Saturday, February 26, 2011

నీతికధలు 23

అతి పెద్ద అబద్ధం

పూర్వం ఒక రాజుగారికి విచిత్రమైన ప్రకటనలు చేయటం సరదాగా ఉండేది. ఒకసారి ఆయన అతి పెద్ద అబద్ధం చెప్పిన వారికి 500 బంగారు నాణాలను బహుమతిగా ప్రకటించాడు.

ఎందరో రాజాస్ధానానికి వచ్చ్హి అబద్ధలు చెప్పారు. కాని ఎవరూ బహుమతిని అందుకునేంత పెద్ద అబద్ధం చెప్పలేదని ఆ రాజు భావించాడు.

ఒకరోజు, రాజు తన సిణాసనంపై కూర్చుని ఉండగా, ఒక యువకుడు వచ్చాడు.

"ప్రభూ! మీరు ఒక విషయానికి బహుమతి ప్రకటించారని విన్నాను" అని అడిగాడు "అవును. అతిపెద్ద అబద్ధం చెప్పిన వారికి 500 బంగారు నాణాలు".

"కాని దానికన్నా ముందు మీరు 1000 బంగారు నాణాలు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు" వాదించాడు యువకుడు.

"పెద్ద అబద్ధం. నేనెప్పుడూ అలా ప్రకటించలేదు" యువకుడి ఆలోచన పసికట్టలేని రాజు వెంటనే అన్నాడు.

అప్పుడా యువకుడు "ప్రభూ! మీరే ఒప్పుకున్నారు. నేను అతి పెద్ద అబద్ధం చెప్పానని. కాబట్టి దయచేసి 500 బంగారు నాణాలు బహుమతిగా ఇప్పించండి" అన్నాడు.

రాజుగారు అతని చతురతకి ముచ్చటపడి 500 బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చాడు.

నీతి : సమయస్పూర్తితో కూడిన చతురత అన్నివేళలా విజయం సాధిస్తుంది.
========================

చల్లటి ఎండాకాలం

అది ఎండ మండుతున్న వేసవి కాలం. వేడి వాతావరణం. శ్రీకృష్ణదేవరాయలతో సహా సభికులందరినీ ఆసహనానికి గురి చేసింది. ఆస్ధాన పూజారి మరింత అసహనంతో "ప్రభూ! ఉద్యానవనంలో తెల్లవారు ఝామున ఉండే స్వచ్చమైన గాలి ఎంత చల్లగా, మధురంగా ఉంటుంది. ఆ చల్లటి గాలిని ఏదైనా చేసి సభలోకి తీసుకురావడం కుదురుతుందా?" అని అడిగాడు రాయలవారిని.

"ఆహా! చలా మంచి ఉపాయం. ఎవరైనా తోటలోని స్వచ్చమైన సువాసన వెదజల్లే గాలిని సభలోకి తీసుకువస్తే, వారికి ఐదు వందల వరహాలు బహుమతిగా ఇస్తాను" అని ప్రకటించాడు రాజు. ఆ గాలిని సభలోకి తేవడం ఎలాగో తెలియని సభికులంతా మొఖాలు వేలాడేసుకున్నారు. రాజుగారికి, ఆస్ధాన పూజారికి పిచ్చి పట్టిందని లోలోపల నవ్వుకున్నారు.

మరునాడు ఉదయం సభ సమావేశంలో సభికులంతా ఒకరి మొఖం ఒకరు చూసుకున్నారు. ఎవరైనా రాజు చెప్పిన పనిని చేశారేమోనని, కానీ అది అసాధ్యం అని అంతా అనుకున్నారు. అంతలోనే రామలింగడు లేచి "రాజా! మీరు చెప్పిన విధంగానే నేను తోటలోని స్వచ్చమైన, సువాసనలు వెదజల్లే గాలిని సభలోకి తీసుకొచ్చాను" అన్నాడు "అవునా? ఏది?" అని ఆతృతగా, సంతోషంగా అడిగాడు రాజు.

రామలింగడు సైగ చేసి, నలుగురు సైనికులను పిలిచాడు. వారు నేరుగా రాజు గారి పక్కకు వెళ్ళి నిలుచున్నారు. వారి చేతిలో పచ్చి వెదురు బొంగులతో, తయారు చేసిన విసనకర్రలు, గులాబి, మల్లెపూవులతొఈ అలంకరింపబడి ఉన్నాయి. ఆ విసనకర్రలు అతారు పూయబడి, నీటిలో తడపబడి ఉన్నాయి.

రామలింగడి ఆజ్ఞ మేరకు ఆ సైనుకులు రాజుగారికి విసరటం మొదలెట్టారు. దానితో సభ మొత్తం సువాసనతో నిండిపోయింది.

ఆ గాలి రాజుగారికి చల్లటి అనుభూతిని ఇచ్చింది. "తెనాలిరామా! నీ తెలివి అమోఘం, నీ మేధస్సు అమోఘం అంటూ కాస్సేపు రామలింగడిని పొగిడిన రాజు "నీవు నా కోరికను నెరవేర్చావు. నీకు ఐదు వందల వరహాల బదులుగా పదిహేను వందల వరహాలు బహుమతిగా ఇస్తున్నాను. అంతేకాదు ఈ సదుపాయం శాశ్వతంగా ఉండేలా వ్యవహారాల మంత్రిని ఆదేశిస్తున్నాను" అంటూ సభను ముగించారు రాయలవారు. రామలింగడి తెలివిని సభికులంతaాచప్పట్లతో మెచ్చుకున్నారు.
==========================

దేవుడికి ఉత్తరం

ఒక గ్రామంలో సోము అనే అమాయకమైన కుర్రాడు ఉండేవాడు. అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. బోజనానికి మిగతా అవసరాలకు ఇరుగుపొరుగు వాళ్ళు సహాయం చేసేవారు. పాఠశాల చదువు కూడా వాళ్ళ దయాదాక్షిణ్యాల వల్లే సాధ్యమైంది.

ఒకసారి సోము దగ్గర పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. 'నమ్ముకున్న వారికి దేవుడే సహాయం చేస్తాడని' ఎవరో అనగా ఒకసారి విన్నాడు. దేవుడికి ఉత్తరం రాసి తనకు కాస్త డబ్బు సహాయం చేయమని అడగాలని నిర్ణయించుకున్నాడు.

దేవుడికి ఉత్తరం ఎలా రాస్తే బావుంటుందా అని చాలాసేపు ఆలోచించి చివరకు ఇలా రాశాడు. 'దేవుడా! నాకెవరు లేరు. నేను నిన్నే నమ్ముకున్నాను. దయచేసి నామీద జాలి చూపి పుస్తకాలు కొనుకునేందుకు 100 రూపాయలు పంపించు' ... చిరునామా రాయాల్సిన చోటులో 'దేవుడు, స్వర్గం' అని రాసి పోస్ట్‌బాక్స్‌లో ఆ ఉత్తరం వేశాడు.

పోస్ట్‌మాన్‌ అన్ని ఉత్తరాలతో పాటు సోము ఉత్తరాన్ని కూడా పోస్టాఫీసుకు తీసుకెళ్ళాడు. అక్కడి పోస్టుక్లర్కు ఆ ఉత్తరంపైన ఉన్న అడ్రసు చూసి ఆశ్చర్యపోయి దాన్ని పోస్టుమాస్టర్‌కు అందించాడు. ఆయన ఆ ఉత్తరం తెరిచి చదివాడు. ఆ ఉత్తరంలోని సున్నితమైన అంశం పోస్టుమాస్టర్‌ హృదయాన్ని తాకింది. అతను సోముకి 75 రూపాయలు మనియార్డరు పంపించాడు.

నాలుగురోజుల తర్వాత సోము నుండి దేవుడికి మరొక ఉత్తరం వచ్చింది. అందులో... దేవుడా! నువ్వు చాలా గొప్పవాడివి. నా మొర ఇంత త్వరగా ఆలకిస్తావని నేను అనుకోలేదు. అయితే నాకు కేవలం 75 రూపాయలు మాత్రమే లభించాయి. నువ్వు 100 రుపాయలు పంపించి ఉంటావు. కాని పోస్టుమాన్‌ అందులోంచి 25 రూపాయలు కాజేసి ఉంటాడు పరవాలేదు. అది నీ తప్పు కాదుగా... మరింకేదైనా అవసరం ఏర్పడితే నీకు మళ్ళీ ఉత్తరం రాస్తానూ అని ఉంది. అది చదివిన పో్స్టుమాస్టర్‌ సోము అమాయకత్వానికి జాలిపడ్డాడు.
=============================

గంగ మంగ

ఒక ఊళ్ళో గంగ, మంగ అనే ఇద్దరు స్త్రీలు పక్కపక్కనే కాపురం ఉంటున్నారు. గంగ తనకున్న రెండు గేదెలతో నేతి వ్యాపారం చేస్తూ ఉండేది. మంగ తన ఎనిమిది గేదెలతో, పాలు అమ్ముకుని బతుకుతూ ఉంది.

ఒకసారి గంగ దగ్గర మంగ కిలో నెయ్యి అప్పుగా తీసుకుంది. ఎన్ని రోజులైనా నెయ్యిని తిరిగి ఇవ్వలేదు. ఊరిలో గయ్యాళిగా పేరున్న మంగను తన కిలో నెయ్యి గురించి ఎలా అడగాలా? అని ఆలోచించిన గంగ ఒకనాడు, "మంగక్కా! నువ్వు నా దగ్గర ఆరు నెలల క్రితం కిలో నెయ్యి అప్పుగా తీసుకున్నావు. ఇప్పుడు నా దగ్గర లేదు, చుట్టాలొచ్చ్హారు కాస్త ఆ నెయ్యి బాకీ తీరుస్తావా?" అని అడిగింది. మంగ ఉవ్వెత్తున లేచి "నీ దగ్గర నేను అప్పు చేయడమేంటి? ఎనిమిది గేదెలున్న నేనెక్కడ, ముష్టి రెండు గేదెలతో బతుకీడుస్తున్న నువ్వెక్కడ?" అంటూ నానా తిట్లు తిట్టింది. గంగకి కన్నీళ్లు జలజలా రాలాయి. ఏమీ అనలేక ఆ ఊరి న్యాయాధికారికి ఫిర్యాదు చేసింది.

మరునాడు న్యాయసభలో న్యాయాధికారితో మంగ గట్టిగా అరుస్తూ "అయ్యా! ఇదేమి న్యాయం? ఎనిమిది గేదెలున్న నేను రెండు గేదెలున్న ఈ గంగ దగ్గర కిలో నెయ్యి అప్పు తీసుకున్నానంటే మీరు నమ్ముతున్నారా? ఆమె చెప్పింది నమ్మి మీరు నన్ను ఇక్కడకు పిలిపించడం చాలా అన్యాయం" అని విరుచుకుపడింది.

మంగ మాటలను గమనించిన న్యాయాధి కారి ఆమె మాటలలో ఉన్న కపటబుద్దిని కూడా గమనించాడు. వారి పోట్లాటకు తీర్పును మరో రోజుకు వాయిదా వేశాడు.

ఆ రోజు తన న్యాయస్ధానం ముందు దారిని బురదగా చేయించి ఉంచాడు న్యాయాధికారి. గంగ మంగ ఇద్దరూ ఆ బురదలో నడుస్తూ లోపలికి వచ్చ్హారు. భటులు వాళ్ళిద్దరికీ చెంబులతో నీళ్ళు ఇచ్చ్హారు. గంగ కేవలం సగం చెంబుడు నీటితో బురదనంతా శుభ్రం చేసుకోగా మంగకి మూడు చెంబుల నీళ్లు అవసరమయ్యాయి. అది గమనించిన న్యాయాధికారి మంగతో "ఏమ్మా! మూడు చెంబుల నీళ్లు ఇచ్చినా నువ్వు నీ కాళ్ల బురదను వదిలించుకోలేక పోయావు. గంగ మాత్రం సగం చెంబెడు నీటితో శుభ్రం చేసుకుంది. ఎనిమిది గేదెలున్నా నీకు పొదుపు చేయడం చేతకాదు. దుబారా చేయటం నీకు అలవాటు. నువ్వు గంగ దగ్గర కిలో నెయ్యి అప్పుగా తీసుకున్నది నిజమే. వెంటనే గంగకు ఇవ్వవలసిన కిలో నెయ్యితో బాటు మరో నాలుగు కిలోల నెయ్యి కలిపి మొత్తం ఐదు కిలోల నెయ్యి ఇచ్చేయి. లేకపోతే నీకు కఠినశిక్ష వేస్తాను" అన్నాడు.

మంగ మారు మాట్లాడక చేసిన తప్పుకు లెంపలేసుకుని గంగకు ఇవ్వవలసిన నెయ్యిని తిరిగి ఇచ్చేసింది.
=================================

గుణపాఠం

ఒక అడవిలో వింత పక్షి జీవించేది. దానికి రెండు తలలు, రెండు ముక్కులు, రెండు మెడలు ఉన్నాయి. కాని ఒక్కటే కడుపు ఉంది. ఒకరోజు అది అలా పచార్లు కొడుతుండగా దానికొక దేవతాఫలం దొరికింది. పక్షి సంతోషం పట్టలేక ఒక నోటితో ఆ పండును రుచి చూసి, "ఆహా! ఎంత రుచిగల పండు. ఎన్నో పండ్లు తిన్నాను కాని దీనంత రుచిగల పండు తినలేదు" అనసాగింది మొదటినోరు.

"నాక్కుడా సగం ఫలం ఇవ్వవా? నేను కూడా రుచి చూస్తాను" అని రెండోనోరు. "నేను తిన్నా నువ్వు తిన్నా ఒక కడుపులోకే కదాపోయేది" అంటూ మిగతా పండునంతా తినేసింది మొదటినోరు. ఎలాగైనా మొదటినోటికి గుణపాఠం చెప్పాలనుకున్నది రెండోనోరు.

ఆ రోజు నుండి మొదటినోటితో మాట్లాడటం మానేసింది రెండోనోరు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న రెండోనోటికి ఒక చెట్టుకు వేలాడుతున్న విష్పు ఫలం కనబడింది.

"అది విషపుఫలం. నీవు దానిని తింటే నువ్వు, నేను ఇద్దరం చనిపోతాం. ఎంతైనా మనకున్నది ఒకే పొట్ట కదా!" అని మొదటి నోరు రెండో నోటిని ఆ విషపు ఫలం తిన వద్దని వారించసాగింది.

విషపు ఫలాన్ని తింటున్నట్టు నటించిన రెండోనోరు మొదటినోటిని ఒకసారి గమనించింది. చావు అంచుల్లో ఉన్నామని మొదటినోరు అనుకుంటున్న తరుణంలో, "చుశావా? నేనీ విషఫలం తింటే నువ్వు, నేను ఇద్దరం చచ్చే వాళ్లం. మనకిద్దరికీ ఒకే పొట్ట ఉన్నా మనిద్దరం ప్రతి వస్తువును పంచుకుని తింటూ, సజావుగా, సఖ్యతగా ఉంటే సమస్యలే రావు" చెప్పింది రెండోనోరు.

అవునన్నట్టు సిగ్గుతో తలదించుకున్న మొదటినోరు ఆ రోజు నుండి రెండోనోటితో సజావుగా, సఖ్యతగా ఉండసాగింది.

నీతి : కలిసి ఉంటే కలదు సుఖం.
=================================

ఇది ధిక్కారం కాదు

ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు తన ఆస్ధానంలోని తెనాలి రామలింగడిపై ఒక విషయంలో విసుగు చెందాడు. ఆ కోపంతో "రేపటి నుంచి నీ ముఖం నాకు చూపెట్టకు పో!" అని ఆదేశించాడు. మౌనంగా తలాడించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామలింగడు.

మరునాడు, కృష్ణదేవరాయలు దర్బారుకు బయలుదేరుతుండగా మార్గమధ్యంలో కనబడిన అతని న్యాయాధికారి ఒకరు రాజుతో - "రాజా! మీరు తెనాలి రామలింగడిని ఈ రోజు దర్బారుకు రావద్దని ఆదేశించినా, మీ ఆదేశాలు పాటించక అతను ఎప్పుడో దర్బారుకు హాజరయ్యాడు. అంతేకాదు, అక్కడ తన వెకిలి చేష్టలతో అందరితో అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడు" అని చెప్పాడు.

అది విన్న రాజు ఆవేశంతో ఊగిపోతు, "నా ఆదేశాలనే ధిక్కరించేందుకు రామలింగడికి ఎన్ని గుండెలు" అన్నాడు. "అవును రాజా! మీ ఆదేశాలు అతనికి పూచికపుల్లతో సమానం. వంద కొరడా దెబ్బలు కూడా అతని రాజధిక్కారానికి శిక్ష కాజాలవు" అని రాజు కోపాన్ని మరింత పెంచాడు ఆ అధికారి.

కోపంతో చిర్రెత్తు కొచ్చిన రాజు వేగంగా దర్బారులోకి ప్రవేశించాడు. అప్పటికే దర్బారులో ఉన్న తెనాలి రామలింగడు తన తలపై ఒక కుండను బోర్లించుకున్నాడు. చూసేందుకు వీలుగా రెండు కళ్ల దగ్గర రెండు రంధ్రాలున్నాయి. రామలింగడి గడుసుతనాన్ని అర్ధం చేసుకున్న రాజు "ఏంటి రామలింగా! ఈ వెకిలి వేషాలు? నీవు నా ఆదేశాలను ధిక్కరించావు" అన్నాడు. దానికి రామలింగడు "లేదు మహాప్రభూ! నా ముఖం మీకు చూపెట్ట వద్దని మీరే కదా ఆదేశించారు. మీరు ఇప్పుడు నా ముఖాన్ని చూడగలుగుతున్నారా? లేదు కదా. అలాంటప్పుడు ఇది ధిక్కారం ఎలా అవుతుంది" అని బదులిచ్చాడు.

"రామలింగా! నీ తెలివికి జోహార్లు. ఇంక ఆ కుండను తొలిగించి, నీ స్ధానంలో నీవు కుర్చుంటావా?" అన్నాడు మహారాజు. తెనాలి రామలింగడు తలపై నుంచి కుండను తీసి వేసి తన ఆసనంలో కూర్చుని కార్యకలాపాలు మొదలుపెట్టాడు.
==================================

కప్ప రాకుమారుడు

ఒక రాజుకు ఒక అందమైన కూతురు ఉండేది. వారి రాజభవనం పరిసరాల్లో ఒక అడవి, దానిలో ఒక బావి ఉండేది. ప్రతి రోజూ బుజ్జి యువరాణి ఆ బావి పక్కన కూర్చుని ఆడుకుంటూ ఉండేది. ఒకరోజు ఆమె ఆడుకుంటుండగా బంతి ఆ లోతైన బావిలో పడిపోయింది.

"అయ్యో నా అందమైన బంతి", అంటూ ఏడ్చిందా యువరాణి. "ఏమయింది యువరాణి?" అని బావిలో నుంచి ఒక స్వరం వినిపించింది. బావిలోకి తొంగి చూసిన ఆ అమ్మాయికి ఒక కప్ప కన్పించింది.

"నా బంతి బావిలో పడిపోయింది" ఏడుస్తూ చెప్పింది యువరాణి.

"ఏడవకు", అంది కప్ప. "నేను నీ బంతిని తీసిస్తాను. మరి బదులుగా నువ్వు నాకేమిస్తావు?" అని అడిగింది. "నీకేం కావాలి? నా దుస్తులా, నా ఆభరణాలా, నా బంగారు కిరీటమా?" అని అడిగింది యువరాణి.

"అవేవీ కావు! నన్ను నీ స్నేహితుడిలా చేసుకుంటే చాలు. నన్ను నీ టేబుల్‌పై కూర్చోనివ్వాలి, నీ బంగారు పళ్లేంలో తిననివ్వాలి, నీ బంగారు గ్లాసులో తాగనివ్వాలి, అప్పుడే నేను నీకు అందమైన బంతిని తెచ్చిస్తాను". అంది కప్ప. "సరే, నేనన్నింటికీ ఒప్పుకుంటున్నాను", అంది యువరాణి. కప్ప ఒక్క ఉదుటున నీటిలోకి దూకి బంతిని పైకి తెచ్చింది.

అంతే యువరాణి గబుక్కున బంతిని లాక్కుని కనీసం 'కృతజ్ఞతలు' కూడా చెప్పకుండా ఇంట్లోకి పరుగుపెట్టింది. "ఆగు, ఆగు", అని అరిచింది కప్ప. కాని యువరాణి వినకుండా పరిగెత్తడంతో కప్ప చేసేదేమీలేక బావిలోకి జారుకుంది.

మరునాడు యువరాణి నిద్రలేచి బయటకు వస్తుంటే గుమ్మం దగ్గర ఆ కప్ప కనబడింది. ఆ కప్పను చూడగానే యువరాణి తలుపు మూసి తండ్రి దగ్గరకు పరిగెత్తింది.

"ఏమయింది, తల్లీ?" అని అడిగాడు రాజు. జరిగిన విషయం తండ్రితో వివరించి చెప్పింది యువరాణి.

"ఎలాంటి పరిస్ధితిలో నైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. కప్పను ఇంట్లోకి రానివ్వు" అన్నాడు రాజు.

యువరాణి తలుపు తెరవగానే, కప్ప నేరుగా భోజనాల బల్ల దగ్గరకు వెళ్లి, కుర్చీ పైకి ఎక్కింది. "నన్ను పైకి తీసుకో. నేను నీ బంగారు పళ్లెంలో భుజించాలి" అని యువరాణితో అంది కప్ప. యువరాణి బంగారు పళ్లెం చేత్తో పట్టుకుని, కప్పను ముట్టుకోగానే, అది ఒక అందమైన అబ్బాయిలా మారిపోయింది.

"నేను ఒక రాకుమారుడిని. ఒక దుర్మార్గపు మంత్రగత్తె నన్ను కప్పలా మార్చింది. ఒక రాకుమార్తె స్పర్శ తిరిగి నన్ను రాకుమారుడిగా మారుస్తుందని ఆ మంత్రగత్తె చెప్పింది". అన్నాడు కప్ప రూపం నుండి మనిషిగా మారి ఆ రాకుమారుడు.

అది విని రాజు చాలా ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత రాకుమారుడిని తమ దగ్గరే ఉండమని కోరాడు రాజు. తనకు కొడుకులు లేని లోటు తీరినందుకు రాజు, అన్న దొరికినందుకు యువరాణి ఎంతగానో సంతోషించారు.
============================

ఖరీదైన కోటు

ఒక దొంగ... విలాసాలకు సరిపడేంత డబ్బు తన దగ్గర లేకపోవడంతో దొరికినంత దోచుకుందామని ఒక సత్రంలో తలదాచుకున్నాడు. రెండు రోజులు గడిచినా తన పాచిక పారక పోవడంతో నిరాశచెంది, ఏదో ఆలోచిస్తూ గది బయటకొచ్చి నిలబడ్డాడు. ఎంతో ఖరీదైన కొత్త కోటు వేసుకున్న సత్రం యజమాని తన గది ముందు కుర్చీలో కూర్చొని ఉండటం గమనించిన దొంగ మెల్లగా వెళ్లి అతనితో మాటలు కలిపాడు.

వారి ముచ్చట్లు మంచి ఊపుమీదుండగా దొంగ అత్యంత భయంకరంగా, అచ్చం తోడేలులా ఆవలించాడు. అదివిన్న యజమానికి ఒళ్లు జలదరించి "ఎందుకింత భయంకరంగా ఆవలిస్తావు?" అని అడిగాడు. "అది ఒక పెద్ద కధ. మీరు నమ్మినా, నమ్మలేకపోయినా చెప్పడం నా కర్తవ్యం. నేను ఇలా ఎప్పుడైతే మూడోసారి ఆవలిస్తానో, అప్పుడు నేను తోడేలులా మారిపోయి మనుషుల మీద దాడి చేస్తాను. ఇది గతజన్మలో నేను చేసిన పాపాల ఫలితం. అలా జరగకుండా ఉండాలంటే ఆ సమయంలో ఎవరైనా నా దుస్తులను గట్టిగా పట్టుకోవాలి. లేదంటే నేను నా దుస్తులన్నీ చింపేసి తోడేలులా మారిపోతాను" అని నమ్మబలికాడు దొంగ. ఇదంతా చెబుతూనే రెండోసారి కూడా ఆవలించాడు.

అది విన్న సత్రం యజమాని అక్కడి నుండి లేచి పారిపోవడానికి ప్రయత్నించగా, "అయ్యా! ఎక్కడికెళ్తున్నారు. నన్ను పట్టుకోండి. లేదంటే నేను నా దుస్తులు చింపుకుని తోడేలులా మారిపోతాను." అంటు అతన్ని గట్టిగా పట్టుకున్నాడు. దొంగ చేతిలో నుంచి తప్పించుకోవాలని చుశాడు సత్రం యజమాని. సాధ్యం కాకపోవడంతో కోటును వదిలించుకుని తప్పించుకుని కాళ్లకు బుద్ధిచెప్పాడు. కోటు దొంగ చేతిలోనే ఉండిపోయింది. దొంగ తన పంటపండిందనుకుని కోటుతో ఉడాయించాడు.

నీతి : కొత్తవారిని అంత సులువుగా నమ్మకూడదు.
===========================

మంచి మాట

ఒక దుప్పి తనను వెంబడిస్తున్న వేట తోడేళ్ల నుండి తప్పించుకునేందుకు ఒక గొడ్లచావిడిలో దూరింది. ప్రాణభయంతో తమ చావిడిలో దూరిన దుప్పిని చూస్తూ ఒక ఎద్దు, "మిత్రమా! ఎందుకు నీ అంతట నీవే నీ శత్రువు గూటిలోకి దూరావు? ఇక్కడ ఎక్కువసేపు ఉండకుండా వెళ్ళిపో!" అని హెచ్చరించింది.

బదులుగా దుప్పి, "మిత్రమా! దయచేసి నేనెక్కడ ఉన్నానో అక్కడే ఉండనివ్వు. తప్పించుకునేందుకు సరైన అవకాశం రాగానే మెల్లగా ఇక్కడి నుంచి జారుకుంటాను" అని చెప్పింది. సాయంకాలం కాగానే కొందరు పనివాళ్లు వచ్చి గొడ్లచావిడిలోని ఎద్దులు, ఆవులకు గడ్డి, దాణా వేసి వెళ్లారు. కాని అక్కడే, ఎద్దులు, ఆవులతో పాటే వున్న దుప్పి ఉనికిని కనిపెట్టలేకపోయారు. పశువులు తమతోపాటే దుప్పిని కుడా గడ్డి మేయమని కోరాయి. కాని, "మిత్రమా! నువ్వు ఇప్పుడు మాతో పాటే గడ్డి మేయచ్చు. ఇప్పుడు వెళ్ళినవారు నిన్ను పసిగట్టలేదు. కాని నీకు పొంచివున్న ముప్పు తప్పిపోలేదు. ఇప్పుడు మా యజమాని వస్తాడు. అతడు వచ్చి వెళ్ళేవరకు నీకు ఆపద సమయమనే చెప్పాలి" అని అన్ని పశువులూ ముక్తకంఠంతో దుప్పిని తమ చావిడ్లో నుంచి వెళ్ళిపొమ్మని చెబుతుండగానే యజమాని రానేవచ్చాడు.

వచ్చీ రావడంతోనే, "నా పశువులకు నేను వేసే దాణా ఎందుకు సరిపోవడం లేదు. నేను వాటి ఖాళీ కడుపులను గమనిస్తున్నాను. ఇందులో ఏదో తిరకాసుంది" అంటూ చావిడంతా కలియదిరిగాడు. అన్ని పశువుల మధ్యలో రాటుదేలిన దుప్పి రాటుదేలిన కొమ్ములను కళ్లారా చూసిన యజమాని తన పనివారిని పిలిచి, దుప్పిని బంధించమని పురమాయించాడు.

పాపం! పశువుల మంచి మాట పెడచెవిన పెట్టిన దుప్పి గొడ్లచావిడి యజమాని చేతిలో బందీ అయిపోయింది.
=============================

మరణించిన గుర్రం

రమణయ్య, రంగయ్య ఇద్దరూ ఇరుగు పొరుగువారు. రమణయ్య స్వర్ణకారుడు రంగయ్య కుండలు చేసి వాటిని అమ్మి పొట్ట పోసుకునే పేద కుమ్మరివాడు. రంగయ్య మంచివాడు. నిజాయితీపరుడు, రమణయ్య అహంకారి, దుర్మార్గుడు.

రమణయ్య ఒకరోజు పక్క ఊరికి వెళ్తూ, "రంగయ్యా! నేను పక్కనే ఉన్న రామాపురానికి వెడుతున్నాను. నాలుగైదు రోజులు పట్టవచ్చు. నా గుర్రాన్ని నీ ఇంట్లో ఉంచి వెళతాను" అంటూ రంగయ్యను బతిమాలాడు. రంగయ్య మంచివాడు కాబట్టి సరేనని గుర్రాన్ని తన ఇంటి వరండాలో కట్టేసుకున్నాడు.

రమణయ్య ఊరికి వెళ్ళిన తర్వాత రెండు రోజులు బాగానే ఉన్నా గుర్రం మూడో అకస్మాత్తుగా చనిపోయింది. ఏం చేయాలో తెలియక, రమణయ్యకు ఏం చెప్పాలో అర్ధంకాక రంగయ్య తలపట్టుకున్నాడు. రమణయ్య వచ్చాక ఆ గుర్రం ఖరీదు కట్టిద్దాంలే అని తనను తాను సముదాయించుకున్నాడు రంగయ్య.

ఐదు రోజులు తర్వాత రమణయ్య రానే వచ్చ్హాడు. విషయం తెలుసుకున్న రమణయ్య కోపంగా కళ్ళెర్రజేసి, "చూడు రంగయ్యా! నేను గుర్రం అప్పగించి వెళ్ళాను. ఇప్పుడు నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నా గుర్రం నాకు కావాలి. అంతే! నాకు డబ్బులూ వద్దు, మరో గుర్రమూ వద్దు" అని చెప్పడంతో ఏం చేయాలో తెలియక రంగయ్య మర్యాద రామన్నని కలిశాడు.

మర్యాద రామన్న చెప్పిన సలహా విని ఒక పాచిక వేశాడు. మర్ణాడు ఉదయం గుర్రం కోసం వచ్చిన రమణయ్య పొరపాటున రంగయ్య ఇంటి ముఖ ద్వారానికి ఆనించి పెట్టిన కుండలను బద్దలు కొట్టేశాడు. ఆ ఉపాయం తనదే కావడంతో రంగయ్య ఇంట్లోంచి ద్వారం దగ్గరకు వచ్చి "అయ్య బాబోయ్‌" నా కుండలు బద్దలైపోయాయి రమణయ్య! ఇప్పుడెలా? అని అరవడంతో రమణయ్య "కుండలదేముంది రంగయ్యా! వాటి ఖరీదు కట్టిస్తాను లేదంటే మరిన్ని కుండలు కొనిస్తాను" అన్నాడు. "కాదు, నాకు నా కుండలే కావాలి" అని రంగయ్య పట్టు బట్టడంతో ఇద్దరూ కలిసి మర్యాద రామన్న దగ్గరకి వెళ్లారు.

ఇద్దరి మాటలు విన్న మర్యాద రామన్న రమణయ్యకు బుద్ధి చెప్పి గుర్రం ఖరీదు రంగయ్య దగ్గర తీసుకుని అతడి కుండల ఖరీదు కట్టివ్వమని మందలించాడు. రమణయ్య తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో ఇంటి ముఖం పట్టాడు.

No comments: