Thursday, February 3, 2011

నానాసాహెబ్

నానాసాహెబ్

నానాసాహెబ్‌
పేరు : నానాసాహెబ్.
తండ్రి పేరు :

నారాయణ్ భట్.

తల్లి పేరు :

గంగాభాయి.

పుట్టిన తేది : 1824.
పుట్టిన ప్రదేశం : బిథూర్.
చదివిన ప్రదేశం :

(తెలియదు).

చదువు :

(తెలియదు).

గొప్పదనం : ఆంగ్లేయుల పక్కలో బల్లెంగా నిలిచి - ధైర్యంగా సాయుధ సమరం సాగించిన సమరసేనాని నానాసాహెబ్.
స్వర్గస్తుడైన తేది :

(తెలియదు).


సిపాయిల తిరుగుబాటు ప్రేరణతో కత్తిదూసి కదన రంగానికి నడిచాడు. వేలాది మంది సైన్యాన్ని సమకూర్చుకుని రెండు సంవత్సరాలపాటు ఆంగ్లేయులపై యుద్ధం ప్రకటించాడు. బాల్యమిత్రులు తాంతియాతోపే, ఝాన్సీ లక్ష్మీభాయి, రావుసాహెబ్‌లతో కలిసి ఆంగ్లేయ పాలనకు అంతం చేయడానికి ప్రతిన బూనిన యోధుడు నానాసాహెబ్.

కాన్పూరు రాజ్యపాలకుడు రెండవ బాజీరావు దత్తపుత్రుడు నానాసాహెబ్. మరాఠా రాజవంశంలో కాన్పూరు సంస్థానం బలమైనది. పాలకుడు రెండవ బాజీరావు ప్రజాభిమానం చూరగొన్న పాలకుడు. ధైర్యంగా ఆంగ్లేయులు విధించిన షరతులను తిరస్కరించాడు. ఫలితంగా ఆంగ్లేయులతో యుద్ధానికి తలపడ్డాడు. కానీ చివరికి రాజీపడక తప్పలేదు. ఆంగ్లేయులు విధించిన షరతుల ప్రకారం కాన్పూరు రాజ్యపాలన వదులుకుని, కోరుకున్న మరో ప్రదేశానికి వెళ్ళాలి. అక్కడ జాగీరుతోపాటు సంవత్సరానికి 8 లక్షల భరణం ఈస్టిండియా కంపెనీ ఇస్తుంది. గత్యంతరం లేక బాజీరావు రాజ్యాన్ని వీడి - సమీపంలోని బిథూర్ చేరాడు. అక్కడ 52 గ్రామాల జాగీరు - లభించే భరణంతో కొత్త జీవితం ప్రారంభించాడు. బాజీరావుతో పాటు రెండువేల కుటుంబాలు కాన్పూరు వీడి బిథూర్ చేరాయి. వారందరినీ ఆత్మీయులుగా చూశాడు. బాజీరావుకు సంతానం లేదు. పిల్లలంటే ప్రేమ. ముగ్గురి పిల్లలను దత్తత తీసుకున్నాడు. ధండుపంత్ అలియాస్ నానాసాహెబ్, సదాశివపంత్ అలియాస్ దాదాసాహెబ్, గంగాధర రావు అలియాస్ బాలాసాహెబ్. ముగ్గుర్నీ గారాబంగా పెంచాడు. సైనిక శిక్షణ నేర్పించాడు. 1851లో బాజీరావు మరణించాడు. వీలునామా ప్రకారం నానాసాహెబ్ వారసుడయ్యాడు. అంతకుముందే దాదాసాహెబ్ మరణించాడు. అతని కొడుకు రావుసాహెబ్ నానాకు ఆత్మీయుడుగా పెరిగాడు. బాజీరావు మరణం తర్వాత 8 లక్షల భరణం ఆపేశారు. జాగీరు విషయంలో కుటుంబ కలహాలు రెచ్చగొట్టారు. జాగీరును కూడా రద్దుచేయడానికి ఆంగ్లేయులు పూనుకున్నారు. ఇవన్నీ నానాసాహెబ్ భరించాడు. తనకు జరిగిన అన్యాయానికి ఆంగ్లేయ పాలకులకు విజ్ఞప్తులు చేసుకున్నాడు. చివరకు అజీముల్లా న్యాయవాది ద్వారా విక్టోరియా మహారాణికి విజ్ఞప్తి పంపుకున్నాడు. న్యాయం కోసం ఎదురు చూశాడు.

బాల్యం నుండి రాజకుటుంబంలో పెరిగాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. స్నేహితులతో సరదాగా గడిపేవాడు. అతనికి అనేకమంది ఆంగ్లేయ కుటుంబాలతో, వ్యక్తులతో స్నేహం వుంది. కాన్పూరు వెళ్ళి వాళ్ళతో గడుపుతుండేవాడు.

ఇంతలో సిపాయిల తిరుగుబాటు లేచింది. మీరట్, ఢిల్లీ వగైరా సిపాయిల వశమయ్యాయి. కాన్పూరు కీలకమైన ప్రదేశం. ఆంగ్లేయపాలకులది మిలటరీ కేంద్రంగా వుంది. అక్కడ కూడా తిరుగుబాటు రావచ్చని అనుమానించిన ఆంగ్లేయులు జాగ్రత్తపడ్డారు. అప్పుడున్న ఆంగ్లేయులందరికీ ఒకేచోట రక్షణ స్థావరం ఏర్పరిచారు. గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. అదనపు బలగాలు సమకూర్చుకున్నారు. తమకు సన్నిహితుడుగా వున్న నానాసాహెబ్ సహాయాన్ని కూడా కోరారు. జనరల్ వీలర్ కాన్పూర్‌లో మిలటరీ అధికారి. నానాకు మిత్రుడు. అతని మాటను కాదనలేక 300మంది తన సైనికులను ఆంగ్లేయులకు రక్షణగా పంపించాడు. తాను స్వయంగా వెళ్ళాడు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా - 1857 జూన్ 3 వ తేదీన కాన్పూరులోని మూడువేలమంది భారతీయ సిపాయిలు విప్లవం లేవదీశారు. ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఖజానాను చేజిక్కించుకున్నారు. జైలులోని ఖైదీలందరినీ విడుదల చేశారు. సుబేదార్ తికాసింగ్ నాయకత్వంలో తిరుగుబాటు జరిగింది.

ఆంగ్లేయులకు సిపాయిలకు మధ్య పోరాటం వారాల తరబడి సాగింది. దిగ్భందంలో వున్న ఆంగ్లేయులకు తిండిలేకుండా చేశారు. చివరికి నానాసాహెబ్ మధ్యవర్తిత్వం కారణంగా ఆంగ్లేయకుటుంబాలను - అధికారులను కాన్పూరు వదిలిపోవటానికి అంగీకరించారు. అందుకు 12 పడవలు సిద్ధం చేశారు. 900 మంది స్త్రీలు పిల్లలు పడవల్లోకి చేరిన తర్వాత దుర్మార్గుడైన ఆంగ్లేయ అధికారి ఒడ్డున వున్న సిపాయిలపై కాల్పులు జరిపాడు. అంతవరకు ఆంగ్లేయులకు రక్షణనిచ్చిన భారతీయ సిపాయిలు, నానాసాహెబ్ పంపినవారు కూడా సిపాయిలతో కలిశారు. జనరల్ వీలర్‌తో సహా ఆంగ్లేయులంతా హతులయ్యారు. కాన్పూరును జయించిన సిపాయిలు నానాసాహెబ్ వద్దకెళ్ళి - కాన్పూరు పేష్వాగా తిరిగి అధికారాన్ని చేపట్టనున్నారు. ఆంగ్లేయులతో శత్రుత్వం ప్రమాదమనుకున్న నానా కొంత సందేహించాడు. తనకు జరిగిన అవమానం సిపాయిల పట్టుదల గమనించి ఆంగ్లేయులతో పోరాటానికి సిద్ధమయ్యాడు.

జూన్ 30 పేష్వాగా నానాసాహెబ్ బాధ్యతలు తీసుకున్నాడు. వేలాదిమంది గ్రామీణప్రజలు స్వచ్ఛంద సైనికులుగా ముందుకొచ్చారు. నానాసాహెబ్ దుర్మార్గం తలపెట్టాడని ఆంగ్లేయులు కక్షగట్టారు. అతన్ని హతమార్చాలని, తిరిగి కాన్పూరును జయించాలని శక్తినంతా ఒడ్డారు. కలకత్తా, లక్నో, బొంబాయి నుంచి ఆంగ్లేయ సైనిక బలగాలను దించారు. నానాసాహెబ్‌కు 10 వేల సైన్యముంది. కానీవారిలో ఎక్కువమంది కొత్తగా సైనికులుగా చేరినవారు. శిక్షణ లేదు. అధునాతన ఆయుధాలు లేవు. అయినా ధైర్యంగా పోరాడారు. ఓటమి తప్పలేదు. తనసేనతో బిధూర్ చేరాడు నానా. ఝాన్సీ, గ్వాలియర్ ప్రాంతాలలో విప్లవయోధులుగా పోరాడుతున్న తాంతియాతోపే, ఝాన్సీ లక్ష్మీభాయితో సంబంధాలు ఏర్పరచుకున్నారు. వారు ముగ్గురు ఒకేచోట పెరిగినవారు, బాల్యమిత్రులు. ముగ్గురు యుద్ధరంగంలో ఆంగ్లేయులను ముప్పతిప్పలు పెట్టారు.

1858 జులై 18న బిధూర్‌పై ఆంగ్లేయుల దాడి జరిగింది. శత్రువు జయించాడు. మిగిలిన సైన్యంతో నానాసాహెబ్ గ్వాలియర్ వైపు వెళ్ళాడు. దారిలో పోరాటంవల్ల మరికొంత నష్టం జరిగింది. ఓటమి చెందుతున్నా పట్టుదల వీడలేదు. ఫరూఖాబాద్ - బరేలీ - బహరియా తర్వాత నేపాల్ సరిహద్దులోని తెరాయ్ అడవుల్లోకి నిష్క్రమించక తప్పలేదు. రహస్యంగా వున్న నానాసాహెబ్‌ను పట్టుకోవడానికి ఆంగ్లేయులు ఎంతో ప్రయత్నించారు. అతని తలకు లక్షరూపాయల బహుమతి ప్రకటించారు. ఈస్టిండియా పాలనపోయి - బ్రిటిష్ సామ్రాజ్యంలో భారతదేశం భాగమైన తర్వాత విక్టోరియా మహారాణి ప్రకటన వచ్చింది. లొంగిపోయిన వారికి రక్షణ కల్పిస్తామని, రహస్యంగా నానాసాహెబ్ - ఆంగ్లేయుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. లొంగిపోవడానికి నానాసాహెబ్ తిరస్కరించాడు.

"మీరు కోరిన విధంగా నేను లొంగిపోను" అన్నాడు. "ప్రాణమెప్పుడైనా పోయేదే. అవమానకరంగా ఎందుకు చావాలి! నేను బతికున్నంతకాలం మీకూ, నాకూ యుద్ధం తప్పదు. నేను చచ్చినా, పట్టుబడినా, ఉరికంబమెక్కినా అది తేలేది కదనరంగంలో కరవాలంతోనే" అన్నాడు. వీరుడిగా నిలిచాడు. నేపాల్ వెళ్ళాడా! అడవిలోనే జీవించాడా! అనూహ్యంగా అదృశ్యమై అస్తమించిన అమరుడు నానాసాహెబ్.


No comments: