Thursday, February 24, 2011

నీతి కధలు 8

ప్రతిభే పెట్టుబడి

వారణాసిలో బ్రహ్మదత్తుడు రాజ్యం చేస్తుండగా బోధిసత్వుడు వైశ్యకులంలో చిన్ని అనే పేరుతో పెరిగి పెద్దవాడయ్యాడు. ఆయన బుద్దిమంతుడే కాకుండా శకునశాస్త్రజ్ఞుడుకూడా.

ఒకనాడాయన రాజుగారి వద్దకు వెళ్తూ తోవలో చచ్చిన ఎలుకని చూసి నక్షత్ర స్థానం గుణించి 'తెలివితేటలు కల యువకుడైతే యీ చచ్చిన ఎలుకని తీసుకుపోయి దీనినే పెట్టుబడిగా వ్యాపారము చేసి వివాహము చేసుకోవచ్చును' అన్నాడు. ఆ మాటలు పేదవాడయిన ఒక మంచి తెలివైన బాలుడు విన్నాడు. చిన్ని శ్రేష్టి తెలిసి తప్పుమాట్లాడడని తలచి ఆ ఎలుకను తీసుకెళ్ళి పిల్లిని పెంచే ఒక కొట్టువానికి కాణికి (కాణి రూపాయలో 64 వ వంతు) అమ్మి దానితో బెల్లంకొని, మంచినీటిని పట్టుకొని అడవి నుంచి పువ్వులు తెచ్చి అమ్మేవారికి చిన్న బెల్లం ముక్కపెట్టి మంచి నీళ్ళు ఇచ్చాడు. వాళ్ళతనికి కొన్ని పూలు ఇచ్చి పోయారు. అతను వాటిని అంగడిలో అమ్మి ఆ డబ్బులతో మరింత బెల్లంకొని మరునాడు కూడా వారికి బెల్లం ముక్క మంచి నీళ్ళు ఇచ్చాడు. వాళ్ళీసారి కొన్ని పూలదండలు, పూలమొక్కలు యిచ్చారు. ఈ ప్రకారంగా అతను ఎనిమిది కార్షాపణములు త్వరగానే సంపాదించాడు. ఇలా ఉండగా ఒకనాడు పెనుగాలి వీచి వానకురిసింది. ఆ గాలికి రాజోద్యానములో ఎండుకొమ్మలు ఆకులు రాలి అక్కడంతా చిందరవందరగా తయారయ్యింది. తోటమాలికి ఏం చేయాలో అర్థంకాలేదు. అదంతా బాగుచేయడం అతనికి తలకిమించినపని. అదిగమనించి యువకుడతనివద్దకు వెళ్ళి రాలిపడిన కర్రలూ కంపా నాకిచ్చేస్తాను అంటే నేను తోట బాగుచేయిస్తాను అన్నాడు. తోటమాలి వెంటనే అంగీకరించాడు.

ఆ యువకుడు పిల్లలాడుకునే చోటుకిపోయి బెల్లం ముక్క పెడతాను అని ఆశచూపి వాళ్ళని తోటలోకి తీసుకుపోయి తుక్కుపోగుచేయించి బయట పోయించాడు. ఆ సమయంలో కుండలని కాల్చేందుకు కర్రలకోసం పోతున్న ఒక కుమ్మరి 26 కార్షాపణములు, కొన్నిచెట్లు యువకుడికిచ్చి ఆ కుప్పని తరలించుకుపోయాడు. అప్పుడా యువకుడికొక ఉపాయంతోచింది. నగరద్వారానికి దగ్గరలో గడ్డికోసుకొని వచ్చేవారికి కుండలతో నీరిచ్చి వారి దాహం తీర్చాడు. నువ్వు మాకు మేలుచేశావు. మేము నీకేంచేయమంటావు? అని అడిగారు. సమయం వచ్చినప్పుడు అడుగుతాను. అప్పుడు మీరు నాకు సాయం చేద్దురుగాని అన్నాడు. ఆ యువకుడు మెల్లగా కొందరు వర్తకులతో స్నేహం చేశాడు. ఒకనాడొక వర్తకుడు రేపు 500 గుర్రాలతో అశ్వవర్తకుడు నగరానికి వస్తాడు. అని యువకుడికి చెప్పాడు. అతను వెంటనే గడ్డి తెచ్చేవాళ్ళ దగ్గరకెళ్ళి రేపు మీరునాకు ఒక్కొక్కరూ ఒక గడ్డిమోపు చొప్పున వెయ్యాలి. నా మోపులమ్ముడయ్యే వరకూ మీరెవరూ మీ గడ్డిమోపులమ్మకూడదు. ఇదే మీరు నాకు చేయవలసిన సాయం అన్నాడు. వాళ్ళంగీకరించారు.

మరునాడు గుర్రాల వర్తకుడు వచ్చాడు. ఆ గుర్రాలకి గడ్డి కావాలి. కాని, ఆ యువకుడి దగ్గర తప్ప నగరంలో మరెక్కడా గడ్డి దొరకలేదు. అందుచేత తన 500 గుర్రాలకి అతనివద్దనున్న 500 గడ్డిమోపులని 1000 నాణాలిచ్చి కొనవలసివచ్చింది. ఇది జరిగిన కొద్ది రోజులకే మరొక వర్తకుడు యువకుడితో 'రేవులోకి ఒక గొప్ప నావ వచ్చింది' అని చెప్పాడు. ఆ మాటలతో యువకుడికొక ఉపాయము తట్టింది. అతను చక్కగా అలంకరించబడిన బండి నొకదానిని గంటకింత అని అద్దెకు తీసుకొని ఒక నావను కొని దగ్గరలో ఒక మంటపం నిర్మించి లోపల తాను కూర్చొని తన పరివారంతో 'బయటినుండి వర్తకులు వచ్చినప్పుడు వరసగా మీ ముగ్గురు వారిని నా దగ్గరకు తీసుకురండి'. అన్నాడు. రేవులోకి నౌక వచ్చిందని విని వారణాసి నుండి 100 మంది వర్తకులు సరుకులు కొనడానికి వచ్చారు. కాని... అంతకు ముందే సరుకంతా యువకుడు నియమించిన ముగ్గురూ వారినతని వద్దకు వెళ్ళబోయారు. యువకుడు నియమించిన ముగ్గురూ వారినతని వద్దకు తీసుకువెళ్ళారు. బేరసారాల పిమ్మట వర్తకులొక్కక్కరూ నౌకలో భాగమునకు వెయ్యిచొప్పున సరుకుకి వెయ్యిచొప్పునా నాణాలిచ్చారు. ఈ విధంగా ఆ యువకుడు రెండు లక్షలతో వారణాసికి తిరిగి వచ్చాడు . మర్నాడతను లక్ష నాణాలతో కృతజ్ఞతలు తెలిపేందుకు చిన్ని శ్రేష్టి వద్దకు వెళ్ళాడు. అప్పుడు శ్రేష్టి 'నాయనా! నీకీ ధనమెలా వచ్చింది?' అని అడిగాడు. మీరిచ్చిన ఉపదేశమువలననే వచ్చింది. ఆరు మాసములలో యిదంతయూ నాకు లభించింది'. అన్నాడు యువకుడు వినయంగా.

వివరంగా చెప్పు అన్నాడు శ్రేష్టి. చచ్చిపోయిన ఎలుక, శ్రేష్టి మాటలు మొదలుకొని జరిగినదంతా వివరంగా చెప్పాడా యువకుడు. అది విన్న శ్రేష్టి ఆనందానికి మేరలేకపోయింది. ఇతన్ని యితరుల చేతిలో పడనివ్వకూడదు అనుకూడదు అనుకున్నాడు. అంతలోనే అతనికి తన పుత్రిక జ్ఞాపకం వచ్చింది. ఆమె పెళ్ళికెదిగి ఉంది. యువకడు అవివాహితుడు, ఇంకేంకావాలి? ఆ శ్రేష్టి అతనికి తన పుత్రికనిచ్చి తొందరలో వివాహం చేసేశాడు. పుత్రికతోపాటు తన సర్వసంపదని అతనికిచ్చాడు. ఆ శ్రేష్టి మరణానంతరం యువకుడు శ్రేష్టి పదవిని పొందాడు.

నీతి: బుద్దిసూక్ష్మత, చతురత ఉంటే అతి తక్కువ పెట్టుబడితో కూడా చక్కగా వ్యాపారం చేసి తన సంపదని పెంచుకోవచ్చు.
====================================================================

ప్రాణం తీసిన గొప్ప

అది ఒక పెద్ద చెట్టు. దాని మొదలు దగ్గర కొన్ని రకాల రెక్కల పురుగులు చేరి, కబుర్లాడు కొంటున్నాయి. ఆ కబుర్లు పెరిగి పెరిగి, చివరికి మనలో ఎవరుగొప్ప? అనే వివాదానికి వచ్చింది!

ఆ పురుగులలో ఒక రెక్కల చీమ గబగబా ముందుకు వచ్చి చూడండి! నేను నేలమీద పాకగలను, గాలిలో ఎగరగలను 'నేనే గొప్ప' అంటూ అటూ ఇటూ తిరిగింది చరచరా! అది చూసి ఒక చీకురు పురుగు తన పెద్ద రెక్కలను ఆడిస్తూ చూడండి నా రెక్కలు ఎంత పెద్దవో, మీలో ఇంతంత పెద్ద రెక్కలు ఎవరికీ లేవు 'నేనే గొప్ప' అంది గర్వంగా, తన రెక్కలను చూసుకొంటూ, చూపిస్తూనూ!

ఇలా అన్ని పురుగులూ ఏవేవో గొప్పలు చెప్పుకొంటుంటే, ఓ మిణుగురు పురుగు చరచరా ముందుకు వచ్చి వూరుకోండి, లేనిపోని గొప్పలు చెప్పుకోకండి నన్ను చూడండి! నేను నేల మీద పాకగలను, గాలిలో ఎగరగలను. అంతే కాదు మీలో ఎవరికీ లేని గొప్పదనము నాకున్నది. నేను మిలమిలా మెరిశానంటే నక్షత్రంగా వుంటాను. "ఆకాశం నుండి ఓ తార దిగి వచ్చింది కాబోలూ" అనుకొంటారు అందరూ! నన్ను చూసి, ఎంత అందంగా వుందో అని అందరూ ముచ్చటపడతారు.అంటూ గిర్రున తిరిగి మిలమిల మెరిసి పోయింది.

మిణుగురు పురుగు మెరుపులు చూసి చూసి మిగిలిన రెక్కల పురుగులు నివ్వెర పోయాయి. ఏమీ మాట్లాడలేక కళ్ళప్పగించి వూరుకొన్నాయి. మిణుగురు పురుగు వయ్యారంగా గాలిలో ఎగురుతూ మెరుస్తూ వుంటే, బంగారు పిచ్చుక చూసి, రివ్వున చక్కా వచ్చి, ఆ మిణుగురు పురుగును ముక్కుతో కరచుకొని, చెట్టుమీద ఓ కొమ్మకు కట్టుకొని ఉన్న తన గూటిలోని మట్టి ముద్దకు అంటించి, నొక్కేసింది. కాళ్ళు రెక్కలు మట్టిముద్దకు అంటుకు పోవడం వల్ల, మిణుగురు పురుగు కదలలేక పోయినది. ఎగరలేక పోయినది.

ఇది చూసి రెక్కల పురుగులన్నీ హడలిపోయాయి. అంతలో చీకురు పురుగు "చూశారా? నక్షత్రంలా మిలమిల మెరిసే శక్తి నాకేవుంది" అంటూ గర్వంగా ఎగిరెగిరిపడిన మిణుగురు పురుగు గతి ఏమైందో! దానిని చూసి మనం బుద్దితెచ్చుకోవాలి. నేనే గొప్ప, నేనే గొప్ప అని విర్రవీగకుండా నడుచుకోవాలి" అనుకొంటూ, అటూ ఇటూ వెళ్ళిపోయాయి.
===========================================================

ప్రాణం తీసిన దురాశ

సంస్కృత భాషలో అద్భుతమైన నీతి కథలను, నీతి చంద్రిక, పంచతంత్రము, హితోపదేశము మొదలైన పేర్లతో లోకానుభవంతో పండిన మహానుభావులు రచించారు. హితోపదేశం - మిత్రలాభంలో నారాయణకవి చెప్పిన గొప్ప నీతి వున్న చిన్న కథ ఒకటి ఉంది.

వింధ్యారణ్య ప్రాంతంలో భైరవుడు అనే పేరుగల వేటగాడు ఉండేవాడు. రోజూ అడవికి వెళ్ళి, రకరకాల ఆహారపదార్థాలను సేకరించి, వాటితో తన కుటుంబాన్ని పోషించేవాడు. అడవిలో దొరకనిదేముంది? ఆకులు, దుంపలు, కాయలు, పండ్లు, తేనె, వెదురు బియ్యం ఇలా ఎన్నో లభిస్తాయి. కాని, ఈ శాఖాహారం కంటే కుందేలు, జింక, అడవి పంది వంటి జంతువుల మాంసాహారమే ఈ వేటగాళ్ళు ఇష్టపడతారు. భైరవుడు ఒకనాడు ఒక బలసిన జింకను వేటాడి చంపాడు. ఇంటిల్లిపాదీ ఆనందంగా విందు చేసుకోవచ్చుననుకుంటూ, దానిని భుజంపైన వేసుకొని తన ఇంటి దారి పట్టాడు. అయితే ఆ అడవి మార్గంలో అతనికి అనుకోకుండా బాగా మదించి, కోరలు ఉన్న అడవి పంది కనిపించింది.

భైరవుడు తన భుజం మీది జింక శవాన్ని నేలపైకి దించి, తన విల్లమ్ములు తీసుకున్నాడు. పదునైన బాణంతో ఆ అడవి పంది రొమ్మును గాయపరిచాడు. అడవి పందులకు కోపం మొండితనం ఎక్కువ. వేటగాడి బాణం వెనుదిరిగి వచ్చిందా అన్నట్లు, అది అతి వేగంగా వచ్చి, భైరవుని పొట్టను కోరలతో చీల్చి చంపింది. తర్వాత, అదీ చచ్చింది. వీరి తొక్కిసలాటలో ఆటుగా వచ్చిన పాము కూడా, ప్రాణాలు విడిచింది.

ఇంతలో క్షుద్రబుద్ధి అనే నక్క ఆహారం వెదకుతూ అటుకేసి వచ్చింది. చచ్చిపడి ఉన్న వేటగాడు, జింక, పంది, పాము దానికి కన్నుల విందుగా కనిపించాయి. నక్కలు స్వయంగా వేటాడలేవు. పులి, సింహం లాంటి జంతువులు చంపి తిని వదలిన అవశేషాలను, జీవుల శవాలను తిని తృప్తి పడతాయి. అందుకే ఒకేసారి నాలుగు శవాలు కనిపించే సరికి క్షుద్రబుద్ధి ఎగిరి గంతులు వేసింది. నక్క ఇలా ఆలోచించింది "ఈ మనిషి శవం ఒక మాసం పాటు తినొచ్చు. జింక, పంది శవాలను రెండు నెలల పాటు భోంచేయవచ్చు. ఈ పాము తలను తీసేసి ఒక రోజంతా కడుపునింపుకోవచ్చు. అంటే మూడు నెలల ఒక్క రోజు పాటు ఆహారం గురించి వెదికే పనే లేదన్నమాట. మరి ఈ పూట మాటేమిటి? ఆ! ఈ వేటగాని ధనుస్సుకు కట్టివున్న కమ్మని వాసన వేస్తున్న, నరాలతో చేసిన అల్లెత్రాటిని తింటే సరిపోతుంది."

క్షుద్రబుద్ధి వింటిని సమీపించి, లాగి బిగించి ఉన్న దాని నరాలతో చేసిన అల్లెత్రాడును కొరికింది. అంతే! పదునైన వింటి కోపు దాని శరీరంలో గుచ్చుకుని, తన దురాశకు చింతిస్తూ క్షుద్రబుద్ధి ప్రాణాలు విడిచింది. ఇప్పుడక్కడ ఐదు శవాలు పడి ఉన్నాయి.

భైరవుడు ఒక మృగము చాలదని మరో దాన్ని వేటాడబోయి చచ్చాడు. క్షుద్రబుద్ధిఎటువంటి కష్టం లేకుండా మూడు నెలల పాటు తిండి దొరికించుకుని కూడా పేరుకు తగినట్లు పిసినారి తనంతో వింటినారిని కొరికి, తానూ శవంగా మారింది. అందుకే అత్యాశ మంచిది కాదు. మానవుడు ఆశాజీవి. కానీ దురాశకు పోతే దుఃఖమే మిగులుతుంది.
==========================================================

ప్రాణం తీసిన దొంగతనం

కోటయ్యకు చిల్లర దొంగతనాలు చేయడం అలవాటు. తన దొంగతనాలకు బాగా ఉపయోగపడుతుందని తోచి, ఓ కోతిని తీసుకు వచ్చాడు. తన దొంగ విద్యలన్నిటినీ ఆ కోతికి బాగా నేర్పాడు. ఆ కోతి అలికిడి కాకుండా దొడ్డి గోడలు ఎక్కి, లోపల వున్న విలువైన వస్తువులను తీసుకువచ్చి ఇస్తూవుండేది. ఆ వస్తువులను అమ్మి కోటయ్య సొమ్ము చేసుకొంటూ వుండేవాడు.

ఇలా ఉండగా ఊరిలోని దేవాలయంలో వున్న కొబ్బరి చెట్ల మీద కోటయ్య కన్ను పడింది. ఆ కొబ్బరి చెట్లు చాలా పొడుగైనవి. ఆకాశంలో మబ్బులను అందుకొనేటంత ఎత్తయిన ఆ చెట్ల కాయలను కోయడానికి ఎవరికీ ధైర్యం చాలదు. అందుచేత ఎవ్వరూ ఆ చెట్లను ఎక్కరు. కోసే వారు లేకపోవడంవల్ల, గుత్తులు గుత్తులుగా కాయలతో కొబ్బరి గెలలు వేలాడుతూ వుంటాయి.

కోటయ్య కొబ్బరిచెట్టు దగ్గరకు కోతిని తీసుకువచ్చి సంజ్ఞ చేశాడు. చర చరా చెట్టు ఎక్కి మొవ్వులో కూర్చుని, కోతి ఒక్కొక్క కాయనే తుంచి కింద పడవేయడం మొదలు పెట్టింది. కిందపడిన కాయలను ఆదరాబాదరా ఏరుకొంటూ, పోగుచేస్తూ, కోటయ్య, తల పైకెత్తి చూడటం మరిచి పోయాడు. అంతలో రెండు కొబ్బరి కాయలు అతని నడి నెత్తి మీద పడ్డాయి. ఎంతో ఎత్తు నుండి పడినందువల్ల, ఆ దెబ్బకు తల పగిలి రక్తం కక్కుకొంటూ, గిలగిల తన్నుకొని, కోటయ్య కన్ను మూశాడు!

కొబ్బరికాయలు పడుతున్న చప్పుడు విని పూజారి గబగబా వచ్చాడు. కొబ్బరి చెట్టు కింద కోటయ్యను, పైన కోతి చూసి ఆశ్చర్యపోయాడు!"తాను దొంగతనాలు చేయడమే గాక, కోతికి కూడా ఆ విద్య నేర్పాడు దురలవాటు నేర్వడం, నేర్పటం సుళువే కాని, ఒక్కొక్కప్పుడు ఆ దురలవాటు ప్రాణాలు తీస్తుంది కదా" అనుకొంటూ నిలబడి పోయాడు ఆ పూజారి నిశ్చేష్టుడై...!
=========================================================================

ప్రాప్తం

రామయ్య కోమటి దగ్గర గుమస్తాగా వుండేవాడు. అతనికి కొత్తగా పెళ్ళి అయింది. భార్య అందగత్తె, చదువుకున్నది. తెలివితేటలుగలది. కట్నము లేకపోయినా చేసుకున్నాడు. ఒక రోజు నిద్రలేస్తూనే కళ్ళు తెరవగానే లక్ష్మీ దేవిలా అలంకరించుకొని భార్య కనిపించింది. నిద్రలేస్తూనే నీ ముఖం చూశాను. ఈ రోజు ఎలా వుంటుందో అన్నాడు. ఆమె చిరునవ్వి నా ముఖం చూసినవారికి మంచే జరుగుతుంది అన్నది. తన భార్య మాట ఎంతవరకు నిజమవుతుందోనని ఆలోచిస్తూ తన కాలకృత్యములు తీర్చుకొని షాపుకి వెళ్ళాడు.

రామయ్యకి ముందు వెనుకా ఎవరూ లేరు. తల్లీ, తండ్రీ చనిపోతే దిక్కులేని వాణ్ణి ఒక అవ్వ చేరదీసింది. తన మనుమడిలా వున్నావని చెప్పి పెంచి పెద్ద చేసింది. ఆ అవ్వని వదిలి పట్నం వచ్చేశాడు. అవ్వని చూడాలనిపించినా తనుకూడా వస్తానంటుందేమోనని వెళ్ళడం మానివేశాడు. ఆ ఆలోచనలతో పరధ్యానంగానే షాపు దాటి ముందుకు వెళ్ళి తర్వాత వెనక్కి వెళ్ళాడు. షాపులోకి వెళ్ళిన తర్వాత షావుకారు కోపంగా వున్నాడు. ఆలస్యంగా వచ్చినందుకు చర్రుబుర్రులాడాడు. బేరాలు కూడా సరిగాలేవు. షాపు కట్టేసి ఇంటికి వస్తూండగా కొందరు అవ్వ వూరివారు గుర్తుపట్టి పిలిచారు. రామయ్యా అవ్వ నీ మీద బెంగతో మంచం పట్టింది. నిన్నే తలస్తుంది. అవ్వకి ఇంట్లో బంగారముతో లంకెబిందెలు దొరికాయి. మంచి యిల్లు కట్టుకొని పొలముగట్రాకొంది. నిన్ను కలవరిస్తూ మనవూరి వాళ్ళను తలాదిక్కుకు పంపిందిరా అన్నారు.

ఇంటికి వెళ్ళి భార్యను వెంటబెట్టుకొని ఆ గ్రామము వెళ్ళాడు. అవ్వ మంచం మీద నుండి లేచి మనవణ్ణి ఆప్యాయంగా నిమిరింది. అతని భార్యను చూసి మురిసిపోతూ అమ్మాయి! మీరిద్దరూ ఇక్కడే ఉండండి. నన్ను వంటరిదాన్ని చేసి వెళ్ళకండి అని చెప్పింది. రామయ్య అవ్వదగ్గరే వుండి వ్యవసాయము చేసుకోసాగాడు. కొంతకాలానికి రామయ్య భార్య ప్రసవించి మగపిల్లవాణ్ణి కని గారాబంగా పెంచసాగింది. రామయ్య సంసారం సుఖ సంతోషాలతో ఆనందముగా గడిచింది.
====================================================

బంగారు ఊయల

అనగనగా ఒక ఊరు. ఆ ఊరు చుట్టూరా పెద్ద అడవి. ఆ ఊరిలో రామయ్య అనే రైతు ఉన్నాడు. ఆయనికి ఒక చిన్నారి కూతురు ఉంది. ఆ అమ్మాయి ఒంటి రంగు బంగారంలా ఉంది. తండ్రి సువర్ణ అని పిలిచేవాడు. సువర్ణకి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. రామయ్య రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఆమె పేరు మందర. సువర్ణని చూసి అసూయ పడేది. మందరమ్మకి ఒక కూతురు పుట్టింది. ఆ పిల్ల పేరు ఆశ. ఆశకి బొమ్మలు తనకే కావాలి. మిఠాయి అంతా తనే తినాలి. గౌన్లు అన్నీ తనవే అనేది. పాపం! సువర్ణ ఎంత పని చేసినా, మందరమ్మ తిడుతూ, కొడుతూ ఉండేది. చిరిగిన గౌన్లు ఇచ్చేది. సరిగ్గా అన్నం పెట్టేది కాదు. ఆశకి తల్లి పోలిక వచ్చింది. శరీరం నల్లటి నలుపు రంగు. ఇంటికి వచ్చిన అందరూ సువర్ణని చూసి "బంగారు బొమ్మలా ఉందమ్మా" అని మెచ్చుకుంటుంటే, మందరమ్మ, చూసి పళ్ళునూరేది! మందరమ్మ అసూయ, కోపంతో, సువర్ణని ఎండలో పనిచేయించేది! అలా ఎండలో పనిచేస్తే ఆమె శరీర రంగు నల్లగా మారుతుందని. మందరమ్మ సువర్ణకి అన్నం పెట్టేది కాదు. పని చేసి అలసిపోయి, పశువుల పాకలో కూర్చుంది. సువర్ణని చూసి చీమలు జట్టుగా వంట ఇంటిలోనికి వెళ్ళాయి. రొట్టె ముక్కలు తెచ్చి సువర్ణకి ఇచ్చి వెళ్ళిపోయేవి. పెంపుడు చిలక రివ్వున ఎగిరి వెళ్ళి జామకాయలు తెచ్చి, సువర్ణ ఒడిలో పడేసేది. సువర్ణ అడవిలోకి వచ్చింది. వెంట కుక్క పిల్ల కూడా వచ్చింది. తోడుగా రామచిలక కూడా ఎగురుతూ వచ్చింది. సువర్ణకి అడవిలో నడిచి, నడిచి, ఆకలివేసింది. దాహం వేసి అలిసిపోయి మూర్చపోయింది. కుక్క పిల్ల పరుగెత్తుకు వెళ్ళి అడవిలో ఉండే అవ్వని తీసుకు వచ్చింది. అవ్వ సువర్ణ ముఖం మీద నీళ్ళు జల్లి లేపింది

బంగారు ఊయలఅవ్వ సువర్ణతో, తన ఇంట్లో పనిచేస్తే "మంచి కానుక" ఇస్తానని చెప్పింది. సువర్ణ పని చేయసాగింది. సువర్ణ సోమరిపోతు కాదు! ప్రతి పనీ ఎంతో శ్రద్దగా, కష్టపడి చేస్తుంది! ఎవ్వరితోనూ పోట్లాడదు. ఒకసారి అవ్వ అడవిలోకి వెళుతూ, గది నిండా బంగారు నగలు పెట్టి, తలుపులు వేయకుండా వెళ్ళిపోయింది! సాయంత్రం అవ్వ తిరిగి వచ్చి నగలు చూసింది! అందులో ఒక్క నగ కూడా పోలేదు. మర్నాడు అవ్వ మళ్ళీ, వంట ఇంటి నిండా రకరకాల మిఠాయిలు పెట్టి తలుపు తెరచి వెళ్ళిపోయింది. సాయంత్రం వచ్చింది! ఒక్క మిఠాయి కూడా పోలేదు. సువర్ణ తనకి ఇచ్చిన రొట్టె ముక్కని మాత్రమే తిని ఊరుకుంది. ఇంటికి తిరిగి వచ్చేసరికి అన్నీ అలాగే ఉన్నాయి. సువర్ణ చినిగిన గౌనుతో ఉన్నా ఒక్క గౌను కూడా దొంగతనం చేయలేదు. అవ్వకి చాలా ఆనందం కలిగింది. పరుల సొమ్ముకి ఆశపడనివారే, ఇతరులకు చాలా మేలు చేస్తారు! మన సువర్ణ కూడా అలాంటి మంచి మనిషి! అవ్వ సువర్ణకి తలంటి పోసింది. కొత్త గౌను తొడిగింది. మిఠాయిలు పెట్టింది. నగలు యిచ్చింది! అంతేకాదు. తర్వాత తన దగ్గర ఉన్న ఒక కొరడా తీసి ఝుళిపించింది. వెంటనే అక్కడ గాలికి చిరు గంటలు శబ్దం చేస్తుండగా, ఒక చక్కటి బంగారు ఊయల ధగ ధగ మెరుస్తూ ప్రత్యక్షం అయింది.

అవ్వ సువర్ణని చేయిపట్టుకొని ఆ ఊయలలో కూర్చోపెట్టింది! "అమ్మాయి! నువ్వు చాలా మంచి పిల్లవి! నీకు నేను ఈ 'కొరడా' కానుకగా ఇస్తాను. నువ్వు వెళ్ళి మీ ఊరిలో నున్న వారందరికి ఈ ఊయలలో కూర్చొని సాయం చెయ్యి. నువ్వు యీ 'ఊయల'లో కూర్చొని ఏది కోరితే, అది నీ దగ్గరకు వస్తుంది" అంటూ సువర్ణ చేతకి కొరడా అందించింది. సువర్ణ కళ్ళు మూసుకొని, 'చక్కటి గౌను ఒకటి కావాలి' అనుకుంది. వెంటనే గౌను ఆమె ఒడిలో ఉంది! సువర్ణ ఇంటికి తిరిగి వచ్చింది. వానలు లేక ఊరిలో కరువుతో బాధపడుతున్నారు. సువర్ణ కొరడాతో బంగారు ఊయల ప్రత్యక్షం చేసింది. దానితో కరువు కాటకం తీరింది. అందరూ సువర్ణని "బంగారు తల్లి" అని ఆశీర్వదించి వెళ్ళారు. ఇది చూసి మందరమ్మకు చాలా ఆశ పుట్టింది. సువర్ణను చంపేసి ఆ 'కొరడా' తీసుకోవాలని అనుకుంది. 'నాకు ఒకసారి ఆ కొరడా ఇవ్వమ్మా' అంది ప్రేమగా. సువర్ణ ఇచ్చింది. మందరమ్మ ఆశని ఒడిలో కూర్చోపెట్టుకొని ఊయలలో కూర్చుంది! అంతే!

ఒక్కసారి ఊయల ఇనుపముళ్ళతో మందరమ్మని బంధించివేసిది. అడుగున రంపపు మొనలు, చుట్టూరా మంటలు! ఆమె అందులో కాలిపోయింది. "అమ్మాయి! ఈ బంగారు ఊయల మంచి వాళ్ళ కోసమే!" చెడ్డవాళ్ళు ఇందులో కూర్చుంటే, వారికి ఇదే 'శాస్తి!' అని చెప్పి మాయమైంది. ఇది చూసి ఆ ఊరిలో అందరూ, చెడ్డ బుద్దులు మానేసి, మంచి నడవడికతో నడుచుకున్నారు!
===============================================================

బాలుడు - తోటకూర


ఒక గ్రామములో సుశీల అనే ఆమెకి, సురేష్ అనే కొడుకు ఉన్నాడు. అతను చిన్నతనములో ఒకనాడు పక్కవారింటిలో నుంచి తోటకూర దొంగిలించి తీసుకొచ్చి తల్లికి ఇచ్చెను. దానికి ఆమె ఆప్యాయంగా కౌగిలించుకొని మానాయనె! అని మెచ్చుకొన్నది. అది ఏదో ఘనకార్యము అన్నట్లుగా ఆ పిల్లవాడు చాలాబాగున్నదని తలచి ఇరుగుపొరుగు వాళ్ళ ఇంటిలో నుంచి వస్తువులు తీసుకురావడము మొదలుపెట్టాడు. తల్లి తప్పని కూడా మందలించలేదు. అదే అవకాశంగా తీసుకొని రోజూ స్కూలులో, తనతోటి పిల్లల దగ్గర పెన్ను గానీ, పెన్సిల్ గానీ, పుస్తకం గానీ, దొంగతనముగా తీసుకురావడము మొదలు పెట్టాడు. క్రమంగా పెరిగి పెద్దవాడైయ్యేటప్పటికి గజదొంగగా మారి అనేక వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ఒక రోజు రక్షక భటులు ఇతన్ని పట్టుకొనిపోవుచూండగా అతని తల్లి "అయ్యో! తోటకూర నాడే ఇది తప్పని చెప్పలేక పొయానే! చెప్పినట్లయితే తన కొడుకు ఇలాంటి వాడు కాక పోవును కదా" అని దుఖించింది. కావున ఎప్పుడూ దొంగతనము చేయరాదు.
==================================================================

బుద్ధి బలం

పూర్వం బ్రహ్మపుత్ర నదీతీరంలో దట్టమైన అరణ్యం ఉండేది. దాంట్లో రకరకాల క్రిమికీటకాలు, జంతువులు సుఖంగా జీవిస్తూ ఉండేవి. ఆ వనంలో కర్పూర తిలకం అనే పెద్ద ఏనుగు కూడా ఉండేది. అది కదలివస్తుంటే చిన్న కొండ నడిచివస్తోందా అన్నట్లుండేది. దాని భారీ కాయాన్ని, శక్తిని చూచి చిన్న చిన్న జంతువులు భయముతో గజగజలాడేవి. పొడుగైన దాని దంతాలు తగిలీ, దాని అడుగుల కింద పడీ చిన్న జంతువులు చాలా వరకు నశించాయి. కొన్ని అడవిని వదిలి వేరే చోటికి వలసవెళ్ళాయి. చిన్న జంతువులు లేకపోవడంతో వనంలోని నక్కలకు ఆహారం కరువయింది. ఒకటొకటిగా మరణించసాగాయి. తమజాతి అంతరించిపోతుందేమోననే భయముతో ఒక రోజు నక్కలన్నీ సమావేశం అయ్యాయి.

ఈ ఏనుగు చస్తే మనకు కొన్ని నెలల దాకా తిండికి లోటు ఉండదు. ఇది చచ్చిందని తెలిస్తే పారిపోయిన జంతువులు కూడా తిరిగి వస్తాయి. మనకు కడుపునిండా భోజనం దొరుకుతుంది" అన్నది ఒక కుంటి నక్క. "నేను చంపుతా" అంటూ లేచింది ఒక పిల్లనక్క దాని మాటలు విని నక్కలన్నీ ఫక్కున నవ్వాయి. "ఇది ఆడుకొనే ఏనుగు అనుకొన్నావా? కాదు. దీన్ని చంపడం మాకే చేతకాదు. నీవేం చేస్తావు? వెళ్ళి ఆడుకో" అన్నది మరొక నక్క. వాళ్ళ మాటలు వినగానే నక్క పిల్లకు కోపం వచ్చింది. అయినా బయటపడకుండా "వయసును, శరీరాన్ని చూసి మీరు తెలివితేటల్ని లెక్కించడం సరి కాదు. నాకు అవకాశం ఇస్తే నా ప్రతిభ చూపిస్తా" అంది నక్కపిల్ల. ఆ మాటలు విన్న ముసలి నక్క "సరే! చూద్దాం! కానీ!" అన్నాయి.

మరునాడు పొద్దున్నే నక్కపిల్ల గజరాజు దగ్గరకు వెళ్ళింది. సాష్టాంగ నమస్కారం చేసి "మహారాజుకు జయము! జయము! అంటూ వినయంగా నిలుచుంది. మహారాజు అని తనను పోల్చేసరికి దంతికి ఆశ్చర్యం వేసింది. "ఎవరు నువ్వు" అంది బిగ్గరుగా. "ప్రభూ నేను నక్క పిల్లను. అందరూ నన్ను బుద్ధిజీవి అంటారు. మృగరాజు సింహం ముసలిదై ఎక్కడో మూలనపడి ఉంటోంది. మహారాజు గుణాలన్ని మీలో ఉన్నాయి, కాబట్టి మహారాజా! అని పిలిచాను. ఈ అడవికి మిమ్ముల్ని రాజుని చేసేందుకు తీసుకురమ్మని జంతువులు నన్ను పంపాయి. బయల్దేరండి" అంది నక్క పిల్ల.

ఏనుగుకు ఎక్కడలేని సంతోషం కలిగింది. "ఎంతదూరం వెళ్ళాలి మనం" అని గర్వంగా అడిగింది. "దగ్గరే. నాతోరండి స్వామీ!" అంటూ జిత్తులమారి నక్కపిల్ల ఒక ఊబి వైపుగా ముందు నడవసాగింది. దాని వెనకే రాచఠీవితో మాతంగం నడవసాగింది. రాజునవుతాననే ఆనందంతో కలులు కంటూ అడుగులేస్తున్న ద్విరదం హఠాత్తుగా ఊబిలో దిగబడింది. తెలివి తెచ్చుకొని "కాపాడండి! కాపాడండి" అని అరవసాగింది.

"ప్రభూ! జిత్తులమారినైన నన్ను నమ్మి వచ్చినందుకు మీకిది ఫలితం. ఇప్పుడు పశ్చాత్తాపపడి ప్రయోజనం లేదు" అంది నక్కపిల్ల. ఏనుగు కేకలు విని అక్కడకు జంతువులు చేరే సరికే ఏనుగు పూర్తిగా ఊబిలో మునిగిపోయింది. అన్నీ నక్క పిల్ల తెలివితేటల్ని మెచ్చుకున్నాయి.

నీతి: శరీరబలం కంటే బుద్ధిబలం మిన్న.
============================================================

మంచి మిత్రుడు (పావురం - ఎలుక)

పూర్వం గోదావరి నదీ తీరంలో ఓ పెద్ద బూరుగు చెట్టు ఉండేది. ఆకాశమును తాకుచున్నదా అన్నంత ఎత్తుగా విశాలంగా పరుచుకున్న కొమ్మలతో కళకళలాడుతూ ఉండే ఆ చెట్టు మీద ఎన్నో రకాల పక్షులు గూళ్ళు కట్టుకుని జీవిస్తున్నాయి. ఒకరోజు ఉదయం ఆ చెట్టు మీద నివసిస్తున్న 'లఘుపతనక' అనే కాకి నిద్రలేస్తూనే కిందకు చూచింది. ఆ చెట్టుకు కొద్ది దూరంలో ఒక వేటగాడు నూకలు చల్లి వలపన్నుతూ కనిపించగానే దానికి భయం వేసింది.

'అయ్యో! పొద్దున్నే నిద్రలేస్తూనే ఈ పాపాత్ముడి మొహం చూసాను. ఈ రోజు నాకు ఏ ఆపద రానున్నదో...' అనుకుంటూ ఆ చెట్టు మీద నుండి రివ్వున ఎగిరిపోయి కొద్ది దూరంలో ఉన్న మరొక చెట్టుపైన వాలి ఆ వేటగాడిని గమనించసాగింది. వల పన్నటం పూర్తిచేసిన వేటగాడు ఆక్కడికి దగ్గరలోనే ఉన్న ఓ పొదలో దాక్కుని వలలో పక్షులు ఎప్పుడు చిక్కుకుంటాయా అని ఎదురుచూస్తున్నాడు.

ఆకాశంలో ఆ చెట్టు వైపుగా ఓ పావురాల గుంపు ఎగురుకుంటూ రాసాగాయి. ఆ పావురాల గుంపుకు 'చిత్రగ్రీవుడు' అనే పావురం రాజు. ఆ బూరుగు చెట్టు దగ్గరకు వస్తూనే ఆకాశంలోంచి నేలమీద వేటగాడు చల్లిన నూకలను గమనించిన చిత్రగ్రీవుడు మిగిలిన పావురములతో 'మిత్రులారా! మనుషులు తిరగని ఈ చోటులో నూకలు ఉన్నాయి కనుక వీటి వెనుక ఏదో మర్మము ఉండి ఉంటుంది. బహుశా ఏ వేటగాడో మనలాంటి పక్షులకోసం పన్నిన వల అయి ఉండవచ్చు. అందుకని మనం ఈ నూకల కోసం ఆశపడి ఆపదను కొనితెచ్చుకోవద్దు' అంటూ హెచ్చరించాడు.

ఆ గుంపులో ఉన్నా ఓ ముసలిపావురం చిత్రగ్రీవుడి మాటలకు నవ్వి 'చిత్రగ్రీవా! నీవు రాజువి అన్న అహంకారం వదిలి నేను చెప్పే మాటలను శాంతంగా విను. అనవసరమైన అనుమానాలతో ఎదుట ఉన్న ఆహారమును కాలదన్నుకొనుట మూర్ఖత్వము. నువ్వే చెప్పావుగా ఈ ప్రదేశములో మనుషులు తిరగరని. మరి ఇలాంటి చోట నూకలు ఉండటం అనుమానించతగ్గ విషయం ఏ మాత్రం కాదు. ఆ బూరుగు చెట్టుమీద నివసించే పక్షులు ఆహారం తెచ్చుకున్నప్పుడు ఆ నూకలు వాటి నుంచి జారిపడి ఉంటాయి. అందుచేత అవితినటానికి మనం క్రిందకు దిగుదాం!' అంటూ చిత్రగ్రీవుడి హెచ్చరికకు అభ్యంతరం చెప్పింది.

ఆ ముసలి పావురం మాటలకు మిగిలిన పావురములు వంత పాడుతున్నట్లుగా ఉండటంతో చిత్రగ్రీవుడు తన మాటలతో ఆ పావురముల మనసు మార్చుట కష్టమని గ్రహించి మౌనంగా ఉండిపోయాడు. చిత్రగ్రీవుడి మౌనం అర్ధాంగీకారంగా భావించిన పావురములన్ని నూకలను తినటానికి నేలమీద వాలి వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోయాయి.

చిత్రగ్రీవుడి మాట వినకుండా ముసలిపావురం మాట విని నూకలకు ఆశపడి ప్రాణాలు మీదకు తెచ్చుకున్నందుకు ఏడుస్తూ ముసలి పావురాన్ని మిగిలిన పావురాలన్నీ కోపంతో తిట్టసాగాయి. చిత్రగ్రీవుడు ఆ పావురాలన్నింటినీ ఓదారిస్తూ 'మిత్రులారా! వివేకవంతుడు కూడా ఒక్కొక్క సారి ఆవేశంవల్ల, దురాశ వల్ల ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు. ఇప్పుడు మనలో మనం గొడవపడితే మంచిదికాదు' అన్నాడు. చిత్రగ్రీవుడి మాటలకు మిగిలిన పావురాలన్ని శాంతించాయి. వలకు కొద్ది దూరంలో ఉన్న పొదలో దాక్కున్న వేటగాడు వలలో చిక్కుకున్న పావురములను చూసి 'ఆహ! పొద్దున్నే ఎవరి మొహం చూసానోగానీ... ఈ రోజు నా పంట పండింది' అనుకుంటూ పొదలోంచి లేచి వలవైపు రాసాగాడు.

వేటగాడిని చిత్రగ్రీవుడు గమనించి 'మిత్రులారా! వేటగాడు వస్తున్నాడు. మనమందరం ఒక్కసారి బలంగా ఆకాశంలోకి ఎగురుదాం అప్పుడు వలతో సహా వేటగాడికి దొరకకుండా ఈ ఆపదను తప్పించుకుంటాం. ఆ తరువాత గండకీ నది ఒడ్డున ఉన్న అడవిలో హిరణ్యకుడు అనే ఎలుక ఉన్నది అతను నాకు మంచి మిత్రుడు, అతని దగ్గరకు వెడదాం ఈ వలను కొరికి మనల్ని రక్షిస్తాడు' అని మిగిలిన పావురములతో చెప్పాడు. చిత్రగ్రీవుడి ఉపాయానికి మిగిలిన పావురాలన్నీ సంతోషించాయి. వేటగాడికి దొరకకుండా తప్పించుకునే మార్గం దొరికినందుకు వాటికి కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది. పావురాలన్నీ ఒక్కసారిగా రెక్కలను టపటపాలాడించాయి. రివ్వుమంటూ వలతో సహా ఆకాశంలోకి వేగంగా ఎగిరిపోయాయి.

వలలో చిక్కుకుని గింజుకుంటున్న పావురాలు ఎక్కడకి పోతాయిలే అని తాపీగా వస్తున్న వేటగాడు ఒక్కసారిగా పావురములన్ని ఆకాశంలోకి ఎగరిపోవటం చూసి కొయ్య బారి పోయాడి. వెంటనే తెలివితెచ్చుకుని ఆకాశంలో పావురాలు ఎగురుతున్న దిక్కువైపు నేలమీద పరుగుపెట్టి కొంత దూరం వెళ్ళి ఆయాసంతో ఆగిపోయి ఇక ముందుకు వెళ్ళలేక తన దురదృష్టానికి ఏడుస్తూ ఇంటి దారి పట్టాడు. పావురములన్ని ఎక్కడా ఆగకుండా ఎగురుతూ విచిత్రవనంలో హిరణ్యకుడు నివశిస్తున్న చెట్టు దగ్గర వాలాయి. పావురముల రెక్కల శబ్ధమునకు భయపడిన హిరణ్యకుడు చెట్టుతొర్రలోపలికి దూరిపోయి భయంతో కూర్చున్నాడు. అప్పుడు చిత్రగ్రీవుడు 'మిత్రమా! నేను చిత్రగ్రీవుడిని' అని చెప్పగానే హిరణ్యకుడు వేగంగా బయటకు వచ్చి చిత్రగ్రీవుడిని చూసి ఆనందపడి ఆ తరువాత చిత్రగ్రీవుడితో పాటు మిగిలిన పావురాలన్ని కూడా వేటగాడు పన్నిన వలలో చిక్కుకున్నాయని తెలుసుకుని బాధ పడ్డాడు.

చిత్రగ్రీవుడు హిరణ్యకుడిని చూసి ఆనందపడి 'మిత్రమా! స్నేహితుడు ఆపదలో ఉన్నపుడు బాధపడేవాడే నిజమైన మిత్రుడు. అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను. ఈ వలతాళ్ళను కొరికి మమ్మల్ని రక్షించు' అన్నాడు. చిత్రగ్రీవుడు మాటలకు హిరణ్యకుడు ఆనందిస్తూ 'మిత్రమా! నీ కోరిక తప్పక మన్నిస్తాను. కాకపోతే నా పళ్ళు చాలా సున్నితమైనవి కనుక ముందు నీ కాళ్ళకున్న తాళ్ళను కొరుకుతాను' అన్నాడు. హిరణ్యకుడి మాటలకు చిత్రగ్రీవుడు నవ్వి... ' అలాగే కానివ్వు మిత్రమా! కాకపోతే ముందుగా ఈ పావురములకున్న తాళ్ళను కొరికి ఆ తరువాత నా కాళ్ళకున్న తాళ్ళను కొరుకు' అన్నాడు.

'చిత్రగ్రీవా! తనకు మాలిన ధర్మము మొదలు చెడ్డబేరము' అన్నాడు హిరణ్యకుడు. 'హిరణ్యకా... మనలని నమ్మిన వారిని రక్షించుట మన ధర్మం. అదే న్యాయం, అందుకే ముందు ఈ పావురాలని రక్షించి ఆ తరువాత నన్ను రక్షించు. 'చిత్రగ్రీవుడి మాటలకు నిజమును గ్రహించిన హిరణ్యకుడు తన పళ్ళతో అన్ని పావురముల బంధములను కొరికి వాటిని రక్షించెను.

చూసారా! ప్రతివారికీ అపద సమయంలో ఆదుకొనుటకు ఓ మంచి మిత్రుడు ఉండాలి. 'మిత్రలాభము కంటే మించిన లాభము లేదు' అన్నది ఈ కధలోని నీతి. నాలుగు రూపాయలను వెనకేసుకోవటం కంటే నలుగురు మిత్రులను సంపాయించుకున్నవాడే నిజమైన ధనవంతుడు, గుణవంతుడు అని చెప్పటం కూడా ఈ కధలోని ఉద్దేశం.
=======================================

మర్యాదరామన్న కథలు


సుబ్బన్న, ముత్యాలమ్మ దంపతులకు చాలా ఏళ్ళుగా సంతానం లేక పుణ్య క్షేత్రాలన్నీ తిరుగుతూ భద్రాద్రి రాముని దర్శనం చేసుకున్నారు. శ్రీరాముని వరప్రసాదంలా చిట్టడవిలో ఒక పిల్లవాడు దొరికాడు - ఆ గొర్రెల కాపరి దంపతులకు, రామన్న అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. రామన్నకు వయసు పెరిగినా, బుద్ధి వికసించలేదు. చదువు అబ్బలేదు. కులవృత్తి అయిన గొర్రెలు కాచుకు రమ్మని అడవికి పంపితే, అతడి అమాయకత్వం వల్ల దొంగలు గొర్రెల్ని తోలుకుపోయారు. తండ్రి "నీ మొహం చూపించ వద్ద" ని వెళ్ళగొట్టాడు. రాత్రయింది. అక్కడే అడవిలోని పాడుబడ్డ గుడిలో తలదాచుకున్నాడు. అమ్మవారి అనుగ్రహంతో రామన్నకి అఖండమైన తెలివితేటలు లభించాయి. "అదృష్టం నిన్ను వరిస్తుంది. నువ్వు ఏదంటే అది జరిగి తీరుతుంది" అని, వరం ఇచ్చింది కాళికాదేవి. ఒక వృద్ధ పండితుని రూపంలో నిజంగానే రామన్నకు అదృష్టం కలిసి వచ్చింది. అప్పటి నుంచీ రామన్న కాస్తా మర్యాద రామన్నగా అందరి మన్ననలూ అందుకోసాగాడు. తల్లిదండ్రులు ఆనందించారు. రామన్నకి ధర్మ బద్ధమైన న్యాయవేత్తగా - తగువుల తీర్పరిగా కొద్ది కాలానికే గొప్ప పేరొచ్చింది. ఒక పేదరాశి పెద్దమ్మకు, నలుగురు దొంగలతో తగువొచ్చింది. అసలు ఒప్పందం ప్రకారం, వాళ్ళెప్పుడో అమెకు దాచమని ఇచ్చిన వెయ్యి వరహాలూ, నలుగురూ కలిసి అడగ వచ్చినప్పుడు మాత్రమే ఇవ్వాలి. బయట మిగతా ముగ్గురు దొంగలు మాట్లాడుకుంటూండగా, వాళ్ళని చూపిస్తూ నలుగో దొంగ, పెద్దమ్మ నుంచి మూట అందుకుని అటునుంచి అటే ఉడాయించాడు.

ఏదో పని మీద రాజధానికి బయల్దేరిన మర్యాద రామన్నతో చెప్పుకుంది పేదరాశి పెద్దమ్మ. దొంగలు ఆమెను న్యాయాధికారి వద్దకు తీసుకు వెళ్ళగా, అతడూ వారినే సమర్ధించిన సంగతీ చెప్పింది. అంతా విని, "ప్రభువులకు పొయ్యేకాలం. రాజోద్యోగి తప్పు చేస్తే, అది ప్రభువు చేసినట్టే" అన్నాడు రామన్న. రాజును తిట్టాడని భటులు రామన్నను బంధించి, కొలువులో హాజరు పెట్టారు. రామన్న తనకు అపచారం చెయ్యలేదని, తీర్పు అతడినే చెప్పమనీ కోరాడు ప్రభువు. ప్రస్తుతం ముగ్గురు దొంగలే ఉన్నారు. వారిలో ఆఖరి వాడిని తీసుకురాగలిగితే, ఒప్పందం ప్రకారం వారికి పెద్దమ్మ వరహాలు చెల్లిస్తుంది అని తీర్పు చెప్పాడు. నాల్గోవాడు దొరకడం కల్ల. అదీ రామన్న యుక్తి. తీర్పు అందరికీ నచ్చింది. ప్రభువు కూడా రామయ్యను తీర్పులు చెప్పే న్యాయాధికారిగా ఉండవలసిందిగా కోరాడు.

శేషయ్య అనే రైతు, పెళ్ళి వేడుకల కోసం, ఖాన్ దగ్గర గుర్రం అద్దెకు తీసుకున్నాడు. దురదృష్టవశాన అది మరణించింది. శేషయ్య గుర్రం ఖరీదు ఇస్తానంటే, ఖాన్ మొండిగా ఆ గుర్రమే తెచ్చిమ్మంటాడు. మర్యాద రామన్న యుక్తిగా ఈ ఫిర్యాదు మర్నాటికి వాయిదా వేశాడు. ఖాన్, మర్నాడొచ్చేటప్పుడు స్వయంగా శేషయ్యను పిలుచుకు రమ్మన్నాడు. ఆ రాత్రి శేషయ్య ఇంట్లో, తలుపు తోయగానే పగిలేలా కుండలు పేర్పించాడు. ఖాన్ వచ్చి తలుపు తోసేసరికి కుండలన్నీ పగిలాయి. తన కుండలే కావాలి అని పేచీతో ఎవరికి వారే న్యాయస్థానానికి వచ్చారు. చనిపోయిన ఆ గుర్రానికీ, పగిలిన ఈ కుండలకీ చెల్లు! ఒకసారి పోయినవి కొన్ని తిరిగి అదే స్థితిలో దొరకవు అని తీర్పు చెప్పి సభాసదులను సంతోషపెట్టాడు మర్యాద రామన్న.

రంగమ్మకీ, గంగమ్మకీ వీశెడు నెయ్యి బాకీ దగ్గర తగువొచ్చింది. రెండు గేదెల పాడి వున్న రంగమ్మ దగ్గర, ఎనిమిది గేదెలకు ఆసామీ అయిన గంగమ్మ వీశెడు నెయ్యి అప్పు తీసుకోవడమా? నిజంగానే ఇది జరిగినా, ఎవరూ రంగమ్మను నమ్మలేదు. పైగా గంగమ్మనే సమర్ధించారు. ఫిర్యాదు దివాణానికి చేరింది. మర్యాద రామన్న తీర్పు మరునాటికి గాని, చెప్పనన్నాడు. ఆ రాత్రి గంగమ్మ ప్రవర్తనను భటులతో ఆరా తీయించి, మర్నాడు ఇద్దరూ రాగానే, చెరో చెంబు నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కోమన్నాడు. రంగమ్మకి ఒక్క చెంబుతో సరిపోయింది. గంగమ్మకి నాలుగు చెంబులు నీళ్ళిచ్చినా, కాళ్ళు పూర్తిగా తడవలేదు. దీనిని బట్టి, రంగమ్మ ఉన్నంతలోనే సర్దుకొని, ఇతరులకు అప్పు ఇవ్వగల స్థితిలో ఉన్నదని, గంగమ్మ దుబారా మనిషి అని తేల్చేశాడు మర్యాదరామన్న. రంగమ్మ దగ్గర గంగమ్మే అప్పు పుచ్చుకున్నదని, మర్యాదగా బాకీ తీర్చకపోతే దండించవలసి ఉంటుందనీ తీర్పు చెప్పి, ప్రశంసలు పొందాడు.

తీర్థ యాత్రలకు వెడుతూ, సూరయ్య పుట్ల కొద్దీ ఇనుమును దాచమని మిత్రుడైన పేరయ్యకు అప్పగించాడు. సూరయ్య వెళ్ళాక, ఇనుము ధర బాగా పెరగడంతో, అదంతా అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు పేరయ్య. సూరయ్య తిరిగి వచ్చి, తన ఇనుము సంగతి అడగ్గా, "అదా! ఇంకెక్కడుంది? ఎలుకలు అంతా ఎప్పుడో తినేశాయి కదా! నేనేం చేసేది?" అంటూ దీర్ఘాలు తీశాడు పేరయ్య. సూరయ్య, మర్యాదరామన్న దగ్గరకెళ్ళి చెప్పాడు. మర్యాదరామన్నకి సూరయ్య చెపుతున్న దాంట్లో అబద్ధం లేదు అనిపించడంతో, పేరయ్య సంగతి ఆరా తీయించాడు. పేరయ్య ఇంటికి వెళ్ళి, పాత స్నేహం ప్రకారం, అతని కొడుకుని విందుకు పిలవమన్నాడు రామన్న. విందుకు వచ్చిన పేరయ్య కొడుకును ఒక గదిలో బంధించేలా చేశాడు. ఎంతకూ కొడుకు రాకపోవడంతో, విందు పేరుతో తన కొడుకును సూరయ్యే ఏదో చేసి ఉంటాడని, నేరుగా ఏమీ అనకుండా, రామన్నకు ఫిర్యాదు చేశాడు. ఇలా జరుగుతుందని రామన్న ఊహించినదే అయింది. సరిగ్గా సూరయ్య అప్పుడే అక్కడకు వచ్చాడు. కొడుకు గురించి రామన్న ఎదుటనే పేరయ్య అడుగ్గా, అతడి కొడుకుని గద్దలు ఎత్తుకు పోయాయి. నేనేం చేసేది అని తొణక్కుండా జవాబు చెప్పాడు సూరయ్య. "ఎంత చోద్యం కాకపోతే, మనిషంత మనిషిని గద్దలు ఎత్తుకు పోవడమా?" అడిగాడు పేరయ్య.

"పుట్ల కొద్దీ ఇనుము మింగేసిన ఎలుకలే ఉన్నప్పుడు, మనుషుల్ని ఎత్తుకుపోయే గద్దలు ఉండడంలో వింతేముంది" అన్నాడు సూరయ్య. తత్తరపోయాడు పేరయ్య. నిజమా? కాదా? ఏమిటి కథ? అని గద్దించాడు మర్యాదరామన్న. తలూపాడు పేరయ్య. సూరయ్య, రామన్నకు దండాలు పెట్టుకుంటూ, అందరితోనూ "ధర్మప్రభువు మర్యాద రామన్న" అని బతికినంత కాలం చెప్పుకుంటూ ఉండేవాడు. రామన్న ఇలాంటి తీర్పులెన్నో ఇచ్చాడు. చరిత్రలో నిలిచిపోయాడు.

No comments: