Friday, February 25, 2011

నీతికధలు 17

కుక్క - గాడిద

ఒక చాకలివాడి దగ్గర గాడిద, కుక్క ఉండేవి. కుక్క పగలూ, రాత్రీ చాకలివాడి ఇల్లు కాపలా కాసేది. గాడిద బండెడు బట్టల మూటలు వీపు మీద మోసుకుని చెరువుకు తీసుకెళ్ళేది. కొంత కాలం గడిచాక... 'ఇంతవరకు ఒక్క దొంగ కూడా నా ఇంటికి రాలేదు. ఇన్నిరోజులు ఈ కుక్క తిండి కోసం అనవరంగా చాలా ఖర్చు చేశాను" అని భార్యతో అన్నాడు.

ఈ మాటలు విన్నది కుక్క. 'రాత్రంతా మేలుకుని ఎంత సేవ చేశాను? నేనుండటం వల్లే దొంగలు పడలేదన్న విషయం విస్మరించాడు'. అనుకుని ఎంతో బాధపడింది.

ఆ రోజు నుండి చాకలివాడి భార్య కుక్కకు సరిగ్గా ఆహారం ఇవ్వడం మానేసింది. పాపం ఆ కుక్క పగలంతా ఆహారం కోసం ఊళ్ళో తిరిగి తిరిగి... ఏమైనా దొరికితే ఇంత తిని, ఓపిక ఉంటే చాకలివాడి ఇంటికి వచ్చేది. లేదంటే ఊళ్ళో ఎక్కడో ఒక చోట ముడుచుకుని పడుకునేది. కొన్ని రోజులు గడచాక... ఒక అర్ధ రాత్రి దొంగ ఒకడు చాకలివాడి ఇంటిలోకి ప్రవేశించాడు. కుక్క దొంగను చూసింది కాని మొరగలేదు. నిశ్శబ్దంగా చూస్తూ కుర్చుంది. దొంగ ఇంటిలోకి వెళ్ళడం గాడిద కూడా పసిగట్టింది.

"ఒక దొంగ మన యజమాని ఇంట్లోకి వెళ్ళాడు తెలుసా?" రహస్యంగా అంది గాడిద.

"అవును, తెలుసు"

"మరి యజమానిని ఎందుకు హెచ్చరించడం లేదు?"

"నా ఇష్టం" నిర్లక్ష్యంగా జవాబిచ్చింది.

"నీ ఇష్టప్రకారం నువ్వు నిర్ణయాలు తీసుకోకూడదు. యజమాని ఇంటిని కాపాడటం నీ బాధ్యత" అని చెప్పింది గాడిద.

"నోరు మూసుకుని పడుకో. అనవసరమైన సలహాలు ఇవ్వకు" కుక్క కోపంగా చెప్పింది.

"సరే... నువ్వు మొరగకు. నేను గట్టిగా అరచి యజమానిని నిద్రలేపుతాను. కుక్క కంటే గాడిదే విశ్వాసమైనదని రుజువు చేస్తాను" అని గాడిద గట్టిగా ఓండ్ర పెట్టింది.

లోపల గాఢనిద్రలో ఉన్న చాకలివాడు ఉలిక్కిపడి నిద్రలేచాడు. బంగారంలాంటి నిద్ర చెడగొట్టినందుకు అతనికి చాలా కోపం వచ్చింది. ఒక దుడ్డు కర్ర తీసుకువచ్చి "ఏం పోయేకాలమే నీకు. అర్థరాత్రి రచ్చ చేస్తున్నావు" అంటూ గాడిదను రెండు బాది, తిరిగి వెళ్ళి నిద్రపోయాడు.

రహస్యంగా ఇంటిలో ఒక మూల నక్కిన దొంగ విలువైన వస్తువులను చక్కగా మూటకట్టుకుని పారిపోయాడు. ఆ మరునాడు ఉదయం నిద్రలేచిన చాకలివాడు ఇల్లు గుల్లవడం చూసి లబోదిబోమన్నాడు. బక్కచిక్కిపోయి నీరసంగా పడున్న కుక్కని చూశాకగాని అతనికి జ్ఞానోదయం కాలేదు. తన తప్పు తెలుసుకున్న చాకలివాడు ఆ రోజునుండి కుక్కకు ఆహారం ఇస్తూ మంచిగా చూసుకోసాగాడు.
=======================

పంటలో వాటా

నజీరుద్దీన్‌ ముల్లాగా మారాక స్వంతంగా ఏదైనా పని చేద్దామని నిర్ణయించుకున్నాడు. అందుకు వ్యవసాయం బావుంటుందని అనుకున్నాడు. ఒక ఆసామి దగ్గరకు వెళ్ళి, పొలం అద్దెకిస్తే వ్యవసాయం చేసుకుంటానన్నాడు.

ఆ ఆసామి జిత్తులమారి. నజీరుద్దీన్‌ వ్యవసాయానికి కొత్త అని కనిపెట్టి, "అలాగే!నా భూమిలో నీవు పంట వేసుకో. కాని అద్దె కట్టాలి"అన్నాడు.

"అలాగే.అద్దె ఎంత?" అడిగాడు నజీరుద్దీన్‌.

"పొలం పండిన తర్వాత, భూమిపైన ఉన్న పైరంతా నాకిచ్చేయాలి. అదే అద్దె" అన్నాడు. ఆ కుటిల ఆస్వామి.

" అలాగే". అని నజరుద్దీన్‌ ఆ రోజునుండే పొలం పనుల్లో నిమగ్నమయ్యాడు.

కొంతకాలానికి పొలం పండే సమయం వచ్చింది. కోత కూడా అయిపోయిందని తెలిసిన ఆసామీ తన వాటా కోసం నజరుద్దీన్‌ దగ్గరకి వెల్లాడు.

"భూమిపైన ఉన్న పైరంతా కోసి సంచుల్లో ఎక్కించాను. తీసుకువెల్లండి"అన్నాడు.

ఆసామి సంచుల్లో చూస్తే అన్నీ ఆకులే ఉన్నాయి. తనను మోసం చేశాడని న్యాయ మూర్తి దగ్గర ఫిర్యాదు చేశాడు.

ఆయన నజీరుద్దీన్‌ని కూడా పిలిపించి విచారించాడు."

ఈ ఆసామి చెప్పేది నిజమేనా?" అని అడిగాడు.

"అవును. నిజమే" అన్నాడు నజీరుద్దీన్‌.

"మరి మోసం చేశావెందుకు?" అడిగాడు. మోసం ఏం ఉంది? ఆయన భూమిపైన పైరు కావాలన్నాడు. నేను వేరుశనగ వేశాను. ఆయన కోరినట్టే భూమిపైనదంతా ఆయన కిచ్చి, గింజలు నేను తీసుసున్నాను". అన్నాడు నజీరుద్దీన్‌.

నజీరుద్దీన్‌ తెలివికి న్యాయమూర్తి మెచ్చుకుని, అన్యాయమైన వాటా అడిగినందుకు ఆసామిని చీవాట్లు పెట్టాడు.
================================

ఒంటికన్ను దుప్పి

ఒక అడవిలో ఒక ఒంటికన్ను దుప్పి ఉండేది. ఆ దుప్పి కన్ను లేని వైపు నుండి, ఎవరైనా దాడి చేయడానికి వచ్చినా చూడలేకపోయేది. దానికి వేటగాళ్ల నుండి, క్రూరమృగాల నుండి రక్షణ కావాలి కాబట్టి చాలా ఆలోచించగా దానికి ఒక ఉపాయం తట్టింది. ఆరోజు నుండి అది తన కన్నున్న భాగాన్ని గడ్డివైపు, కన్నులేని భాగాన్ని సముద్రం వైపు ఉంచి మేతమేసేది. సముద్రం వైపు నుండి ఏ విధమైన అపాయాలు రావు అని అనుకునేది ఆ దుప్పి.

కాని ఒక రోజు ఒక వేటగాడు పడవపై ప్రయాణిస్తూ వచ్చాడు. దుప్పిని చూసిన వెంటనే ఆ వేటగాడు తన బాణం సంధించాడు. బాణం దుప్పి కాలిలో గుచ్చుకుంది. బాధతో విలవిల్లాడిపోతూ దుప్పి అక్కడి నుండి ఎలాగో తప్పించుకుని పారిపోగలిగింది.

'నేను గడ్డి వైపు నుండి అపాయం వస్తుందనుకున్నాను. కాని అపాయం రాదు అనుకున్న సముద్రం వైపు నుండే అపాయం వచ్చింది. అడవి జంతువులకు అపాయం అన్ని వైపుల నుండి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి' అని అనుకుంది.

ఆ రోజు నుండి దుప్పి మరింత జాగ్రత్తగా అడవిలో సంచరించడం మొదలు పెట్టింది.

నీతి: అపాయాలు అనుకోని విధంగా, అనుకోని కారణాల వల్ల వస్తాయి.
===============================

గాడిద గర్వం...

ఒక పాడుబడ్డ గుడిసెలో ఒక గాడిద, కోడిపుంజు ఉండేవి. గాడిద బాగా లావుగా, దిట్టంగా ఉండేది. రెండు జంతువులూ చాలా స్నేహంగా ఉండేవి. ఒక రోజు ఒక సింహం తన దారిలో వెళ్తూ దిట్టంగా ఉన్న గాడిదను చూసింది. ఎలాగైనా దానిని చంపి,తినాలని అనుకుంది.

సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న సింహానికి గాడిద గడ్డి తింటూ పరధ్యానంగా ఉండడం గమనించింది. అంతే, చెట్టు మాటున దాగి, గాడిదపై దాడి చేయాలని ఒక రంకె వేసింది. సింహాన్ని గమనించిన కోడిపుంజు తన మిత్రుడిని చంపుతుందేమోనని "కొక్కొరోకో....కొక్కొరో" మని అరవసాగింది. కోడి పుంజు గోల విన్న సింహం ఎవరైనా వస్తారేమో అని భయపడి వెనుదిరిగి పారిపోయింది. కోడిపుంజు అరుపులను విని పరధ్యానంలో నుండి తేరుకున్న గాడిద సింహం పారిపోవడం చూసి తనను చూసి భయపడి పారిపోతుందేమోనని, తనను తాను మృగరాజులా ఊహించుకుని సింహం వెంటబడడం ప్రారంభించింది.

సింహం కంటే వేగంగా పరిగెత్తి సింహాన్ని చేరుకునేంతలో సింహం వెనక్కి తిరిగి చూసింది. అవకాశం వెతుక్కుంటూ కాళ్ల దగ్గరికే వచ్చింది అనుకుని ఒకేఒక్క గెంతులో గాడిద మీద పడింది. తన పని ముగించి బ్రేవుమంది.

నీతి: అహంకారం ఆపదలకు నాంది.
==============================

గుడ్డి రాబందు - జిత్తులమారి పిల్లి

ఒక నది ఒడ్డున ఒక గుడ్డి రాబందు నివసించేది. ఎన్నో ఇతర పక్షులూ అదే చెట్టుపైన జీవించేవి. పక్షులు తాము తెచ్చుకున్న ఆహారములో కొంత రాబందుకు కూడా ఇచ్చేవి. బదులుగా, ఆ పక్షులు గూళ్లలో లేనపుడు వాటి పిల్లలను రాబందు చూసుకునేది.

ఒకరోజు ఒక పిల్లి చెట్టుమీద ఉన్న పక్షి కూనలను గమనించింది. ఎలాగైనా వాటిని ఆరగించాలని అనుకుంది. కాని పిల్లి రావడం గమనించిన పక్షి కూనలు అరవడం మొదలెట్టాయి. వాటి అరుపులు విన్న గుడ్డి రాబందు "ఎవరు, ఎవరక్కడా?" అని అరిచింది.

రాబందును చూసిన పిల్లికి ప్రాణం పోయినంత పనయింది. 'నా పనైపోయిందిరా దేవుడా. ఈ రాబందు నన్ను వదలుదురా బాబు! దీన్ని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించాలి' అని అనుకుంటూ, " నేనే...నీ ఆశీర్వాదం పొందాలని వచ్చాను గురువా" అన్నది పిల్లి గట్టిగా. రాబందు ఎవరు నువ్వు? అని అడిగింది.

"నేను పిల్లిని" అని జవాబిచ్చింది పిల్లి.

"వెళ్ళిపో, లేకపోతే నీ ప్రాణం తీస్తాను" అని అరిచింది రాబందు. రాబందు అరుపులకు భయపడ్డ పిల్లి "గురూ్! నా మాట విను తర్వాత నన్ను చంపినా సరే" అని ప్రాధేయపడింది.

"మరి నువ్వెందుకు వచ్చావో చెప్పు?" అని రాబందు పిల్లిని నిలదీసింది.

"నీవు ఎంతో బుద్ధి, తెలివితేటలు గలవాడివని విని, నీ ఆశీర్వాదం పొందాలని వచ్చాను. కాని నీవు ఈ బక్క పిల్లిని చంపాలనుకుంటున్నావు. "నన్ను అతిధిలా ఆదరించాలి" అని చెప్పింది పిల్లి. పిల్లి మాటలకు రాబందు "కాని నువ్వు మాంసాహారివి. నిన్ను నేనెలా నమ్మగలను?" అంది. బదులుగా పిల్లి "నేను జీవహింస చేయడం పాపమని తెలుసుకుని శాకాహారిలా మారిపోయాను" అని చెప్పింది. గుడ్డి రాబందు పిల్లిని నమ్మింది. చెట్టుపైన ఉన్న తన గూట్లో ఉండనిచ్చింది. రోజులు వేగంగా గడుస్తున్నాయి, జిత్తులమారి పిల్లి పక్షి కూనలను ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా తినడం మొదలు పెట్టింది. గుడ్డి రాబందుకు ఏమి జరుగుతుందో అర్ధం కాలేదు.

కాని పక్షులు మాత్రం తమ పక్షి కూనలు కనబడకపోతుండడం గమనించాయి. ఎప్పుడైతే తన పని ముగిసిందో, పిల్లి మెల్లగా్ జారుకుంది. కొన్ని రొజుల తర్వాత, పక్షులు తమ పక్షి కూనల ఎముకలను గుడ్డి రాబందు గూటిలో కనిపెట్టాయి.

"ఈ గుడ్డి రాబందు మన పిల్లల్ని తినేసింది" అనుకుని, పక్షులన్నీ కలిసి ఆ గుడ్డి రాబందును పొడిచి చంపేశాయి.

నీతి: దుష్టులతో స్నేహం చేస్తే, మంచి వారూ దోషులుగా పరిగణింప బడతారు.
==============================

పిరికి దుప్పి

అది దట్టమైన పచ్చని అడవి. ఒక దుప్పి దాని పిల్ల దుప్పితోపాటు గడ్డిమేస్తూ అడవంతా తిరుగుతోంది. అడవిలో పరిసరాలు చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉన్నాయి.

హఠాత్తుగా ఆ దుప్పులకు వేటకుక్కలు మొరుగుతున్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం దూరం నుంచే వినిపిస్తున్నా తల్లి దుప్పిలో విపరీతమైన అలజడి ప్రారంభమైంది. వేటకుక్కలు ఎటునుంచి వస్తున్నాయో, వాటి అరుపులు ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయో అర్ధంకాక అటూ ఇటూ చూస్తూ కలవరపడింది.

తల్లిని చూసి విషయం అర్ధం కాని దుప్పిపిల్ల " అమ్మా! వేటకుక్కల కంటే పెద్దగా ఉన్నావు కదా. మరి వాటిని చూసి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు వాటికంటే వేగంగా పరుగెత్తుతావు. నీకు కొమ్ములు కూడా ఉన్నాయి. వాటితో ఆ వేటకుక్కలను తరిమికొట్టచ్చు" అని అంది.

దుప్పిపిల్ల మాటలకు తల్లి, "అవును, నిజమే," అంటూ కుక్కల అరుపులు విన్న వెంటనే పారిపోవడం ప్రారంభించింది. తల్లి ప్రవర్తన అర్ధంకాని దుప్పిపిల్ల కూడా తల్లి వెంటే పరిగెత్తింది.

నీతి: పిరికిపందకు ఒకరిని ఎదుర్కొనే ఆత్మ విశ్వాసం ఉండదు.
=======================================

ప్రియమైన వస్తువు

ఒకరోజు అక్బరు చక్రవర్తికి తన రాణి పట్ల చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో ఆయన రాణిని అంత:పురం విడిచి పుట్టింటికి వెళ్ళిపొమ్మని, ఇంకెప్పూడూ తిరిగి రావద్దని ఆజ్ఞాపించాడు. రాణి అక్బరు కోపం పోగొట్టడానికి ఎన్నో రకాలుగా ప్రాధేయపడింది. కాని, ఆయన రాణి మాటలు వినే స్థితిలో లేడు. ఏం చేయాలో పాలుపోక రాణి బీర్బలు కు కబురు పంపింది. బీర్బల్‌ వచ్చాక జరిగినదంతా చెప్పి ఆ సంకటంలోంచి తనను గట్టెక్కించమని ప్రాధేయపడింది. బీర్బల్‌ ఆమెను ఓదార్చి, కొద్దిసేపు ఆలోచించి ఒక ఉపాయం చెప్పాడు. అది విన్న రాణి మనసు కొంత కుదుటపడింది.

వెంటనే రాణి కోపంగా ఉన్న అక్బరు దగ్గరకి వెళ్ళి "ప్రభూ, మీ ఆదేశానుసారం నేను రేపు ఈ కోటను వదిలి వెడుతున్నాను. ప్రభువుల వారు అనుమతి ఇస్తే నాకు ప్రియమైంది నాతో తీసుకువెళ్ళాలనుకుంటున్నాను." అని వినయంగా చెప్పింది.

"ఈ కోట నుండి నీకేం కావాలో అది తీసుకువెళ్ళు" అని జవాబిచ్చాడు అక్బరు. ఆ మరునాడు రాణి తన ప్రయాణానికి సిద్ధం అయ్యింది. అప్పుడు బీర్బల్‌ అక్బర్‌ దగ్గరకు వెళ్ళి "ప్రభూ, రాణీగారు కోటను వదిలి వెళ్ళి పోవాలనుకుంటున్నారు కాని వారికి ప్రియమైన వస్తువు ఒకటి ఉందని, అది లేనిదే వెళ్ళలేనని అంటున్నారు." అని చెప్పాడు.

"తనకేం కావాలో అది తీసుకుని తక్షణం ఇక్కడుంచి వెళ్ళిపోమని చెప్పు."

"అలాగే జహాపనా. ఆవిషయంలోనే వారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు"

సరే రమ్మని చెప్పు" అని ఆదేశించాదు అక్బరు.

రాణి సరాసరి అక్బరు ముందు నిలబడి "ప్రభూ మీరు నా ప్రియమైన వస్తువు నాతో తీసుకెళ్ళవచ్చని అనుమతి ఇచ్చారు. మీరు నాతో కలిసి మా పుట్టింటికి రమ్మని మిమ్మల్ని ప్రార్ధిస్తున్నాను. మీకంటే ప్రియమైనది ఈ ప్రంపంచంలో నాకు ఇంకొకటి లేదు," అంది రాణి వణికే కంఠంతో.

రాణి మాటలు వినగానే అక్బరులోని కోపం ఒక్కసారిగా చల్లారింది. రాణి తనను ఎంతగానో ప్రేమిస్తోందన్న విషయాన్ని గ్రహించాడు. ఈ తెలివైన ఆలోచన ఎవరిదో అక్బరుకు తెలుసు. అందుకే నవ్వుతూ బీర్బల్‌ వైపు చూశాడు.
==============================

తొందరపాటు

ఒక వర్తకుడు జాతరలో తన సరుకునంతా అమ్మి బాగా సొమ్ము చేసుకున్నాడు. సంచులన్నీ డబ్బులతో బరువెక్కిపోయాయి. జాతర ముగిసిన తర్వాత చీకటి పడకముందే ఇల్లు చేరాలని నిశ్చయించుకున్నాడు.

మధ్యాహ్నమంతా ఒక పట్టణంలో విశ్రాంతి తీసుకున్నాడు. అతనింక బయల్దేరాలనుకునే సమయానికి అతని పనివాడు వర్తకుడి గుర్రాన్ని వెంటబెట్టుకు వచ్చి "అయ్యా! గుర్రం ఎడమ గిట్టలో ఒక మేకు ఉండిపోయింది. ఇప్పుడేం చేద్దాం! అని అడిగాడు. దానికా వర్తకుడు "ఉండనివ్వరా, ఏం కాదులే!" అని జవాబిచ్చి ఊరుకోకుండా "నేను ఇంకా ఆరుమైళ్ళ దూరం వెళ్ళాలి, నేను కొంచెం తొందరగా ఉన్నాను. నాగుర్రానికి నన్ను సవ్యంగా ఇల్లు చేర్చే సత్తా ఉంది" అన్నాడు.

సాయంత్రం వేళ అతను ఒక సత్రం దగ్గర మళ్ళీవచ్చి "అయ్యా! గుర్రం ఎడమ గిట్టకున్న నాడా ఊడిపోయింది. నేను దాన్ని కంసాలి వద్దకు తీసుకెళ్ళాలా?" అని అడిగాడు.

"దాన్నలాగే ఉండనివ్వరా బాబూ! నా గుర్రం మరో రెండు మైళ్ళు నన్ను మోయ లేదా? నేను కాస్త తొందరలో ఉన్నాను కదా?" అని బదులిచ్చాడు వర్తకుడు.

అలాగే వర్తకుడు ప్రయాణం సాగించాడు. కాని కొద్ది దూరం ప్రయాణించాక గుర్రం కుంటడం మొదలెట్టింది. మెల్లిగా కుంటడం మొదలెట్టి ఒక దగ్గర కూలబడిపోయింది. హఠాత్తుగా కూలబడిపోవడం వల్ల గుర్రం కాలు విరిగిపోయింది. అంతే! వర్తకుడు బిత్తరపోయాడు. గుర్రాన్ని అక్కడే వదిలేసి, సంచులన్నీ మోసుకుంటూ, రొప్పుతూ నడుస్తూ ఇల్లు చేరాడు.

వర్తకుడు తన పనివాడి మాట విని గుర్రానికి గిట్టలకు నాడాలు వేయించినట్లయితే వర్తకుడికి బాధలు తప్పేవి కదా! సమయస్పూర్తితో మెలుగుతూ, చెయాల్సిన పనిని తగిన సమయంలో పూర్తిచేస్తే ఎలాంటి ఆపదలూ, ఇబ్బందులూ ఉండవు.

మీ పనిపై మనసు లగ్నం చేయండి. అలా చేయడం వల్ల అన్ని పనులూ అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఇలా చేయడం వలన అద్భుతాలు చేయడం ఏమంత కష్టంకాదు.

No comments: