Thursday, February 3, 2011

రాజా రామమోహనరాయ్

రాజా రామమోహనరాయ్

రాజా రామమోహనరాయ్
పేరు : రాజా రామమోహనరాయ్.
తండ్రి పేరు : రమాకాంత్ రాయ్
తల్లి పేరు : శ్రీమతి ఠాకూరాణి.
పుట్టిన తేది : 22-5-1772.
పుట్టిన ప్రదేశం : బెంగాలులోని రాధా నగర్ అనే గ్రామాంలో జన్మించాడు.
చదివిన ప్రదేశం : పాట్నా.
గొప్పదనం : విగ్రహారాధన, స్త్రీ విద్య పై ఆంక్షలు, సతీసహగమనం మొదలగు దురాచారాల గురించి పోరాడాడు.
వ్రాసిన రచనలు : 'హిందూ స్త్రీల హక్కులపై దురాక్రమణ'.
స్వర్గస్తుడైన తేది : క్రీ.శ. 1833 వ సంవత్సరం.

రాజారామమోహన్ రాయ్ 1772 మే 22 న బెంగాలులోని రాధా నగర్ అనే గ్రామాంలో జన్మించాడు. తండ్రి రమాకాంత్ రాయ్ ముర్షీదా బాద్ పాలకులైన మహమ్మదీయుల ఆస్థానంలో పనిచేసేవాడు. తల్లి ఠాకూరాణి సనాతనురాలు. రామమోహనరాయ్ ప్రాధమిక విద్యను ఆ గ్రామంలోనే అభ్యసించాడు. తరువాత పాట్నాకు వెళ్ళి అక్కడ చదువుకున్నాడు. చిన్నతనం నుంచే అతను ఖురాన్, బైబిలు, భగవద్గీత క్షుణ్ణంగా చదివాడు. అంతేకాదు ఆయా గ్రంధాల లోతుపాతుల్ని గ్రహించాలనే జిజ్ఞాసతో, అరబ్బీ భాషను, సంస్కృత భాషను, ఇంగ్లీషును అభ్యసించి, ఆయా మతాలకు సంబంధించిన ఇతర గ్రంధాలను అధ్యయనం చేశాడు. ఒకప్పుడు భారతదేశంలోని స్థితిగతులను చూసిన వారెవ్వరూ ఇంతటి మార్పు వస్తుందని కలలో కూడా ఊహించి ఉండరేమో?

ఆ రోజుల్లో సాంఘీక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉండేవి. చాందస సంప్రదాయాలు, మూఢ నమ్మకాలు, అవివేకంతో కూడిన ఆచారాలు, నిరక్షరాస్యత దేశ జీవన వాహినికి అడ్డుగోడలై అంధకారమయిపోయింది. దానికితోడు బ్రిటీష్ దొరల పెత్తనం, మన దేశ ప్రజలను సాంఘీకంగా, రాజకీయంగా పెరగనివ్వకుండా, మూఢ నమ్మకాల వలయంలో కూరుకుపోవడానికీ అవకాశం కలిగించి, ప్రజలను మరింత చీకట్లోకి పడవేయడానికి ఎంతగానో ప్రయత్నించారు. అటువంటి సమయంలో వెలుగు రేఖలా అవతరించాడు "మహా మనిషి" రాజా రామమోహన రాయ్. "ప్రముఖ సంఘ సంస్కర్తగా, మానవతావాదిగా, యుగకర్త" గా కొనియాడబడిన మహా వ్యక్తి. మన ఆచారాల విషయంలో గుడ్డి నమ్మకాలు, జుగుప్స కలిగించే విశ్వాసాలు, అజ్ఞానంతో కూడిన ఆచారాలు, పాప విముక్తి కొరకు ఆచరించే అనేక ప్రక్రియలు రాం మోహన్ రాయ్ కి ఎంతో చికాకు కలిగించాయి.

ఒక మతానికి చెందినవారు ఇతర మతాలకు చెందిన వారిపై నిందారోపణలు చేయటం, బహిరంగంగా విమర్శించుకోవటం, ముష్టి యుద్ధాలకు దిగటం ఆయన సహించలేకపోయాడు. ఆయన ఉద్దేశంలో "దేవుడనే వాడు ఒకడే. ఏ మతమైనా, కులమైనా అందరూ ఆరాధించేది ఒకరినే. అందరి పూజలూ ఆయనకే చేరుతాయి. మతాలన్నీ కలసి పోయి విశ్వమతం ఏర్పడాలి "ఆ ఆలోచనలే ఆయన బ్రహ్మ సమాజం స్థాపించడానికి పురికొల్పాయి. రాయ్ హిందువు అయినప్పటికీ, హిందూ మతంలోని దురాచారాలను, మూఢ విశ్వాసాలను తీవ్రంగా ఖండించేవాడు. ఆ సమయంలోనే వాటిని ఖండిస్తూ ఒక వ్యాసం రాసినప్పుడు తండ్రికి కోపం వచ్చి, అతనిని ఇంటి నుండి గెంటివేశాడు. అయినా, రాయ్ చలించక, తన దేశ ప్రజలు బాగుపడాలంటే మూఢ విశ్వాసాలను వదిలి, బాగా చదువుకొని జ్ఞానం సంపాదించి తెల్లదొరల బానిసత్వపు చెరను తప్పించుకొని, స్వతంత్రంగా బతకాలని భావించి తన భావి కార్యక్రమాన్ని నిర్ణయించుకున్నాడు. ఆ రోజుల్లో భారతదేశంలో మతం పేరిట పీడిస్తున్న దురాచారాలలో "సతీసహగమనం" ముఖ్యమైనది.

భర్త మరణించగానే అతని శరీరం దహనం చేసేటప్పుడు భార్య కూడా ఆ మంటల్లోకి దూకి దహనమయ్యే అనాగరిక చర్యను అప్పటి ప్రజలు ఎంతో పవిత్ర కార్యక్రమంగా భావిస్తూండేవారు. రాయ్ ఆ చర్యను ఖండించినప్పుడు ఎందరో పెద్దల ఆగ్రహానికి, అసంతృప్తికి గురి అయ్యాడు. అయినా పట్టువిడువక, బ్రిటీష్ దొరలతో పోరాడి "సతి"ని నిషేధించమని హవుస్ ఆఫ్ కామన్స్ కి ఒక విజ్ఞాపనపత్రం సమర్పించాడు. అయితే అప్పటి ప్రభుత్వం ఆ విజ్ఞాపనను తిరస్కరించింది. రాయ్ విజ్ఞాపనను అంగీకరిస్తే అతను ఇంకా అనేక సంఘ సంస్కరణలు తలపెట్టి ప్రజల్ని చైతన్యవంతులుగా చేస్తాడేమోననే భయం వారిలో ఎక్కువగా ఉండేది. భారతీయులు సాంఘీకంగా గానీ, రాజకీయంగా గానీ విజ్ఞానపరంగా గానీ చైతన్యవంతులుకావటం వారి కిష్టంలేదు. హిందూ స్త్రీలకు "సతి" దురాచారం ద్వారా అన్యాయం జరుగకుండా కాపాడటమే కాకుండా, స్త్రీలకు వారి తండ్రి, భర్తల ఆస్తిలో హక్కు ఉండాలని కృషి చేసిన మొట్టమొదటి వ్యక్తి రామ మోహన రాయే. 1823లో "హిందూ స్త్రీల హక్కులపై దురాక్రమణ" అనే గ్రంధం కూడా రాసి సంచలనం సృష్టించాడు.

రాయ్ సంఘ సంస్కర్తగా తన విధి నిర్వహణలో అష్టావధానం చేశాడు. విద్య, సంగీతం, సాహిత్యం, రాజకీయం, విశ్వమత ప్రచారం, ప్రజల ప్రతినిధిగా, మూఢ విశ్వాసాలను ఖండించే వ్యక్తిగా అనేక రంగాలలో కృషి చేశాడు. రాయ్ బెంగాలీ బాషలో "బెంగాలీ భాషా వ్యాకరణం" రాశాడు. దాన్ని 1833లో కలకత్తాలో ప్రచురించారు. అనంతరం పాఠశాలలో పాఠ్యయగ్రంథంగా ప్రవేశపెట్టడం జరిగింది. మతానికి సంబంధించిన అనేక గీతాలు రాశాడు. ఆ రోజుల్లోనే పత్రికా రంగానికి ఎంతో చేయూతనిచ్చిన ఘనత కూడా రాయ్ కే దక్కింది. కలకత్తాలో ప్రారంభమయిన తొలి పత్రిక "బెంగాల్ గెజెట్"ను 1916 నుండి 1920 దాకా రాయ్ శిష్యులే నిర్వహించారు. కాలక్రమాన రాయ్ సంఘ సంస్కరణ కార్యక్రమాల్ని పరిశీలించిన ఢిల్లీ పాలకులు తమ తరపున, బ్రిటీష్ ప్రభుత్వంతో పనిచేయమని కోరారు.

ఢిల్లీ చక్రవర్తి తరపున ప్రాతినిధ్యం వహిస్తూ అనేకపర్యాయాలు ఇంగ్లాండువెళ్ళి రాజుకి, బ్రిటీషు ప్రభుత్వానికి ఉన్న విభేదాలను తొలగించడానికి ఎంతో కృషి చేశారు. ఆయన చొరవకు, విజ్ఞానానికి, తెలివితేటలకు, సమయస్ఫూర్తికి , స్వామి భక్తికి బ్రిటీషు వారు కూడా విస్తుపోయారు. ఢిల్లీ చక్రవర్తి ఆయన సేవలకు మెచ్చి "రాజా" అనే బిరుదు నిచ్చాడు. అప్పటి నుండి ఆయన రాజా రామమోహన్ రాయ్ అయ్యాడు. ఆ రోజుల్లో ఆయనను, ఆయన భావాలను అర్ధం చేసుకున్నవారు చాలా తక్కువ. చాలామంది ప్రజలు ఆయనను కఠినంగా తిరస్కరించారు. రాజా రామమోహన్ రాయ్ ఆశయసిద్ది కొరకు చివరి వరకు పోరాడారు.

1833 సెప్టెంబర్ 27న రాయ్ స్వర్గస్థుడయ్యాడు.రాజారామమోహన్ రాయ్ జీవించి వుండగా తన ఆశయాలను ఆచరణ రూపంలో చూడలేకపోయినా ఆయన తదనంతరం ప్రజలే వాటిలోని సత్యాన్ని గ్రహించి ఆయనను"యుగకర్తగా" కీర్తించి, ఆయన అడుగు జాడలలో నడుచుకుంటున్నారు.


No comments: