Sunday, February 20, 2011

నీతి కధలు 3

కలిసి ఉంటే కలదు సుఖం

అనగనగా ఒక అడవిలో నాలుగు ఆవులు కలిసి మెలసి ఉండేవి. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ నాలుగు ఆవులు కలిసే వెళ్ళేవి. మేతకు వెళ్లినా కలిసే మేతకు వెడుతూ ఉండేవి. వాటి యజమాని కూడా వాటి ఐకమత్యానికి ఎంతో ఆనందించేవాడు. ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు ఆ నాలుగు ఆవులు ఎప్పటిలా మేతకు వెళ్లాయి. వాటిల్లో అవి కబుర్లు చెప్పుకుంటూ గడ్డి తింటున్నాయి.

అంతలో ఓ సింహం గాండ్రిస్తూ అక్కడికి వచ్చింది. దూరంగా మేత మేస్తున్న ఆవులను చూడగానే దానికి నోరూరింది. "ఆహా! ఈరోజు నాకువిందు భోజనం దొరికిందన్న మాట. ఈ ఆవులు చాలా పుష్టిగా ఉన్నాయి. వీటిని చంపి నా ఆకలి తీర్చుకుంటాను" అని సింహం అనుకుంది.

సింహాన్ని చూస్తే నిజానికి ఆవులు భయపడాలి. కానీ అవి ఏమాత్రం భయపడలేదు. "చూడండి సింహం మనల్ని భయపెట్టేందుకు గాండ్రిస్తోంది. మీరుభయపడద్దు. మనందరం ఐకమత్యంగా ఉంటే ఈ అడవిలో ఏ జంతువు మనల్ని ఏమీ చెయ్యలేదు. నేను చెప్పినట్లు చెయ్యండి. ఆ సింహం మన దగ్గరకు రాగానే మనం నలుగురం కలిసి మన వాడి కొమ్ములతో దాని మీదకు దూకుదాం దానిని తరిమికొడదాం" అని చెప్పింది ఆ నాలుగు ఆవులలో ఒక ఆవు. "నీఆలోచన బాగుంది. నువ్వు చెప్పినట్టుగానే చేద్దం" అంటూ మిగిలిన ఆవులు అంగీకరించాయి.

అంతే సింహం తమ మీద దూకేలోపునే నాలుగు ఆవులు కలిసి సింహం మీద దూకాయి. తమ వాడి కొమ్ములతో సింహాన్ని పొడిచాయి. సింహానికి ఎదురు దాడి చేసే అవకాశం ఇవ్వకుండా ఆవులు దాడికి దిగాయి. అంతే సింహంవాటి దాడికి ఎదురు నిల్వలేక భయపడి పారిపోయింది. ఆ విధంగా ఆవులు తమ ప్రాణం కాపాడుకున్నాయి.

అయితే సింహం వాటిని విడిచిపెట్టలేదు. శారీరక బలంతో సాధించలేనిది బుద్ధిబలంతో సాధించచ్చు అని దానికి తెలుసు. అందుకే మంచి సమయం చూసి ఆ నాలుగు ఆవులను విడి విడిగా కలిసింది.

ఆ రోజు మీరంతా కలిసి నామీద పోట్లాడినప్పుడు "నీ కొమ్ముల వాడితనం ఉందే అబ్బో నిజంగా సింహం పంజా కూడా నీ కొమ్ముల వాడితనం ముందు ఎందుకు పనికి రాదు. నువ్వు లేకపోతే మిగిలిన ఆవుల పని పట్టేదాన్ని నేనునీ బలానికి నీ ధైర్యానికి తలవంచి నమస్కరిస్తున్నాను. అంతా బాగానే ఉంది కానీ నువ్వే కదా మిగిలిన మూడు ఆవులకు ఏదైనా ఆపద వస్తే రక్షిస్తోంది. అంటే నువ్వు నిజానికి మీ జట్టుకు నాయకుడివిలాంటి వాడివి. కాబట్టి మిగతా మూడు నీకు మేత తెచ్చిపెట్టాలి. అంతేకాదు నువ్వు ఏ పని చెప్పినా అవి చెయ్యాలి. కానీ ఇక్కడ అలా జరగటం లేదు. అదే నాకు బాధగా ఉంది" అని చెప్పింది. ఆ ఆవు ఆలోచనలో పడింది.

ఇలా ప్రతి ఆవు దగ్గరకు వెళ్లి చెప్పింది. దాంతో నాలుగు ఆవులు మిగతావాటి కన్నా తామే గొప్ప అని అనుకోవడం మొదలుపెట్టాయి. అట్లా అనుకుని ఊరుకోకుండా దేనికది మిగతా ఆవుల మీద అజమాయిషీ చేయడం మొదలు పెట్టాయి. దాంతో వాటి మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ పెరిగి పెరిగి పెద్దదైయింది. వాటి మధ్య ఉన్న ఐకమత్యం దెబ్బతింది. ఆ నాలుగు ఆవులు ఒకదాని పొడ ఒకదానికి గిట్టదన్నట్టు ఎవరికి వారే అన్నట్టు సంచరించసాగాయి. ఇదివరకులా అవి కలిసి మెలసి ఉండటం లేదు. కలిసి మేతకు వెళ్ళడంలేదు. ఎవరికి వారుగా విడిపోయి వేరు వేరు ప్రాంతాలలో మేత మేయసాగాయి. వాటి మధ్య ఇదివరకు ఉన్న ఐక్యత ఇప్పుడు లేదు. తను అనుకున్నది సాధించినందుకు సింహం ఆనందించింది. వాటిని విడగొట్టినందుకు దానికి చాలా సంబరంగా ఉంది. ఇంకే ముంది అదునుచూసుకుని ఒక్కొక్క ఆవు మీదకు లంఘించి వాటిని మట్టుపెట్టింది. అలా వాటి అనైక్యత వాటి వినాశనానికి దారి తీసింది.

చూశారా! ఆ ఆవులు కలిసి ఉన్నంతకాలం అడవికి రాజైన సింహం కూడా వాటిని ఎంతో తేలికగా సంహరించగలిగింది. అందుకే మన పెద్దవారు ఐకమత్యమే మహాబలం అని చెప్పేది. కలిసి ఉన్నప్పుడు ఏవైనా ఆపదలూ వస్తే మన సంఘటితంగా ఎదుర్కోగలం. లేదంటే మనకు ఎదురయ్యే ఆపదలకు తలవంచాల్సి వస్తుంది.
___________________________________________________________

కల్తీ నెయ్యి


"రాఘవయ్యా! పోయిన వారం బంధువులొస్తే మీ దుకాణంలో స్వీట్స్ కొనుక్కెళ్లాను. అవి ఇంతకుముందులా రుచిగా లేవు. పట్టుమని వారం రోజులు కూడా నిల్వ ఉండలేదు. తేడా ఎక్కడ జరిగిందో కనుక్కోని, సరిచేసుకో" అన్న మిత్రుడు సీతారామయ్య మాటలే తలచుకుంటూ పడుకున్నాడు రాఘవయ్య.

తను పదేళ్లుగా స్వీట్ షాప్ నడుపుతున్నాడు. వంటలకు వాడే సరుకుల నాణ్యతలో ఏ మాత్రం రాజీపడేవాడు కాదు. కాబట్టే ఇన్నేళ్లల్లో కొత్త దుకాణాలు ఎన్ని వెలిసినా రాఘవయ్య స్వీట్ షాప్‌లో రద్దీ తగ్గలేదు. అలాంటిది ఇవాళ మిత్రుడు సీతారామయ్య అన్న మాటలు రాఘవయ్యను ఆలోచనలో పడేశాయి. మొదట వంటవాళ్ల పనితనం మీద అనుమానమొచ్చింది. కానీ అదంతా తన భ్రమ అని కొద్దిరోజుల్లోనే రూఢీ అయ్యింది. మరి సరుకు విషయంలో ఏమైనా లోపముందా? గత పదేళ్లుగా ఒకే దుకాణంలో సరుకులు కొంటున్నాడు. ఇంతవరకు ఒక్కసారి కూడా తేడా రాలేదు. అలాంటిది ఇప్పుడు వస్తుందంటే నమ్మబుద్ధికాలేదు.

ఈ మధ్య తమకు సరఫరా అవుతున్న నెయ్యి కాస్త తేడాగా అనిపిస్తోందని భార్య సుభద్ర రెండు, మూడుసార్లు అంది. తానే పెద్దగా పట్టించుకోలేదు. ' ఒకవేళ నెయ్యిలో ఏమైనా కల్తీ జరుగుతోందా?' అని రాఘవయ్యకు అనుమానమొచ్చింది.

అసలు కల్తీ జరిగిందో? లేదో? ఎవరికి తెలుసు? జరిగితే దుకాణం యజమాని రంగారావును గద్దించవచ్చు. లేకపోతే....అనవసరంగా అనుమానించినట్లవుతుంది. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి? అని ఆలోచించసాగాడు రాఘవయ్య అదే విషయం మాటల సందర్భంలో పెద్ద మనవడు శ్రీధర్‌తో చెప్పాడు.

పదవ తరగతి పాసైన శ్రీధర్‌కి సైన్స్ అంటే మహా ఇష్టం. ఎక్కడ సైన్స్ ఎగ్జిబిషన్ జరిగినా తప్పకుండా వెళతాడు. అలా ఓ ఎగ్జిబిషన్‌లో ఆహార పదార్ధాల్లో జరిగే కల్తీని గుర్తించడమెలాగో వివరించారు. అక్కడ చూపించిన పదార్ధాల్లో నెయ్యి కూడా ఉంది. 'చిన్న ప్రయోగం చేసి చూస్తే కల్తీ జరిగిందో లేదో తెలిసిపోతుంది' కదా అనుకున్నాడు శ్రీధర్. తన దగ్గర వున్న కొన్ని రసాయనాలను తీసుకొచ్చాడు.

మనవణ్ణి ఆశ్చర్యంగా చూస్తున్న రాఘవయ్యతో, "తాతయ్యా! ఇది బయట కొన్న నెయ్యి, ఈ గిన్నెలోది మన ఇంట్లో వెన్న కరగబెట్టిన నెయ్యి ఇవేమో హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఫర్‌ఫ్యూరాల్ కలిసిన ఆల్కహాల్. ఈ రెండింటితోనే ఏది స్వచ్ఛమైన నెయ్యో తెలిసిపోతుంది" అన్నాడు శ్రీధర్.

"అదెలా?!" ఆశ్చర్యంగా అడిగాడు రాఘవయ్య.

"ముందు మన ఇంట్లో కాచిన నెయ్యితో ప్రయోగం చేద్దాం. ఎంత నెయ్యి వుందో అంతే పరిమాణంలో మొదట హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలపాలి. దీన్ని బాగా కలిపిన తర్వాత ఫర్‌ఫ్యూరాల్ కలిసిన ఆల్కహాల్ ద్రావణాన్ని దీనికి చేర్చాలి. కాసేపట్లో నెయ్యి రంగు మారితే నకిలీది. లేకపోతే స్వచ్ఛమైనది" అన్నాడు శ్రీధర్. రెండు గిన్నెల్లోనూ ద్రావణాలు కలిపాడు. ఇంట్లో చేసిన నెయ్యిలో ఏ మార్పూలేదు. కానీ బయట కొన్న నెయ్యి గులాబీ రంగులోకి మారింది.

"చూశారుగా తాతయ్యా! మనం బయట కొన్న నెయ్యిలో డాల్డా కలిసింది. అందువల్లే నెయ్యి రంగు మారింది. ఇన్నాళ్లూ ఆ దుకాణం యజమాని మనల్ని మోసం చేశాడు" ఒకింత ఆవేశంగా అన్నాడు శ్రీధర్. రాఘవయ్యకు అసలు విషయం అర్ధమైంది.

మర్నాడు శ్రీధర్‌ని తీసుకొని రంగారావు దుకాణానికి వెళ్లాడు. వీళ్ల మాటలు విన్న రంగారావు మొదట దబాయించాడు. కానీ ప్రయోగాత్మకంగా నిరూపించిన మీదట తన తప్పు ఒప్పుకున్నాడు. ఇకమీదట నిజాయితీగా వ్యాపారం చేస్తానని, ఈ ఒక్కసారికి క్షమించమని వేడుకున్నాడు.

"రంగారావ్! ఏ వ్యాపారానికైనా నమ్మకమే పునాది. దాన్ని పోగొట్టుకుంటే నష్టాలపాలయ్యేది నువ్వే. ఇకమీదట ఇలాంటి తప్పుడు పనులు చేస్తే నలుగుర్నీ పిలిచి నీ గుట్టు రట్టు చేస్తాను. అప్పుడు నువ్వు ఈ ఊళ్లోనే కాదు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా దుకాణం నడపలేవు" అని తీవ్రంగా మందలించాడు రాఘవయ్య. చిన్న ప్రయోగం ద్వారా పెద్ద మేలు చేసిన శ్రీధర్‌ను మెచ్చుకున్నాడు.
_______________________________________________

కాగితం పడవలు


రామయ్యది వెంకటాపురం. భూస్వామి భూపతి దగ్గర పాలేరుగా పని చేస్తున్నాడు. మంచి పనిమంతుడు. నమ్మకస్తుడు. అందుకే అతనంటే భూపతికి ప్రత్యేకమైన అభిమానం.

నమ్మకంగా వుంటూ, ఇంటిని, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే మనిషి వుంటే పంపించమని పట్నంలో వ్యాపారం చేస్తున్న భూపతి కొడుకు మహేష్ ఉత్తరం రాశాడు. ఆ పనికి రామయ్యే సరైనవాడని భూపతికి తెలుసు. అదే మాట రామయ్యతో అన్నాడు. ముందూ వెనుక ఎవరూ లేకపోవడంతో రామయ్య కూడా అంగీకరించాడు. అలా రామయ్య వెంకటాపురం వదిలి హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. ప్రశాంతమైన పల్లె వాతావరణానికి అలవాటుపడిన రామయ్యకు రణగొణ ధ్వనుల మధ్య జీవించడం కొంచెం కష్టంగానే ఉంది. అయినా అలాగే సర్దుకుపోతున్నాడు.

భూపతి కొడుకు రాహుల్, కోడలు రమ్య, వాళ్లిద్దరూ వారి వారి పనుల్లో బిజీగా ఉంటారు. పిల్లలు వంశీ, వసుధ. వంశీ ఆరవ తరగతి చదువుతున్నాడు. వసుధ నాలుగవ తరగతి. పొద్దున్నే తొమ్మిది గంటలకల్లా ఎటు వాళ్లు అటు వెళ్లిపోతారు.

రమ్యకు ఇంటి పనుల్లో సాయం చేయడం, బజారుకెళ్లి కావాల్సిన సరుకులు తీసుకురావడం, పిల్లలకు కావాల్సినవి అమర్చడం, ఇంటిని కనిపెట్టుకొని వుండడం.. ఇది రామయ్య దినచర్య. రామయ్యకు వెంకటాపురంలోకంటే ఇక్కడే పని తక్కువగా ఉంది. కాకపోతే ఒక్కటే చిక్కు. కాయకష్టానికి అలవాటుపడిన మనిషిని ఖాళీగా వుండమంటే ఉండలేడు. ఇప్పుడు రామయ్య పరిస్ధితీ అదే.

ఓ రోజు ఏ కారణం చేతనో ట్యూషన్ మాష్టారు రాలేదు. పిల్లలకు కావాల్సినంత తీరుబడి దొరికింది. ఆ బజారులోని తోటి పిల్లలందర్నీ పోగు చేశారు. వాళ్లతో ఇంట్లోనే ఆటలు మొదలుపెట్టారు. రామయ్య కూడా వాళ్లతో కలిసిపోయాడు. కాసేపటికి వర్షం మొదలయ్యింది. డాబా మీద కురిసిన వాన నీళ్లు కాలువలా పెరట్లో నుండి పోతున్నాయి. రామయ్యకు ఓ ఆలోచన వచ్చింది.

"వంశీ బాబూ! నీకి కాగితాలతో పడవలు తయారుచేయడం వచ్చా?" అడిగాడు రామయ్య .

"రాదు. ఏం?"

"మేం చిన్నప్పుడు కాగితాలతో పడవలు తయారుచేసి వాన నీళ్లల్లో వదిలేవాళ్లం. మునగకుండా ఎవరి పడవ ఎక్కువ దూరం వెళ్తుందో వాళ్లు గెలిచినట్టు. ఆ ఆట భలే సరదాగా ఉంటుంది" చెప్పాడు రామయ్య.

"అయితే త్వరగా వెళ్లి కాగితాలు తీసుకురా తాతా..." అంది వసుధ.

"కాగితాలు నాన్నగారి గదిలో ఉంటాయి" వెంటనే అందుకున్నాడు వంశీ.

రామయ్య రాహుల్ గదిలోకి వెళ్లాడు. అక్కడ తెల్ల కాగితాలు, రాసిన కాగితాలు విడివిడిగా ఉన్నాయి. తెల్ల కాగితాలైతే రాసుకోవచ్చు. అదే వాడిన కాగితాలు తీసుకున్నా ఫర్వాలేదు ' అనుకున్నాడు రామయ్య రాసిన కాగితాలు తీసుకొని పిల్లల దగ్గరకొచ్చాడు. వాటితో పడవలు తయారుచేసి, పిల్లలకిచ్చాడు. వాళ్లు వాటిని నీళ్లల్లో వదులుతూ ఆనందించారు. కాసేపటి తర్వాత వర్షం ఆగిపోయింది. ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. పిల్లలు అన్నం తిని, నిద్రపోయారు. రాత్రి తొమ్మిది గంటలకు భార్యాభర్తలిద్దరూ ఇంటికొచ్చారు. వచ్చీరాగానే రాహుల్ తన గదిలోకి వెళ్లాడు. ఏవో ముఖ్యమైన కాగితాల కోసం చాలాసేపు వెతికాడు. ఎంత వెతికినా అవి కనిపించలేదు.

రామయ్యను పిలిచి, "టేబుల్ మీద నేను కొన్ని ముఖ్యమైన కాగితాలు పెట్టాను. అవేమైనా చూశావా?" అని అడిగాడు రాహుల్.

"నల్ల సిరాతో ఏదో రాసి ఉంది. అవేనా బాబుగారూ?" అడిగాడు రామయ్య.

"అవును. అవే...ఎక్కడ పెట్టావు?" ఆతృతగా అడిగాడు రాహుల్.

"అవి పనికిరాని కాగితాలు అనుకొని..."

"అనుకొని... నీళ్లు నమలడం మాని ఏం చేశావో చెప్పు" కోపంగా అన్నాడు రాహుల్.

"ఇందాక పిల్లలకు పడవలు చేసిచ్చాను" భయం భయంగా చెప్పాడు రామయ్య.

"అసలు వాటి జోలికెందుకువెళ్లావు? పక్కన అన్ని తెల్లకాగితాలు ఉన్నాయి. అవి తీసుకోవచ్చుగా. అయినా పాత న్యూస్ పేపర్లతో పడవలు చెయ్యోచ్చు కదా. అసలు ఆ పేపర్ల విలువేంటో తెలుసా నీకు?" ఆవేశంగా అన్నాడు రాహుల్.

రామయ్య దిగాలుగా ముఖం పెట్టి. "అయ్యా! నాకు చదువురాదు. అందుకే వాటి మీద ఏం రాసి వుందో తెలీలేదు. తెలిస్తే... వాటితో పడవలు చేసేవాణ్ణే కాదు. క్షమించండి" అన్నాడు.

"ఎలా క్షమించమంటావు? అవేమైనా పాతిక రూపాయలు పెడ్తే వచ్చే కాగితాలనుకున్నావా? కొత్తగా తీసుకున్న ఉద్యోగులతో కుదుర్చుకున్న ఒప్పందం కాగితాలు" అరిచాడు రాహుల్. రాహుల్ అరుపుల విన్న రమ్య ఆ గదిలోకి వచ్చింది.

విషయాన్ని గ్రహించి, "ఊరుకో రాహుల్. అంత ముఖ్యమైన కాగితాలను నిర్లక్ష్యంగా టేబుల్ మీద పడేసి వెళ్లిపోవడం నీ తప్పు. అవి మామూలు కాగితాలు అనుకొని రామయ్య పడవలు చేసి ఉంటాడు. జరిగిందేదో జరిగిపోయింది. మళ్లీ వాళ్లతో అగ్రిమెంట్ రాయించుకుంటే సరిపోతుంది" అంటూ సర్ధిచెప్పింది.

రామయ్యవైపు తిరిగి, "రామయ్య... నువ్వు వెళ్లి భోం చేసి పడుకో" అని చెప్పింది. రామయ్య అక్కడి నుండి వెళ్లిపోయాడు.

మర్నాడు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు రామయ్య కోసం ఓ ప్యాకెట్ తీసుకొచ్చింది రమ్య. అందులో కొన్ని పుస్తకాలు ఉన్నాయి. వాటిని అయోమయంగా చూశాడు రామయ్య.

"ఇవి నీ కోసమే రామయ్య రేపటి నుండి నువ్వు కూడా చదువుకోవాలి. పిల్లలతోపాటు నీక్కూడా ట్యూషన్ మాష్టారే చదువు చెప్తారు. మరి శ్రద్ధగా చదువుకుంటావు కదూ" అంది రమ్య.

రామయ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తాను చేసిన తప్పు గుర్తొచ్చింది. ఇకమీదట అలాంటి తప్పు చేయకుండా వుండాలంటే చదువుకోవడం ఒక్కటే మార్గమని నిర్ణయించుకున్నాడు.
_______________________________________________________________________

కుక్క బుద్ధి-చీమ సుద్దు


అదొక ఖాళీ ప్రదేశం. వీధిలో రెండు ఇళ్ళ మధ్యన ఉంది. ఆ వీధి వారందరికీ ఆ ఖాళీ స్థలం ఓ చెత్త కుండీలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ స్థలానికి యజమాని ఒక నల్లకుక్క! ఆ నల్ల కుక్క, చుట్టు ప్రక్కల ఇళ్ళ వారు, తిని పారవేసిన విస్తరాకులలోని మెతుకులు తింటూ, ఆ దొడ్డిలో నలుమూలలా తిరుగుతూ ఉంటుంది. ఏ మూల ఏ చప్పుడైనా ఉలిక్కి పడి చూస్తూ!కోపంగా గుర్రుపెడుతుంది ఆ కుక్క. ఎప్పుడైనా మరో కుక్క ఆ స్థలంలోకి వచ్చిందంటే దాని మీద పడి, రక్కి, కరిచి ఆ కుక్కను అవతలకు తరిమివేస్తుంది. ఆ స్థలంలో పడిన పుల్లిస్తరాకులన్నీ దాని సొత్తు; వాటిని ఎవ్వరూ ముట్టుకొనడానికి వీలు లేదు. అయినా చీమలు, ఈగలు ఆ ఆకుల మీద ముసురుతూనే ఉంటాయి! ఆ నల్ల కుక్క వాటిని తోలేస్తూనే ఉంటుంది.

ఇలా ఉండగా ఓ పండుగ రోజున రోజూ కంటే ఎక్కువ పుల్లిస్తరాకులు ఆ స్థలంలో వచ్చి పడ్డాయి. వాటిని చూడగానే నల్లకుక్కకు పండగ ఆనందం కలిగింది. కాని, అంతలోనే పుల్లిస్తరాకులతో పడిన పిండివంటల ముక్కల వాసన పసిగట్టి మరో కుక్క తిందామని అక్కడకు వచ్చింది. ఆ కుక్క రావడమే తడవుగా నల్లకుక్క దాని మీద ఉరికింది పెద్దగా అరుస్తూ! కొత్త కుక్క కోరలు చూపుతూ నల్ల కుక్క మీద తిరగబడింది.

అరుపులు కరుపులతో పెద్ద కోట్లాట జరిగింది. ఆ దెబ్బలాటతో పుల్లిస్తరాకులన్నీ చిందరవందర అయిపోయాయి;అన్నీ మట్టి కొట్టుకొని పోయాయి. చివరకు కొత్త కుక్కను వీధి చివరిదాక తరిమేసి, నల్ల కుక్క తిరిగి వచ్చింది. ఒగుర్చుకుంటూ చూస్తే మట్టి, తుక్కు, చెత్తతో నిండిన పుల్లిస్తరాకులలో దానికి అన్నం మెతుకులే కనపడ లేదు. అటూ ఇటూ వెతికి దిగులు పడుతూ కూర్చుంది...!

ఆ ఆకుల మీద తిరుగుతూ వున్న ఓ కండ చీమ, నల్లకుక్కను చూసి జాలిగా అంది; "ఎవరో తిని పారవేసిన పుల్లిస్తరాకులు నీ సొంతం అనుకొంటావు. ఎవరినీ చేరనీయవు. ఏ కుక్క అయినా వస్తే, మీద పడి అరిచి, కరిచి తరిమి వేస్తావు. చూడు, నీ దెబ్బలాట వల్ల, తిందామనుకున్నదంతా ఎలా మట్టి కొట్టుకు పోయిందో!" నాకే తప్ప ఎవరికీ వుండకూడదు అనే నీ దుర్బుద్ధి నీకు కూడా లేకుండా చేసింది... చూడు... మా చీమలను! ఎక్కడైనా రవ్వంత తినుబండారం కనపడితే, మా చీమలనన్నిటినీ పిలుచుకు వస్తాము. అందరమూ కలిసి తింటాము; హాయిగా వుంటాము... మా చీమలను చూసి బుద్ధి తెచ్చుకుంటే, నువ్వూ, నీ జాతివాళ్ళు బాగు పడతారు అంటూ చక్కా పోయింది కండ చీమ!"

ఆకలితో, అలసటతో అవస్థ పడుతున్న నల్లకుక్కకు చీమ మాటలు సూదుల్లా గుచ్చుకున్నాయి. అలాగే పడుకుంది, మట్టి ఆకులను చూస్తూ, కన్నీళ్ళు కారుస్తూ మూలుగుతూ.
_______________________________________________________

కృతజ్ఞత


అడవిలో కట్టెలు కొట్టుకునేందుకు రామయ్య వెళ్ళాడు. అక్కడికి సమీపములో వేటగాడు వలపన్ని బియ్యం నూకలు వెదజల్లి వుంచాడు. వాటికి ఆశపడి జంటపావురాళ్ళు వలలో చిక్కుకుని ప్రాణభీతితో ఉన్నాయి. వాటిని వల తప్పించి పైకి ఎగురవేశాడు రామయ్య.

కొంతకాలము గడిచింది. రామయ్య అడవికి వెళ్ళి వస్తూనే వున్నాడు. ఒక రోజు దారి తప్పి అడవిలో బాగా పైకి వెళ్ళిపోయాడు. దారి తెలియక అవస్థపడుతున్నాడు. చీకటి పడింది. క్రూరమృగములు తనని ఏం చేస్తాయోనని భయపడుతూ అక్కడికి సమీపంలో గల సత్రం వద్దకు చేరుకున్నాడు. ఇంతలో వర్షం ప్రారంభమయింది. ఏమిటో ఈ పాడు వర్షము, ఇంటికెలా వెళ్ళాలో తెలియటంలేదు. అని భాధపడుతున్నాడు. ఆ సమీపములో గల పావురముల జంట రామయ్యని గుర్తించాయి. దారితప్పిన అతన్ని గమ్యస్థానము చేర్చే ఉద్దేశ్యముతో తలగుడ్డ తన్నుకుని వెళ్ళాయి. రామయ్య తల గుడ్డకు వంగి పైకి చూసి ఆ పావురముల వెంట బయలుదేరి గమ్యస్థానము చేరుకున్నాడు. ఎంత చిన్న జీవులైన తనని గమ్యస్థానము చేర్చినందుకు భగవన్నామస్మరణ చేస్తూ ఇల్లు చేరాడు. ఆ పావురముల జంట కృతజ్ఞతకు మురిసిపోయాడు. తర్వాత వాటిని తన వద్దనే వుంచుకుని పెంచుకోసాగాడు.
_____________________________________________

కోతి - యువకుడు


ఒక బిచ్చగాడుండేవాడు. దొరికినదేదో తిని, ఏ అరుగు మీదనో నిద్రపోయేవాడు. ఖరీదైన కోరికలు లేనందున వాడికి సుఖాల మీదికి మనసు పోలేదు. ఒకసారి వాడికి, ఓ గొప్పదాత ఐదు దీనారాలు బహుమతిగా ఇవ్వగా దాంతో ఒక కోతిని కొన్నాడు. అది ఆడిస్తూ బతికితే ఇంకా ఎక్కువ సంపాదించవచ్చని బిచ్చగాడి ఊహ. ఓ రాత్రి వేళ కోతి ఒక యువకుడిగా మారిపోయింది. అతడు బిచ్చగాణ్ణి పేరుపెట్టి పిలిచి, ఒక బంగారు నాణెం ఇచ్చి ఇద్దరికీ భోజనం తెమ్మన్నాడు. నువ్వు ఏ శాపం వల్ల ఇలా అయ్యావని అడగబోయాడు బిచ్చగాడు. అదంతా అనవసరం వెళ్ళి చెప్పింది చెయ్యమన్నాడు. ఆకలిగా ఉన్న బిచ్చగాడు ఇక ఏమీ మాట్లాడలేదు. ఆ యువకుడే, ఓ డబ్బుసంచి సృష్టించి నగరం మధ్యలో ఒక గొప్ప మేడ కిరాయికి కుదిర్చేలా చూశాడు. ఇప్పుడు భాగ్యవంతుడి దర్పాన్ని, ఠీవిని బిచ్చగాడికి నేర్పాడు. రాజకుమార్తెతో నీకు పెళ్ళి చేయిస్తాను అనగానే నమ్మలేక విచిత్రంగా చూశాడు బిచ్చగాడు. అప్పటికే అతనికి యువకుడి మీద చాలా కృతజ్ఞతగా ఉంది. యువకుడు ఏం చెప్తే అది మారు మాట్లాడకుండా చెయ్యడానికి సిద్దంగా ఉన్నాడు.

అతడి సలహా మేరకు ఆ దేశపు రాజుగార్ని కలిసి, వజ్రాలను బహుకరించి, కూతుర్ని ఇమ్మన్నాడు. రాజు తన న్యాయాధికారితో ఆలోచించి వివాహానికి సమ్మతించాడు. ఇంత మేలు చేసినందుకు తనకు తిరిగి ఏదైనా ఉపకారం చెయ్యమన్నాడు యువకుడు. ప్రాణాలైనా ఇస్తానన్నాడు బిచ్చగాడు. నీభార్య చేతికున్న తావీజు కావాలి అన్నాడు యువకుడు. అది తీసుకెళ్ళి ఇచ్చాడు బిచ్చగాడు. అంతే! అతడికి అంతవరకూ వచ్చిన సంపదా, రాజకుమారీ అన్నీ మాయం. బిచ్చగాడి బతుకు మరల మొదటికి వచ్చింది. ఒకరోజు జ్యోతిష్కుని సంప్రదించాడు. అతడు పైశాచీ భాషలో ఓ రేకుమీద ఏదో రాసి, ఎడారిలోకి వెళ్ళమన్నాడు. బిచ్చగాడు అలాగే వెళ్ళాడు. అక్కడ ఒక చోట కేవలం మనుషుల్లేకుండా కాగడాలు నడుస్తూ, ఓ పల్లకీ గాల్లో తేలుతూ కనిపించింది. జ్యోతిష్కుడు తనకిచ్చిన కాగితాన్ని పల్లకీలోని వ్యక్తికి చూపించాడు బిచ్చగాడు. అతడికి విషయం అర్థమైది. వెంటనే బిచ్చగాణ్ణి మోసం చేసిన కోతి యువకుణ్ణి మంత్ర శక్తులతో పిలిపించి విచారించాడు. తావీజుని ఆ యువకుడు వెంటనే మింగేసి, నాయకుడి ఆగ్రహానికి గురైనాడు. అతడు తన అరచెయ్యి బాగా సాచి, తన ఆజ్ఞ ధిక్కరించిన కోతి యువకుని పాతాళానికి అణగతొక్కేశాడు. తావీజు తిరిగి బిచ్చగాడి వశమైంది. అసలు మహిమంతా తావీజులోనే ఉంది. అది చేతికి రాగానే బిచ్చగాడి పరిస్థితి మళ్ళీ మారిపోయింది. భాగ్యం, సంపదా, రాజకుమార్తె అన్నీ అతడికి దక్కాయి. ఆ తరువాత అతడెప్పుడూ ఆమె చేతి నుంచి తావీజును తొలగించే ప్రయత్నం చేయలేదు. ఇంకెప్పుడూ కోతుల గురించి ఆలోచించలేదు.
_________________________________________________

'కోతులు - పాలపిట్ట'

మూర్ఖులకు మంచి మాటలు, మంచి సలహాలు చెవికెక్కవు. అలాంటి వాళ్ళకి సలహాలు చెప్పటం వృధా ప్రయాస మాత్రమేకాదు. ఒక్కోక్కసారి ప్రాణాలకు కూడా ముప్పు కలుగవచ్చు. అందుకనే సాధ్యమయినంత వరకు మూర్ఖులకు దూరంగా ఉండటం ఉత్తమం. మూర్ఖులైన కోతిమూకకి ఓ సలహా ఇవ్వబోయి తన ప్రాణాలు పోగొట్టుకున్న పక్షి వైనం ఈకధలో తెలిసుకుందాం.

పూర్వం ఓ కొండ ప్రాంతంలో ఓ కోతుల గుంపు ఉండేది. అవి కొండ క్రిందునున్న గ్రామాలలోకి దండుగా వచ్చి దొరికినంత ఆహారం తిని మిగిలిన ఆహారాన్ని పట్టుకుపోయి కొండ ప్రాంతంలోని తమ స్ధావరంలో దాచుకుని వచ్చినన్ని రోజులు తిని మళ్ళీ యధావిధిగా ఆహారం కోసం గ్రామాల మీద పడేవి. ఆ కోతుల స్ధావరం దగ్గరే ఉన్న ఓ మర్రిచెట్టు మీద ఓ పాలపిట్టల జంట కాపురం చేస్తుండేవి. రోజూ సాయంత్రంపూట ఆ కోతుల దండు చేసే వింత చేష్టలు ఆ పాలపిట్టల జంటకు వినోదం కలిగిస్తూ ఉండేది.

అది చలికాలం. ఓ సాయంత్రం పూట ఆ కోతులకి చలికాగాలన్న ఆలోచన కలిగింది. వెంటనే చెట్ల మీద ఎగురుతున్న మిణుగురుపురుగులను తీసుకొచ్చి కుప్పగా పోసి వాటి చుట్టూ కూర్చున్నాయి. మిణుగురు పురుగులనుండి వెలుగు తప్ప వేడి రాకపోవటంతో వాటికి ఏం చెయ్యాలో అర్ధం కాక బుర్రలు గోక్కోసాగాయి. వాటి అవస్ధ చెట్టు మీద పాలపిట్ట జంట చూసి నవ్వుకున్నాయి. ఆ జంటలోని మగపిట్ట 'పాపం! అవి మంట ఎలా పుట్టించాలో తెలియక బాధ పడుతున్నాయి. వాటికి వివరంగా చెప్పివస్తాను' అంది.

అందుకు ఆడపిట్ట 'వద్దు! అవి కోతులు వాటికి విచక్షణా జ్ఞానం తక్కువ, వాటి మధ్యకు నువ్వు వెడితే నీకేదన్నా అపకారం తలపెడతాయి' అంది భయంగా. 'ఫర్వాలేదులే! అవి మరీ అంత మూర్ఖమైనవి కావు' అంటూ ఆ పాలపిట్ట రివ్వుమంటూ చెట్టుమీద నుంచి ఎగిరి ఆ కోతుల గుంపు మధ్యలో వాలింది. తమ మధ్యలో వాలిన ఆ పాలపిట్ట వంక గుర్రుగా చూసాయి గుంపులోని కోతులు. పాలపిట్ట అది పట్టించుకోకుండా 'మిత్రులారా! ఇవి పురుగులు వీటి వల్ల కొంచెం వెలుగు వస్తుంది కానీ వేడి రాదు. మీరు చలికాగాలంటే వెళ్ళి ఎండుకట్టెలు తెచ్చుకుని వాటిని చెకుముకిరాయిని రాజేసి వచ్చే నిప్పుతో అంటించండి. అపుడు మంట వచ్చి చలి తీరుతుంది' అంది. కోతులకి తమకి సలహా ఇవ్వటానికి పాలపిట్ట వచ్చిందని కోపం వచ్చింది. 'ఇంతలేవు నువ్వు మాకు సలహా యిస్తావా?' అంటూ ఆ పిట్టను పట్టుకుని పుటుక్కుమంటూ మెడను విరిచి చంపేసాయి.

పాపం ఆ పాలపిట్ట లోని ఆడపిట్ట 'మూర్ఖులకి సలహా యివ్వటం మంచిది కాదని చెప్పినా వినకుండా ప్రాణాలు పోగొట్టుకున్న ఆ మగపిట్ట కోసం ఏడుస్తూ అక్కడి నుంచి ఎగిరిపోయింది.
_____________________________________________________

గాండ్రించిన కప్ప

పుట్టలు, గుట్టలు దాటుకొంటూ సింహం హడిలి పోతూ తన గుహలోకి వచ్చేసింది. సింహం గాబరాను గమనించిన నక్క, గబగబా వచ్చి సింహం అంతగా భయపడడానికి కారణం ఏమిటని అడిగింది. సింహం, ఆయాసంతో వొణుకుతూ చెప్పింది.

"మామూలుగా కొలనులో మంచి నీళ్ళు తాగి గట్టు ఎక్కాను. అంతలో పెద్ద పెద్ద అరుపులు వినపడ్డాయి. గుర్, గుర్...పువ్వాం పువ్వాం... బెకా బెకా మంటూ హొరెత్తిన ఆ అరుపులు వింటే ఎంతో భయం వేసింది, అటూ ఇటూ చూశాను...ఎవ్వరూ కనపడలేదు సరిగదా! ఆ అరుపులు ఇంకా భయంకరంగా పెరిగి పోతున్నాయి. ఈ అడవిలో ఏదో దొంగ మృగం వచ్చి వుంటుంది!నన్ను చంపడానికి ఏ దెయ్యమో వచ్చి, అరుస్తుందని నాకు భయం వేసింది. పరుగెత్తుకుంటూ గుహలోకి వచ్చేశాను. కౄరమృగమో, దెయ్యమో దానిని చంపివేస్తేనే గాని నాకు స్తిమితం కలగదు" అంటూ ముందు కాళ్ళపై తల పెట్టుకొని ఆలోచించడం మొదలు పెట్టింది సింహం...! నక్కకు విషయం అంతా అర్ధమైయింది. ఆ అరుపులు, ఇది వరకు ఎన్నోసార్లు విన్నది నక్క! అందుచేత దానికి భయం కల్గలేదు. ఏమీ భయం లేదని సింహానికి నచ్చజెప్పి కొలను దగ్గరకు తీసుకు వచ్చింది. బిగ్గరగా అరవమంది, ఆ అరుపులు, విని శత్రుమృగం బైటకు వస్తే చంపివేయవచ్చని ధైర్యం చెప్పింది నక్క . సింహం, కొంచెం ధైర్యం తెచ్చుకొని బిగ్గరగా అరిచింది. అడవి దద్దరిల్లి పోయేలా అరుపులు మీద అరుపులుగా అరిచింది.

వెంటనే, అంతకంటే బిగ్గరగా అరుస్తూ చెరువులోంచి, ఓ బోదురుకప్ప గభాలున ఎగిరి సింహం దగ్గరకు ఒక్క దూకు దూకింది. అసలే భయంతో వున్న సింహం, మరింత కంగారు పడుతూ అటూ ఇటూ ఎగరడంతో ఆ బోదురు కప్ప సింహం కాలి కింద పడి నలిగి చచ్చింది.

'హమ్మయ్య' అనుకొంటూ సింహం చతికిలపడి కూర్చుంటే నక్క అన్నది.

'ఏవో అరుపులు విని, ఎవరో శత్రువులు అనుకొని గాబరా పడ్డావు గాని, కప్ప అల్పమైన జంతువు; దాని గొంతు మాత్రం పెద్దది! కర్ణ కఠోరంగా అరుస్తుంది... బలం లేని వాడు ఇలాగే అరుస్తాడు' అందుకే "బూకరింపులు బలహీనుని ఆయుధాలు" అంటారు పెద్దలు! అని హితవు చెప్పింది నక్క!

తన అజ్ఞానానికి తానే సిగ్గుపడింది సింహం.
___________________________________________

గురువును మించిన శిష్యుడు


ఆ రోజు సోమవారం. సూరిబాబు ఎంతో ఉత్సాహంగా బడికి బయలుదేరాడు. దారిలో స్నేహితులు కలిశారు. మాటల సందర్భంలో ఆదివారం నాడు తాము ఎలా గడిపామో ఒక్కొక్కరు సంతోషంగా చెప్పడం ప్రారంభించారు. నిఖిల్ తాను తన అభిమాన హీరో సినిమా చూశానన్నాడు. చంద్రం తానెంతో ఇష్టపడే క్రికెట్ ఆడినట్లు చెప్పాడు. లోకేష్ తాను గీసిన డ్రాయింగ్ గురించి వర్ణించాడు. సూరిబాబు వంతు వచ్చింది. ఇంతలో బడి గంట మోగటంతో వారంతా బడిలోకి గబగబ అడుగులు వేయసాగారు. గదుల నుంచి బయటకు వచ్చారు. అప్పుడే పాఠశాల ఆవరణలో ఆగిన కారు వంక అందరూ తదేకంగా చూడసాగారు. కారులోంచి ఓ వ్యక్తి దిగడం, ప్రధానోపాధ్యాయుడి గదిలోకి వెళ్ళడం గమనించిన విద్యార్థులు అతడు ఎవరై ఉంటాడోనని గుసగుసలాడసాగారు. మధ్యాహ్నాం చివరి పీరియడ్ "నీతిబోధన" తరగతికి తెలుగు మాష్టారు వచ్చారు. మాష్టారు చెప్పే నీతి కథలంటే పిల్లలకెంతో ఇష్టం. ఆ రోజు మాష్టారు చెప్పబోయే కథకోసం పిల్లలెంతో ఆత్రుతతో ఎదురు చూడసాగారు. కానీ మాష్టారు తాను చెప్పిన నీతికథలు పిల్లలపై ఎలా ప్రభావం చూపుతున్నాయో తెలుసుకోవాలని ఉత్సాహపడ్డారు.

తెలుగు మాష్టారు విద్యార్థులను తాము ఇతరులకు సాయపడిన సందర్భాల గురించి అడగడంతో వారు అవాక్కయ్యారు. మాష్టారు చెప్పిన కథలు వినడం వాటిని తమ స్నేహితులకు చెప్పడం తప్ప ఆ కథల్లోని నీతిని తమ జీవితంలోని వివిధ సందర్భాలలో ఎలా అన్వయించుకోవాలో తెలియక, బొత్తిగా ఆచరించని ఆ విద్యార్థులు మాష్టారు వేసిన ప్రశ్నకు బిక్కముఖం వేశారు. తాను ఇన్నాళ్ళు చెప్పిన నీతికథలు బాలల ఆలోచనల్లో ఏ మాత్రం కదలిక తేలేకపోయినందుకు మాష్టారు బాధపడ్డారు. మాష్టారి మనస్సును సరిగ్గా చదవగలిగిన సూరిబాబు, తాను ఆచరించిన పనులను మాష్టారి ముందుంచేందుకు తనకెందుకు ధైర్యం చాలడంలేదోనని కలవరపడ్డాడు. ఎలాగైనా సరే, మాష్టారి బోధనల వల్ల తాను చేసిన ఒక మంచి పనిని మాష్టారికి చెప్పి అతడి వేదన పోగొట్టాలని తలచిన సూరిబాబు "మాష్టారూ! నేను చెబుతా!" అని మనసులోనే అనుకుంటూ పైకి లేవబోయాడు. ఇంతలో తెలుగు మాషార్ని ప్రధానోపాధ్యాయుడు పిలుస్తున్నారని కబురు రావడంతో మాష్టారు వెళ్ళిపోయారు. సూరిబాబుకు తాను చేసిన పని మాష్టారికి చెప్పే అవకాశం చేజారిపోయింది. కొంత సేపటికి లాంగ్‌బెల్ కొట్టడంతో పిల్లలంతా బడి వదిలిపెట్టారు.

మరుసటి రోజు ఉదయం ప్రార్థనా సమావేశం జరుగుతోంది. ప్రధానోపాధ్యాయుడు ఓ కొత్త వ్యక్తిని అందరికి పరిచయం చేశాడు. క్రితం రోజు పాఠశాలకు కారులో వచ్చిన ఆ వ్యక్తిని కొందరు గుర్తించారు. అతడు వృద్దాశ్రమానికి చెందిన ఆఫీసరు. తర్వాత తెలుగు మాష్టార్ని వేదికపైకి ఆహ్వానించారు. మాష్టారి నీతికథల వల్ల ఓ విద్యార్థి ఆలోచనల్లో వచ్చిన మంచి మార్పే నేడు మన పాఠశాలకు ఎంతో గర్వకారణమయిందని ప్రధానోపాధ్యాయుడు చెబుతుండగా, అందరూ ఆ విధ్యార్థి ఎవరో? అని ఎదురు చూడసాగారు. తెలుగు మష్టారి ముఖంలో ఆనందం చూసి సంబరపడుతున్న సూరిబాబు తనను వేదికపైకి పిలవడాన్ని పట్టించుకోలేకపోయాడు. తమ తోటి విద్యార్థులు తనను వేదికపైకి వెళ్ళమని చెప్పడం, అందరూ తన వంకే చూస్తూ ఉండటం, ఏమి జరుగుతుందో ఏమీ అర్థంకాని సూరిబాబు తడబడుతూ వేదికపైకి వెళ్ళాడు. ఆదివారం నాడు నడిరోడ్డుపై అడ్డంగా వెళుతున్న ఓ అంధ వృద్ధుణ్ణి బస్సు ప్రమాదం నుండి కాపాడడమేకాక అతణ్ణి వృద్ధాశ్రమంలో చేర్చిన సూరిబాబుకు వృద్ధాశ్రమ ఆఫీసర్ మంచి పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు.

విద్యార్థులు, టీచర్లు తమ కరతాళ ధ్వవనులతో సూరిబాబును అభినందించసాగారు. సూరిబాబుని మాట్లాడమని వృద్ధాశ్రమ ఆఫీసరు కోరారు. "తాను ఆచరించడమే కాక, నీతికథల ద్వారా మాలో మానవతా దృక్పథాన్ని పెంపొదిస్తున్న మా తెలుగు మాష్టారే నాకు ఆదర్శం" అన్నాడు. ప్రధానోపాధ్యాయుడు సూరిబాబును అభినందిస్తూ, గురువుని మించిన శిష్యుడని అభివర్ణించారు.
___________________________________________________________________


గొప్ప గుణం

మొగసాల మర్రి గ్రామంలో ధర్మయ్య, రంగయ్య అనే ఇద్దరు వడ్డీ వ్యాపారం చేస్తూ జీవించేవారు. వారిలో ధర్మయ్య తక్కువ వడ్డీ తీసుకొని అడిగిన వారికి లేదనక అప్పులిచ్చి అవసరాలలో ఆదుకొంటుండేవాడు. ఎవరైనా ఇచ్చిన అప్పును సకాలంలో తీర్చకపోతే పీడించేవాడుకాదు. అందువల్ల ఆ ఊరి ప్రజలకు ధర్మయ్య అంటే చాలా ఇష్టం. కాని రంగయ్య మాత్రం పరమలోభి. అధిక వడ్డీలు గుంజి లక్షలకు లక్షలు సంపాదించాలని కలలు కనేవాడు. అప్పులు తీర్చకపోతే వారు తాకట్టు పెట్టిన భూములు, నగలను, ఇండ్లను తిరిగి ఇవ్వక వారికి నిలువ నీడ లేకుండా చేస్తాడు. ఆ ఊరి ప్రజలు అతనిని లోభి అని, చండాలుడని చెప్పుకొనేవారు. ప్రజల్లో ధర్మయ్యకున్న గొప్ప పేరును చూసి రంగయ్య అసూయపడేవాడు. ఎలాగైనా ధర్మయ్యను దెబ్బ తీయాలని అనుకున్నాడు. ఆ ఊరివారందరూ కలిసి ఒక రామాలయం కట్టించారు. ఆ ఊరి జమిందారు ఇచ్చిన విరాళంతో నగలను చేయించారు. ఆ గుడి తాళాలను నిజాయితీ పరుడైన ధర్మయ్యకే అప్పగించారు. అది చూసి ఓర్వలేని రంగయ్య మండిపడ్డాడు. అతను బాగా ఆలోచించి ఒక పథకం వేశాడు. ధర్మయ్య ఇంట్లో పనిచేసే రాజయ్యను రహస్యంగా కలిసాడు. ఎలాగైనా గుడి తాళాలను తెచ్చి ఇస్తే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తానని ఆశ చూపాడు. మొదట్లో రాజయ్య దానికి ఒప్పుకోలేదు. కాని కుటుంబ అవసరాల వల్ల అతను ఆ పనికి ఒప్పుకున్నాడు. ధర్మయ్య గుడి తాళాలను పెట్టెలో పెట్టి భద్రంగా వుంచాడు. రాజయ్య మాత్రం దానిని జాగ్రత్తగా గమనిస్తున్నాడు.

ఒక రోజు ధర్మయ్య భార్య నగల కోసం పెట్టె తెరచి మరలా దానికి తాళం వేయడం మరచి లోనికి వెళ్ళిపోయింది. అదే అదనుగా భావించి చాటున ఉన్న రాజయ్య ఆ పెట్టెను తెరచి గుడి తాళాలను తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ గుడి తాళాలను రంగయ్య చేతికిచ్చాడు. ఒకరోజు రాత్రి రంగయ్య ఊరంతా గాఢ నిద్రలో ఉండగ గుడి తలుపులు తెరచి గర్భ గుడిలోనికి వెళ్ళాడు. అక్కడ దేవతలకు అలంకరించిన నగలను తీసి ఒక సంచిలో వేసుకొని అక్కడ నుంచి మెల్లగా జారుకున్నాడు. మరుసటి రోజు దేవుని నగలు దొంగిలించారన్న వార్త ఊరంతా పాకిపోయింది. గుడి తాళాలు ధర్మయ్య వద్ద ఉండగా దొంగతనం ఎలా జరిగిందోనని కొందరి మాటల్లో వినిపిస్తుంది. గ్రామ పెద్ద భీమన్న ఈ విషయాన్ని గూర్చి రచ్చబండ దగ్గర పంచాయితీ నిర్వహించారు. ఊరివారందరితో పాటు ధర్మయ్య, రంగయ్యలు కూడా అక్కడికి చేరుకున్నారు. అప్పుడు గ్రామ పెద్ద భీమన్న, ధర్మయ్యా! తాళాలు నీవద్ద ఉన్నాయి. మరీ దొంగతనం ఎలా జరిగింది? దీనికి నీ సంజాయిషీ ఏమిటీ? అని ప్రశ్నించాడు. ధర్మయ్య గ్రామ పెద్ద వంక చూసి "అయ్యా! గుడి తాళాలను పెట్టెలో భద్రంగా ఉంచాను. రెండు రోజులుగా అవి కనిపించలేదు. ఎంత వెతికినా వాటి ఆచూకీ తెలియలేదు" అని బదులిచ్చాడు. "ఈ ధర్మయ్య మోసకారి, తానే నగలు కాజేసి ఏమి తెలియదన్నట్లు నటిస్తునాడు. తగిన శిక్ష వేసి చెరసాలలో వేయించండని రంగయ్య చెప్పాడు.

గ్రామ పెద్ద భీమన్నకు రంగయ్య మాటలపై నమ్మకం కలుగలేదు. ధర్మయ్య నిజాయితీ పరుడని నమ్ముతున్నాడు. ఇందులో ఏదో మోసం జరిగింది. అది తెలుసుకోవాలనుకున్నాడు. ఒకరోజు గ్రామ పెద్ద ధర్మయ్య ఇంట్లో పని వారందరిని పిలిపించాడు. వారికి తలోక ఉంగరాన్ని ఇచ్చి ఇవి మహిమ కలవని, ఒక మునీశ్వరుని వద్ద నుండి సంపాదించానని చెప్పాడు. దొంగతనం చేయని వారి ఉంగరం ధగ ధగ మెరుస్తుందని నమ్మబలికాడు. వాటిని మరుసటి రోజు తిరిగి ఇవ్వమని చెప్పి వారిని పంపించాడు. రాజయ్య తాను తాళాలు దొంగిలించిన విషయం బయటకు తెలియకుండా తనకు తెలిసిన కంసాలి వద్ద ఉంగరాన్ని మెరుగు పట్టించాడు. మరుసటి రోజు వారు ఆ ఉంగరాలను భీమన్నకు అందజేసారు. భీమన్న ఆ ఉంగరాలను పరిశీలించి రాజయ్య ఉంగరం మెరుస్తుండడం గమనించాడు. అయనకు దొంగ ఎవరో తెలిసిపోయింది. వెంటనే "రాజయ్య నిజం చెప్పు? నగలను ఎక్కడ దాచావ్? అంటూ గద్దించాడు. అది విని రాజయ్య గజగజ వణికిపోయాడు. అయ్యా! నగలను గూర్చి నాకేం తెలియదు. బుద్ది గడ్డి తిని గుడి తాళాలను రంగయ్య చేతికిచ్చాను. తర్వాత ఏమి జరిగిందో నాకు తెలియదని గ్రామ పెద్దను వేడుకొన్నాడు. రంగయ్య తను చేసిన నేరం అందరికి తెలిసిపోయిందన్న విషయం గ్రహించి సిగ్గుతో తలవంచుకున్నాడు. అప్పుడు భీమన్న "రంగయ్య నీవు స్వార్థంతో అతి పవిత్రమైన దేవుని నగలను దొంగిలించావు! నిజాయతీ పరుడైన ధర్మయ్యపై నేరాన్ని మోపి దోషిగా అందరి ముందు నిలబెట్టావు! అందువల్ల నీకు కఠిన శిక్ష విధించి చెరసాలలో వేయించాలని తీర్పు ఇస్తున్నాను" అన్నాడు. అప్పుడు ధర్మయ్య రంగయ్యను క్షమించి వదిలివేయమని గ్రామపెద్దను వేడుకున్నాడు. భీమన్న ధర్మయ్య మాట కాదనలేక రంగయ్యను మందలించి వదిలివేశాడు. అపకారికి కూడా ఉపకారం చేసే ధర్మయ్య గొప్ప గుణానికి అక్కడున్న వారందరూ మెచ్చుకున్నారు. రంగయ్య, ధర్మయ్య చేతులుపట్టుకొని "అసూయతో చేసిన నేరానికి క్షమించమని" అడిగాడు. ధర్మయ్య "ఇప్పుడైనా నీలో మార్పు వచ్చింది! అంతే చాలు అన్నాడు. తర్వాత ఇద్దరు ఎన్నో గొప్ప పనులు చేసి ఆ ఊరిని బాగు చేసారు.

No comments: