Sunday, February 20, 2011

నీతి కథలు 2

ఉంగరం దొంగ ఎవరు?

ఒక రోజు అక్బర్ చక్రవర్తికి బీర్బల్‌ను ఏడిపించాలన్న సరదా ఆలోచన కలిగింది. బీర్బల్‌ను ఎలా ఏడిపిస్తే బావుంటుంది? అని బాగా ఆలోచించాడు మహారాజు ఆలోచించగా, ఆలోచించగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఇంకేముంది వెంటనే తన ఆలోచనను ఆచరణలో పెట్టేశాడు. అక్బర్‌ను ఏడిపించటానికి రాజుగారు ఏం చేశారంటే ఆయన దగ్గర పని చేస్తున్న ఒక అతన్ని పిలిచి తన చేతికి ఉన్న ఉంగరాలలో ఒక ఉంగరాన్ని తీసి అతని చేతికి ఇచ్చాడు. ఉంగరం ఇచ్చి దానిని దాచిపెట్టమన్నాడు. అతను అక్బర్ చక్రవర్తి చెప్పినట్టుగానే ఆ ఉంగరం తీసుకోని తన దగ్గర దాచిపెట్టాడు.

ఈ సంగతులు ఏవీ కూడ బీర్బల్‌కు తెలియవు. ప్రతి రోజు వచ్చినట్లు గానే ఆరోజు కూడా రాజ్య సభకు వచ్చాడు. బీర్బల్‌ను చూడగానే అయనకు తాను వేసుకున్న పధకం గుర్తుకు వచ్చింది. అందుకని నవ్వు వచ్చిందన్న మాట. అంతే కాదు ఈ సమస్యను బీర్బల్ ఏలా పరిష్కరిస్తాడో చూడాలన్న కుతూహలం కూడా కలిగింది. "బీర్బల్ ఈ రోజు నామనస్సు ఏమి బాగాలేదు." అన్నాడు రాజు గారు "ఏమైనది మహారాజా!" కంగారుగా అడిగాడు బీర్బల్. బీర్బల్‌కు రాజుగారంటే ఎంతో అభిమానం ఉంది. ఆయన మీద ఎంతో గౌరవం ఉంది. అంతేనా ఆయన సాక్షాత్తు తమని పరిపాలించే చక్రవర్తి. మరి అట్లాంటి రాజుగారు "నామనసు బాగాలేదు" అంటే బీర్బల్ కంగారు పడకుండా ఎలా ఉంటాడు? మనమైన అంతే కదా! మనం బాగా ఇష్టపడే వాళ్ళు ఎప్పటిలా కాకుండా నీరసంగా దిగులుగా కనిపిస్తే బాధపడతాం కదా! అలాగే బీర్బల్‌ కూడా రాజుగారి మనసు బాగుండలేదు అని అనేసరికి కంగారు పడ్డాడన్న మాట.

"చెప్పండి మహారాజా! మీ మనసు ఎందుకు బావుండలేదు? ఎవరు మీ మనసును బాధపెట్టింది?" అని అడిగాడు బీర్బల్. అప్పుడు అక్బర్ తన చేతిని చూపించాడు. బీర్బల్‌కు రాజుగారి ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు. "మీమనసు ఎందుకు బావుండ లేదు?" అని అడిగితే రాజుగారు తమ చేతిని చూపిస్తున్నారేమిటి అని ఆలోచించాడు బీర్బల్. "మీ మనసు ఎందుకు బాగుండలేదు మహారాజా అని నువ్వు అడుగుతుంటే నేను సమాధానం చెప్పకుండా చేతిని చూపిస్తున్నారేమిటా అని అనుకుంటున్నావు కదూ!" అని అడిగాడు అక్బర్. అందుకు బీర్బల్ అవునన్నట్లుగా తల ఆడించాడు.

"బీర్బల్! ఒక సారి నువ్వు నా చేతిని జాగ్రత్తగా గమనిస్తే నేను ఎందుకు బాధపడుతున్నానో నీకే అర్థం అవుతుంది." అన్నాడు అక్బర్. చక్రవర్తి చెప్పినట్టుగానే చేసాడు బీర్బల్. "ఊఁ ఏమైనా అర్థం అయిందా!" అడిగాడు అక్బర్ చక్రవర్తి. "అర్థం అయ్యింది మహారాజా! మీ సమస్య ఏమిటో తెలిసింది" అన్నాడు. "అయితే చెప్పు మా సమస్య?" అడిగాడు అక్బర్. మీ మధ్య వ్రేలికి ఉండాల్సిన ఉంగరం లేదు మహారాజా!" అన్నాడు బీర్బల్. బీర్బల్ సునిశిత దృషికి అక్బర్ చక్రవర్తి మనసులో ఎంతో సంతోషించాడు. "అవును నువ్వు చెప్పింది నిజమే నాకు ఎంతో ప్రియమైన ఉంగరం ఒకటి కనిపించటం లేదు."అన్నాడు అక్బర్. "ఎక్కడైనా భద్రంగా పెట్టిమర్చిపోయారేమో గుర్తు చేసుకోండి మహారాజా!"

"లేదు బీర్బల్ నాకు గుర్తుంది. ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు కూడా చూసుకున్నాను. చేతికి ఉంగరం ఉంది. బాత్‌రూమ్‌కు వెళుతూ తీసి పక్కన పెట్టాను. నేను తిరిగి వచ్చేసరికి ఉంగరం మాయమైనది." అని చెప్పాడు. చక్రవర్తి చెప్తున్నదంతా బీర్బల్ మౌనంగా వినసాగాడు. ఇంకా అక్బర్ చక్రవర్తి ఇలా అన్నాడు. "ఆ ఉంగరం దొంగ ఎవరో ఇక్కడే ఉన్నాడు. ఆ విషయం నాకు బాగా తెలుసు. కాబట్టి ఆ ఉంగరం ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది." "మహారాజా! మీకు ఎవరి మీదనైన అనుమానం ఉంటే చెప్పండి." అడిగాడు బీర్బల్. లేదు బీర్బల్! నాకు ఎవ్వరి మీద అనుమానం లేదు. అయినా సరైన ఆధారాలు లేకుండా ఎవరినైనా అనుమానించడం చాలా తప్పు." అన్నాడు అక్బర్ చక్రవర్తి. సభలో ఉన్న వారంతా వారికి తోచిన సలహాలు చెప్పరు అందరూ మాట్లాడుతున్నా బీర్బల్ మాత్రం మౌనంగా ఉండిపోయాడు.

కొద్దిసేపటి తర్వాత అక్బర్ "బీర్బల్ ఈ సమస్య పరిష్కరించగలవాడివి నువ్వేనని నాకు అనిపిస్తోంది అన్నాడు. "చెప్పండి మహారాజా! నేను ఏం చేయాలో చెప్పండి." అడిగాడు బీర్బల్. "బీర్బల్! నీకు జ్యోతిష్యం తెలుసు కాబట్టి నీ జ్యోతిష్యం ప్రతిభతో ఆ ఉంగరం దోంగ ఎవరో నువ్వే కనిపెట్టాలి." చెప్పాడు అక్బర్. రాజుగారు చెప్పినదానికి బీర్బల్ ఒప్పుకున్నాడు." మహారాజా మీరు బాత్‌రూమ్‌కు వెళుతూ ఉంగరం ఎక్కడ పెట్టారో ఆ స్థలం నాకు చూపించండి." అని అడిగాడు బీర్బల్. అక్బర్ చక్రవర్తి వెంటనే బీర్బల్‌ను ఓ అలమారు దగ్గరకు తీసుకునివెళ్ళాడు. "ఇదిగో ఇక్కడే పెట్టాను" అంటూ ఆ స్థలం చూపించాడు. బీర్బల్ ఆ అలమర దగ్గరకు వెళ్ళి తన చెవి ఆనించాడు. "ఆహఁ! అలాగా! సరే... సరే..." అన్నాడు.

బీర్బల్ ఏమిచేస్తున్నాడో అక్కడ ఉన్నవాళ్ళకి అర్థం కాలేదు. బీర్బల్ నిలబడిన తీరు 'ఆహా! అలాగా! ఓహొ! అని అనడం అది చూస్తుంటే ఆ దృశ్యం చూసే వారికి ఎలా ఉందంటే అలమర ఏదో చెపుతుంటే బీర్బల్ వింటున్నట్టుగా ఉంది. షుమారు ఐదు నిమిషాల తర్వాత బీర్బల్ అలమర దగ్గరనుండి ఇవతలకు వచ్చాడు. "ఉంగరం దొంగ దొరికాడు మహారాజా!" అన్నాడు. "చెప్పు బీర్బల్! ఎవారా దొంగ త్వరగా చెప్పు. రాజుగారి ఉంగరాని తీసేటంత ధైర్యం ఉన్న ఆ దొంగ ఎవరో నేను వెంటనే చూడాలి. ఇంతటి నేరానికి పాల్పడినందుకు కఠినంగా శిక్షించాలి." అన్నాడు.

"మహారాజా" ఈ అలమార ఏం చెప్తోందంటే ఎక్కడ మీరు బాత్‌రూంలోంచి వచ్చేస్తారో అని అతను ఖంగారు ఖంగారుగా ఉంగరం తీస్తుండేసరికి ఆ ఖంగారులో అతని గడ్డం అలమరలో ఇరుక్కుని పోయిందట. మీరు బాత్‌రూంలోంచి వచ్చేస్తారేమోనని భయపడి గబాల్న గడ్డం లాక్కునేసరికి కొన్ని వెంట్రుకలు అలమారలో చిక్కుకుని పోయాయట. కావాలంటే మీరు అలమార తెరిపించండి తప్పకుండా అందులో మీకు వెంట్రుకలు కనిపిస్తాయి." అని అన్నాడు బీర్బల్. బీర్బల్ చెప్పినదంతా నిజం కాదని తెలిసినా కూడా ఎవరికైతే చక్రవర్తి తన ఉంగరాన్ని దాచి పెట్టమని ఇచ్చాడో అతను ఖంగారుగా గడ్డం సవరించుకున్నాడు. అంతే బీర్బల్ దొంగను పట్టుకున్నాడు. "మహారాజా! దొంగ దొరికాడు" అంటూ అతన్ని పట్టుకున్నాడు బీర్బల్. అక్బర్ చక్రవర్తి జరిగినదంతా బీర్బల్‌కు చెప్పాడు. అంత కచ్చితంగా బీర్బల్ దొంగను ఎలా పట్టుకోగలిగాడో అక్కడ ఉన్న వారెవ్వరికి అర్ధంకాలేదు. అదే విషయం బీర్బల్‌ను అడిగాడు అక్బర్ చక్రవర్తి.

"మరేమి లేదు మహారాజా! మీరు అలమరలో ఉంగరం పెట్టి వెళ్ళానని చెప్పారు. నేను మీరు చెప్తున్నది నిజమనే అనుకున్నాను. అందుకే మీరు నాకు జ్యోతిష్యం తెలుసునని చెప్పగానే నాకు ఈ ఉపాయం తోచింది. వెంటనే అలమర దగ్గరకు వెళ్ళి అలమరకు చెవి ఆనించి నిలబడి ఏదో విన్నట్టుగా నటించాను. అక్కడి నుంచి ఇవతలకు వచ్చి ఉంగరం తీస్తుండగా దొంగ గడ్డం అలమారలో చిక్కుకుని పోయింది అని కల్పించి చెప్పాను. నేను ఇలా చెప్పగానే ఉంగరం దొంగ ఎవరో తప్పకుండా గడ్డం సవరించుకుంటాడని నాకు తెలుసు. అంతే దొంగను సులభంగా పట్టుకోవచ్చని అనుకున్నాను. అయితే మీరు ఉంగరం దాచి పెట్టమని ఇచ్చినా కూడా అతను ఆ విషయం మర్చిపోయి గడ్డం సవరించుకోవడంతో దొంగ దొరికిపోయాడు." అని తను దొంగను ఎలా పట్టుకున్నాడో రాజుగారికి వివరించాడు బీర్బల్.
____________________________________________

ఊరికోసం బావి

వేసవి సెలవులు వచ్చాయి. రాము పదవ తరగతి పరీక్షలు రాశాడు. రామూ నాన్నగారికి పల్లెలో ఉద్యోగం. అందుచేత అందరూ ఆ పల్లెలోనే ఉంటున్నారు. తెలంగాణాలోని ఒక చోటు వారికి వాన నీరే ఆధారం. నీరు తెచ్చుకోవడానికి రెండు మైళ్ళు పోవాలి. అక్కడ ఒక చెరువు ఉంది. ఆ నీరు తెచ్చుకుని వాడుకోవాలి. బిందె అయిదు రూపాయలకు నీరు కొనుక్కోవాలి. ఈ బాధలన్నీ కళ్ళారా చూస్తున్నాడు రాము. ఏదైనా చేయాలి? అనుకున్నాడు. రామూ మామయ్య ఇంజనీరు. ఆయన పట్నంలో ఉంటాడు. శెలవులకు మామయ్య దగ్గరకు వెళ్ళాడు. తమ ఊరి సమస్య చెప్పాడు. రామూ మామయ్య బాగా ఆలోచించాడు. ఒక ఉపాయం చెప్పాడు. రామూ సంతోషంగా తిరిగి వచ్చాడు. ఊరివారు అందరికీ మంచినీరు కావాలి. ఓపిక ఉన్నవారు రెండు మైళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు. డబ్బులు ఉన్నవాళ్ళు నీరు కొనుక్కుంటారు. మరి ఓపిక, డబ్బూ లేని వారు ఏం చేయాలి? దాహంతో చావవలసిందేనా! రామూ స్నేహితులు అందరినీ ఈ ప్రశ్న కలచివేసింది. వారు కూడా ఏదైనా చేయాలి అనుకున్నారు. సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు. వారం శ్రమ పడితే ఊరి ఇబ్బంది తీరుతుంది. రామూ మామయ్య చెప్పినది స్నేహితులతో చెప్పాడు రాము.

ఊరికి మధ్యలో చింతల తోపు ఉంది. అక్కడ బావి తవ్వితే నీరు పడుతుంది. ఇది ఇంజనీరు మామయ్య చెప్పిన మాట. అయితే బావి ఎవరు తవ్వుతారు? పెద్ద బావి తవ్వడానికి బోలేడు డబ్బు కావాలి. అంత డబ్బు ఎవరు ఇస్తారు? రాము, స్నేహితులు ప్రతి ఇంటికి వెళ్ళారు. ఊరి సమస్య అందరికీ తెలిసినదే! సహాయం అడిగారు. డబ్బు రూపంగా ఇవ్వవచ్చు. శ్రమదానం చేయవచ్చు. ఎవరు ఎలా అయినా బావి తవ్వకానికి సహాయపడాలి. పిల్లలను చూసి పెద్దవాళ్ళకు ఊపు వచ్చింది. ఊరివారు అందరూ ఒక చోట చేరారు. ఈ సమస్యకు జవాబు చెప్పాలని అనుకున్నారు. అందరూ చందాల రూపంలో డబ్బు పోగు చేశారు. డబ్బు ఇవ్వలేని వారు పలుగు - పార చేతబట్టారు. బావి తవ్వడానికి ముహూర్తం పెట్టారు. అందరూ ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చారు. పంతులుగారు కొబ్బరి కాయ కొట్టారు. బావితవ్వడం పనులు మొదలు అయ్యాయి. పెద్దవాళ్ళు పలుగు పారలతో తవ్వుతున్నారు. రాము, రాము స్నేహితులు తట్టలతో మట్టిమోశారు. అందరూ పాటలు పాడుతూ పని చేస్తున్నారు. ఆడవారు పని చేసేవారికి అన్నీ అందిస్తున్నారు. అందరికీ పులిహార పొట్లాలు, పెరుగు అన్నం యిచ్చారు. అందరూ మధ్యాహ్నానికి ఇంత ఎంగిలి పడ్డారు. బీద గొప్ప తేడాలేదు. కులం మతం పట్టింపు లేదు. అందరూ చేయి చేయి కలిపారు. బావి తవ్వకం జోరుగా సాగుతోంది. రాము ఎంతో సంతోషించాడు. పట్నం నుండి ఇంజనీరు మామయ్య వచ్చాడు. ఎన్ని అడుగులు తవ్వితే నీరు పడుతుందో చెప్పాడు. మూడు రోజులలో బావి తవ్వకం పూర్తి అయింది. జలజలమంటూ నీటి ఊట ఉబికి వచ్చింది.

ఊరివారి ఆనందానికి హద్దులు లేవు. ఎగిరి గంతులు వేస్తూ పండుగ చేసుకున్నారు. బావి నీరు కొబ్బరి నీరులాగా తియ్యగా ఉంది. బీడు నేలలో తియ్యని నీరు పడటం అబ్బురం! చకచకా బావి చుట్టూ రాతి గోడలు కట్టారు. మరి వారం రోజులలో పనులూ పూర్తి అయ్యాయి. పంచాయితీ ప్రెసిడెంటుగారు వచ్చారు. బావిని ఊరికి అంకితం చేశారు. ఆయన బావి తవ్వకం కథ విన్నారు. రామూని, అతని స్నేహితులనూ అభినందించారు. ఊరికి ఉపకారం ఇంత చిన్న పిల్లలు చేశారు. బావి తవ్వకంలో పది మంది పిల్లలు పని చేశారు. వాళ్ళకి ఈ సంవత్సరం ఖర్చు అంతా పంచాయితీ భరిస్తుంది. వాళ్ళ చదువు, బట్టలూ అన్నీ పంచాయితీ చూస్తుంది. ఆ విధంగా ప్రెసిడెంటుగారు హామీయిచ్చారు. అందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు.
_________________________________________

ఎత్తుకు పై ఎత్తు

ఒక ఊరిలో ఒక వర్తకుడున్నాడు. అతడు గొప్ప జిత్తుల మారి. అతనొక నాడు మరొక వూరి సంతకు బయలుదేరాడు. దారిలో అతను చాలా విచారంగా వున్నాడు. అతని విచారానికి కారణం ఆనాడు తనింకా లాభసాటి పని ఏదీ చెయ్యలేదు అన్న ఆలోచనే. ఎలాగో లాభం దారిలోనే సంపాదించాలనే దురాలోచన ప్రారంభమయిందతనికి. ఇంతలో దారిలో ఒక మనిషి తారసపడినాడు. ఆ రైతు మరొక గ్రామం నుండి షావుకారు వెళుతున్న గ్రామానికే సంతపని మీద వెళుతున్నాడు. అతన్ని చూడగానే షావుకారికి పల్లెటూరి రైతు అంటే బైతు అని షావుకారు నమ్మకం. ఆ నమ్మకంతో సునాయాసమైన లాభం సంపాదించడానికి షావుకారు బ్రహ్మాండమైన ఎత్తువేశాడు. రైతుని చూసి ఎక్కడికి వెళుతున్నావని అడిగాడు. రైతు సంతకు వెడుతున్నానని జవాబు చెప్పాడు. సరే దారిలో ఉబుసుపోవడానికి యేవయినా కథలు చెప్పుకుందామని షావుకారు సూచించాడు. కథలంటే అందరికీ ఇష్టమే. అందులోను ప్రయాణంలో కాలక్షేపానికి కథలైనా ఉండాలి. కమ్మని నేస్తం అయినా ఉండాలి. కాలక్షేపానికి బావుంటుందని రైతు వెంటనే ఒప్పుకున్నాడు. షావుకారు కథకి పందెం కడితే రంజుగా ఉంటుందన్నాడు. ఇద్దరూ చెరొక కథ చెప్పాలనీ, ప్రతి కథా నమ్మడానికి వీలులేనంత అభూత కల్పనలతో అంటే పచ్చి అబద్దంగా ఉండాలనీ ఆ అబద్దం నమ్మడానికి వీలులేదని ఇద్దరిలో ఏ ఒకరయినా సందేహం వెలిబుచ్చితే, అతడు రెండవవాడికి వంద రూపాయలు చెల్లించాలనీ షావుకారు నిర్ణయించాడు. పాపం భయస్తుడయిన రైతు ఆ పందానికి మొదట ఒప్పుకోలేదు. కానీ జిత్తులమారి షావుకారు నయవంచనలకు లొంగి చివరకు అంగీకరించాడు. ఇంకేముంది? షావుకారు రొట్టె విరిగి నేతిలో పడిందని సంతోషించాడు. రైతును మొదట కథ చెప్పమన్నాడు. కానీ, వయస్సులో పెద్దవాడయిన షావుకారే ముందు కథ చెప్పాలని రైతు పట్టుబట్టాడు. "వైద్యుడు ఇచ్చినవి పాలే, రోగి కోరిందే పాలే" అన్నట్లు షావుకారు కోరిందీ అదే రైతు వత్తిడి చేసిందీ అదే, ఠపీమని షావుకారు అంగీకరించి, మొదటి దెబ్బకే లాభం చేసుకోవాలని లోలోపల పొంగి పోయాడు. అతను కథనిలా ప్రారంభించాడు.

అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద బిడారు వర్తకుడున్నాడు. అతనికి పాతిక ఒంటెలు వున్నాయి. వాటినన్నిటినీ ఒక దాని ముక్కును మరియొకదానికి పెద్ద పెద్ద మోకులతో కట్టి, ఒక పెద్ద గుంపుగా ఎడారిలో నడిపించుకుంటూ పోతున్నాడు. ఒకొక్క ఒంటె మీద వందేసి బారువుల ఖర్జూరపు పండ్లూ, వందేసి బస్తాల చింతపండూ, వందేసి బుట్టల తాటిబెల్లం వేసుకొని బదరీనాధ్‌కు ఎగుమతి చేస్తున్నాడు. అదే సమయానికి ఆ ప్రాంతములో నున్న రాజుగారి కుమార్తె తలంటుకొని, జుట్టు ఎండలో ఆరబెట్టుకుంటోంది. ఆమె చెలికత్తె జుట్టు చిక్కుతీస్తుంది. ఇంతలో ఒక పెద్ద గండభేరుండ పక్షి, ఆ ఎడారిలో ఎగురుతూ క్రిందనున్న ఒంటెలను చూచింది. దానికి ఆకలి వేసింది. వెంటనే ఒక ఒంటెని కాళ్ళతో తన్నుకొని కోడిపిల్లలను గ్రద్ద తన్నుకొని పోయినట్లు పైకి ఎగిరిపోయింది. కాని క్రింద నున్న పర్వతాల్లాంటి పాతిక ఒంటెలు ఒక కదువుగా వుండడం వలన అన్నీ పైకి పోయినవి. చాలా విచిత్రం! అది ఎంత పెద్ద గండభేరుండ పక్షో! దానికి ఎంత బలముందో! కాని క్రిందనున్న ఒంటెలు ఒకదానికి ముక్కు కొకటి కదువులతో కట్టబడి వుండడం వలన గిజగిజ తన్నుకున్నాయి. దానితో పక్షికి తట్టుతప్పింది. లటుక్కుమని కాళ్ళసందు నున్న ఒంటె జారి క్రిందపడింది. దాని వెంట మిగిలిన ఒంటెలు కూడా జరజర పడిపోసాగాయి. అవి అలాగ పడిపోతూ పెద్ద పెద్ద అరుపులు అరచాయి. ఇంతలో క్రింద తలారబోసుకుంటున్న రాజకుమార్తె ఆ గొడవేమిటాయని తల పైకెత్తి చూసింది. అంతే పైనుండి క్రిందపడుతున్న పాతికి ఒంటెల గుంపు కనిపించింది. ఆ రాకుమారి కళ్ళు ఒక్కొటి చిన్న సైజు చెరువంత వుంటుంది. మొత్తం పాతిక ఒంటెలు ఆ కంట్లో పడిపోయాయి.

రాకుమారి కంట్లో నలకల్లా పడ్డ ఒంటెలు చేసే గోలకి రాకుమారికి తీవ్ర ఇబ్బంది కలగజేయగా ఆవిడ బాధగా అరుస్తూ ఉంటే పక్కనే ఉన్న చెలికత్తె రాకుమారి కన్నులోని ఒక్కొక్క ఒంటెని తీసి తన జేబులో వేసుకుంది. మొత్తం 25 ఒంటెలను తీసి రాకుమారి బాధను తగ్గించింది. ఆ చెలికత్తె వెంటనే జేబురుమాల తీసుకొని, రాచకన్నె కన్ను వత్తి ఒక్కొక్క ఒంటెని కంటిలోనివి తీసి జేబులోవేసింది. అలాగ పాతిక ఒంటెలను తీసి రాజకుమార్తె గగ్గోలును తగ్గించింది. అని ఆ షావుకారు తనవంతు కథను పూర్తిచేశాడు. కాని రైతు ఏ రకమయిన సందేహాన్ని బయట పెట్టలేదు. పాపం షావుకారు నిరుత్సాహపడి బిక్కమొహం వేశాడు. ఇంక చేసేది లేక రైతు వంతు కథను మొదలు పెట్టమన్నాడు. ఆ రైతు తన కథను ఇలా చెప్పాడు.

మా నాన్న గారు ఈ ఊరిలో చాలా పెద్ద రైతు ఆయనకు రెండువందల జతల ఎడ్లు, ఐదువందల ఆవులు, ఒక వేయి ఎకరాల మాగాణి, పెద్ద మండువా ఇల్లు ఉండేది. ఆ రోజుల్లో మీ నాన్న చాలా పేద షావుకారు, మా నాన్నకి చాలా గుర్రాలుండేవి. ఆ గుర్రాలలో చింత పువ్వురంగు గుర్రం అంటే మా నాన్నకు పంచప్రాణాలు, దాన్ని చూసి అందరూ ముచ్చట పడేవాళ్ళు. ఆ గుర్రం మీదే మా నాన్న ప్రతివారం సంతకు వెళ్ళి సామానులు వేసుకుని, ఇంటికి వస్తూండేవాడు, ఒకసారి సంతకు వెళ్తుండగా గుర్రం మీద జీను రాసుకొని గుర్రం వీపు మీద పుండు పడింది. సంతనుంచి గోధుమల బస్తాలు గుర్రం మీద వేసుకొని మా నాన్న వస్తూ వుండగా దారిలో పెద్ద గాలివాన వచ్చిందట. అందువలన పెద్ద ధూళిపొర ఎగిరి గుర్రం వీపు మీదనున్న పుండుపై పడిందట. తరువాత వాన చినుకులు కూడా దాని మీద పడ్డాయి. గుర్రం వీపు మీద పడి మొలకెత్తడం మొదలు పెట్టాయి. అలా మొలచిన మొక్కలకు గుర్రం వీపు మీద పెద్ద గోధుమ పొలం తయారయింది. మరి కొన్నాళ్ళకు ఆ పొలం పండి కోతకు సిద్దపడింది. అందుచేత ఆ పొలం కొయ్యటానికి రెండువందల మంది పనివాళ్ళను మా నాన్న పెట్టాడట, అంటే మా గుర్రం మీద పెరిగిన గోధుమ చేను ఎంత పెద్దదో తెలుసుకో! ఆ చేను కోయగా ఎన్నో వేల బస్తాల గోధుమల దిగుబడి వచ్చిందట, ఇంతలో మీ నాన్న మా నాన్న దగ్గరకు వచ్చి "పెదకాపుగారూ! నేను చాలా పేదవాణ్ణి పిల్లలతో నానా బాధపడుతున్నాను. దయచేసి నాలుగు బస్తాల గోధుమలు నాకు అప్పుగా ఇప్పించండి. మీ అప్పు తప్పక తీరుస్తాను. అని దీనంగా ప్రాధేయపడ్డాడు. అసలే మా నాన్నది చాలా జాలిగుండె మీ నాన్న కష్టంలో అడిగిన అప్పు ఇవ్వడానికి అంగీకరించాడు. వెంటనే మీ నాన్న నాలుగు బస్తాల గోధుమలు తీసుకొని వెళ్ళిపోయాడు. కాని ఆ బాకీని ఇప్పటికీ తీర్చలేదు. అందుచేత వడ్డీ లేకపోయినా, అసలు మొత్తమైనా నువ్వు ఇస్తే మీ నాన్న చచ్చి యే లోకాన ఉన్నాడో ఋణ విముక్తుడవుతాడు. అని తన కథను ముగించాడు.

ఇప్పుడు షావుకారు పెద్ద సంకటంలో పడ్డాడు. నిజానికి షావుకారు తండ్రి పెద్ద ధనికుడు. కాని రైతు కథలో చాలా బీదవాడని అన్నాడు. అతను చెప్పింది కాదంటే వంద రూపాయలు రైతుకి ఇచ్చుకోవలసినదే. పోనీ పైసా కోసం పరువు పోగొట్టుకుందాం అనుకున్నా గుర్రం వీపు మీద గోధుమ పొలం ఏమిటి? అనే సందేహం వచ్చిపడింది. అది బయటకు చెబితే నిర్ణయం ప్రకారం వంద రూపాయలు ఇచ్చుకోవలసిందే. పోనీ ఆ అవమానాన్ని పచ్చి అబద్దం అని తెలిసినా సహించినా షావుకారు తండ్రి అప్పుగా నాలుగు బస్తాల గోధుమలు తీసుకోవడం ఏమిటి? ఖర్మ ఇక షావుకారు నాలుగు బస్తాల గోధుమలయినా రైతుకు ఇచ్చుకోవాలి. లేదా వందరూపాయలు ఐనా ఇచ్చుకోవాలి. ఇప్పుడు షావుకారు పని అడకత్తెరలో పోకచక్కలా అయింది. ఈ రెండింటిలో అప్పుకంటే అనుమానమే చౌక అంటే నాలుగు బస్తాల గోధుమల కంటే కథ అంతా పచ్చి అబద్దం అనేసి, వంద రూపాయలు వదులుకోవటమే నయం అని నిశ్చయించుకున్నాడు. అందుచేత "కథ అంతా పుక్కిటి పురాణం" అని రైతుతో అన్నాడు. వెంటనే నిర్ణయం ప్రకారం రైతు వంద రూపాయలు వసూలు చేసుకున్నాడు. పాపం షావుకారు బ్రహ్మాండమైన ఎత్తువేశాడు. కాని చివరకి తను తవ్విన గోతిలో తానే పడ్డట్టు చిత్తయిపోయాడు.
___________________________

సాటివారికి సాయం

అనగా అనగా ఒక ఊరు. ఆ ఊరిలో అచ్చమ్మ అనే ఒక స్త్రీ ఉంది. ఆమెకి దేవుడు అంటే మక్కువ. పాప భీతి ఎక్కువ. ఆమె భర్త మరణించాడు. ఆమెకి ఇద్దరు కుమారులు. పెద్దవాడు రామయ్య, చిన్నవాడు అంజయ్య. ఆ ఇద్దరు పిల్లలనూ అల్లారు ముద్దుగా పెంచి పెద్ద జేసింది. ఒకసారి చిన్నవాడు అంజయ్యకి జబ్బు చేసింది. ఎన్ని మందులు వాడినా జబ్బు తగ్గలేదు. జబ్బు తగ్గితే తిరుపతి కొండకు వస్తామని మొక్కింది. శ్రీ వేంకటేశ్వర స్వామికి ముడుపు కట్టింది. ఏమైతే నేం? అంజయ్యకి జబ్బు తగ్గింది. కానీ కొండకి వెళ్ళలేదు. మొక్కు తీర్చలేదు. ఇలావుండగా ఒకనాడు దేవుని పటం ముందు ముడుపు కనిపించలేదు. కంగారు పడిపోయింది. అచ్చమ్మ "ఏరా!స్వామి ముడుపు కనిపించటం లేదు. ఏమైందిరా" అని కేకలు పెట్టింది. "నేనే తీశానమ్మా" అన్నాడు అక్కడే వున్న అంజయ్య. "అపచారం!అపచారం!ఆ ముడుపు ఎందుకు తీశావురా? అంది అచ్చమ్మ చెంపలేసుకొంటూ. "లేదమ్మా! ఆ పాతిక రూపాయలూ నారయ్యకు ఇచ్చాను" అన్నాడు అంజయ్య. "వాడికెందుకు ఇచ్చావురా? వాడికేమొచ్చిందిరా?" "ఏమొచ్చేదేమిటమ్మా! జ్వరమొచ్చింది. డబ్బు ఇస్తేగానీ మందు ఇవ్వనన్నాడు డాక్టరు. అందుకని...." అని అంజయ్య అంటూ ఉండగానే - ఎంత ఘోరం" అంటూ చిందులు తొక్కింది అచ్చమ్మ.

ఇంతలో పొలం నుంచి పెద్ద కొడుకు రామయ్య వచ్చాడు. వస్తూనే తల్లి కేకలు విన్నాడు. "ఏమిటమ్మా! ఏం జరిగింది?" అని అడిగాడు. జరిగింది అంతా చెప్పింది అచ్చమ్మ. "ఏరా అంజీ!నిజమేనా?" అని తమ్ముడ్ని అడిగాడు రామయ్య. "నిజమే అన్నయ్యా! కాని ఆ డబ్బులు నా కోసం తీసుకోలేదు. నారయ్యకి జ్వరం తగ్గటానికి మందుల కోసం ఆ డబ్బు ఖర్చు చేశాను అన్నాడు అంజయ్య. భేష్!మంచి పని చేశావురా!" అని మెచ్చుకొన్నాడు రామయ్య. "ఏమిట్రా! తప్పు అని చెప్పకపోగా నీవూ వాడినే సమర్థిస్తున్నావా?" అని ఆశ్చర్యంతో బుగ్గలు నొక్కుకుంది అచ్చమ్మ. "అవునమ్మా! చిన్నవాడు అయినా మన అంజయ్య చేసిన పని చాల గొప్పది. ఆపదలో ఉన్న మానవుని ఆదుకోవటం మానవ ధర్మం. మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా!. కనుక దేవుని సొమ్ము ఖర్చు పెట్టినా తప్పు లేదు-ముప్పులేదు. "ఆపదలో ఉన్న ఒక అనాధ బాలునికి తన సొమ్ము సాయపడిందని భగవంతుడు ఆనందిస్తాడు." - అన్నాడు రామయ్య. "నిజమే బాబూ! మీరు ఇద్దరూ నా కళ్ళు తెరిపించారు. మానవ సేవే మాధవ సేవని చెప్పే వారే గాని చేసేదెవరు?" "ఒరే అంజయ్యా! వయస్సు చిన్నది అయినా నీ మనస్సు వెన్నరా." అని అంజయ్యని మెచ్చుకొంది అచ్చమ్మ.

అప్పుడే బీరువాలో నుంచి పాతిక రూపాయలు తీసుకొచ్చాడు రామయ్య. అమ్మ చేతికిచ్చి "అమ్మా! ఈ సొమ్ము తీసుకో! మళ్ళీ స్వామి వారికి ముడుపు కట్టుకో! ఇక నీ ముడుపు యధావిధిగా ఉంటుంది. నీ దడుపూ తొలగిపోతుంది!" అన్నాడు నవ్వుతూ.
__________________________________

ఏ గుళ్ళో పెళ్ళి

పరంధామయ్య గారికి ఏడుగురు కుమార్తెలు. ఆరుగురికి వివాహాలు పూర్తి చేశాడు. కాని ఏడవకుమార్తె వివాహము గురించి సంబంధాల కోసము తెగ ప్రయత్నము చేశాడు. ఎక్కడా సరియైన సంబంధము దొరకలేదు. ఒక రోజున పరంధామయ్య పట్నంలో ఉన్న చిన్నప్పటి బాల్యస్నేహితుని ఇంటికి వెళ్ళాడు. ఆయనకు, పరంధామయ్యగారికి దూరపు చుట్టరికం కూడా వుంది. ఆయనే ఒక సంబంధం గురించి చెప్పి వాళ్ళింటికి తీసుకువెళ్ళాడు. ఆ సంబంధము పరంధామయ్య గారికి నచ్చింది. పెళ్ళిచూపులు ఏర్పాటు చేశారు. పిల్లనచ్చిందన్నారు. కట్నం అక్కరలేదన్నారు. కాని పెళ్ళి గుళ్ళో చెయాలని ఇంటిలోని వారు అన్నారు. ఏ గుడిలో చేయాలనే విషయంలో ఏకాభిప్రాయం కలగలేదు. పరంధామయ్యగారి పెద్దల్లుడు వేంకటేశ్వర స్వామి గుడి అని, పరంధామయ్య హనుమంతుడి గుడి అని, రెండవ అల్లుడు రామాలయం అని, మూడవ అల్లుడు ఆది దేవుడైన వినాయకుని గుడి అని రకరకాలుగా చెప్పసాగారు.

వీళ్ళ మాటలకి పెళ్ళి కూతురు ఏం చెప్తే ఎలా వుంటుందోనని ఆలోచించి 'పెళ్ళి ముహూర్తము పెట్టే జ్యోతిష్కుణ్ణే అడగండి. ఏ గుళ్ళో చేయమంటారో తెలుసుకోండి. ఆయన ఇష్ట ప్రకారము చేయండి' అని చెప్పింది. జ్యోతిష్కుడు అందరి అభిప్రాయాలు తెలుసుకొని పెళ్ళి ఏ గుడిలోను జరగడం అంతమంచిదికాదు. వేంకటేశ్వరునికి ఇద్దరు భార్యలు. హనుమంతుడు బ్రహ్మచారి. వినాయకుడు బ్రహ్మచారి అనీ, కొందరు ఇద్దరు భార్యలు కలరని అంటారు. ఇహపోతే శ్రీరాముడు అన్ని విధాల యోగ్యుడే అయినా అతన్ని వివాహమాడిన సీతాదేవి ఎన్ని ఇబ్బందులు పడిందో మనకు తెలుసుకదా. నిక్షేపంగా ఆలోచించకుండా మీ స్వగృహములోనే వివాహము చేయండి. ఇంకేమీ ఆలోచించకండి. అనగానే వారు అంగీకరించి పెళ్ళి ఇంటివద్దనే చేశారు.
______________________________________________

ఏడు కూజాల కథ

అనగా అనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో ఒక రాజు, ఖజానా నిండుగా డబ్బులు ఉండేవి, అయినా రాజుకు తెలీని అసంతృప్తి. ఒక రోజు ఆ రాజు వేటకు వెళ్ళినాడు, వేటకు వెళ్ళి జింక పిల్లలు, భల్లూకాలు, సింగాలు, వేటాడి అలసి నిద్రిస్తుంటే ఒక కల వచ్చింది.

ఆ కలలో ఒక పురుషుడు కనపడి రాజా నీకు నేను అమూల్యమైన ధనం ఇస్తున్నాను. చక్కగా ఆనందించు అని చెప్పినాడు, కానీ దేనికైనా పైన నక్షత్రపు గుర్తు ఉండాలి కదా, అలాగే ఓ కండీషను కూడా పెట్టినాడు. నేను నీకు ఏడు పెద్ద కూజాలు ఇస్తాను వాటిలో ఆరు కూజాల నిండా ధనం, వజ్రాలు, వైడూర్యాలు అమూల్య రత్నాలు మొదలగునవి ఉంటాయి. ఏడవ కూజా మాత్రం సగం నిండి ఉంటుంది, సగం ఖాళీగా ఉంటుంది. నీవు నీ దగ్గర ఉన్న డబ్బుతో ఈ ఏడవ కూజా నింపితే ఆ తరువాత ఏడు కూజాలూ చక్కగా వాడుకోవచ్చు అని చెప్పి మాయం అవుతుంది.

రాజు ఆనందాశ్చర్యాలతో మేల్కొంటాడు. లేచి చూస్తే ఏముంది ధగ ధగ మెరుస్తూ ఏడు పెద్ద కూజాలు కనిపించినాయి, వాటిలో ధనం చూసి రాజుకు మూర్చ వచ్చినంత పని అయినది. ఆనందంతో వాటిని చూసి రాజు తన దగ్గర ఉన్న డబ్బులు అన్నీ, నగలు అన్నీ దానిలో వేసినాడు కానీ కూజా నిండుగా కాలేదు! ఇంకా సగం ఖాళీగానే ఉన్నది.

రాజ్యం వెళ్ళి ఒక్క రోజు ఆదాయం వేసినాడు కానీ ఇంకా కూజా ఖాళీగానే ఉన్నది. వారం రోజుల ఆదాయం వేసినాడు కానీ ఇంకా కూజా ఖాళీగానే ఉన్నది. ఒక్క నెల రోజుల ఆదాయం వేసినాదు కానీ ఇంకాక్ ఊజా ఖాళీగానే ఉన్నది. ఒక సంవత్సరం ఆదాయం వేసినాడు ఇంకా ఖాళీగానే ఉన్నది. ఇహ పౌరుషం పొడుచుకొచ్చి ఆవేశంతో ఖజానా మొత్తం వేయడానికి సిద్ధం అయినాడు, కానీ తెలివి గల మంత్రిపుంగవులు వచ్చి రాజు ఆవేశాన్ని చల్లార్చి రాజా! ఈ ఏడవ కూజా ఉన్నది చూసినారా అది మీ మనస్సు లాంటిది, అది ఎప్పటికీ తృప్తి పొందదు మీరు కొద్దిగా తెలివిగా ఆలోచించండి అని చెప్పినాడు. రాజు కూడా నిజమే కదా అనుకొని చక్కగా తృప్తి పొంది ఆవేశాన్ని అనుచుకున్నాడు.
_________________________

ఐకమత్యమే బలం


పూర్వకాలం ఉజ్జయినీ నగరంలో ఒక వర్తకుడు ఉండేవాడు. అతను చాలా తెలివిగా వ్యాపారం చేస్తూ బాగా డబ్బు, పేరు సంపాదించుకున్నాడు. అన్నీ ఉన్నా అతనికి ఉన్న దిగులు ఒక్కటే. అది తన పిల్లల గురించే. అతని నలుగురు పిల్లలు పుట్టటంతోనే ధనవంతులు కావడం వల్ల అల్లారు ముద్దుగా పెరిగారు. ఎవరికీ చదువు అబ్బలేదు. ఇతరులు అంటే నిర్లక్ష్యం. లోకజ్ఞానం లేదు. పైగా ఒకరంటే ఒకరికి పడదు. వారికి వయస్సు పైబడుతున్నా ఏమాత్రం మార్పు రావడంలేదు. కొంత కాలానికి షావుకారికి జబ్బు చేసింది. చనిపోతానేమోనని బెంగపట్టుకుంది.తను చనిపోతే తన పిల్లలు ఎలా బ్రతుకుతారా అని దిగులుతో వ్యాధి మరింత ఎక్కువైంది. బాగా ఆలోచించగా అతని ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది.

నలుగురు కొడుకులను పిలిచి వాళ్ళతో కొన్ని కట్టెలు తెప్పించాడు. ఒక్కొక్కడిని ఒక్కొక్క కట్టె తీసుకొని విరవమన్నాడు. నలుగురు తలో కట్టెను తీసుకుని సునాయాసంగా మధ్యకు విరిచేసారు. తరువాత ఒకేసారి రెండేసి కట్టెలను విరవమన్నాడు. ఆ నలుగురు వాటిని కష్టం మీద విరిచారు. తరువాత ఒక్కొక్కరినీ నాలుగేసి కట్టెలు తీసుకుని విరవమన్నాడు షావుకారు. నాలుగేసి కట్టెలు విరవడం ఏ ఒక్కరి వల్లనా సాధ్యం కాలేదు. అవే నాలుగు కట్టెలను నలుగురిని పట్టుకుని విరవమన్నాడు.నలుగురూ కలిసి నాలుగు కట్టెలను నునాయాసంగా విరిచేశారు. చూశారా మీరు కలిసి కట్టుగా ఒక పని చెయ్యగలిగారు. ఎవరికి వారు చేయలేకపోయారు. "ఐకమత్యమేబలం" కాబట్టి నా తదనంతరం మీరు ఐకమత్యంగా ఉంటామని ప్రమాణం చేయండి అన్నాడు తండ్రి. నలుగురూ తండ్రి మాటల్లోని సత్యాన్ని గ్రహించి అలాగేనని తండ్రికి ప్రమాణం చేశారు.
___________________

కట్టెలు కొట్టువాడు - బంగారు గొడ్డలి


కట్టెలు కొట్టువాడు కట్టెలు కొట్టుచుండగా వాని గొడ్డలి జారి ప్రక్కనే వున్న నదిలో పడిపోయెను. తన జీవనాధారమైన గొడ్డలి పోయినదని అతడు వల వల ఏడ్చుచూ నది ఒడ్డున కూర్చుండెను.

అతని దు:ఖమును చూచి ఆ నది దేవత ప్రత్యక్షమై ఏమి జరిగినదని అడిగి తెలుసుకొని నది దేవత వెంటనే నదిలోకి మునిగి, ఒక బంగారు గొడ్డలి తెచ్చిచూపెను. ఇది నాదికాదనెను. దేవత తిరిగి వెళ్ళి ఈసారి వెండి గొడ్డలి తెచ్చెను. వాడు అది చూచి అదియు నాదికాదనెను. దేవత మరల వెళ్ళి ఇనుప గొడ్డలి తెచ్చెను. ఆ అదియే నాది అని కట్టెలవాడు దానిని సంతోషంతో తీసుకొనెను. నది దేవత వాని నిజాయితీకి మెచ్చుకొని ఇనుప గొడ్దలితో పాటు బంగారు, వెండి గొడ్డళ్ళు కూడా బహుమతిగా ఇచ్చెను.

వాడు ఇంటికి వెళ్ళి ఊరంతట ఈ సంగతి చెప్పెను. ఇది విని ఒక ఆశపోతుకు దుర్భుద్ది పుట్టెను. మరుసటి దినము తాను ఒక ఇనుపగొడ్డలిని తీసుకొని కట్టెలు కొట్టుచున్నట్లు నటించుచు కావాలని గొడ్డలిని నీటిలో పడవేసెను. నది ఒడ్డున కూర్చొని దొంగ ఏడుపు మొదలు పెట్టెను. నది దేవత ప్రత్యక్షం కాగా తన గొడ్డలి పడిపోయెనని చెప్పెను. దేవత నీటిలోనికి వెళ్ళి బంగారు గొడ్డలి తెచ్చెను. అదే నా గొడ్డలి అని అబద్దం చెప్పెను. దేవతకు కోపం వచ్చి, వెంటనే బంగారు గొడ్డలితో సహా అదృశ్యమాయెను. ఆశపోతుకు బంగారం, వెండి గొడ్డళ్ళు రాకపోగా, తాను తెచ్చుకున్న ఇనుప గొడ్డలికూడా దక్కలేదు.

నీతి: నిజము మేలు చేయును. అబద్దము ఆపద తెచ్చును.
_________________________________________________

కనువిప్పు

ఒక అడవి సమీపాన ఒక పూరిగుడిసె ఉండేది. అందులో కొండయ్య, కాంతమ్మ దంపతులు కాపురం ఉండేవాళ్ళు. కొండయ్య అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వచ్చి, పట్టణంలో అమ్మేవాడు. ఇలా వాళ్ళ జీవనం సాగించేవారు. ఒక రోజు మామూలుగా కొండయ్య కట్టెల కోసం అడవికి వెళ్ళి ఒక చెట్టు కొట్టబోయాడు. అప్పుడు వనదేవత ప్రత్యక్షమయింది. 'చెట్టు నరకటం వలన అడవి పాడవుతుంది. చెట్టు నరకవద్దు' అంది. కట్టెలు కొట్టి అమ్మకపోతే నా జీవితం ఎట్లా గడుస్తుంది అన్నాడు కొండయ్య. అప్పుడు వన దేవత 'నీకు ఒక పాడి ఆవును ఇస్తాను. దాని పాలు అమ్ముకొని సుఖముగా జీవించు' అంది. కొండయ్య సరేనన్నాడు. వనదేవత అతనికి ఒక పాడి ఆవును ఇచ్చింది.

వనదేవత అతనికి ఒక పాడి ఆవును ఇచ్చింది. కొండయ్య ఆవును తోలుకొని ఇంటికి వచ్చాడు. భార్యకు చూపాడు. ఆమె కూడా చాలా సంతోషించింది. రోజూ పాలు అమ్మగా వచ్చే డబ్బుతో వాళ్ళ జీవితం గడిపేవారు. కొన్ని రోజులు గడిచాయి. రోజూ ఆవుకి మేత వేయాలి, పాలు పితకాలి. కాంతమ్మకు విసుగువేసింది. కష్టపడకుండా డబ్బు సంపాదించాలి. భర్తను మళ్ళా అడవికి పంపింది. కొండయ్య ఆవును తోలుకొని అడవికి వెళ్ళాడు. గొడ్డలితో ఒక చెట్టు నరకబోయాడు. వనదేవత ప్రత్యక్షమయింది. ఏమిటి కొండయ్యా! మళ్ళీ వచ్చావు? చెట్టును ఎందుకు నరకబోతున్నావు? అని అడిగింది.

అప్పుడు కొండయ్య ఈ ఆవు వద్దు. ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చే ఉపాయం చెప్పు అన్నాడు. వన దేవత సరే అన్నది. ఆవును తీసుకొని ఒక బాతుని ఇచ్చింది. ఇది ప్రతీ రోజు ఒక బంగారు గుడ్డు పెడుతుంది. అమ్ముకొని సుఖముగా జీవించమని చెప్పింది. కొండయ్య బాతుతో ఇల్లు చేరాడు. బాతు ప్రతి రోజూ బంగారు గుడ్డు పెట్టేది. దాన్ని అమ్మి వచ్చిన డబ్బుతో రోజులు గడిపేవాళ్ళు. కొన్ని రోజులకు కాంతమ్మకు మళ్ళీ విసుగు పుట్టింది. ఈ బాతు రోజుకు ఒక్క గుడ్డు మాత్రమే పెడుతుంది. మనం త్వరగా ధనవంతులం కావాలంటే కోరిన ధనం ఇచ్చే సంచి కావాలి. అది అడిగి తీసుకురా అని మళ్ళీ కొండయ్యను అడవికి పంపింది.

బాతుని తీసుకొని అడవికి వెళ్ళాడు. చెట్టు నరకబోయాడు. వనదేవత ప్రత్యక్షమయింది. 'ఏం కొండయ్యా! మళ్ళీ వచ్చావు అంది. ఈ బాతు రోజుకు ఒక్క గుడ్దు మాత్రమే పెడుతుంది. మాకు ఇది వద్దు ధనం ఇచ్చే సంచి ఇవ్వు' అన్నాడు. అతని అత్యాశకు వనదేవతకు కోపం వచ్చింది. బాతుతో పాటు మాయమైపోయింది.

కొండయ్యకు కోపం వచ్చింది. బలంగా గొడ్డలితో చెట్టు కొమ్మ నరికాడు. అది తెగి కొండయ్య కాళ్ళపై పడింది. కాళ్ళు విరిగాయి. పడిపోయాడు. కాంతమ్మ కొండయ్యను వెతుక్కుంటూ అడవికి వచింది. ఎలాగో కొండయ్యను తీసుకొని ఇల్లు చేరింది. కొండయ్య పని చేయలేడు. ఎట్లా? కాంతమ్మే అడవికి వెళ్ళి ఉసిరి, నేరేడు, రేగు పండ్లు ఏరుకొని వచ్చేది. వాటిని తినేవారు. గింజలను ఇంటి వెనక ఖాళీ స్థలంలో విసిరే వారు. కొన్నాళకు అవి మొలకలెత్తి పెరిగి పెద్దవయ్యాయి. కాయలు కాసాయి. కాంతమ్మకు అడవికి వెళ్ళే భాధ తప్పింది. కావలసిన పండ్లు తాము తినేవారు. మిగిలినవి సంతలో అమ్మేవారు. చెట్లను కొట్టి బతకటమే కాకుండా చెట్లను పెంచి కూడా జీవితం సాగించవచ్చని కొండయ్య దంపతులు గ్రహించారు. ఇంటి ముందున్న ఖాళీ స్థలాన్ని కాంతమ్మ చదును చేసింది. రకరకాల పండ్ల మొక్కలు నాటింది. ప్రతి రోజు క్రమం తప్పకుండా నీరు పోసేది. ఒక రోజు వనదేవత ప్రత్యక్షమయింది. వాళ్ళు చేసే మంచి పని చూసింది సంతోషపడి దీవించింది. కొండయ్య దంపతులకు మొక్కలు పెంపకం విలువ తెలిసింది. తమ చుట్టు పట్ల మొక్కలు నాటటంలో నలుగురికి తోడ్పడ్డారు. ఆనందంగా జీవనం గడిపారు.
_________________________________________

కప్పరాజు సాయం...కష్టాలన్నీ మాయం

అనగనగానేమో ఒక రాజుగారికి ముగ్గురు కొడుకులు. పెద్దవాళ్ళు ఇద్దరూ మంచి వాళ్ళుకారు. చిన్నవాడు మంచివాడేకానీ, పాపం అమాయకుడు. వీరిలో రాజ్యాన్ని ఎవరికి ఇవ్వాలా అని రాజు ఆలోచించి, ముగ్గుర్నీ పిలిచి మీకు మూడు పరీక్షలు పెడతాను. గెలిచిన వాడిదే రాజ్యం. మొదటి పరీక్షగా ప్రపంచంలోనే గొప్ప శాలువా తేవాలి అన్నాడు. ముగ్గుర్నీ మైదానంలోకి తీసుకువెళ్ళి మూడు పక్షి ఈకల్ని పైకి ఎగురవేసి అవి ఎటు ఎగిరితే ఆ దిశల్లో వెళ్ళిరండి అని కోటలోకి వెళ్ళిపోయాడు. వాటిలో ఒక ఈక తూర్పు దిక్కుగా ఎగిరితే పెద్దవాడు అటు వెళ్తానన్నాడు. ఇంకోటి పడమరకేసి వెళితే రెండోవాడు ఆ దిశగా వెళతానన్నాడు. మూడో ఈక పైకంటా ఎగిరి తిరిగి అక్కడే నేల మీద పడిపోయింది. అది చూసి పెద్దవాళ్ళిద్దరూ మూడోవానిని ఎగతాళి చేసి వెళ్ళిపోయారు. పాపం మూడోవాడు దిగులుగా కూర్చొని ఆ ఈకని తీస్తుంటే అక్కడ నేలమీద ఒక తలుపు కనిపించింది. దాన్ని తీసేసరికి కిందికి మెట్లు కనిపించాయి. దిగి వెళితే ఒక గది కనిపించింది. గదిలోపలి నుండి కప్పల రాజును నేను. కష్టాలన్నీ తీరుస్తాను అనే పాట వినిపించింది. మూడో వాడు లోపలికి వెళ్ళి చూస్తే, ఒక పెద్దకప్ప కిరీటం పెట్టుకొని సింహాసనం మీద కూర్చొని ఉంది. దాని చుట్టూ బోలెడు కప్పలు కూర్చొని వున్నాయి.

కప్పల రాజు ఎవరు నువ్వు అని అడిగితే మూడో రాజకుమారుడు అంతా చెప్పాడు. వెంటనే ఆ కప్ప నా మాయల పెట్టి తెండి! అది నా మహిమల దుట్టి! అని అరిచేసరికి కప్పలన్నీ ఒక పెట్టెను మోసుకువచ్చాయి. కప్పరాజు దాని మూత తీసి దాంట్లోంచి బంగారు దారాలతో అల్లిన శాలువా తీసి రాజకుమారుడికి ఇచ్చింది. ఈలోగా పెద్దవాళ్ళిద్దరూ ఏం చేశారో తెలుసా? మూడోవాడు ఎలాగూ ఏమీ తేలేడు కాబట్టి గొప్ప శాలువా గురించి వెతికి శ్రమ పడటం ఎందుకనుకొని ఊరి సంతలో రెండు శాలువాలు కొనేసి వెనక్కి వచ్చేశారు. రాజు మూడో వాడు తెచ్చిన బంగారు శాలువా చూసి 'శభాష్' అన్నాడు. ఇప్పుడు రెండో పరీక్ష. ఈ లోకంలోనే మంచి ఉంగరం తేవాలి. అంటూ మూడు ఈకల్ని ఎగరేశాడు. అవి మళ్ళీ అలాగే పడ్డాయి. పెద్దవాళ్ళిద్దరూ తలో దిక్కుకు వెళితే, మూడోవాడు మళ్ళీ నేలమీద తలుపు తీసి కప్పరాజు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు కప్ప రాజు పెట్టెలోంచి వజ్రపుటుంగరం తీసి ఇచ్చాడు.

ఈ సారి కూడా రాజు మూడో వాడు తెచ్చిన ఉంగరాన్ని చూసి 'శభాష్' అన్నాడు. ఇప్పుడు ఆఖరి పరీక్ష. ఈ భూమి మీదే అందమైన అమ్మాయిని తేవాలి. అంటూ మళ్ళీ ఈకలు ఎగరేశాడు. ఈ సారి కూడా పెద్దవాళ్ళిద్దరూ చెరోదిక్కు వెళితే మూడో ఈక కిందనే పడడంతో మూడోవాడు తిరిగి కప్పరాజు దగ్గరకే వెళ్ళాడు. కప్పలరాజు చప్పట్లు కొట్టి ఒక పల్లకి తెప్పించాడు. అందులో తన కూతురైన ఈ ఆడకప్పను కూర్చోమన్నాడు. ఆ పల్లకిని మోసుకుంటూ బోలెడు కప్పలు బయలుదేరాయి. చేసేదిలేక మూడోవాడు వాటి వెనుకే తండ్రి దగ్గరికి వెళ్ళాడు. రాజు పెద్దవాళ్ళిద్దరూ తెచ్చిన అమ్మాయిలను చూసి, మూడోవాడికేసి తిరిగి నువ్వు తెచ్చిన అమ్మాయి ఏది? అన్నాడు. ఈలోగా కప్పలు పల్లకిని మోసుకుంటూ వెళ్ళాయి. రాజు పల్లకి తెర తీసి చూసేసరికి అందులో ఆడకప్ప ఉంది. సభలోని వాళ్ళందరూ నవ్వడం మొదలుపెట్టారు. అంతా నవ్వుతుండగానే పల్లకిలో కప్ప బయటకు గెంతింది. అలా గెంతగానే అందమైన అమ్మాయిగా మారిపోయింది. ఆమె సౌందర్యానికి సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు.

రాజు మళ్ళీ 'శభాష్' అని మూడో వాడిని రాజుగా ప్రకటించాడు. కానీ పెద్దవాళ్ళిద్దరూ చెడ్డవాళ్ళుకదా? తండ్రి మీదకే కత్తులు దూసి 'ఇక మేమే రాజులం. మీరంతా రాజ్యం విడిచి పొండి' అన్నారు. అప్పుడో చిత్రం జరిగింది. పల్లకిని మోసుకువచ్చిన కప్పలన్నీ సైనికులుగా మారిపోయి, పెద్ద కొడుకులను బంధించి రాజుగారిని విడిపించాయి. ఆయన పెద్దకొడుకులను దేశం నుండి తరిమేసి మూడోవాడిని రాజును చేశాడు.

No comments: