Friday, February 25, 2011

నీతి కథలు 16

అమూల్యమైన బహుమతి

ఒక ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఉపన్యాసం ప్రారంభిస్తూ జేబులో నుంచి ఒక వెయ్యి రూపాయల నోటు బయటకు తీశాడు. ఆ గదిలో కనీసం 200 మంది వరకు ఉన్నారు. ఆయన అందరిని ఇలా అడిగాడు - "ఈ వెయ్యి రూపాయల నోటు ఎవరెవరికి కావాలి?" అంతే చేతులు ఒక్కటొక్కటిగా పైకి లేచాయి. దాదాపు అందరూ చేతులెత్తారు.

"నేను మీలో ఒకరికి ఈ వెయ్యి రూపాయల నోటు ఇస్తాను. కాని దానికి ముందు నేనొకటి చేస్తాను" అంటూ ఆ నోటును చేతితో నలపటం మొదలెట్టాడు. రెండు నిమిషాల తరువాత మళ్ళీ అడిగాడు. ఇప్పుడు ఈ నోటు ఎవరిక్కావాలి?". అయినా చేతులు లేపడం ఆగలేదు.

"సరే!" అంటూ ఆయన తన చేతిలోని ముడతలు పడి నలిగిన వెయ్యిరూపాయల నోటును కింద పడేసి బూటు కాలితో నలపడం మొదలెట్టాడు. కొద్ది సేపటి తరువాత దాన్ని చేతిలోకి తీసుకుని "ఇప్పటికీ ఇది ఎవరిక్కావాలి?" అని అడిగాడు. నలిగిపోయి, మాసిపోయినా ఆ నోటు కోసం చేతులు లేపడం ఆపలేదు సభికులు.

"ప్రియ మిత్రులారా? మనం ఇప్పటి వరకు ఒక విలువైన పాఠం నేర్చుకున్నాం. డబ్బుకు ఎంత చిరుగులు పడినా, నలుగులు పడినా, దాన్ని అందరూ కోరుకుంటారు. ఎందుకంటే అది దాని విలువను ఎంత మాత్రం కోల్పోలేదు కాబట్టి ఈ నోటు ఇప్పటికీ వెయ్యిరూపాయల నోటే. ఈ నోటులాగే మన జీవితంలో మనం ఎన్నో ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలను ఎదుర్కొంటాం. కొన్నిసార్లు మనం ఎందుకూ పనికిరాని వారమని,

మన బ్రతుకులు వ్యర్ధమని అనుకుంటాం.కాని ఏం జరిగినా, ఏం జరగబోతున్నా మన విలువను మాత్రం కోల్పోం. మనల్ని ప్రేమించే వారికి మనం ఎల్లప్పుడూ అమూల్యమైన బహుమతులమే" అని వివరించాడు ఉపన్యాసకుడు.

మరుక్షణం ఆ హాలు చప్పట్లతో మారుమోగి పోయింది.
==================================

గురువా! మజాకా!

ముల్లా నస్రుద్దీన్‌ తన పట్టణంలో ఒక ప్రముఖ వ్యక్తి. చాలామంది తాము కూడా నస్రూలా చతురత, మేధాశక్తి కలిగివుండాలని కోరుకునేవారు. ఒకరోజు కొందరు విద్యార్ధులు నస్రును కలిసి ఇలా అడిగారు, "గురువుగారూ! మేము మీ గురించి చాలా విన్నాం. మీకు ప్రతి ప్రశ్నకూ జవాబు తెలుసని అంతా అనుకుంటారు. మీ చతురత, మేధాశక్తిలో మేము కొంతభాగం సంపాదించుకోగలిగినా చాలు, మమ్మల్ని మీ శిష్యులుగా అంగీకరించండి."

మొదట నస్రు తిరస్కరించాడు. అతనికి చాలా సిగ్గు, అతనొక గురువుగా ఉండటానికి ఇష్టపడలేదు. కాని విద్యార్ధులు ప్రాద్ధేయపడడంవల్ల అతను ఒప్పుకోక తప్పలేదు. నస్రు విద్యార్ధులతో "సరే! నేను మిమ్మల్ని నా శిష్యులుగా అంగీకరిస్తున్నాను, కాని కొన్ని రోజుల వరకే. మీరు ఏమి చేస్తున్నారో చూసి కొన్నిసార్లు ప్రజలు నవ్వుతారు, కాని ప్రతీ పని వెనుక ఒక కచ్చితమైన ఉద్దేశ్యం వుంటుంది." అని చెప్పడంతో విద్యార్ధులు సంతోషించారు.

వారిలో ఒక విద్యార్ధి ఇలా అన్నాడు, "ముల్లాగారూ! ప్రజలు మీలా గొప్ప శక్తులను పొందాలని కోరుకుంటారు. మీరేమైనా శక్తులను పొందారా?

నస్రు నవ్వుతూ, "హా! అవును! నేను చీకటిలో కూడా చూడగలిగే శక్తిని సంపాదించాను", అన్నాడు. విద్యార్ధులు ఆశ్చర్యపోయారు. మరో విద్యార్ధి "గురువుగారూ! మీరు చీకటిలో లాంతరు పట్టుకుని నడవడం నేను చూశాను. మీకు చీకటిలో కనిపించినట్లైతే మీరు అలా ఎందుకు చేస్తారు?" అన్నాడు.

నస్రు నవ్వుతూ, "ఆహ్‌ ఎందుకంటే ఇతరులు చీకట్లో చూడలేరు కదా! లాంతరు నన్ను ఇతరులు ఢీకొట్టకుండా కాపాడుతుంది" అని చెప్పాడు.

విద్యార్ధులు నవ్వుతూ నస్రు మేథోశక్తి, చతురతను పొగిడారు. కొంత సమయం తర్వాత నస్రు విద్యార్ధులతో "పదండి మిత్రులారా! ఇంటికి వెళ్ళిపోదాం. మీకు ఇంటికెళ్ళడానికి గుర్రాలున్నాయా?" అని ప్రశ్నించాడు.

విద్యార్ధులు, "లేవు గురువుగారూ!" అని బదులిచ్చారు.

దాంతో నస్రు గుర్రం మీదకు ఎక్కి మెల్లగా స్వారీచేస్తుండగా, విద్యార్ధులు నడుస్తూ అతన్ని అనుసరించారు.

కానీ నస్రు తన గుర్రం మీద తల వెనుకకు, వీపు ముందుకు చేసి కూర్చోవడంతో విద్యార్ధులంతా ఆశ్చర్యపోయారు. వీధుల్లో వెళ్తున్న ప్రజలు నస్రును చూసి పగలబడి నవ్వడం మొదలెట్టారు.

ఒక విద్యార్ధి ఉండబట్టలేక కుతూహలంతో "గురువుగారూ! మీరు గుర్రంపై ఎందుకిలా వెనుదిరిగి కూర్చున్నారో కాస్త చెప్తారా? ప్రజలంతా మనల్ని చూసి నవ్వుతున్నారు", అని అడిగాడు. నస్రు, "కూర్చోవడంవల్ల మీకు ఒక పాఠం అబ్బుతుంది. మీరు ఇతరుల పరిహాసాన్ని పరిగణలోకి తీసుకోరాదు మిత్రులారా!" అని బదులిచ్చాడు.

తర్వాత అతనిలా అన్నాడు. "నేను వెనుదిరిగి ఎందుకు కూర్చున్నానంటే నేను మిమ్మల్ని గౌరవిస్తాను కాబట్టి. మీరు నా ముందు నడుస్తూ, నేను మిమ్మల్ని అనుసరిస్తే అది నాకు అగౌరవం. అదే నేను ముందు వెళ్తూ, మీరు నన్ను అనుసరిస్తే అది మీకు అమర్యాద. వెనుదిరిగి స్వారీచెయడమే మనందరికీ గౌరవప్రదమైన పద్ధతి". అది విన్న విద్యార్ధులు చప్పట్లు చరుస్తూ. తమ కొత్త గురువు నస్రుతో నవ్వుతూ ప్రయాణం కొనసాగించారు.
==========================

తలపాగా ఖరీదు?

ఒకరోజు నస్రుద్దీన్‌ ఒక కొత్త తలపాగా తీసుకుని రాజు దగ్గరికి వచ్చాడు.

"రాజా ఈ తలపాగా మీరు కొంటారని తీసుకువచ్చాను" అన్నాడు.

"అలాగా! దీని ఖరీదు ఎంత?" అన్నాడు రాజు.

"వెయ్యి వరహాలు రాజా" అన్నాడు నస్రు. ఇంతలో రాజు పక్కనే ఉన్న మంత్రి ఒకరు "రాజా! ఈ నస్రుద్దీన్‌ మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నాడు. ఈ తలపాగా అంత ఖరీదు చెయ్యదు." అని చెవిలో చెప్పాడు.

మంత్రి చెప్పింది నిజమే అనిపించింది రాజుకి. అయినా తలపాగా నచ్చడంతో, "నస్రుద్దీన్‌! ఈ తలపాగాకి అంత విలువ లేనట్టుందే. ఎందుకంత ధర?" అని అడిగాడు.

"రాజా! దీన్ని చూడగానే ఇది అత్యంత గొప్పవాళ్ల తలపైనే ఉండే తలపాగా అనిపించింది. అంత గొప్పవాళ్లు ఎవరా అని ఆలోచిస్తే నాకు మీరు తప్ప మరెవరూ లేరనిపించింది. అందుకే బేరం కూడా చేయకుండా వెయ్యి వరహాలు పెట్టి కొన్నాను రాజా!" అన్నాడు నస్రు.

నస్రు మాటలకి రాజు పొంగిపోయాడు. వెంటనే వెయ్యి వరహాలిప్పించి, ఆ తలపాగా తీసుకున్నాడు.

వరహాలు తీసుకుని వెళ్తున్న నస్రుకి బయట మంత్రి కనిపించాడు. అతని దగ్గరకి వెళ్లి, మంత్రిగారూ! మీకు తలపాగా గొప్పదనం తెలుసు, కాని నాకు రాజుగారి బలహీనత తెలుసు" అని నవ్వుకుంటూ వెళ్లిపోయాడు.
=======================

అజ్ఞానం

మౌల్వీ నజీరుద్దీన్‌ చాలా గ్రంథాలు చదివి అపార జ్ఞానం సంపాదించాడు. కానీ అసలు జ్ఞానం కావాలంటే అది జీవితం నుండే నేర్చుకోవాలన్నది అతని ఉద్దేశ్యం. అందుకే ప్రజలను కలుసుకునే వీలుండే పనేదైనా చేస్తే జీవిత సత్యాలు తెలుస్తాయని, అన్వేషణ ఆరంభించాడు.

నజీరుద్దీన్‌కి ఈత బాగా తెలుసు. అందువల్ల పడవ నడిపే పని బావుంటుందని, దానిలో చేరాడు. రోజూ నదికి అటూ ఇటూ మనుషుల్ని పడవపై చేరవేయడం అతని పని.

ఒకరోజు అతని పడవలో ఒక ముసలి గురువు ఎక్కాడు. ప్రయాణిస్తుండగా మాటా మాటా కలిసి, ఆ గురువు ఒక మహా పండితుడని తెలిసింది. మౌల్వీ నజీరుద్దీన్‌ తన పేరు చెప్పకుండా, తన గురించి తెలియనివ్వకుండా ఉన్నాడు.

కొద్దిసేపటికి వర్షం ప్రారంభమైంది. "నీకు వర్షం ఎలా కురుస్తుందో తెలుసా?" అని అడిగాడు గురువు.

"నాకు తెలియదు " అన్నాడు నజీరుద్దీన్‌.

"వర్షం ఎలా కురుస్తుందో తెలియకపోతే నీ సగం జీవితం వ్యర్థం" అన్నాడు గురువు ఎగతాళిగా.

"అవునా గురువుగారూ? మరెలా?" అని అడిగాడు అమాయకంగా.

"ఇంకేముంది? నువ్వు సగం చచ్చినవాడితో సమానం" అన్నాడు గురువు. ఇంతలో వర్షం ఎక్కువైంది. పడవలోకి నీళ్లు చేరుతున్నాయి. అలలు పెద్దవై పడవ అటూ ఇటూ ఊగడం మొదలెట్టింది.

"గురువుగారూ! మీకు ఈత వచ్చా?" అని అడిగాడు నజీరుద్దీన్‌. అప్పటికే భయం భయంగా వణుకుతున్న గురువు "రాదు" అన్నాడు.

"అయితే మీ పూర్తి జీవితం వ్యర్థం " అని నజీరుద్దీన్‌ పడవలో నుండి నీటిలోకి దూకి, ఈదుకుంటూ వెళ్లిపోయాడు.
========================

ధర్మ విజయం

ఒక ఊరిలో రాజమ్మ అనే ఒక వృద్ధ వితంతువు ఉండేది. ఆమె వద్ద నూరు బంగారు నాణాలు ఉండేవి. వయసు మీద పడుతుండడంతో రాజమ్మ తీర్ధయాత్రలకు బయల్దేరాలనుకుంది. ఆమె తన దగ్గరున్న బంగారు నాణాలను ఒక సంచిలో వేసి లక్కతో కట్టేసింది. ఆ నాణాల సంచిని పొరుగింటి షావుకారుకు దాచమని ఇస్తూ "అయ్యా ఒకవేళ నేను తిరిగి వచ్చినట్లయితే నా నాణాల సంచిని తీసుకుని నీ సేవకు ప్రతి ఫలంగా పది బంగారు నాణెములు ఇస్తాను. నేను రాకపోయినట్లయితే ఈ సంచి నీదే అని చెప్పింది.

రాజమ్మ వెళ్ళిన వెంటనే షావుకారు సంచిలోని నూరు బంగారు నాణాలను లెక్కపెట్టాడు. ఆ నాణాలను దక్కించుకోవాలని ఒక పన్నాగం పన్నాడు.

రాజమ్మ తీర్థయాత్రలు ముగించుకుని తిరిగి వచ్చి తన బంగారు నాణాల సంచిని ఇవ్వమని కోరగా షావుకారు సంచిని ఆమెకు అందించాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత, రాజమ్మ షావుకారుకు మాట ఇచ్చినట్లు పది బంగారు నాణాలు ఇవ్వడానికి సంచి బిరడా తొలగించి చూడగా, సంచిలో బంగారు నాణాలకు బదులుగా ఇనప నాణాలు ఉన్నాయి. ఆమె ఆ సంచి తీసుకుని షావుకారు దగ్గరకెళ్లి జరిగినదంతా వివరించింది. కాని షావుకారు తనకేమీ తెలియదని బుకాయిస్తూ, తనకు రావలసిన పది బంగారు నాణాలు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు.

రాజమ్మ న్యాయం కోసం రాజు వద్దకు వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పింది.

రాజు షావుకారును న్యాయస్థానానికి రప్పించి ఏం "ఈ విషయంపై నీవేమి చెప్పాలనుకుంటున్నావు?" అనడిగాడు.

అప్పుడు షావుకారు "నాకేమీ తెలియదు మహారాజా! ఈ అవ్వ నాకు ఒక లక్కతో బిగించిన సంచిని భద్రపరచమని ఇచ్చింది. నేను తిరిగి భద్రంగా అప్పగించాను, ఇంతవరకు నాకు రావలసిన రుసుము అందలేదు" అన్నాడు.

ఇద్దరి వాదనలు విన్న రాజు సంచిని సునిశితంగా పరిశీలించాడు. సంచికి చేసిన రంధ్రం దానిని నిపుణతతో కుట్టిన క్రమం రాజును ఆలోచించేలా చేసింది. రాజు రాజమ్మను, షావుకారును రెండు రోజుల తర్వాత న్యాయస్థానంలో హాజరుకావాలని ఆదేశించాడు.

ఈ క్రమంలో, రాజు పట్టణంలోని నిపుణులైన కుట్టుపని వారిని తన ఆస్థానానికి రప్పించి వారికి ఆ సంచిని చూపించాడు. వారిలో ఒకడు ఆ సంచిని షావుకారు అడిగితే కుట్టించానని చెప్పాడు.

రెండు రోజులు గడిచిన తరవాత, రాజమ్మ, షావుకారు రాజుగారి ఆస్థానంలో హాజరయ్యారు. రాజు రాజమ్మకు అనుకూలంగా తీర్పు ఇచ్చాడు.

షావుకారు తను తప్పు చేయలేదని వాదించాడు. అప్పుడు రాజు ఆ కుట్టుపనివాడిని చూపించాడు. అంతే! షావుకారు తప్పు ఒప్పుకున్నాడు.

మొత్తం బంగారు నాణాలు రాజమ్మకి ఇవ్వవలసిందిగా షావుకారును రాజు ఆదేశించాడు. షావుకారు తనకి రావలసిన పది బంగారు నాణాలను కూడా జరిమానా రూపంలో కోల్పోయాడు. రాజమ్మ కోరిక మేరకు రాజు షావుకారుకు జైలుశిక్ష విధించలేదు.

నీతి :సత్యాన్ని ఎంతోకాలం దాచలేం, ఎందుకంటే అసత్యానికి నిలబడేందుకు పాదాలు ఉండవు. ఆలస్యంగానైనా సరే, అసత్యం పడిపోక తప్పదు.
============================

తోడేలు సాకు

ఒక తోడేలు పారుతున్న సెలయేటి ఎగువన నీరు తాగుతుండగా దిగువన కాళ్ళు కడుక్కుంటున్న గొర్రె పిల్లను చూసింది.

తోడేలు ఆ గొర్రెపిల్లను ఎలాగైనా తినాలని భావించింది. అందుకోసం ఒక సాకు ఉంటే బావుంటుందని అనుకుంది.

గొర్రెపిల్లను చూస్తూ తోడేలు - "నేను ఈ సెలయేట్లో నీరు తాగుతుండగా నీటిని బురదమయం చేయడానికి నీకు ఎంత ధైర్యం?" అని అంది.

తోడేలుకు గొర్రెపిల్ల బదులిస్తూ "నీవు ఉన్నచోటి నుండే నీరు నా వద్దకు వస్తున్నాయి. అలాంటప్పుడు నీవు తాగే నీటిని నేను ఎలా బురదమయం చేయగలను?" అంది.

తోడేలు ఇంకా ఏదో సాకు దొరకబుచ్చుకోవాలని ప్రయత్నించింది. గొర్రెపిల్లపై అరుస్తూ, "నువ్వు నా గురించి సంవత్సరం క్రితం కూడా అలాగే మాట్లాడావు" అంది.

తోడేలు మాటలకు "నేనింకా అప్పటికి పుట్టనే లేదు", అని ప్రశాంతంగా బదులిచ్చింది గొర్రెపిల్ల.

"కావచ్చు. అప్పుడు నీ తండ్రి కావచ్చు. అని అరుస్తూ కోపంతో తోడేలు గొర్రెపిల్ల మీద పడి దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నమిలేసింది.

నీతి: అపాయాన్ని ముందుగానే పసిగట్టాలి. దుష్టులకు దూరంగా ఉండాలి.
=============================

వేళాకోళం

పూర్వం ఒకసారి ఇద్దరు మిత్రులు వ్యాపార నిమిత్తం కాలినడకన ఒక ఊరు నుండి మరొక ఊరుకు ప్రయాణం సాగిస్తున్నారు. ఒక గ్రామానికి చేరుకోగానే వారికి చాలా ఆకలి వేసింది. వెంటనే వారు సత్రం ఎక్కడుందో కనుక్కొని అక్కడికి వెళ్ళారు. శాంతమ్మ అనే వంటావిడ సమయం కాని సమయంలో వచ్చినందుకు వారిపై విసుక్కోకుండా వేడివేడి అన్నం వండి పెట్టింది. బాగా ఆకలితో ఉండటంతో స్నేహితులిద్దరు కడుపారా తృప్తిగా భుజించారు.

"నీ రుణం తీర్చుకోలేం. ఇంద ఈ డబ్బులు ఉంచు" అని ఇవ్వబోయారు. "అయ్యో డబ్బులు వద్దు నాయనా... ఆకలి వేసిన వారికి అన్నం పెడితే పుణ్యం వస్తుంది. అయినా ఇది ఉచిత సత్రం. ఒక దాత ఆధ్వర్యంలో ఈ సత్రం నడుస్తుంది." అని చెప్పింది అవ్వ.

తరువాత మాటల సందర్భంలో ఆమె తనకు నడుం నొప్పి ఉందని, ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేదని ఏదైనా చిట్కా ఉంటే చెప్పమని అడిగింది.

ఆ స్నేహితులిద్దరిలో కాశీనాథ్‌ అనేవాడు అందరితో వేళాకోళాలు ఆడుతూ ఉంటాడు. మరొక స్నేహితుడు వారిస్తున్నా వినకుండా "అవ్వా నడుముకు తాడు కట్టుకుని నీ పెరట్లో ఉన్న ఏదైనా చెట్టు కొమ్మకి వేలాడి పదిసార్లు అటూ ఇటూ ఊగు. అప్పుడు కూడా నీ నడుము నొప్పి తగ్గకుంటే మా ఊరురా" అని అతని పేరు ఊరు చిరునామా చెప్పాడు.

"పాపం ఎందుకలా అబద్ధం చెప్పావు? అమాయకురాలైన అవ్వను ఆటపట్టించడం సరికాదు" అంటూ కాశీనాథ్‌ను చివాట్లు పెట్టాడు స్నేహితుడు.

"ఏదో తమాషాకి అలా చెప్పాను లేరా... ఆమెకు ఆ మాత్రం తెలీదా? తనంతట తానుగా తాడు కట్టుకుని ఊగలేదు. ఎవరినైనా సహాయం అడిగితే వారు ఆమెతో పాటు మనల్ని కూడా చివాట్లేస్తారు" అని అన్నాడు కాశీనాథ్‌.

కొంతకాలం గడిచింది. ఈ సంఘటన గురించి స్నేహితులిద్దరూ మర్చిపోయారు. ఒక రోజు కొందరు వ్యక్తులు కాశీనాథ్‌ను వెతుక్కుంటూ ఆ ఊరు వచ్చారు.

"నేనే కాశీనాథ్‌ని. ఏంటి విషయం?" అని అడిగాడు. "అయ్యా మేము శాంతమ్మ అనే ధనవంతురాలు పంపించగా వచ్చాం. మీరేదో చిట్కా చెప్పారట కదా! అది బాగా పనిచేసిందని చెప్పమంది. అంతేకాదు చింతచెట్టు కొమ్మ విరగడంతో అక్కడ ఆమె పూర్వికులు దాచిన బంగారు కాసులు బయటపడ్డాయని, ఎప్పుడైనా అటువైపు రావడం జరిగితే ఆమె తప్పకుండా కలుసుకోమని చెప్పింది" అని అన్నారు.

వారు చెప్పిన మాటలు నిజమేనని నమ్మిన కాశీనాథ్‌ ముందువెనుకలు ఆలోచించకుండా వెంటనే ఆ ఊరు వెళ్ళాడు. వేళాకోళానికి చెప్పిన మాటలు నిజమేనని నమ్మిన శాంతమ్మ కాశీనాథ్‌ చెప్పినట్లు చేసి నడుము విరగ్గొట్టుకోవడంతో సత్రం కాస్తా మూత పడింది. జరిగింది తెలుసుకున్న గ్రామ ప్రజలు తెలివిగా కాశీనాథ్‌ను తమ ఊరికి రప్పించి దేహశుద్ధి చేసి పంపించారు. చావుతప్పి కన్ను లొట్టపోయినంత పని అయి కాశీనాథ్‌ ఇంకెప్పుడు అలాంటి పనులు చేయనని లెంపలేసుకున్నాడు.
=================================

No comments: