Thursday, February 24, 2011

నీతి కధలు 9

మారిన మనసు

రామచంద్రయ్య ఆ వూరిలో పెద్ద వ్యాపారస్తుడు. అతనికి పువ్వులంటే చాలా ఇష్టం. అందువలనే ఇంటి చూట్టూ వున్న ఖాళీస్థలంలో రకరకాల పూల మొక్కలను నాటించాడు. ఆ మొక్కల పెంపకం కొరకు రాజయ్య అనే ఓ తోటమాలిని ఏర్పాటు చేసాడు. రాజయ్య సోమరిపోతు. ఆ మొక్కలకు నీరు పోయడానికే చాలా కష్టపడేవాడు.

వేసవికాలం వచ్చింది. దాంతో పాటు ఆ వూరికి నీళ్ళ కరువు వచ్చింది. రామచంద్రయ్య ఇంట్లో వారి ఉపయోగానికే నీరు దొరకడం చాలా కష్టమవసాగింది. అందువలన ఇంట్లోని నీరు మొక్కలకు పోయడానికి ఉండేదికాదు. తోటను గమనించడం రాజయ్య పని. అందువలన అతను మొక్కలకు నీరు కొరకు అక్కడికి మూడు ఫర్లాంగుల దూరంలో వున్న నూతి వద్దకు వెళ్ళిరావలసి వుండేది. అన్ని మొక్కలకు నీరు పోయాలంటే నాలుగు బిందెల నీళ్ళు కావాలి. ఒక్కసారే నాలుగు బిందెలు తీసుకురావడం కష్టం. రెండు బిందెల చొప్పున రెండు సార్లు వెళితేనేగాని, మొక్కలకు నీరు పోయడానికి వీలుపడదు. అంత దూరం నడిచి నీళ్ళు తీసుకురావడం తన శక్తికి మించిన పనవుతుందని అనుకున్నాడు రాజయ్య. రెండు రోజులు కష్టపడి తెచ్చాడు. ఆ పైన అతనికి కష్టమనిపించింది. పని తగ్గించుకోవాలని బుద్ది పుట్టిందతనికి. దాంతో రెండు బిందెల నీళ్ళు తెచ్చి, దాన్నే అన్ని మొక్కలకు కొంచెం, కొంచెం చొప్పున పోశాడు. చూడటానికి నీరు పోసినట్లు అందరికీ తెలుస్తుంది. తక్కువ నీళ్ళు పోశాడని ఎవరికీ తెలియదు. ఒకరోజు రామచంద్రయ్య తన తోటలో పువ్వుల మొక్కలు ఎలా పెరిగాయో చూద్దామని వచ్చాడు. చాలావరకు మొక్కలు వాడిపోయి వున్నాయి. వెంటనే రాజయ్యని పిలిచి, ఏరా! మొక్కలకు నీళ్ళు పోయడం లేదా! అన్నీ వాడిపోయివున్నాయే అని అడిగాడు. రాజయ్య చేతులు కట్టుకొని, అయ్యా! ప్రతిరోజు మూడు ఫర్లాంగుల దూరం వెళ్ళి, నీళ్ళు తీసుకొని వచ్చి మొక్కలకు పోస్తున్నానండీ అన్నాడు.

రామచంద్రయ్యకు అతని మాటలలో నమ్మకం కుదరలేదు. ఒకసారి మొక్కలను చూసి ఆలోచనలో పడి తాను అనుకున్నది సరి అని నిర్ణయానికి వచ్చి, బయటకి వెళ్ళిపోయాడు. వారం రోజులైంది. రాజయ్య, రామచంద్రయ్య ఇంట్లోనే అన్నం తిని అక్కడే వుంటున్నాడు. ఓ రోజు మధ్యాహ్నం ఆకలి వేయగానే కంచం తీసుకొని అమ్మగారి వద్దకు వెళ్ళాడు. రామచంద్రయ్య భార్య, రాజయ్యకి ఎప్పుడూ పెట్టే అన్నం కన్న సగం తగ్గించి అతనికి పెట్టింది. అది గమనించి రాజయ్య అమ్మగారూ అన్నం బాగా తగ్గించారు. ఇంకా అన్నం పెట్టండి అని అడిగాడు. అందుకామె, రాజయ్యా! బియ్యం ధర పెరిగింది. అంచేత అయ్యగారు తగ్గించి వండమన్నారు. అందుకే తక్కువ వండాను అంది.

అది విన్న రాజయ్యకి వళ్ళు మండింది. ఏమీ మాట్లాడకుండా బయటకి వచ్చి అన్నం తిన్నాడు. అరగంట గడిచేసరికి అతనికి ఆకలి మొదలైంది. మొక్కలకు నీళ్ళు పోయాలి. నీరసంతో నీళ్ళు తీసుకురావాలంటే చాలా కష్టమనిపించింది. అయినా తాను పనిచేయక తప్పదు కదా! మనసులో బాధపడుతూ, బిందెతీసుకొని మెల్లగా నడిచివెళ్ళి, నీళ్ళు తీసుకువచ్చి ఎప్పటిలా కొంచెం కొంచెం నీరు చొప్పున మొక్కలకు పోసాడు. అతనికి ఆకలి ఎక్కువకాసాగింది. కానీ యజమానురాలిని అడగడానికి ఆత్మగౌరవం అడ్డువచ్చింది. సాయంత్రం రామచంద్రయ్య ఇంటికి వచ్చాడు. రాజయ్య ఆయన వద్దకు వెళ్ళి అయ్యా! మీరు చేసింది అన్యాయమండి. ధరలు ఎక్కువ అయ్యాయని నాకు తిండి తగ్గించడం న్యాయం కాదు. మీరు అన్నం తినడం తగ్గించారా! మిమ్మల్ని నమ్ముకొని మీ వద్ద కష్టపడి పనిచేసుకుంటున్న నాకు కడుపునిండా తిండి పెట్టకపోతే ఎలా! అన్నాడు.

వాడి మాటలకు రామచంద్రయ్య నవ్వుతూ రాజయ్యా! పనిమనిషిని ఇబ్బంది పెట్టకూడదని అంటున్నావు న్యాయమే. కానీ మనకి సువాసనలు యిచ్చే పూల మొక్కలకు కావలసినంత నీరు పోయకుండా నువ్వు అన్యాయం చేయడంలేదా! అమ్మగారు భోజనం పెట్టకపోతే నీ పొట్ట ఒక్కటే ఇబ్బంది పడుతుంది. కానీ నువ్వు అన్ని మొక్కలనూ ఇబ్బంది పెట్టావే! అన్నాడు. రాజయ్య కంగారుతో లేదండీ! నేను ప్రతిరోజూ సక్రమంగా అన్ని మొక్కలకు నీరు పోస్తున్నానండి అన్నాడు.

నువ్వు నీళ్ళు పోయలేదు అని నేను అనలేదు. మొక్కలకు చాలీచాలని నీళ్ళు పోస్తున్నావు. అవి మాట్లాడవు అని వాటికి అన్యాయం చేస్తున్నావు. నీకు అన్నం కాస్త తక్కువకాగానే నన్ను అడిగావు. మరి వాటి సంగతి ఆలోచించావా. వృక్ష, జంతువులయందు దయకలిగి వున్నవాడే సత్‌పురుషుడు. నువ్వు మొక్కలకి తక్కువ నీరు పోస్తున్నది నేను నీకు తెలియకుండా పొంచి వుండి కనిపెట్టాను. ఆకలి అంటే ఎలా వుంటుందో నీకు తెలియాలని అమ్మగారికి చెప్పి అలా చేయించాను అన్నాడు రామచంద్రయ్య. రాజయ్య సిగ్గుతో తలవంచుకొని నన్ను క్షమించండి. ఇంకెప్పుడూ ఇలా మొక్కలకు అన్యాయం చేయను. వాటికి ఎప్పటిలా నీళ్ళు పోస్తాను. ఈ రోజు నుంచి నా సోమరితనం తగ్గించి, కష్టపడి పనిచేస్తాను అన్నాడు. ఆ నెల నుండి రాజయ్యకి ఇరవై రూపాయలు జీతం పెంచాడు రామచంద్రయ్య. జీతం పెరగటంతో రాజయ్యకి ఉత్సాహం పెరిగి ఎంత దూరమైనా నడిచి, ఎన్నిసార్లు అయినా వెళ్ళి నీళ్ళు తీసుకొని అన్ని మొక్కలకు కావలసినంత నీళ్ళు పోయసాగాడు. కొన్ని రోజులలో అన్ని మొక్కలు పెరిగి రంగురంగుల పువ్వులు విరబూశాయి. వాటిని చూసి రాజయ్యకి ఎంతో ఆనందం కలిగి తాను పడిన కష్టాలన్నీ మరిచాడు.
=========================================================

మార్పు

అది బస్టాండ్. ప్రయాణికుల అరుపులు, పాప్‌కార్న్ అమ్మే కుర్రాళ్ళ కేకలతో గందరగోళంగా ఉంది. ఇంతలో చేతిలో బ్రీఫ్‌కేస్‌తో బస్‌స్టాండ్‌లోకి అడుగుపెట్టాడు నవీన్. కళ్ళకు గ్లాసులు, మెడలో గోల్డ్‌చెయిన్, సఫారీ డ్రస్‌తో నవీన్ చాలా అందంగా ఉన్నాడు. తను ఎక్కబోయే బస్సు కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో బాబూ అన్న పిలుపుకు పక్కకి తిరిగి చూసాడు నవీన్. తనకెదురుగా కొంచెం దూరంలో ఒక ముసలివాడు, మాసిన గడ్డం అక్కడక్కడ చిరిగిన బట్టలతో అసహ్యంగా ఉన్నాడు. ఏమిటి అంటూ నిర్లక్ష్యంగా ముసలాయన వైపు చూసాడు నవీన్. బాబూ గూడెం బస్సు ఇక్కడే కదా ఆగేది అన్నాడు. ఆ ప్రశ్నకు అవునంటూ ముక్తసరిగా సమాధానం చెప్పి మరో వైపు ముఖం తిప్పుకున్నాడు నవీన్. మళ్ళీ బాబూ! అంటూ పిలిచాడు అదే ముసలాయన. ఏమిటన్నట్లు అసహ్యంగా ముఖం పెట్టి కళ్ళతోనే ప్రశ్నించాడు నవీన్.

నవీన్ చూపులకు బయపడ్డ ముసలాయన ఈ బస్సు జంక్షన్లో ఆగుతుందిగా బాబూ అన్నాడు. ఆ ఆగుతుందిలే అంటూ మరో వైపు ముఖం పెట్టాడు. నవీన్ శుభ్రతకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తాడు. అలాంటి నవీన్ అపరిశుభ్రంగా ఉన్న ముసలాయనతో మాట్లాడటం అంటేనే అదోరకంగా ఫీలవుతున్నాడు. అదీగాక ఈ బస్‌స్టాండ్‌లో ఇంతమంది ప్రయాణికులుండగా పనిగట్టుకొని తననే అడుగుతున్నందుకు మనసులోనే తిట్టుకోసాగాడు. ఇంతలో గూడెం బస్ వచ్చి పాయింట్‌లో ఆగింది. బిల బిలమంటూ వచ్చిన జనం బస్సులో ఎక్కడానికి ఒకర్నొకరు తోసుకుంటూ నానాయాతన పడుతున్నారు. కొందరైతే బస్సు కిటికీ గుండా చేతిరుమాళ్ళు, బ్రీఫ్‌కేసులు వేసి సీటులు రిజర్వ చేసుకుంటున్నారు. నవీన్ కూడా కిటికీ గుండా బ్రీఫ్‌కేస్‌ను ఓ సీటులో పెట్టి అందరూ ఎక్కిన తరువాత ఎక్కవచ్చులే అని మనసులో అనుకుని క్రిందే ఉండి చుట్టూ పరిశీలించసాగాడు.

కొన్ని క్షణాల అనంతరం బస్సు లోపల నుండి బాబూ! ఇదిగో బాబూ మిమ్మల్నే అంటూ గట్టిగా అరవడంతో బస్సు వైపు చూసాడు నవీన్. నల్ల బనీను ధరించిన ఓ వ్యక్తిని గట్టిగా పట్టుకొని అరుస్తున్నాడు ఇంతకు మునుపు తను చూసిన ముసలాడు. జరిగిందేమిటో అర్థంకాని నవీన్ ఒక్క ఉదుటున బస్సులోకి దూసుకుపోయాడు. బస్సులోకి వెళ్ళిన నవీన్ దృష్టి నల్ల బనీను వ్యక్తి చేతిలో ఉన్న తన బ్రీఫ్‌కేస్ మీద పడింది. అంటే వీడు దొంగన్న మాట. అని మనసులో అనుకొని ఆ దొంగపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. నవీన్ రావడంతో పాపం ముసలాయన రొప్పుతూ దొంగని వదిలేసాడు. ఇంతలో ఒక కానిస్టేబుల్ జరుగుతున్న గొడవ చూసి బస్సులో కొచ్చాడు. జరిగింది తెలుసుకొని ఆ దొంగని లాఠీతో కొట్టుకుంటూ బయటకు తీసుకెళ్ళాడు.

ఇంతలో నవీన్ దృష్టి బస్సు రాడ్‌కు ఆనుకొని ఆయాసంతో రొప్పుతున్న ముసలాయన మీద పడింది. పాపం అతని బట్టలు చూసి ఇంతవరకూ తను అసహ్యించుకున్నందుకు ఎంతో బాధపడ్డాడు. కానీ అవేమీ పట్టించుకోని ఆ ముసలాయన తనకు చెప్పలేనంత సహాయం చేసాడు. తనే ఆ దొంగని గమనించి పట్టుకోకపోతే బ్రీఫ్‌కేస్‌లో ఉన్న తన స్టడీ సర్టిఫికేట్స్, రెండువేలరూపాయల డబ్బు, బట్టలు అన్నీ తను పోగొట్టుకొని ఉండేవాడు. అందుకే తను చేసిన తప్పును తెలుసుకొని ఆ దేవుడి ఋణం తీర్చుకోవాలి అని మనసులో అనుకొని ఆయాసంతో రొప్పుతున్న ఆ ముసలి వ్యక్తిని చేత్తో గట్టిగా పట్టుకొని, చూడు తాతా! నీకు చాలా నీరసంగా ఉంది కదూ! నా సీట్లో కూర్చొని కాసేపు విశ్రాంతి తీసుకొందువుగానీ రా తాతా! అంటూ తీసుకెళ్ళి తన సీట్లో కూర్చోబెట్టాడు.
========================================================

మాట్లాడే గాడి

కధ పేరు చూసి గాడిద మాట్లడటం ఏమిటని ఆశ్చర్య పోతున్నారా! అవునర్రా! నిజంగా గాడిద నిజంగానే మాట్లడింది. ఒకసారి అక్బర్ చక్రవర్తితో మాట పట్టింపు వచ్చి బీర్బల్ గాడిదతో మాట్లాడించటమే గాక గాడిదతో పుస్తకం కూడ చదివించాడు. ఇప్పుడు మీకు ఆ కధనే చెప్పబోతున్నాను. ఒక రోజున అక్బర్ బీర్బల్‌లు సభలో ఉండగా ఒక వ్యాపారి ఒక గాడిదను తీసుకొని వచ్చాడు. తాను తీసుకువచ్చిన గాడిదను రాజుగారికి అమ్మాలన్నది ఆ వ్యాపారి ఉద్దేశ్యం.

సమాయానికి బీర్బల్ కూడా సభలో ఉండటం చూసి ఆవ్యాపారి ఎంతో సంతోషించాడు.

అతను తీసుకువచ్చిన గాడిదను చూసి బీర్బల్ "మహారాజా!ఈ గాడిదను చూస్తుంటే ఇది ఎంతో తెలివి కలదని నాకు అనిపిస్తుంది. మనం కొంచం శ్రద్ద తీసుకొని ఈ గాడిదకు వ్రాయటం, చదవటం నేర్పిస్తే గాడిద నేర్చుకుంటుందని నాకు అనిపిస్తుంది. "అన్నాడు.

అంతే అక్బర్ ఆ మాటనే పట్టుకున్నాడు. "అయితే బీర్బల్ ఈ గాడిద చాలా తెలివైనది అని అంటావు అవునా!" అని అడిగాడు మహారాజు

"అవును మహారాజా" అన్నాడు బీర్బల్

"మనం కొంచెం ఓర్పుగా చెబితే ఈ గాడిద చదవటం, వ్రాయటం నేర్చుకుంటుందని అంటావు అవునా!" అని అడిగాడు అక్బర్.

మళ్ళీ 'అవునని' చెప్పాడు బీర్బల్

వెంటనే అక్బర్ చక్రవర్తి ఓ నిర్ణాయానికి వచ్చారు. ఆ వ్యాపారి దగ్గర గాడిదను కొన్నాడు. ఆగాడిదను బీర్బల్ చేతిలో పెట్టాడు రాజుగారు గాడిదను కొని తనకు ఎందుకు ఇస్తున్నాడో బీర్బల్‌కు అర్దం కాలేదు. వెంటనే రాజుగారిని అదే ప్రశ్ననుఅడిగాడు.

బీర్బల్ ఈ గాడిదను నీతో పాటు తీసుకొని వెళ్ళు. ఓ నెల రోజులు సమయం ఇస్తున్నాను. ఈలోగా ఈగాడిదకు చదవటం, వ్రాయటం నేర్పించు. నెల రోజుల తర్వాత గాడిదను తీసుకురా! ఒక వేళ నువ్వన్నట్టుగా నెల రోజుల లోపల గాడిదకు చదవటం, వ్రాయాటం రాకపోతే నిన్ను శిక్షించాల్సి ఉంటుంది. చెప్పు ఇది నీకు సమ్మతమేనా!? " అని అడిగాడు అక్బర్ చక్రవర్తి.

బీర్బల్‌కు రాజుగారి మాట మన్నించటం మినహా వేరే గత్యంతరం లేకుండా పోయింది. "అలాగే మహారాజా! మీరు కోరుకున్న విధముగానే నెల రోజులలోపల ఈ గాడిదకు మాట్లాడటం, వ్రాయాటం నేర్పిస్తాను" అన్నాడు బీర్బల్.

రాజుగారు చెప్పిన విధంగా గాడిదను తీసుకొని ఇంటికి వెళ్ళాడు.

రాజుగారి సభలో ఉన్న వారంతా బీర్బల్ సాహాసానికి ఆశ్చర్య పోయారు.

"ఇదంతా జరుగుతుందా నిజంగా బీర్బల్ గాడిదకు చదవటం, వ్రాయటం నేర్పిస్తాడా?"

ఒక వేళ ఆ పని చేయ లేకపోతే రాజుగారు బీర్బల్‌ను శిక్షిస్తారా? లేకపోతే బీర్బల్ మీద ఉన్న అభిమానం కొద్దీ మందలించి వదిలేస్తారా?"

"అసలు జంతువులు ఎక్కడైనా మాట్లాడతాయా? మాట్లాడటమే రాని జంతువుకు బీర్బల్ చదవడం వ్రాయడం ఎలా నేర్పిస్తాడు?"

"బీర్బల్‌కు ఈ సారి ఎలా అయినా శిక్ష తప్పదు. అని ఓ వర్గం వారు.."

"ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు ఇలాంటి చిక్కు సమస్యలను బీర్బల్ ఎంతో తెలివిగా పరిష్కరించాడు. అలాగే ఈ సారి కూడా ఎంతో తెలివిగా ఈ సమస్యను పరిష్కరిస్తాడు" అని మరొక వర్గం వారు.

ఈవిధంగా సభ రెండుగా చీలిపోయింది. ఒక వర్గం బీర్బల్‌కు అనుకూలంగా ఉంటే మరొక వర్గం బీర్బల్‌కు వ్యతిరేకంగా ఉంది.

ఈ విధమైన ఊహాగానాలతో నెలరోజులు గడిచిపోయాయి. గాడిదను రాజుగారి సభకు ప్రవేశపెట్టే రోజు దగ్గరకు వచ్చింది. గాడిదతో సహా బీర్బల్ రాజుగారి సభకు హాజరయ్యాడు.

"బీర్బల్! గాడిదకు వ్రాయటం, చదవటం వచ్చినదా!?" కుతూహలంగా అడిగాడు అక్బర్.

"చిత్తం మహారాజా" అన్నాడు బీర్బల్.

బీర్బల్ సమాధానానికి సభలో ఉన్నవారంతా ఆశ్చర్య పోయారు.

"గాడిదకు నిజంగా చదవటం, వ్రాయటం వచ్చిందా!"

"ఎప్పటిలాగే ఈసారి కూడ బీర్బల్ ఏదో చమత్కారం చేస్తున్నాడు" "బీర్బల్‌కు ఈసారి శిక్ష తప్పదు."

ఈవిధంగా తమలో తాము మాట్లడు కోసాగారు.

"బీర్బల్ నువ్వు చెప్తున్నది నిజమేనా? గాడిద నిజంగా చదువుతుందా?" అడిగాడు అక్బర్ చక్రవర్తి.

"ఏదీ అయితే గాడిదతో ఏదైనా చదివించు" అడిగాడు అక్బర్ చక్రవర్తి.

వెంటనే బీర్బల్ ఒక పుస్తకం తీసుకొని గాడిద ముందు పెట్టాడు. సభలో ఉన్నవారందరూ ఆశ్చర్యపోయేలా గాడిద తన నాలుకతో పుస్తకంలో పేజీలు తిప్పటం మొదలుపెట్టింది. ఆవిధంగా తిప్పుతూ మూడవ పేజికి రాగానే గట్టిగా చదవటం మొదలు పెట్టింది.

ఇదంతా చూస్తున్న అక్బర్ చక్రవర్తి, సభలో ఉన్న మిగతావారు ఆశ్చర్యంతో ముక్కున వేలువేసుకున్నారు.

"అద్భుతం నిజంగా అద్భుతం బీర్బల్ నీవు చాలా గొప్పవాడివి. నిజంగా నువ్వు అన్నట్టుగానే సాధించి చూపించావు. నీకు మంచి బహుమానం ఇచ్చి సత్కరించాలి" అంటూ బీర్బల్‌ని ఎంతగానో మెచ్చుకున్నాడు రాజుగారు.

బీర్బల్ చిరునవ్వుతో ఆ ప్రసంశలు స్వీకరించాడు.

"అదిసరే బీర్బల్ ఇంతకి ఆ గాడిద ఏమంటున్నది.?" అని అడిగాడు మహారాజు

"అది ఏ మంటున్నదో తెలియాలంటే మనకు గాడిద బాష తెలియాలి మహారాజా!" అన్నాడు బీర్బల్.

అంతే అక్బర్ చక్రవర్తికి బీర్బల్ చేసిన చమత్కారం ఏమిటో అర్దం అయ్యిది. "సరే మనకు గాడిద బాష తెలియదు కాబట్టి గాడిద ఏం మాట్లడుతుందో మనకు తెలియదు. ఆ విషయం ప్రక్కన పెట్టు. కాని గాడిద ముందు పుస్తకం పెడితే పేజీలు తిప్పుతుంది. అక్కడక్కడ ఆగి పుస్తకం చదువుతున్నట్టు అరుస్తుంది. చెప్పు బీర్బల్! నువ్వేం చేస్తావు.? పుస్తకం చదవటం దానికి ఎలా నేర్పించావు?" అని అడిగాడు అక్బర్.

అక్బర్ చక్రవర్తి చెప్పిన ప్రశ్నకు బీర్బల్ ఇలా సమాధానం చెప్పాడు "మహారాజా! ఆరోజున గాడిదను చూచి దాన్ని మీదగ్గర మెచ్చుకుంటే ఆవ్యాపారకి నాలుగు డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అని అనుకున్నాను. అందుకే మీ ముందు అలా చెప్పాను. మీరు వెంటనే నెల రోజులు సమయం ఇచ్చి గాడిదకు చదవటం, వ్రాయటం నేర్పించమని చెప్పారు. జంతువులతో మాట్లాడించటానికి నాకు ఏలాంటి ఇంద్రజాల విధ్యలు తెలీవు కాని ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారు గాడిద పుస్తకం పేజీలు తిప్పుతూ చదువుతోందని కాబట్టి నేను అసలు విషయం చెప్పేస్తాను. తీరా అసలు సంగతి విన్నాక మీరు నన్ను శిక్షించకూడదు." అన్నాడు బీర్బల్.

అక్బర్ అందుకు అంగీకరించాడు.

"మహారాజా! గాడిదను ఇంటికి తీసుకుని వెళ్ళాక ఒక రోజంతా దానికి ఏమి పెట్టలేదు. దాంతో అది ఆకలితో నకనకలాడిపోయింది. మరునాడు ఇదిగో ఈపేజీలో గడ్డి పెట్టాను. అంతే అసలే ఆకలి మీద ఉంది దానికి తోడు పుస్తకం లోంచి గడ్డి కనిపిస్తుంది ఇంకేముంది గబగబ పుస్తకం తెరచి మొదటి పేజి తీసి అక్కడ పెట్టిన గడ్డిని తినేసింది. మరునాడు రెండో పేజిలో గడ్డి పెట్టి గాడిద ముందు పెట్టాను. పుస్తకం దాని ముందు పెట్టగానే దానిలో గడ్డి పెట్టి ఉంటానని గాడిద అనుకోవడం మొదలు పెట్టింది. దాంతో రెండో రోజు కూడ పుస్తకం దాని ముందు పెట్టగానే గబగబ మొదటి పేజీ తిప్పింది. దానికేమి కనిపించ లేదు. వెంటనే రెండో పేజీ తిప్పింది. ఈసారి అక్కడ గడ్డి కనిపించింది. మూడో రోజు కేవలం పుస్తకం మాత్రమే గాడిద ముందు పెట్టాను అందులో గడ్డి పెట్టలేదు ఎప్పుడైతే పుస్తకంలో గడ్డి పెట్టలేదో గాడిద పెద్దగా అరవటం మొదలు పెట్టింది. ఈవిధంగా షుమారు నెల రోజుల పాటు దానికి శిక్షణ ఇచ్చాను. అంతే అదేవిధంగా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. అంటూ తను ఏవిధంగా గాడిదతో మాట్లాడించాడో రాజుగారికి వివరించాడు బీర్బల్.

అంతే సభలో ఉన్న వారంతా చప్పట్లు కొట్టి బీర్బల్‌ను ఎంతగానో అభినందించారు.

ఇక రాజుగారైతే బీర్బల్‌కి బోలెడన్ని బహుమానాలు ఇచ్చారు.

చూసారా పిల్లలూ! బీర్బల్ ఎలాంటి చిక్కు ప్రశ్నలకైనా ఎంత సులభముగా పరిష్కారిస్తున్నాడో!
======================================================

మూడు చేపలు

మంచిని ఎవరు చెప్పినా వినాలి. అలాకాక అజ్ఞానంతో, మూర్ఖత్వంతో ఆ మంచిమాటలను పెడచెవిన పెడితే అందుకు తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదు. ఇతరులందరూ అబద్దాలు చెప్పేవాళ్ళు అనుకుంటే అంతకు మించిన పొరపాటు మరొకటి లేదు. అలాంటి పొరపాటులు ఒక్కొక్కసారి ప్రాణాలకే ముప్పు తెస్తాయి అది ఎలాగో ఈ మూడు చేపల కధ ద్వారా తెలుసుకుందాం.

అంబాపురం సమీపంలో ఒక చిన్న చెరువు ఉంది. ఆ చెరువు నీటి గడ్డితోను నాచుతోను నిండి ఉండేది. ఆ చెరువులో ప్రభవ, విభవ, ఆశ్లేష అనే మూడు చేపలు ఎంతో స్నేహంగా ఉండేవి. ప్రభవ మంచి తెలివి కలది ఏ విషయం ఇతరులతో చెప్పించికోకుండా ఇట్టే పసికట్టి సమయానికి తగ్గట్టుగా మసలుకునేది. విభవ కొంచెం మందబుద్ధి ఏవిషయం అయినా నిదానంగా ఆలోచించి నడుచుకునేది. ఆశ్లేష అహంకారి అన్నీ తనకే తెలుసునని మిగిలిన రెండు చేపలకంటే తానే తెలివైన దానిననీ విర్రవీగుతూండేది.

ఈ ముడు చేపల మధ్య గుణగణాలలో తేడాలు ఉన్నా ఒకే జాతికి చెందిన చేపలు కావటం వల్ల వాటి మధ్య స్నేహం ఏర్పడింది. ఒకనాడు కొందరు జాలరులు వచ్చి చెరువును పరిశీలిస్తూ మట్లాడుకోవడం ప్రభవ విన్నది. వెంటనే తన మిత్రులైన విభవ, ఆశ్లేష దగ్గరకు వచ్చి 'మిత్రులారా! ఇప్పుడే ఇద్దరు జాలరులు మాట్లాడుకోవడం విన్నాను...' రెండు, మూడు రోజులలలో వచ్చి ఈ చెరువులో నీళ్ళు తోడి చేపలు పట్టుకుందాం అనుకుంటున్నారు. అందుకే మనం తొందరగా ఇక్కడికి దగ్గరలో ఉన్న మరో చెరువులోకి వెళ్ళిపోదాం ' అంటూ చెప్పింది. దాని మాటలకు ఆశ్లేష పగలబడి నవ్వి 'నువ్వు పిరికిపందవు' అంటూ ఎగతాళి చేసింది. విభవ మాత్రం 'ఇంకా రెండు మూడు రోజులు ఆగి కదా! అప్పుడు ఆలోచిద్దాం' అంది. ప్రభవ మాత్రం ఆ రాత్రికే వేరే చెరువుకు వలస వెళ్ళిపోయింది. రెండు రోజుల తరువాత వద్దామనుకున్న జాలరులు మర్నాడు ఉదయమే ఆ చెరువులో చేపలు పట్టుకునేందుకు వచ్చారు. చెరువులో కొంతభాగం బురుదమట్టితో గోడగా కట్టి ఇందులో నీళ్ళను తోడి అవతలకు పోసి ఆ తరువాత మిగిలిన కొద్దినీళ్ళల్లోకి వలలు వేసారు. దానితో చెరువులోని చేపలన్నీ వలలోకి చిక్కాయి.

'అయ్యో! మిత్రుడు చెప్పిన మాటలు వినకుండా ఈ జాలరులకు చిక్కామే' అంటూ విభవ, ఆశ్లేష భాధపడ్డాయి. ఆ సమయంలో విభవకు ఒక ఉపాయం తట్టింది. అది ఆశ్లేషకు చెబితే తనని ఎక్కడ ఎగతాళి చేస్తుందో అని చెప్పకుండా ఆ ఉపాయంతో తాను మాత్రమే జాలరుల నుంచి తప్పించుకోవాలని నిర్ణయించుకుంది. జాలరులు వలలోంచి ఒక్కొక్క చేపను తీసి బ్రతికున్నదా లేదా అని పరీక్షించి బుట్టలో వేసుకుంటున్నారు. అది గమనించిన విభవ జాలరి తనని వలలోంచి బయటకు తీసి పరీక్షిస్తున్నప్పుడు ఊపిరిబిగపట్టి చనిపోయినట్లు నటించింది. అది నిజంగా చచ్చిపోయింది అనుకున్న జాలరి దానిని చెరువు గట్టు మీదే వదిలేసి వెళ్ళిపోయాడు. జాలరి కనుమరుగు కాగానే విభవ మళ్ళీ చెరువులోని నీళ్ళలోకి గెంతి తన ప్రాణాలను కాపాడుకుంది. అహంకారంతోను, మూర్ఖత్వంతోను విర్రవీగిన ఆశ్లేష మాత్రం జాలరుల చేతిలో ప్రాణాలు పోగొట్టుకుంది.

అందుకే పిల్లలు! మంచి మాటని ఎవరు చెప్పినా వినాలి. దాన్ని తప్పకుండా ఆచరించాలి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు పెద్దలకో... మనకంటే తెలివైన వారికో చెప్పి ఆ నిర్ణయం మంచిదో, చెడ్డదో తేల్చుకోవాలి.
=============================================

మోసం చేసిన మోసం

ఒక పిల్లల కోడి, తన చిట్టి పొట్టి కోడి పిల్లలను వెంట బెట్టుకొని చెత్తకుప్పల మీద తిరుగుతూ పురుగులను ఏరుకొని తింటూ వుంది. కోడిని, కోడిపిల్లలను చూడగానే, ఆ పక్కనే కలుగులో వున్న పాముకు నోరూరింది. ఎలాగైనా ఓ కోడి పిల్లను మింగాలనుకుంది. తల్లి కోడి చూస్తూ వుండగా, పిల్ల కోడిని పట్టుకుంటే, తల్లి కోడి వాడి ముక్కుతో తన కళ్ళు పొడిచేస్తుందని పాముకు తెలుసు!

అందు కోసం ఏదైనా ఎత్తు వేయాలని అనుకొని, చచ్చిన దానిలాగ ఓ పక్కగా పడుకుంది. పాము! పాము అంటే ఇంకా భయం ఎరుగని కోడి పిల్లలు ఇటూ అటూ తిరుగుతూ, ఆ పాము మీద నుంచి ఈ పక్కకూ, ఆ పక్కకూ గెంతుతూ వున్నా పాము కదలకుండా, మెదలకుండా పడుకునే వుంది.

పాము మీద నుంచి గెంతుతూవున్న పిల్లలను చూసి కోడి భయపడింది. కదలకుండా వున్న ఆ పామును చూసి, అది చచ్చి పడి వుందని అనుకొని, తల్లికోడి పక్కగా పోయింది. ఇంతలో చీకటి పడుతూ వుండడం వల్ల, పిల్లలను వెంట బెట్టుకొని తల్లి కోడి వెళ్ళి పోయింది. అయితే వెనుక బడిన ఓ కోడి పిల్లను నోట కరచుకొని, పాము చరచరా పారిపోయింది!

తన ఎత్తు బాగా పని చేసిందని సంతోషించింది పాము. మరునాడు కూడా మరో కోడి పిల్లను తినవచ్చునని, అదే చోటున చచ్చినట్టుగా పడుకుంది కోడి పిల్లలు అటు వచ్చే సమయానికి!

పురుగులను ఏరుకొని తింటూ, కోడి, కోడిపిల్లలు మామూలుగా అటు వచ్చాయి. తల్లికోడి, అచట పడి వున్న పామును చూసింది. "నిన్నటి నుంచీ ఇలాగే పడి వుంది. చచ్చిపోయిందో ఏమో, చూద్దామని", పాము దగ్గరగా వచ్చి ముక్కుతో దానిని దొర్లించింది. పాము వెల్లికిలాపడినా కదల లేదు, మెదల లేదు. కోడి పిల్లలు అటూ ఇటూ తిరుగుతూ పక్కగా వెళ్ళి పోయాయి. ఇంతలో రివ్వున ఓ గద్ద, బాణంలా దూసుకు వచ్చి ఆ పామును తన్నుకు పోయింది!

"పామును చంపిన వాడా! దానిని బోర్లా పడెయ్యకు, వెల్లకిలా పడేయ్" అని సామెత! మామూలుగా పడుకుని వున్న పామును సాధారణంగా, గద్ద తన్నుకు పోదు. వెల్లకిలా పడి వుంటేనే, చచ్చిందని తన్నుకుపోతుంది. కోడి పిల్లలను తినాలని దొంగ ఎత్తు వేసిన పాముకు, దాని దొంగ ఎత్తే దాని చావుకు కారణమైంది!

నీతి: మోసగాడిని, మోసమే "మోసం" చేస్తుంది;
======================================================

మోసగాళ్ళకు మోసగాడు

పాలకొల్లు చంద్రశేఖరం, సూర్యం ప్రాణ స్నేహితులు, ఇద్దరు సినిమాలకి షికార్లకీ తిరుగుతూ కాలక్షేపము చేస్తుంటారు. ఓ రోజు ఇద్దరూ సినిమాకని బయల్దేరారు. కొత్త సినిమా కారణముగా వాళ్ళు వెళ్ళేటప్పటికే బుకింగ్‌లో టికెట్స్ అయిపోయాయి. ఆ హాలులో దొంగటికెట్లు, అమ్ముతున్నారన్న పేరు బాగా వుంది.సార్! మీకు టికెట్స్ కావాలా, అన్న పిలుపుకు సూర్యం గమనించి కావాలి అన్నాడు. ఇరవైరూపాయల టికెట్ పాతిక రూపాయలే అన్నాడు ఆ వ్యక్తి. వద్దురా ఇంటికెళ్దాం, ఇక్కడి పరిస్థితి నీకు తెలియదు. అంతా మోసం అనగానే చూస్తుండు అని చెప్పి యాభై రూపాయలనోటు ఇచ్చి రెండు టికెట్స్ తీసుకున్నాడు.

ఇద్దరు హాలులోపలకి వెళ్ళి గేట్‌కీపర్ కు ఇవ్వగా ఆ టికెట్స్ గమనించి మిమ్మల్ని ఎవరో బాగా మోసం చేశారని చెప్పాడు. చేసేది లేక వెనుదిరిగారు. కాని సూర్యం మాత్రము ఆనందంగా ఉండడం చూసి చంద్రశేఖరం, ఏమిటి ఆనందముగా వున్నావంటే నేను ఇచ్చిన యాభైరూపాయలు కూడా దొంగనోటే అని చెప్పాడు. నిన్న బ్యాంకులో డబ్బు కట్టడానికి వెళితే బ్యాంకువారు అసలు నోటుకీ దొంగనోటుకీ గల గుర్తులు అవీ చెప్పారు. అది ఎలాగో మా వద్దకి ఒకటి చేరింది. దాంతో ఇక్కడ ఇచ్చాను. ఆ దొంగనోటుని చించవలసినది. వీళ్ళ వ్యవహారము తెలిసే ఆ విధంగా చేశాను.

టికెట్ అమ్మిన వ్యక్తి ఆనందముగా పాన్ షాపులో ఇచ్చి సిగరెట్ పెట్టె ఇవ్వమన్నాడు. పాన్ షాపతను నోటును పరీక్షగా చూసి ఇది దొంగనోటు మీకెవరిచ్చారో అన్నాడు. నేనే మోసగాణ్ణి అనుకుంటే నన్నే మోసం చేశాడే అనుకుంటూ ఆలోచిస్తూ ఇంటికి చేరుకున్నాడు విచారముగా.
==========================================================

మోసపోయిన మోసగాడు

రామశింగవరం అనే గ్రామంలో సోమయ్య అనే చిన్న రైతు ఉండేవాడు. ఎంతో కష్టించి పనిచేసి ఒక ఎకరం పొలం, ఒక చిన్న ఇల్లు సంపాదించగలిగాడు. అతని వద్ద కొన్ని కోళ్ళు, ఒక కుక్క కూడా ఉన్నాయి. సోమయ్యకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడి పేరు రాజయ్య. రెండవ వాడి పేరు అంజయ్య. సోమయ్యకు వృద్ధాప్యం వచ్చింది. తరచు సుస్తీగా ఉండేవాడు. ఒకరోజు ఇద్దరు కొడుకులనూ పిలిచి తన ఆస్తిని వారిరువురూ చెరి సమానంగా పంచుకోమని చెప్పాడు. "మీరిద్దరూ కలిసి మెలిసి ఉండండి. పొలంలో ఎవరి వాటాను వారు వ్యవసాయం చేసుకోండి. మీలో మీకు గొడవలు వస్తే మీ మధ్య మూడవ మనిషి ప్రవేశించి తాను లాభం పొందుతాడు" అని సోమయ్య వాళ్ళకు సలహా చెప్పాడు. మరి కొద్ది రోజులకు అతను చనిపోయాడు. సోమయ్య ఇద్దరు కొడుకుల్లో రాజయ్య తెలివైనవాడు. అతను దుర్మార్గుడు కూడా. తమ్ముడి మంచితనాన్నీ, తెలివితక్కువతనాన్నీ, చూసి అతణ్ని మోసగించడానికి రాజయ్య నిర్ణయించుకున్నాడు. తమ ఇంట్లో వున్న వస్తువుల్లో సగం వస్తువులను తమ్ముడికి జాగ్రత్తగా పంచి ఇచ్చాడు. కోళ్ళను పంచవలసివచ్చినప్పుడు మాత్రం అతను తన తెలివితేటలను ఉపయోగించాడు! "తమ్ముడూ! ఈ కోళ్ళను పెంచడానికి చాలా శ్రమ పడవలసి వస్తుంది.

నువ్వు చిన్నవాడివి. ఇందులో నీకు అనుభవం లేదు. వీటిని పెంచి నువ్వు అవస్థలు పడలేవు. అందువల్ల నీకు శ్రమ తగ్గించడం కోసం ఈ కోళ్ళను నేనే తీసుకొని, ఆ కష్టమేదో నేనే పడతాను" అన్నాడు. మంచివాడైన అంజయ్య తన అన్నగారి మాట కాదనలేక అందుకు అంగీకరించాడు. "తమ్ముడూ! కోళ్ళను నాకిచ్చావు కాబట్టి కుక్కను నువ్వు తీసుకో!" అన్నాడు రాజయ్య. అంజయ్య కుక్కను, రాజయ్య కోళ్ళను పెంచసాగారు. కొన్నాళ్ళు గడిచాయి. తన వాటాకు వచ్చిన కోళ్ళ వల్ల రాజయ్య లాభం పొందసాగాడు. గుడ్లను పట్నానికి తీసుకు వెళ్ళి అమ్మి అతను డబ్బు సంపాదిస్తున్నాడు. అంజయ్య ఎటువంటి ఆదాయం రాక అవస్థలు పడసాగాడు. అతనికి కుక్క అదనపు భారమైంది. దానికి రోజూ అతను తిండి పెట్టవలసి వస్తోంది. వాడు విచారంగా ఉండేవాడు. ఒకరోజున అంజయ్యకు మెరుపు మెరిసినట్టు ఒక ఆలోచన తోచింది. కుక్క వల్ల తాను అంతో ఇంతో లాభం పొందాలనుకొన్నాడు. కొంతకాలం పాటు దానికి వేటాడ్డంలో తర్ఫీదును ఇచ్చాడు.

ఒకనాడు కుక్కతో పాటు అడవిలోకి వెళ్ళాడు. అంజయ్య, కుక్క కలిసి చాలా శ్రమపడి చివరికి ఒక లేడిని చంపారు. లేడి మాంసాన్ని పట్నానికి తీసుకు వెళ్ళి అంజయ్య అమ్మాడు. అందువల్ల అతనికి కొంత డబ్బు వచ్చింది. అతనిలో ఎంతో ఉత్సాహం కలిగింది. అతను రోజూ కుక్కను తీసుకొని అడవికి వెళ్ళసాగాడు. ఆ కుక్క నేర్పుగా అంజయ్యతో పాటు కుందేళ్ళను, చిన్న జంతువులను వేటాడసాగింది. వాటిని పట్నంలో అమ్మి అంజయ్య డబ్బు సంపాదించసాగాడు. తమ్ముడు డబ్బును సంపాదించి సుఖంగా ఉండడం చూసిన రాజయ్యలో అసూయ కలిగింది. ఎలాగైనా ఆ కుక్కను చంపేయాలని అలోచించాడు. అందుకు తగిన అదును కోసం అతను ఎదురు చూడసాగాడు. ఒకరోజు సాయంత్రం అంజయ్య పట్నానికి వెళ్ళాడు పనిమీద. రాజయ్య కొంత అన్నాన్ని కూరతో కలిపి, దాంట్లో విషాన్ని జల్లాడు. ఆ అన్నాన్ని కుక్క ముందు పెట్టి పొలంలోకి వెళ్ళాడు. కుక్క కొద్దిగా అన్నం తిన్నది. అయితే అన్నంలోంచి వస్తున్న ఏదో వాసన దానికి సహించలేదు.

అందుచేత ఆ అన్నాన్ని అది తినడం మాని, అన్నం మెతుకుల్ని కాళ్ళతో అటూ ఇటూ జిమ్మేసింది. తాను తిన్న అన్నాన్ని కూడా కక్కేసింది. రాజయ్య కోళ్ళు అటూ ఇటూ తిరుగుతూ కుక్క జిమ్మిన అన్నం మెతుకుల్ని పూర్తిగా తినేశాయి! అన్నంతో పాటు వాటి పొట్టల్లోకి విషం కూడా వెళ్ళిపోయింది. తర్వాత అవి తమ గూళ్ళలోకి వెళ్ళిపోయాయి. తెల్లవారింది. రాజయ్య నిద్రలేచాడు. అప్పటికి తాను పెట్టిన విషంతో కుక్క చచ్చిపడి వుంటుందని అతను భావించాడు. కుక్క శవం కోసం ఇంటి చుట్టుప్రక్కల వెతకసాగాడు. అయితే హఠాత్తుగా అతనికి తమ్ముడు అంజయ్య, కుక్క యధాప్రకారం అడవికి వెళ్తూ కనిపించారు. అతను అశ్చర్యపోయాడు కుక్క బతికుండడం చూసి. తర్వాత రాజయ్య కోళ్ళగూళ్ళ వద్దకు వేళ్ళాడు. కోళ్ళ గూళ్ళ ముందు కొన్ని లోపల కొన్ని కోళ్ళు చచ్చిపడి ఉండడం చూసి రాజయ్యకు మతిపోయింది. అతనికి చాలా ఏడుపు వచ్చింది. తాను కుక్కను చంపడానికి, దానికి పెట్టిన విషం నిండిన అన్నాన్ని తన కోళ్ళు తిని చనిపోయాయని రాజయ్య గ్రహించాడు. తాను తీసిన గోతిలో తానే పడినందుకు అతను కృంగిపోయాడు. అయితే అంజయ్య మాత్రం అన్నను ఓదార్చాడు. ఆ తరువాత రాజయ్య తన స్వార్థ బుద్ది మార్చుకొని అంజయ్యతో ప్రేమగా ఉండసాగాడు.
======================================================================

మోసానికి శిక్ష

ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న రాజయ్య స్కూలుకు సెలవుదినమైతే ఇంట్లో నుంచి కదలడు. ఏదో పుస్తకమో, పేపరో చదువుతూ కాలక్షేపం చేయడం ఆయనకలవాటు. ఒకరోజు ఉదయంపూట మార్కెట్టుకు వచ్చాడు. మామూలుగా అతను మార్కెట్టుకు రాడు. ఆ పని భార్య నిర్మలే చేస్తుంది. అయితే ఇంట్లో నిమ్మకాయ పచ్చడి పెట్టాలనుకున్నారు. నిమ్మకాయ పచ్చడి అంటే రాజయ్యకు ప్రాణం. నిమ్మకాయలు మీరు తెచ్చేపక్షంలో నిమ్మకాయ పచ్చడి పెడతానంది భార్య నిర్మల. దానితో ఇక లాభం లేదనుకొని ఆ కాయలు కొనడం కోసమే రాజయ్య మార్కెట్టుకు రావడం జరిగింది. ఆదివారం కావడంవల్ల ఆ రోజు మార్కెట్టు చాలా రద్దీగా ఉంది. రాజయ్య నాలుగు దుకాణాలు తిరిగాడు. ఈ చివరగా ఉన్న బండిని సమీపించాడు. కాయలు నవనవలాడుతూ తాజాగా కనిపించాయి. బాగా నచ్చాయి. కాయ ఒకటి చేతిలోకి తీసుకుని వంద కాయలు కావాలి. ధర ఎంత? అని అడిగాడు.

దుకాణాదారు కాస్త పరధ్యానంలో ఉన్నట్టున్నాడు. రాజయ్య ఒకటికి నాలుగు సార్లు అడిగేసరికి, వంద యాభైరూపాయలు అన్నాడు. రాజయ్య ముప్పైకి ఇమ్మన్నాడు. బండివాడు సరేనన్నాడు. రాజయ్య గబగబా వంద నిమ్మకాయలు ఏరుకొని సంచిలో వేసుకొన్నాడు. వందరూపాయలు నోటు అందించాడు. అందుకు తన దగ్గర చిల్లరలేదని త్వరగా చిల్లర తెస్తానని గబగబా జనంలోకి వెళ్ళాడు దుకాణందారుడు. రాజయ్య చాలాసేపు ఆ దుకాణం దగ్గర నిలబడ్డాడు. ఆ వెళ్ళినవాడు ఎంతకూ రాలేదుగాని వేరొకడు వచ్చాడు. తెచ్చిన చిల్లర గల్లాపెట్టెలో వేసుకొని మిగతాది రాజయ్యకు ఇవ్వబోయాడు. రాజయ్య అయోమయంగా చూస్తూ నేను ఇచ్చింది వంద. నాకు రావాల్సింది నిమ్మకాయలధర పోను డైబ్భై రూపాయలు అన్నాడు. దుకాణాదారు వెర్రిగా చూస్తూ నువ్వు ఉల్లిగడ్డలు తీసుకొని ఇరవై రూపాయల నోటు ఇచ్చావుకదా? అది తీసుకొని చిల్లర కొసం వెళ్ళి అష్టకష్టాలు పడి తీసుకొని ఇప్పుడే వచ్చాను. అంతేకదా! అన్నాడు. రాజయ్య ఉలిక్కిపడ్డాడు. తాను తీసుకున్నవి నిమ్మకాయలేనని సంచి గుమ్మరించాడు. తానిచ్చింది వంద గనుక నిమ్మకాయల ధర ముప్పై పోగా తనకు డెబ్బై రావాలని లబోదిబోమన్నాడు. ఆ గోలకు పదిమంది అక్కడ చేరారు. దుకాణం వాడికి పిచ్చెక్కిపోయింది. జరిగిన విషయం దుకాణం వాడికి పూర్తిగా అర్థమయింది. వాడు అక్కడ చేరిన జనాన్ని ఉద్దేశించి అయ్యా! ఈయనకంటే ముందు నా దగ్గరకు ఒకడొచ్చి కిలో ఉల్లిగడ్డలు కొని ఇరవై నోటు ఇచ్చాడు. నా దగ్గర చిల్లర లేకపోవడంతో ఆ నోటు తీసుకొని చిల్లర కోసం వెళ్ళాను. వాడు బండి దగ్గరే నా కోసం నిలబడ్డాడు. ఈలోగా ఇతనొచ్చి వాడే దుకాణం వాడనుకొని నిమ్మకాయలు కొన్నాడు. చిల్లర లేదంటూ వాడికి వంద నోటు ఇచ్చాడు. చిల్లరలేదంటూ వాడు నాలాగే ఆ నోటుతో వెళ్ళాడు. కాని తిరిగి రాలేదు. వాడు నా దగ్గర కొన్న ఉల్లిగడ్డలు ఇవిగో! మోసం జరిగిపోయింది. దానికి వాడు బాధ్యుడయితే నేనెలా మూల్యం చెల్లించేది చెప్పండి. అంటూ తల బాదుకున్నాడు.

అది పగటి మోసంగా భావించి జనం వెళ్ళిపోయారు. చేసేది మాష్టారు ఉద్యోగం కనుక ఒకసారి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు రాజయ్య. తన తెలివి తక్కువతనమే తనను మోసపోయేలా చేసింది. ఇందులో దుకాణాదారు తప్పులేదు. అని గ్రహించాడు రజయ్య. మరి కాసేపు తన డబ్బులు కోసం అరిస్తే ఆ నిమ్మకాయలు తనకు మిగిలేట్టు లేవని జడిసి రాజయ్య చల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. రాజయ్య ఇంటిదారి పట్టాడుగాని అతని మనస్సు మనస్సులో లేదు. తనొక కొత్త తరహాలో మోసపోయాడని బాధపడుతూ నడుస్తున్నాడు. అల్లంత దూరంలో జనం గుమ్మిగూడి ఉండటం చూసి, అదేంటో చూద్దామని అక్కడికి నడిచాడు కుతూహలంగా. రాజయ్య జనాన్ని తోసుకొని లోనికి వెళ్ళాడు. ఆ మధ్యలో ఒకడు రక్తం మడుగులో పడివునాడు. వాడి ముఖం పరిశీలనగా చూచి, అతను ఉలిక్కిపడ్డాడు. ఇంతకు వాడు ఎవరో కాదు? ఇందాక తానే దుకాణాదారుగా ఫోజు కొట్టి వందకు చిల్లర తీసుకువస్తానని వెళ్ళినవాడే. ఎవరో పాపం కంగారుగా పరుగెత్తుతూ వచ్చి ఎదురుగా వస్తున్న లారీని గుద్దుకొని పడిచచ్చాడు. అన్నారెవరో ఆ గుంపులోనుంచి. విషయమంతా రాజయ్యకు అర్థమయింది. మోసం చేసి పారిపోతున్న అతను కంగారులో ప్రమాదానికి గురై చచ్చాడన్నమాట. అవును పరధనం పామువంటిది. అది ఎప్పటికైనా కాటువేయకమానదు. కానీ ఆ మోసానికి తగిన శిక్ష అనుభవిస్తున్నప్పుడు తెలుస్తుంది బాధంటే ఏమిటో. ఈ మోసగాడికి దేవుడే మరణశిక్ష విధించాడు. ప్రతి చెడ్డపనికి శిక్ష ఉన్నట్లే నమ్మిన తోడి మనుష్యుల్ని మోసగించినందుకు కూడా ఆ శిక్ష పడింది మరి. తన డబ్బు పోయినందుకుకాదు అతను చచ్చినందుకు తోటి మానవునిగా రాజయ్య మరింత బాధపడుతూ ఇల్లు చేరాడు.
==========================================================

రంగమ్మ గంగమ్మ

ఒక ఊళ్ళో రంగమ్మ, గంగమ్మ అనే ఇద్దరు ఆడవాళ్ళు ప్రక్కప్రక్కనే కాపురం వుంటున్నారు. రంగమ్మకు రెండు గేదెలు ఉన్నాయి. నెయ్యి వ్యాపారం చేస్తూ వుంది. గంగమ్మకు ఎనిమిది గేదెలు వున్నాయి. పాలు అమ్ముకుని జీవిస్తున్నది ఆమె. ఇలా వుండగా ఒకసారి గంగమ్మ రంగమ్మ దగ్గర వీశెడు నెయ్యి అప్పుతీసుకున్నది. ఎన్నిరోజులు గడిచినా బాకీ తీర్చలేదు. గంగమ్మ గయ్యాళి గంప. ఎప్పుడూ ఇరుగుపొరుగు వాళ్ళతో నిష్కారణంగా తగవులాడుతూ వుంటుంది. ఆమె నోటికి భయపడి అందరూ ఏమీ అనలేక ఊరుకునేవారు. ఇలాంటి మనిషిని నెయ్యి బాకీ తీర్చమని ఎలా అడిగేది భగవంతుడా అని బుద్ది మంతురాలయిన రంగమ్మ లోలోపల మదనపడింది. చివరకు ఎలాగో ధైర్యం చేసి 'గంగమ్మక్కా! నా దగ్గార వీశెడు నెయ్యి అప్పు తీసుకున్నావు. నీవే బాకీ తీరుస్తావని వూరుకున్నాను కానీ, నెలలు గడిచిపోయినా నీవు ఆ ప్రస్తావనే చేయలేదు. మరచిపోయావేమోనని ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఇంట్లో చుట్టాలొచ్చారు. నెయ్యి అప్పు తీరుస్తావా అక్కా!' అని ఎంతో మర్యాదగా అడిగింది. అది విని గంగమ్మ వెర్రెత్తినట్లు బర్రెగొంతుతో బిగ్గరగా అరుస్తూ పొట్లాటకు దిగింది.

ఆహా! చోద్యంగా వుందే! నేనేమిటి? నీ దగ్గర నెయ్యి అప్పుతీసుకోవడమేమిటి! ఎనిమిది గేదెల పాడి చేస్తున్న నేను ముష్టి రెండు గేదెలతో బతుకుతున్న నీ దగ్గర వీశెడు నెయ్యి అప్పు తీసుకున్నానంటే ఎవడైనా నమ్మే విషయమేనా? ఇక నోరుమూసుకొని ఊరుకో! ఎవరైనా వింటే నవ్విపోతారు. అని రంగమ్మపై విరుచుకుపడింది. ఆమెతో పోట్లాడే శక్తిలేక రంగమ్మ అప్పటికి ఏమీ మాట్లాడకుండా ఊరుకొని తర్వాత మర్యాదరామన్న దగ్గరికి వెళ్ళి విషయమంతా వివరించి గంగమ్మ పై ఫిర్యాదు చేసింది.

మర్యాద రామన్న ఒకనాడు గంగమ్మను న్యాయసభకు పిలిపించాడు. సభలో అడుగుపెడుతూనే గంగమ్మ గణాచారిలా చేతులు తిప్పుకుంటూ పెద్దగా అరవటం మొదలుపెట్టింది. అయ్యా! ఇదేనా మీధర్మం? నన్ను సభకుపిలిపించడం న్యాయమేనా? నాకు ఎనిమిది గేదెల పాడి వుంది. ఈ రంగమ్మ రెండు గేదెలు పెట్టుకొని బ్రతుకుతున్నది. అలాంటిది నేను ఆమె దగ్గరికిపోయి నెయ్యి అప్పు అడిగే అవసరం ఏముంటుంది? ఎవరినయినా చెప్పమనండి. ఇది నమ్మదగిన విషయమేనా? వినడానికే వింతగాలేదూ? నాపై గిట్టక ఆ రంగమ్మ లేనిపోని అబద్దాలు కల్పించి నా మీద ఫిర్యాదు చేసింది. మీరు ఆలోచించి రంగమ్మకు తగిన విధంగా బుద్ది చెప్పండి అని అన్నది రంగమ్మ. మర్యాద రామన్న ఆమె మాటల ధోరణి గమనించాడు. ఆమె మాటలలోని కపటం గ్రహించాడు. తీర్పు వాయిదా వేసి మరునాడు రంగమ్మను, గంగమ్మను ఇద్దర్నీ సభకు రావలసినదిగా ఆదేశించాడు. మరునాడు రామన్న తన న్యాయస్థానం ముందు భాగమంతా అడుసుపోయించి అంతా బురదగా వుండేటట్లు చేయించాడు. సభ ప్రారంభమయ్యే సమయానికి రంగమ్మ, గంగమ్మ వచ్చారు. వారిద్దరూ ఆ బురదలో నడూస్తూ న్యాయసభ దగ్గరకు రావలసి వుంది. అలాగే రంగమ్మ, గంగమ్మ మోకాలి లోతు బురదలో నడుచుకుంటు మర్యాదరామన్న సమక్షానికి వచ్చారు. వెంటనే రామన్న వాళ్ళిద్దరికి బురద కాళ్ళు కడుక్కోవడానికి రాజభటులచేత రెండు చెంబులతో నీళ్ళు తెప్పించాడు.

రంగమ్మ చెంబుడు నీళ్ళలోసగం నీళ్ళతోనే శుభ్రంగా బురద కడుక్కొని ఇంకా సగం నీళ్ళు మిగిల్చింది. కాని గంగమ్మ చెంబుడు నీళ్ళు ఖర్చుచేసినా కాళ్ళబురద పోలేదు. మరో చెంబు నీళ్ళు అందించారు భటులు, రామన్న ఆజ్ఞ ప్రకారం. అలా రెండు చెంబుల నీళ్ళు ఖర్చు చేసినా గంగమ్మకాళ్ళకు బురద పూర్తిగా పోలేదు. అది చూచి రామన్న గంగమ్మతో ఏవమ్మా! రెండు చెంబులునీళ్ళు ఇచ్చినా నీవు నీ కాళ్ళబురద వదిలించుకోలేకపోయావు. కాని రంగమ్మ సగం చెంబు నీళ్ళతోనే శుభ్రంగా బురద కడిగేసుకున్నది. దీన్ని బట్టి నీవు ఎంతటి దుబారా మనిషివో తేలిపోతుంది. నీకు వుండటానికి ఎనిమిది గేదెలు ఉన్నా, నెయ్యితీసి పొదుపుచెయ్యడం నీకు చేతకాదు. దుబారాగా ఖర్చుచేయటం నీకు అలవాటు. నీకు రంగమ్మ దగ్గర వీశెడు అప్పు తీసుకున్న మాట వాస్తవమే! రంగమ్మకు రెండు గేదెలున్నా పొదుపుగా వాడుకొనే మనిషి కాబట్టి నీవు వెంటనే వీశెడు నెయ్యి రంగమ్మకు ఇవ్వు, లేకపోతే నీకు మరణశిక్ష పడుతుంది అని అన్నాడు. గంగమ్మ మారూమాట చెప్పలేకపోయింది. చేసిన తప్పు మర్యాదగా ఒప్పుకొని వీశెడు నెయ్యి తెచ్చి రంగమ్మకు ఇచ్చింది.
===================================================

రామలింగడు -నలుగురు దొంగలు

శ్రీకృష్ణదేవరాయలవారి కొలువులో తెనాలి రామలింగడు ఒక మహాకవి. ఎంతటి వారినయినా తన తెలివితో ఓడించగలడు. రాజును సంతోషపరచి బహుమతులు ఎన్నో పొందేవాడు. నలుగురు పేరు మోసిన దొంగలు రేపు రామలింగడి ఇంటిని దోచుకోవాలని పథకం వేసి, దొంగలు రామలింగడి ఇంటి వెనుక తోటలో అరటి చెట్ల పొదలో నక్కి ఉన్నారు. రామలింగడికి భోజనం వేళయింది. చేతులు కడుగుకోవడానికి రామలింగడు పెరటిలోకి పోయాడు. అనుకోకుండా అరటిచెట్లు వైపు చూశాడు. చీకటిలో దాగిన దొంగల్ని గమనించాడు. రామలింగడు కంగారు పడకుండా ఒక ఉపాయం ఆలోచించాడు భార్యను పిలిచి పెద్దగా "ఊరిలో దొంగల భయం ఎక్కువగా ఉంది. ఈ రోజు నగలు నాణాలు ఇంటిలో ఉంచకూడదు వాటిని ఒక సంచిలో మూటకట్టి ఈ బావిలో పడేద్దాం!" అన్నాడు. ఈ మాటలు దొంగలు విన్నారు. రామలింగడి ఉపాయం ఫలించింది. తరువాత రామలింగడు భార్య చెవిలో ఏదో చెప్పాడు. ఇంటి లోపలికి పోయి ఒక మూటను తయారు చేశారు. ఒక మూటను బావిలో పడేశారు. మూటను బావిలో వేయడం దొంగలు చూశారు. వెదకబోయిన తీగ కాలికి తగిలిందని దొంగలు సంతోషించారు. అందరూ నిదురపోయేదాకా ఉండి తరువాత బావిలో దిగుదాం అని దొంగలు నిర్ణయించుకున్నారు. బాగా చీకటిపడింది. అందరూ నిదుర పోయారు. ఆ నలుగురు దొంగలు అరటి చెట్ల వెనుక నుంచి లేచి బావిలోకి తొంగి చూశారు. మొదట ఒకడు బావిలోకి దిగి నగల మూట కోసం చాలసేపు వెతికాడు. నీరు ఎక్కువగా ఉన్నందున నగల మూట దొరకలేదు. నీరు బయటికి తోడితే మంచిదని మరొక దొంగ చెప్పాడు. సరేనని చేద బావిలోకి విడిచి చాలాసేపు నీరు తోడిపోశారు. రామలింగడు దొంగలు నీరు తోడి పోయడం చూశాడు. మళ్ళీ ఉపాయం ఆలోచించాడు. చప్పుడు చేయకుండా పెరటి లోకి పోయి అరటి చెట్లకు నీరు బాగా పారేలాగా పాదులు చేశాడు. వంతులవారీగా దొంగలు బావిలోని నీరు తోడసాగారు. ఎంత తోడినా బావిలోని నీరు తరగలేదు. కాని అరటి చెట్లకు నీరు బాగా పారింది. తెల్లవారు జామున కోడికూసే వేళ వరకూ తోడిపోశారు. చివరకు మూట దొరికింది. కష్టపడినందుకు ఫలితం దక్కిందని మురిసిపోయారు. ఎంతో ఆశగా చూస్తూ మూటముడి విప్పారు. అందులో నగలకు బదులు నల్ల రాళ్ళు ఉన్నవి. దొంగలకు నోట మాట రాలేదు.

రామలింగడు వారిని ఎలా మోసం చేశాడో తెలిసింది. సిగ్గుతో తలవంచుకొని పారిపోయారు. ఇంతకాలం తమను మించినవారులేరని ఆ దొంగలు మిడిసిపడేవారు. ఎంతోమందిని దోచుకోగలిగారు. కాని రామలింగడి ఇంటిని మాత్రం దోచుకోలేక పోయారు. తెలివిగ రామలింగడే దొంగలను ఉపయోగించుకోగలిగాడు. జరిగిన సంగతి రాజుకు తెలిసింది. రాజు రామలింగడి తెలివికి సంతోషపడి బహుమతులతో గౌరవించాడు.

నీతి: ఉపాయంతో అపాయాన్ని జయించవచ్చు

No comments: