Thursday, February 3, 2011

దాదాభాయి నౌరోజి

పేరు : దాదాభాయి నౌరోజి
తండ్రి పేరు :

(తెలియదు).

పుట్టిన తేది : 04 - 09 - 1825.
పుట్టిన ప్రదేశం : బొంబాయి
చదివిన ప్రదేశం : బొంబాయి సొసైటీ స్కూల్
చదువు : ఉపాధ్యాయుని చదువు చదివాడు
గొప్పదనం : బాల్యవివాహాలను ఖండించి, వితంతు వివాహాలను ప్రోత్సహించాడు.

స్థాపించిన సంస్థలు - "బోంబే అసోసియేషన్, పార్శీ జిమ్నాయిజం, విడోరీమ్యారేజి అసోసియేషన్, స్టూడెంట్స్ లిటరరీ అండ్ సైంటిఫిక్ సొసైటీ, లండన్ ఇండియా సొసైటీ".

ప్రారంభించిన పత్రిక : ఇండియా జర్నల్.
వ్రాసిన వ్యాసాలు : "భారతదేశంలో పేదరికం" "పేదరికం నిర్మూలన"
స్వర్గస్థుడైన తేది : 30 - 06 - 1917.

దాదాభాయి బొంబాయి మహానగరంలో 1825 సెప్టెంబర్ 4న ఒక పేద పార్శీ కుటుంబంలో జన్మించాడు. తండ్రి పౌరోహిత్యం చేసేవాడు. ఉన్నప్పుడు తింటూ, లేనప్పుడు పస్తులుంటూ కాలం వెళ్ళబుచ్చేవాడు. తన గారాల కుమారునికి ఆడుకోవడానికి బొమ్మలుకూడా కొనివ్వలేకపోయాడు. దురదృష్టవశాత్తు దాదాభాయికి నాలుగు సంవత్సరాల వయస్సు వచ్చేసరికి తండ్రి మరణించాడు. అసలే పేదరికం, దానికి తోడు తండ్రి అకాల మరణం, తల్లికి చదువులేదు.దాదాభాయి చదువు చాలా కాలం వీధి బడిలోనే సాగింది. బాగా చదివి మంచి పేరు తెచ్చుకోవటం వలన, తెలిసిన ఒక ఉపాధ్యాయుడు బొంబాయి సొసైటీ స్కూలులో అడ్మిషను ఇప్పించాడు. అక్కడ కూడ బాగా చదివి మంచి విద్యార్ధిగా పేరుతెచ్చుకుని స్కాలర్ షిప్పులు కూడా పొందేవాడు. స్కూలు ఫైనల్ పరీక్షల్లో ప్రప్రధముడిగా రావటం వలన ఆ రోజుల్లో గొప్పగా చెప్పుకొనే ఎల్పిన్‌స్టన్ కాలేజీలో సునాయాసంగా అడ్మిషను దొరికొంది. అక్కడ కూడా ఎప్పుడూ అతనే ఫస్టు. ఫైనల్ పరీక్షలో మొత్తం బొంబాయి నగరంలోనే ప్రధముడిగా వచ్చి అందరి దృష్టిలో పడ్డాడు. ఒక భారతీయుడు అందరికన్నా మంచి మార్కులు తెచ్చుకోవడం పలువురికి ఆశ్చర్యం కలిగింది. అప్పటి చీఫ్ జనరల్ సర్ ఎర్క్సిన్ షెర్రి దాదాభాయిని ప్రత్యేకంగా తన యింటికి ఆహ్వానించి అభినందించి, లండన్‌లో బారిస్టరు పరీక్షకు వెళ్ళమని ప్రొత్సహించాడు. కానీ వారిది సంప్రదాయ కుటుంబం కావటం వలన అతను లండన్ వెళ్తే మతం మార్చుకుంటాడేమోనని భయంతో ఇంట్లో వారెవరూ అంగీకరించలేదు.

ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా "స్టూడెంట్స్ లిటరరి అండ్ సైంటిఫిక్ సొసైటి" అనే సంస్థను స్థాపించి బాలబాలికల సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి అనేక విధాల కృషి చేశారు. అంతేకాదు, బాంబే అసోసియేషన్, పార్శీ, జిమ్నాయిజం, విడోరీమ్యారేజి అసోసియేషన్, వంటి సంస్థలు స్థాపించి తన వంతు సమాజసేవ చేశాడు. 1851 లో 'రాస్తే గోప్తార్' (యదార్థ వాది) అనే పత్రికను స్థాపించి దానిలో సమాజంలోని దురాచారాలను, మూఢనమ్మకాలను దుయ్యబట్టి, ప్రజలలో మార్పు తీసుకురావటానికి ఎంతో కృషి చేశాడు. ముఖ్యంగా బాల్యవివాహాలను ఖండించి, వితంతు వివాహాలను ప్రోత్సహించి ప్రజల ఆలోచనలలో ఆచార వ్యహారాలలో మార్పు తీసుకురాగలిగాడు. ఈ మార్పు బ్రిటీషు వారిని కూడా కలవరపరిచింది. 1855 లో దాదాభాయి తొలిసారి లండన్‌లో అడుగుపెట్టాడు. అక్కడి భారతీయుల స్థితి మరీ అద్వానంగా ఉంది. "లండన్ ఇండియా సొసైటీ" అనే సంస్థను స్థాపించి భారతీయులందరినీ ఒక తాడి మీదకు తెచ్చి వారిలో స్వాతంత్ర పిపాసను కలిగించి, అందరినీ ఐక్యమత్యంగా ఉండవలసిందని బోధించాడు.

భిన్న జాతులు, భిన్న మతాలు ఉన్నప్పటికీ భారతీయులందరూ ఒకటే అని బోధించి వారందరూ ఒక త్రాటిపై నిలిచేలా చేశాడు. "ఇండియా జర్నల్" అనే పత్రికను స్థాపించి, అందులో భారత దేశానికి చెందిన రాజకీయ, ఆర్ధిక సమస్యలను, భారతదేశంలో తెల్ల దొరలు వేసిన పన్నుల వివరాలు, అందులో ఎంత భాగం లండన్‌కి తరలించారు, ఎంత ఖర్చు పెట్టారు లాంటి విషయాలను వ్రాసేవాడు. ఇది ఆంగ్లేయుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తించింది. ఇండియాలో వసూలు చేసిన సొమ్ములో తొంభై పాళ్ళు లండన్‌కి బంగారం రూపంలో పంపి వేస్తున్నారనే సత్యాన్ని దాదాభాయి ధైర్యంగా వ్రాయటం భరించలేక పోయారు. అనేక సమస్యలను సృష్టించి పత్రికను ఆపడానికి ప్రయత్నంచేశారు. కానీ దాదాభాయి తొణకలేదు. దీక్షతో తన సమరాన్ని కొనసాగించడానికి స్వదేశీ సంస్థానాధిపతుల సహాయం అర్ధించాడు. సింధియా, గైక్వాడ్, కచ్, హొల్కార్, మొదలగు సంస్థానాధీశులు అతనికి అండగా నిలిచారు. దాదాభాయి ఒక సామాన్య పౌరుడిగా దొరలను కలిసి "భారతదేశంలో పేదరికం", "పేదరికం నిర్మూలన" వంటి విషయాలపై వ్యాసాలు సమర్పించి వారు ఆలోచించేలా చేశాడు.

ఆ రోజుల్లో బ్రిటీషు పార్లమెంటులో భారతీయులెవరూ సభ్యులుగా లేరు. ఆంగ్లేయులు అది భరించలేరు కూడా. అటువంటి సమయంలో దాదాభాయికి ఒక ఆలోచన వచ్చింది. తమ సమస్యలను ఒక పౌరుడిగా చెప్తే అది ప్రభుత్వం చెవికెక్కడంలేదు. పార్లమెంటు సభ్యుడు చేత అయితే తప్పనిసరిగా వింటారు అని అనుకుని పార్లమెంటు సభ్యుడు కావాలని దీక్ష బూనాడు. ఆనాటి నుంచి పగలనక, రాత్రనక, శ్రమించి దేశంలో పర్యటించి, కాంగ్రెస్ పార్టీ స్థాపనకు కృషి చేసి, అందులో ముఖ్యమైన పదవులు నిర్వహించి, భారతీయుల్ని ఉత్తేజితుల్ని చేశారు. అతని దీక్ష ఫలించింది. 1892 లో జరిగిన ఎన్నికలలో బ్రిటన్ లో సెంట్రల్ ఫిన్సుబరీ నుండి బ్రిటీషు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

బ్రిటీషు పార్లమెంటులో ప్రవేశించిన మొదటి భారతీయుడితడే. అసాధ్యమనుకున్నది సాధ్యం చేశాడు. పార్లమెంటు సభ్యుడిగా దాదాభాయి చేసిన సేవ గణనీయమైనది. భారతీయుల సమస్యలను పార్లమెంటులో చర్చించి, వాటిలో అనేకం పరిష్కరించగలిగాడు. 92 సంవత్సరాలు మహొజ్వల జీవితం గడిపిన ఆ మహా మనిషి 1919 లో స్వర్గస్థుడైనాడు.

అచంచల దీక్ష వుంటే అనుకున్నది ఎంతటి అసాధ్యమైనా చేసి చూపించవచ్చు అని దాదాభాయి ఋజువు చేశాడు.


No comments: