతు అప్పటి నుంచి ప్రేమగా చూడసాగాడు.

నీతి : ఈ గాడిదలాగే మనమీద కుడా ఎంతో మంది దుమ్ము, మట్టి వేస్తుంటారు. కాని ఆ దుమ్మును, మట్టిని దులుపుకొని జీవితంలో పైకి వచ్చేవారే తెలివైనవారు.

================================

ఉపదేశం

కోసంగిపురం అనే ఊరి పరిసరాలలో ఒక నల్లత్రాచు ఉండేది. ఎంతోమంది దాని కాటుకు బలై ప్రాణాలు విడిచారు.

పాము భయంతో చిన్నపిల్లలు ఉన్న కుటుంబాలు ఈ ఊరును వదిలి వెళ్ళిపోయారు. నల్లత్రాచువల్ల ఆ ఊరిలో అభద్రతాభావం పెరిగిపోయింది.

ఒకరోజు ఒక సాధువు కోసంగిపురం వచ్చాడు. ప్రజలలో ఉన్న నల్లత్రాచు భయాన్ని తెలుసుకుని జాలిపడ్డాడు. వారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.

సాధువు పామును వెతుకుతూ దాని పుట్ట దగ్గరకు వెళ్ళాడు. అడుగుల శబ్దం వినగానే పాము... కోపంగా బుసకొడుతూ పుట్ట నుండి బయటకు వచ్చింది. కాటువేయడానికి పడగ ఎత్తిన పాము ఆ సాధువు కళ్ళలో కనిపిస్తున్న మహిమకు చప్పున పడగ దించేసుకుని చలనం లేనట్టు నిలబడిపోయింది.

'నిష్కారణంగా మానవులను చంపడం పద్ధతి కాదని, దానివల్ల అది చాలా పాపం మూట కట్టుకుంటోదని...' బోధించాడు.

సాధువు చెప్పిన మాటలతో పాములో చాలా మార్పు వచ్చింది. 'ఇకముందు ఎవ్వరినీ కాటువేయననీ ఆయనకు మాటిచ్చింది పాము.

ఇక పాముతో భయం లేదని ఆ ఊరి ప్రజలతో చెప్పి అక్కడ కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోయాడు సాధువు. నెల తర్వాత తిరిగి సాధువు ఆ ఊరికి రావడం జరిగింది. ఊరిలోకి అడుగుపెట్టగానే ఆయనకి ఒక దారుణమైన దృశ్యం కనబడింది. ఒకప్పుడు అందరిని భయపెట్టి నిద్రలేకుండా చేసిన నల్లత్రాచుని యువకులు రాళ్ళతో కొడుతుంటే... ఆ పాము నిశ్శబ్దంగా ఆ దెబ్బలను భరిస్తోంది.

సాధువు వాళ్ళని వారించి ఇళ్ళకు పంపేసాడు.

గాయాలతో రక్తసిక్తమైన నల్లత్రాచు సాధువు వైపు దీనంగా చూస్తూ... "స్వామీ... ఎవరినీ ఇబ్బంది పెట్టరాదని మీరు చెప్పారు. ఆ రోజు నుండి మీ ఆజ్ణను పాలిస్తూ వచ్చాను. కాటువేయడం మానేసాను. మనుషుల జోలికి వెళ్ళకుండా కప్పలను... చిన్న చిన్న పక్షులను భుజిస్తూ నా మానాన నేను బతుకుతున్నాను. కాని ఎప్పుడైతే నావల్ల ప్రమాదం లేదని తెలిసిందో... అప్పటి నుండి నాకు కష్టాలు మొదలయ్యాయి. నిష్కారణంగా నా దగ్గరకు వచ్చి నా మీద రాళ్ళు విసురుతున్నారు. మీరే చెప్పండయ్యా ఒకప్పటి నా మార్గం సరైనదే కదా?".

సాధువు ప్రేమగా దానివైపు చూస్తూ... "మనుషులను కాటు వేసినప్పుడు నీది సరైన మార్గం కాదు. అలాని వాళ్ళ హింసను నిశ్శబ్దంగా భరించే ఈ మార్గం కుడా సరైనది కాదు. నిన్ను కాటు వేయకూడదని చెప్పానేగాని ఆత్మరక్షణ కోసం బుసకొట్టకూడదని చెప్పలేదు. హింస నుండి నిన్ను నువ్వు రక్షించుకునే హక్కు నీకు వుంది" అని చెప్పాడు.

నీతి : ఎదుటివారిని కష్టపెట్టకూడదు. అలాగే కష్టపెట్టే అవకాశం ఎదుటివారికి ఇవ్వకూడదు.
=====================================================

విశ్వాసం

ఒకరోజు అక్బర్‌ చక్రవర్తికి ఒక సందేహం వచ్చింది. " ప్రపంచంలో అతి విశ్వాసపాత్రమైన జంతువు, అసలైన విశ్వాసఘాతుకమైన జంతువు ఏమిటి?" అనేదే ఆయన సందేహం. అదేమాట బీర్బల్‌కు చెప్పి తన సందేహం తీర్చుకోవాలనుకున్నాడు అక్బర్‌. "ప్రభూ! నేను రెండు రోజుల్లో మీ దగ్గర ఆ రెండు జంతువులను ప్రవేశ పెట్టడానికి ప్రయత్నిస్తాను" అని చెప్పాడు బీర్బల్.

రెండు రోజుల తర్వాత, బీర్బల్‌ అక్బర్‌ చక్రవర్తికి దర్బార్‌లోకి ఒక కుక్కను, తన సొంత అల్లుడిని వెంటబెట్టుకుని వచ్చాడు. బీర్బల్‌ అక్బర్‌కు వివరిస్తూ "ప్రభూ! మీరు కోరినట్లుగానే మీ ముందు ఆ రెండు జంతువులలో ప్రపంచంలో అత్యంత విశ్వాసమైన జంతువు కుక్క. అది మనం ఏది పడేసిన తిని బతికేస్తుంది. కుక్కను తన యజమాని ఎంతగా కొట్టినా అతని ఇంటిని మాత్రం విడిచివెళ్లదు. అది జీవితాంతం యజమానికి విశ్వాసపాత్రమైనదిగా బతుకుతుంది" అని చెప్పాడు.

ఆ తరువాత ఎవరి గురించి చెబుతాడా అని కుతూహలంగా ఎదురు చూస్తుండగా, బీర్బల్‌ "మహరాజా! దీనికి పూర్తి వ్యతిరేకంగా, అల్లుడు అత్యంత విశ్వాస ఘాతకుడు. చేయించుకున్న సహాయాన్ని తెలివిగా, తక్కువ సమయంలో మరిచిపోతాడు. తన మామ ప్రపంచంలోని సంపదనంతా చేతిలో పెట్టినా అతనికి సరిపోదు. మామకు సంబంధించిన సంపద అంతా తనదేననట్లు భావిస్తుంటాడు అల్లుడు" అన్నాడు.

బీర్బల్‌ వివరణ ఆలకించిన అక్బర్‌ చక్రవర్తి అతడి చాతుర్యానికి, లోకజ్ణానానికి, తెలివితేటలను మెచ్చుకుంటూ, "నిజమే బీర్బల్! నువ్వు చెప్పింది అక్షరాలా సత్యం. మనమంతా ఎవరో ఒకరికి అల్లుళ్లమే కాని మన మామలు చేసిన సహాయం, త్యాగం, మరేదైనా కాని, దాని గురించి పెద్దగా పట్టించుకోం. ఈ ఒక్క నిరూపణ చాలు ఒక అల్లుడే ప్రపంచంలో అతి పెద్ద విశ్వాసఘాతకుడు, కృతజ్ణత లేనివాడు అని చెప్పడానికి" అన్నాడు అక్బర్‌.

నీతి : విశ్వాసం మనిషి ఉత్తమ జీవితానికి అత్యుత్తమ మార్గం.
======================================

అడవి మొక్కలు

ఒకసారి అక్బరు చక్రవర్తి అడవికి వేటకు వెళ్ళినప్పుడు కొండజాతికి చెందిన స్త్రీలు ఎవరి సహాయం లేకుండానే కట్టెలు కొట్టడం, రాళ్లు ఎత్తడం వంటి కఠినమైన పనులు చేయడం చూశాడు. ఎంతో ఆశ్చర్యానికి గురైన అక్బరు "చూశావా బీర్బల్‌! మన అంత:పుర స్త్రీలు ఇలాంటి పనులు ఎప్పుడైనా చెయగలరా? ప్రతి పనికి సేవకులు, పరిచారకులు... ఇలా ఎందరో కావాలి. దీనికి కారణం మన స్త్రీలను మనం ఎక్కువగా గారాబం చేయడమే. అందుకే వాళ్ళలా మరీ నాజూకుగా తయారవుతున్నారు" అన్నాడు.

ఆ తరువాత అక్బరు కోటకు తిరిగి వెళ్లాక కూడా ఈ విషయమే మహారాణితో చర్చిస్తూ ఆమెను ఎగతాళి చేశాడు.

దానితో రాణి మనసు గాయపడింది. అక్బరు చక్రవర్తికి తన తప్పు తెలియజేయాలనుకుని బీర్బల్‌ని పిలిపించి జరిగినదంతా చెప్పింది. చక్రవర్తి ఆ విధంగా మాట్లాడకుండా ఉండాల్సిందని బీర్బల్‌కి కూడా అనిపించింది.

బీర్బల్‌ వెంటనే చక్రవర్తి తోటను పరిరక్షించే తోటమాలిని పిలిచి "ఈ రోజు నుండి మొక్కలకు నీళ్ళు పోయడం మానెయ్యి. పాదుషాగారు ఏమైనా అంటే నా పేరు చెప్పు" అని చెప్పాడు.

బీర్బల్‌ ఊహించినట్టుగానే వారం రోజుల తరువాత అక్బరు నుండి పిలుపు వచ్చింది.

"ఏమిటి బీర్బల్‌ నువ్వు చేసిన పని. మొక్కలకు నీళ్ళు పెట్టొదని తోటమాలికి చెప్పావా? నీకేమైనా పిచ్చి పట్టిందా?" అని చాలా కోపంగా అడిగాడు అక్బరు.

"ప్రభూ, రాజుగారి తోటకు చెందిన మొక్కలకు అనవసరంగా గారాబం చేయడం జరుగుతోంది. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరమేమీ లేదు. అడవిమొక్కలను ఎవరు సమ్రక్షిస్తారు? ఎవరు నీళ్ళు పెడతారు? వాటంతట అవే పెరగవా? రేగుపండ్లు, నేరేడుపండ్లు ప్రత్యేకమైన శ్రద్ధ లేకపోయినా ఎంతో మధురంగా ఉండవా? మరి అలాంటప్పుడు ఈ మొక్కలు నీళ్ళు పోయకుంటే బతకలేవా?" అని నెమ్మదిగా చెప్పాడు.

అక్బరు ముఖం కోపంతో ఎర్రబడింది. "నీకు మతి ఉండే మాట్లాడుతున్నావా? ఎంతో నాజూకుగా పెంచుకుంటున్న మొక్కలను అడవి మొక్కలతో పోలుస్తావా?" కాస్త గట్టిగానే అరిచాడు అక్బరు.

"క్షమించండి ప్రభూ! నేను మతి ఉండే మాట్లాడుతున్నాను. మీరు కొండజాతి స్త్రీలతో అంత:పుర రాణులను పోల్చినప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది" చేతులు జోడించి చెప్పాడు బీర్బల్‌.

దానితో అక్బరు చక్రవర్తికి తన తప్పు తెలిసి వచ్చింది.
================================

బలం బలహీనత

దశరధం తన తోటలో కలుపు తీయటం, మొక్కలు నాటడం వంటి పనులు చేస్తున్నాడు. అతని పన్నెండేళ్ళ కొడుకు రాము కూడా తనకు తోచిన పనులు చేస్తూ తండ్రికి సాయం చేస్తున్నాడు. దశరధం తోటలో పని చేస్తున్న రాము వైపు చూసి, "రామూ! నీ పక్కనున్న ఈ రాయిని తొలిగించు. మనం అక్కడ ఒక మంచి చెట్టును నాటుదాం" అన్నాడు.

రాము వెంటనే ఆ రాయిని తొలిగించేందుకు ప్రయత్నించాడు. కానీ అది అంగుళం కూడా కదల్లేదు. "నాన్న! ఈ రాయి చాలా బలంగా పాతుకుపోయి ఉంది. దీనిని తొలిగించడం నావల్ల కావట్లేదు" గట్టిగా అరిచాడు రాము. రాము తెలివితేటలను పరీక్షిస్తున్న దశరధం "బాబూ! మళ్ళీ ప్రయత్నించు. నీ బలాన్నంతటినీ ఉపయోగించి ఎలాగైనా ఆ రాయిని పెకిలించి, తొలిగించు" అంతే బిగ్గరగా అరిచాడు.

ఎంత బలంగా ప్రయత్నిచినా ఆ రాయి కదలకపోవడంతో రాము ఇంక భరించలేక బిగ్గరగా ఏడవటం మొదలెట్టాడు. రాముని సముదాయించేందుకు అతని వద్దకు వెళ్ళాడు దశరధం. "నేను నీ బలాన్నంతటినీ ఉపయోగించమని చెప్పానా లేదా?" ప్రశ్నిచాడు దశరధం. ఏడుస్తూనే రాము, "అవును, నాన్నా. కానీ నేను నా శక్తి మేరకు ప్రయత్నించాను. కానీ రాయి కనీసం కదలనుకూడా లేదు." అని చెప్పాడు. "కానం రామూ! నీవు నన్ను మర్చిపోయావు నాన్నా. నీవు నా సహాయం కోరవచ్చు కదా! నీకున్న బలంలో నన్ను కూడా ఒక బలంగా ఎందుకు అనుకోవు?" అని తండ్రి అనడంతో రాము కళ్ళు జిగేల్‌న మెరిసి ఏడుపు తానంతట అదే ఆగిపోయింది. తండ్రి సహాయంతో ఆ రాయిని సులభంగా పెకిలించిన రాము అక్కడ ఒక చక్కని మామిడి మొక్కను నాటాడు.

నీతి : ఏదైనా పని చేసేముందు మనబలాలను, బలహీనతలను అంచనా వేసుకోవడం మంచిది.
=====================================

అమూల్యమైన బహుమతి

ఒక ప్రముఖ వ్యక్తితో వికాస నిపుణుడు ఉపన్యాసం ప్రారంభిస్తూ జేబులో నుంచి ఒక వెయ్యి రూపాయల నోటు బయటకు తీశాడు. ఆ గదిలో కనీసం 200 మంది వరకు ఉన్నారు. ఆయన అందరినీ ఇలా అడిగాడు... "ఈ వెయ్యి రూపాయల నోటు ఎవరెవరికి కావాలి?" అంతే చేతులు ఒక్కటొక్కటిగా పైకి లేచాయి. దాదాపు అందరూ చేతులెత్తారు.

"నేను మీలో ఒకరికి ఈ వెయ్యిరూపాయల నోటు ఇస్తాను. కాని దానికి ముందు నేనొకటి చేస్తాను" అంటు ఆ నోటును చేతితో నలపటం మొదలెట్టడు. రెండు నిమిషాల తర్వాత మళ్ళీ అడిగాడు. "ఇప్పుడు ఈ నోటు ఎవరిక్కావాలి?" అయినా చేతులు లేవడం ఆగలేదు.

"సరే!" అంటు ఆయన తన చేతిలోని ముడతలు పడి నలిగిన వెయ్యిరుపాయల నోటును కింద పడేసి బూటు కాలితో నలపడం మొదలెట్టాడు. కొద్ది సేపటి తర్వాత దాన్ని చేతిలోకి తీసుకుని "ఇప్పటికీ ఇది ఎవరిక్కావాలి?" అని అడిగాడు. నలిగిపోయి, మారిపోయినా ఆ నోటు కోసం చేతులు లేవడం ఆపలేదు సభికులు.

"ప్రియ మిత్రులారా? మనం ఇప్పటి వరకు ఒక విలువైన పాఠం నేర్చుకున్నాం. డబ్బుకు ఎంత చిరుగులు పడినా, నలుగులు పడినా దాన్ని అందరు కోరుకుంటారు. ఎందుకంటే అది దాని విలువను ఎంత మాత్రం కోల్పోలేదు కాబట్టి ఈ నోటు ఇప్పటికీ వెయ్యిరూపాయల నోటే. ఈ నోటులాగే మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలను ఎదుర్కొంటాం. కొన్నిసార్లు మనం ఎందుకు పనికిరాని వారమని, మన బ్రతుకులు వ్యర్ధమని అనుకుంటాం. కాని ఏం జరిగినా, ఏం జరగబోతున్నా మన విలువను మాత్రం కోల్పోం. మనల్ని ప్రేమించే వారికి మనం ఎల్లప్పుడూ అమూల్యమైన బహుమతులమే" అని వివరించాడు ఉపన్యాసకుడు.

మరుక్షణం ఆ హాలు చప్పట్లతో మారుమోగిపోయింది.
====================================

చెడుస్నేహం

ఒకసారి నీటిలో సరిగా ఈదలేని తేలు నదిని దాటాలన్న తన ముచ్చటను తీర్చుకోవాలనుకుని ఒక తాబేలు దగ్గరకు వచ్చి "నేను నీ వీపు మీద ఎక్కుతాను. నన్ను నది దాటిస్తావా?" అని అడిగింది. బదులుగా తాబేలు, "నేను నది మధ్యలో ఉన్నప్పుడు నువ్వు నీ కొండితో కుట్టావంటే నేను మునిగిపోతాను కదా!" తన సందేహం వెలిబుచ్చింది.

"మిత్రమా! నేను నిన్ను కుడితే నీవు మునిగిపోతావు. నీతో పాటు నేను కూడా మునిగిపోతాను కదా! మరి నిన్ను నేనెందుకు కుడతాను" అని తాబేలు సందేహం నివృత్తి చేసింది తేలు. "అవును. నువ్వన్నదీ నిజమే! సరే ఎక్కు" అని తేలును తన వీపు మీద ఎక్కించుకుంది తాబేలు.

దర్జాగా తాబేలు వీపుపైకెక్కిన తేలు, నది మధ్యభాగంలో ఉండగా తాబేలును తన పదునైనకొండితో కరవడంతో నొప్పికి విలవిల్లాడిన తాబేలు నది మట్టానికి చేరుకుంది. దానితోపాటే తేలు కుడా నది మట్టానికి చేరువైంది.

ఆ సమయంలో తాబేలు... తేలును "నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నువ్వు నన్ను కుట్టవని చెప్పావు కదా! మరి ఎందుకు కుట్టావు?" అని అడిగింది. "నేను ఎవరినైనా కుట్టే సమయంలో నేనేం చేస్తానో నాకే తెలియకుండా జరిగిపోతుంది. అది నా స్వాభావిక లక్షణం. దానికి నేనేమీ చేయలేను." చెప్పింది తేలు మునిగిపోతూ.

నీతి : చెడ్డ వారితో స్నేహం మంచిది కాదు.
================================

ఏడుమల్లెల రాకుమారి

ఒక రాణి దేశంలోకెల్లా అతి పెద్ద సామ్రాజ్యాన్ని పాలిస్తూ ఉండేది. ఆమె ఏకైక పుత్రుడే ఆ రాజ్యానికి కాబోయే మహారాజు. యువరాజు ఆరడుగుల ఎత్తులో ఎంతో అందంగా, సుకుమారంగా ఉండేవాడు. అతనికి యుక్త వయసు వచ్చింది. పెళ్ళి చెయాలని భావించింది రాణి. కాబోయే కోడలు కూడా చాలా అందంగా, సుకుమారంగా ఉండాలని కోరుకుంది.

యువరాజుకి ఎన్నో రాజ కుటుంబాల నుండి సంబంధాలు వచ్చాయి. కాని ఆ రాజకుమార్తెలెవరూ రాణి కోరుకున్న లక్షణాలకు తగ్గట్టుగా లేరు. రాణి ఎన్నో సంబంధాలను కాదన్నదనే వార్త దేశమంతటా పొక్కింది. అది విన్న ఒక అందమైన రాకుమారి... రాణి గారిని కలుసుకోవాలని నిర్ణయించుకుంది. రాణిగారు ఎలాంటి రాకుమారిని తన కోడలుగా కోరుకుంటున్నారో తెలుకోవాలని అనిపించింది. అందుకని రాణి గారిని వ్యక్తిగతంగానే వెళ్ళి కలవాలనుకుంది.

సైనికులు ద్వారా తన రాకను రాణి గారికి తెలియజేసింది రాకుమారి. ఆమె కోసం రాణి తన భవనంలోని అందమైన గదిని సిద్ధంగా ఉంచిది. రాకుమారి రాణి గారి భవనానికి రాగానే రాణిగారి పరిచారికలు ఆమెను ఆ అందమైన గదిలోకి తీసుకు వెళ్ళారు. రాకుమారి ఎంత సున్నితమైనదో తెలుసుకోవాలని గదిలోని మంచం మీద కొన్ని మల్లెపూలు పెట్టి, వాటి మీద ఏడు పరుపులు పరిచారు. రాత్రి కాగానే ఆ మంచంపై పడుకున్న రాకుమారికి ఆ మల్లెపూల వల్ల అస్సలు నిద్ర పట్టలేదు.

ఆమె వీపు మీద ఎర్రని మచ్చలు ఏర్పడ్డయి. ఒళ్ళంతా కంది పోయింది. రాకుమారిని చూసేందుకు వచ్చిన రాణి కందిపోయిన ఆమె ఒంటిని చూసి ఆమె అత్యంత సున్నితమైనదని, తనకు కోడలిగా, తన కొడుకుకు సరైన భార్యగా రాణిస్తుందని నిర్ణయించుకుంది.
=============================

జీవిత సత్యం

ఒక చిన్న గ్రామంలో ఒక ముసలి అవ్వ, ఆమె మనవడు కలిసి ఒక చిన్న గుడిసెలో జీవించేవారు. ఒక రోజు ఆమె వంట చేస్తుండగా, మనవడు ఆమె దగ్గరికొచ్చాడు. "నానమ్మ! ఈ మధ్య నాకు ఒంట్లో అస్సలు బావుండట్లేదు, తలనొప్పి, కడుపు నొప్పి, జ్వరం అన్నీ ముకుమ్మడిగా బాధిస్తున్నాయి. స్కూల్‌లో కుడా నాకు మార్కులు తక్కువుగా వస్తున్నాయి, ఉపాధ్యాయులు తిడుతున్నారు, స్నేహితులు నాతో సరిగా మాట్లాడట్లేదు" అని తన బాధలన్నింటినీ ఏకరువు పెట్టసాగాడు.

అవ్వ తన మనవడికి ఎలాగైనా జీవిత సత్యాన్ని వివరించాలని, "చూడు నాన్నా! నువ్వు ఈ ఉడకని, వండని బియ్యాన్ని అలాగే తినగలవా?" అని అడిగింది. "ఛీ. అస్సలు తినలేను" అన్నాడు మనవడు. "మరి కేవలం నీళ్ళు త్రాగి జీవించగలవా?" అని నానమ్మ అడగ్గా "లేదు" అని జవాబిచ్చాడు మనవడు. "కూరలో వేసే కారం ఒక్కదాన్నే తిని కడుపు నింపుకోగలవా? మళ్ళీ అడిగింది నానమ్మ. "అమ్మో! నావల్ల కాదు" చెప్పాడు మనవడు. "మరి ఉప్పు" అని అడిగిన నానమ్మను "లేదు నానమ్మ. కాని ఇవన్నీ ఎందుకడుగుతున్నావు?" అని ఎదురు ప్రశ్నించాడు మనవడు.

"బాబూ! బియ్యం, నీరు అన్నీ కలిస్తే అన్నం. ఉప్పు, కారం, కూరగాయలు కలిస్తే కూర అవుతాయి కదా! అదే విధంగా బాధ, సంతోషం, కోపం, శాంతం.... ఇలా అన్నీ కలిస్తేనే అది జీవితమవుతుంది. ఇదే జీవిత సత్యం. దేవుడికి ఎవరికి, ఏమి, ఎప్పుడు ఇవ్వాలో అన్నీ తెలుసు.

మనం మన జీవిత స్ధితి గతులను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించాలి. ప్రతిఫలం మాత్రం దేవుడికే వదిలేయాలి. ఆయన ఏది ఇస్తే దానికి తలవంచి స్వాగతించాలి. నీకూ ఇలాగే మంచి రోజులూ ఉంటాయి, చెడు రోజులూ ఉంటాయి" అని జీవిత సత్యాన్ని మనవడికి వివరించింది నానమ్మ.

No comments: