Thursday, February 3, 2011

మదర్ థెరిసా

మదర్ థెరిసా

మదర్‌ థెరిసా
పేరు : మదర్ థెరిసా.
తండ్రి పేరు : నికలస్ బొజాక్సియొ.
తల్లి పేరు : డ్రానా ఫైల్ బెర్నయ్.
పుట్టిన తేది : 27-8-1910.
పుట్టిన ప్రదేశం : యుగోస్లేవియా.
చదివిన ప్రదేశం : యుగోస్లేవియా.
చదువు :

(తెలియదు).

గొప్పదనం : దరిద్రులకు, రోగులకు, కుష్టురోగులకు తల్లిలా ఆలనా పాలనా చూస్తూ వారి హృదయంలో చెరగని స్థానం సంపాదించినది. ముంబాయిలోని మురికి వాడలను శుభ్రపరచడానికి శ్రమించింది.
స్వర్గస్థురాలైన తేది : 5-9-1997.

'స్కోప్ జీ' పట్టణంలో అల్బేనియా దంపతులు ఉండేవారు.ఆగ్నేస్ తండ్రి పేరు 'నికలస్ బొజాక్సియొ'భవనాలు నిర్మించే కాంట్రాక్టరు. ఆయన భార్య పేరు డ్రానా ఫైల్ బెర్నయ్' వెనిస్ ఫ్రాంతానికి చెందిన స్త్రీ. ఆ దంపతులకు 1910 ఆగస్టు 27వ తేదీన మూడవ బిడ్డ జన్మించింది. ఆమెకు "ఆగ్నేస్" అని పేరు పెట్టుకున్నారు. ఆ అమ్మాయి పూర్తి పేరు ' ఏగ్నేస్ గాంజా బొజాక్సియొ ' వారిది మధ్య తరగతి కుటుంబం. తండ్రి చేసే వ్యాపారంతోనే కుటుంబం గడిచేది. అక్క, అన్నలతో పాటు ఆగ్నేస్ అల్లారు ముద్దుగా పెరిగింది. ఆగ్నేస్ ఎర్రగా, బొద్దుగా, పరిశుభ్రంగా పువ్వులాగా ఉండేది. అందుకని "గోన్జ" అని ముద్దుగా పిలుస్తూ ఉండేవారు. "గోన్జ" అనేది అల్బేనియా పదం . దానికి "పువ్వు మొగ్గ" అని అర్దం. నిజంగానే పువ్వు మొగ్గ లాగే ఆ పసిపాప ఉండేది. ఆగ్నేస్ తల్లి భక్తురాలు. వారిది రోమన్ కాథలిక్ మతం. ఎప్పుడూ చర్చికి వెళ్ళి ప్రార్ధనలు చేస్తూ కాలం గడిపేది. భక్తితో పాటు దయాగుణం కూడా అలవర్చుకున్నది. యాచించి వచ్చిన వారిని పోమ్మనలేదు. వాళ్ళు అడిగిన అన్నమో, డబ్బో, ఆశ్రయమో ఇచ్చేది. తన పిల్లలకు "దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగు వాళ్ళను ప్రేమించు" అని ఎప్పుడూ బోధిస్తూ ఉండేది. తల్లి ప్రభావం చిన్ని "ఆగ్నెస్ " మీద ఎక్కువగా పడింది.

కొందరి జీవితాలలో బడితో పాటు గుడి కూడా పెనవేసుకుని వుంటుంది. బడికి వెళ్లి చదువుకొని జ్ఞానం సంపాదించినట్లే గుడికి వెళ్లి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదిస్తారు. ఆగ్నెస్ విషయంలో అదే జరిగింది. ఆమె బడి చదువు ముందుగా సెక్రెడ్ హార్ట్ (పవిత్ర హృదయం) చర్చిలో ప్రారంభమయ్యింది. తరువాత యుగోస్లావియా ప్రభుత్వ పాఠశాలలో పూర్తయింది. ఆమెకు నాలుగు సంవత్సరాలు వయసున్నప్పుడు మొదటి ప్రపంచ యుద్దం ప్రారంభమయింది. ఆ యుద్ధమేఘాలు యుగోస్లేవియాలో కూడా కమ్ముకున్నాయి. ఇతరులతో పాటు వాళ్ల కుటుంబం కూడా యుద్దం యొక్క ప్రభావానికి లోనయ్యింది. శాంతిమయ జీవితాలను యుద్దం భంగపచింది.

ఆగ్నెస్ కు ఏడు సంవత్సరాల వయసప్పుడు తండ్రి చనిపోయాడు. దానితో వాళ్లమ్మ కష్టాలను ఎదుర్కొవలసి వచ్చింది. ధైర్యంగా వాటిని ఎదుర్కొన్నది. ఏ పని దొరికితే ఆ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చింది. తరువాత లేసు బట్టలు అమ్మే వ్యాపారాన్ని ప్రారంభించింది. ఆ సంపాదనతోనే ముగ్గురు పిల్లలను పెంచి పెద్దచేసింది. ఆగ్నెస్ కు పుస్తకాలు అంటే కూడా ఎక్కువ ఇష్టం. ఆమెకు మతపరమైన శిక్షణ చర్చి దగ్గర, ఇంటి దగ్గర కూడా జరిగేది. తల్లితో చర్చిలో చాలా సమయం గడిపేది. కుటుంబలోని ముగ్గురు పిల్లలు కలిసిమెలిసి ఉండేవారు. ఒక వైపు బడిని, మరొక వైపున చర్చిని చూసుకొనేది. అంతే కాకుండా ఇంటి దగ్గర కూడా ప్రార్ధనలతో గడిపేది. స్కొప్ జీ లో ఉన్న "లేడీ ఆఫ్ ది లెట్నిస్" పాదాల దగ్గర పవిత్ర జపమాలిక ప్రార్థన చేసేది.

ఆమె చిన్నతనం నుండే ఇటువంటి ముఖమైన లక్షణాలను అలవరచుకున్నది ఆమె బాగా చదివేది, బాగా ప్రార్థన చేసేది. ఇతరులకు ముచ్చటగా కనిపించేది. తనకంటే చిన్న వారికి భక్తిని బోధించేది. బోధన చేయటమంటే అమెకు ఎంతో ఇష్టం. ఆమె పెరిగి పెద్దదవుతూ ఉన్నది. బడిలో పాఠాలు, చర్చిలో ప్రార్థనలు ఆమె వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతూ వున్నాయి. ఇవి రెండూ ఆమెలో ప్రేమను, దయాగుణాన్ని పెంపాందింపజేశాయి.

"నన్" అంటే క్రైస్తవ మతంలో సన్యాసిని. తన జీవితాన్నంతా దైవకార్యాలకు, ప్రభువు సేవకు అంకితం చేసిన స్త్రీ. వీరు వివాహం చేసుకోరు. ప్రపంచంలోని సుఖాలనన్నిటినీ వదలుకొని కన్యలుగా జీవించే సాధ్వీమణులు. పన్నెండు సంవత్సరాల వయస్సులోనే ఆగ్నెస్ కు 'నన్' కావాలనే కోర్కె కలిగింది. బాల్యంలో యద్ధకాలపు భయంకర సంఘటలను చూసింది. ఎన్నో కష్టాలను అనుభవించింది. అవి ఆమెలో ప్రపంచ సుఖాల పట్ల విముఖతను పెంచాయి. అందుకని తన జీవితాన్ని భగవంతుడికీ, పేదలకూ అంకితం చేయాలనుకున్నది. అప్పుడు ఆమె తల్లిని ఈ విషయమై అడిగారు. అప్పటికి ఆగెన్స్ చిన్నపిల్ల కాబట్టి ఆమె ఒప్పుకోలేదు. ఆగ్నెస్ చర్చి కార్యకలాపాలలో మునిగిపోయింది. చర్చిలో ఫాదర్ జాంబ్రెన్ కొవిచ్ తో ఆమెకు పరిచయం కలిగింది. ఆయన "పావన కన్య మేరీ క్రైస్తవ సోదర సంఘాన్ని" స్థాపించి యున్నారు. ఆగ్నెస్ ఆ సంఘంలో సభ్యురాలయ్యింది.

ఆయన యుగోస్లావ్ జెస్సూట్ గురించి తరచూ చెబుతూ ఉండేవారు. జెస్సూట్స్ అంటే రోమన్ కేధలిక్ క్రైస్తవ సంఘంలోని సభ్యులు. ఈ సంఘాన్ని క్రీస్తు శకం 1533 లో ఇగ్నాటియస్ లయోలా అనే ఆయన స్థాపించాడు. 1924లో వాళ్లు భారతదేశం వచ్చారు. బెంగాల్ రాష్ట్రం తిరిగారు. ఈ మిషనరీల కార్యకలాపాల గురించి ఫాదర్ జాంబ్రెన్ కోవిచ్ సంఘ సభ్యులకు తెలియజేశారు. ఈ సంఘం ఆగ్నెస్ మీద ప్రభావాన్ని చూపించింది. సెయింట్లు (దైవంగా భావింపబడే వ్యక్తులు) జీవితాల గురించీ, మిషనరీల కార్యకలాపాల గురించీ తెలుసుకున్నది. భారతదేశంలోని బాలల దీనస్థితిని గురించి చెప్పిన విషయాలు ఆమె మీద బలంగా పనిచేశాయి. మిషనరీల లాగా పేదలకు, రోగులకు, పిల్లలకు సేవచేయాలని నిర్ణయించుకున్నది. ఆమెకు దైవం పిలుపు అందినట్లు అనిపించింది. కుటుంబాన్ని, ఆప్తుల్ని వదలిపెట్టి మిషనరీ కావాలన్న పిలుపు అది. ఆమె తనను తాను ప్రభువు సేవకు, నిరుపేదల సేవకూ అంకితం చేసుకున్నారు. ఈ విషయం గురించి విన్న తల్లి తన గదిలోకి వెళ్లిపోయింది. ఒక రోజంతా గడిపింది. చివరకు బయటకు వచ్చింది. "నీ జీవితాన్ని ప్రభువుకు అంకితం చెయ్యి. చివరి వరకూ ఆయనతోనే గడుపు" అనే సందేశాన్ని అందించింది. ఇలా తల్లి అనుమతి లభించినందుకు ఆమె ఎంతో సంతోషించింది.

బెంగాల్ లో "లోరెటో మఠం" ఉన్నది. దానికి అర్జీని పంపుకున్నది. ఆ బెంగాల్ మఠానికి ఐర్లాండ్ లోని డబ్లిన్ పట్టణంలో రాత్ ఫార్మన్ లో ఉన్న "లోరెటో అబ్బే" కేంద్ర స్థానం. బెంగల్ రావటానికి ముందు రాత్ ఫార్మన్ వెళ్ళి రావాలనే వర్తమానాన్ని అందుకున్నది. 1928 సెప్టెంబరు 28న తల్లి, అక్కలు వెంటరాగా రాత్ ఫార్మన్ బయలుదేరింది. ఆమె స్కోప్ జీ లో రైలెక్కి జాగ్రెబ్ అనే చోటికి వెళ్ళాలి. ఆవిడ బంథువులు, స్నేహితులు, సాలిడారిటీ సభ్యులు వీడ్కోలు చెప్పటానికి రైల్వేస్టేషన్ కు వచ్చారు. రైలు కదలుతూ వుండగా కన్నీటితో వీడ్కోలు చెప్పారు. జాగ్రెబ్ చేరుకొని, తల్లితో, అక్కతో కొన్నాళ్లు గడిపింది. జాగ్రెబ్ లో రైలెక్కి "అమ్మా వెళ్లి వస్తా!" అని చివరి సారిగా తల్లికి వీడ్కోలు చెప్పంది. అదే ఆవిడ తన తల్లిని చివరిసారి చూసిన రోజు. రాత్ ఫార్మన్ లో మత దీక్ష కోసం దాదాపు రెండు వారాలు గడపవలసి వచ్చింది. అక్కడ చర్చి లో మదర్ బోర్గియా ఇర్విన్ అనే ఆమె దగ్గర ఇంగ్లీషు నేర్చుకున్నది. ఇక్కడి నుండి ఆమె ఇంగ్లీషులోనే మాట్లాడటం మొదలు పెట్టింది. మందిరంలో శిష్యరికాన్ని తీసుకున్నది. తరువాత లొరెటో నన్ లతో కలసపోయింది.

1928 నవంబరు నెలలో ఆమె భారతదేశానికి ఓడలో ప్రయాణమయ్యింది. ఐరోపాలోని పశ్చిమ సముద్ర తీర ప్రాంతం నుంచి ఆమె ప్రయాణం భారతదేశంలోని తూర్పుతీర సముద్ర ప్రాంతానికి సాగింది. తన దేశాన్ని, తన కుటుంబాన్ని తనకు చిరపరిచితమైన అన్నింటినీ వదలివేసింది. ప్రభువు ఆజ్ఞ మేరకు ఒక విదేశంలో సేవ చేయటానికి తన ప్రయాణం సాగించింది. ఇది అద్భుతమైన త్యాగం. డార్జిలింగ్ బ్రిటీషు పాలకులకు వేసవి విడిదిగా ఉండేది. అది బ్రిటీషు విద్యకు కూడా ముఖ్యమైన కేంద్రం. హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్న ఒక అందమైన నగరం డార్జిలింగ్. అక్కడ "లోరెటో నోనో టియే" ఉన్నది. ఇక్కడ నన్ లకు ఉపదేశాన్ని, శిక్షణనీ ఇస్తారు. దానినే "నోవోషియేట్" అని అనేవారు. నొవొషియేట్ లో పని చేస్తూ శిక్షణ పొందాలి. అందుకని పేద పిల్లలకు చదువు నేర్పుతూ ఉండేవారు.

వారానికి ఒకసారి రోమన్ కాథలిక్ ఫాదర్ దగ్గరకు వెళ్లేవారు. అక్కడ బోధనలను వినేవారు, వారంతా ఏదో ఒక భారతీయ భాషను నేర్చుకోవాల్సి ఉంది. అందుకని ఆగ్నెస్ బెంగాలీ నేర్చుకోవటం మొదలు పెట్టారు. దానితో పాటు ఆమెకు హిందీ కూడా కాస్తంత పట్టుబడింది. 1931 మార్చి 24న ఆమె తొలి ప్రమాణాలు తీసుకున్నది. పేదరికం, పవిత్రత, విధేయత అనే మూడు నియమాలను విధిగా పాటించాలి. ఆమె పేరు కూడా మార్చుకోవాలి. థెరిసె మార్టిన్ అనే ఫ్రెంచి నన్ ఒకావిడ ఉండేవారు. ఆమె మిషనరీల కోసం, వాళ్ల విజయం కోసం ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండేది. ఆ విధంగా ఆమె ప్రపంచంలోని కాథలిక్ లనందరిని ఆకట్టుకున్నది. ఆమెకు క్షయవ్యాధి వచ్చింది. దానితో 24 సంవత్సరాల వయస్సులోనే మరణించింది. ఆమె ఘనతను గుర్తించిన వాటికన్ 1927లో ఆమెని సిద్ద స్త్రీ గా ప్రకటించింది. అంతే కాకుండా "సెయింట్ థెరిసా ఆఫ్ లిసోవ్" అనే బిరుదును ఇచ్చి గౌరవించింది..

ఈ పేరు మఠ జీవిత నామంగా ధరించాలని ఆగ్నెస్ కు ప్రేరణ కలిగింది. కాని ఒక చిక్కు వచ్చి పడింది. సిస్టర్ బ్రేన్ అని ఇంకో ఆవిడ ఉన్నది. ఆవిడ "మేరీ థెరిసా" అని పేరు పెట్టుకున్నది. ఆగ్నెస్ కు కూడా అదే పేరు కావాలి. అందుకని ఆలోచించి తను "థెరిసా" అని పేరు పెట్టుకుంది. ఆమె బెంగాలీ భాషను బాగా మాట్లాడుతూ ఉండేది. అందువల్ల గుర్తు కోసం "బెంగాలీ థెరిసా" అని పిలవటం మొదలు పెట్టారు. తరువాత " సిస్టర్ థెరిసా "గా పిలవటం కొనసాగించారు. ఆమె శిక్షణ పూర్తయింది. ఇక పని చేయాలి. కలకత్తా శివార్లలో "ఎంటల్లి" అనే ప్రదేశం ఉన్నది. అక్కడ సెయింట్ మేరీ పాఠశాల ఉన్నది. ఆ పాఠశాలంలో ఉపాధ్యాయినిగా చేరారు. సిస్టర్ ధెరిసా చాలా సాదాగా వుండేవారు. నిరాడంబరంగా, సామాన్యంగా కనిపించేవారు.సౌమ్యం ఉట్టిపడుతూ ఉండేది. అలసట ఎరుగకుండా హషారుగా కాలం గడిపేవారు. అక్కడ వున్న వారందరూ దైవభక్తి కలిగినవారు. కష్టించి పని చేసేవారు. సాంప్రదాయకమైన పొడవాటి దుస్తులు తెలుపురంగు, నలుపురంగులవి ధరించేవారు. ఉపాధ్యాయినులలో కొందరు బెంగాలీ నన్ లు కూడా ఉండేవారు.

1937 వరకూ ఆమె ఉపాధ్యాయినిగా పని చేశారు. తరువాత ప్రాథమిక పాఠశాల అజమాయిషీ దారుగా వున్నారు. డార్జిలింగ్ లో ఆమె ముగింపు దీక్షా ప్రయాణాలు స్వీకరించలేదు. 1939 మే నెలలో ఆ కార్యక్రమం ముగించారు. సుపీరియర్ హొదాలో 'ఎంటల్లీ' తిరిగి వచ్చారు. ఆరోజు నుంచే ఆమె అందరికీ మదర్ థెరిసా అయ్యింది. మదర్ దుసెకిల్ అనే ఆమె ఆ పాఠశాలకు ప్రిన్సిపాల్ గా నుండేది. 1944లో ఆమె 17 సంవత్సరాల పాటు పాఠశాలలో సమర్థంగా పనిచేశారు. మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె మనస్సు పేదల సేవ వైపు మళ్లింది. ఫాదర్ హెన్రీ అనే ఆయన మురికివాడల్లో పనిచేసేవారు. ఆ పనిలో ఆయనకు చాలా అనుభవం ఉన్నది. "కార్యాచరణ లేకుండా భగవంతుని ఆరాధించటం వ్యర్ధం" అన్నది ఆయన అభిమతం. ఈ మాటలు చాలాసార్లు మదర్ తో అన్నారు. ఆమె అంతరాత్మలో ఆందోళన చెలరేగింది. లోరెటోని వదలి పెట్టాలి. వీధుల్లో వున్న పేదలకు సేవ చేయాలి. ఆ పని చేయాలంటే దేవుని నుంచి పిలుపు రావాలి. అది ఇంకా రాలేదు. ఒకరోజు అది కూడా జరిగింది. ఆమె 1946 సెప్టెంబరు 10న డార్జిలింగ్ వెళ్లే దారిలో ఉన్నారు. ఆ రోజు అమె అంతరాత్మ ప్రబోధించింది. పిలుపు అందింది. డార్జిలింగ్ లో కొన్నాళ్ళు గడిపింది. అక్కడ ఉన్నంతకాలమూ ఆమెకు పిలుపు అందుతూనే వున్నది. ఆ పిలుపు స్పష్టంగా వుంది. అది ఆజ్ఞలా వుంది. కాన్వెంటును వదలిపెట్టాలి. నిరుపేదరాలిగానే వుండాలి.

పాట్నాలో శిక్షణ పూర్తి చేసుకొని ఆమె 1948 డిసెంబరు 9న కలకత్తా చేరుకున్నారు. రాగానే ఆమె కార్యరంగంలోకి ప్రవేశించింది. కాని ఆరోగ్య పరిస్థితుల వల్ల ఒక వారం విశ్రాంతి తీసకోవలసి వచ్చింది. మొదట "తల్ తలా" అనే చోట పనిని ప్రారంభించారు. కాని వెంటనే ఆమె "మోతీఝిల్" ను ఎంచుకున్నారు. అది ఒక మురికివాడ. ఒక విధంగా ఇళ్లన్నీ గుడిసెలే! ఒక తీరూ తెన్నుగా ఉండేవి కాదు, అస్తవ్యస్తంగా ఉండేవి. మురికి కాల్వలు ఇళ్ల ముందరి నుంచే పారుతూ ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం నిండి ఉండేది. అక్కడి పిల్లలు కొందరు కాన్వెంటులో చదువుకున్న వారే! మోతీఝీల్ అంటే "ముత్యాల సరస్సు" అని అర్థం. పేరు గొప్పే గాని వాడ మాత్రం దిబ్బ. ఎక్కడో ఓ మూల చిన్న చెరువు మాత్రం ఉన్నది.

మదర్ కాన్వెంట్ పాఠశాలలో పాఠాలు చెబుతున్నప్పుడు కిటికీ నుంచి ఆ వాడను చూస్తుండేవారు. అందుకని మొదట తన సేవకు కేంద్రంగా ఆ వాడను ఎన్నుకున్నారు. 1948 డిసెంబరు 19న మొట్టమొదటిసారి మదర్ మోతెఝీల్ కు వెళ్లారు. అక్కడ నీళ్ల పరిస్థితి ఏమంత బాగోలేదు. త్రాగటానికీ, బట్టలు ఉతుక్కో వటానికీ ఆ తొట్టెలో వున్న నీరే ఆధారం. ఇక తన కార్యక్రమానికి మొతీఝీల్ లో శ్రీకారం చుట్టారు. మొదటి రోజునే అక్కడి పిల్లల తల్లిదండ్రులను కలుసుకున్నారు. వారితో మాట్లాడారు. ఆ నివాస ప్రాంతంలో బడిని ప్రారంభిస్తామని చెప్పారు. వారంతా తమ తమ పిల్లల్ని బడికి పంపిస్తామని మాట ఇచ్చారు. మరునాడు బడి ఒక చెట్టు క్రింద మొదలయ్యింది. అది నీటి తొట్టెకు దగ్గరలో వున్న ప్రదేశం. బడికి బ్లాక్ బోర్డు లేదు. సుద్ద ముక్క అసలే లేదు. పిల్లలంతా క్రిందనే కూర్చున్నారు. ఆమె పుల్లతో నేల మీద అక్షరాలు రాశారు. పిల్లల చేత వాటిని దిద్దించారు. మళ్లీ వారి చేత చెప్పించారు. అలా ఆమె సేవా కార్యక్రమం నిరాడంబరంగా మొదలయ్యింది.

మోతీఝీల్ లో బడి పెట్టినా ఆమె నివాసం లిటిల్ సిస్టర్స్ నిర్వహిస్తున్న " సెయింట్ జోసఫ్స్ హరేయ్"లో అది వృద్దుల ఆశ్రమం. 2వ లోయర్ సర్కులర్ రోడ్డులో వుంది. ఆ అశ్రమంలో ఇంచుమించు 200 మంది వృద్దులు ఉండేవారు. ఆ ఆశ్రమానికి ఆదాయమంటూలేదు. లిటిల్ సిస్టర్స్ ఆఫ్ ది పూర్ సభ్యులు ఆ ఆశ్రమం బాగోగులు చూస్తున్నారు. వారు పేదరికానికి అంకితం అయిపోయినవారు. లిటిల్ సిస్టర్స్ కాన్వెంటుకీ, మోతీఝీల్ కూ ఒక మోస్తరు దూరం ఉన్నది. ఆ దూరం గురించి ఆమె పట్టించుకోలేదు.

డిసెంబరు 28 నాటికి దాదాపు 20 మంది పిల్లలు పోగయ్యారు. ఆమెకు ఇంకొక తోడు కూడా దొరికింది. సెయింట్ మేరీస్ లో పని చేసే ఓ టీచర్. స్వచ్ఛందంగా మదర్ తో పాటు పని చేయటానికి ముందుకు వచ్చింది. మొట్ట మొదట పిల్లలకు శుభ్రంగా ఉండటం నేర్పేవారు. ప్రతి ఒక్కరికీ స్నానం చేయించేవారు. పరిశుభ్రతకు బహుమతులు కూడా ఇచ్చేవారు. జబ్బులతో బాధపడుతున్న పిల్లలకు మందులిప్పించి. ధనవంతుల నుంచి సేకరించిన విరాళాలను వారి బాగోగులకై ఖర్చు పెట్టి వారిలో చైతన్యం తీసుకురాగలిగింది. దరిద్రులకు, రోగులకు, ముఖ్యంగా కుష్టురోగులకు తల్లిలా ఆలనా పాలనా చూస్తూ వారి హృదయంలో చెరగని స్థానం సంపాదించిన ఆ తల్లికి భారతప్రభుత్వం పౌరసత్వం ఇవ్వటమేకాకుండా అనేక సత్కారాలు చేసింది గౌరవ డాక్టరేట్లు, పద్మ శ్రీ, నెహ్రూఅవార్డు, భారతరత్న వంటి పురస్కారాలను అందుకుంది. అత్యంత ప్రతిష్టాకరమైన నోబెల్ బహుమతిని కూడా ఆమెకు లభించింది.


No comments: