Saturday, February 26, 2011

నీతికధలు 26

బీదవాడు-గొప్పవాడు

ఒకరోజు సభలో అక్బర్ చక్రవర్తి బీర్బల్‌ను ఈ విధంగా ప్రశ్నించాడు. "ఒక వ్యక్తి ఒకే సమయంలో బీదవాడు మరియు గొప్పవాడుగా గుర్తింపు పొందడం సాధ్యమవుతుందా?"

"సాధ్యమవుతుంది ప్రభూ" అని చెప్పాడు బీర్బల్. " అలాగా! అయితే అలాంటి వ్యక్తిని నాకు చూపించగలవా?" . "తప్పకుండా చూపిస్తాను ప్రభూ" అని బీర్బల్‌ సభ నుండి బయటకు వెళ్ళి పోయాడు. కొద్దిసేపటి తర్వాత ఒక వ్యక్తిని వెంటబెట్టుకుని సభకు తిరిగి వచ్చాడు. "ఇతను కడు బీదవాడు ప్రభూ! బిచ్చ మెత్తుకుని జీవిస్తాడు" బీర్బల్ ఆ వ్యక్తిని అక్బరు ముందు నిలబెడుతూ చెప్పాడు.

"ఆ విషయం చూస్తేనే అర్ధం అవుతోంది. మరి ఇతను గొప్పవాడు ఎలా అవుతాడు?" ఆసక్తిగా అడిగాడు అక్బరు. "ఒక చక్రవర్తితో పాటు ఇతను కూడా ప్రజల ముందు సత్కారాన్ని పొందగలిగితే, ఇతను తన బిచ్చగాళ్ళ మధ్య గొప్పవాడిగా గుర్తింపు పొందుతాడు" అన్నాడు బీర్బల్.

బీర్బల్‌ చాతుర్యానికి అక్బరు చక్రవర్తి ఎంతో ఆనందించాడు.
====================

అక్కరకురాని బహుమానం

అడవికి రాజైన సింహం దగ్గర ఒక ఉడుత సేవకుడిలా ఉండేది. ఏ పని చెప్పినా చీకటిలో చేసేసి రాజు దగ్గర మంచి పేరు సంపాదించుకుంది. ఉడుత పనికి మెచ్చుకుని, సింహం ఒక మంచి బహుమానం ఇస్తానని ప్రకటించింది. "ఏమిటా బహుమానం, మహారాజా?" అని ఆత్రుతగా అడిగింది ఉడుత. "నువ్వు పదవీ విరమణ చేసే సమయానికి నీకు ఓ బండెడు బాదం గింజలు ఇప్పిస్తాను. అదే బహుమానం" అంది సింహం.

బహుమానం తెలుసుకుని ఉడుత మహా సంబరపడిపోయింది. అందరూ ఆహారం కోసం కష్టపడుతున్న సమయంలో తను సుఖంగా ఇంట్లో కూర్చుని హాయిగా జీవితాంతం తింటూ గడపవచ్చని ఆనందించింది. తనంత అదృష్టం ఇంకెవరికి రాదని, మిగతా ఉడుతలు జీవితాంతం కష్టపడినా అన్ని బాదం పప్పులు కూడబెట్టలేవని అది చాలా సంతోషించింది. రోజూ, తనకు పట్టిన అదృష్టాన్నే తలచుకుంటూ కాలం గడిపేది. అలా అలా కాలం గడిచి, ఉడుత ముసలిది అయింది. ఇక పదవీ విరమణ చేసే సమయం వచ్చింది.

పదవీ విరమణ చేసే రోజున సింహం తనమాట ప్రకారం ఒక బండెడు బాదం గింజలను ఉడుతకు ఇచ్చింది. ఆనందంగా బండినిండా ఆహారాన్ని పెట్టుకుని ఇంటికెళ్ళిన ఉడతకు మిగతా ఉడుతలన్నీ స్వాగతం పలికాయి.

స్నానపాదులన్నీ పూర్తి చేసి, ఇక బాదం పప్పులు తిందాం అనే సమయానికి తనకు ముసలితనం వల్ల పళ్ళన్నీ ఊడిపోయాయన్న విషయం గుర్తుకొచ్చింది. బాదం గింజలపై ఎంతోకాలంగా ఆశ పెంచుకున్న అవి ఇప్పుడు నిరుపయోగంగా ఎదురుగా ఉన్నాయని చాలా బాధపడింది..
========================

జ్ఞానోదయం

ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు. అతను చాలా అద్భుతంగా బొమ్మలు చెక్కేవాడు. అలా చెక్కిన బొమ్మల్ని తన గాడిదపై తీసుకువెళ్ళి పక్క ఊరి సంతలో అమ్ముతుండేవాడు. ఒక రోజు ఆ శిల్పి ఒక దేవత బొమ్మను చెక్కాడు. బొమ్మ చాలా అందంగా, దైవత్వంతో ఉన్నట్టు ఉంది. ఆ బొమ్మను జాగ్రత్తగా గాడిద మీద పెట్టుకుని, పక్క ఊరికి తీసుకువెళ్తున్నాడు. దారిలో వెళ్ళేవారు ఆ దేవత బొమ్మను చూసి, నిజంగా దేవతలా భావించి దణ్ణం పెట్టుకుని వెళ్తున్నారు. అయితే ఇదంతా గాడిదకి మరొక రకంగా అనిపించింది. అందరూ తనని చూసి, తనకే నమస్కారం చేస్తున్నారనుకుంది. అలా నడుస్తూ వెళ్తున్న కొద్దీ అందరూ ఆగాగి నమస్కారాలు చేయడంతో గాడిదకి గర్వం పెరిగింది.

'ఇంత మందికి నేను పెద్ద మనిషిలాగా, గౌరమివ్వాలనిపించేలా కనిపిస్తున్నానా! అని ఆశ్చర్యపోయింది. 'ఇక నేనెవ్వరి మాట విననవసరం లేదు' అనుకుంది. కొద్ది సేపయ్యాక దానికి కాళ్ళునొప్పి పుట్టాయి. అందుకని అది దారి మధ్యలో ఆగిపోయింది. గాడిద ఆగిపోయినా, దానిపైన దేవతకి ప్రజలు ఇంకా దండాలు పెడుతూనే పోతున్నారు. గాడిద ఆగిపోయిందేంటబ్బా అని శిల్పి గాడిదను ఎంత సముదాయించినా అది కదలలేదు. 'ఊరి వాళ్ళంతా నాకు గౌరవమిస్తుంటే నేను గొప్పదాన్నే కదా! మరి గొప్పవాళ్ళు యజమానుల మాటని ఎందుకు వినాలి, అనుకుని అక్కడి నుండి కదలలేదు.

శిల్పికి విసుగు వచ్చి, దేవతా విగ్రహాన్ని గాడిదపై నుండి తీసి తన తలపైనే పెట్టుకుని ముందుకు సాగాడు." ఆ(! పోతే పోయాడు" అనుకుని గర్వంతో కళ్ళు మూసుకుంది గాడిద. కొద్ది సేపటి తర్వాత కళ్ళు తెరచి చూస్తే, ఒక్కరు కూడా తన దగ్గర లేరు. అందరూ తన యజమాని వెనకే దండాలు పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో దారిలో అడ్డంగా ఉందని ఒకతను, గాడిద వీపుపై కర్రతో కొట్టాడు. దానితో గాడిదకి జ్ఞానోదయం అయింది. "అనవసరంగా నన్ను నేను గొప్పగా ఊహించుకున్నాను. ఇంకాసేపు ఇక్కడే ఉంటే, నా వీపు పగిలిపోయేలా ఉంది, అనుకుని యజమాని దగ్గరకు పరుగెత్తింది.

నీతి : గొప్పవారి పక్కన ఉన్నప్పుడు దక్కే మర్యాదలు శాశ్వతమని విర్రవీగడం అవివేకం.
=============================

ఆత్రపడ్డ నక్క

ఓ అడవిలో రెండు నక్కలు ఎంతో స్నేహంగా కలసి మెలసి తిరిగేవి. మోసానికి, జిత్తులకు, ఆశకు నక్కలు పెట్టింది పేరు. ఆ నక్కలు కలసి మెలసి తిరుగుతున్నాయి గాని, హృదయంలో ఒకదాన్ని చూస్తే ఒకదానికి జుగుప్స. ఒక రోజు అవి రెండూ కలిసి ఆహారం కోసం ఆ అడవిలో వేటకు బయలుదేరాయి. అవి చెట్లూ, పుట్టలూ, గుట్టలూ, అంతటా తిరిగి తిరిగి అలసిపోయాయి. కాని, తినడానికి ఏ జంతు మాంసం దొరకనందున ఓ పెద్ద చెట్టు కిందకు చేరి విచారంతో పడుకున్నాయి. వాటికి బాగా ఆకలి వేసి నీరసంగా కళ్లు మూసుకుని కునుకు తీశాయి. ఆ రెండు నక్కల్లో ఒక నక్కకు ఆ శబ్ధం వినిపించింది. ఏమిటో అనుకొని, తన పక్కనే ఉన్న నక్క వైపు చూచింది. ఆ నక్క బాగా నిద్రపోతోందని గ్రహించి గబుక్కిన లేచి ఆ చెట్టు కిందపడ్డ దాని దగ్గరకి పరిగెత్తింది.

అదృష్టం. ఏదో కాని ఒక మాంసపు ఎముకను కొమ్మ మీదికి తెచ్చుకొని తింటున్నది. పొరపాటున జారి కింద పడిపోయిందని నక్క గ్రహించింది. ఎముక చుట్టూ ఎర్రని మాంసము చూడగానే పోయేప్రాణం లేచి వచ్చింది. ఆ ఎంత అదృషం ఆకలికి మాంసమున్న ఎముక దొరికిందని ఆత్రంగా నోటితో పట్టుకుంది. దూరంగా వున్న మరోనక్క లేచి పరుగు పరుగున తన దగ్గరకి రావడం చూసింది. అది వస్తే నన్నిక ఈ ఎముకను కొరక నివ్వదని గబుక్కున ఆ ఎముకను మింగింది. మింగేటప్పుడు ఆ ఎముక నక్కనోటికి అడ్డంగా పడింది. ఎముక అటు నోట్లోకి ఇటు బయటికి రాకుండా ఇరుక్కుపోవడం వల్ల నక్క నేలమీద పడి గిజగిజ తన్నుకోవడం రెండో నక్క చూసింది. రెండో నక్కకు ఏంచేయాలో తోచలేదు. ఎముక మింగుడు పడక ఊపిరి ఆడక నక్క ప్రాణం పోయింది. తినేటప్పుడు ఆత్రం పడి కంగారుగా మింగేయడం వల్ల నక్క ప్రాణాలే పోగొట్టుకుంది.

కనుక బాలలూ, ఎప్పుడు ఏదైనా తినేముందు ఆత్రపడకూడదు. నిర్భయంగా, శాంతంగా తినాలి. ఆత్రం పడనే కూడదు.
==================================

అక్బర్ కల

ఒకరోజు బీర్బల్‌ని ఏడిపించాలని అక్బరు చక్రవర్తి దర్బారులో "బీర్బల్ రాత్రి నాకు ఒక కల వచ్చింది. అందులో మనిద్దరం మన ఉద్యానవనంలో షికారు చేస్తున్నాం. అమావాస్య అవటం వల్ల అంతా చీకటిగా ఉంది. ఇంతలో మన దారులకడ్డంగా రెండు పెద్ద గొయ్యలు వచ్చాయి. మనిద్దరం వాటిలో పడిపోయాం. అదృష్టవశాత్తు నేను పడింది తేనె ఉన్న గొయ్యలో. నువ్వు పడ్డ గొయ్యిలో ఏముందో తెలుసా?" బీర్బల్‌ని ప్రశ్నించాడు అక్బరు.

"ఏముంది ప్రభూ అందులో" అమాయకంగా అడిగాడు బీర్బల్. "బురద". షాదుషా మాటలు విని సభలోని వారందరు పెద్దపెట్టున నవ్వారు. బీర్బల్‌ని ఏడిపించగలిగానన్న ఆనందం కలిగింది అక్బర్‌కు. సభలో నిశ్శబ్దం ఏర్పడ్డాక బీర్బల్ "విచిత్రంగా ఉంది ప్రభూ నాకూ సరిగ్గా ఈ కలే వచ్చింది. అయితే మీరు అంతవరకే కలగని నిద్రలేచేసారు. నేను కల పూర్తయ్యే వరకు నిద్ర పోయాను. అప్పుడు మీరు చాలా రుచికరమైన తేనెతో, నేనేమో దుర్గంధమైన బురదతో పైకి వచ్చాం. శుభ్రపరచుకోవడానికి నీటి కోసం చుట్టూ వెతికాం. కానీ మనకు ఆ దగ్గరలో ఒక నీటి చుక్క కూడా కనిపించలేదు. అప్పుడేం జరిగి ఉంటుందో మీరు ఊహించగలరా?" అన్నాడు.

"ఏం జరిగింది?" కొంచెం కంగారుగానే అడిగాడు అక్బర్. "మనం ఒకరినొకరు నాకి శుభ్రపరచుకున్నాం". అక్బరు ముఖం ఎర్రబడింది. ఏదో అనబోయి ఆగిపోయాడు. తను చేసిన అవమానానికి బీర్బల్ సరైన సమాధానం చెప్పాడని ఊరుకున్నాడు. ఇంకెన్నడూ బీర్బల్‌ని ఏడిపించే ప్రయత్నం చేయలేదు.
============================

రెండు నాలుకలవాడు

ఒక అడవిలో ఒక నక్కను కొన్ని తోడేళ్లు తరుముతున్నాయి. నక్క గుక్క తిప్పుకోకుండా, ప్రాణభయంతో, ఊపిరి బిగబట్టి పరుగుతీస్తోంది. తోడేళ్లు తమ ఆహారాన్ని వదలలేక మరింత వేగంగా దూసుకొస్తున్నాయి. నక్క ఇక పరిగెత్తలేక ఒక గుడిసె వెనకాల దాక్కుంది. ఆ గుడిసె ముందు చెట్టుపై ఒకతను కట్టెలు కొడుతున్నాడు. నక్క అతన్ని చూసి "అయ్యా! నేను ప్రాణ భయంతో పరిగెత్తుకు వస్తున్నాను. నన్ను తోడేళ్లు తరుముతున్నాయి. అవి వస్తే దయచేసి నేను ఇక్కడ ఉన్నానని చెప్పకు" అని అంది. బదులుగా అతను "సరే ! నువ్వు ప్రాణం అరచేతిలో పెట్టుకుని వస్తున్నావు. నువ్వు ఇక్కడ దాక్కున్నావని చెప్పనులే" అన్నాడు.

అంతలో తోడేళ్లు రొప్పుతూ అతని ముందుకొచ్చాయి. " అయ్యా! మేము ఒక నక్క కోసం వెతుకుతున్నాం. ఆ నక్క గాని ఇటు వైపు వచ్చిందా? చెప్పండి. మీకు మేము రుణపడి ఉంటాం", అని అన్నాయి తోడేళ్లు ముక్తకంఠంతో. కొద్దిసేపు ఆలోచించి ఆ కట్టెలు కొట్టేవాడు, ఒక వైపు చేయి నక్కవైపు, మరో చేయి రోడ్డువైపు చూపిస్తూ, " అటుగా వెళ్ళింది" అని పలికాడు. అతని సంజ్ఞను అర్ధం చేసుకోలేని వెర్రి తోడేళ్లు అతను చూపించిన రోడ్డువైపు పరిగెత్తాయి. "హమ్మయ్య" అని బయటకొచ్చిన నక్క తన దారిలో తాను వెళ్తుంటే కట్టెలు కొట్టేవాడు నక్కతో, " నువ్వు మామూలు వాడివి అయితే కృతజ్ఞతలు చెప్పేదాన్ని. కానీ నువ్వు రెండు నాలుకలవాడివి. నావైపు చూపిస్తూ మరోవైపు వెళ్లిందని చెప్పావు. నీలాంటి వాడికి కృతజ్ఞతలు చెప్పడం కూడా సంస్కారం అనిపించుకోదు" అంది నక్క.

నీతి : రెండు నాలుకల ధోరణి మంచిది కాదు.
=======================================

విలువైన నిజం

ఎప్పుడూ నిజాలు చెప్పే రాము, అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడని రంగా ఇద్దరూ కలిసి ఒకరోజు అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. అనుకోకుండా వారిద్దరూ వానరాల రాజ్యంలో అడుగుపెట్టారు. ఆ సంగతి తెలిసిన వానర రాజు, అతని సైనిక కోతులకు రాము, రంగాలను బంధించి తీసుకురావాల్సిందిగా ఆదేశం జారీచేశాడు. అంతే, క్షణాల్లో సైనికకోతులు వారిద్దరినీ బంధించి రాజు దగ్గరకు తీసుకెళ్ళాయి.

రాజు తన సభికులతో కొలువుదీరి ఉన్నాడు. సభలో సింహాసనం మీద కూర్చున్న కోతుల రాజు రాము, రంగలిద్దరినీ తన సభలోకి ఆహ్వానించాడు. "మానవుల్లారా! నేను ఈ రాజ్యానికి అధినేతను. నేను మీకు ఎటువంటి రాజులా కనిపిస్తున్నాను?" అని అడి్గాడు.

ఎప్పుడూ అబద్ధాలు తప్ప నిజాలు చెప్పని రంగా కోతుల రాజువైపు చూస్తూ. "ప్రభూ! మీరు అత్యంత వీరులైన, శక్తిసంపన్నులైన రాజులా కనిపిస్తున్నారు" అన్నాడు. "మరి నా పక్కన ఉన్న నా సైన్యం, పరివారం ఎలా ఉన్నారు?" అని అడిగారు కోతుల రాజు. "శక్తి సంపన్నమైన రాజుకు బలవంతులైన బుద్ధిమంతులైన అనుచరులు, సహచరుల వలె ఉన్నారు వీరంతా" అని బదులిచ్చాడు రంగా. తమని పొగిడిన రంగాను వానరులు ఒక సింహాసనం వేసి కూర్చొబెట్టడంతో అతను పొంగిపోయాడు.

ఆ తర్వాత ఎప్పుడూ నిజాలే చెప్పే రాము వైపు తిరిగి కొతుల రాజు. "ఇప్పుడు మీరు చెప్పండి. నేను నా పక్కనున్న వారంతా మీకు ఎలా కనబడుతున్నాం? ఏ మాత్రం సంకోచించకుండా చెప్పండి" అని పలికాడు. అబద్ధం చెప్పిన వాడిని సింహాసనం మీద కూర్చొబెట్టాడు ఈ కోతి గాడు. కాని నేను నా వ్యక్తిత్వాన్ని వదులుకో లేను. కాబట్టి నాకు తోచినట్టు నిజమే చెబుతాను అని మనసులో అనుకున్న రాము. "నీవు ఒక అద్భుతమైన వానరానివి. నీ పక్కనున్న వారంతా నీలాగే వీరులైన కోతులు" అంటూ చెప్పసాగాడు.

అంతే రాము నిజాయితీని, వ్యక్తిత్వాన్ని చప్పట్లతో అభినందించిన కోతుల రాజు అతనికి వజ్రాలు, రత్నాలు బహుమానంగా ఇచ్చాడు. అబద్ధం చెప్పిన రంగాకు వంద కొరడా దెబ్బల శిక్ష విధించాడు కోతుల రాజు. అబద్ధం చెప్పిన రంగా ఒళ్లంతా గాయాలతో ఆసుపత్రికి చేరుకున్నాడు. వ్యక్తిత్వం చంపుకోలేక నిజం చెప్పిన రాము వజ్రాలు, రత్నాలతో ఇంటికి చేరుకున్నాడు.
=====================================

అపూర్వ స్నేహం

అనగనగా ఒక ఊళ్లో ఓ ఏనుగు ఉండేది. ఆ ఏనుగు ఉన్నచోటనే బక్కచిక్కిన కుక్క ఒకటి ఉండేది. ఏనుగుకు తెలియకుండా చడీచప్పుడు కాకుండా డేరాలోకి వచ్చి ఏనుగు తినేటప్పుడు పడిపోయిన ఆహారపదార్ధాలను ఆ కుక్క తింటుండేది. ఆ ఏనుగు కుక్క రాకపోకలు గమనించింది. తరచూ అలా వస్తూపోతుండటంతో కుక్కతో ఏనుగుకు క్రమేపీ స్నేహం కుదిరింది.

ఆ ఏనుగు, కుక్క మంచి స్నేహితులయ్యయి. ఒకరు లేకుండా మరొకరు తినేవారు కాదు. రెండూ ఎంతో ఆనందంగా, ఆటలతో గడిపేవి.

ఒకరోజు ఓ గ్రామస్తుడు నగరానికి వచ్చి, ఈ ఏనుగు డేరావైపు వచ్చాడు. అతను ఎవరూ గమనించకుండా కుక్కను తన గ్రామానికి తీసుకెళ్లాడు.

తన స్నేహితుడు లేకపోయేసరికి ఏనుగుకు దిగులు పట్టుకుంది. ఏమీ చేయబుద్ది కావడం లేదు. తినడానికి, స్నానం చేయడానికి మనస్కరించడం లేదు. మాలి ఈ సంగతిని రాజుకు తెలిపాడు.

రాజు దగ్గరున్న మంత్రికి జంతువులను అర్ధం చెసుకునే తెలివితేటలు ఉన్నాయి. మంత్రిని పిలిచి ఆ ఏనుగు పరిస్ధితి కంక్కోమని చెప్పాడు రాజు. ఆ మంత్రి ఏనుగు డేరా దగ్గరికి వెళ్లాడు. ఏనుగు చాలా దిగులుగా ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడే వున్న సేవకులను పిలిచి, "ఏనుగుతో ఎవరైనా స్నేహంగా ఉండడం మీలో ఎవరైనా గమనించారా?" అని అడిగాడు మంత్రి.

వెంటనే వాళ్లు కుక్కతో ఏనుగు స్నేహంగా ఉండేదని, అవి రెండూ మంచి మిత్రులని చెప్పారు. "ఆ కుక్కను ఎవరో తీసుకెళ్ల్లారు" అని చెప్పారు.

మంత్రి రాజు దగ్గరికి వచ్చి, జరిగిన విషయం మొత్తం వివరించి చెప్పాడు. "రాజా్, మీ ఏనుగుతో స్నేహం కట్టిన ఆ కుక్కను ఎవరు బంధించి ఉంచారో వారికి జరిమానా వేస్తానని ఓ ప్రకటన చేయండి" అని సూచించాడు.

రాజు ప్రకటన జారీచేశాడు. కుక్కను తీసుకెళ్లిన ఆ గ్రామస్తుడు ఆ ప్రకటన తెలుసుకుని కుక్కను వదిలేశాడు. అది పరుగు పరుగున ఏనుగు డేరాను చేరింది.

ఏనుగు ఆనందానికి అంతేలేదు. తన స్నేహితుడిని తొండంతో పట్టి లేపి తన తలపై కూర్చోబెట్టి ఆడించింది. తోకను ఆడిస్తూ కుక్క కూడా ఎంతో ఆనందంతో ఆడుకుంది. అప్పట్నుంచీ ఆ రెండూ సంతోషంగా కలిసే ఉన్నాయి.

నీతి : సహజశత్రువులైనా ఎంతో మంచి మిత్రులు కావడానికి అవకాశం ఉంది.
===============================

ఉపాయం

మిన్నూ బయటికి వెళ్తుండగా దారిలో ఒక చిన్న మూతి గల జాడి కనిపించింది. జాడీలో ఏముందో తెలుసుకుందామని మిన్నూ దాని దగ్గరకు వెళ్లాడు. 'అబ్బ! నాకిష్టమైన పల్లెలున్నాయే' సంతోషంగా అనుకున్నాడు.

మిన్నూ జాడీ లోపల చేయి పెట్టాడు. పిడికిలి నిండా పల్లీలు పట్టుకున్నాడు. ఆ తరువాత చేయి బయటికి తీయడానికి ప్రయత్నించాడు. మిన్నూ పిడికిలి బిగించడంతో చిన్నదైన జాడీ మూతిలోంచి ఎంత ప్రయత్నించినా చేయి బయటకు రాలేదు.

దాంతో ఏడవటం మొదలుపెట్టాడు. ఇదంతా గమనిస్తున్న ఒక పెద్దాయన మిన్నూ దగ్గరకు వచ్చాడు. "కంగారు పడకు బాబు, ఊరుకో! నేను చెప్పినట్టు చేస్తే నీ చేయి బయటకు వస్తుంది. అలాగే పల్లీలు కూడా వస్తాయి" అన్నాడు.

"అవునా? అయితే వెంటనే చెప్పండి" అని అడిగాడు మిన్నూ.

"చూడు బాబూ! నువ్వు ఒకేసారి మొత్తం కావాలనుకుంటే నీకు దొరకవు. కొంచెం కొంచెం పట్టుకుని తీస్తే నీకు నెమ్మదిగా అన్నీ దొరుకుతాయి. ఒకసారి ప్రయత్నించు!" అన్నాడాయన.

వెంటనే మిన్నూ పిడికిలి నిండా ఉన్న పల్లీలను వదిలేసి కొన్నింటిని పట్టుకున్నాడు. ఈసారి చేయి తేలికగా బయటకు వచ్చింది. ఆ విధంగానే పల్లీలు బయటికి తీయడం మొదలెట్టాడు. కొంత సమయం పట్టినప్పటికీ పల్లీలన్ని బయటికొచ్చేస్తాయి. పెద్దాయనకు ధన్యవాదాలు తెలిపి మిన్నూ సంతోషంగా పల్లీలు తింటూ వెళ్లిపోయాడు.

నీతి : మనం దేనినైనా సాధించాలనుకుంటే దానికి కావాలసిన ఉపాయాన్ని ఆలోచించాలి.
==========================================

చీమ - రాజు

మహేంద్రపుర రాజ్యాన్ని విజయసింహుడు పరిపాలించేవాడు. అతను ప్రజలను తన బిడ్డల్లా చూసుకుంటూ ప్రజారంజకంగా పాలించేవాడు. విజయ సింహుని తరువాత అతని కుమారుడు విక్రమసింహుడు ఆ రాజ్యానికి రాజయ్యాడు. విక్రసింహుడు కూడా తండ్రి లాగా పరిపాలించాలనుకున్నాడు. కాని మంత్రి, తక్కిన అధికారులు అతనికి సహకరించేవారు కాదు.

ఒకరోజు రాత్రి నా తండ్రి ఎంత ప్రజారంజకంగా పరిపాలించాడు. నేను అలా పరిపాలిద్దాం అనుకుంటే మంత్రి, అధికారులు సహకరించడం లేదే?? ప్రజలకు నా మీద నమ్మకం పోతుందేమో. నేను ఈ బాధ్యత మోయలేనేమో, ఎక్కడికైనా దూరంగా పారిపవాలి!" అని మనసులో అనుకుంటూ మంచం మీద నుంచి లేచాడు. రాజభవనం ద్వారం దాటి బయటకు వచ్చాడు. "ఎంత దూరం పారిపోగలను? నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలు నన్ను గుర్తుపడతారు," అని మళ్లీ తన మనసులో అనుకుని, తిరిగి మందిరానికి వచ్చాడు. అలా కొంచెం సేపు ఆలోచించి, చివరికి రాజభవనం మీద నుండి దూకి చనిపోదామని నిర్ణయించుకున్నాడు. ప్రజలను బాగా పరిపాలించలేకపోతున్నాననే బాధ అతను ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది.

విక్రమసింహుడు రాజభవనం మీదకి చేరుకున్నాడు. ఏదో ఆలోచిస్తూ భవనం గోడ దగ్గర నిలబడ్డాడు. అక్కడ అతనికి ఒక చీమ తన నోటితో ఒక చక్కెర పలుకును కరుచుకొని గోడ వారగా వెళ్లడం కనిపించింది. ఆ చీమ అలా వెళుతూ గోడ పగుళ్లలో ఉన్న తన నివాసంలోకి వెళ్లిపోయింది. అది చూసిన విక్రమసింహుడు, ఔరా! ఈ చీమను చూడు. ఈ రాజభవనంలో ఎక్కడో మూలన ఉన్న వంట గది నుండి పంచదార పలుకుని కరుచుకొని, మూడు అంతస్తులు ఉన్న ఈ రాజ భవనం మీదకు చేరింది. ఒక చిన్న చీమనే ఇంత పైకి రాగలిగితే, దాని కన్నా ఎన్నో రెట్లు పెద్దగా, బలంగా ఉన్న నేను నా ప్రజల సంక్షేమం కోసం పాటుపడలేనా? అనుకున్నాడు. ఆ ఆలోచనతో అతనిలో ఉన్న నిరాశ పటాపంచలయ్యింది.

చనిపోదాం అనుకున్న విక్రమసింహుడు తన మనస్సు మార్చుకుని, కొత్త ఉత్సాహంతో తన మందిరానికి చేరుకున్నాడు. అప్పటి నుండి మంత్రులను, అధికారులను తనకు సహకరించేలా చేసుకుని ప్రజారంజకంగా పరిపాలించసాగాడు.

నీతి : చిన్ని ప్రాణుల ద్వారా కూడ మంచిని తెలుసుకోవచ్చు.

No comments: