Thursday, February 24, 2011

నీతి కధలు 10

వల్లభుడు వనదేవత

వల్లభుడు అడవిలో కట్టెలు కొట్టి జీవించేవాడు. ఆరోజు అడవికి వెళూతుండగా 'రేపు అమ్మాయి పుట్టినరోజు , దానికి చిలక బొమ్మ కావాలట! ఎకువ కర్రలు కొట్టి, ఎక్కువ డబ్బు తీసుకురా!' అన్నది వాడి భార్య. వల్లభుడుకి అడవిలో ఒక్క ఎండుపుల్ల కూడా దొరకలేదు. వాడు ఒక పచ్చని చెట్టును నరకబోయాడు. అతని ముందు వనదేవత ప్రత్యక్షం అయ్యింది. 'ఈ అడవిలో వున్న ఒకే ఒక గంధం చెట్టు ఇది! దానిని నరకవద్దు!' అంటూ వల్లభుడిని వేడుకుంది ఆమె. వల్లభుడు తన కష్టం చెప్పుకున్నాడు. 'మీ అమ్మాయికి మాట్లాడే చిలకను ఇస్తాను!' అంటూ చప్పట్లు చరిచింది వనదేవత. ఒక పంచవెన్నెల రామచిలుక వచ్చి వనదేవత భుజం మీద వాలింది! ఆ చిలుకను వల్లభుడికి ఇచ్చింది వనదేవత!

మాట్లాడే చిలుకను చూసి ముచ్చటపడింది. వల్లభుడి కూతురు. భార్యకి జరిగింది చెప్పాడు వల్లభుడు. 'వనదేవత పుణ్యాన నీకు శ్రమజీవితం తప్పింది! ఈ చిలుకతో నగర కూడలిలో కూర్చో! చిలుక మాటలు వినడానికి రుసుము వసూలు చేయి!' అన్నది వల్లభుడి భార్య. వల్లభుడు చిలకను పెట్టుకొని కూడలిలో కూర్చున్నాడు. జనం అతని చుట్టూ పోగుబడ్డారు! ఆవైపుకి తిక్కరాజు వచ్చాడు. అటువంటి చిలుకను తనకు బహుమతిగా ఇవ్వనందుకు వల్లభుడి మీద మండిపడ్డాడు. వల్లభుడికి ఆరుకొరడా దెబ్బలు శిక్షవేశాడు. చిలుకను తీసుకుపోయాడు. 'ఆ వెర్రిబాగుల వనదేవత అండ మనకు వుంది! ఈరోజు నా పుట్టిన రోజు అని చెప్పు! గంధం చట్టు నరుకుతున్నట్లుగా నటించు! నాకోసం చంద్రహారం అడుగు! అన్నది వల్లభుడి భార్య. ఆ విధంగానే వనదేవతకు చెప్పాడు వల్లభుడు. గంధం చెట్టు నరకనందుకు చంద్రహారం ఇచ్చింది వనదేవత!

హారాన్ని వేసుకొని ఊరంతా తిరిగింది వల్లభుడి భార్య! ఆరాత్రి ఇంట్లో దొంగలు పడి హారం ఎత్తుకెళ్ళారు. 'మన దరిద్రం తీరిపోవాలి! వనదేవతను అడిగి బస్తా బంగారు నాణాలు తీసుకురా! పట్నం వెళ్ళి వ్యాపారం చేద్దాం!' అన్నది వల్లభుడి భార్య. వనదేవత వల్లభుడికి బంగారు నాణాలు ఇచ్చింది. బస్తా భుజాన వేసుకొని వస్తున్నాడు వల్లభుడు దారిలో రక్షక భటులు వాడిని అడ్డగించారు! బస్తాలో బంగారం చూసి వాడిని తిక్కరాజు దగ్గరికి తీసుకుపోయారు. తిక్కరాజు వల్లభుడి మాటలు వినిపించుకోలేదు! 'ఈ గజదొంగని చెరసాలలో పెట్టండి! ధనాన్ని కోశాగారంలో జమ చేయండి!' అనాడు. చేయని నేరానికి పది నెలలు కారాగారం శిక్ష అనుభవించాడు వల్లభుడు.

అతను తిరిగి రాగానే భార్య గొడ్డలి చేతికి ఇచ్చింది. ' అమ్మాయి పుట్టిన రోజు దగ్గర పడుతుంది! వనదేవత నడిగి మంచి బహుమానం తీసుకురా!' అన్నది. వల్లభుడు. ఆ గొడ్డలిని బావిలో పడవేశాడు. గంధం చెట్టు చాయలకు వెళ్ళలేదు. అడవిలో కుంకుళ్ళు, జిగురు, చింతపండు ఏరాడు. అవి అమ్మి కూతురికోసం చిలక బొమ్మకొన్నాడు. బొమ్మ చిలక తెచ్చావేం? వనదేవత ఏం అన్నది? అనికోపంగా అడిగింది వల్లభుడి భార్య. ఆ మధ్య గాలివానకి గంధం చట్టు నేలకూలింది. వనదేవత కనిపించలేదు. అయినా మనం చెట్లు నరకనవసరం లేదు. మనం సుఖంగా బతకడానికి దారి లేకపోలేదు! ఆ తల్లి సమకూర్చిన సంపద అడవిలో పుష్కలంగా వుంది. అన్నాడు వల్లభుడు. అటవీ సంపదను పోగు చేసి బజారులో అమ్మిన వైనాన్ని భార్యకు వివరించాడు.
=========================================

లంచగొండికి శిక్ష తప్పదు

హేలాపురికి రాజు నవనీత వర్మ. ఆయన జనరంజకంగా పరిపాలన చేసేవాడు. ఆయన పేదలకు ఎంతో సహాయం చేసేవాడు. ఒక రోజున ఒక పేద బ్రాహ్మణుడు ఆయన దగ్గరకు వచ్చాడు. అతని పేరు పుండరీక శర్మ. 'బ్రాహ్మణుడా! నీవు ఏ పని మీద వచ్చావు?' అని అడిగాడు రాజు. అందుకు బ్రాహ్మణుడు ఎంతో వినయంగా చెప్పాడు. 'మహారాజా! నేను కటిక బీదవాడిని. ఆ బాధ భరించలేకుండా ఉన్నాను. దయతో నాకు సహాయం చేయండి' అని వేడుకున్నాడు. రాజుగారు అతని బాధ తెలుసుకున్నారు. అతని వంక పరిశీలనగా చూశారు. అతని బట్టలు చిరిగి ఉన్నాయి. అతని శరీరం సన్నగా ఎముకలు కనిపించేలా ఉంది. రాజు కొంతసేపు ఆలోచించాడు. 'ఇక మీద మీరు రోజూ ఉదయం రండి. నన్ను కలవండి' అని చెప్పాడు మహారాజు. రాజు వద్ద సెలవు తీసుకుని వెళ్ళాడు శర్మ. మరుసటి రోజు ఉదయం మహారాజును కలిశాడు శర్మ. 'ఈ ఉత్తరం తీసుకువెళ్ళండి. మా కోశాధికారికి యివ్వండి' అన్నాడు మహారాజు. శర్మ ఆ ఉత్తరం తీసుకుని కోశాధికారి దగ్గరకు వెళ్ళాడు. ఆ ఉత్తరం చూసుకొని కోశాధికారి రెండు వరహాలు శర్మకు ఇచ్చాడు. శర్మకు ఎంతో ఆనందం కలిగింది. రెండు వరహాలు అంటే ఆ రోజుల్లో చాలా ఎక్కువ డబ్బులు. రోజువారీ అతని కుటుంబానికి కొంత ఖర్చు అవుతుంది. ఇంకా డబ్బులు మిగులుతాయి. రాజు రోజూ ఉత్తరం ఇస్తున్నాడు. ఉత్తరం తీసుకుని కోశాధికారి రెండు వరహాలు ఇస్తున్నాడు. బ్రాహ్మణుడి జీవితం ఆనందంగా గడిచిపోతుంది. ఒకరోజు పుండరీకుడు కోశాధికారి దగ్గర రెండు వరహాలు తీసుకున్నాడు. తిన్నగా యింటిదారి పట్టాడు. దారిలో అతనికి ఒక మనిషి కనిపించాడు.

'నన్ను రోజూ రాజుగారి దగ్గర చూస్తున్నారు కదా! నేను రాజుగారి మంగలిని. రోజూ రాజుగారికి మర్దన చేస్తాను' అన్నాడు ఆ మనిషి. అవును. మిమ్ములను అక్కడ చూశాను. ఇంతకూ నాతో ఏమిటి పని? అన్నాడు పుండరీకుడు. నేను రోజూ రాజుగారికి మర్దన చేస్తాను. ఆయన శరీరం తేలికపడి సంతోషంగా ఉంటారు. ఆ సమయంలోనే నువ్వు వస్తావు. రాజుగారు సంతోషంతో నీకు సహాయం చేస్తున్నారు. అంటే ఆ సంతోషం నావల్లనే కదా వస్తోంది! నాకు ఇక్కడ చాలా పలుకుబడి ఉంది. నేను కోశాధికారికి చెబితే నీకు రావలసిన డబ్బు ఆగిపోతుంది. నేను చెప్పకుండా ఉండాలీ అంటే నువ్వు ఒక పనిచేయాలి. నాకు రోజూ నీకు వచ్చే డబ్బులో వాటా ఇవ్వాలి. రోజూ అర వరహా కానుకగా ఇవ్వాలి. నా మాటకు తిరుగులేదు అన్నాడు ఆ మంగలి. వాడి పేరు చెన్నయ్య. పుండరీక శర్మకు మతిపోయింది. ఏమి అనడానికి తోచలేదు. కొంతసేపు ఏమీ మాట్లాడలేదు శర్మ. ఆ తరువాత "నేను నీకు లంచం ఇవ్వను" అని తన దారిన తను వెళ్ళిపోయాడు. కానీ చెన్నయ్య, శర్మను వదలలేదు. రోజూ దారిలో కనిపించి లంచం అడగసాగాడు. ఒకరోజు శర్మకు ఎదురుపడ్డాడు మంగలి చెన్నయ్య. 'రాజుగారు మీమీద కోపంగా ఉన్నారు' అన్నాడు చెన్నయ్య శర్మతో.

ఎందుకూ? అన్నాడు శర్మ. 'మీరు ముక్కు నుండి వదిలేగాలి వాసన వస్తోందట. ఆ చెడు వాసనకు రాజుగారు చిరాకు పడుతున్నారు. మీరు రేపటి నుండి ముక్కుకు గుడ్డ కట్టుకుని రమ్మని చెప్పారు' అన్నాడు చెన్నయ్య. నిజమే అనుకున్నాడు శర్మ. చెన్నయ్య రాజుగారి వద్దకు వెళ్ళాడు. రాజుగారి పాదాలు వొత్తుతూ 'కొందరు ఉపకారం పొందుతూ కూడా చిన్నచూపు చూస్తూ ఉంటారు' అన్నాడు చెన్నయ్య. 'ఎవరిని గురించి నువ్వు మాట్లాడుతున్నావు?' అన్నారు మహారాజు. తమరి నుండి రోజూ రెండు వరహాలు తీసుకు వెళ్ళే బ్రాహ్మణుడు. అతను ఉదయం ఏదో గొణుగుతూ పోతున్నాడు. ఏమిటి సంగతి? అని అడిగాను నేను. రాజుగారి నోటినుండి చెడువాసన వస్తోంది. అది తట్టుకోవాలీ అంటే ముక్కుకు గుడ్డ కట్టుకోవాలి అన్నాడు మహారాజా! అన్నాడు చెన్నయ్య వినయంగా! మరుసటి రోజు చెన్నయ్య చెప్పిన విధంగానే వచ్చాడు శర్మ. ముక్కుకూ, మూతికీ ఎర్రని గుడ్డ కట్టుకుని రాజుగారిని కలిశాడు. రాజుగారు సంగతి ఏమిటి? అని శర్మను అడిగారు. 'నా ముక్కు నుండి చెడు వాసన వస్తోంది. దానివల్ల మీకు చిరాకు కలుగుతోంది. దానిని నివారించడానికే మహారాజా!' అన్నాడు శర్మ అమాయకంగా! రాజుగారికి చెన్నయ్య ఎత్తుగడ తెలిసింది. చెన్నయ్య లంచం అడిగిన సంగతి కూడా చెప్పాడు పుండరీక శర్మ.

మరురోజు శర్మకు రెండు ఉత్తరాలు ఇచ్చాడు మహారాజు. 'ఈ రెండో ఉత్తరం చెన్నయ్యకి ఇవ్వండి. మీరు మీ ఉత్తరం చూపించి ధనం తీసుకోండి' అన్నాడు మహారాజు. పుండరీక శర్మకు దారిలో చెన్నయ్య కనిపించాడు. మహారాజు గారు నీ సేవను ఎంతో మెచ్చుకున్నారు. నీకు ఈ ఉత్తరం ఇమ్మని చెప్పారు అని ఉత్తరం ఇచ్చాడు శర్మ. "చెన్నయ్యా! నీకు డబ్బు ఇవ్వనందుకు ఎంతో బాధ పడుతున్నాను. ఈ రోజు నాకు డబ్బు అక్కరలేదు. ఈ ఉత్తరం తీసుకు వెళ్ళి నువ్వే ఆ డబ్బు తీసుకో" అని రాజుగారు ఇచ్చిన ఉత్తరం ఇచ్చాడు. చెన్నయ్య సంబరపడుతూ డబ్బు కోసం కోశాధికారి దగ్గరకు వెళ్ళాడు. ఉత్తరం చూసిన కోశాధికారి మండిపడ్డాడు. డబ్బులకు బదులు చెన్నయ్యను భటులు బంధించారు. "నువ్వు లంచం కోసం శర్మగారిని బెదిరించావు. నీ నోటిని సూదీ దారంతో కుట్టమని మహారాజుగారి ఆజ్ఞ. నీ లంచగొండి తనానికి యిదే తగిన శిక్ష" అన్నాడు కోశాధికారి. చెన్నయ్య సిగ్గుతో తలదించుకున్నాడు.

నీతి: లంచగొండికి శిక్ష తప్పదు!
=============================================

వింతపరిష్కారం

శ్రీకృష్ణదేవరాయలు అయిదు వందల ఏళ్ల క్రితం మన దక్షిణ భారతాన్ని పరిపాలించిన చక్రవర్తి. ఈయన యుద్ధాలలో ఎంత నిపుణుడో, కావ్య రచనలో అంత నేర్పరి. ఈయనకు "సాహితీ సమరాంగణ చక్రవర్తి" అనే బిరుదు ఉండేది. అముక్తమాల్యద, రాయలు రచించిన గొప్ప కావ్యం. రాయల దగ్గర ఎనిమిది మంది గొప్ప కవులుండేవారు. వారిని 'అష్టదిగ్గజాలు' అని పిలిచేవారు. అల్లసాని పెద్దన, ముక్కుతిమ్మన, రామభద్రుడు, ధూర్జటి, భట్టుమూర్తి, పింగళి సూరన, మాదయగారి మల్లన, తెనాలి రామకృష్ణుడు రాయల అస్థానకవి దిగ్గజాలు. ఆయన సభకు "భువన విజయం" అని పేరు.

ఒకసారి రాయల దగ్గరకు ఒక మహా పండితుడు వచ్చాడు. అతడు అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ఇంతకీ సమస్య ఏమిటంటే రాయల సభలోని కవి పండితుల్లో ఎవరైనా అతని మాతృభాషను కనిపెట్టాలి. రాయలవారు తన కవిదిగ్గజాలను ఈ సమస్య విడగొట్టమని కోరాడు.

మొదట 'ఆంధ్రకవితాపితామహుడని పేరు పొందిన పెద్దన కవి లేచి, తనకు వచ్చిన భాషలలో అతనితో సంభాషించి, వాదించి కూడా, అతని భాష తేల్చుకోలేక పోయాడు. తరువాత ఆరుగురూ అంతే. చివరికి తెనాలి రామకృష్ణుని వంతు వచ్చింది. ధారాళంగా భాషలన్నీ వల్లె వేస్తున్న ఆ పండితుని దగ్గరకు వెళ్ళాడు. ఎంతో సేపు అతనికి ఎదురుగా నిలబడి ఏమీ అడగలేక పోయాడు. ఓటమి తప్పదని రాయలు భావించాడు. ఆ ఉద్ధండ పండితుడు కూడా ఉప్పొంగిపోతున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా తెనాలి కవి ఆ పండితుని కాలును గట్టిగా తొక్కాడు. ఆ బాధ భరించలేక పండితుడు 'అమ్మా' అన్నాడు. అంతే! " నీ మాతృభాష తెలుగు పండితోత్తమా!" అని తేల్చేశాడు తెనాలి రామకృష్ణుడు. పండితుడు ఒప్పుకోక తప్పలేదు. రాయల ఆనందానికి అంతులేదు. శభాష్! వికటకవీ అని రామకృష్ణుని మెచ్చుకొని బహుమానంగా సువర్ణహారం ఇచ్చాడు.

మాతృభాష గొప్పతనం అదే. ఆనందంలో కాని విషాదంలో కాని మన నోటి నుండి వెలువడేది మన మాతృభాషే. కన్నతల్లిలా, మాతృభూమిలా, మాతృభాష మధురమైనది, మరపురానిది.
==========================================

విననిది, రానిది, లేనిది - వింతకథ

కాంభోజనగరంలో విమలుడనేవాడుండేవాడు. ధనవంతుడయిన అతను ఉదారుడే, అతిధిపూజలు చేసేవాడే. కాని అతని భార్య కుటిలమాత్రం పేరుకి తగ్గ స్త్రీ. ఆమె తన యింటికెవరయినా వచ్చి దాహం (మంచి నీళ్ళు) అడిగితే 'నేను విననిదీ, నీకు రానిదీ, భూమిలో లేనిదీ అగు ఒక కథ చెబితే చక్కని చిక్కని మజ్జిగిచ్చి నీ దాహం తీరుస్తాను' అనేది - మంచినీళ్ళివ్వకుండా. ఎవరెంత చిత్రమయిన కథచెప్పినా -'ఓస్ దింతేనా' అని పరిహాసం చేసి దాహమివ్వకుండానే పొమ్మనేది. శాంతుడనే వాడు ఉజ్జయినీ నగరం వాడే. కానీ అతను దేశాటనం చేస్తుండగా అక్కడికి రావడమూ, కుటీలను దాహమడగడమూ ఆమె కథ చెప్పమనగా అతనికి కథ చెప్పడం ఇష్టంలేక మరో యింట దాహం తీర్చుకొని ఉజ్జయినీ తిరిగి వచ్చాక కుటిల విషయం విక్రమార్కుడికి విన్నవించడమూ జరిగింది.

విక్రమార్కుడు శాంతడిని వెంటబెట్టుకొని కాంభోజ నగరం కుటిల, విమలుల యింటి విషయాలన్నీ బాగా తెలుసుకొని విమలుడింటిలో లేని మిట్టమధ్యాహ్నవేళ ఎండలో చెమట కారుతుండగా ఆ యింటి ముందు నిలుచుని కుటిలను దాహమడిగాడు. ఆమె ఎప్పటిలానే నేను విననిది, నీకు రానిది, భూమిలో లేని కథను చెప్పితివా చక్కని మజ్జిగయిస్తాను అంది. దానికి రాజు అమ్మా! నాకపరిమితమగు దాహం వేస్తుంది. అందుకు కారణముంది. నేనీ నగరానికి ప్రవేశిస్తూంటే తోటలో విమలుడను సజ్జనుడున్నాడని విని అక్కడికి వెళ్ళి దాహమడిగితే భార్యతో సరసములాడుటలో మునిగిన అతను నా మాట లక్ష్యము పెట్టలేదు. నేను మళ్ళీ మళ్ళీ దాహం అడిగేసరికి నన్ను కొట్టడానికి వచ్చి నన్ను తరిమి అతను భార్యతో పడమట దిక్కుగా పోయాడు. పరుగెత్తిరావడం వల్ల అలసట ఎక్కువగా ఉంది. దాహం తీరాక నువ్వడిగిన కథ చెబుతాను. అన్నాడు. ఆ మాటలు వింటూనే కుటిల తోక తొక్కిన తాచులా మండిపడుతూ తన భర్త పర స్త్రీతో సరసాలాడుతున్నాడనే కోపంతో అతనిని దండించాలని వెదకుతూ పడమర దిక్కుకు పరుగెత్తింది. కొంతసేపటికి విమలుడు పొలం నుంచి అలసిసొలసి యింటికి వచ్చి భార్య కనబడక వీధి అరుగుమీద కూర్చున్న విక్రమార్కుని 'ఈ యింటామె ఎటు పోయింది?' అని అడిగాడు. 'నేను దాహమడిగాను. కాని ఆమె నా మాటలు వినిపించుకోకుండా ప్రియుడితో సరసాలాడుతూ తూర్పు దిక్కుగా వెళ్ళిపోయింది. మీరయినా నాకు దాహమీయరా?' అన్నాడు. తన భార్య వేరొకరితో పోయినదనే కోపంతో విమలుడామెను దండించాలని వెతుక్కుంటూ తూర్పు దిశగా వేగంగా వెళ్ళిపోయాడు. అంతలో పొరుగూరిలో ఉన్న కూతురికి జబ్బుచేసిందని చూసిరావడానికి వెళ్ళిన విమలుని తల్లి ఊరి చివరి నుంచి తిరిగివచ్చి యింట్లో ఎవరూలేకపోవడం గమనించి వీధి తిన్నెమీదున్న అతన్ని 'ఈ యింటిలో వాళ్ళెక్కడికెళ్ళారు?' అని అడిగింది.

'అమ్మా! ఈ యింటి యజమాని పుత్రుడు హఠాత్తుగా చనిపోగా వానిని పూడ్చి పెట్టడానికి వాళ్ళు ఉత్తర దిశగాపోయారు. అని చెప్పాడు మారువేషంలోని రాజు. ఆవిడ గొల్లుమని ఏడుస్తూ ఉత్తర దిశగా పరుగెత్తింది. ఒకరికి తెలియకుండా ఒకరు యింటినుంచి పోయిన విమలుడు కుటిలా ఒక చోట కలుసుకుని ఒకరినొకరు నిందించుకుంటూ, అసహ్యించుకుంటూ ఏడ్చుకుంటూ ఉండగా విమలుని తల్లి కూడా వారిని చేరుకుంది. ఒక నీటి గుంట ఒడ్డున కూర్చొని ఏడుస్తున్న కొడుకునీ, కోడలినీ చూసి తను కూడా ఏడుస్తూ వారి వద్దకు వెళ్ళగా కూతురు చనిపోయినందుకు కాబోలు ఆవిడ ఏడవసాగిందనుకొని వారు కూడా ఆవిడని పట్టుకొని బిగ్గరగా ఏడవసాగారు. కాని, ఎవరు మాత్రం ఎంత కాలమని ఏడవగలరు? కొంతసేపట్లో వాళ్ళూ ఏడుపాపి ఒకరి విషయం ఒకరు తెలుసుకొని యింటికి బయలుదేరారు. ఈ లోగా విక్రమార్కుడు వాళ్ళింట్లో ప్రవేశించి ఆ యింటి దూలములు, వాసములు, స్థంబములు మొదలగువాని లెక్క రాసుకున్నాడు.

విమలుడు, భార్య, అత్తగారు యింట్లోకి వెళ్ళబోతుంటే వారినడ్డుకొని విక్రమార్కుడు ఈ ఇల్లునాది. మీరెందుకు లోపలికి వెళ్తున్నారు? అని దెబ్బలాడసాగాడు. వాళ్ళు తెల్లపోయారు. 'ఈ ఇల్లు మాది, నీదంటావేం? నడు, వీధిలోకి నడు, పెద్దమనుషుల దగ్గర తేల్చుకుందా, అన్నారు. అతను 'సరే' అని పెద్దమనుషుల దగ్గరకు వచ్చి వీరెవరో నా యింటిలో చొరబడబోవుచున్నారు అని తగవు పెట్టాడు. విమలుడి కుటుంబం పెద్దమనుషులని ఆ యిల్లు మాదని మీరెరుగరా అని అడుగుతుంటే ఈ ఇల్లు వారిదే అయితే ఆ యింటి దూలములు, వాసాలూ ఎన్నో చెప్పమనండి. లేకపోతే నేను చెబుతాను అన్నాడు రాజు. ఇంక వాళ్ళేమీ చెయ్యలేక రాజువేపు ప్రాధేయపడుతూ చూసి మీరెవరో పెద్దమనిషిలాగే ఉన్నారు. ఇలాంటి అన్యాయానికెందుకు పూనుకుంటున్నారు? అన్నారు బతిమాలుతు. అప్పుడు విక్రమార్కుడు అయ్యా! నీ ఇల్లాలు విననిదీ, నాకు రానిదీ, భూమిలోలేనిదీ అయిన కథ చెప్పినవారికి దాహమిస్తానని చెప్పింది. అందుకే నేనీ కథ చెప్పితిని అనగా అతని యుక్తికందరూ మెచ్చుకున్నారు. కుటిలని అందరూ ఎగతాళీ చేశారు. దానితో కుటిల తన కుటిలమార్గాన్ని వదిలి బుద్ది తెచ్చుకొని జీవించడం మొదలుపెట్టింది. రాజు తనతో వచ్చిన శాంతుడికి అనేక విధములయిన కానుకలిచ్చి తన నగరానికి వెళ్ళిపోయాడు.
=============================================

వెండి నాణెం

పూర్వం అనంతారంలో భీమయ్య అనే పేదవాడు ఉండేవాడు.ఒకసారి ఆయన బంధువుల ఊరికి బయల్ధేరాడు. మధ్యాహ్నానికి ఒక పట్టణానికి చేరుకున్నాడు. భీమయ్యకు బాగా ఆకలివేస్తోంది. అందుకని దగ్గర్లోని పేదరాసి పెద్దమ్మ ఇంటికి వెళ్ళాడు. పేదరాశి పెద్దమ్మ ఇంటి ప్రక్కనే కల్లు దుకాణం ఉంది. ఆ దుకాణం యజమానురాలి పేరు సూరమ్మ. భీమయ్య అక్కడికెళ్ళేటప్పటికి సూరమ్మ చేపలు వేయిస్తోంది. భీమయ్య ఇదేమీ పట్టించుకోలేదు. పేదరాశి పెద్దమ్మ దగ్గరకెళ్ళాడు.

ఆమెకు కొంత డబ్బిచ్చి, కడుపునిండా భోజనం చేశాడు. బయటకొచ్చి తన దారిన తాను వెళ్ళసాగాడు. ఇంతలో సూరమ్మ గోలగోలగా అరుస్తూ అతని దగ్గరకెళ్ళింది. సూరమ్మ అరుపులకు చుట్టుపక్కలవాళ్ళు అక్కడ చేరారు. ఆమె ఎందుకు అలా అరుస్తుందో భీమయ్యకు అర్ధం కాలేదు. అదే అడిగాడు. "ఈ పెద్దమనిషి నా చేపల వాసన పీల్చి, డబ్బులివ్వకుండా చక్కా పోతున్నాడు అంది సురమ్మ. ఆ మాటలకు భీమయ్య తెల్లబోయాడు. "చేపల వాసన పీల్చినందుకు డబ్బులివ్వాలా! ఎంత?" అయోమయంగా అడిగాడు. "ఒక వెండి నాణెం" చెప్పింది సూరమ్మ.

"ఇది చాలా అన్యాయం. బజర్లో పీల్చిన వాసనకు కూడా డబ్బులివ్వాలా? నేనివ్వను" అన్నాడు భీమయ్య. అతనితో సూరమ్మ వాదనకు దిగింది. చివరకు వాళ్ళిద్దరూ పట్టణాధికారి దగ్గరకెళ్ళారు. జరిగిందంతా ఆయనతో చెప్పారు. "అవునయ్యా...నువ్వు చేపల వేపుడు వాసన పీల్చడం వలన ఆ కూర రుచి తగ్గుతుంది. కాబట్టి నువ్వు ఆమెకు డబ్బులివ్వాల్సిందే" చెప్పాడు పట్టణాధికారి. భీమయ్యకు ఏమీ పాలుపోలేదు. అయోమయంగా అయన్నే చూస్తూ నిలబడ్డాడు. అతణ్ణి చూసి పట్టణాధికారి చిరునవ్వు నవ్వాడు.

"చూడు భీమయ్య...నేనిచ్చిన తీర్పు ప్రకారం నువ్వు వెండి నాణాన్ని ఎండకు ఎదురుగ్గా పెట్టు. సూరమ్మ వచ్చి ఆ నాణెం నీడను పట్టుకుంటుంది. చెల్లుకు చెల్లు" అన్నాడు పట్టణాధికారి. ఇది విన్న తరువాత సూరమ్మ ముఖం మాడిపోయింది. అత్యాశకు పోయినందుకు తనను తానే నిందించుకుంది. పట్టణాధికారిని, భీమయ్యను క్షమాపణ కోరింది. భీమయ్య సంతోషంగా తన దారిన తాను వెళ్ళిపోయాడు.
========================================

శిల్పి ప్రకృతి

అనగా అనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో ఒక రాజు, ఆ రాజు దగ్గర ఒక మంత్రి, ఆ మంత్రి ఒక రోజు వేటకి బయలుదేరినాడు ఆ మంత్రి వెళ్ళిన అడవిలోనే ఒక జలపాతం, సుందరమైన దృశ్యం, అత్యంత మనోహరమైన శబ్దం, పక్షుల రాగాలు, జలపాతం పై దోబూచులాడుకునే మేఘాలు, ఆ పైన వెలిగిపోతూ ఎంతో ఎంతో అందంగా ఉన్నాయి.

ఆ జలపాతం దగ్గరలో ఒక శిల్పాల వరుస! శిల్పి తదేక దీక్షతో ఓ ఏనుగు బొమ్మ చెక్కుతున్నాడు. దానికి ముందు ఓ హంస శిల్పం, ఆ పైన ఒక సుందరాంగి, ఆ పైన ఓ నాట్య గత్తె, ఆ పైన ఓ పుంగవుడు, ఆ పైన ఓ బాలుడు ఇలా రక రకాల శిల్పాలు ఉన్నాయక్కడ. కొద్ది రోజులుగా చెక్కుతున్న ఆ ఏనుగు బొమ్మకి కూడా ఆ రోజుతో చివరి ఉలి పోటు పెట్టి తృప్తిగా చూసుకొని కొద్దిగా దూరంగా వెళ్ళి తన శిల్పాలు అన్నీ చూసుకున్నాడు. మరో సారి తృప్తిగా తలాడించినాడు. ఇంతలో అటువైపు కొంతమంది అటవి జాతులు, యువతలు, యువకులూ, బాలలు వెళ్తూ ఇతనికి హల్లో చెప్పి ముందుకు వెళ్ళినారు. మరొక సారి తన సృష్టిని చూసుకొని నిట్టూర్చి "అద్భుతంగా ఉన్నాయని ఎవరైనా అంటారా?" అసలు నిజంగానే అద్భుతంగా ఉన్నాయా? లేక కాకి పిల్ల కాకికి ముద్దా? అని పెద్దగానే అన్నాడు. ఈ మాటలను అటువైపుగా వెళ్తున్న మంత్రిగారు విని వచ్చి చూసి, చూసి ఆశ్చర్యపోయి పెద్దగా, అసంకల్పితంగానే అనేసాడు. ?అద్భుతంగా ఉన్నాయి!? అని.

ఈ మాట వినగానే శిల్పి ముఖం వెలిగిపొయినది. తరువాత అన్నీ చక చకా జరిగిపొయినాయి. శిల్పి రాచనగరులో ఓ మూల శిల్పాలు చెక్కడం మొదలుపెట్టినాడు. అతని పనితనాన్ని చూసి వచ్చిన వారంత ముక్కున వేలేసుకోసాగినారు. అంత అద్భుతంగా చెక్క సాగినాడు. అతను చెక్కేవన్నీ దేనికదే సాటి అని అందరూ చెప్పుకోసాగినారు.

ఓ సుందరి, ఓ ఏనుగు, ఓ జింక, ఓ ఇంద్రుడు, ఓ విష్ణుమూర్తి, ఓ బ్రహ్మ, ఓ నారదుడు, ఓ కొలను, ఓ శిఖరం, ఓ గోపురం దేనికదే సాటిలా ఉన్నాయి.

ఓ రోజు మంత్రిగారు రాజును తోడ్కోని వీటిని అన్నీ చూపించడానికి వచ్చినాడు. శిల్పి నెమ్మదిగా అన్నిటినీ చూపించసాగినాడు. రాజుగారు ముందు సుందరాంగి బొమ్మ చూసినాడు, అద్భుతం అని ఆగిపొయినాడు ఇదేమిటి కళ్ళు చెక్కలేదు? ఇంకా పూర్తికాలేదు ప్రభూ అని తల వంచుకున్నాడు. తరువాత ఏనుగు బొమ్మ చూపించినాడు, చాల బాగుంది కానీ ఇంకా తొండం పూర్తి అయినట్టు లేదు అంటూ ముందుకు సాగినాడు. జింకకేమో కాలు పూర్తి కాలేదు, ఇంద్రునికేమో చేతులు పూర్తి కాలేదు, విష్ణుమూర్తికేమో కిరీటం పూర్తి కాలేదు, బ్రహ్మకేమో రెండే తలకాయలు ఇంకోటి? ఇలా అన్నీ చూస్తూ ముందుకు వెళ్ళినాడు.

శిల్పినేమో ఏమీ అనబుద్ది కాలేదు, ఎందుకంటే పూర్తి అయినంత వరకూ చాలా చాలా బాగా వచ్చినాయి. ఇలా చాలా సార్లు జరిగినది. రాజు గారు రావడం పూర్తికాని ఆ శిల్పాలు చూడటం అలాగే కొత్తగా చెక్కిన శిల్పాలు చూడటం మరళా పూర్తి కాలేదని నిట్టూర్చడం జరుగుతూనే ఉన్నది. ఒక రోజు మాత్రం రాజుగారి మూడ్ అస్సలు భాగోలేదు.

దానికి తోడూ ఇలా ఎప్పటికీ పూర్తికాని శిల్పాలు చూసి మరింత రెచ్చిపోయి సరిగ్గా వారం రోజులు సమయం ఇస్తున్నాను ఈ లోపులో పూర్తి కాకపొయినాయో నీకు మెడకాయ మీద తలకాయ ఉండదని బెదిరించాడు.

వారం రోజుల తరువాత రాజు గారు వచ్చి చూడ సాగినారు. సుందరి బొమ్మ కళ్ళు పూర్తి అయినాయి కానీ మెల్ల కన్ను, ఏనుగు తొడం పూర్తి అయినది కానీ నాలుగు వంకర్లు, జింక కాలు పూర్తి అయినది కానీ కుంటి కాలు!, ఇంద్రుడి చెయ్యి అవిటిది!, విష్ణు మూర్తి కిరీటం రివర్సు అయినది, బ్రహ్మ ముక్కు చప్పిడి ముక్కు అయినది.

రాజు కోపం నషాలాన్నంటినది, వెంటనే శిల్పికి కూడా మెల్ల కన్ను చేసి, కుంటి కాలు చేసి, అవిటి చేయి, ముక్కు పగల గొట్టి, తల బొప్పి కట్టించమని ఆజ్ఞాపించి వెళ్ళి పొయినాడు. శిల్పి కథ అంతటితో ముగిసేదేమో, కానీ మంత్రిగారు కొద్దిగా జాలి చూపించి రాజు గారి దగ్గర సెకండ్ చాన్సు పొంది శిల్పి దగ్గరకు వచ్చి మాట్లాడతాడు

ఏమిటయ్యా ఇది? అలా చేసినావు?

శిల్పి చేతులు నులుముకుంటున్నాడు కానీ ఏమీ మాట్లాడలేదు, ఆ ముఖంలో బాధ లేదు, సంతోషం లేదు. అడవిలో చక్కగానే చెక్కినావు కదా, ఇక్కడేమయినది? అయినా శిల్పం మొత్తం చక్కగా చెక్కి ఇదేమిటయ్యా ఇలా చివర్లో అంతా పాడు చేసినావు?

?అదేమిటో తెలీదు కానీ శిల్పం మొత్తం పూర్తి అవుతుంది కానీ ఈ రాచ నగరులో ఈ జనాల మధ్య ముగింపు మాత్రం నా వల్ల కావడంలేదు, మనసు లేకుండా ముగిస్తే ఇదిగో ఇలా పూర్తి అయినాయి." అయితే ఏమంటావు?

నేను అడవిలో, ఆ ప్రకృతి మధ్య బతక వలసిన వాడిని, ఇలా రాజుల కోసం, రాచ బిడ్డల కోసం చెక్కమంటే నా వల్ల కాదు. నా మనసు ఒప్పు కోవడంలేదు, నన్ను మరల పంపిస్తే అడవిలోకే పోతాను అని బతిమిలాడినాడు. ఇలా చాలా చాలా మాట్లాడుకున్నాక చివరకు ఎలాగో శిల్పి ప్రాణాలతో అడవిలోకి చేరినాడు. అడవిలో మరళా శిల్పాలు చెక్కసాగినాడు.

అందమైన రాజు బొమ్మ, రాచ నగరు బొమ్మ చెక్కి దూరంగా వెళ్ళి చూసుకోని ఇలా అనుకోసాగినాడు ?అద్భుతంగా ఉన్నాయని ఎవరన్నా అంటే భాగు? అర్థమయినదనుకుంటాను?.!
===========================================

శ్రధ్ధ లోపించిన పూజ

ఒక ఊరిలో ఒక ధనికుడు నివసించుచుండెను. అతనికి ఆస్తిపాస్తులు కొల్లలుగా గలవు. వ్యాపారము, వ్యవసాయము రెండింటియందును అతడు ధనమును బాగుగా గడించి శ్రీమంతుడయ్యను.

రెండు మూడు పెద్ద భవనములు కూడ అతనికి కలవు. అతని ఇంటిలో ఎందరో పరిచారికులు, సేద్యగాళ్ళు, గుమస్తాలు పనిచేయుచుందురు. ఒకనాడా ధనికునకు సత్యనారాయణవ్రతము చేయవలెనని సంకల్పము కలిగినది. తదనుసారము పురోహితునతో సంప్రదించి పూజకై ఒకరోజును నిర్ణయించి, ఆపూజకు కావలసిన పదార్ధములన్నియూ రాసుకొని గుమస్తాచేత వాటిని తెప్పించెను. సరిగా ముహూర్తము వేళకు సత్యనారాయణ పటము పూజామందిరములో ప్రతిష్ఠించబడెను. పూజాద్రవ్యములన్నియూ సమకూర్చబడెను. సమయానుకూలముగా పురోహితుడు పూజ ప్రారంభించెను. ధనికుడు, అతని భార్య పీటలమీద ఆసీనులైరి.

భగవంతునకు చేయవలసిన షోడశోపచారములతో ధూపము, దీపము పూర్తి అయినవి. తదుపరి నైవేద్యము తెప్పించబడెను. దానిని దేవుని పటము ముందు పళ్ళెరములోనుంచి నీటతో మంత్రోచ్చారణపూర్వకంగా సంప్రోక్షించి, 'ఓం ప్రాణాయ స్వాహా' అను మంత్రము చెప్పుచూ నైవేద్యమును దేవునకు అర్పించుటకై చేతిని పటమువైపు చూపుమని ధనికునితో చెప్పెను. కానీ ధనికుడు చేతిని తన పొట్టవైపు చూపించుచుండెను. "అట్లు చేయవద్దు అది అపచారము" అని పురోహితుడు చెప్పగా అంతట శ్రీమంతుడు "నైవేద్యము తినునది నేనేకదా, పటము తినదు కదా! అట్లు చూపినచో తప్పేమి?" అని అడిగెను.

"అప్పుడు పురోహితుడు తినువారు మీరే అయినను దేవునకు సమర్పించుచున్నట్లు భావనచేసి ఆ ప్రకారము దేవునకు చేయవలెను. భావన ప్రధానము" అని చెప్పగా ధనికుడు అట్లే చేసెను.

నీతి: ఏ కార్యమందైననూ శ్రధ, భావన ప్రధానము. పటము ఎదురుగా పెట్టినను సాక్షాత్ భగవంతుడే అచట ఉన్నాడని భావించి వారికి అన్ని ఉపచారములు భక్తిపూర్వకముగా చేయవలెను. శ్రధ్ధ లోపించిన కార్యము చేయనిదానితో సమానము.
=====================================================

సత్యమేవ జయతే

బోధిసత్వుడు సేరివనే రాష్ట్రంలో సేరివ అనే పేరుతో వర్తకుడిగా ఉంటున్నాడు. అదే పేరుకల మరొక వర్తకుడితో కలసి వ్యాపారానికి బయలుదేరి ఆంధ్రపురానికి చేరుకున్నాడు. వాళ్ళిద్దరిదీ ఒకటే వ్యాపారం కనుక వారి మధ్య ఘర్షణ ఉండకుండా యిద్దరూ ఒక ఒప్పందం చేసుకున్నారు. నగర వీధులలో సగం ఒకరివి, మిగిలిన సగం వీధులు రెండో వారివి. ఒకరొక వీధికొకసారి వెళ్తే తరువాత రెండవ వారు ఆ వీధిలో తాను కూడా వ్యాపారం చేసుకోవచ్చు. ఇదీ ఒప్పందం.

ఆ పట్నంలో బతికిచెడిన వైశ్య కుంటుంబమొకటుంది. ఒకప్పుడు వారు శ్రీమంతులే. కానీ, కాలవశంలో ఆ కుటుంబంలోని వారూ వారి ఐశ్వర్యమూ నశించి ఒక ఒక అవ్వ, అమ్మాయీ మాత్రమే మిగిలారు. ఇద్దరూ కూలిచేసుకుంటూ బ్రతుకుతున్నారు. వాళ్ళింట్లో చాలాకాలం నుంచి వాడని ఒక పాత సామాగ్రి పడుండేది. సేరివ ఆ వీధిలో తిరుగుతూ దండలు కావాలా? అంటూ అరవసాగాడు. ఆ అమ్మాయి వర్తకుడి కేక విని అవ్వా! నాకేమయినా కొనిపెట్టవా? అని అడిగింది. ఆ అవ్వ బాధపడూతూ ' తల్లీ! మనకి దుర్గతి పట్టింది. నీకు నేనేమిచ్చి కొనగలను? అంది. అందుకా అమ్మాయి మనింట్లో పనికిరాని పాత్ర పడుందికదా? అంది. అవ్వ ఆ వర్తకుణ్ణి లోపలికి పిలిచి ఆ పాత్ర యిచ్చి అయ్యా ఇది తీసుకొని నీ చెల్లిలికేమయినా యివ్వు, అంది. అతను దానిని చూసి, అటూ యిటూ తిప్పి, శలాకతోగీసి, బంగారు పాత్ర అని గ్రహించి వీరికేమియు తెలిసినట్లు లేదు. ఏమియు యివ్వకుండానే దీనిని పట్టుకుపోవాలి. అనుకుంటూ "ఈ బొక్కి పాత్ర కేమి విలువ? ఇది ఎందుకూ పనికిరాదు గుడ్డిగవ్వపాటయినా చెయ్యదు". అంటూ విసిరేసి వెళ్ళిపోయాడు. కొంతసేపయ్యాక బోధిసత్వుడు కూడా ఆ వీధిలోకి వచ్చి మణికలు(దండలు)కావాలా? అంటూ కేకవేశాడు. మనుమరాలు మునుపటిలాగే అవ్వను కొనమంది.

అందుకా అవ్వ కొనడానికి మనదగ్గరేముంది? ఆ వర్తకుడు పాత్రని నేలకేసి కొట్టిపోయాడు కదా చిల్లిగవ్వకూడా చేయదని? అంది. అవ్వా! అతను దుడుకు స్వభావం కలవాడు. ఈయన యోగ్యుడిలా మంచిగా కనబడుతున్నాడు. లోపలికి పిలువనా అంది. అతన్ని పిలుచుకువచ్చి కూర్చోబెట్టి ఆ పాత్రనిచ్చింది. బోధిసత్వుడు అది బంగారు పాత్ర అని గ్రహించి " అమ్మా! ఈ పాత్ర లక్ష కార్పణములు విలువ చేస్తుంది. దీనికి తూగే వస్తువులు నా దగ్గర లేవు అనేశాడు. అవ్వ ఆశ్చర్యపోయి ఇందాక వేరొక వర్తకుడు వచ్చి యిది అర్థమాషంకూడా విలువ చేయదని నేలకేసికొట్టి పోయాడు. మీ పుణ్యం కొద్దీ యిది బంగారు పాత్రే కావచ్చును. దీనిని మీకిచ్చేస్తాను. బదులుగా మాకేమివ్వగలిగితే అదే యివ్వండి అంటూ ఆమె ఆ పాత్రను అతని చేతిలో పెట్టేసింది. బోధిసత్వుడు తనవద్ద ఉన్న 500 కార్షాణాలనీ, 500 కార్షాపణాలు విలువ చేసే వస్తువులన్నీ యిచ్చి త్రాసు, సంచి, ఎనిమిది కార్షాపణములు (రూపాయిలాంటి ద్రవ్యం) మాత్రము నన్నుంచుకోనివ్వండి అని బంగారు పాత్రని తీసుకువెళ్ళాడు.

కొంత సేపటికి రెండో వర్తకుడు వచ్చి ఆ పాత్ర యివ్వండీ. ఏదో ఒకటిస్తాను. అన్నాడు దయ తలుస్తున్నట్లు. ఆ అవ్వ అతికోపంగా లక్ష కార్షాణముల విలువచేసే పాత్రను అర్ధమాషము విలువ చేయదనిపోయావుకదా? ఒక ధర్మాత్ముడూ, న్యాయమూర్తి వచ్చి వెయ్యి కార్షాణములకు దానిని కొనుక్కువెళ్ళాడు. అని తలుపు వేసింది. అప్పుడాలోభి లక్షచేసేడి బంగారు పాత్రని అతనపహరించి నన్నెంతో నష్టపరిచాడు. అంటూ ఏడుస్తూ, నిగ్రహం కోల్పోయి పిచ్చివాడిలా తన డబ్బూ, సరుకులూ, అక్కడే పారేసి బోధిసత్వుని జాడలను బట్టి నదీతీరానికి చేరుకున్నాడు.

అప్పటికే బోధిసత్వుడు పడవ మీద వెళ్ళి పోతుండటం గమనించి పడవవాడివాడిని వెనక్కి రమ్మని అరిచాడు. బోధిసత్వుడు వొద్దు అన్నాడు. వెళ్ళిపోతున్న అతన్ని చూస్తూ రెండోవర్తకుడు దుఃఖం ఆపుకోలేక గుండెవేడెక్కి బోధిస్త్వుని మీద ద్వేషం పెచ్చు పెరగగా గుండెబరువెక్కి రక్తం కక్కుకుంటూ అక్కడేపడి చచ్చిపోయాడు. బోధిసత్వుడు తన వూరు చేరి దానాలు, పుణ్యకార్యాలుచేస్తూ జీవితం గడిపాడు.
=============================================

సమయస్ఫూర్తి

ఒకప్పుడు సుజ్ఞాని అనే వర్తకుడు ఉండే వాడు అతడు తన తోటివాళ్లతో ఓ బృందంగా ఏర్పడి ఒక ఊరి నుండి మరొక ఊరికి సరుకులను తీసుకువెళ్లి అమ్ముతుండేవాడు.

ఒకసారి ఆ బృందం ఒక అరణ్యం గుండా వెళ్లవలసి వచ్చింది. అరణ్యంలోకి ప్రవేశించక ముందే సుజ్ఞాని తనవారిని పిలిచి, ఈ ఆడవిలో జాగ్రత్తగా ఉండండి. నాకు చెప్పకుండా ఇక్కడ ఏ పండూ,దుంపా, ఆకూ తినవద్దు అన్నాడు. ఆ బృందం అలా నడుస్తుండగా వారికి ఒక ఊరు కనిపించింది. ఆ ఊరికి చాలా దగ్గరలో ఒక పెద్ద చెట్టు, ఆచెట్టునిండా బోలెడు పళ్ళు కనిపించాయి. ఆ పళ్ళు చూడటానికి ఆకర్షణీయంగా, పక్వానికి వచ్చిన రుచ్చికరమైన వాటిలా అనిపించాయి. వాస్తవానికి అవి విషపు పళ్లు.

కాని విషం సంగతి తెలియకపోవడంతో వారు వాటిని తినడానికి సిద్ధమయ్యారు. వారిలో కొంత మంది తమ బృందానికి నాయకుడైన సుజ్ఞాని చెప్పాలని నిర్ణయించుకున్నారు.

కాని మరికొందరు మాత్రం తొందరపాటులో ఆ పళ్ళని కోసుకుని తినేశారు. ఇంతలో సుజ్ఞాని అక్కడకు చేరుకున్నాడు. కొద్దిసేపు ఆ చెట్టునీ, ఊరినీ పరీక్షగా చూసి, ఈ పళ్ళు తినడానికి పనికిరావు. బహుశ ఇవి విషపూరితం కావచ్చు అని చెప్పాడు.

దాంతో వాటిని అప్పటికే తిన్నవాళ్లు బలవంతంగా వాంతి చేసి ఆ పండు ప్రభావం నుండి బయటపడ్డారు.

ఊరి ప్రజలకు ఆ చెట్టువల్ల లాభం ఉంది, సుజ్ఞాని బృందంలాగే అంతకు ముందు అక్కడకి వచ్చిన వాళ్లు ఆ పళ్లును తిని చనిపొతే ఆ నవాళ్ల సామాన్లు తీసుకు పోయేవాళ్లు. ఇప్పుడు కూడా అదే విధంగా తీసుకుపోవచ్చని భావించి ఊరివాళ్లు వచ్చి, అందరూ బాగానే ఉండటం చూసి ఆశ్చర్యపోయారు.

అందులో ఒకడు ధైర్యం చేసి సుజ్ఞానిని అడిగాడు ఈ పళ్లు విషమని మీకెలా తెలిసింది?

సుజ్ఞాని చిరునవ్వు నవ్వి ఈ చెట్టు ఎక్కడానికి చాలా సులువుగా ఉంది, ఊరికి చాలా దగ్గరలో ఉంది.

అయినా చెట్టు నిండా పళ్ళున్నాయి.ఎవరూ కోయడం లేదంటే ఈ పళ్ళు మంచివి కాదనేగా అర్ధం అన్నాడు.

తమ నాయకుడి సమయస్ఫూర్తి తమ ప్రాణాలను కాపాడిందని సంతోషిస్తూ అందరూ కాపాడిందని సంతోషిస్తూ అందరూ ముందుకు సాగిపోయారు.
======================================

ఎప్పుడో చదువుకున్న చందమామ కథ

అనగా అనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో సౌరభూడు (అసలు కథలో పేరు గుర్తు లేదు ప్రస్తుతానికి సౌరభుడు అని అనుకుందాం) అందరితో పాటే వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. కానీ అప్పుడప్పుడూ ఆశువుగా కవిత్వం చెప్పేవాడు. విన్న నలుగురూ బాగుంది, బాగుంది అనేవారు. అలా మొదలై ప్రతి రోజూ మద్యాహ్నం భోజనం వేళ ఇతను కవిత్వం చెప్పడం తోటి వారంతా చేరి బాగు బాగు అనడం ఓ దినచర్యలా మారిపొయింది.

ఒకరోజు దూరపు బంధువు ఒకతను ఏదో పనిమీద ఈ ఊరు వచ్చి మన సౌరభూడి ఇంటిలో దిగాడు. సౌరభూడి కవిత్వం గురించి విని మద్యాహ్నం తనుకూడా తీరిక చేసుకొని విన్నాడు. విని బాగుంది అని చెప్పి, ఊరకుండకుండా ఇలా అప్పుడప్పుడూ కవిత్వం చెప్పకపోతే ఏదన్నా పుస్తకం వ్రాయరాదు అని ఓ ఉచిత సలహా ఇస్తాడు.

దానికి సమాధానంగా సౌరభుడు తను ఎంతోకాలం నుండి వ్రాస్తూ పూర్తికావచ్చిన 'దేవపరిణయం' అనే పుస్తకాన్ని ఇంటికి వెళ్ళాక చూపిస్తాడు. దాన్ని చదివిన పెద్దాయన చాలా సంతోషించి రాజాశ్రయం పొందితే కవిత్వం ఇంకా రాణిస్తుందని చెప్పి ఒకసారి తనతో పాటు రమ్మని తన ప్రక్కింటిలోనే రాజకవి ఉంటాడని పిల్చినాడు.

ఇంటిలోని వారు, పొరుగువారు కూడా వచ్చినాయనకే వంతపాడేసరికి సౌరభుడు అతనితో పాటు బయలుదేరి రాజధాని చేరతాడు.

పక్కింటాయనే కాకుండా రాజకవి మన సౌరభుడి చుట్టానికి మంచి మిత్రుడు కూడా! అతన్ని కలుసుకొని తన పుస్తకం చూపిస్తాడు. మొత్తం ఓపిగ్గా చదివిన రాజకవి కొన్ని మార్పులూ, చేర్పులూ సూచిస్తాడు. అవి అన్నీ చేసి రాజుగారికి వినిపించి మంచి బహుమతి మెచ్చుకోళ్ళు పొందుతాడు.

తరువాత అందరూ అక్కడనే ఉండి మంచి మంచి కవిత్వం వ్రాయమని అడుగుతారు, కానీ వినకుండా ఇంటికి వెళ్ళి తన పుస్తకాన్నీ, బహుమతులను ముందేసుకొని బావురుమంటాడు. తను వ్రాయాలనుకున్నది ఒకటి చివరికి మార్పులూ, చేర్పులు తరువాత ఆత్మలేని శరీరంలా తయారవుతుంది. ముగింపు కూడా తను అనుకున్నది ఒకటి అక్కడ వ్రాసినది మరొకటి.

No comments: