Saturday, February 26, 2011

నీతికధలు 19

తెలివైన ఎలుగుబంట్లు

ఒక వేటగాడు వేటకోసం ఒక అడవికి వెళ్ళాడు. జంతువుల కోసం అతను వెతుకుతూ చాలా దూరం అడవిలోకి వెళ్ళాడు. అడవిలో ఒకచోట ఎండిపోయిన ఒక వాగు, దానిమీద కర్ర వంతెన కనిపించాయి. ఆ వంతెన ఎంత సన్నదంటే, ఒకేసారి ఆ దారి గుండా ఇద్దరు మనుషులు ఒకేసారి ప్రయాణించలేరు.

వంతెనకు ఒకపక్క నేరేడు చెట్లు ఉన్నాయి. రెండో పక్క దట్టమైన అడవి ఉంది. నేరేడు పళ్ళంటే ఎలుగుబంట్లకు ఇష్టమని వేటగాడికి తెలుసు. వేటగాడు అటుగా వచ్చే ఎలుగుబంటిని చంపడానికి కాచుకుని కూర్చున్నాడు.

కాస్సేపు గడిచాక నేరేడు చెట్ల వైపు నుండి ఒక పెద్ద ఎలుగు, మరోవైపు నుండి మరొక చిన్న ఎలుగుబంటి రావడం వేటగాడి కంటపడింది. ఎలుగుబంట్లు ఒకదానినొకటి దాటుకుంటూ వెళ్ళలేవని అతడికి తెలుసు. అక్కడ ఏదో పోట్లాట జరుగుతుందని ఊహించాడు.

వేటగాడు ఆ దృశ్యం చూస్తూ కూర్చున్నాడు. ఎలుగుబంట్లు దగ్గరగా వచ్చాయి. కొన్ని క్షణాలు ఎదురెదుగా నిలబడి ఒక దానివైపు ఒకటి చూస్తూ కాస్సేపు నిలబడ్డాయి. ఆ తరువాత పెద్ద ఎలుగుబంటి కింద కూర్చుని చిన్న ఎలుగును తన వీపుపై ఎక్కించుకుంది. చిన్న ఎలుగుబంటి పెద్దదాని వీపుపై ఎక్కి అవతలికి దాటింది. ఆ తరువాత వాటి దారిలో అవి వెళ్ళిపోయాయి.

వేటగాడు ఆశ్చర్యపోయాడు. జంతువులు మనుషులకన్నా మంచి ప్రవర్తన గలవని గ్రహించాడు.

నీతి: మనిషి జంతువుల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
============================

నిజమైన మేధావి

రాజు తెలివైన కుర్రాడు. ఒకరోజు సెలయేటి దగ్గర నడుస్తూ వెళ్తున్నాడు. హఠాత్తుగా అతనికో గొంతు వినిపించింది. అది పక్కనే ఉన్న చెట్టు కింద నుంచి వస్తోందని గమనించాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక సీసా కనిపించింది. ఆ సీసాలో ఒక చిన్న మనిషిలాంటి జీవి ఉంది. ఆ జీవి మూత తీసి తనను విడిపించమని రాజును అర్ధించింది.

చిన్న రూపంలో ఉన్న జీవిపై ఏ మాత్రం అనుమానం రాని రాజు సీసామూత తీశాడు. వెంటనే అందులో నుంచి దట్టమైన పొగ, మధ్య నుంచి ఒక భయంకరమైన భుతం బయటకు వచ్చింది. దానిని చూసి రాజు భయంతో "ఎవరు నువ్వు?" అని అడిగాడు. "నేను భూతాన్ని, ఒక మంత్రగాడు నన్ను ఈ సీసాలో బంధించాడు. నేనిప్పుడు స్వేచ్చగా ఉన్నాను. నిన్ను తినేస్తాను" అంటూ పెద్దగా అరిచింది ఆ భూతం.

తెలివైన రాజు, "నేను నిన్ను నమ్మను. ఇంత పెద్దగా ఉన్నావు, నువ్వు ఈ చిన్న సీసాలో ఎలా ప్రవేశించావు?" అని అడిగాడు. దానికి ఆ భూతం "ఎందుకు ప్రవేశించలేను. కావాలంటే చూపిస్తాను" అంటూ సీసాలోకి ప్రవేశించింది. ఏ మాత్రం ఆలస్యం చెయకుండా రాజు వెంటనే ఆ సీసా బిరడా బిగించేశాడు. అది చూసిన భూతం "దయచేసి నన్ను విముక్తుడిని చెయి. నేను నీకు ఏ మాత్రం హాని చేయను" అని బతిమాలసాగింది. "నేను నిన్ను ఎలా నమ్ముతాను? నిన్ను బయటకు వదిలితే వెంటనే నన్నే తినాలని అనుకున్నావు" అన్నాడు రాజు. భూతం "నేను నీకు అపకారం చెయ్యను. అంతేకాకుండా నీకొక అద్భుతమైన మంత్రదండం కూడా ఇస్తాను. దానిని ముట్టుకున్న వెంటనే రోగాలు మాయమైపోతాయి. హాయిగా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ముందుగా నువ్వు ఏ వస్తువును తాకితే అది బంగారంగా మారుతుంది" అని చెప్పింది.

దాని మాటలు నమ్మిన రాజు భూతాన్ని సీసాలో నుంచి విడిపించాడు. భూతం ఇచ్చిన అద్భుతమైన మంత్రదండం సహాయంతో... అది చెప్పిన సంగతి కుడా గుర్తుంచుకుని మరి దేనినీ ముట్టుకోకుండా నేరుగా వెళ్లి పెద్ద చెట్టును ముట్టుకున్నాడు. అది బంగారంగా మారింది. అనతికాలంలోనే సంపన్నుడయ్యడు రాజు.

నీతి : ఆపదలో కూడా చురుగ్గా ఉండేవాడే నిజమైన మేధావి.
======================

అభిప్రాయం

తెనాలి రామలింగడి దగ్గరకు ఒక పండితుడు తాను రాసిన కొన్ని పద్యాలను వినిపించాలని వచ్చాడు. తన పాండిత్యాన్ని రామలింగడి ముందు ప్రదర్శించాలని ఆయన కోరిక. అసలు తీరికలేని రామలింగడు "పండితావర్యా! మీరు మీ పద్యాలను మా వద్ద ఉంచి వెళ్ళండి. మేము తరువాత వాటిని తప్పకుండా చదివి అభిప్రాయం మీకు చెబుతామ" అని చెప్పాడు. రామలింగడి మాటలు నమ్మని ఆ పండితుడు పద్యాలను ఇప్పుడు వినవలసిందేనంటూ పట్టుబట్టాడు.

పండితుడు మొండి వైఖరి రామలింగడికి కోపం తెప్పించినా "సరే! మొదలెట్టండి" అని ఒక గోడకు ఒరిగి కూర్చున్నాడు. పండితుడు పద్యాలు చదవడం మొదలెట్టాడు. మొదటి రెండు మూడు పద్యాలకు "ఊ" కొట్టిన రామలింగడు ఆ తర్వాత ఎంచక్కా గాఢ నిద్రలోకి జారుకున్నాడు. పండితుడు. పండితుడు తన పద్యాల మోత మాత్రం ఆపలేదు.

రామలింగడు కాస్సేపటి తర్వాత నిద్రలేచాడు.

"అయ్యా! నా పద్యాలను మరోసారి వినిపించాలా?" అడిగాడు పండితుడు. "ఎందుకు? నేను ఇందాకే నా అభిప్రాయం చెప్పానుగా!" అన్నాడు రామలింగడు. "మీరా..... అభిప్రాయమా? లేదే! మీరు జోరునిద్రలోకి జారుకున్నారు" అని ఆశ్చర్యంగా అన్నాడా పందితుడు. "అవును నిజమే! నేను నిద్రలోకి జారుకున్నప్పుడే నా అభిప్రాయం వెలిబుచ్చాను" అని ముక్తసరిగా బదులిచ్చాడు రామలింగడు.

రామలింగడి వ్యంగ్య సమాధానానికి, అతని చతురతను కొనియాడాలో లేక తనను వెక్కిరించాడని బాధ్పడాలో అర్ధంకాక అక్కడి నుండి జారుకున్నాడు ఆ పండితుడు.
============================================

అక్బరు కల

ఒక రోజు రాత్రి అక్బరుకి తన పళ్ళన్నీ రాలిపోయినట్టు కల వచ్చింది. కంగారుగా నిద్రలో నుండి లేచి, వెంటనే ఆస్ధాన జ్యోతిష్యులను పిలిపించాడు. ఆదుర్దాగా వచ్చిన జ్యోతిష్యులకు తన కల గురించి చెప్పి, దాని పర్యవసానాలు వివరించమన్నాడు.

జ్యోతిష్యులు చాలాసేపు చర్చించుకుని, "అయ్యా! తమరి కలకు గొప్ప అర్ధమే ఉంది. విన్నవించమంటారు?" అని అడిగారు.

"కానీయండి" అన్నాడు అక్బర్‌.

"జహాపనా! మీ బందువులందరూ మీకంటే ముందుగా చనిపోతారు ప్రభూ" అన్నారు.

అక్బరుకి విపరీతమైన కోపం వచ్చింది. దాంతో జ్యోతిష్యులను మందిరం నుండి పంపి వేశాడు.

ఆ మరుసటి ఉదయం, యధాలాపంగా బీర్బల్ రాజుగారిని కలుసుకునేందుకు వెళ్లాడు. బీర్బల్‌కి కూడా రాజు తన కల గురించీ, జ్యోతిష్యులు చెప్పిన విషయం గురించీ చెప్పాడు. విషయం అర్ధమైన బీర్బల్‌ - "జహాపనా! నాకూ కొద్దిగా స్వప్న ఫలితాల జ్ణానం ఉంది. మీ కల ప్రకారం మీ బందువలందరికంటే మీరు ఎక్కువ కాలం ఆనందంగా జీవిస్తారని అనిపిస్తోంది" అన్నాడు.

ఈ సమాధానికి అక్బరు సంతోషించి బీర్బల్‌ని సత్కరించి పంపాడు.

జ్యోతిష్యులు చెప్పిందీ, తను చెప్పిందీ ఒకటే అయినా, చెప్పే విధానంలో తేడా అక్బరుకి తెలియనందుకు సంతోషించాడు బీర్బల్‌.
================================

అసమర్ధునికి బాధ్యత

ప్రతాపవర్మ అనే రాజుకు వేట అంటే అమితమైన నినోదం. రాజ్య వ్యవహారాలకంటే వేటకే ఎక్కువ సమయాన్ని కేటాయించేవాడు. తరచుగా అడవికి వెళ్లి కొద్ది రోజుల పాటు వేటాడి ఆ వినోదం తీరాక రాజ్యానికి వచ్చేవాడు. అలాగే ఒకసారి అడవికి వెళ్తూ భద్రయ్య అనే పనివాడికి అంత:పురం బాధ్యతను అప్పగించాడు. అంత:పురాన్ని భద్రంగా చూసుకుంటానని మాటంచ్చాడు భద్రయ్య.

కొద్ది రోజులకు రాజు వేట సరదా తీరిన తర్వాత తిరిగి రాజ్యానికి వచ్చాడు. భద్రయ్య రాజుకు స్వాగతం పలికాడు. పరిచారికలు రాజుకు హారతి ఇచ్చి పాటలు పాడి ఆహ్వానించారు. అంతా సవ్యంగానే ఉందనుకుంటూ సంతోషించిన రాజు భద్రయ్యతో "భద్రయ్యా! అంతా క్షేమమేనా?" అని అడిగాడు. భద్రయ్య భద్రంగా తలూపుతూ "అంతా భద్రంగా ఉంది ప్రభూ" అని బదులిచ్చాడు.

"రాణిగారెక్కడ?" అని అడిగాడు తన వేట ముచ్చట్లను అడిగి తెలుకోవడానికి. రాణి కనిపించలేదేమిటా! అని కలయచూస్తూ.

"యువరాజు గారిని చూడడానికి ఆస్దాన వైద్యుడి విడిదికి వెళ్లారు" అన్నాడు భద్రయ్య.

"యువరాజు అక్కడ ఎందుకు ఉన్నారు? వారికి ఏమైది?" అన్నాడు రాజు.

"పొరుగు రాజ్యం యువరాజుతో తలపడినప్పుడు తీవ్రమైన గాయాలయ్యాయి ప్రభూ" అన్నాడు భద్రయ్య.

రాజు మనసు కీడు శంకించింది. "పొరుగు రాజ్యం యువరాజుతో ఎందుకు తలపడాల్సి వచ్చింది? ఏ ప్రమాదం మంచుకొచ్చింది" అన్నాడు ఆందోళనగా.

"మన యువరాణి గారిని అపహరించుకుని వెళ్లడానికి వచ్చారు ప్రభూ, అప్పుడు ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో మన యువరాజు గారు గాయపడ్డారు" అన్నాడు.

"ఏమిటీ? మన యువరాణిని అపహరిద్దామని వచ్చారా? ఇంతకీ యువరాణిగారు ఎలా ఉన్నారు?" కంగారుగా అడిగాడు రాజు.

"అపహరించుకుని వెళ్లిపోయారు ప్రభూ! బహుశా రాక్షసంగా వివాహమాడి ఉండవచ్చు" వినయంగా సమాధానమిచ్చాడు భద్రయ్య. అంత:పురం అంతా భద్రంగానే ఉందన్నట్లు.

రాజు వినోదానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి రాజ్యవ్యవహారాలను పక్కన పెట్టాడు. ఆ పరిణామం రాజ్యానికే కాకుండా అంత:పురంలోని మహిళలకు రక్షణ కరువయ్యే పరిస్దితికి దారితీసింది. తన బాధ్యతను తాను నిర్వర్తించక పోవడం ఒక్కటే కాకుండా అసమర్ధుడికి అంతటి ప్రధాన బాధ్యతను అప్పగించడం వల్ల ఎంతటి అనర్ధం ముంచుకు వచ్చిందో అర్ధం చే్సుకున్నాడు. సరిదిద్దుకోలేని పొరపాటు జరిగిన తర్వాత కానీ ఆ రాజుకు తన బాధ్యత తెలిసి రాలేదు.

నీతి : బాధ్యతలను విస్మరించరాదు. తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించలేని వారు ఆ స్దానంలో ఉండే అర్హతను కోల్పోతారు.
===================================

అత్యంత మూర్ఖుడు

కృష్ణదేవరాయల మహారాజు ఆస్దానంలో ప్రతి సంవత్సరం ఒక వింత పోటీ జరిగేది. పాల్గొనే వారందరికీ ఒక పోటీ పెట్టి అందులో గెలిచిన వారికి ఆ సంవత్సరానికిగానూ అత్యంత ముర్ఖుడు అనే బిరుదునిచ్చి 5000 వరాహాలు బహుమానంగా అందజేసేవారు. ప్రతి సంవత్సరం తెనాలి రామలింగడే విజేతగా నిలిచి 5000 వరాహాలు ఎగరేసుకు పోయేవాడు. ఈసారి ఎలాగైనా అతన్ని గెలవకుండా ఆపాలని ఇతర ఆస్ధానకవులు, అధికారులు అతని వద్ద పనిచేసే అబ్బాయికి డబ్బు ఆశ చూపి రామలింగడిని ఒక గదిలో తాళం వేసి బంధించమని పురమాయించారు. ఆ కుర్రాడు అలాగే చేశాడు.

పోటీ అయిపోయిన తర్వాత రామలింగడు సభకు చేరుకున్నాడు. "ఇదేమిటి రామలింగా! నీవు పోటీ ముగిసిన తర్వాత విచ్చేశావు" అని అడిగాడు కృష్ణదేవరాయలు. "ప్రభూ! నాకు వంద వరహాలు అవసరమయ్యాయి. వాటిని పోగు చేసేసరికి ఇంత సమయం పట్టింది" అని జవాబిచ్చాడు రామలింగడు.

"నువ్వు ఈ పోటీలో పాల్గొని ఉంటే 5000 వరహాలు సంపాదించేవాడివి కదా! వంద వరహాలు కోసం 5000 వరహాలు కాదనుకున్నావు" అన్నాడు మహారాజు. "ప్రభూ! నేనొక పెద్ద మూర్ఖుడిని" అన్నాడు రామలింగడు. బదులుగా మహారాజు "నువ్వు అత్యంత మూర్ఖుడివి. నీలాంటి మూర్ఖుడిని నేనింతవరకు చూడనే లేదు" అన్నాడు.

"అంటే ఈ పోటీలో విజేతను నేనే అన్నమాట!" అని ఎగిరి గంతేశాడు రామలింగడు. అప్పటికి గాని రాజుగారికి తను నోరుజారానని అర్ధం కాలేదు. కాని రామలింగడి వంటి చతురుడికి ఈ బహుమానం దక్కడం గర్వకారణమని భావించి రాయలవారు అతడికి 5000 వరహాలను బహుమానంగా ఇచ్చి సత్కరించాడు. మరోసారి రామలిండే అందరికన్నా తెలివైన మూర్ఖుడని రాయలవారి ఆస్ధానంలో నిరూపితమైంది.
======================================

భేషజాల కప్ప

ఒక అడవిలో నీటి మడుగు ఉండేది. ఆ మడుగులో ఎన్నో జంతువులు ఉండేవి. వాటిలో ఒక చిన్న చేపను మిగతా చేపలే కాకుండా ఇతర జంతువులూ ఆప్యాయంగా చూసుకునేవి. ఆ చేప అన్ని జంతువులతో ప్రేమగా మాట్లాడుతూ, స్నేహంగా ఉండేది.

ఒకరోజు ఆ చేప ఈదుతూ మడుగు ఒడ్డుకు వస్తుంటే ఒక కప్ప చూసింది. కప్ప మడుగుకి కొత్త కావడంతో ఆ చేప గురించి దానికి తెలియదు. చేపను చూసి కప్ప, "ఏయ్‌ చేపా! నువ్వెందుకు మడుగు ఒడ్డుకు వస్తున్నావు? ఒడ్డుకు రావాలంటే నా అనుమతి తీసుకోవాలి" అంటూ అరవడం మొదలెట్టింది.

కప్ప మాటలకు చేప ఖంగుతింది. అప్పటివరకు దానితో ఎవరూ అలా మాట్లాడలేదు. అది కప్పను ఏమీ అనకుండా మడుగులోపలికి వెళ్లిపోయింది. అయినా కూడా ఆ కప్ప చేపను వదల్లేదు. మడుగులోకి దూకి చేప వెనకాలే వచ్చింది. "నువ్వొక నిస్సహాయ ప్రాణివని నీకు తెలుసా? నీటిలో నుండి బయటకు వచ్చినట్టు కనీసం కల కూడా కనలేవు. కాని నేను, నీటిలో ఈదగలను, నేలమీద బతకగలను" అని తన గొప్పలు చెప్పుకోసాగింది కప్ప. చేపమాత్రం ఏమీ మట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. కనీసం కప్ప వైపు తిరిగి చూడను కూడా చూడ లేదు. దాంతో కప్పకు కోపమొచ్చింది.

కప్ప తన గొప్పలను ఏకరువు పెడుతూ ఉండిపోయింది. "నువ్వు కనీసం మాట్లాడగలవా? నేను శ్రావ్యంగా పాడగలను కూడా" అంటూ మడుగులో నుంచి ఒడ్డుకు ఎగిరి "బెక బెక" మని అరవడం మొదలెట్టింది. అలాగే చాలాసేపు అరవసాగింది. కప్ప బెకబెకలు పక్కనే ఉన్న పుట్టలో నిద్రపోతున్న పామును నిద్రలేపాయి. తనను నిద్రలేపిందెవరో చూద్దామని కోపంగా పుట్ట బయటకొచ్చిన పాముకు మడుగు ఒడ్డున కప్ప కనబడింది. అంతే ఒక్క ఉదుటున కప్పపై దూకి కప్పను మింగేసింది. చేప చల్లగా నీటిలోకి జారుకుంది.

నీతి : గొప్పలు చెప్పుకోవడమంటే మన గోతిని మనమే తవ్వుకోవడం.
===================================================

చెరపకురా... చెడేవు!

ఒక ఊరిలో వృద్ధ సాధువు ఉండేవాడు. ఆయన ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్ళి భిక్ష తెచ్చుకుని కాలం వెళ్లదీసేవాడు. ఆయనకున్న దయాగుణం, మంచిమనసు వల్ల ప్రజలకు సాధువు వచ్చేసరికే ఆయన కోసం ఆహారం సిద్ధం చేసి ఉండేవారు.

సాధువు తాను భిక్షగా స్వీకరించిన ఆహారంలో నుండి పేదవారికి, బిచ్చగాళ్లకు, దారినపోయే బాటసారులకు పంచి మిగిలినది తినేవాడు. కొన్నిసార్లు ఆహారమంతా ఇతరలకు పంచి పస్తులుండేవాడు.

ఒకరోజు ఆ సాధువు ఒక వృద్ధురాలి ఇంటికి భిక్ష స్వీకరించడానికి వెళ్ళాడు. ఆ వృద్ధురాలు చాలా పిసినారి, దుర్మార్గురాలు, ఎవరికీ భిక్ష పెట్టేది కాదు. అయినా సాధువును వదిలించుకోడానికి కొంత ఆహారం భిక్ష వేసింది. మరునాడు కూడా సాధువు ఆ ఇంటికి భిక్ష కోసం రాగా, పాడైపోయిన అన్నం పెట్టింది. మూడోరోజు సాధువు వృద్ధురాలి ఇంటి దగ్గరకు రాగానే, అతని బెడద వదిలించుకునేందుకు. ఆమె ఒక దుర్మార్గపు పన్నగం పన్నింది.

వంటగదిలోకి వెళ్ళి విషం కలిపిన అన్నం తీసుకువచ్చి పెట్టింది. ఆ అన్నాన్ని స్వీకరించిన సాధువు అటూ ఇటూ తిరిగి సాయంత్రానికి తన ఇంటికి చేరుకున్నాడు. అన్నం తిందామని తన ఇంటి వాకిట్లో కూర్చొగానే ఒక యువకుడు అలసటగా రొప్పుతూ నడుస్తున్నాడు. వెంటనే సాధువు ఆ యువకుడిని పిలిచి, "అలసటగా ఉన్నట్టున్నావు. కాస్త అన్నం తిను. కాస్సేపు కూర్చుని వెళ్ళు" అని అతనికి వృద్ధురాలు పెట్టిన అన్నం మొత్తం పెట్టేశాడు. దురదృష్టవశాత్తు ఆ యువకుడు వృద్ధురాలి కొడుకే. ఆకలిగా ఉన్న ఆ యువకుడు వెంటనే గబగబా అన్నం తిని తన ఇంటికి బయల్దేరాడు. ఇల్లు చేరుకునే సరికి తలతిరుగుతున్నట్లు అనిపించింది. వెంటనే నురగలు కక్కుతూ తల్లి ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు. కొడుకు నుంచి విషయం తెలుసుకున్న తల్లి లబోదిబోమంది. ఆ యువకుడినే అనుసరిస్తూ వచ్చిన సాధువు తనకు తెలిసిన విద్యతో అతణ్ణి బతికించాడు. అప్పుడు వృద్ధురాలు ఏడుస్తూ తన తప్పును క్షమించమని సాధువు కాళ్ళమీద పడింది. అప్పటినుంచి జీవితాంతం మంచి తనంతో మెలిగింది.

నీతి : దుర్మార్గుల పన్నాగాలు ఎప్పుడూ పనిచేయవు సరికదా అవి వారిపైనే బెడిసికొడతాయి.
==========================================

చిలక పలుకులు

అక్బర్ చక్రవర్తికి వేటాడ్డం ఒక సరదా. ఆ సరదా వల్ల రాజ్యంలోని అడవులన్నీ నిర్వీర్యమైపోవడం బీర్బల్‌ను ఎంతగానో బాధించింది. బీర్బల్ ఈ విషయాన్ని అక్బర్‌ దృష్టికి తీసుకురావాలనుకున్నాడు. తగిన సమయం కోసం ఎదురుచూస్తుండగా ఒకరోజు అక్బర్‌ తన పరివారంతో కలిసి వేటకు వెళ్ళాడు. బీర్బల్‌ కూడా అతని వెంటే ఉన్నాడు. అడవికి వెళ్ళే తోవలో వారు ఒక చిలకల గుంపు చెట్టుపై కూర్చుని అరవడం చూశారు. అక్బర్‌ బీర్బల్‌తో "బీర్బల్‌! నువ్వు పక్షుల భాషను అర్ధం చేసుకుంటానని చెప్పావుగా, ఆ చిలకలు ఏమని మాట్లాడుకుంటున్నాయో చెప్పగలవా?" అని అడిగాడు.

బీర్బల్‌ వాటి మాటలను శ్రద్ధగా వింటున్నట్టు నటిస్తూ, "రాజా! ఈ చిలకలు పెళ్ళి పద్ధతులు గురించి మట్లాడుకుంటున్నాయి. పిల్ల వాడి తండ్రి ఏ పక్షులూ, జంతువులూ లేని ఐదు అడవులను వరకట్నంగా కావాలని అడుగుతున్నాడు. పెళ్లికూతురు తండ్రి ఇదేం కర్మ, పది ఖాళీ అడవులైనా కట్నంగా ఇవ్వడం సమ్మతమే అంటున్నాడు" అని చెప్పాడు.

ఇంకా ఏం మట్లాడుతున్నాయో తెలుసుకోవాలన్న కుతూహలంతో అక్బర్‌, "మరి పెళ్లికొడుకు తండ్రి ఏమంటున్నాడు?" అని అడిగాడు.

బదులుగా బీర్బల్‌ "మహారాజా! పెళ్లికొడుకు తండ్రి అంత సులభంగా ఖాళీ అడవులను ఎలా ఇవ్వగలవని పెళ్లికూతురు తండ్రిని అడగగా, పెళ్లికూతురు తండ్రి అయిన ఈ రాజ్యపు చక్రవర్తికి వేటాడటం సరదా. ఆ సరదాతో ఎన్నో అడవులను నాశనం చేశాడు. ఆయన తన సరదాతో మరికొన్నింటిని కూడా పక్షులు, జంతువులు లేని అడవులుగా మారుస్తాడని చెబుతున్నాడు" అన్నాడు. చిలుకల సహాయంతో బీర్బల్ తను చెప్పాలనుకున్న మాటలను తెలివిగా అక్భర్‌కు చెప్పేశాడు. తన సరదా అడవులకు ఎంతటి దుర్గతి తీసుకువచ్చిందో గ్రహించిన అక్బర్ వెంటనే దానికి కళ్ళెం వేశాడు.

No comments: