బాలగంగాధర్ తిలక్
పేరు | : | బాలగంగాధర్ తిలక్ |
తండ్రి పేరు | : | (తెలియదు). |
తల్లి పేరు | : | (తెలియదు). |
పుట్టిన తేది | : | 23-7-1856 |
పుట్టిన ప్రదేశం | : | రత్నగిరిలో |
చదివిన ప్రదేశం | : | (తెలియదు). |
చదువు | : | న్యాయశాస్త్రం |
గొప్పదనం | : | బ్రిటీషుపరిపాలనపై ప్రజలలో చైతన్యమును పెంపొందించెను. భారతీయులలో విద్యాభివృద్దికి అతడు పాటుపడెను. తిలక్ రచించిన గ్రంథాలు ('గీతారహస్యం', 'ఆర్కిటిక్ హోం ఆఫ్ వేదాస్') ; స్థాపించిన పత్రికలు ('కేసరి', 'మరాటా') |
స్వర్గస్తుడైన తేది | : | 1-8-1920 |
బాలగంగాధర్ తిలక్ 1856 వ సంవత్సరం జులై 23న రత్నగిరిలో జన్మించాడు. తండ్రి ఒక సామాన్య బడిపంతులు. తల్లి మహాభక్తురాలు. చిన్నతనంలోనే తిలక్ తండ్రి అతనికి సంస్కృతంలోనూ, గణిత శాస్త్రంలోనూ గట్టిశిక్షణ ఇచ్చాడు. తిలక్ కూడా చదువు పట్ల ఎంతో ఆసక్తి చూపుతూ మెట్రిక్యులేషన్ దాకా ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడవుతూ వచ్చాడు. అతనికి పదహరేళ్ళు వచ్చేసరికి తల్లిదండ్రులిద్దరూ మరణించటం, అతని వివాహం జరగటం అన్ని జరిగిపోయాయి.
మెట్రిక్ పాసయిన తరువాత, అతని పినతండ్రి ప్రభుత్వరంగంలో ఒక ఉద్యోగానికి సిఫారసు చేసి చేయించాడు. అయితే చిన్నప్పటినుంచి స్వతంత్ర భావాలున్న తిలక్, ఆ ఉద్యోగంలో చేరలేదు. భారతదేశ ప్రజలు అమాయకంగా ఉండి చదువు లేకపోవటంవల్లనే ఆంగ్లేయులు అధికారం చెలాయిస్తునారని, వారి అధికారం నుంచి భారతీయులు స్వేచ్చ పొందాలంటే చదువు ముఖ్యమని భావించి తిలక్ బి.ఏ. చదివి, అనంతరం న్యాయశాస్త్రం కూడా చదివి, తనలాగే పౌరులందరినీ తీర్చి దిద్దాలని ఉద్యోగంవచ్చినా చేయక, న్యాయవాద వృత్తి చేపట్టక 1880లో తన మిత్రుడు అగర్మర్ తో కలిసి పూనాలో ఒక పాఠశాల స్థాపించాడు. ఆంగ్లేయులు భారతీయ సంస్కృతిని కాలరాస్తూ, వారి నాగరికతను మన మీద రుద్దుతూ, హిందువులను వారి మతంలోకి మార్చుతుంటే, తిలక్ భరించలేకపోయాడు. కేవలం వ్యాపారం చేయడానికి మన దేశాన్ని ఆశ్రయించి, ఏకుమేకై కూర్చున్నట్లుగా వారు మనమీద పెత్తనం చెలాయించటం తిలక్ సహించలేకపోయాడు. తన పాఠశాలలో ప్రతి విద్యార్ధి దేశానికి నిజమైన సేవ చేయాలంటే బాగా చదువుకొని బ్రిటీషువారి పీడ వదిలించుకోవటానికి సిద్దపడాలనీ, అందుకు అవసరమైతే ప్రాణాలు అర్పించటానికైనా వెనుకంజ వేయరాదని నూరిపోశాడు. కాంగ్రెసులోని మితవాదుల విధానాలతో అతడు తృప్తిచెందలేదు. తర్వాత అతడు 1916లో "హొం రూల్ లీగ్" ను స్థాపించెను.
దేశసేవ నినాదంతో తన పాఠశాలను ఎంతో అభివృద్ది చేసుకుని అనేక దేశభక్తులను తయారు చేశాడు తిలక్. తోటి ఉపాధ్యాయులు కానీ, తను కానీ, ఎటువంటి జీతభత్యాలు తీసుకోకుండా పిల్లల బంగారు భవిష్యత్తుకై కృషి చేస్తూ, ఎప్పటికైనా భారతీయులు స్వేచ్ఛ పొందాలని కలలు కనేవారు. ఏ కోశానా స్వార్ధంలేని ఆ మేధావులు ఎందరో ఆణిముత్యాలను దేశానికి సమర్పించారు. తిలక్ పట్టుదల, కృషి, దీక్షవలన ఆ పాఠశాల ఉత్తమ పాఠశాలగా గుర్తింపు తెచ్చుకుని, భారతదేశంలోని యితర విద్యార్థులు కూడా అక్కడ చేరేలాగా ప్రాముఖ్యం పొందింది. ఈ పాఠశాల విజయాలు గమనించిన బ్రిటీషు ప్రభుత్వం ఆ రోజుల్లో ఒకింత కలవరపడింది. కారణమేమంటే భారతదేశం నలుమూలల నుండి విధ్యార్ధులు వచ్చి చేరుతున్నారు. వీళ్ళు చదువుతో పాటు దేశసేవ, దేశభక్తి అంటూ నూరిపోస్తున్నారు. వీళ్ళు చదువు పూర్తిచేసుకొని వస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలుచేయవచ్చు, అందుకని ఈ పాఠశాలను మొగ్గగా ఉన్నప్పుడే తుంచివేయాలి, అనే దురుద్దేశంతో పాఠశాలలో రాజకీయాలు నేర్పుతున్నారనే మిషతో గుర్తింపును రద్దు చేస్తూ తాఖీదు పంపారు.
తాఖీదు అందుకున్న తిలక్ ఉగ్రుడై బ్రిటీషు ప్రభుత్వంపై కోర్టులో దావా వేసి, తానే వాదించి తిరిగి గుర్తింపు పొందాడు. ఆ సంఘటన ప్రభుత్వ ప్రతిష్టను చాలా బలహీనపరచింది. ఆ సమయంలోనే తెల్లదొరల గర్వం అణగదొక్కడానికి భారతీయులను తెల్లవారి దొరతనం నుంచి విముక్తి కలిగించటానికి వార్తా పత్రిక ఎంతో అవసరమని భావించి, తన స్నేహితుడితో కలిసి 'మరాఠా', 'కేసరి' అనే పత్రికలు స్థాపించి ప్రభుత్వం చేసేఅవకతవకలు, వారిలోపాలు వరుసపెట్టి దుమ్మెత్తిపోయటం ప్రారంభించాడు. అనతికాలంలోనే ఆ పత్రికలు పాఠకుల అభిమానాన్ని చూరగొన్నాయి. "కేసరి" పత్రికలను ఆ రోజుల్లో అందరికన్నా ముందుగా దొరలే కొనుక్కొని చదువుకొనేవారు. బ్రిటీషు ప్రభుత్వంచేత నాటి రాజద్రోహ నిరోధకచట్టం క్రింద విచారించబడి, శిక్షించబడిన మొదటి భారతీయుడు తిలక్. అతనిని అనేక పర్యాయాలు జైలుకు పంపారు. అతడు స్వాతంత్ర్య యోధుడేకాదు; గొప్పవిద్వాంసుడు కూడా. 'గీతారహస్యం', 'ఆర్కిటిక్ హొం ఆఫ్ వేదాస్' అనే గ్రంథాలను అతడు రచించెను. అతడు, బ్రిటీషు పరిపాలనపై ప్రజలలో చైతన్యమును పెంపొందించెను. ఇదే, అతని నుండి జాతీయోద్యమానికి వచ్చిన కానుక. 1893లో అతడు 'గణపతి ఉత్సవాలను' ప్రారంభించెను. 'శివాజీ పండుగ' ను కూడా 1895లో అతడు ప్రారంభించెను. తిలక్ 'లాఠీక్లబ్' 'అఖ్ఖారస్' అనే వ్యాయామశాలనూ, 'గోహత్యా నిషేధసంఘాల'నూ స్థాపించెను. అతని తీవ్రవాద విధానాల వల్ల, అతనిని "భారత అశాంతికి జనకుడు" అన్నారు. "స్వరాజ్యం నా జన్మ హక్కు"అని చాటింది ఇతడే.
తన జీవితకాలంలో అనేక సార్లు కారాగారశిక్షననుభవించాడు. తిలక్ బయటవుంటే దొరల పక్కలో బల్లెంలా ఉండేవాడు. అందుచేతనే ఏదో మిషతో వారు ఆయన్ని జైలులో పెట్టేవారు. అనేక ఉద్యమాలు నడిపి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి తన జీవితమంతా దేశ స్వాతంత్ర్య సాధనకొరకు అర్పించి మహాత్మాగాంధీలాంటి మహానాయకులకు, ఆదర్శమూర్తిగా నిలిచి ప్రజలచే లోకమాన్యుడనిపించుకున్న మహావ్యక్తి బాలగంగాదర్ తిలక్. ఆయన 1920 ఆగష్టు 1 న స్వర్గస్థులయినారు.
No comments:
Post a Comment